Saturday 28 July 2018

శ్రీకృష్ణునితో ఇంటర్వ్యూ 1

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((మొదటి భాగం)) 

ప్రస్తావన:
అరిందమనుడి బుఱ్ఱ నిండా ప్రశ్నలే ప్రశ్నలు. 
ఒకోసారి అర్ధరాత్రి పూట కూడా నిద్రనుండి లేపి మరీ ప్రశ్నలు వేస్తుంటాడు. వాడికి అందరు దేవుళ్లకంటే కృష్ణుడంటేనే ఎక్కువ ఇష్టం. రేపటి దినాన కృష్ణాష్టమికి హరే రామ హరే కృష్ణ గుడికి పోదాం అని చెబుతూ చెబుతూ వాడు నన్ను నిన్న సాయంత్రం అడిగిన ప్రశ్న ఇదీ -

"అప్పన్నా, కృష్ణుడికి ఎవరంటే అందరికంటే ఇష్టం?"

వెంటనే సమాధానం చెప్పాను: "అర్జునుడంటే ఇష్టం."

"మరి".. అని మొదలుపెట్టాడు వాడు. (పాచికలు జూదం అనే పదాలు వాడికి ఇంకా అలవాటు పడలేదు. చేతితో వాటిని వేస్తున్నట్టు అభినయిస్తూ) "ఇలా ఇలా వేసి ఆడుతాడే... వాడు ఇష్టమని ఆ సినిమాలో చెప్పాడు కదా?" అని అడిగాడు.

మాయాబజార్ సినిమాలో శకుని ఇష్టమని చెప్పించిన విషయం గూర్చి అడుగుతున్నాడని కాసేపటికి అర్థమైంది.

"సినిమాలో తీసి చూపించేవన్నీ నిజం కావు" అని చెప్పాను. ఈలోగా వాడి నేస్తం ఎవడో పిలిచేసరికి ఆడుకోవాలంటూ పారిపోయాడు.

లాభం లేదు,
కొన్ని కొన్ని విషయాలు నేరుగా కృష్ణుడినే అడిగి కన్ ఫామ్ చేసుకోవాలని నిశ్చయించుకుని

"కృష్ణా ఇంటర్వ్యూ ఇస్తావా" అని అడిగాను.

ఓ వైపు ప్రపంచమంతా ఈరోజు ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నా, నా కోరికను మన్నించి ఆయన "సరే" అని అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూ ను ఈ రోజు మీముందుకు తేగలిగాను.

***
ఇంటర్వ్యూ మొదలు:
***

ప్రశ్న 1
స్వామీ, కృష్ణా, మీకు సూటిగా ఒక ప్రశ్న. మీకు అందరికంటే ఎవరు ఇష్టం?

కృష్ణుడు:
నువ్వే చెప్పావు గదయ్యా అరిందమనుడికి. మళ్ళీ సందేహం ఎందుకు? నాకు అర్జునుడంటేనే అందరికంటే ఇష్టం.

ప్రశ్న 2
అర్జునుడిలో ఏమి చూసి అంతగా ఇష్టపడ్డారు?

కృష్ణుడు:
అర్జునుడిలో ఉండే సుగుణాలు ఒకటా రెండా?

అర్జునుడి ఆత్మవిశ్వాసం మొదటి కారణం. "నేను కోరిన గురుదక్షిణ ఎవరు ఇస్తారు?" అని గురువు అడిగితే చిన్నతనంకొద్దీ మిగిలిన రాజకుమారులు అందరూ అదేమిటో అని భయపడిన క్షణాన అర్జునుడు ఒక్కడే "నేనిస్తాను" అని ధైర్యంగా చేయి ఎత్తాడు.

క్షత్రియుడిగా పరాక్రమవంతుడు కావడం తన లక్ష్యంగా భావించి అందుకు అహర్నిశలు శ్రమించే అతడి దీక్ష అనితరసాధ్యం. చిన్నతనంలో రాత్రులు చీకట్లో కూడా బాణాలు వేస్తూ అభ్యాసం చేసినా, గొప్ప తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించినా అతడికతడే సాటి.

మహా ప్రతాపవంతుడిని అనే గర్వం మనసులో లేకుండా తన చేత ఓడిన వారి పట్ల కూడా అతడు ప్రదర్శించే సౌమ్యత చాలదూ అతడిని మహానుభావుడు అనడానికి? ఆ మాటలకు ముగ్ధుడైపోయి కాదూ, ద్రుపదుడు అర్జునుడికి ఇవ్వడానికి తనకో కూతురు ఉంటే బాగుండుననుకున్నది?

విజయం సాధించాక ఒళ్ళు మరచి విశృంఖలంగా ప్రవర్తించేవారిని చూస్తాం కానీ, అటువంటి ఆనందంలో కూడా సదాచారాన్ని మరువని అతడి నడవడికను పొగడకుండా ఎలా ఉండగలం? "అర్జునా! ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నావు కాబట్టి, ఆమెను నువ్వు పెళ్లాడు” అని ధర్మరాజు అంటే, ఎగిరి గంతేసి పెళ్లి చేసుకోకుండా, "అన్నా, నాకంటే పెద్దవారు మీరు భీమన్న ఉన్నారు కదా, మీ ఇద్దరికీ అయిన తరువాతే నా పెళ్లి" అని చెప్పడం అందరికీ సాధ్యమా? చివరకు తల్లి అయిన కుంతి మాటపై ద్రౌపదిని అన్నదమ్ములందరూ పెళ్ళాడడం వేరే విషయం.

ప్రపంచం తల్లక్రిందులైనా ఒక నియమానికి కట్టుబడి ఉండటం అతనిలో తప్ప వేరెవరిలో చూడగలం? మిగిలిన పాండవులందరూ ఇంద్రప్రస్థంలో హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ ఉండగా నియమానికి స్వచ్ఛందంగా కట్టుబడి అతడు పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేయడం సామాన్యమైన విషయమా?

అర్జునుడికి ఉన్నంతటి ఆత్మనిగ్రహశక్తి వేరెవరికీ లేదు. అంతటి అప్సరస, సాక్షాత్తు ఊర్వశి అతడిపై మరులుగొని వస్తే, "అమ్మా నీవు నాకు తల్లివంటి దానివి" అని పాదాభివందనం చేశాడు కదా?

ఇలా ఇంకా ఇంకా చాలా చెప్పగలను. కానీ ప్రస్తుతానికి ఇవి చాలు.

ప్రశ్న 3
మరి అర్జునుడు అంతటి గుణవంతుడే అయితే - తన గురువు గారైన ద్రోణుడికి ద్రుపదుడు శత్రువు కదా? అటువంటి ఆయన కూతురును పెళ్ళాడి ఎందుకు అతనికి ఎందుకు బంధువు అయ్యాడు?

కృష్ణుడు:
ద్రోణుడు ద్రుపదునితో సంధి కుదుర్చుకున్నాడు కదా. ద్రుపదుడికి దక్షిణపాంచాలరాజ్యం ఇచ్చి, ఉత్తరాన ఉన్న అహిచ్ఛత్రనగరం తన స్వాధీనంలో ఉండేట్టు ఒప్పందం చేసుకున్నారు కదా? ఇక శత్రుత్వం లేదని ద్రోణుడే స్వయంగా ద్రుపదుడితో అన్నాడు కదా? ద్రుపదుడితో బంధుత్వం పెట్టుకుంటే అతడి మనసులో తన గురువుపై ఉన్న ఏ కొద్ది ద్వేషమైనా సమసిపోతుందని భావించాడు. తప్పేముంది?

ప్రశ్న 4
మరి అర్జునుడు గురువుగారి మీదనే బాణాలు వేసిన మాట అబద్ధమా?

కృష్ణుడు:
మీలాంటి వారు భవిష్యత్తులో ఇలా ఆక్షేపిస్తారనే కాబోలు, సభలో పెద్దలందరి ఎదుటా ద్రోణుడు అర్జునుడిని ఒక ప్రత్యేకమైన గురుదక్షిణ కోరాడు. యుద్ధరంగంలో స్వయంగా గురువైన తానే ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా యుద్ధం చేయమని అడిగాడు.

आचार्यदक्षिणां देहि ज्ञातिग्रामस्य पश्यतः।
युद्धे2हं प्रतियोद्धव्यो युध्यमानस्त्वयानघ।।
(మహాభారతం.1.138.13&14)

అందుకని అర్జునుడు గురువుగారిమీద బాణాలు వేసి గురుదక్షిణ చెల్లించవలసి వచ్చింది. సరేనా?

ప్రశ్న 5
మరి తాతగారైన భీష్ముడిమీద బాణాలు వేయడం తప్పు కాదా?

కృష్ణుడు:
అయ్యా, మీరు మామూలు మనుషులు. అందువల్ల మామూలుగానే ఆలోచిస్తున్నారు. కాని, భీష్ముడు అర్జునుడు క్షత్రియులు. వారికి సంబంధించి యుద్ధం అనేది పెళ్ళివంటి శుభకార్యం. బాణాలు తగిలి పడిపోయిన భీష్ముడు తన వద్దకు దుర్యోధనుడు పంపగా వచ్చిన శస్త్రవైద్యులను వద్దని రాజులందరితోనూ ఏమన్నాడో తెలుసునా?

"క్షత్రియుడు మంచాన పడి రోగాలతో చనిపోవడం అనుచితం. యుద్ధరంగాన అస్త్రవిద్ధుడై చనిపోవడమే క్షత్రియునికి అత్యుత్తమమరణం".

అలా అర్జునుడు తన తాతగారి కోరికను నెరవేర్చినవాడయ్యాడు సుమా.

ప్రశ్న 6
పక్షపాతం లేకుండా చెప్పండి - కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా?

కృష్ణుడు:
వారిద్దరినీ పోల్చి చూడాలనే బుద్ధి జనాలకు ఎందుకు పుట్టింది? వారిద్దరూ యుద్ధంలో పరస్పర ప్రత్యర్థులు కాబట్టి. కాబట్టి, గెలిచినవాడే గొప్ప. అర్జునుడు కర్ణుడిని ఉత్తరగోగ్రహణసమయంలో ఓడించాడు. రెండోసారి నేరుగా కురుక్షేత్రంలో ఓడించాడు.

అసలు అర్జునుడిదాకా ఎందుకు? కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు. సాత్యకి చేతిలో ఓడిపోయాడు. కానీ, వారందరూ "ఈ కర్ణుడు అర్జునుడిచేతిలోనే చావాలి తప్ప మా చేతిలో కాదు" అని వదిలేయబట్టి బ్రతికిపోయాడు.

అటువంటి మొహమాటాలేమీ లేని ఘటోత్కచుడు దాదాపు కర్ణుని చంపేసేవాడే.
అందుకని ఆ ఆపత్సమయంలో కర్ణుడు అర్జునుడిని చంపడం కోసం దాచుకున్న ఇంద్రుడిచ్చిన మహాశక్తిని ఘటోత్కచుడిపై విసిరేసి మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బ్రతికి బయటపడ్డాడు.

ప్రశ్న 7
కానీ, ఇంద్రుడు కర్ణుని కవచం లాగేసి శక్తిహీనుణ్ణి చేసేసిన తరువాత కదా, వీరందరి చేతిలో కర్ణుడు ఓడింది?

కృష్ణుడు:
సరే, కాసేపు అలాగే అనుకుందాం.

కానీ, ఘోషయాత్ర సమయంలో కర్ణుడు అర్జునుని శిష్యుడైన చిత్రసేనుని చేతిలో చిత్తుగా ఓడిపోయి జాడ కూడా తెలియకుండా పారిపోయాడు కదా. దానికేమంటారు?

ఈ కర్ణుడు తన నూత్న యౌవనసమయంలోనే తనతో ద్వంద్వయుద్ధం చేయమని అర్జునుడిని సవాలు చేశాడు కదా, కానీ, ఆ మరుసటి రోజే దుర్యోధనుడితోనూ, మిగిలిన కౌరవులతోనూ కలసి ద్రుపదుడి మీద యుద్ధానికి పోయి చిత్తుగా తన్నులు తిని పారిపోలేదా?

ఈ రెండు సందర్భాలలోనూ అతడి ఒంటి మీద సహజకవచకుండలాలు ఉన్నాయి కదా? అవి ఉండడం వల్ల అతడు ఏమాత్రం గెలిచాడేమిటి?

ప్రశ్న 8
మరి కర్ణుడికి గురుశాపం ఉంది కదా?

కృష్ణుడు:
అది అతడు చేతులారా చేసుకున్న పని. దానికి ఎవడు ఏం చేయగలడు? ఈ విషయంలో అర్జునుడికి ఏమి సంబంధం ఉంది? అర్జునుడు స్వయంగా పరశురాముడి చెంతకు వెళ్లి "అయ్యా, దయచేసి కర్ణుడికి శాపం ఇవ్వండి" అని కోరి ఉంటే మీరు తప్పు పట్టవచ్చు.

"సచిన్ టెండూల్కర్ రన్ అవుట్ కాకుండా ఉంటే అతడు సెంచరీ చేసేవాడు, మ్యాచ్ గెలిపించేవాడు" అని మీరు బాధపడితే ఎంత అసంబద్ధమో, ఇపుడు ఈ గురుశాపప్రస్తావన వంటివి అంతే అసంబద్ధం.

ప్రశ్న 9
యుద్ధంలో రథం క్రుంగి పోయి నేల మీద ఉన్న కర్ణుడి మీదకు బాణం వేయమని మీరు అర్జునుడిని ప్రోత్సహించలేదా? అది ధర్మమేనా?

కృష్ణుడు:
ఇప్పుడు మీరే కాదు, సాక్షాత్తు కర్ణుడు కూడా నన్ను ఆ సమయంలో ఇదే మాట అడిగాడు. అపుడు నేను కూడా ఆ కర్ణుడిని అడిగాను -

ఏమయ్యా కర్ణా? "పాండవులు వానవాసాన్ని అజ్ఞాతవాసాన్ని నియమం ప్రకారం ముగించారు కాబట్టి, వారి రాజ్యం వారికి ఇచ్చేయడం ధర్మం" అని నువు దుర్యోధనుడికి ఆ సమయంలో ధర్మాన్ని ఎందుకు గుర్తు చేయలేదు?

భీముడికి విషం పెట్టినపుడు అది అధర్మం అని నీ మిత్రుడికి ఎందుకు చెప్పలేదు?

పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చివేసే ప్రయత్నం అధర్మం అని ఎందుకు చెప్పలేదు?

ద్రౌపదిని నిండుసభలో దుశ్శాసనుడు, మీ ప్రాణమిత్రుడైన దుర్యోధనుడు పరాభవించినపుడు, నువ్వు ఆనందంతో కేరింతలు కొట్టినప్పుడు ఈ ధర్మం ఎందుకు గుర్తుకురాలేదు?

అభిమన్యుడు ఒంటరిగా యుద్ధం చేస్తూ నీలాగే నేలమీద ఉన్నపుడు, అయ్యో అతడు బాలుడు కదా, నిరాయుధుడై ఉన్నాడు కదా అనే కనికరం కూడా లేకుండా ఆరుగురు అతిరథులు అతడిపై విరుచుకుపడి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా?  ఆ ఆరుగురిలో నువ్వు కూడా ఒకడివి కదా? ఆ సమయంలో అది అధర్మం అని ఎందుకు గుర్తుకు రాలేదు తమరికి?" అని అడిగాను.

ఆవిధంగా నేనడిగిన ప్రశ్నలలో కర్ణుడు ఏ ఒక్కదానికైనా సరైన సమాధానం చెప్పి ఉంటే, "అర్జునా! కాసేపు ఆగు, కర్ణుడు యుద్ధానికి సిద్ధమైన తరువాత బాణాలు వేద్దువు గాని" అని అర్జునుడిని ఆపి ఉండేవాడిని. మీకు ఈ ప్రశ్న వేసే శ్రమ తప్పి ఉండేది.

ప్రశ్న 10
శల్యుడు కర్ణుడిని నిరుత్సాహపరిచాడు కదా?

కృష్ణుడు:
అసలు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వస్తున్న శల్యుడిని మాయలతో వశపరచుకుని తన పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పించుకున్న దుర్యోధనుడిని అడగండి ఈ మాట. శత్రువు వేలుతో శత్రువు కంటినే పొడవాలని దుర్యోధనుడు అలాంటి ఎత్తు వేశాడు. అదే యుక్తిని ధర్మరాజు అమలు పరిస్తే తప్పు పడతారెందుకు?

ప్రశ్న 11
మీరు కూడా కర్ణుడిని పాండవపక్షానికి రప్పించేందుకు ప్రయత్నించారు కదా?

కృష్ణుడు:
కర్ణుడు పాండవపక్షంలో చేరి ఉంటే యుద్ధం జరుగదు కదా అనే ఆశతో అలా చేశాను. అయినా, ప్రయత్నించడంలో తప్పేమిటి? దుర్యోధనుడు ఏకంగా నన్నే తన పక్షాన యుద్ధం చేయమని కోరేందుకు రాలేదా?

ప్రశ్న 12
అలా ప్రయత్నించినపుడు ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని ఆశ పెట్టారట కదా?

కృష్ణుడు:
ఎవరు అలా చెప్పిన నీచుడు? మీ తెలుగువాళ్లు పరమచెత్త సినిమాలు తీసి అందులో నా పాత్రధారి చేత అటువంటి నీచపు మాటలు పలికించారని విన్నాను. నిజానికి కర్ణుడు పాండవుల పక్షానికి వస్తే అతడు రాజు అవుతాడని 
నేను చెప్పానే కానీ, ద్రౌపది గురించి అలా మాట్లాడే అధికారం నాకెక్కడిది? ఆ సమయంలో జరిగింది జూదమూ కాదు, ద్రౌపదిని తాకట్టు పెట్టేందుకు నేను ధర్మరాజునూ కాదు.

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
(అందుకు సమాధానంగా ఏమని ఉంటాడు ఊహించగలరా? ఇంకా కృష్ణుని ఎలాగైనా ఇరికిద్దామని, ఎన్నో సందేహాస్పదమైన విషయాలకు ఆయన నోటిమీదుగానే సమాధానాలను రాబడదామని ప్రయత్నించాను. ఆ మిగిలిన ఇంటర్వ్యూ ను ఈరోజే రెండో భాగంలో చదవండి)

ఇంటర్వ్యూ మొదటి భాగం శ్రీకృష్ణార్పణమస్తు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...