Wednesday 24 March 2021

బాఘ్ మార్ హరిసింగ్ నల్వా (4)


ఒకరోజు రాజా రంజిత్ సింగ్ నుండి హరిసింగ్ నల్వాకు ఒక రహస్య సందేశం వచ్చింది. “మన దేశంలోనికి శత్రువులు నిరంతరం కైబర్ కనుమగుండా చొరబడుతున్నారు. కాబట్టి కైబర్ కనుమ మన నియంత్రణలో ఉండాలి. వెంటనే అందుకు తగిన చర్య చేపట్టు.”
హరిసింగ్ నల్వా వెంటనే తన మంత్రులు సలహాదారులతో సమావేశమై కైబర్ కనుమను గూర్చి చర్చించాడు.
కైబర్ కనుమ హిమాలయపర్వతశ్రేణులలో భాగమైన హిందూకుష్ పర్వతాలలో ఉన్నది. ఆ ప్రాంతాలలో పష్తూన్ జాతికి చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. (నేడు ఆఫ్రిదీలుగా, యూసప్జాహిలుగా, పఠాన్లుగా పిలువబడుతున్నవారందరూ పష్తూన్లే.)
ఒకప్పుడు వారిలో అధికులు హిందువులుగా ఉండేవారు. మరికొందరు బౌద్ధులుగా, జొరాష్ట్రియనులుగా ఉండేవారు. పశుపాలనవృత్తి ద్వారా, అటవీసంపదను సేకరించి అమ్ముకొనడం ద్వారా, కొందరు కృషికర్మద్వారా ప్రశాంతజీవనం కొనసాగించేవారు.
భారతదేశంనుండి పడమటి దేశాలకు పోయేందుకు కైబర్ కనుమ దగ్గరి దారి. భారతదేశం నుండి, చైనా నుండి వ్యాపారులు కైబర్ కనుమ ద్వారా తమ వర్తకప్రయాణాలు కొనసాగించేవారు. (నేటి లెక్కలో అది యాబై కిలోమీటర్ల పొడవైన దారి.)
అయితే క్రమంగా అదే కనుమగుండా పశ్చిమదేశాలనుండి దోపిడీదారులైన తెగలు సౌభాగ్యవంతమైన భారతదేశంపై దాడికి రావడం ప్రారంభమైంది. అలెగ్జాండరు, తైమూరు, బాబరు మొదలైనవారందరూ కైబర్ కనుమనుండి అపారమైన సైన్యాలతో వచ్చి భారతదేశంమీద దాడి చేసినవారే. వారిలాగానే అనేకమైన నరహంతకులు లెక్కలేనన్ని సార్లు భారతదేశాన్ని దోచేందుకు వచ్చారు.
వచ్చిన ప్రతిసారీ వారు ఎన్నెన్నో అరాచకాలకు అకృత్యాలకు పాల్పడ్డారు. అపారమైన జనక్షయానికి కారకులైనారు. దేవాలయాలను కొల్లగొట్టి ధ్వంసం చేశారు. భారతీయుల గురుకులాలపైన విశ్వవిద్యాలయాలపైన దాడి చేసి, అక్కడ నిరపరాధులు, నిరాయుధులు అయిన ఆచార్యులను వారి శిష్యులను పాశవికంగా హతమార్చారు. గ్రంథాలయాలను గ్రామాలను తగులబెట్టారు. భారతీయులైన క్షత్రియులు ఒకవైపు యుద్ధరంగంలో ఉండగా, మరొకవైపు ఆయుధప్రయోగేతరవృత్తులలో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్న నిరపరాధులైన హిందువులపై భయంకరమారణాయుధాలతో దాడి చేసి పిల్లలు, వృద్ధులు అనే కనికరం లేకుండా పురుషులందరినీ హతమార్చారు. కంటికి సజీవంగా కనిపించిన స్త్రీలనందరినీ ఎత్తుకుపోయారు. భారతీయుల జీవనాధారమైన పశువులను కూడా వదలకుండా చంపేశారు. వారి వ్యవసాయక్షేత్రాలను సర్వనాశనం చేశారు. బావులలోను, చెఱువులలోనూ త్రాగే నీటిని విషమయం చేశారు.
అయితే ప్రతిసారీ భారతీయులు వారి దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఓడారు. మరికొన్ని సార్లు గెలిచి వారిని తరిమికొట్టారు. (ఈ కాలానికే చరిత్ర మధ్య యుగం అని పేరు. వారి క్రూరత్వానికి ఒక్క భారతదేశమే కాక ప్రపంచమంతా గగ్గోలెత్తిపోయింది. దానిని వారు తమ ఘనమైన వారసత్వచరిత్రగా ఈనాటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు.)
అయినప్పటికీ శతాబ్దాల తరబడి వేలాదిగా లక్షలాదిగా మిడతలదండులా వచ్చిపడిన ఎడారి సైన్యాలు క్రమంగా ఆఫ్ఘనిస్థాన్ పైన, కైబర్ కనుమ పైన పట్టును పెంచుకున్నాయి. ఒకప్పుడు గాంధారదేశంగా పిలువబడిన ఆఫ్ఘనిస్థాన్ లో స్థానికులైన హిందువులు బౌద్ధులు క్రమంగా అల్పసంఖ్యాకులైపోయారు. రంజిత్ సింగ్ కాలానికి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలముందే ఆఫ్షనిస్థాన్ బలవంతంగా ఇస్లాం దేశంగా మార్చబడింది. ఇస్లాం ధర్మం స్వీకరించేందుకు ఇష్టపడనివారు అమానుషంగా వధించబడ్డారు. భారతదేశం పడమటి భాగాన్ని ఆక్రమించుకున్నందున తమకు తోచినపుడు హఠాత్తుగా భారతదేశంపై దండెత్తడం ముసల్మాను రాజులకు సులువైంది.
ఇదే క్రమంలో వారు పష్తూన్ తెగవారిపై భీకరమైన దాడులు చేసి ఇస్లాం మతంలోనికి మార్చేశారు. వారి పష్తో భాషలో కూడా చాల మార్పులొచ్చాయి. వారి భాషలో భారతీయపదసంపద తగ్గిపోయింది. పర్షియన్ భాషాపదాలు వచ్చి చేరాయి. భాష మారితే సంస్కృతి మారిపోవడానికి ఎంతో కాలం పట్టదు. నెమ్మదిగా పష్తూన్ వారి ఆచారవ్యవహారాలు కూడా పూర్తిగా నాశనమైపోయాయి.
తరాలు గడుస్తున్న కొద్దీ పష్తూన్లు తమ పూర్వచరిత్రను మరచిపోయి, అచ్చమైన ముసల్మానులలాగానే ప్రవర్తించడం మొదలు పెట్టారు.
ఒకప్పుడు ప్రశాంతంగా బ్రతికిన వారు క్రూరస్వభావులైపోయారు. భారతదేశంపై నిష్కారణమైన ద్వేషం పెంచుకున్నారు. తాము పడమటి దేశాల వారసులమని, భారతదేశాన్ని దార్ అల్ ఇస్లాంగా మార్చాలని భావించడం మొదలు పెట్టారు. చీటికి మాటికి ఆఫ్ఘన్ సైన్యాలకు తోడుగా వారు భారతదేశంపై దాడులు చేస్తూ చీకాకు పెడుతున్నారు.
నౌషేరా యుద్ధంలో రాజా రంజిత్ సింగుకు వ్యతిరేకంగా అజీం ఖానుకు సహాయపడ్డారు. అలాగే హరిసింగ్ పెషావర్ ను స్వాధీనం చేసుకున్న సమయంలో దోస్త్ మహమ్మద్ ఖాను నిరపాయంగా తప్పించుకుని పారిపోయేందుకు కూడా సహాయపడ్డారు. ఆఫ్ఘన్ సైన్యాలు పక్కలో బల్లెమైతే ఈ పష్తూన్లు ఆ బల్లేనికి మొనలాంటివారు.
అందువలన భవిష్యత్తులో పడమటినుండి దండయాత్రలను ఆపాలంటే కైబర్ కనుమపై పట్టుసాధించడం అనివార్యం. అదీ రంజిత్ సింగ్ హరిసింగ్ నల్వాకు పంపిన ఆదేశంలోని ఆంతర్యం.
)))(((
హరిసింగ్ అమృతసర్ నగరంలో నవరాత్రి ఉత్సవాలలో పాల్లొనేందుకు వెళ్లాడని అందరూ అనుకున్నారు. అయితే అతడు తన కదలికలపై శత్రువుకు అంచనా వేసే అవకాశం ఇవ్వరాదనే వ్యూహంలో భాగంగానే వెళ్లాడు. నవరాత్రులు ముగియటమేమిటి, హరిసింగ్ నల్వా కైబర్ కనుమ దారిలో ముందుగా వచ్చే పష్తూన్ల స్థావరమైన జమ్రూద్ పై మెరుపుదాడి చేశాడు. (1836)
ఊహించని దెబ్బకు శత్రువులందరూ చెల్లాచెదురైపోయారు. కైబర్ కనుమగుండానే కాబూల్ కు పారిపోయారు. హరిసింగ్ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా జమ్రూద్ లో కోటను పటిష్టపరిచాడు.
దోస్త్ మహమ్మద్ ఖాన్ ఈ దెబ్బనుండి తేరుకునే లోగా హరిసింగ్ పంజతర్ మీద దాడిచేసి యుసఫ్జాహి సైన్యాన్ని ఓడించాడు. పంజతర్ పాలకుడైన ఫతే ఖాన్, రంజిత్ సింగ్ కు సామంతుగా ఉంటూ శిస్తు కట్టడానికి, హిందువులను హింసించకుండా ఉండటానికి అంగీకరించడంతో తిరిగి అతడికే పంజతర్ ను అప్పగించాడు.
ఇంతటి సంతోషకరమైన సందర్భంలో రాజా రంజిత్ సింగ్ మనుమడైన నవ నిహాల్ సింగ్ కు వివాహం నిశ్చయమైంది. (1837) మనం శత్రుత్వాన్ని వీడి మిత్రులుగా ఉందాం రమ్మంటూ దోస్త్ మహమ్మద్ ఖానుకు కూడా వివాహానికి రమ్మని రంజిత్ సింగ్ సందేశం పంపించాడు. వివాహానికి చాలమంది బ్రిటిష్ కమాండర్లు కూడా హాజరు కాబోతున్నారు.
రంజిత్ సింగ్ మాత్రమే కాక అతని సైన్యంలోని ప్రముఖసర్దార్లందరూ కూడా కూడా అమృత్ సర్ లో జరిగే వివాహానికి హాజరౌతున్నందు వలన, వారెవరూ లేని సమయంలో రాజధాని అయిన లాహోరుపై శత్రువులెవరూ దండెత్తకుండా, దండెత్తినా తగిన రక్షణకోసం యావత్ పంజాబ్ సామ్రాజ్యంనుంచి సైన్యంలో అధికభాగాన్ని లాహోరుకు రప్పించారు. వివాహానికి ఆహూతులైన అతి ముఖ్యమైన అతిథులకు అనుకోని ప్రమాదం వాటిల్లకుండా రక్షణ కల్పించాలనే సదుద్దేశంతో అమృత్ సర్ కు కూడా చాల సైన్యం వచ్చింది. అందులో భాగంగానే, పెషావర్ నుండి, జమ్రూద్ నుండి కూడా చాల సైన్యం లాహోర్ కు వెళ్లింది.
ఈ ఇంటిగుట్టు కమాల్ ఖాను ద్వారా దోస్త్ మహమ్మద్ ఖానుకు చేరింది. హరిసింగ్ నల్వాపై ప్రతికారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతడికి కాలం కలసి వచ్చినట్లనిపించింది. రాజకుమారుని వివాహానికి హరిసింగ్ అమృత్ సర్ కు పోతే నాయకుడు లేక తక్కువ సైన్యం కలిగిన జమ్రూద్ ను పెషావర్ ను తాను తిరిగి ఆక్రమించుకోవచ్చునని భావించి, తనకు ఆహ్వానం అందినప్పటికీ వివాహానికి అతడు హాజరు కాలేదు.
అమృత్ సర్ లో వివాహపు వేడుకలు ప్రారంభమయ్యే సమయానికి దోస్త్ మహమ్మద్ ఖాన్ జమ్రూద్ మీదకు తన కుమారులను, తన సర్దారులను పెద్ద సైన్యాన్ని తోడిచ్చి దండయాత్రకు పంపించాడు.
అప్పటికి హరిసింగ్ దళపతి అయిన మహాన్ సింగ్ కేవలం 600 మంది సిపాయిలతో జమ్రూద్ కోటను రక్షిస్తూ ఉన్నాడు. దాదాపు పాతికవేల మహమ్మద్ సైన్యం జమ్రూద్ కోటను చుట్టుముట్టి దిగ్బంధిచారనే విషయం హరిసింగ్ నల్వాకు తెలిసింది. అతడు నిజానికి అమృత్ సర్ వివాహానికి వెళ్లలేదు. పెషావర్ లోనే ఉన్నాడు. అతడు తత్క్షణమే హుటాహుటిన పెషావర్ నుండి కొద్దిపాటి సైన్యంతో జమ్రూద్ కు బయలుదేరాడు.
అతడు కవచం తొడుగుకుని యుద్ధసన్నద్ధుడై గుఱ్ఱం ఎక్కబోతున్న సమయానికి కమాల్ ఖాన్ చేతినిండా మిఠాయిలతోను, తన సేవకులతో పండ్ల బుట్టలతోను ఎదురు వచ్చాడు. హరిసింగ్ కు సలాం చేసి, హుజూర్, ఈ మిఠాయిలను స్వీకరించండి అన్నాడు.
అతడి సంతోషానికి హరిసింగ్ ఆశ్చర్యపోయి కారణం అడుగగా, “హుజూర్, మా నూర్ భానుకు కుమారుడు పుట్టాడు. అదే ఈ సంతోషానికి కారణం. మీరు ఈ మిఠాయిలు స్వీకరించండి. మా ఇంటికి విచ్చేసి (నిజానికి ఆ భవనం వారికి హరిసింగ్ ఇచ్చినదే) మీ చేతులతో నా మనుమడిని మీ అంతటి వాడు కావాలని దీవించండి” అని పలికాడు.
హరిసింగ్ సంతోషపడ్డాడు. కమాల్ ఖాను ఇచ్చిన మిఠాయిలను తీసుకున్నాడు. “కమాల్ సాబ్, నేను జరూరుగా జమ్రూద్ వెడుతున్నాను. తిరిగి వచ్చిన తరువాత తప్పక మీ ఇంటికి వస్తాను” అని చెప్పాడు. సరేనన్నాడు కమాల్ ఖాన్.
జమ్రూద్ చేరుకునే దారిలోనే హరిసింగ్ కు దోస్త్ మహమ్మద్ ఖాన్ సైనికులు ఎదురువచ్చి అడ్డగించారు. హరిసింగ్ చండప్రచండంగా విజృంభించాడు. అతడి ధాటికి ఆఫ్ఘన్ సైన్యం కకావికలైంది. చచ్చినవారు చావగా మిగిలినవారు పిక్కబలం చూపించసాగారు.
అయితే ఆ సమయంలో హరిసింగ్ కు కండ్లు తిరగటం మొదలుపెట్టాయి. తల దిమ్మెక్కిపోయింది. విపరీతమైన దాహం వేసింది మంచినీళ్లు అందుబాటులో లేవు. స్పృహతప్పి తన గుఱ్ఱం మీద వాలిపోయాడు.
ఇదంతా కమాల్ ఖాన్ హరిసింగ్ కు ఇచ్చిన మిఠాయిలలో కలిపిన విషప్రభావం!
హరిసింగ్ నీరసపడిపోవడం చూసిన శత్రువులు తిరిగి అతని చుట్టూ కమ్ముకున్నారు. ఒకడు తన బల్లెంతో హరిసింగ్ రొమ్ముపై బలంగా పొడిచాడు. మరొకడు డొక్కలో పొడిచాడు. నలుగురైదుగురు సైనికులు అతడి తలపై బలంగా ఆయుధప్రయోగం చేశారు. హరిసింగ్ గుఱ్ఱం ఒక్కసారిగా సకిలిస్తూ వెనుక కాళ్లమీద లేచింది.
దాంతో హరిసింగ్ తిరిగి స్పృహలోనికి వచ్చాడు. వెంటనే పరిస్థితిని గమనించాడు. వెంటనే భీషణపరాక్రమంతో విజృంభించాడు. అతడి కత్తికి సమాధానం చెప్పే ప్రతియోధుడు లేకపోయాడు. నిప్పులోనికి దూకుతున్న పురుగుల్లా అతడిని ఎదిరించబోయిన ప్రతి శత్రుసైనికుడూ అతడి ప్రతాపాగ్నిలో మాడిపోయాడు. అంతే కాదు, అతడి సైనికులు కూడా శత్రువులపై విజృంభించిన తీరు చూశాక అందులో ఒకొక్కడు ఒకొక్క హరిసింగ్ లా వారికి అనిపించాడు. దాంతో శత్రువులందరూ ప్రాణభయంతో మరలా పలాయనమంత్రం పఠించారు.
మొత్తానికి హరిసింగ్ జమ్రూద్ కోటకు చేరుకున్నాడు. అయితే అతడు తీవ్రంగా గాయపడిన విషయం దోస్త్ మహమ్మద్ ఖానుకు తెలిసిపోయింది. దాంతో చెల్లాచెదురైన తన సైన్యాన్ని తీసుకుని తానే స్వయంగా మరలా కోటను ముట్టడించాడు. లోపల సిక్ఖు సైనికుల సంఖ్య చాల తక్కువగా ఉందని అతడికి తెలుసు. అయినప్పటికీ, హరిసింగ్ నాయకత్వంలో ఒకొక్క సైనికుడూ పదేసిమంది శత్రువులను సులువుగా హతమార్చగలరని కూడా అతడికి తెలుసు. అందువల్ల యుధ్ధం చేయడానికి అతడికి ధైర్యం చాలలేదు. లోపల సైనికులకు ఎక్కువరోజులు సరిపోయేన్ని ఆహారపదార్థాలు లేవని, వారు తిండికి లేక నీరసించిపోతే కోటను పెద్దగా ప్రతిఘటన లేకుండానే స్వాధీనం చేసుకోవచ్చునని భావించి, కోటలోని వారు బయటకు రాకుండా కాపలా కాయడం మొదలుపెట్టాడు.
ఇటు హరిసింగ్ కు తనకు మరణఘడియలు సమీపించినట్లు తెలిసిపోయింది. అతడు మహాన్ సింగ్ ను పిలిచి, “నాయనా, నేను మరణించబోతున్నాను. నేను మరణించాను అనే విషయం తెలిస్తే మహమ్మద్ ఖాన్ తప్పకుండా కోటలోనికి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల నేను మరణించినా సరే, ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకు. అయితే త్వరలో జమ్రూద్ కు మన అదనపు బలాలు రానున్నాయి. అవి వచ్చి, మహమ్మద్ ఖానును తరిమికొట్టిన తరువాతనే నా మరణవార్తను మహారాజుగారికి నివేదించు. అంతవరకూ నా మరణసమాచారాన్ని మన శత్రువులకు గాని, మన ప్రజలకు గాని, చివరకు నా కుటుంబానికి గాని తెలియనివ్వకు” అని ఉపదేశించాడు.
మహాన్ సింగ్ సరేనని మాట ఇచ్చాడు.
మహమ్మద్ ఖాను దాదాపు వారం రోజుల పాటు కోట బయట ఎదురు చూశాడు. ఇంతలో రాజా రంజిత్ సింగ్ అదనపు బలగాలు అక్కడకు వచ్చి చేరడం చూడగానే తిరిగి సైన్యంతో సహా కాబూలుకు పారిపోయాడు. మరలా జమ్రూద్ ను, పెషావర్ ను స్వాధీనం చేసుకోవాలనేది అతడి జీవితంలో ఒక తీరని కోరికగానే మిగిలిపోయింది.
ఒక మహాయోధునిగా, గొప్ప ఔదార్యవంతునిగా, ప్రజలను ఎంతగానో ప్రేమించిన పరిపాలకునిగా, హరిసింగ్ నల్వా చరిత్రలో నిలిచిపోయాడు.
నమ్మకూడని వారిని నమ్మి వారిని చేరదీసి, చివరకు వారి ద్రోహానికి గురైన వారి జాబితాలో హరిసింగ్ నల్వా కూడా ఉండటం మన దురదృష్టం.
అతడు చేసిన పొరబాటునుండి మనం నేర్చుకొనవలసిన గొప్ప గుణపాఠం అది. నేర్చుకునేందుకు నిరాకరిస్తే అది మన జాతి కూడా చరిత్రలో కలిసిపోయి శాశ్వతంగా అదృశ్యమైపోతుంది. తథాపి, అమంగళం ప్రతిహతమగు గాక!
)))(((
ఇది కథలో నాల్గవ భాగం, చివరి భాగం.
)))(((
May be an image of outdoors and monument
M K Rama Raju and Satya Kumar
1 comment
6 shares
Like
Comment
Share

Monday 22 March 2021

(బాఘ్ మార్ హరిసింగ్ నల్వా 3)


హరిసింగ్ ప్రతిరోజూ ఉదయమే షాహిబాగ్ కు వచ్చి ఏకాంతంలో జపజీ సాహిబ్ ను భక్తిశ్రద్ధలతో పఠిస్తాడు. ఆ సమయంలో ఒకరిద్దరు సైనికులు కొంత దూరంగా ఉంటారే తప్ప అతని చుట్టూ నిత్యం ఉండే పరివారం ఆ సమయంలో ఉండరు. ఆ తరువాత ఆ సమయంలో అక్కడకు వచ్చిన పౌరులు ఎవరైనా తనతో మాట్లాడదలిస్తే వారితో కొంతసేపు ముచ్చటిస్తాడు. ప్రజల కష్టసుఖాలను నేరుగా తెలుసుకునేందుకు, తన పరిపాలనలో ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకునేందుకు కూడా అది ఒక చక్కని అవకాశంగా కూడా హరిసింగ్ భావిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరైనా ఏదైనా తమకు కావాలని ఏదైనా అడిగితే కాదనకుండా వారికి సాయం చేస్తాడు లేదా దానం చేస్తాడు.


ఈ విషయం తెలిసిన కమాల్ ఖాన్ సరిగ్గా అటువంటి హరిసింగ్ అలవాటునే తన కోర్కె నెరవేర్చుకునేందుకు తగిన ఉపాయంగా మలచుకుందామనుకున్నాడు. అటువంటి సమయంలో నూర్ తనను పెండ్లి చేసుకొనమని అడిగితే హరిసింగ్ కాదనలేడని కమాల్ సింగ్ పన్నాగం. ఆవిధంగా అతడి ధర్మతత్పరతనే అతడి బలహీనతగా మార్చి దెబ్బ కొట్టాలని అతడు భావించాడు.

మొత్తానికి ఒక రోజు హరిసింగ్ జపజీ పఠనం పూర్తి చేసుకుని ప్రజలను కలుసుకునే సమయానికి తన కుమార్తె అయిన నూర్ భాను అక్కడకు వెళ్లేలా ఏర్పాటు చేశాడు.

హరిసింగ్ జపజీ పఠించి ప్రజలను కలుసుకునే స్థానానికి వచ్చాడు. ఆజానుబాహుడైన అతడి దేహం క్షత్రియోచితంగా అమితబలాఢ్యమై అలరారుతోంది. అతడు పిడికిలి బిగించి కొడితే ఎంతటి కఠినమైన పాషాణశిల అయినా ముక్కలు కావలసిందే అనిపిస్తుంది. పదేండ్ల వయసులోనే అమృతసంచార్ సంస్కారాన్ని పొందిన అతడు సమున్నతమైన తన శిరస్సుపై ధరించిన పగిడీ అతడి అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ ఉన్నది. గురువు అడిగితే తన తలను ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా సమర్పించడానికి సిద్ధం అనే ఖల్సా వీరుల ప్రతిజ్ఞకు గుర్తుగా ఆ పగిడీ ముందు భాగంలోనే ఎక్ ఓంకార్ చిహ్నమైన ఖండా, బసంతి-సుర్మయినీలం రంగులలో మెరుస్తూ అతడి ధీరత్వాన్ని తెలుపుతోంది. అతడి మీసాలూ గడ్డము తన ధర్మానికి తాను సుదీర్ఘకాలంనుండి అనంతకాలం వరకు కట్టుబడినట్టుగా పొడవుగా ఉన్నాయి. మెడ చుట్టూ అతడు ధరించిన హజూరీ ధవళకాంతులను వెదజల్లుతూ నిర్మలమైన అతడి మనస్సుకు ప్రతీకగా ఉన్నది. ప్రసన్నమైన అతని ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. అతని కండ్లు దయామృతరసాన్ని ఒలికిస్తూ ఉన్నాయి. అతడు నడుముకు ధరించిన కృపాణం దుష్టశిక్షణ చేసేందుకు అనుక్షణం సన్నద్ధమై ఉంటూ సజ్జనులకు అభయప్రదాయకంగా నయనానందకరంగా ఉన్నది.

“సూర్యసింగ్, ఈ రోజు వచ్చినవారిని తీసుకురా” అన్నాడు హరిసింగ్ అక్కడ ఉన్న తన అనుచరునితో.

“ఈరోజు ఒక్కరే వచ్చారు” అని తెలిపాడు సూర్యసింగ్.

“సరే. తీసుకురా”.

ఒక్క నిమిషంలో తన ముందుకు వచ్చి కొంత దూరంలో నిలబడిన వ్యక్తిని చూశాడు హరిసింగ్. ముదురునీలంరంగు దుస్తులలో మేలిముసుగు కప్పుకుని వచ్చిన ఒక యువతి. ఆమె ముఖం కనబడటం లేదు.

మొట్ట మొదటసారి హరిసింగ్ ను ప్రత్యక్షంగా చూసిన నూర్ భాను పరవశురాలైపోయింది. తన మనసులో అనునిత్యం మెదలుతూ ఉన్న ఆ ధీరగంభీరమూర్తి తాను ఊహించుకున్న దానికంటె నూరింతలు గొప్పగా ఉన్నాడు. ఆమె తనను తాను మరచిపోయి, అతడికి అభివాదం చేయడం కూడా విస్మరించింది.

ఒక స్త్రీ ఒంటరిగా ఏదో చెప్పుకోవాలని వచ్చిందంటే ఆమె నిస్సహాయురాలై ఉంటుందని, చాల చిక్కులలో ఉండి ఉంటుందని భావించి హరిసింగ్ మనసులోనే చాల వ్యాకులత చెందాడు.

“కూర్చోండమ్మా” అన్నాడు ఎంతో దయాపూర్ణమైన కంఠంతో.

నూర్ భాను కు అమ్మా అనే ఆ పిలుపు కర్ణకఠోరంగా వినిపించింది. అందరూ తనను పేరు పెట్టి పిలిచేవారు, లేదా బేటీ అని బెహన్ అని పిలిచేవారే తప్ప ఇలా ఆమెను మా అంటూ సంబోధించినవారు అంతవరకూ ఎవరూ లేరు. అటువంటిది తాను ఎవరిని తన ప్రియునిగా భావిస్తూ ఉన్నదో ఆ వ్యక్తి తనను అమ్మా అని పిలవడం ఆమెకు ఎంతో కష్టమనిపించింది.

“కూర్చోండమ్మా” అని మరోసారి అన్నాడు హరిసింగ్.

మరోసారి మరోసారి అమ్మా అని పిలిపించుకొనడం ఇష్టం లేక నూర్ భాను తటాలున కూర్చుంది. అయితే అక్కడున్న శిలాసనం మీద కాకుండా నేలపై తన మోకాళ్లమీద కూర్చుంది. వెంటనే హరిసింగ్ లేచి నిలుచున్నాడు.

“అమ్మా, మీరు ఇంత దీనంగా ఉండకండి, గురుసేవకుడూ రాజా రంజిత్ సింగ్ ఆజ్ఞాపాలకుడూ అయిన ఈ హరిసింగ్ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాడు. మీకు వచ్చిన ఎటువంటి కష్టాన్నైనా నేను తొలగిస్తాను. భయపడకుండా నేను మీకు ఏమి చేయగలనో చెప్పండమ్మా” అన్నాడు.

హరిసింగ్ నోటినుండి వెలువడుతున్న అమ్మా అనే పదం మాటిమాటికి ములుకుల్లా గుచ్చుకుంటూ ఉండగా నూర్ భాను ఏమీ మట్లాడలేక పోయింది. తనను పెండ్లాడమని అతడిని అడిగేందుకు ఆమె వచ్చింది. కాని పదే పదే హరిసింగ్ అమ్మా అమ్మా అంటూ ఉంటే తన కోరికను ఎలా చెప్పుకునేది అంటూ ఆమె మాటలాడేందుకు తడబడుతోంది. ఆమె మనసు ఆమెనే ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నది.

ఆమె ఎంతకూ తన మౌనాన్ని వీడి మాట్లాడకపోవడంతో తన కష్టాన్ని ఇతరుల ముందు చెప్పుకునేందుకు ఆమె సంకోచిస్తున్నదేమో అనే భావించి హరిసింగ్ సూర్యసింగును కాస్త దూరంగా పొమ్మని సంజ్ఞ చేశాడు.

సూర్యసింగ్ దూరంగా పోయాడు. కాని, మరీ దూరంగా కాదు. పరాఙ్ముఖుడై నిలబడినప్పటికీ చీమ చిటుక్కుమన్నా వినగలిగేంత జాగరూకతతో ఎవరైనా శత్రువు తన ప్రభువుకు అపకారం తలపెట్టే ఉద్దేశంతో మారువేషంలో వచ్చివుంటే, ఏమైనా ద్రోహం తలపెట్టదలిస్తే మెరుపులా అడ్డుపడి అతడి తలను ఒక్క వేటుతో ఎగురగొట్టగలిగినంత దూరంలోనే అప్రమత్తంగా ఉన్నాడు.

కాని, సూర్యసింగ్ దూరంగా పోయినప్పటికీ నూర్ భాను ఏమీ మాట్లాడలేక పోయింది. హరిసింగ్ వంటి వ్యక్తిని ఆమె ఇంతవరకూ తమ బంధువులలో గాని, పరిచయస్థులలో గాని ఎన్నడూ చూడలేదు. అటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడని ఆమె ఎన్నడూ విని ఉండలేదు. అసలు అలాంటి వ్యక్తిత్వం ఒకటి ఉంటుందని కూడా ఆమె ఎన్నడూ ఊహించి ఉండలేదు.

“చెప్పండమ్మా” అన్నాడు హరిసింగ్ మృదువుగా. “మీకు వచ్చిన కష్టం ఎటువంటిదైనా శాయశక్తులా తీరుస్తాను. ఆ కష్టాన్ని తీర్చలేకుంటే పెషావర్ పాలకుడనే ఈ పదవి నాకు తృణప్రాయమైనది. తత్క్షణమే వదులుకుంటాను” అన్నాడు. తాను ఆమె కోర్కెను తీర్చలేమోననే సందేహంతో ఆమె మాట్లాడటానికి సంశయిస్తుందేమోనని అతడు భావించాడు.

ఆ మాటలతో నూర్ భాను చలించిపోయింది. తన తండ్రి, ఇతర బంధువులు పదవీకాంక్షతోనే నిత్యం యుద్ధాలలో నిమగ్నమై నరమేధం చేస్తున్నారు. ఎంతోమందిని చిత్రహింసల పాలు చేస్తున్నారు. తమకు అనుకూలురు కానివారిని పదవీచ్యుతులను చేసేందుకు ఎంతో అసహ్యకరమైన కుట్రలు కుతంత్రాలు పన్నుతుంటారు. వారు నిత్యరక్తపిపాసులు. వారిలో ఎన్నడూ కూడా మనసా వాచా కర్మణా హరిసింగ్ వంటి ప్రశాంతుడైన ఒక్క మనిషిని కూడా తాను చూచి ఎరుగదు.

అంతవరకూ ఆమె ఊహాప్రపంచంలో హరిసింగ్ ఒక పురుషుడు, తాను ఒక స్త్రీ. అంతే. కాని, ఇప్పుడు హరిసింగ్ సమక్షానికి వచ్చాక, కేవలం ఒకటి రెండు మాటలలోనే అతడి మహోన్నతవ్యక్తిత్వం అర్థమైనాక ఆమెకు అతడు భగవత్స్వరూపంలా తోచాడు. అతడి పట్ల భక్తిభావం పెరిగింది. తాను అతడిని కోరదలచిన కోరిక చాల తుచ్ఛమైనదిగా అనిపించింది. అటువంటి కోరిక కోరమని తనను పంపిన తల్లిదండ్రులమీద ఆమెకు కోపం కూడా వచ్చింది.

కాని... కాని... “నీవు హరిసింగును కాకుండా ఇంకెవరిని నిఖా చేసుకున్నా దోస్త్ మహమ్మద్ ఖాన్ అతడిని చంపేసి నిన్ను ఎత్తుకుపోతాడు” అని తండ్రి చెప్పిన మాట గుర్తుకు రాగానే ఆమె భయంతో వణికిపోయింది. నెమ్మదిగా నోరు విప్పి అస్పష్టంగా చెప్పింది. “నాకు కుమారుడు కావాలి.”

వినీవినిపించకుండా ఆమె పలికిన మాటలు హరిసింగుకు అర్థం కాలేదు. “ఏమన్నారమ్మా?” అని స్పష్టతకోసం మరలా అడిగాడు.

“నేను మీవంటి కుమారుని కోరుతున్నాను” అన్నది నూర్ భాను నెమ్మదిగా, స్పష్టంగా.

ఆ మాటలు విని హరిసింగ్ ఒక్క క్షణం మౌనం వహించాడు. ఆ మాటలకు అర్థం ఏమిటో అతడికి తెలుసును. ఒక ప్రియురాలు తనను పెండ్లాడమని తన ప్రియుడిని అడిగే సందర్భంలో ఆ విధంగా పలుకడం ఆ ప్రాంతంలో ఒక వాడుక.

హరిసింగ్ ఎటువంటి బదులూ పలుకకపోయేసరికి నూర్ భాను నెమ్మదిగా తల ఎత్తి అతడి వైపు చూసింది. హరిసింగ్ మునుపటిలాగానే నిశ్చలంగా ఉన్నాడు. ఆమె మాటలు విన్న తరువాత కూడా అతడి మనస్సు వదనం రెండూ ప్రశాంతంగానే ఉన్నాయి. దూరంగా ఉద్యానంలో ఉన్న ఎత్తైన వృక్షాగ్రభాగాన్ని తదేకంగా చూస్తున్నాడు.

అతడి నిశ్చలత ఆమెకు కొంత భయం కలిగించింది. తనను అతడు తిరస్కరిస్తే తన గతి ఏమిటి? ఇతడు మాత్రమే తనను రక్షించగల ధీరపురుషుడు. వెంటనే “ప్రభుజీ” అని అతడిని సంబోధించింది. ఎటో ఉన్న అతడి చూపును తనవైపు మళ్లించుకునే ఉద్దేశ్యం ఆమెది.

హరిసింగ్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. వెంటనే ఆమె తన మేలిముసుగును తొలగించింది. “నీ అందానికి ఏ మగవాడైనా బానిస కాక తప్పదు” అని ఆమె తల్లిదండ్రులు ఆమెకు బాగా తలకెక్కించి పంపించారు. ఆ మాటలను నమ్మిన ఆ అమాయికురాలు వారి బోధనల ప్రకారమే ఆ విధంగా తన ముఖారవిందాన్ని తనవాడనుకున్న పురుషునికి చూపే ప్రయత్నం చేసింది.

ఒకే ఒక్క క్షణం ఆమె ముఖాన్ని చూసిన హరిసింగ్ వెంటనే మరలా తలను పక్కకు తిప్పుకున్నాడు. హరిసింగ్ చర్య నూర్ భానుకు శరాఘాతంలా తోచింది. తన అందచందాలపై ఆమెకున్న నమ్మకం నడిసముద్రంలో నావలా మునిగిపోయింది. కరువుకాలంలో చివరి గింజకూడా ఖర్చైపోయిన బికారిలా ఆమె నిస్సహాయురాలైపోయింది. ఆమె కండ్లలో నీళ్లు పెల్లుబికాయి. కంఠం గద్గదమైపోగా “ప్రభుజీ” అని అతి కష్టంగా పలికింది.

ఆమె కంఠంలోని ఆర్తస్వరాన్ని హరిసింగ్ గుర్తుపట్టగలిగాడు. ఈసారి తలతిప్పి ఆమెను భక్తి ఉట్టిపడుతుండగా చూశాడు. తాను కూడా నెమ్మదిగా మోకాళ్లమీద కూర్చున్నాడు. మరలా అలాగే ఆమెను సంబోధించాడు – “అమ్మా” అని.

“అమ్మా, నావంటి కుమారుడు ఎందుకమ్మా? ఇంతటివాడిని మీ ఎదురుగా నేనున్నాను. నన్నే మీ కుమారునిగా భావించండి. మిమ్మల్ని నేను నా మాతృమూర్తిగా భావిస్తున్నాను. మీరు కూడా కనికరించి నన్ను మీ కుమారునిగా స్వీకరించండి” అన్నాడు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ.

ఆ పదహారేండ్ల యువతి ఈ మాటలు విని కంపించిపోయింది. ఎంతటి మహోన్నతమూర్తి ఇతడు? ఇతడి చెంతకు తాను ఎంత హీనమైన కోరికతో వచ్చింది? బేలతనంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. గద్గదస్వరంతో ప్రభుజీ అని మాత్రం పలికింది.

“అమ్మా, నన్ను ప్రభుజీ అనకండి. నేను పెషావర్ లో అందరికీ ప్రభువును కావచ్చును గాని, మీకు, మా తల్లిగారికి మాత్రం కుమారుడనే. అందువల్ల మా తల్లిలాగానే మీరు కూడా నన్ను పుత్తర్ అని పిలవండి. బేటా హరీ అని పిలవండి” అన్నాడు హరిసింగ్.

ఎంతో మృదువుగా, దయాపూరితంగా అతడు పలికిన మాటలు వినేసరికి నేను చేయరాని తప్పు చేశాను అని తనను తానే నిందించుకుంటున్న నూర్ భాను మనసులోని అపరాధబావం సమూలంగా తొలగిపోయింది.
)))(((

జరిగిన విషయం తెలుసుకున్న కమాల్ ఖాన్ హరిసింగ్ అంతటి ఔదార్యవంతుడు అంటే నమ్మలేకపోయాడు. అతడు ఎందరో పర్షియన్ ఆఫ్ఘన్ రాజుల చెంత పని చేశాడు. వారందరూ నరరూపరాక్షసులు, హింసాప్రియులు, పశుప్రవృత్తి కలిగినవారు, డబ్బుకోసం ఆడవాళ్లకోసం ఎంతటి ఘోరానికైనా వెనుదీయని వాళ్లే తప్ప హరిసింగ్ లాంటి వాడు ఒక్కడూ తారసపడలేదు. అతడి ప్రవర్తనను గూర్చి తన కూతురు మాటలు విన్న తరువాత హరిసింగ్ పై అతడికి ఏదో మూల గౌరవం కలిగింది.

నూర్ భాను తల్లుల ఆశ్చర్యానికి మేర లేకపోయింది. వారెరిగిన ప్రపంచంలో అటువంటి పురుషుడు ఒకడు ఉంటాడని వారు ఊహలో కూడా ఎరుగరు. ఎంతమంది స్తీలను తన జనానాలో చేర్చుకుంటే అంత గొప్ప మగవాడిగా కీర్తింపబడుతున్న వ్యక్తులను గూర్చి మాత్రమే వారు చిన్నతనం నుండి వింటున్నారు. అటువంటి గొప్పతనాలు తమకు కంపరం పుట్టించేవిగా ఉన్నప్పటికీ స్త్రీలకు, వారి భావాలకు, వారి మాటలకు ఏమాత్రం విలువనివ్వని సమాజంలో పుట్టిన దురదృష్టానికి గాను తమను తామే నిందించుకుంటూ నిస్సహాయులుగా బ్రతికేస్తున్నారు. హిందువులలో ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునిగూర్చి, భీష్ముడు వంటి ఆజన్మబ్రహ్మచారులను గూర్చి వారు విన్నారు గాని, కథలలో తప్ప అటువంటివారు నిజంగా ఉంటారని వారు ఎన్నడూ భావించలేదు. ఇప్పుడు హరిసింగ్ ప్రవర్తన తెలిశాక అటువంటి వ్యక్తి పెషావర్ పాలకుడుగా ఉండటం తమ అదృష్టంగా భావించారు.

నూర్ భాను సమచారాన్ని చారుల ద్వారా తెలుసుకున్న హరిసింగ్ ఆ మరుసటి రోజే కమాల్ ఖానును పిలిపించాడు. నూర్ భానుకు మీరు యోగ్యుడైన ఒక వరుని చూడండి. ఆమె పెండ్లి ఖర్చులన్నీ నేనే ఇస్తాను. మా తల్లిగారు ఎటువంటి భవనంలో ఉంటారో అటువంటి భవనం ఇస్తాను. మా తల్లిగారికి ఉన్న సౌకర్యాలన్నిటినీ నేనే కల్పిస్తాను అని సాదరంగా చెప్పాడు.

కమాల్ ఖాన్ ఈ విషయాన్ని నూర్ భాను తల్లులకు తెలుపగానే వారు ఎంతో సంతోషించారు. హరిసింగ్ అండ ఉండగా దోస్త్ మహమ్మద్ ఖాన్ భయం తమకు ఎంతమాత్రం ఉండదు!

సరిగా రెండు నెలలు తిరిగేసరికి నూర్ భానుకు గొప్ప అందగాడు, వీరుడూ అయిన ఒక పఠాన్ యువకునితో వివాహం జరిగింది. హరిసింగ్ పరివారం మొత్తం ఆ పెండ్లికి హాజరైనారు. పెషావర్ ప్రజలందరూ కమాల్ ఖాను కుటుంబాన్ని రాజబంధుకుటుంబంగా పరిగణించి గౌరవించసాగారు.

తాను అనుకున్నట్లు జరుకగపోయినా, తాను మాత్రం ఎంతో అదృష్టవంతుడినని కమాల్ ఖాన్ సంతోషించాడు. కాని అతడి సంతోషం ఎంతో కాలం నిలబడలేదు.

కాబూల్ నుండి ఒక రహస్యదూత వచ్చి కమాల్ ఖాన్ తనకిచ్చిన మాట నిలబెట్టుకోనందుకు గాను అతడికి దోస్త్ మహమ్మద్ ఖాను మరణశిక్ష విధించాడనే సమాచారం అందించాడు. అతడి క్రూరత్వాన్ని ప్రత్యక్షంగా ఎరిగిన కమాల్ ఖాను నిలువెల్లా వణికిపోయాడు.
“హుజూర్, అల్లాకీ కసం. నేను మాట తప్పేవాడిని కాను. నా కూతురు ద్వారా హరిసింగును చంపడానికి చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు మీకు అనిపించవచ్చును. కానీ, ఆ ప్రయత్నం చేయడం ద్వారా నేను హరిసింగుకు చాలా చేరువ అయ్యాను. అతడు నన్ను ఇపుడు నమ్ముతున్నాడు. కాబట్టి, త్వరలోనే హరిసింగును నేను మంచి అవకాశం చూసుకుని ఏదో ఒక విధంగా చంపగలను. నన్ను నమ్మండి” అంటూ మహమ్మద్ ఖానుకు రహస్యసందేశం పంపించాడు.

(ఇది మూడవ భాగం. తరువాత కథ నాల్గవ భాగంలో...)

మొదటిభాగం లింకు
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3757991060988213

రెండవభాగం లింకు
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3760406447413341


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...