Saturday 28 July 2018

నిర్వ్యాజమైన ప్రేమ

అవ్యాజమైన ప్రేమ? 
అదేమిటి? అలాంటిది ఎక్కడైనా ఉంటుందా?
వ్యాజము అంటే కారణం లేదా సాకు. 
నిష్కారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తామా?

అనగా అనగా యాజ్ఞవల్క్యమహర్షి. అబ్బో, ఆయన సామాన్యుడు కానే కాదు. సూర్యభగవానుని శిష్యుడు. శుక్లయజుర్వేదపు ఆవిర్భావానికి కారకుడు. జనకమహారాజుగారి వేదాంతసభలో హేమాహేమీలైన మహా మహా పండితులెందరినో వాదప్రతివాదాలలో చిత్తుచిత్తుగా ఓడించినవాడు. 

అటువంటి ఆయన ఒకరోజు గృహస్థాశ్రమం ముగించుకుని సన్న్యాసాశ్రమం స్వీకరిద్దామనే నిర్ణయానికొచ్చాడు. తన ఇద్దరు భార్యలకు తనకున్న ఆస్తి పంచి ఇచ్చి సన్న్యాసి అయ్యేందుకు వారి అనుమతి కోరాడు. 

కాత్యాయని అనే పేరు గలిగిన భార్య సరే అంది. కానీ మైత్రేయి అనే భార్య మాత్రం, "డబ్బుతో నిండిన ఈ మొత్తం భూమి నాకు స్వంతం అయితే నాకు అమృతత్వం (మోక్షం) వస్తుందా?" అని అడిగింది. అబ్బే, అలాంటి అవకాశం లేనే లేదు పొమ్మన్నాడు యాజ్ఞవల్క్యుడు. అయితే దేనివల్ల అటువంటి అమృతత్వం సిద్ధిస్తుందో అది నాకు ఉపదేశిస్తేనే మీరు సన్న్యాసం స్వీకరించేందుకు అనుమతి" అన్నది మైత్రేయి.

యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వాడు. "ఇందువల్లనే నీవు నాకు ప్రియమైన భార్యవు అయ్యావు" అని పలికి, ఉపదేశం మొదలు పెట్టాడు.

ఎందువల్ల ఆమె ప్రియమైన భార్య అయింది? ఊరికే కాదు. ఏదో కారణం వల్లనే. యాజ్ఞవల్క్యుడే స్వయంగా చెప్పాడు తన ఉపదేశంలో - 

न वा अरे जायायै कामाय जाया प्रिया भवति।
आत्मनस्तु कामाय जाया प्रिया भवति।
(बृहदारण्यकोपनिषद् 4.5)


"భార్యకోసం భార్య ఎప్పుడు ప్రియమైనది కాదు, 
తన కోసమే భార్య ప్రియమైనది అవుతుంది."

యాజ్ఞవల్క్యుని విషయంలో - అతనికి ఇష్టమైనది అమృతవిద్య (ఆత్మవిద్య). అటువంటి అమృతవిద్యను కోరినందువల్ల మైత్రేయి అతనికి ఇష్టురాలైంది. లేకుంటే కాత్యాయని లాగే ఒక సాధారణమైన భార్య అయ్యుండేది అన్నమాట.

ఆ విధంగా ఒక్క భార్య విషయంలో మాత్రమే కాదు, 

పుత్రుల కోసం పుత్రులు ఎవరికీ ఇష్టం కారుట. 
తనకోసమే పుత్రులు ఇష్టులౌతారట.
నిజమే కదా, చిన్నప్పుడు వారి ముద్దు మురిపాలు మనిషికి ముచ్చట గొలుపుతాయి కాబట్టి వారి పట్ల ప్రేమ ఉంటుంది. పెద్దయ్యాక ఆ పిల్లలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే వారి మీద కోపం తారాస్థాయిలో ఉంటుంది.

ధనం కోసం ధనం ఎవరికీ ఇష్టం కాదుట. 
తనకోసమే (తనకు ఉపయోగపడుతుంది కాబట్టే) ధనం అంటే ఇష్టం ఉంటుందట. 

అలాగే - 
భార్యకు భర్త ఇష్టమైనా తనకోసమే తప్ప, భర్తకోసం కాదుట. 
బ్రాహ్మణులనైనా, క్షత్రియులనైనా, పశువులనైనా, లోకాన్నైనా, దేవతలనైనా, వేదాలనైనా, ఇలా ఎవరిని (లేదా) దేనిని ఇష్టపడినా తనకోసమే కానీ వారి కోసం (లేదా వాటికోసం) మాత్రం కానే కాదుట. 

కాబట్టి, 
ఏవైనా, ఎవరైనా, మనకు ఉపయోగపడితేనే అవి మనకు ప్రియమైనవి అవుతాయి అని నిర్మొహమాటంగా చెప్పేశాడు ఆయన. ఎవరిమీదనైనా దేనిమీదనైనా నిష్కారణమైన ప్రేమ అంటూ ఉండదు, ప్రేమ సకారణమే అంటున్నాడన్నమాట.

అరెరే, 
ఆయన అంత మాట అన్నాడని 
మనం ఎవరమూ ముఖాలు మాడ్చుకోనక్కర లేదు.
మనసును చిన్నబుచ్చుకోనక్కరలేదు.
భుజాలు తడుముకోనక్కర లేదు.

ఎందుకంటే 
ఆయన ప్రసంగం మానవుని స్వార్థబుద్ధి గురించి కాదు.
అమృతవిద్య గురించి కదా.
అందువల్ల ఆయన ధోరణిని కాస్త పరిశీలించి చూద్దాం.

"ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః" 
"అన్నిటినీ (అందరినీ) తనవలె ఎవడైతే చూడగలడో అతడే అసలైన పండితుడు" - అని శాస్త్రం.

అంటే - 
మనం మన పిల్లల్లో మనలను (ఆత్మను) చూసుకుంటున్నాం కాబట్టి వారు మనకు ఇష్టమౌతున్నారు. అంటే - ఆ క్షణంలో వారు వేరు, నేను వేరు అనే భావన మనలో ఉండదు - వారి విషయంలో దాదాపు అద్వైతసిద్ధి అన్నమాట. అదీ విషయం. 

ఈవిధంగా మన పిల్లలనే కాదు, ప్రపంచంలో అన్నింటినీ ఆత్మస్వరూపాలుగా గమనించగలగడమే ఆత్మవిద్య అంటే - అదీ మోక్షవిద్య అంటే - అదీ అమృతవిద్య అంటే. 

"ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయి"
(అరే ఓ మైత్రేయి, ఇటువంటి స్వరూపం గల ఆత్మదర్శనం చేసుకోవాలి, దానిని గూర్చి వినాలి, మననం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి.) 

"ఆవిధమైన అభ్యాసంతో నీవు అమృతవిద్యను సాధించగలవు" అని యాజ్ఞవల్క్యమహర్షి మైత్రేయికి ఆమె కోరిన అమృతవిద్యను ఉపదేశించాడు. (ఈ సందర్భానికి అవసరమైన కొద్ది భాగం మాత్రమే నేను తీసుకున్నాను. పూర్తి ఉపదేశం తెలుసుకోవాలనుకుంటే మిత్రులు బృహదారణ్యకోపనిషద్ చదవగలరు.)

ఈ క్రింది చిత్రం చూడండి. తల్లి ఆవు తన బిడ్డకు పాలను ఇస్తోంది. కొంత దూరంతో తల్లి లేని దూడలు నిలబడి ఉన్నాయి. ఈ ఆవు వాటిని పిలిచి పాలు ఇవ్వడం లేదు. ఒకవేళ అవి చొరవగా వచ్చి పాలు త్రాగబోయినా ఈ ఆవు సరేనని వాటికి కూడా ఇస్తుందో లేక తిరస్కరిస్తుందో తెలియదు. 

అపుడపుడు ఆవు పందిపిల్లలకు కూడా పాలు ఇస్తున్న ఫోటోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆవులు అమృతవిద్యను సాధించిన మహర్షులుగా భావించి మనం వాటికి నమస్కరించవలసిందే!

శ్రీకృష్ణుడితో ఇంటర్వ్యూ - 2

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((రెండవ భాగం))

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
ఎందుకు ఉండదూ? ఎలాగో కష్టపడి యుద్ధాన్నంతా ఓ కొలిక్కి తెచ్చామా? దాదాపు దుర్యోధనుడొక్కడే మిగిలిపోయాడు. మడుగులో దాక్కున్నాడు. అతడిని యుక్తిగా ఏదో ఒక రకంగా బయటకు రప్పించాము. ఈలోగా ధర్మరాజు - "ఓయ్ దుర్యోధనా! మా పాండవులు ఐదుగురిలో ఎవరో ఒకరిని ఎంచుకో. వారితో నీకు నచ్చిన ఆయుధంతో యుద్ధం చేసి గెలు చూద్దాం. ఏ ఒక్కర్ని గెలిచినా మొత్తం రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తాను" అనేశాడు. అపుడు నాకు ఎంత కోపం వచ్చిందో!

ప్రశ్న 14
అయినా, దుర్యోధనుడు మంచివాడు, నిజాయితీపరుడు కదా! అందుకే ఏ సహదేవుడినో ఎంచుకుని ఓడించకుండా తనకు తగిన జోడీ అని భీముడిని ఎంచుకున్నాడు! లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది?

కృష్ణుడు:
దుర్యోధనుడికి నిజాయితీనా? ఆ మాత్రం నిజాయితీ ఉంటే పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన వెంటనే వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి ఉండాల్సింది.

సరే, ప్రస్తుతానికి వస్తే, ధర్మరాజు సవాలును స్వీకరించి మీరన్నట్టు ఏ సహదేవుడినో ఎంచుకొని గదతో పడగొట్టి రాజ్యాన్ని సంపాదించేవాడే. కానీ, అతడు అలా చేయకపోవడానికి కారణం నిజాయితీ కాదు, మంచితనం కూడా కాదు, అలా చేస్తే అతడి పిరికితనానికి, కక్కుర్తితనానికి జనాలు నవ్వుకొనేవారు. వెక్కిరించేవారు. అభిమానధనుడని పేరుపొందిన దుర్యోధనుడికి అటువంటి అవహేళన చావుకంటే దుర్భరం. జనాల మాటలు వినలేక గుండెలు పగిలి చచ్చుండేవాడు.

అలాగని అతడు భీముడిని కూడా తన ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. "మీలోనే ఎవరైనా రండి, మీలోనే ఎవరైనా రండి, మట్టి కరిపించేస్తా, సవాల్!" అంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ మాటల్లో ఏ నకులుడో సహదేవుడో రాకపోతారా అనే ఆశ కూడా ఉంది. వారంతట వారే వచ్చి తన చేతిలో చస్తే అది తన తప్పుగా ఎవరూ భావించలేరు కదా? తనకు అటు రాజ్యమూ వస్తుంది, ఇటు అవహేళన చేసేవారు కూడా ఎవరూ ఉండరు అనే దురాశ అతడిది. కానీ పాపం, అతడి ఆశ చెల్లలేదు. అతడు చేసిన సవాలును భీముడే స్వీకరించి ముందుకొచ్చి అతడిని మట్టికరిపించాడు.

ప్రశ్న 15
అసలు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మీరే అని చాలమంది అంటారు?

కృష్ణుడు:
దుర్యోధనుడు భీముడికి విషం పెట్టినపుడు, ఆ భీముడికి కాళ్ళు చేతులు కట్టేసి నీటిలోని తోసి చంపదలచినపుడు నేను చాల చిన్నపిల్లవాడిని.

అప్పటికి నేను ఇంకా యశోదానందుల బిడ్డడిననే అనుకుంటూ ఉన్నాను. అప్పటికి కుంతి మా అత్త అని తెలియదు. పాండవులు మా బావలు అని తెలియదు. మధురానగరిలో రాజకీయాలు కూడా తెలియవు, కంసుడు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా తెలియదు. ఏదో అమాయికంగా ఆవులు కాచుకుంటూ, మిగిలిన పిల్లలతో ఆడుకుంటూ, మా జోలికి వచ్చిన చిన్న చిన్న పాములను కాలితో తొక్కేసి తరిమేస్తూ - ఇలా బయటి ప్రపంచం తెలియకుండా కాలం గడిపేవాడిని. అలాంటి నేను ఆ సమయంలో హస్తినాపురానికి వచ్చి భీముడికి విషం పెట్టమని దుర్యోధనుడికి చెప్పానా?

ఏమయ్యా, ఇది శకునిని అడగవలసిన ప్రశ్న కదా, నన్ను అడుగుతున్నారేమిటి?

ప్రశ్న 16
అలా కాదు, మీరు తలచుకుని ఉంటే అసలు యుద్ధానికి కారణమైన జూదమే జరగకుండా ఆపగలిగి ఉండేవారు కదా?

కృష్ణుడు:
ఆ సమయంలో మా యాదవులమీద కక్షగట్టిన సాళ్వరాజు, సౌభరి అనే విమానాన్ని ఎక్కి వచ్చి ద్వారకమీద దాడి చేశాడు. నేను మా వారితో కలసి వాడితో యుద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ జూదం జరిగింది. లేకుంటే నేను పిలవకున్నా ఈ జూదానికి వచ్చేవాడినే, జూదం జరగకుండా చూసేవాడినే.

ప్రశ్న 17
కాదు, కౌరవులు పాండవులు జూదమాడుతూ ఉండగా మీరు ద్వారకలో 'విన్నావా యశోదమ్మా' అనే ఒక నృత్యరూపకాన్ని చూస్తూ మైమరచి ఉన్నారు కదా?

కృష్ణుడు:
ఏమయ్యా? మాయాబజార్ సినిమాకు నువ్వు వీరాభిమానివిలా ఉన్నావే? మాయాబజార్ ఒక కల్పితకథ. అసలు మా అన్న బలరామునికి శశిరేఖ అనే కూతురే లేదు. పాండవుల వనవాసకాలంలో సుభద్రాభిమన్యులు పూర్తిగా
ద్వారకలోనే నివసించారు. దేవకాంత, అతిసౌమ్యురాలూ అయిన మా వదిన రేవతిగారిని తుచ్ఛమైన డబ్బుకు ఆశపడే సామాన్యస్త్రీగా చిత్రీకరించారే? సరే, లోకం ఇలా ఉంటుంది సుమా అని జానపదులకు అర్థమయేలా చెప్పేందుకు ఈరకమైన సినిమా తీశారులే అని జాలిపడి మేము ఊరుకున్నాము.

ప్రశ్న 18
కానీ, మీరు ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ, ద్రౌపదికి పరాభవం కలుగకుండా కాపాడారు కదా? అంత చేసిన వారు అదే చేత్తో దూరం నుండే జూదాన్ని ఎందుకు ఆపలేకపోయారు?

కృష్ణుడు:
ఎందుకు ఆపలేదు? ధృతరాష్ట్రుడి మనసులో భయం పుట్టించాను. ద్రౌపదికి వరాలు ఇచ్చే మిషతో జూదంలో పాండవులు ఓడిపోయినదంతా తిరిగి వారికి ఇప్పించాను. అంతా సవ్యంగానే ఉండింది.

ఈలోగా రెండోసారి కూడా జూదానికి పిలుపు వచ్చింది. ధర్మరాజు తగుదునమ్మా అని మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి పన్నెండేళ్ల వనవాసము, ఒక యేడు అజ్ఞాతవాసము అనే నియమంతో మళ్ళీ పందెంలో ఓడిపోయాడు.

ఇలా ఎన్ని సార్లు భక్తులను దేవుడు కాపాడాలి? కష్టం అనుభవిస్తేనే గాని సుఖం విలువ తెలియదు. అందుకని రెండోసారి నేను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా రెండో సారి కూడా అడ్డం తగిలి ఉంటే "తప్పులు చేసిన ప్రతిసారీ దేవుడొచ్చి కాపాడతాడు" అనే మానసికదౌర్బల్యం జనాలందరికీ కలిగేది. అది ప్రమాదకరం. "అసలు తప్పులే చేయకుండా ఉండాలి" అనే ఆదర్శం ప్రచారం కావాలి. అందుకే రెండో సారి ఊరుకున్నాను.

ప్రశ్న 19
కానీ మీకు తరువాతనైనా పాండవులను గట్టెక్కించే శ్రమ తప్పలేదు కదా?

కృష్ణుడు:
నిజమే. కానీ, ఎంత శక్తిమంతులు అయినా పొరపాట్లు చేస్తే కష్టపడవలసి ఉంటుంది సుమా అనే భయం అందరికీ ఉండాలంటే ఆ మాత్రం శ్రమ పడక తప్పదు.

ప్రశ్న 20
కానీ, మీరు ఆనాడు అలా ఊరుకొనడం వల్లనే కదా, యుద్ధం సంభవించింది?

కృష్ణుడు:
దీనికి నేను ముందే సమాధానం చెప్పాను. క్షత్రియుడు కోరుకునేది ఇటువంటి మరణాన్నే. తెలిసి కూడా అధర్మంవైపు నిలబడిన వారు మరణించారు. ధర్మం కోసం ప్రాణాలర్పించినవారు ధన్యులయ్యారు.

ప్రశ్న 21
క్షత్రియులు అలా మరణిస్తే మంచిదని మీరంటున్నారు. కాని, ఆ మరణించిన వీరుల కుటుంబాలలో ఎంతటి సంక్షోభం కలిగి ఉంటుందో కదా!

కృష్ణుడు:
మీ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ఈ విషయం దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి. ఆవు వ్యాసంలాగా. (నవ్వులు) అసలు భగవద్గీతలో అర్జునుడి విషాదం కూడా ఇదే కదా!

క్షత్రియులు అంటేనే ప్రాణాలకు తెగించి ఉండే జాతి అని ఇంతకు ముందే చెప్పాను. అసలు ఏ వృత్తికి చెందినవాడైనా, ఇంటి బయటకు వెళ్లినవాడు మరలా ఇంటికి క్షేమంగా తిరిగి రాగలడని ఎవరైనా హామీ ఇవ్వగలరా? క్షత్రియవృత్తిని అవలంబించిన వారిలో ఈ ప్రమాదశాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వారు చిన్నతనం నుండి ఆ సంక్షోభానికి సిద్ధపడి బ్రతికేలా మానసికమైన సన్నద్ధత ఉంటుంది.

నాటి సమాజం నేటి సమాజం వంటిది కాదు, వారి కుటుంబానికి మంచి గౌరవమర్యాదలు ఉంటాయి. ఆ యోధుల కుటుంబాలకు రాజుల అండదండలు ఉంటాయి. వారికి ఆర్థికసంక్షోభం ఉండే సమస్య లేదు. అయితే మనిషి లేకపోవడం అనే కొరతను ఎవరూ తీర్చలేరు. కానీ, క్షత్రియజాతికి గుండెనిబ్బరం జన్మతః సిద్ధిస్తుంది.

సుఖదుఃఖాలు శాశ్వతాలు కావు. "ధర్మ ఏకో హి నిశ్చలః." ధర్మం ఒకటే శాశ్వతమైనది. కాబట్టి, నేటి మనుషులను, నేటి సమాజాన్ని చూసిన కళ్ళతో నాటి మనుషులను, నాటి సమాజాన్ని అంచనా వేయకండి. మళ్ళీ ఇటువంటి ప్రశ్నను వేస్తే మీదగ్గర అడగడానికి మరే ప్రశ్నలూ లేవనుకుని ఇంటర్వ్యూ ను ఇంతటితో ముగిద్దాము.

ప్రశ్న 22
స్వామీ, స్వామీ, కోప్పడకండి. మరో రెండు మూడు ప్రశ్నలున్నాయి.
మరి యుద్ధంలో అబద్ధమాడమని మీరు ధర్మరాజుకు చెప్పారా లేదా? అది తప్పు కాదా? గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టమని భీముడికి చెప్పారా లేదా? అది తప్పు కదా?

కృష్ణుడు:
అవునయ్యా. అవును ధర్మరాజుకు, భీముడికి నేను అలా చెప్పిన మాట నిజమే. అసలు నా అవతారరహస్యాలలో అది ఒకటి.

కలియుగంలో దురాచారులెందరెందరో భారతానికి వస్తారు. వారు చేసే ప్రతి వెధవ పనిని కప్పిపుచ్చుకుంటూ భారతీయులు చేసే ప్రతిపనినీ తప్పు పడుతూ ఉంటారు. వారు చంపితే వీరత్వం అంటారు. వారికి ఎదురుతిరిగి భారతీయులు చంపితే క్రూరత్వం అంటారు. ఈరకంగా వారు తప్పు చేస్తే ఆనాటి అవసరం అలా చేయించింది అంటారు. భారతీయులు తప్పనిసరై అలా చేయబోతే నానా యాగీ చేస్తారు. భారతీయులు ఏమి చేయాలో తెలియని ధర్మసంకటంలో ఇరుక్కుని నిస్సహాయులౌతారు. వారికి నేను కర్తవ్యం బోధించదలచాను.

మాయాచారో మాయయా బాధితవ్యః.
సాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః..

మాయగాళ్లని మాయతోనే కొట్టాలి.
మంచివారితో మంచిగానే వ్యవహరించాలి.

ఇలా స్వయంగా నేను చెప్పినప్పటికీ నిజంగా అలా మాయ చేసి దెబ్బ కొట్టవచ్చునా అని వెనుకంజ వేస్తూ పిరికివాళ్ళనిపించుకొనేంత వెర్రి వాజమ్మలు కలియుగభారతీయులు. అందుకే వారికి ఆదర్శంగా స్వయంగా నేనే కురుక్షేత్రయుద్ధంలో అలా చేసి చూపించవలసి వచ్చింది. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అబద్ధమాడినా పరవాలేదు. నియమం తప్పినా పరవాలేదు. అటువంటి సందర్భాలలో తప్పొప్పులు ఏమి చేసినా నాకు వదిలిపెట్టండి, కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి అని చెప్పదలిచాను.

ప్రశ్న 23
ధన్యులం స్వామీ, ధన్యులం. మీ ఉపదేశాన్ని భారతీయులందరూ సక్రమంగా గ్రహిస్తే వారికి ఇక తిరుగు ఉండదు. కాని, మీకు పక్షపాతం దేనికి స్వామీ, ఒకవైపు "సర్వత్ర సమదర్శనః" అంటారు. కానీ అంత గొప్ప భగవద్గీతను అర్జునుడికి మాత్రమే బోధించారు.

కృష్ణుడు:
అయ్యో పిచ్చోడా, నేను వేరు, అర్జునుడు వేరు అనుకుంటున్నావా?

यो2हं तमर्जुनं विद्धि, यो2र्जुनः सोहमेव तु।
నేనెవరిననుకుంటున్నావో ఆ నన్ను అర్జునుడనే తెలుసుకో.
ఇతడు అర్జునుడు అని ఎవరిని గూర్చి అనుకుంటున్నావో అతడు నేనేనని తెలుసుకో.

భగవద్గీతను నాకు నేనే బోధించుకున్నా. అది నా ఆత్మప్రబోధం.

ప్రశ్న 24
శ్రీకృష్ణా, నమో నమః. నమో నమః. పరమానందం. పరమానందం.
కానీ, మేము మీరన్నట్టే సామాన్యులం కదా స్వామీ, మీరు ఆ భగవద్గీతను దుర్యోధనుడికి చెప్పి ఉంటే యుద్ధం ఉండేది కాదేమోనని మా ఆశ.

"भक्तो2सि मे सखा चेति रहस्यम् एतदुत्तमम्"

అంటూ అర్జునుడికి మాత్రమే చెప్పారు కదా.

కృష్ణుడు:
(నవ్వులు) ఏమయ్యా తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా?

రాయబారానికి వెళ్ళినపుడు నేను మంచి మాటలు చెప్పనే లేదంటావా? దుర్యోధనుడు కాస్త ఓపికగా విని ఉంటే ఆ భగవద్గీతను అప్పుడే చెప్పి ఉండేవాడినేమో? కానీ, నా మాటలు వినే ఓపిక ఆయనకెక్కడిది? ఆయన నా మాటలు వినకుండా తన మిత్రుల మాటలు విన్నాడు. నన్నే బంధించే ప్రయత్నం చేశాడు.

అప్పుడు కూడా సభామధ్యంలో నా విశ్వరూపం ప్రదర్శించాను. భయపడ్డాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత నన్ను ఇంద్రజాలం చేసే గారడీ వాడినంటూ హేళన చేశాడు.

"యద్భావం తద్భవతి" అని వినలేదా?
"యే యథా మామ్ ప్రపద్యన్తే తాన్ తథైవ భజామ్యహమ్"
(భగవద్గీత 4.11)

నన్ను గూర్చి ఎవరు ఏమనుకుంటే నేను వారికి అలాగే కనిపిస్తాను. అనిపిస్తాను. నువ్వేమనుకుంటావో నీ యిష్టం.

ప్రశ్న 25
స్వామీ, మీ మాటలు నాకు అయోమయం కలిగిస్తున్నాయి. ఒకవైపు అన్నీ చేసే భగవంతుడిని నేనే అంటారు. మరో వైపు నీ భావన ఎలా ఉందో అలాగే జరుగుతుంది అంటారు.  అందుకనే అర్జునుడిలా నేను నిన్ను అదే విధంగా ఆశ్రయిస్తున్నాను.

కార్పణ్యదోషోప హతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః.
యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్.

కృష్ణుడు:
ఇది ప్రశ్నలా లేదే?

*****
ఉపసంహారం:
******
అలా ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ చేసేటపుడు ఎదుట ఉన్నవారు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయితే అతడిని అయోమయంలో పడేస్తూ అతడి చేత వివాదాస్పదవ్యాఖ్యలు చేయిస్తూ అతడికి తెలియకుండా అతడి మాటల మీద ప్రజాభిప్రాయం కోరుతూ, రాచి రంపాన పెట్టడమే ఇంటర్వ్యూ అని కదా ఈరోజుల్లో భావం?

కానీ, అలా చేస్తూ చేస్తూ అతని మాటలు బలేగా నచ్చేసి అతనికి భక్తుడైపోయి నువ్వే నాకు దిక్కంటే ఆ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పటికీ కట్ చెప్పాల్సిందే కదా?

అలా నేను చేస్తున్న/చేసిన ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోవలసి వచ్చిందన్న మాట. అయినప్పటికీ ఆయననుండి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను రాబట్టాననే భావిస్తున్నాను.

ఈ ఇంటర్వ్యూ చదివినవారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ నిశ్చితమైన శ్రేయస్సు కలుగుగాక!

ఇంటర్వ్యూ రెండవ భాగం కూడా శ్రీకృష్ణార్పణమస్తు.

శ్రీకృష్ణునితో ఇంటర్వ్యూ 1

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((మొదటి భాగం)) 

ప్రస్తావన:
అరిందమనుడి బుఱ్ఱ నిండా ప్రశ్నలే ప్రశ్నలు. 
ఒకోసారి అర్ధరాత్రి పూట కూడా నిద్రనుండి లేపి మరీ ప్రశ్నలు వేస్తుంటాడు. వాడికి అందరు దేవుళ్లకంటే కృష్ణుడంటేనే ఎక్కువ ఇష్టం. రేపటి దినాన కృష్ణాష్టమికి హరే రామ హరే కృష్ణ గుడికి పోదాం అని చెబుతూ చెబుతూ వాడు నన్ను నిన్న సాయంత్రం అడిగిన ప్రశ్న ఇదీ -

"అప్పన్నా, కృష్ణుడికి ఎవరంటే అందరికంటే ఇష్టం?"

వెంటనే సమాధానం చెప్పాను: "అర్జునుడంటే ఇష్టం."

"మరి".. అని మొదలుపెట్టాడు వాడు. (పాచికలు జూదం అనే పదాలు వాడికి ఇంకా అలవాటు పడలేదు. చేతితో వాటిని వేస్తున్నట్టు అభినయిస్తూ) "ఇలా ఇలా వేసి ఆడుతాడే... వాడు ఇష్టమని ఆ సినిమాలో చెప్పాడు కదా?" అని అడిగాడు.

మాయాబజార్ సినిమాలో శకుని ఇష్టమని చెప్పించిన విషయం గూర్చి అడుగుతున్నాడని కాసేపటికి అర్థమైంది.

"సినిమాలో తీసి చూపించేవన్నీ నిజం కావు" అని చెప్పాను. ఈలోగా వాడి నేస్తం ఎవడో పిలిచేసరికి ఆడుకోవాలంటూ పారిపోయాడు.

లాభం లేదు,
కొన్ని కొన్ని విషయాలు నేరుగా కృష్ణుడినే అడిగి కన్ ఫామ్ చేసుకోవాలని నిశ్చయించుకుని

"కృష్ణా ఇంటర్వ్యూ ఇస్తావా" అని అడిగాను.

ఓ వైపు ప్రపంచమంతా ఈరోజు ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నా, నా కోరికను మన్నించి ఆయన "సరే" అని అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూ ను ఈ రోజు మీముందుకు తేగలిగాను.

***
ఇంటర్వ్యూ మొదలు:
***

ప్రశ్న 1
స్వామీ, కృష్ణా, మీకు సూటిగా ఒక ప్రశ్న. మీకు అందరికంటే ఎవరు ఇష్టం?

కృష్ణుడు:
నువ్వే చెప్పావు గదయ్యా అరిందమనుడికి. మళ్ళీ సందేహం ఎందుకు? నాకు అర్జునుడంటేనే అందరికంటే ఇష్టం.

ప్రశ్న 2
అర్జునుడిలో ఏమి చూసి అంతగా ఇష్టపడ్డారు?

కృష్ణుడు:
అర్జునుడిలో ఉండే సుగుణాలు ఒకటా రెండా?

అర్జునుడి ఆత్మవిశ్వాసం మొదటి కారణం. "నేను కోరిన గురుదక్షిణ ఎవరు ఇస్తారు?" అని గురువు అడిగితే చిన్నతనంకొద్దీ మిగిలిన రాజకుమారులు అందరూ అదేమిటో అని భయపడిన క్షణాన అర్జునుడు ఒక్కడే "నేనిస్తాను" అని ధైర్యంగా చేయి ఎత్తాడు.

క్షత్రియుడిగా పరాక్రమవంతుడు కావడం తన లక్ష్యంగా భావించి అందుకు అహర్నిశలు శ్రమించే అతడి దీక్ష అనితరసాధ్యం. చిన్నతనంలో రాత్రులు చీకట్లో కూడా బాణాలు వేస్తూ అభ్యాసం చేసినా, గొప్ప తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించినా అతడికతడే సాటి.

మహా ప్రతాపవంతుడిని అనే గర్వం మనసులో లేకుండా తన చేత ఓడిన వారి పట్ల కూడా అతడు ప్రదర్శించే సౌమ్యత చాలదూ అతడిని మహానుభావుడు అనడానికి? ఆ మాటలకు ముగ్ధుడైపోయి కాదూ, ద్రుపదుడు అర్జునుడికి ఇవ్వడానికి తనకో కూతురు ఉంటే బాగుండుననుకున్నది?

విజయం సాధించాక ఒళ్ళు మరచి విశృంఖలంగా ప్రవర్తించేవారిని చూస్తాం కానీ, అటువంటి ఆనందంలో కూడా సదాచారాన్ని మరువని అతడి నడవడికను పొగడకుండా ఎలా ఉండగలం? "అర్జునా! ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నావు కాబట్టి, ఆమెను నువ్వు పెళ్లాడు” అని ధర్మరాజు అంటే, ఎగిరి గంతేసి పెళ్లి చేసుకోకుండా, "అన్నా, నాకంటే పెద్దవారు మీరు భీమన్న ఉన్నారు కదా, మీ ఇద్దరికీ అయిన తరువాతే నా పెళ్లి" అని చెప్పడం అందరికీ సాధ్యమా? చివరకు తల్లి అయిన కుంతి మాటపై ద్రౌపదిని అన్నదమ్ములందరూ పెళ్ళాడడం వేరే విషయం.

ప్రపంచం తల్లక్రిందులైనా ఒక నియమానికి కట్టుబడి ఉండటం అతనిలో తప్ప వేరెవరిలో చూడగలం? మిగిలిన పాండవులందరూ ఇంద్రప్రస్థంలో హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ ఉండగా నియమానికి స్వచ్ఛందంగా కట్టుబడి అతడు పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేయడం సామాన్యమైన విషయమా?

అర్జునుడికి ఉన్నంతటి ఆత్మనిగ్రహశక్తి వేరెవరికీ లేదు. అంతటి అప్సరస, సాక్షాత్తు ఊర్వశి అతడిపై మరులుగొని వస్తే, "అమ్మా నీవు నాకు తల్లివంటి దానివి" అని పాదాభివందనం చేశాడు కదా?

ఇలా ఇంకా ఇంకా చాలా చెప్పగలను. కానీ ప్రస్తుతానికి ఇవి చాలు.

ప్రశ్న 3
మరి అర్జునుడు అంతటి గుణవంతుడే అయితే - తన గురువు గారైన ద్రోణుడికి ద్రుపదుడు శత్రువు కదా? అటువంటి ఆయన కూతురును పెళ్ళాడి ఎందుకు అతనికి ఎందుకు బంధువు అయ్యాడు?

కృష్ణుడు:
ద్రోణుడు ద్రుపదునితో సంధి కుదుర్చుకున్నాడు కదా. ద్రుపదుడికి దక్షిణపాంచాలరాజ్యం ఇచ్చి, ఉత్తరాన ఉన్న అహిచ్ఛత్రనగరం తన స్వాధీనంలో ఉండేట్టు ఒప్పందం చేసుకున్నారు కదా? ఇక శత్రుత్వం లేదని ద్రోణుడే స్వయంగా ద్రుపదుడితో అన్నాడు కదా? ద్రుపదుడితో బంధుత్వం పెట్టుకుంటే అతడి మనసులో తన గురువుపై ఉన్న ఏ కొద్ది ద్వేషమైనా సమసిపోతుందని భావించాడు. తప్పేముంది?

ప్రశ్న 4
మరి అర్జునుడు గురువుగారి మీదనే బాణాలు వేసిన మాట అబద్ధమా?

కృష్ణుడు:
మీలాంటి వారు భవిష్యత్తులో ఇలా ఆక్షేపిస్తారనే కాబోలు, సభలో పెద్దలందరి ఎదుటా ద్రోణుడు అర్జునుడిని ఒక ప్రత్యేకమైన గురుదక్షిణ కోరాడు. యుద్ధరంగంలో స్వయంగా గురువైన తానే ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా యుద్ధం చేయమని అడిగాడు.

आचार्यदक्षिणां देहि ज्ञातिग्रामस्य पश्यतः।
युद्धे2हं प्रतियोद्धव्यो युध्यमानस्त्वयानघ।।
(మహాభారతం.1.138.13&14)

అందుకని అర్జునుడు గురువుగారిమీద బాణాలు వేసి గురుదక్షిణ చెల్లించవలసి వచ్చింది. సరేనా?

ప్రశ్న 5
మరి తాతగారైన భీష్ముడిమీద బాణాలు వేయడం తప్పు కాదా?

కృష్ణుడు:
అయ్యా, మీరు మామూలు మనుషులు. అందువల్ల మామూలుగానే ఆలోచిస్తున్నారు. కాని, భీష్ముడు అర్జునుడు క్షత్రియులు. వారికి సంబంధించి యుద్ధం అనేది పెళ్ళివంటి శుభకార్యం. బాణాలు తగిలి పడిపోయిన భీష్ముడు తన వద్దకు దుర్యోధనుడు పంపగా వచ్చిన శస్త్రవైద్యులను వద్దని రాజులందరితోనూ ఏమన్నాడో తెలుసునా?

"క్షత్రియుడు మంచాన పడి రోగాలతో చనిపోవడం అనుచితం. యుద్ధరంగాన అస్త్రవిద్ధుడై చనిపోవడమే క్షత్రియునికి అత్యుత్తమమరణం".

అలా అర్జునుడు తన తాతగారి కోరికను నెరవేర్చినవాడయ్యాడు సుమా.

ప్రశ్న 6
పక్షపాతం లేకుండా చెప్పండి - కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా?

కృష్ణుడు:
వారిద్దరినీ పోల్చి చూడాలనే బుద్ధి జనాలకు ఎందుకు పుట్టింది? వారిద్దరూ యుద్ధంలో పరస్పర ప్రత్యర్థులు కాబట్టి. కాబట్టి, గెలిచినవాడే గొప్ప. అర్జునుడు కర్ణుడిని ఉత్తరగోగ్రహణసమయంలో ఓడించాడు. రెండోసారి నేరుగా కురుక్షేత్రంలో ఓడించాడు.

అసలు అర్జునుడిదాకా ఎందుకు? కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు. సాత్యకి చేతిలో ఓడిపోయాడు. కానీ, వారందరూ "ఈ కర్ణుడు అర్జునుడిచేతిలోనే చావాలి తప్ప మా చేతిలో కాదు" అని వదిలేయబట్టి బ్రతికిపోయాడు.

అటువంటి మొహమాటాలేమీ లేని ఘటోత్కచుడు దాదాపు కర్ణుని చంపేసేవాడే.
అందుకని ఆ ఆపత్సమయంలో కర్ణుడు అర్జునుడిని చంపడం కోసం దాచుకున్న ఇంద్రుడిచ్చిన మహాశక్తిని ఘటోత్కచుడిపై విసిరేసి మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బ్రతికి బయటపడ్డాడు.

ప్రశ్న 7
కానీ, ఇంద్రుడు కర్ణుని కవచం లాగేసి శక్తిహీనుణ్ణి చేసేసిన తరువాత కదా, వీరందరి చేతిలో కర్ణుడు ఓడింది?

కృష్ణుడు:
సరే, కాసేపు అలాగే అనుకుందాం.

కానీ, ఘోషయాత్ర సమయంలో కర్ణుడు అర్జునుని శిష్యుడైన చిత్రసేనుని చేతిలో చిత్తుగా ఓడిపోయి జాడ కూడా తెలియకుండా పారిపోయాడు కదా. దానికేమంటారు?

ఈ కర్ణుడు తన నూత్న యౌవనసమయంలోనే తనతో ద్వంద్వయుద్ధం చేయమని అర్జునుడిని సవాలు చేశాడు కదా, కానీ, ఆ మరుసటి రోజే దుర్యోధనుడితోనూ, మిగిలిన కౌరవులతోనూ కలసి ద్రుపదుడి మీద యుద్ధానికి పోయి చిత్తుగా తన్నులు తిని పారిపోలేదా?

ఈ రెండు సందర్భాలలోనూ అతడి ఒంటి మీద సహజకవచకుండలాలు ఉన్నాయి కదా? అవి ఉండడం వల్ల అతడు ఏమాత్రం గెలిచాడేమిటి?

ప్రశ్న 8
మరి కర్ణుడికి గురుశాపం ఉంది కదా?

కృష్ణుడు:
అది అతడు చేతులారా చేసుకున్న పని. దానికి ఎవడు ఏం చేయగలడు? ఈ విషయంలో అర్జునుడికి ఏమి సంబంధం ఉంది? అర్జునుడు స్వయంగా పరశురాముడి చెంతకు వెళ్లి "అయ్యా, దయచేసి కర్ణుడికి శాపం ఇవ్వండి" అని కోరి ఉంటే మీరు తప్పు పట్టవచ్చు.

"సచిన్ టెండూల్కర్ రన్ అవుట్ కాకుండా ఉంటే అతడు సెంచరీ చేసేవాడు, మ్యాచ్ గెలిపించేవాడు" అని మీరు బాధపడితే ఎంత అసంబద్ధమో, ఇపుడు ఈ గురుశాపప్రస్తావన వంటివి అంతే అసంబద్ధం.

ప్రశ్న 9
యుద్ధంలో రథం క్రుంగి పోయి నేల మీద ఉన్న కర్ణుడి మీదకు బాణం వేయమని మీరు అర్జునుడిని ప్రోత్సహించలేదా? అది ధర్మమేనా?

కృష్ణుడు:
ఇప్పుడు మీరే కాదు, సాక్షాత్తు కర్ణుడు కూడా నన్ను ఆ సమయంలో ఇదే మాట అడిగాడు. అపుడు నేను కూడా ఆ కర్ణుడిని అడిగాను -

ఏమయ్యా కర్ణా? "పాండవులు వానవాసాన్ని అజ్ఞాతవాసాన్ని నియమం ప్రకారం ముగించారు కాబట్టి, వారి రాజ్యం వారికి ఇచ్చేయడం ధర్మం" అని నువు దుర్యోధనుడికి ఆ సమయంలో ధర్మాన్ని ఎందుకు గుర్తు చేయలేదు?

భీముడికి విషం పెట్టినపుడు అది అధర్మం అని నీ మిత్రుడికి ఎందుకు చెప్పలేదు?

పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చివేసే ప్రయత్నం అధర్మం అని ఎందుకు చెప్పలేదు?

ద్రౌపదిని నిండుసభలో దుశ్శాసనుడు, మీ ప్రాణమిత్రుడైన దుర్యోధనుడు పరాభవించినపుడు, నువ్వు ఆనందంతో కేరింతలు కొట్టినప్పుడు ఈ ధర్మం ఎందుకు గుర్తుకురాలేదు?

అభిమన్యుడు ఒంటరిగా యుద్ధం చేస్తూ నీలాగే నేలమీద ఉన్నపుడు, అయ్యో అతడు బాలుడు కదా, నిరాయుధుడై ఉన్నాడు కదా అనే కనికరం కూడా లేకుండా ఆరుగురు అతిరథులు అతడిపై విరుచుకుపడి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా?  ఆ ఆరుగురిలో నువ్వు కూడా ఒకడివి కదా? ఆ సమయంలో అది అధర్మం అని ఎందుకు గుర్తుకు రాలేదు తమరికి?" అని అడిగాను.

ఆవిధంగా నేనడిగిన ప్రశ్నలలో కర్ణుడు ఏ ఒక్కదానికైనా సరైన సమాధానం చెప్పి ఉంటే, "అర్జునా! కాసేపు ఆగు, కర్ణుడు యుద్ధానికి సిద్ధమైన తరువాత బాణాలు వేద్దువు గాని" అని అర్జునుడిని ఆపి ఉండేవాడిని. మీకు ఈ ప్రశ్న వేసే శ్రమ తప్పి ఉండేది.

ప్రశ్న 10
శల్యుడు కర్ణుడిని నిరుత్సాహపరిచాడు కదా?

కృష్ణుడు:
అసలు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వస్తున్న శల్యుడిని మాయలతో వశపరచుకుని తన పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పించుకున్న దుర్యోధనుడిని అడగండి ఈ మాట. శత్రువు వేలుతో శత్రువు కంటినే పొడవాలని దుర్యోధనుడు అలాంటి ఎత్తు వేశాడు. అదే యుక్తిని ధర్మరాజు అమలు పరిస్తే తప్పు పడతారెందుకు?

ప్రశ్న 11
మీరు కూడా కర్ణుడిని పాండవపక్షానికి రప్పించేందుకు ప్రయత్నించారు కదా?

కృష్ణుడు:
కర్ణుడు పాండవపక్షంలో చేరి ఉంటే యుద్ధం జరుగదు కదా అనే ఆశతో అలా చేశాను. అయినా, ప్రయత్నించడంలో తప్పేమిటి? దుర్యోధనుడు ఏకంగా నన్నే తన పక్షాన యుద్ధం చేయమని కోరేందుకు రాలేదా?

ప్రశ్న 12
అలా ప్రయత్నించినపుడు ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని ఆశ పెట్టారట కదా?

కృష్ణుడు:
ఎవరు అలా చెప్పిన నీచుడు? మీ తెలుగువాళ్లు పరమచెత్త సినిమాలు తీసి అందులో నా పాత్రధారి చేత అటువంటి నీచపు మాటలు పలికించారని విన్నాను. నిజానికి కర్ణుడు పాండవుల పక్షానికి వస్తే అతడు రాజు అవుతాడని 
నేను చెప్పానే కానీ, ద్రౌపది గురించి అలా మాట్లాడే అధికారం నాకెక్కడిది? ఆ సమయంలో జరిగింది జూదమూ కాదు, ద్రౌపదిని తాకట్టు పెట్టేందుకు నేను ధర్మరాజునూ కాదు.

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
(అందుకు సమాధానంగా ఏమని ఉంటాడు ఊహించగలరా? ఇంకా కృష్ణుని ఎలాగైనా ఇరికిద్దామని, ఎన్నో సందేహాస్పదమైన విషయాలకు ఆయన నోటిమీదుగానే సమాధానాలను రాబడదామని ప్రయత్నించాను. ఆ మిగిలిన ఇంటర్వ్యూ ను ఈరోజే రెండో భాగంలో చదవండి)

ఇంటర్వ్యూ మొదటి భాగం శ్రీకృష్ణార్పణమస్తు.

అరిగే అన్నం - చేరే పంట

1 जीर्णमन्नं प्रशंसीयात्।  జీర్ణమన్నం ప్రశంసీయాత్
2 सस्यं च गृहमागतम्।  సస్యం చ గృహమాగతమ్

1 మనం మెచ్చుకోవలసింది
చూడగానే నోట్లో నీళ్లూరించే వంటకాలను కాదు, తింటూ ఉన్నపుడు రసాలూరే భోజనాన్ని కూడా కాదు. 
తిన్న తరువాత ఎటువంటి గడబిడ చేయకుండా చక్కగా జీర్ణమై దేహానికి చక్కని బలాన్ని, ముఖానికి మంచి తేజస్సును కలిగించే అన్నాన్ని మనం మెచ్చుకోవాలి.

2 మనం మెచ్చుకోవలసింది 
కనులవిందుగా విరగకాచిన పంటలను కాదు, కోసి నూర్చి తూర్పారబోసి కుప్పలు బెట్టిన ధాన్యరాసులను కూడా కాదు.
మూటలకో గిన్నెలకో ఎత్తి మన ఇంటికి తెచ్చుకున్న గింజలు మాత్రమే మనవి. వాటిని మనం మనసారా మెచ్చుకోవాలి.

ఇదీ పైనున్న రెండు వాక్యాలకు చిన్న వివరణ.
మన పూర్వుల అనుభవసిద్ధమైన వాక్యాలు.

మొదటి వాక్యాన్ని అనుభవజ్ఞుడైన ఒక వైద్యుడు ఇంకా బాగా వివరించగలడు.

రెండవ వాక్యాన్ని డక్కామొక్కీలు తిన్న రైతు మరింత బాగా వివరించగలడు.
***

మనకు ఆ మాటలు అంత రుచించకపోవచ్చు.
మన స్వభావమే అంత.

మనం సహజంగానే అల్పసంతోషులం.
ఎంతో ఎక్కువగా ఆశిస్తాం.
అంతే కాదు,
మనకు తొందర ఎక్కువ.
మనకున్నంత సహనం వేరెవరికీ లేదు.

ఇవ్వేంటి, ఇవన్నీ పరస్పరవ్యతిరేకవాక్యాలు  కదాని తెలివైనవారెవరూ తికమకపడరు. మన జనాలంతటి స్థితప్రజ్ఞులు ప్రపంచంలో మరెక్కడా కానరారు.
***

మనం ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలని ఆశిస్తాం.
కాని, ఓడిపోయినా పరవాలేదు,
టెండూల్కర్ సెంచురీ కొడితే ఆనందిస్తాం.

మన టీమ్ వల్డ్ కప్ గెలవాలని గుడులకెళ్లి పూజలు చేస్తాం.
కాని, ఫైనల్లో చిత్తుగా ఓడిపోయినా పరవాలేదు.
పాకిస్తాన్ మీద గెలిస్తే చాలు పండుగ చేసుకుంటాం.

మన దేశం అభివృద్ధిలో అమెరికా ఐరోపాలను మించాలంటాం.
కాని, ఆశ్రితులకు మాత్రమే కాంట్రాక్టులిచ్చినా పరవాలేదు.
అడ్డమైన వాగ్దానాలు చేసి మన నాయకుడు గెలిస్తే చాలంటాం.
****

ప్రతియేటా ఎమ్సెట్లోనూ ఐఐటీజీలోనూ ఎవరో ఒకరికి ర్యాంకులొస్తూనే ఉంటాయి. కాని, ఆయా విద్యాసంస్థలు ఆ ర్యాంకులు సాధించినవారొక్కరే, ఇప్పుడిప్పుడే చంద్రమండలం మీద అంగారక గ్రహం మీద మొట్టమొదట కాలు పెట్టి తిరిగొచ్చారన్నంత హడావుడి చేస్తాయి. ఆ తరువాత వారేం చదువుతారో, ఎలా చదువుతారో, చదివి మిగిలినవారికంటె భిన్నంగా ఏం సాధిస్తారో, వారి తెలివితేటలను దేశానికి ఎటువంటి ప్రయోజనం కలిగించేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలో - ఎవ్వరూ పట్టించుకోరు.

మన పీయంగారు మేకినిండియా నినాదాన్ని తప్ప దానికి అవసరమైన ఒక విధానాన్ని ఇచ్చినట్టు కానరాదు.

మన సీయంలాంటి వారైతే "ఈ మనిషి మేడినిండియానా? ఛీ, ఛీ, పనికిరానెదవ! వీడి రిజ్యూమేను చించి బుట్టలో పడేయండ్రా. మనం అమరావతిని కట్టుకుందాం, సింగపూర్ జపాన్ చైనావోళ్లనిట్టా పిలవండే" అంటారు.

అలా మనవి ర్యాంకుల్ని చూసి ఆనందించే మొహాలే గాని, ఆ ర్యాంకర్లను ఉపయోగించుకొనే మొహాలు కావు. మరింత గట్టిగా చెప్పాలంటే గెలిచిన కోడినీ ఓడిన కోడినీ ఊళ్లో ఉండే మొత్తం కోళ్లనీ కలిపి ఒకే బుట్ట క్రింద కప్పెట్టే మొహాలు.
***

ఇపుడు వెంకయ్యగారు ఉపరాష్ట్రపతి అయ్యారు. మనవాళ్లు షరా మామూలుగా అదేదో పెద్ద ర్యాంక్ అని నమ్మింపజూస్తున్నారు. పౌరసన్మానాలూ ఫోటో సెషన్లు మాజోరుగా చేయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ర్యాంకర్ గారు తరువాత రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఎలా ఉపయోగపడగలరో గాని, గవర్మెంటునుండి ఆ సన్మానం బిల్లులు వసూలు చేసేవారికి ఆ బిల్లుల్ని చెల్లించేవారికి మాత్రం ప్రస్తుతం బలేగా ఉపయోగపడుతున్నారు.

ఈయన మన రాష్ట్రప్రజలకు జీర్ణమయ్యే అన్నం కాదు, ఇంటికొచ్చే పంటా కాదు అనేది అందరికీ స్పష్టం.

అలా కాదు,
లాభనష్టాలప్రసక్తి లేకుండా పెద్దోళ్లని గౌరవించాలి కదా అంటే సరే అలాగే కానివ్వండి, ఎన్టీయార్ కు తన మామ అయ్యే అవకాశమిచ్చి గౌరవించిన వారిని మించి ఎవరున్నారు మర్యాదస్థులు మన దేశంలో?

ఆయనే స్వయంగా తన మిత్రులకు (బీజేపీకి) జీర్ణం కాని అన్నం.
ఆయనే స్వయంగా ఖర్జూరనాయుడింటికి చేరని పంట.

దాతా భవతి వా న వా -2

(దాతా భవతి వా న వా? - రెండవభాగం - Part -2)
దానయోగ్యమైనవి ఏమున్నాయి?
కాదేదీ దానానికనర్హం అన్న రీతిలో చాల ఉన్నాయి.
దాత ఒక మనిషే. గ్రహీత కూడా మనిషే.
కాబట్టి దాత వద్ద ఉన్నది అందరికీ కాకున్నా ఎవరో మరొకరికి తప్పక అవసరపడుతుంది కదా.

<><><><><><>
పుస్తకదానం -
<><><><><><>

మా చిన్నపుడు -
మేము పై తరగతికి ప్రమోట్ కాగానే, మా పాఠ్యపుస్తకాలను మా జూనియర్ విద్యార్థులకు ఇచ్చే పద్ధతి ఉండేది. అలాగే మా సీనియర్ల నుండి మేము అందుకొనేవాళ్లం. అలా మాకు దేవుడిచ్చిన అన్నల్లా మా సీనియర్లు ఉండేవారు. పాఠశాలలో మాకు ఎలాంటి సమస్య వచ్చినా మేము వారికి చెప్పేవాళ్లం. వాళ్లు పరిష్కరించేవాళ్లు. లేదా పరిష్కారమార్గం చూపేవారు.
ఈ రోజుల్లో అంతటి సుహృద్భావాలు తక్కువైపోయినై. పై తరగతికి ప్రమోట్ అయిన తరువాత పుస్తకాలను సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ వాడికి ఎంతో కొంత మొత్తానికి అమ్మేస్తున్నారు. జూనియర్స్ కూడా ఇచ్చినా ఎవరూ తీసుకొనటం లేదు. అబ్బే, ప్రజల్లో దాతృత్వభావన తగ్గటం కాని, లేదా తీసుకొనడానికి మొహమాటం పెరగటం కాని అందుకు కారణాలు కానే కావు.
అసలు కారణం కార్పొరేట్ విద్యాలయాలు!
అవి తమ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను లేదా స్టడీ మెటీరియల్ ను బలవంతంగా అంటగడుతున్నాయి. వాటి ఖరీదును ముక్కు పిండి బలవంతంగా వసూలు చేస్తున్నాయి.
ఇలా ఒకప్పుడు Charity begins at Home అనే సూత్రం అమలౌతూ ఉండగా, క్రమక్రమంగా వ్యాపారసంస్థలు మన జీవనంలోనికి దూరి ఆ సుహృద్భావనలను నాశనం చేయడం మొదలైంది. "జీవితమంటే వ్యాపారం" అనే దుర్మార్గభావాలను అవి బలవంతంగా బాల్యంలోనే మెదళ్లలోనికి చొప్పిస్తున్నాయి.
ఏ విత్తనం వేస్తే ఆ పంట పండటం సహజమే కదా! సమాజమంతా వ్యాపారపంటలు పండటం ప్రారంభమైనాయి. ఇప్పటికీ అవే పండుతున్నాయి.
<><><><><><>

గ్యూటెన్బర్గ్ మహాశయుల పుణ్యమాని అచ్చొత్తే పద్ధతి వచ్చాక పుస్తకమనేది అందరికీ అందుబాటులోనికి వచ్చింది. కంప్యూటర్ వచ్చాక పుస్తకముద్రణ మరీ తేలికైంది. కాని, అంతకు ముందు పుస్తకాలంటే తాళపత్రాల కట్టలే కదా - ఓ గ్రంథాన్ని వాటిపై వ్రాసి దానం చేయడమంటే ఎంతటి సమయం పట్టేదో - అది ఎంత కష్టమైన విషయమో ఊహించుకొనగలిగినవారికే - పుస్తకదానంలోని మహత్త్వం అర్థమౌతుంది.
ఔదార్యవంతులైన ధనవంతులు కొందరు వ్రాతగాళ్లను పోషిస్తూ, వారితో వివిధగ్రంథాలను కాపీ చేయిస్తూ, విద్యాలయాలకు, విద్యార్థులకు దానం చేసేవారట. అటువంటి మహాత్ములకు మన భారతజాతి మొత్తం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.
ఎప్పటి రామాయణభారతాలు? ఎప్పటి వాల్మీకివ్యాసులు?
వారి స్వహస్తలిఖితగ్రంథాలు శిథిలం కాకుండా మన తరం వరకూ ఉంటాయని అనుకోలేం.
దేశవ్యాప్తంగా అటువంటి అద్భుతగ్రంథాలను రక్షించుకొనేందుకు ఎంతెంతమంది కృషి చేసి ఉంటారు?
తరతరాలుగా ఎప్పటికప్పుడు వాటికి కాపీలు వ్రాయిస్తూ,
వాటిని కూలంకషంగా అధ్యయనం చేసేవారికి దానం చేస్తూ, గ్రంథాలయాలలో భద్రం చేస్తూ ఉండిన మహాదాతలు ఎందరు ఉండి ఉంటారు?
అందుకే కదా -
మనవరకు ఆ మహర్షుల ఉదాత్తభావాలు వచ్చి చేరాయి?
భారతదేశమంతటా ఆ రామాయణమహాభారతాలు ప్రఖ్యాతి చెంది ఉన్నాయంటే తరతరాలుగా ఎంతమంది తమ జీవితకాలాలను కఠోరశ్రమకోర్చి ఆ పుస్తకాలనిర్మాణానికి వెచ్చించి ఉంటారు?
వారు, వారిని ఆదరించి పోషించిన అజ్ఞాతదాతలు మనకు నిత్యవంద్యులు. ప్రాతఃస్మరణీయులు.
మా గురువుగారు తమ డాక్టరేట్ థీసిస్ లో పేరు కూడా తెలియని ఇటువంటి మహాభానువులు ప్రతి ఒక్కరికి ఎంతో భక్తితో కృతజ్ఞతలు సమర్పించి ఉండడం చూశాను. అది వారి సంస్కారం!
పుస్తకంలో కవి హృదయం ఉంటుంది. ఒక పుస్తకం చదివామంటే ఆ కవితో నేరుగా భాషిస్తున్నట్టే. అతి ప్రాచీన కవులతో ఆనాటి విషయాల గురించి చాటింగ్ చేయాలంటే ఆయా కవుల పుస్తకాలను చదవడమే ఏకైకోపాయం. అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చదవడమే - మనకు ఎన్ని సార్లు సందేహం వచ్చినా మనపై కోప్పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రశాంతంగా చెప్పేది ఆ పుస్తకంలోని కవి మాత్రమే కదా!
అలాంటి పుస్తకాలను ప్రజలకు చేరువ చేయాలని #రాయలసీమ బిడ్డడైన శ్రీ #గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు మహోద్ధృతంగా #గ్రంథాలయోద్యమంచేశారు. తత్ఫలితంగా ఈనాడు సామాన్యునికి కూడా చేరువలో గొప్ప పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
<><><><><><>

యుద్ధాలు లేని కాలమంటూ లేదు. భారతీయరాజుల నడుమ యుద్ధాలు జరిగేవి. కాని, వారెన్నడూ ఓడిపోయిన ప్రాంతానికి చెందిన ప్రజలను బాధించలేదు. గెలిచిన రాజునుండి ప్రజలు రక్షణ పొందుతూ వారికి పన్ను కట్టారు. కాబట్టి ఎందరు రాజులు మారినా ప్రజలు సుఖంగానే ఉన్నారు.
కాని, ఆవిధంగా "అయ్యో పాపం" అనే సెంటిమెంట్లవంటి "బలహీనతలేమీ" లేని విదేశీయులు భారతదేశంపై దండయాత్రలు మొదలుపెట్టాక ప్రజలను దోచుకొనడం మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయాలపై పడి సంఖ్యాధికమైన పుస్తకాలను తగలబెట్టేశారు. అధ్యాపకులను, విద్యార్థులను ఊచకోత కోశారు.
ఆ కాలంలో ఎన్నెన్ని శాస్త్రాలు (sciences) మంటగలిసి పోయాయో! తరువాత యూరోపీయపాలకులు వచ్చాక కూడా ఎన్నెన్ని పుస్తకాలు మన గ్రంథాలయాలనుండి అపహరింపబడ్డాయో! భారతీయులు తేనెటీగల్లా శ్రమించి కూడబెట్టుకున్న జ్ఞానమకరందాన్ని విదేశీయులు ఎలుగ్గొడ్లలా వచ్చి నాశనం చేసినంత చేశారు, త్రాగినంత త్రాగారు, ఎత్తుకుపోయినంత ఎత్తుకుపోయారు.
అయినా, మనం ఈనాటికీ వాళ్లు కోహినూర్ ఎత్తుకుపోయారని ఏడుస్తాం. నెమలిసింహాసనం ఎత్తుకుపోయారని ఏడుస్తాం. అమరావతి స్థూపాన్ని పెళ్లగించుకు పోయారని ఏడుస్తాం. వాటిని మనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. అవి ఖచ్చితంగా విలువైనవే.
కాని, వాళ్లు నాశనం చేసిన శాస్త్రగ్రంథాలు మరింత విలువైనవి. వెలకట్టలేనివి. వాటికోసం ఎవ్వరూ ఏడవరు, వాటి విలువ తెలిసినవారు తప్ప!
ఇది ఇలా ఉండగా మరికొందరు తయారయ్యారు -
తమకు ఇష్టంలేని ఒకటి రెండు విషయాలు ఏదైనా ఒక పుస్తకంలో కనబడితే చాలు - ఆ పుస్తకం తగలబెట్టెయ్యండి అనే వాళ్ళు, ఆ పుస్తకాన్ని బహిష్కరించండి అనే వాళ్ళు, ఆ పుస్తకాలను జనజీవనస్రవంతి నుండి తప్పించాలి అనే వాళ్ళు..
ఈ మధ్యనే ఒకాయన భారతజాతి శీలాన్ని నిర్దేశించే రామాయణమహాభారతాలను భారతదేశ ప్రజలకు దూరం చేయాలంటూ రాగం అందుకున్నారు కూడా. 
<><><><><><>

వైజ్ఞానికంగా ఎంతో ముందున్న భారతీయులు దిగజారిపోవడం అప్పటినుండే ప్రారంభమైంది. ప్రోత్సహించే దాతలు కరువయ్యారు. విదేశీప్రభుత్వాలు స్థానికపరిశోధనలను ప్రోత్సహించడం అటుంచితే వెతికి వెతికి నాశనం కూడా చేశాయి.
అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను నేయగల నేతగాళ్ల వ్రేళ్లను బ్రిటిషువారు నిర్దాక్షిణ్యంగా నరికించారని అంటారు. పబ్లిగ్గా జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు ఏమాత్రం సిగ్గుపడని బ్రిటిషు వాళ్లు, అజ్ఞాతంగా ఇటువంటి క్రూరకృత్యాలను ఏమీ చేయించలేదు అంటే ఎవరూ నమ్మరు.
సరే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనైనా భారతీయవైజ్ఞానిక పరిశోధనలు ముందుకు దూసుకుపోవడం లేదేమి అంటే -
ఒకటే కారణం -
శాస్త్రజ్ఞానమెపుడూ రిలే పరుగులాంటిది. సీనియర్ శాస్త్రవేత్తలు అందించిన జ్ఞానాన్ని జూనియర్లు అందుకొని, తాము కూడా దాని అభివృద్ధికి కృషి చేసి, తమ పరిశోధనఫలితాలను తమ జూనియర్లకు భద్రంగా అందించాలి.
కాని, మన దేశంలో సుదీర్ఘమైన విదేశీపాలన ఫలితంగా మన పూర్వవిజ్ఞానశాస్త్రవేత్తలతో మనకుండిన link తెగిపోయింది.
ఇంగ్లీషు మోజులో శాస్త్రభాష అయిన సంస్కృతాన్ని వదిలేశాం. సంస్కృతాన్ని నేర్చుకున్నవారు కూడా చాలమంది సంస్కృతమంటే కాళిదాసు, కొన్ని సుభాషితాలు, కొన్ని చమత్కారశ్లోకాలు, కొన్ని స్తోత్రాలు, కాస్త జ్యోతిషం - ఇలాంటివి మాత్రమే అనుకొని వాటిలో చెప్పుకోదగినంత పరిశ్రమ చేసి, ఈ జీవితానికిది చాలు అనుకుంటున్నారు.
కాలిపోయినవి కాలిపోగా, అపహరణకు గురైనవి పోగా, మిగిలిన శాస్త్రగ్రంథాలు ఇంకా తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. అవి కూడా దేవనాగరిలిపిలో ఉన్నవి తక్కువ. సంస్కృతమే అయినా రకరకాల లిపులలో ఉన్నాయి. వాటిలో కూడా, ఘుణాక్షరాలేవో వ్రాతగాని అక్షరాలేవో సరిగా గుర్తించాలంటే తలప్రాణం తోకకొస్తుంది. ఆ ప్రాచీన లిపులను నిర్దుష్టంగా చదవగలిగిన వారు అసలు దేశంలో ఉన్నారో లేరో అనిపిస్తుంది!
అయినా, వాటిని పరిశోధించేందుకు నిధులిచ్చే దాతలు లేరు. నేటి ప్రభుత్వాలకు పుష్కరాలనిర్వహణమీద ఉన్నంత శ్రద్ధ ఇటువంటి పనులలో లేదు.
కాబట్టి, విజ్ఞానశాస్త్రానికి భారతీయుల contribution ఏమీ లేదు అనుకుంటూ, మనలను మనం తక్కువ చేసుకుంటూ inferiority complex తో బ్రతకాల్సిందే మనం. అది మనం చేసుకున్న "ఖర్మ".
ఇపుడు మరింత బాగా అర్థమౌతుంది కదా, - "दाता भवति वा न वा - దాత అనేవాడొకడు ఉన్నాడో లేడో" - అనే కవిగారి మాటలోని ఆవేదన?
ఆవేదన కవికి మాత్రమే కాదుట, పుస్తకానికి కూడా ఉంటుందట -
అది ఆవేదనతో - "నాయనలారా, నన్ను నూనెనుండి, నీటినుండి రక్షించండి. నా కుట్లు ఊడి శిథిలం అయిపోకుండా కాపాడండి. దయచేసి మూర్ఖుని చేతికి ఇవ్వకండి" అని వేడుకుంటుందట పాపం.
తైలాద్రక్షేద్ జలాద్రక్షేద్ రక్షేచ్చిథిలబంధనాత్।
మూర్ఖహస్తే న దాతవ్యమ్ ఏవం వదతి పుస్తకమ్।।
కాబట్టి, పుస్తకదానం గొప్పదే - కానీ దాని గొప్పదనం అర్థం చేసుకోలేని వానికి చేరితే దానికి మరణమే గతి. తప్పదు - అక్కడ కాస్త జాగ్రత్త పడాలి అని పెద్దల మాట.
ఈరోజుల్లో డిజిటల్ పుస్తకాలు వచ్చాక రక్షణ కాస్త సులువైనట్లుగా అనిపిస్తోంది. కాని అందులో కూడా ఏవో కష్టనష్టాలు ఉండకపోవు. 

దాతా భవతి వా న వా - 1

(మొదటి భాగం - Part 1)
శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః।
వక్తా దశసహస్రేషు దాతా భవతి వా న వా।।

నూరుగురిలో ఒక శూరుడు పుడతాడు.
వేలమందిలో ఒక పండితుడు పుడతాడు.
పదివేలమందిలో ఒక వక్త పుడతాడు.
కాని దాత అనేవాడు ఒకడు పుడతాడో లేదో!

చూశారా?
సకలశుభలక్షణాలు కలిగినవారు కొందరైనా ఎంతో కొంత మొత్తంలో పుడుతున్నారు కాని దాత మాత్రం పుడతాడో లేడో అంటూ విచారం వ్యక్తం చేశాడో కవి. దాతలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా సప్లై తక్కువగా ఉందని అర్థం కావట్లా పాపం?
దాత అనగానే ఎలాంటి మనిషిని ఊహిస్తాం ?
రోజూ ఓ శుభముహూర్తాన తన ఇంటి ముందు క్యూలో నిలబడిన పేదవాళ్లకు బట్టలు డబ్బులు పంచి, అమ్మా, అయ్యా, అదే చేత్తో మా ఇంట భోజనం చేసి వెళ్లండంటున్న ఓ మధురమందహాసముఖుడిని ఊహిస్తామా?
ఆఫీసులో తన ఏసీ ఛాంబర్లో కూర్చుని, ఎవరో ఆర్గనైజర్లు తన దగ్గరకు వచ్చి, తాము చేయబోతున్న ప్రజోపయోగకరమైన పని ఏదో చెప్పగానే, కన్విన్సైపోయి, వారు ఊహించనంత పెద్ద మొత్తానికి ఓ చెక్కు వ్రాసిచ్చే ఓ గొప్ప వ్యాపారవేత్తను ఊహిస్తామా?
ఊహ ఎలా ఉన్నా, దాత అనగానే, తన దగ్గర తన అవసరానికంటె ఎక్కువ ఉన్న వస్తువులనో లేక ధనాన్నో ఇతరులకు ఇచ్చేవాడని అనుకుంటాం కదా? ఎంత పెద్ద రిజర్వాయరైనా తన కడుపులో ఎన్ని నీళ్లని దాచుకోగలదు? వరద వస్తే వదిలేస్తుంది కదా? వదలకపోతే పగిలిపోతుంది కదా? ప్రాణం లేని రిజర్వాయర్ కు కూడా ఆమాత్రం జ్ఞానముంది కదా?
<><><><><><>
దానాలు ఎన్ని రకాలు?
సాత్త్వికదానం, రాజసికదానం, తామసికదానం అంటూ భగవద్గీత చెబుతుంది. (17-20,21,22)
ప్రతిఫలాపేక్షలేకుండా దేశకాలపాత్రోచితంగా చేసే దానం సాత్త్వికం.
ప్రతిఫలాన్ని ఆశిస్తూనో, బాధతోనో చేసే దానం రాజసం.
దేశకాలపాత్రౌచిత్యాలను ఎరుగకుండా తిరస్కారభావంతో చేసే దానం తామసం.
<><><><><><>

దానం ఎంత శ్రద్ధగా చేయాలో తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది. 
(శిక్షావల్లి-ఏకాదశోऽనువాకః) 
శ్రద్ధయా దేయమ్ = 
ప్రేమపూర్వకంగా, ఆదరపూర్వకంగా, ఆలస్యం చేయకుండా, అవసరాన్ని గుర్తించి చేయాలి.
అశ్రద్ధయాऽదేయమ్ = 
బాధపడుతూ గాని, తిరస్కారభావంతో గాని, ఇవ్వరాదు. 
శ్రియా దేయమ్ = 
తన సంపదకు తగినట్లు ఇవ్వాలి. (సంపదకు మించి దానం చేయడం వద్దు అని కూడా అర్థం)
హ్రియా దేయమ్ = 
సంకోచిస్తూ దానం చేయాలి. (అయ్యో, నేను ఇస్తున్నది ఈయనకు సరిపోతుందో లేదో అని)
భియా దేయమ్ = 
భయంతో ఇవ్వాలి. (నా యజమాని అయిన భగవంతుడు నాకు ఇచ్చినది నేను ఇతరులకు ఇస్తున్నాను. ఇది భగవంతుని కార్యమే కాని, నా పని కాదు, ఇందులో లోపాలుంటే భగవంతునికి కోపం వస్తుందనే భయంతో ఇవ్వాలి)
సంవిదా దేయమ్ = 
స్వీకరించేవాని యోగ్యతకు తగినట్లు చేయాలి.
<><><><><><>
ఐదు కారణాలవల్ల దానాలు జరుగుతాయని వ్యాసమహాభారతం చెబుతుంది.
(అనుశాసనపర్వ-దానధర్మపర్వ- 138.5,6,7,8,9,10)

1 ఇహలోకంలో కీర్తిని పరలోకంలో సుఖాన్ని కోరి చేసే దానాలు. 
2 నేను ఇతని వల్ల మేలు పొందాను అనే కృతఙ్ఞతతోనో, లేదో ఇతని వల్ల నాకు రాబోయే కాలంలో మేలు కలుగుతుందనే భావంతోనో చేయబడే దానాలు.
3 వీనికి ఇవ్వకుంటే నాకు అపకారం చేస్తాడని భయపడి చేసే దానాలు.
4 వీడు నాకు ఆప్తుడు, కావలసినవాడు అని ప్రేమతో చేసే దానాలు. 
5 పాపం వీడు దీనుడు, అభిమానం వదులుకొని యాచిస్తున్నాడు, ఎంత చిన్నమొత్తం ఇచ్చినా దాంతోనే సంతోషపడతాడు అని జాలిపడి చేసే దానాలు.
<><><><><><>
దానాలు చేయడం వల్ల వివిధ పుణ్యలోకాలలో సుఖంగా ఉండవచ్చునని పురాణాలు ఉద్ఘోషిస్తూ ఆశపెట్టడం ఎందుకు - అంటే - దాతలను తయారుచేయడానికే! వాపీకూపతటాకాలయారామాదుల నిర్మాణం చేయించేవాడు కూడా దాతగానే పరిగణింపబడ్డాడు. కరువురోజుల్లో ప్రజలు అల్లలాడిపోతుంటే వారిని కూర్చోబెట్టి పోషించడం కాకుండా, వారితో చెఱువులు బావులను తవ్వించడం, దేవాలయాలను కట్టించడం వంటి పనుల ద్వారా ఆయా శ్రమజీవులకు, ఆయా వృత్తులను నమ్ముకొని బ్రతికేవారికి ఆవిధంగా జీవనభృతి కల్పించడమనేది - నిష్కారణదానంతో సమానమైన పుణ్యకార్యంగా గుర్తించబడింది.

దీన్ని మనం ఆధునికీకరించడానికి a planned social crisis management గా కూడా గుర్తించవచ్చు. అడవుల్లో తినడానికి ఏమీ దొరకనపుడు చిరుతపులులు ఊళ్లమీద పడి గొఱ్ఱెలు, మేకలు, దూడలు, కోళ్లు, కుక్కలను లాక్కుపోతుంటాయి కదా? అలాగే కరువు రోజుల్లో మంచి క్రమశిక్షణ కలిగిన ప్రజలు కూడా, ఆకలిబాధకు తట్టుకోలేక, తెగబడి, దొంగలుగా దోపిడీదార్లుగా మారే అవకాశం ఉంది. దానిని నివారించడానికి ఉత్తమమార్గం - ఆ కరువు రోజుల్లో వారికి పనికి ఆహారం పథకం ద్వారా జీవనోపాధిని చూపడమే. అందువల్ల ధనవంతులకు డబ్బు నష్టమైనా, శాశ్వతమైన కీర్తి లభిస్తుంది కదా!

కాని మన దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కరువునివారణ అనేది కేవలం గవర్నమెంటు చేయవలసిన పనిగా ధనవంతులు తమ బాధ్యతలనుండి తప్పుకుంటున్నారు. కరువు లేనపుడు తమ సంపద పెరగడానికి ఉపయోగపడిన సామాన్యప్రజలు కరువు కాలంలో మోయరాని భారంగా కనపడడం అన్యాయం కదా? అందుకే - దాత అనేవాడు అసలు పుడతాడో లేడో అని ఒక సామాజికస్పృహ కలిగిన కవి వాపోయింది. 
<><><><><><>
సరే, అసలు దానయోగ్యమైనవి ఏమిటి? అంటే -
"కాదేదీ దానానికి అనర్హం" అన్నట్టు చాలానే ఉన్నాయి.
(ఇంకా ఉంది)

కులము - పౌరుషము


తన కుమారుడు యుద్ధరంగంలో చనిపోయాడని మాట యుధిష్ఠిరుని నోట విన్నవెంటనే ద్రోణాచార్యులకు జీవితేచ్ఛ పోయింది. యుద్ధమధ్యంలో శస్త్రత్యాగం చేసి యోగాసనంలో కూర్చున్నాడు. ఇదే అదనుగా భావించి ధృష్టద్యుమ్నుడు ఆయన రథం మీదకు కుప్పించి దూకి అతని శిరోజాలను పట్టుకుని ఒక్క కత్తివేటుతో తలను మొండెం నుండి వేరు చేశాడు.

పాండవకౌరవపక్షాలు రెండూ ఈ చర్యను చూసి దిగ్భ్రాంతి చెందాయి. ఆచార్యుని మరణానికి ఎంతో ఖేదం చెందాయి. ఒక్క కర్ణుడే మిగిలిన అందరికంటె భిన్నంగా ఆలోచించాడు. 

"నా మిత్రుడైన దుర్యోధనుడు ఎంతో నమ్మకంతో ఈ ద్రోణాచార్యుని తన సమస్తసైన్యానికి నాయకుడిగా నియమిస్తే అతడు తన మహారాజుకు విజయం కలిగేలా యుద్ధం చేయవలసింది పోయి, తన కొడుకు చనిపోయాడనేసరికి యుద్ధం మానేసి చేతులారా చావు కొనితెచ్చుకున్నాడు. ఈ విధంగా అతడు స్వామిద్రోహి" అని అతడు మనసారా నమ్మాడు. 

మరోవైపు ఆ ఘోరం జరిగిన సమయానికి అక్కడ లేని అశ్వత్థామకు ఈ విషయం తెలిసింది. ప్రాణప్రదుడైన తండ్రిని కోల్పోయిన తీరని దుఃఖం ఒకవైపు, తండ్రిని అన్యాయంగా చంపిన ఆ దుర్మార్గుడైన ధృష్టద్యుమ్నుని మట్టుపెట్టాలన్న తీవ్రప్రతీకారేచ్ఛ మరొకవైపు. తన తండ్రి గారు అవమానకరమైన రీతిలో మరణించడానికి కారణమైన పాండవ మత్స్య పాంచాల మాగధాది క్షత్రియాపసదుల పాలిటి పరశురాముడయ్యేందుకు పరమ క్రోధంతో ఉద్యుక్తుడయ్యాడు. 

అటువంటి తన మేనల్లునికి దుర్యోధనుడు కౌరవసేనాధిపత్యం ప్రసాదించగలడని కృపాచార్యులు ఆశించారు. కానీ, భీష్మద్రోణుల తరువాత కౌరవసేనాధిపత్యానికి మరొక పోటీదారుడు కర్ణుడు ఉన్నాడు. 

అతడు మహారాజైన దుర్యోధనుడికి ప్రియమిత్రుడు. పైగా రాజసమక్షంలో ద్రోణాచార్యుని మీద లేని పోని నిందలు వేస్తూ ఉన్నాడు. ద్రోణుడి బుద్ధి మంచిది కాదని, ఆసంగతిని బాల్యంలోనే కనుగొన్న ద్రుపదుడు అతనిని తన చెంత ఉంచుకోకుండా తరిమేశాడని ఇలా ఏమేమో చెబుతూ అతని మనసు విరిచేసి, అతనికి ద్రోణుడి పట్ల కృతజ్ఞతాభావం కానీ, గౌరవభావం కానీ లేకుండా చేశాడు. 

ఆ దుర్యోధనుడి సమక్షంలోనే కర్ణాశ్వత్థామల సంవాదం ఇలా జరిగింది:

అశ్వత్థామ) 
రాజా ఇక నిశ్చింతగా నిద్రపోదువు గాని. ఈ రోజు భూమి కృష్ణుడు, పాండవులు లేకుండా అయిపోతుంది.

కర్ణుడు) 
చెప్పడం సులువే. చేయడమే కష్టం. నువ్వు చెప్పిన పనిని చేయగలిగినవారు కౌరవసైన్యంలో చాలామంది ఉన్నారులే. (నీకంత శ్రమవద్దు.) 

అశ్వత్థామ) 
అంగరాజా, తండ్రి పోయిన దుఃఖంలో అలా అన్నానే గాని, ఇతరవీరులను అవమానించడం నా ఉద్దేశం కాదు.

కర్ణుడు) 
ఓయీ మూఢా! దుఃఖంతో ఉంటే కన్నీరు వదలాలి, కోపం వస్తే యుద్ధరంగంలోకి ఉరకాలి. అంతే గాని, ఇటువంటి ప్రగల్భాలు పలుకరాదు.

అశ్వత్థామ) 
ఒరే రాధాగర్భభారభూతుడా! సూతాపసదుడా! నువ్వా నాకు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్పేది? నీలా నేనెప్పుడూ యుద్ధరంగంనుండి పారిపోయి రాలేదే? నా ఆయుధం నీ ఆయుధంలా గురుశాపం పొంది నిర్వీర్యం కాలేదే? నీలా స్తోత్రపాఠాలు పలికే సూతకులంలో నేను పుట్టలేదే? కాబట్టి, నా క్షుద్రశత్రువులు నాకు చేసిన అపకారానికి నేను ప్రతీకారాన్ని అశ్రువులతో కాదు, అస్త్రంతోనే చేస్తాను.

కర్ణుడు) 
ఒరే వాచాలుడా! నా ఆయుధం నిర్వీర్యమో, సవీర్యమో గాని, నేనెప్పుడూ నీ తండ్రిలా ఆయుధాన్ని యుద్ధరంగంలో పక్కన పెట్టలేదు సుమా. 

మరొకటి కూడా చెబుతున్నాను. నేను సూతుడినా సూతపుత్రుడినా, ఎవరైతే నేమయ్యా? दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्। ఒరే, నేను ఏ కులంలో పుడితేనేమిరా, పుట్టించింది ఆ భగవంతుడు. అందువల్ల నా పుట్టుకకు అతడే బాధ్యుడు. కానీ, పౌరుషం ఉన్నదే, అది మాత్రం నేను సంపాదించుకున్నది. అది నాకు పుష్కలంగా ఉన్నదిరా"
***
***

ఇలా ఎవరైనా (సకారణంగానో లేక నిష్కారణంగానో) ఒక వ్యక్తిని ఆక్షేపిస్తే ఆ వ్యక్తి కోపగించుకుని తనను ఆక్షేపించిన వ్యక్తిని కులం పేరుతో తూలనాడడం ఈనాటి మాట కాదు. 

ఈ వాగ్వాదం జరిగింది భట్టనారాయణమహాకవి వ్రాసిన వేణీసంహారం అనే నాటకంలో. ఆయన మనకు దాదాపు పదకొండువందల సంవత్సరాల పూర్వీకుడు. ఆనాటికే ఇటువంటి ఆక్షేపణలు తూలనాడడాలు ఉన్నాయన్న మాటేగా?
***

కానీ ఆ తిట్లు కాసేపు పక్కన పెడితే చూడండి, అశ్వత్థామ వినయం: 

"నేను దుఃఖంలో ఏదో అన్నానే గాని, ఇతరవీరులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు" అన్నాడు. 

అంటే, "నేనొక్కడే వీరుడిని కాను, నావంటి వీరులు ఇంకా చాలామంది ఉన్నారు." అని స్వయంగా అంతటి మహావీరుడై ఉండి కూడా వినమ్రతను కనబరిచాడు. 
***

కాని, ఈనాడు ముఖానికి రంగులు పూసుకుని కెమెరా ముందు తైతక్కలాడే ఒక మనిషి కూడా, 

మా పుట్టుకే వేరు, మా బ్రీడే వారు, మా వంటి వంశం లేదు, మాకు సాటి పోటీ ఎవరూ రాలేరు 

అని వాగుతుంటే భరించవలసి ఖర్మ పట్టింది మనకు. 

అలాంటి వారికి కర్ణుడు ఆనాడే ఒక జవాబు చెప్పాడు:


" - దైవాయత్తం కులే జన్మ మదాయత్తం తు పౌరుషమ్ -
నేను ఫలానా కులంలో పుట్టడం అనేది దైవం చేతిలో ఉంది. 
కానీ, 
పౌరుషం నిరూపించుకొనడం మాత్రం ఖచ్చితంగా నా చేతిలో ఉంది." 
***

అలాగే జరుగుతుంది. 
అలా జరిగిందని ఇతిహాసమూ చెప్పింది, 
చరిత్ర కూడా అలా జరగడాన్ని చాలాసార్లు ప్రత్యక్షసాక్షిగా చూసింది.

- ఎవ్వరూ తక్కువ వాళ్లు కారు -


బ్రహ్మవంశసముద్భూతుడైన ఉత్తానపాదుడు అనే ఒకానొక మహారాజు ఉండేవాడు. ఆయనకు సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు.

ఉత్తానపాదునికి తన చిన్న భార్య అయిన సురుచి అంటే ప్రీతి ఎక్కువ. ఓ రోజు ఆయన ఉత్తముని ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలిస్తున్నాడు. ఇంతలో అక్కడికి ధ్రువుడు వచ్చాడు. తాను కూడా తండ్రి ఒడిలో ఎక్కాలని ఆశ పడ్డాడు. కాని, సునీతి అడ్డుపడింది.

“ఒరే అబ్బాయీ, నువు రాజపుత్రుడవే కావచ్చు. కాని, నువు నా కడుపున పుట్టలేదు, కాబట్టి, తండ్రి ఒడిలో కూర్చోవాలనే నీకోరిక దుర్లభం పొమ్మం”ది.

న వత్స నృపతేర్ధిష్ణ్యం భవానారోఢుమర్హసి।
న గృహీతో మయా యత్త్వం కుక్షావపి నృపాత్మజః।।
నూనం వేద భవాన్ యస్య దుర్లభేऽర్థే మనోరథః।।
(శ్రీమద్భాగవతం.4.8.11-12)

“అంతగా తండ్రి ఒడిలో కూర్చోవాలని ఉన్నా, రాజసింహాసనం కోరుకుంటున్నా, నువు ఒక పని చెయ్. నువు పురుషోత్తముని ఆరాధించు, అతని అనుగ్రహంతోనే మరలా నువు నా కడుపున పుట్టు.” అని అహంకారంతో పలికింది.

పసివాడైన ధ్రువుడు కఱ్ఱదెబ్బ తిన్న పాములా రోషంతో బుసలు కొట్టాడు. తరువాత తన నిస్సహాయత తెలుసుకొని పెద్దగా రోదించాడు. సునీత కూడా ఈ విషయం తెలుసుకుని చాల బాధపడింది. కుఱ్ఱవానికి కర్తవ్యం బోధించింది.

ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వమ్, ఉక్తం సమాత్రాపి యదవ్యలీకమ్।
(శ్రీమద్భాగవతం.4.8.19)

“నాయనా, ఆమె నీకు సవతి తల్లి అయినప్పటికీ, పురుషోత్తముని ఆరాధించమని నీకు సరైన మార్గనిర్దేశనమే చేసింది. కాబట్టి, ఆమెపై ద్వేషం పెట్టుకోక, ఆ పనిని చెయ్.” అన్నది.

ధ్రువుడు అలాగే చేశాడు. దయాళువైన నారదమహర్షి చెప్పిన ప్రకారం అద్భుతమైన తపస్సు చేశాడు. భగవంతుడు ఆ తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఆ ధ్రువుడు మనసులో కోరుకున్నదానిని మాత్రమే కాక, అంతకంటె ఉన్నతమైన స్థానాన్ని కూడా ప్రసాదించాడు.

ధ్రువుడు తండ్రి ఒడిని, సింహాసనాన్ని మాత్రమే పొందడం కాకుండా ద్రువమైన (స్థిరమైన) నక్షత్రమై నిలిచాడు.

ఇది, అందరికీ తెలిసిన ఒక సుప్రసిద్ధమైన కథ. ధ్రువుడు ఒక బాలభక్తుడని, పిల్లలందరూ అటువంటి భక్తిని కలిగి ఉండాలని బోధించి ఊరుకొనడంతో ఈ కథను పెద్దలందరూ కంచికి పంపేస్తారు. కాని ఆమాత్రంతో వదలిపెట్దదగిన కథా ఇది?
*

ఆనాడు ఉత్తానపాదుడికి ధ్రువుడు, ఉత్తముడు ఇద్దరూ సమానులే. ఐనప్పటికీ, తన మీద ఉత్తానపాదుడికి ఉన్న ప్రీతిని గ్రహించిన సురుచి న్యాయమైన ధ్రువుని కోరికను తిరస్కరించింది.

భగవంతుని దృష్టిలో బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు అనబడే వారందరూ సమానులే. (నేడు దళితులు అని పిలువబడుతున్నవారు కూడా శూద్రులే.)

కాని, కొందరు పైన చెప్పిన కథలో సురుచిలా అహంకరించి, “నువు మా ఇంట పుట్టలేదు కాబట్టి, నీకు ఫలానా పని చేసే అర్హత లేదు పో, ఫలానా మోక్షం వచ్చే దారి లేదు పో” అని అన్నారనుకోండి.

ప్రస్తుతసమాజంలో అలా అనిపించుకుంటే ఇతరులకు రోషం రావడం సహజమే - పసివాడైన ధ్రువుడికి సవతి తల్లి మాటలకు రోషం వచ్చినట్టు.

కాని, అలా అన్నంతమాత్రాన ధ్రువుడు రాజకుమారుడు కాకుండా పోలేదు. అలాగే, కూడా అటువంటి మాటను అనిపించుకున్నంత మాత్రాన ఇతరుల దివ్యత్వానికి వచ్చే లోటేమీ లేదు. అన్నవారు కూడా అలా అనేసి లేని గొప్పతనాన్ని తెచ్చుకున్నదీ లేదు.

నీకు అర్హత లేదు అని ధ్రువుడితో పలికిన సురుచిది ఎంతటి అజ్ఞానమో నీకు జ్ఞానార్హత లేదు, మోక్షార్హత లేదు అని బోధించేవారిది కూడా అంతే అజ్ఞానం.

“నీ పట్ల కఠినమైన మాటలు మాట్లాడిన ఆమె పట్ల ద్వేషం పెంచుకోకు” అన్న సునీతి ఉపదేశం ధ్రువునికి మాత్రమే కాదు, నేడు తిరస్కరణకు గురి అవుతున్నవారికి కూడా అంతే అవసరం.

పూర్వకాలంలో కూడా మాంసాన్ని అమ్మి జీవించే కులంలో కూడా ధర్మవ్యాధుడు అనే అసామాన్య జ్ఞాని ఉన్నాడని మహాభారతం చెప్పింది. బోయవాడై పుట్టిన కణ్ణప్ప కూడా భక్తావతంసుడయ్యాడని సాక్షాత్తు శంకరాచార్యులంతటి వారే శివానందలహరిలో సాక్ష్యం చెప్పారు.

కాబట్టి, “మనిషి పుట్టుక ఎక్కడ జరిగినా, అది అతడి జ్ఞానసాధనకు గాని, ఉన్నతస్థానసాధనకు గాని ఎటువంటి అడ్డంకి కాబోదు” అని ధ్రువుని కథ ద్వారా తెలిపి శ్రీమద్భాగవతపురాణం మనకు స్ఫూర్తిని ఇస్తుంది.

నేడు మన రాజ్యాంగం అందరూ సమానులే అంటుంది. ఉన్నతస్థానానికి చేరేందుకు అందరికీ అవకాశాలను ఇస్తోంది. ధ్రువునిలా పట్టుదల కలిగినవారు ఎవరైనా తమ అద్భుతకృషితో తాము కోరిన స్థానాన్ని పొందవచ్చు అనడంలో సందేహం లేదు.

జన్మ చేత గాని, బలం చేత గాని, ధనం చేత గాని, అహంకారాన్ని పొంది ఇతరులను తిరస్కరించేవారికి మన పురాణాలు ఇటువంటి గుణపాఠాలను చెబుతూ ఉంటాయి. ఇలా మనకు ఆత్మవిశ్వాసం కలిగించడం మన మతం గొప్పదనం!

Monday 23 July 2018

నక్క ఉపవాసము

అనగా అనగా ఒక నక్క.
రోంత వయసు ముదురు నక్క.

ఆ నక్క ఒగు దినుము దినాముకట్లే ఆకలి తీర్చుకొనేకి తొండేబిక్కిల్ని, ఉడతలని యెదుకులాడుకుంటా బయలుదేర. దానికంటె ముందరే చిన్న నక్కలు వుషారు వుషారుగా వేటాడేసి కడుపు నింపుకుంటా కానొచ్చె. దీనికిమాత్రం తొండేబిక్కలు, ఉడతలు దొరక్కుండా తప్పిసుకుంటుండాయి. తన కండ్లముందురే కళ్లిచెట్టు బుడుముతాన బొక్కలోకి దూరి దాపెట్టుకున్న తొండేబిక్కిని ఎట్లైనా బయటికి యెల్లబీకల్లని మొన్ను తోగి తోగి దానికి మిగిలిన గోళ్లు కూడా సమిసిపాయ. తన చాటుమాల్నుండి చటుక్కున చెట్టుమిందికెగిరిన ఉడతని పండ్ల మధ్యన యిరికించుకోవల్లని దుంకితే దాని కోరలన్నీ మానులోకి ఇరుక్కుని అర్ధము యిరిగిపాయ.

ఇంత గోరుము జరిగినంక దాని బలమేమో దానికే అర్థమైపాయ. ఇంగ నాకి వయసైపాయరా, అందరితానా యేట్లాడి యేట్లాడి సంపాదిచ్చేది ఇంగ నాకి శాతకాదు అని తెలిసిపాయ. అది యిచారంగా బోయి అడివిలోన గుడికాడ కూకొనిడిశ. ఆ గుడితాన మనుషులు అపుడపుడు కోళ్లూ మేకలూ బలిచ్చి కోసుకుతింటాంటారు. అపుడు ఆడాడ యేమన్నా నేలబడింటే యేరుకుతినొచ్చు అని దాని ఆశ. కానీ, ఆ ఆశ కూడా నిరాశ ఐపాయ.

దావన బొయ్యే ఇంకో నక్క “ఏమిరా అల్లుడూ ఈడ ఇట్ల్నే మొగుము యేలాడదీసుకుని కూకునుండావు? ఈ పొద్దు తొలి ఏకాదశి, అందుకే ఈ పొద్దు ఎవరూ బలిచ్చేది లేదు, నీకు కడుపు నిండేదీ లేదు” అని జెప్పి దాని దోవకి అది బాయ.

కడుపాకలి తట్టుకోలాపుక ఆ నక్క ఇంగ బాగ ఏడిశిడిశ. ఇట్లా టైములో ఏమి చేయాల్నో నేను చదివిన రెండులక్షల పుస్తుకాలలో ఏ వొక్క పుస్తుకంలోనైనా ఉండునా అని బాగ ఆలోచన చేశ. అప్పుడుసగం చిరిగిన యెర్రట్ట పుస్తకంలో తాను చదివిన ఒగు విషయం దానికి నెప్పికొచ్చ.

ఏకాదశీ ఉపవాసవ్రతమాహాత్మ్యము! ఆ పొద్దు పూర్తిగా ఉపాసముంటే దండిగా పున్నెము వస్తాదంట. పున్నెము అంటే ఏమిడిదో దానికి రోంత రోంత తెలుసు. పిట్ట మాంసము, పుంజు మాంసము, మేక మాంసము – ఇవన్నీ కలిపి తింటే - అదీ పున్నెము అంటే! అంతకంటే గొప్ప పున్నెము ప్రపంచంలో యాడ్యాడా ఉండుదని ఆ పుస్తుకములాన ఘోస ఘోస పెట్టి ఉన్న్యారు. దానికి అవకాసము వచ్చింది గదాని, నక్కకి ఆ పొద్దు ఉపాసము ఉండాల్నని బుద్ది పుట్టిడిశ. యెట్లోగట్ల నెలకు రెండు దినాలు ఇట్ల ఉపాసముంటే ఇంక మిగిలిన దినాలన్నీ పున్న్యాలంటే పున్న్యాలు!

ఉపాసమున్నపుడు నీళ్లు దాగినా యేమీ వ్రతభంగం కాదని దానికి తెలుసును. దానికే దగ్గర్లో వుండిన యేటితాకి యెట్లో కాళ్లీడ్సుకుంటాబాయ. యేటి వొడ్డున అనుకోకుండా ఒక దృశ్యం చూసేతలికే దాని కండ్లు మిల మిల మెరిసిపాయ.

సన్న మేకపిల్ల వొగిటి ఆడ మే మే అని అర్సుకుంటా తిరుగుతాండాది. ఎట్ల్నో తప్పిపయినట్లుండాది. రాజుగారి తోటలోన మేతకు బోయి, రాణిగారి పూలచెట్లు మేత మేస్తూ, తోటమాలి కొట్టవస్తే తుర్రుమని కానొచ్చిన దిక్కులో పారి పారి వచ్చిన బుజ్జి మేక అదే! అట్లా దూరుం దూరుం పారి పారొచ్చి వాళ్లమ్మను కానకపాయ. అబుడు శాన బయమేసి నోటిలో ఉన్నశక్తినంతా ఉపయోగిచ్చి గొంతు వూడొచ్చేలా పిలుస్తాంటే అయ్యో పాపుమని యెవురికన్నా కనికరము బుట్టాల్సిందే!

పాపం ఆ బుజ్జి మేకపిల్ల రొంత సేపు ఆ యాకునీ ఈ యాకునీ వాసన జూస్తాది, అర్సతాది. రొంత ముందరకి పొయ్యి జూస్తాది, మళ్లీ యెనిక్కొచ్చి అర్సతాది. పొడుగాటి చెవుల్ని అట్లా ఇట్లా అల్లాడిచ్చుకుంటా తలకాయ తిప్పుతాది, అర్సతాది. రోంత సేపు వంకర టింకరగా అడ్డడ్డుము ఎగర్లాడతాది, అర్సతాది. రెండు గడ్డిపరకలు నముల్తాది, తలెత్తి మళ్లీ అర్సతాది. ఆడ ఒగ యెత్తైన రాయుంటే దాని మింద ముందరికాళ్లు పెట్టి నిలబడి తలకాయ అట్లా ఇట్లా తిప్పుకుంటా అమ్మ కనిపిస్తాదేమో అని దిక్కులు చూస్తాది, అర్సతాది. కాళ్లు నొచ్చుతాయేమో, రోంతసేపు నేలమీద పండుకుని ముకుము డొక్కలా పెట్టుకుంటాది. అంతలోనే, మళ్లీ పండుకుంటే పనులు జరగవని అంతరాత్మ ప్రబోధం జరిగినట్టు లేచి మళ్లీ అర్సతాది. పాపుము అది అట్లా అరిసేతప్పుడు సూడల్ల, నోట్లోంచి నాలుక రొవంత బయటకివచ్చి కానొస్తాది. మెడ ఎంత దూరుము సాచి అరిస్తే అంత దూరుము యినిపిస్తాది, అబుడుమా అమ్మ యాడున్నా పారి పారి నాతాకి వస్తాది అన్నట్ల ఆ సన్న మెడని ఇంత పొడుగు నీలిగిచ్చి నీలిగిచ్చి అర్సతాది. కండ్ల నిండా బయం బయం నింపుకుని అర్సతాది.

నక్క ఆ మేకపిల్లని చాటునుంచి దూరం నుంచి శానా సేపు సూసుకుంటా అట్ల్నే నిలబడినాది. వాళ్లమ్మ ఆడ్నే యాడ్నో వుంటాది, నేను తొందరపడి దాన్ని పట్టుకునేకి పోతే వాళ్లమ్మ వచ్చి నన్ను డొక్కలో కుమ్మి పారేస్తాది అని నక్క భయం నక్కది.
కాని, ఆ మేకపిల్ల యెంతసేపు అర్సినా వాళ్లమ్మ రాకపాయ. ఆర్సీ ఆర్సీ ఆ మేకపిల్ల అలిసిపాయ. నేలమింద పండుకుని ముకుము కడుపులాకి దూర్సుకునిడిశ.

శానాసేపైనా అది మళ్లీ లెయ్యకోకుండేది సూసి నక్క ఇదే మంచి అవకాశమురా దీన్ని పట్టుకునేకి అనుకునింది. మెల్లగా సప్పుడు కాకుండా దానిపక్క పొదల పక్కనే నక్కుకుంటా పాయ. వచ్చ, వచ్చ, దగ్గరకు వచ్చిడిశ! ఇంకా ఆడ్నే వుంది మేకపిల్ల. అమ్మే యెట్లోగట్ల నన్ని యెతుక్కుంటా వస్తాదిలే అనుకునిందో యేమో! అడివిలో గండాలు ఇట్లిట్లా వుంటాయని దానికి యేమి తెలుసు పాపుము?

నక్క ఊపిరి బిగబట్టుకున్య. రెండడుగులు ముందుకేసి ఒక్క దూకు దూకితే, ఇంగ ఆమేకపిల్ల తనదే! విందు భోజనమే! దేముడుండే స్వర్గానికి పోయినా కూడా అంత మంచి భోజనం యెవురూ పెట్టలాపురు అనిపించింది. ఒకటో అడుగు వేసింది. ఇంతలో గాలి వీచి, ఆకులు గలగలలాడినాయి. మేకపిల్ల తల యెత్తింది. నక్క చప్పున వంగి తలను భూమికి ఆనిచ్చిడిశ. పొద యెనుకనున్న ఆ నక్కను మేకపిల్ల కానక పాయ. కాని, యేమో అనుమానమొచ్చి అది అట్ల్నే లేసి నిలబడ. కాని, యాటికీ కదలకపాయ. అది తన దిక్కు చూడలేదని నక్క గమనిచ్చుకుని రెండో అడుగు ముందుకేశ. దాని దురదృష్టము, ఆడ గాలికి కొట్టుకొచ్చిన రెండు ఎండుటాకులు ఉండ్య. నక్క అడుగు పడగానే అవి కరకరమని శబ్దం చేసుకుంట యిరిగిపాయ. మేకపిల్ల చప్పున తలదిప్పి చూసిందీ, నక్కయెగిరి దానిమిందికి దుంకిందీ ఒకేసారి జరిగిపాయ.

కానీ, నక్క మేకపిల్ల మీద పడల్యా. నేలమీదనే పడింది. యేమిటికంటే, మేకపిల్ల దానికంటె ముందరే యెగిరి బండమీదకి దుంకింది. నక్కకి ఆశాభంగమైపాయ. మేకపిల్ల గూడా నక్కను కండ్లారా చూసిడిశ. అంతే! ఒక్కు క్షణుము గూడా ఆడ నిల్సుకోకుండా అట్ల్నే దుంకుకుంటా దుంకుకుంటా యేటిపక్కకి పార్య. నక్క ఆశ యిడిసిపెట్టలాపుక దాన్ని యెంటదరుముకుంట పాయ. యెదురుగ్గా పెద్ద సప్పుడు సేసుకుంటా జోరు జోరున పారుతున్న యేరుని చూసి మేకపిల్లకి బయమేసి పాయ. యెనిక్కి తిరిగేతలికే తనని పట్టుకునేకి పారి పారి వస్తుండిన నక్క కనబడ్య. అంతే! మేకపిల్ల ఇంకేమీ ఆలోచన చేయకుండా యెగిరి యేట్లోకి దుంకిడిశ.

అంతదంకన్నా పారి పారొచ్చిన నక్కకి దానెనికినే యేట్లోకి దుంకేకి దమ్ము లేకపాయ. అట్ల్నే దాన్ని తేరిపారజూసుకుంటా నిలబడుకొనిడిశ. బుజ్జి మేక యేట్లో బడి కొట్టుకుపోతా, అట్లా ఇట్లా కాళ్ళు అల్లాడిచ్చుకుంటా యెట్ల్నో మొత్తానికి అవతలి గడ్డకి పడ్య.

గడ్డకి పడినంక కడుపును అట్లా ఇట్లా అల్లాడిస్తే దాని బొచ్చునుండి నీళ్లన్నీ వానచినుకులా కట్ల టప టప రాలి పడ్య. అప్పుడది యెనిక్కి తిరిగి అవతలి గట్టున నిలబడిన నక్కను చూశ. నక్క గూడా దాన్ని సూసుకుంటానే ఉణ్ణింది. అప్పుడు బుజ్జిమేక ఒకసారి మెడ ముందుకు చాచి నాలుక కొంచెం బయటకు కనబడేలా మే మే అంటూ అరిచింది. ఆనెంక నక్క దిక్క తిరిగి చూడకుండా అరుసుకుంటా అట్ల్నే నడుసుకుంటా ఆదిక్క అట్లే పాయ.

నక్కకి మళ్లీ యేడుపొచ్చ. ఆ వొక్క క్షణం గాలి వీచకుండా ఉండివుంటే – ఆ వొక్క అడుగు తాను యెండిపోయిన ఆకుల మీద వేయకపోయి వుండివుంటే - ఈ పాటికి ఆ బుజ్జిమేక తన కడుపులో చేరి ఆకలి తీర్చి వుండేది! దేవుడు తనకు ఆ అవకాశం ఇవ్వలేదు!

దేవుడు అనుకునేతాలికే నక్కకు బిరీన నెప్పికొచ్చ... – తను సంకల్పించిన ఏకాదశీ ఉపవాసం గురించి. అరెరే! అనుకొన్య.

అవును సుమా! నేను దాని గూర్చి నేను మరిచే పోయినాను! ఈ పొద్దు నేను ఉపాసం ఉండాల్నని అనుకుంటి గదా! మరి ఈ మేక నాకు చిక్కింటే నాకు వ్రతభంగం అయితాండ కదా? అనుకుంది. పశ్చాత్తాపపడింది. నేను చేసింది తప్పే! అనుకునింది. లెంపలేసుకుంది. దేవుడికి క్షమాపణ చెప్పుకుంది. నువ్వే నాకు మేకను చిక్కకుండా చేసి నన్ను మహాపాపం నుండి కాపాడావని మెచ్చుకుంది. గుంజీలు తీసింది. నా బుద్ధిని యెప్పుడూ ఇట్లే సక్రమమార్గంలో నడిపిచ్చు తండ్రీ అనుకుంది. దాని మనసు తేలికపడింది. యెట్లో యేట్లో కాసిని నీళ్ళు గతికి, నెమ్మదిగా గుడి దగ్గరకు బయలుదేరింది.

ఇంతలో మళ్ళీ మే మే అని అరుపులు వినిపించాయి. వెంటనే గబా గబా పక్కనున్న గుట్టెక్కి చూసింది. మేకలమంద! అందులో ఒక మేక కంగారు కంగారుగా అటూ ఇటూ వెదుకుతోంది. బుజ్జిమేకవాళ్ల అమ్మ కాబోలు! నక్కకి నోట్లో నీళ్లు ఊరాయి. ఎన్ని మేకలు! ఎన్నెని మేకలురా దేవుడా! ఇన్ని మేకల్లో ఒక్కటైనా నాకు దొరక్కపోతుందా అనుకుంది. ఉపాసముంటానని దేముడికిచ్చిన మాట దానికి మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది, పక్కనుండే పొదలో ముండ్లు మళ్లీ మళ్లీ గుచ్చుకుంటున్నాయి. హే, అంటూ ఆ ముండ్లను విదిలిచ్చుకుంటూ ఒక్కమేకనైనా ఎట్లా పట్టేది అని ఆలోచనలో పడింది.

దేవుడా, ఏకాదశి ఉపవాసం వదిలి రేపు ద్వాదశినాడు ఉపాసముంటాలే – ఎప్పుడు చేస్తే ఏముంది, ఉపాసం ఉపాసమే కదా! అని దేముడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది.

ఇంతలో హే హే అంటూ మనిషి గొంతు వినిపించింది. మెడ నిక్కించి చూసింది. మంద వెనుక చాలమంది కాపర్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఇంతింతలేసి దుడ్డుకఱ్ఱలు ఉన్నాయి. ఇంక నక్క అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేదు. దేముడా! ఇంక పోస్టుపోనుమెంట్లు లేవు. ఈపొద్దే నా ఏకాదశి ఉపవాసం కన్ఫాం చేసుకో అంటూ గుడిదిక్క పరుగులు తీశ.
***

((DISCLAIMER – ఈ కథ చదువుతున్నపుడు గాని, చదివిన తరువాత గాని, బుజ్జి మేకపిల్ల అంటే “రాజ్యసభ సీటు” అని ఎవరికైనా అనిపిస్తే నా బాధ్యత లేదు. ఏకాదశీ ఉపవాసం చేయడం అంటే “పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడం” అనిపించినా సరే, నా తప్పు లేదు. నక్క ఎవరు అంటూ ఎవరూ నన్ను ప్రశ్నలు వేయవద్దు, మీ ఊహలకు నేను బాధ్యుడిని కాజాలను.))

తిల్లై కూతన్, తిరునీలకంఠర్

అది నటరాజస్వామి కొలువైన చిదంబరపుణ్యక్షేత్రంలో పవిత్రమైన శివగంగ కోనేరు.
స్థానికులు తమభాషలో స్వామిని తిల్లై కూతన్ అని పిలుచుకుంటారు. తిల్లై అనేది అక్కడి సముద్రతీరప్రాంతాలలో విరివిగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి. (తిల్లై నటరాజు అని అర్థం అన్నమాట)
ఆయన కొలువైన స్థానాన్ని వారు చిత్రాంబళం అంటారు. అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం. చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. అద్భుతమైనది, దివ్యమైనది, వర్ణమయమైనది, శోభస్కరమైనది, శుభంకరమైనది... ఇలా.
చిదంబళం అనేవారు కూడా ఉన్నారు. చిత్ + అంబళం అన్నమాట. చిత్ అంటే చైతన్యం అని అర్థం. సత్ + చిత్ + ఆనందం = సచ్చిదానందం అనే పదాల కలయికలో చిత్ ఇదే. చిదంబళం అంటే చైతన్యదేవాలయం అని అర్థం
స్వామివారి సహధర్మచారిణి పేరు శివగామి సుందరి. ఆమె ఆలయానికి ఎదురుగా ఉన్నదే ఈ శివగంగ కోనేరు.
***
పూర్వం చిదంబరంలో తిరునీలకంఠర్ అని ఒకాయన ఉండేవారు. ఆయన గొప్ప శివభక్తుడు. అంతటి ఆయన కూడా జితేంద్రియుడు కానందువల్ల, ఒకసారి ఒకానొక తప్పు చేశాడు. ఆ తప్పును అతని భార్య సహించలేకపోయింది. అతడు తన భార్యను అనునయించే ప్రయత్నం చేశాడు.
ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతే ఆమె "మీరు మమ్మల్ని అంటరాదు, తిల్లై కూతన్ స్వామి పేరిట ప్రమాణం" అనేసింది.
ఆమె నన్ను అంటరాదు అని ఏకవచనప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి, అతడు స్త్రీలెవరినీ తాకరాదు అని నిశ్చయించుకున్నాడు. నిండు యౌవనంలో ఉన్నపుడే అతడు బ్రహ్మచర్యదీక్షను స్వీకరించాడు. తన వృత్తిని తన శివుని తప్ప వేరెవరినీ మనసులో ఉంచుకోకుండా జీవితం గడిపాడు. అలాగని, భార్యను పోషించే తన ధర్మాన్ని మాత్రం అతడు విడిచిపెట్టలేదు. ఆమె కూడా శివభక్తితన్మయురాలైంది. క్రమంగా వారు ఇరువురూ వృద్ధులయ్యారు. శరీరంలో శక్తి క్షీణించింది.
శివగామీనటరాజులకు వారిపట్ల కరుణ కలిగింది. వారికి ఇహపరసౌఖ్యాలు కలుగజేయవలసిందిగా శివగామి నటరాజును కోరింది. సరేనన్నాడు ఆయన. 
ఒక శివయోగి వేషం ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. అతని ఆతిథ్యం స్వీకరించిన తరువాత ఒక బంగారు భిక్షాపాత్రను అతని చేతికి ఇచ్చి, ఓయి నీలకంఠా, ఈ తీర్థయాత్రలకు పోతున్నాను, తిరిగి వచ్చిన తరువాత ఈ పాత్రను నీ దగ్గరనుండి తీసుకుంటాను, అంతవరకు నీవద్ద భద్రంగా దాచిపెట్టవలసింది" అని కోరాడు. సరేనన్నాడు నీలకంఠర్.
కొంతకాలం గడిచాక ఆ మాయాశివయోగి తిరిగివచ్చి, "ఏదీ, నీకిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇచ్చేసెయ్" అన్నాడు. నీలకంఠర్ తన ఇల్లంతా వెతికినా ఆ పాత్ర దొరకలేదు. అతడు శివయోగి కాళ్లమీద పడి, క్షమాపణ కోరాడు. ఆ పాత్రకు బదులుగా మరొక బంగారు పాత్రను ఇస్తానన్నాడు. కానీ, మాయాశివయోగి శాంతించాడు కాడు. నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు అంటూ నిందించాడు.
నిజమైన శివభక్తుడు ఎన్నడూ దొంగ కాజాలడు అన్నాడు నీలకంఠర్. నీవు నిర్దోషివి అయితే శివుని సాక్షిగా ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు మాయాశివయోగి. అలాగే, ఏమని ప్రమాణం చేయమంటారు అని నీలకంఠర్ అడిగాడు.
"నీవు నీ భార్య చేతిని పట్టుకుని తిల్లై కూతన్ శివగామి సుందరిల సమక్షంలో, శివగంగ కోనేరులో మునిగి బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పండి చూదాం" అన్నాడు మాయాశివయోగి.
ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది నీలకంఠర్ కు. పూర్వం తిల్లై కూతన్ పేరిట తన భార్య చేసిన శపథం వల్ల తాను ఆమెను తాకరాదు. తాకితే స్వామివారిపట్ల ఘోరమైన అపరాధం చేసినట్లవుతుంది. కానీ, ఇపుడు ఆమె చేతిని పట్టుకుని తాను బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పి కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే శివభక్తుడు దొంగ అనే అపవాదం వచ్చి పడుతుంది. ఏమి చేయాలో తెలియని విషాదంలో మునిగి కన్నీరు కార్చాడు నీలకంఠర్.
మాయాశివయోగి చిదంబరంలో పెద్దలందరినీ పిలిచి పెద్ద రచ్చ చేశాడు. వారందరూ వచ్చి, ఆ శివయోగి చెప్పినట్లే నీలకంఠర్ తన భార్య చేతిని పట్టుకుని ప్రమాణం చేయవలసిందేనని తీర్పు చెప్పారు. లేదంటే గ్రామబహిష్కరణ శిక్ష తప్పదని హెచ్చరించారు.
అపుడు ఇక మరణమే శరణం అని భావించిన అతనితో ఆయన భార్య ఒక ఉపాయం తెలిపింది. ఆ ఉపాయం ప్రకారం భార్యాభర్తలు ఇరువురు ఒక కఱ్ఱను ఇరువైపులా పట్టుకుని, మాయాశివయోగి చెప్పిన ప్రకారమే ప్రమాణం చేసి కోనేటిలో మునిగారు. వారు లేచి చూసేసరికి...
***
***
ఆశ్చర్యం!
దంపతులు ఇరువురూ నవయౌవనవంతులు అయ్యారు.
వారి వృద్ధత్వం ఎటుపోయిందో ఎవరూ ఎరుగరు. అక్కడ ఉన్న చిదంబరక్షేత్రప్రజలందరూ అది తమ తిల్లై కూతన్ చేసిన మాయ అని తెలుసుకున్నారు. హర హర మహాదేవ శంభో అనే వారి భక్తితన్మయధ్వనులతో క్షేత్రమంతా ప్రతిధ్వనించిపోయింది.
***
కాలక్రమేణా ఆ నీలకంఠర్ అరవై ముగ్గురు నాయన్మారులలో ప్రథముడిగా ఘనత వహించాడు. నాయన్మారులంటే ద్రవిడదేశానికి చెందిన పరమశివభక్తులు. ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియవిజయం ప్రసాదించి అనుగ్రహించిన కూతన్ కథ ఇది.
***
ఇదిగో మిస్టర్ I Lie Yeah,
ఈ తిరునీలకంఠ నాయనారు బ్రాహ్మడు కాదు, కోమటోడు అంతకంటే కాదు, అచ్చమైన శూద్రుడు. అతడు కుంభకారుడు అంటే మొదట అర్థం కాక ఏడుస్తావు. అర్థమైతే అది సంస్కృతం అని ఏడుస్తావు. అందుకే అతడు కుమ్మరి కులంలో పుట్టినవాడు అని స్పష్టంగా చెబుతున్నాను.
ఈ కథ తెలుసుకున్న తరువాతనైనా,
"హిందూ దేవుళ్ళు తక్కువజాతి భక్తులను దూరంగా పెడతారు, యేసుక్రీస్తు, బుద్ధుడు మాత్రమే శూద్రులను చేరదీస్తారు" - అనే నీ వెధవ వాగుడు ఇక ఆపు.
హిందూ దేవుళ్ళు పరమ సెక్యులర్ దేవుళ్ళు. తమను తిట్టినవారికి కూడా మోక్షం ప్రసాదిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, శిశుపాలుడు వంటివారిని ఎరుగుదువా? వాళ్ళు ఎన్ని తిట్టినా సహించి తన చెంతకు చేర్చుకున్నవారు. వారిది కూడా భక్తేనని హిందూ దేవుళ్ళు భావిస్తారు. వాళ్ళది వైరభక్తి అట.
అలాగే, నీవు ద్వేషంతో వాగుతున్నా, అజ్ఞానంతో వాగుతున్నా, మొత్తానికి హిందూ దేవుళ్లను స్మరిస్తున్నావు. నీకు కూడా పుణ్యం వస్తుంది పో. అదీ మా మతపు గొప్పదనం.

సర్వః సగంధేషు విశ్వసితి

ఫలకాలు చెప్పే పాఠాలు – 4
కాళిదాసమహాకవి శకుంతల నోట పలికించిన మాట...
“సగంధ” అనే పదానికి జ్ఞాతి అనే అర్థం చెబుతుంది వాచస్పత్యం.
“ప్రతి ఒక్కరూ తమవారినే విశ్వసిస్తారు.”
నిజమే కదా, అది సహజం.

It is an animal’s instinct.
Birds of the same feather flock together.
Like likes Like.

అది సరే, “తమవారు” అని ఎవరైనా సరే, కొందరిని ఎలా గుర్తుపడతారు?

ప్రాథమికంగా - తాము తినేటటువంటి తిండినే తినే వారిని తమవారని గుర్తుపడతారు...

అర్థం చేసుకొనేందుకు ఆధునికశిక్షణ పొందిన మన మనసు నిరాకరించినా అది చాలవరకు నిజం. 

విస్తారమైన ఆఫ్రికా అడవుల్లో నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ వాళ్ళు జంతువుల మీద తీసిన డాక్యుమెంటరీలు చూడండి...

చిన్నపాటి జింకలు ఒక చోట గడ్డిమేస్తూ ఉంటాయి. వాటికి పక్కనే మరింత పెద్ద కొమ్ముల జింకలు కూడా గడ్డిమేస్తూ ఉంటాయి. ఈ పక్క జీబ్రాలు మేస్తుంటాయి. ఆపక్క అడవి బర్రెలు, దున్నలు మేస్తుంటాయి. ఇవన్నీ వేరు వేరు జాతుల జంతువులు. అయినా ఒకదానిని చూసి మరొకటి భయపడవు. ఇంతలో అక్కడికి వీటన్నింటికన్నా బలమైన ఏనుగుల మంద వస్తుంది. వాటిని చూసి కూడా ఇవేవీ భయపడవు. మరికాసేపట్లో వీటన్నింటికన్నా పొడవైన జిరాఫీలు వస్తాయి. అప్పుడు కూడా ఇవేవీ భయపడవు. ఎందుకంటే, వీటన్నిటికీ ఆహారం సమానమైనదే. గడ్డి, ఆకులు, కొమ్మలు. 

ఇంతలో అక్కడికి ఒక చిన్న నక్క వచ్చిందనుకోండి...
అది కనబడకున్నా పొదలమాటున దాక్కున్నప్పటికీ దాని వాసన తగిలిన వెంటనే జింకలలో అలజడి ప్రారంభమౌతుంది. అవి ప్రశాంతంగా తినలేవు. కంగారుగా దిక్కులు చూస్తాయి. అటూ ఇటూ పరుగెడతాయి. అది సగంధమైనది (సమానమైన వాసన కలిగినది) కాదన్న మాట. సగంధ అనే పదాన్ని మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు.

సరే, ఎందుకు వాటికా భయం అంటే, ఆ నక్క ఆహారం గడ్డి కాదు, వాటికి ఉడతలు తొండేబిక్కలు దొరికితే సరే సరి, లేకుంటే తమలో ఒకదాన్ని ఆ నక్క లాక్కుపోయి పీక్కు తింటుందని ఆ జింకల భయం. ఏ చిరుతపులో వచ్చిందంటే ఇక జీబ్రాలకు బర్రెలకు కూడా భయమే. ఇక సింహాలమంద వచ్చిందంటే ఏకంగా జిరాఫీలు అడవిదున్నలు ఏనుగులలో కూడా భయం కలుగుతుంది. అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తూ మొదట తమ చిన్నారులను, తమలోని బలహీనులను ఎత్తుకుపోతాయని వాటికి తెలుసు. సాధ్యమైనంతవరకు పారిపోయి తప్పుకునేందుకే అవి ప్రయత్నిస్తాయి. కొన్ని నిస్సహాయంగా వాటికి దొరికిపోతాయి. కొన్ని రోషంతో ఎదురు తిరిగి, వాటినే చంపేసిన సంఘటనలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 

సరే – ఈవిధంగా - ప్రాథమికంగా - తమకంటే భిన్నమైన ఆహారం కలిగినవాటిపై నమ్మకం కలిగి ఉండడం జంతువులలో కుదరదు. మనుషులలో కూడా పూర్వం ఇటువంటి మనస్తత్వం ఉండేదేమో. కాని, రాన్రాను అటువంటి జంతులక్షణాలు తగ్గి ఉంటాయి. 

కాని, ఇప్పటికి కూడా - తాము చేసేటటువంటి పనినే చేసేవారిని, తాము ధరించే దుస్తులవంటి దుస్తులనే ధరించేటటువంటివారిని, తమవంటి అలవాట్లే కలిగినవారిని, తాము పాటించేటటువంటి ఆచారాలనే పాటించేవారిని తమవారిగా మనుషులు సులువుగా నమ్మేస్తారు. వారిని తమ కులస్థులుగా, తమ మతస్థులుగా పరిగణించి వారితో సన్నిహితంగా మెలగడం చూస్తూనే ఉన్నాం. విద్య సార్వజనీనమై ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకొనగలిగే స్థాయికి వచ్చాక మానవులందరూ సమానులేనన్న భావన బలపడింది. 

అయినప్పటికీ సమానమైన ఆలోచనలు కలిగినవారు, సమానమైన వ్యవహారాలు నడిపేవారు, సమానమైన కష్టనష్టాలు కలిగినవారు కులమతాల తేడా లేకుండా కలిసి ఒక సమూహంగా ఉండటం ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక్కడ కూడా మరొక అర్థంలో సగంధత కనిపిస్తోంది. ఇక్కడ గంధము అంటే – వాసన – అంటే - ఈ జన్మలోనో పూర్వజన్మలోనో అబ్బిన సంస్కారాలు కొందరిని పరస్పరం మిత్రులను చేస్తాయి అన్నమాట. 

మృగా మృగైః సంగమనువ్రజంతి.
గావశ్చ గోభిః తురగాస్తురంగైః।
మూర్ఖాశ్చ మూర్ఖైః సుధియః సుధీభిః
సమానశీలవ్యసనేన సఖ్యమ్।। 

జింకలు జింకల తోనే కలిసి తిరుగుతాయి. గోవులు గోవులతోనే కలిసి తిరుగుతాయి, గుఱ్ఱాలు గుఱ్ఱాలతోనే కలిసి తిరుగుతాయి. మూర్ఖులు మూర్ఖులతోనే కలిసి తిరుగుతారు. పండితులు పండితులతోనే కలిసి తిరుగుతారు. సమానశీలము, సమానమైన వ్యసనాలు (అంటే కష్టాలు, బాధలు కూడా) కలిగినవారి నడుమ స్నేహం ఏర్పడుతుంది అని పెద్దల మాట. 

“స వానరేంద్రో హృతరాజ్యదారః స రాఘవేంద్రో హృతరాజ్యదారః।
ఏవం తయోరధ్వని దైవయోగాత్ సమానశీలవ్యసనేషు సఖ్యమ్।।“


“ఆ వానరేంద్రుడికి ఆ రాఘవేంద్రుడికి నడుమ స్నేహం కలిసిందన్నా కారణం ఒకటే – వారిరువురి కష్టాలు సమానమైనవి కాబట్టే!” - అని ఒక కవి చమత్కరించాడు. ఇరువురూ రాజ్యం కోల్పోయారు, ఇరువురి భార్యలూ అపహరింపబడ్డారు కదా అంటాడాయన.

ఏదేమైనా, అప్పటికీ, ఇప్పటికీ మనవారు అనేవారిని మనం విశ్వసిస్తాం. 

భారతదేశంలో ఉంటున్నాడనే ఒకే ఒక్క కారణంగా పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ ను సవాలు చేస్తున్నా ఓ ఫరూక్ అబ్దుల్లా గాడిని చూసీ చూడనట్టు వాడి మాటలు వినీ విన్నట్టు ఉంటున్నాం కదా. 

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...