Monday 22 March 2021

(బాఘ్ మార్ హరిసింగ్ నల్వా 3)


హరిసింగ్ ప్రతిరోజూ ఉదయమే షాహిబాగ్ కు వచ్చి ఏకాంతంలో జపజీ సాహిబ్ ను భక్తిశ్రద్ధలతో పఠిస్తాడు. ఆ సమయంలో ఒకరిద్దరు సైనికులు కొంత దూరంగా ఉంటారే తప్ప అతని చుట్టూ నిత్యం ఉండే పరివారం ఆ సమయంలో ఉండరు. ఆ తరువాత ఆ సమయంలో అక్కడకు వచ్చిన పౌరులు ఎవరైనా తనతో మాట్లాడదలిస్తే వారితో కొంతసేపు ముచ్చటిస్తాడు. ప్రజల కష్టసుఖాలను నేరుగా తెలుసుకునేందుకు, తన పరిపాలనలో ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకునేందుకు కూడా అది ఒక చక్కని అవకాశంగా కూడా హరిసింగ్ భావిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరైనా ఏదైనా తమకు కావాలని ఏదైనా అడిగితే కాదనకుండా వారికి సాయం చేస్తాడు లేదా దానం చేస్తాడు.


ఈ విషయం తెలిసిన కమాల్ ఖాన్ సరిగ్గా అటువంటి హరిసింగ్ అలవాటునే తన కోర్కె నెరవేర్చుకునేందుకు తగిన ఉపాయంగా మలచుకుందామనుకున్నాడు. అటువంటి సమయంలో నూర్ తనను పెండ్లి చేసుకొనమని అడిగితే హరిసింగ్ కాదనలేడని కమాల్ సింగ్ పన్నాగం. ఆవిధంగా అతడి ధర్మతత్పరతనే అతడి బలహీనతగా మార్చి దెబ్బ కొట్టాలని అతడు భావించాడు.

మొత్తానికి ఒక రోజు హరిసింగ్ జపజీ పఠనం పూర్తి చేసుకుని ప్రజలను కలుసుకునే సమయానికి తన కుమార్తె అయిన నూర్ భాను అక్కడకు వెళ్లేలా ఏర్పాటు చేశాడు.

హరిసింగ్ జపజీ పఠించి ప్రజలను కలుసుకునే స్థానానికి వచ్చాడు. ఆజానుబాహుడైన అతడి దేహం క్షత్రియోచితంగా అమితబలాఢ్యమై అలరారుతోంది. అతడు పిడికిలి బిగించి కొడితే ఎంతటి కఠినమైన పాషాణశిల అయినా ముక్కలు కావలసిందే అనిపిస్తుంది. పదేండ్ల వయసులోనే అమృతసంచార్ సంస్కారాన్ని పొందిన అతడు సమున్నతమైన తన శిరస్సుపై ధరించిన పగిడీ అతడి అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ ఉన్నది. గురువు అడిగితే తన తలను ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా సమర్పించడానికి సిద్ధం అనే ఖల్సా వీరుల ప్రతిజ్ఞకు గుర్తుగా ఆ పగిడీ ముందు భాగంలోనే ఎక్ ఓంకార్ చిహ్నమైన ఖండా, బసంతి-సుర్మయినీలం రంగులలో మెరుస్తూ అతడి ధీరత్వాన్ని తెలుపుతోంది. అతడి మీసాలూ గడ్డము తన ధర్మానికి తాను సుదీర్ఘకాలంనుండి అనంతకాలం వరకు కట్టుబడినట్టుగా పొడవుగా ఉన్నాయి. మెడ చుట్టూ అతడు ధరించిన హజూరీ ధవళకాంతులను వెదజల్లుతూ నిర్మలమైన అతడి మనస్సుకు ప్రతీకగా ఉన్నది. ప్రసన్నమైన అతని ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. అతని కండ్లు దయామృతరసాన్ని ఒలికిస్తూ ఉన్నాయి. అతడు నడుముకు ధరించిన కృపాణం దుష్టశిక్షణ చేసేందుకు అనుక్షణం సన్నద్ధమై ఉంటూ సజ్జనులకు అభయప్రదాయకంగా నయనానందకరంగా ఉన్నది.

“సూర్యసింగ్, ఈ రోజు వచ్చినవారిని తీసుకురా” అన్నాడు హరిసింగ్ అక్కడ ఉన్న తన అనుచరునితో.

“ఈరోజు ఒక్కరే వచ్చారు” అని తెలిపాడు సూర్యసింగ్.

“సరే. తీసుకురా”.

ఒక్క నిమిషంలో తన ముందుకు వచ్చి కొంత దూరంలో నిలబడిన వ్యక్తిని చూశాడు హరిసింగ్. ముదురునీలంరంగు దుస్తులలో మేలిముసుగు కప్పుకుని వచ్చిన ఒక యువతి. ఆమె ముఖం కనబడటం లేదు.

మొట్ట మొదటసారి హరిసింగ్ ను ప్రత్యక్షంగా చూసిన నూర్ భాను పరవశురాలైపోయింది. తన మనసులో అనునిత్యం మెదలుతూ ఉన్న ఆ ధీరగంభీరమూర్తి తాను ఊహించుకున్న దానికంటె నూరింతలు గొప్పగా ఉన్నాడు. ఆమె తనను తాను మరచిపోయి, అతడికి అభివాదం చేయడం కూడా విస్మరించింది.

ఒక స్త్రీ ఒంటరిగా ఏదో చెప్పుకోవాలని వచ్చిందంటే ఆమె నిస్సహాయురాలై ఉంటుందని, చాల చిక్కులలో ఉండి ఉంటుందని భావించి హరిసింగ్ మనసులోనే చాల వ్యాకులత చెందాడు.

“కూర్చోండమ్మా” అన్నాడు ఎంతో దయాపూర్ణమైన కంఠంతో.

నూర్ భాను కు అమ్మా అనే ఆ పిలుపు కర్ణకఠోరంగా వినిపించింది. అందరూ తనను పేరు పెట్టి పిలిచేవారు, లేదా బేటీ అని బెహన్ అని పిలిచేవారే తప్ప ఇలా ఆమెను మా అంటూ సంబోధించినవారు అంతవరకూ ఎవరూ లేరు. అటువంటిది తాను ఎవరిని తన ప్రియునిగా భావిస్తూ ఉన్నదో ఆ వ్యక్తి తనను అమ్మా అని పిలవడం ఆమెకు ఎంతో కష్టమనిపించింది.

“కూర్చోండమ్మా” అని మరోసారి అన్నాడు హరిసింగ్.

మరోసారి మరోసారి అమ్మా అని పిలిపించుకొనడం ఇష్టం లేక నూర్ భాను తటాలున కూర్చుంది. అయితే అక్కడున్న శిలాసనం మీద కాకుండా నేలపై తన మోకాళ్లమీద కూర్చుంది. వెంటనే హరిసింగ్ లేచి నిలుచున్నాడు.

“అమ్మా, మీరు ఇంత దీనంగా ఉండకండి, గురుసేవకుడూ రాజా రంజిత్ సింగ్ ఆజ్ఞాపాలకుడూ అయిన ఈ హరిసింగ్ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాడు. మీకు వచ్చిన ఎటువంటి కష్టాన్నైనా నేను తొలగిస్తాను. భయపడకుండా నేను మీకు ఏమి చేయగలనో చెప్పండమ్మా” అన్నాడు.

హరిసింగ్ నోటినుండి వెలువడుతున్న అమ్మా అనే పదం మాటిమాటికి ములుకుల్లా గుచ్చుకుంటూ ఉండగా నూర్ భాను ఏమీ మట్లాడలేక పోయింది. తనను పెండ్లాడమని అతడిని అడిగేందుకు ఆమె వచ్చింది. కాని పదే పదే హరిసింగ్ అమ్మా అమ్మా అంటూ ఉంటే తన కోరికను ఎలా చెప్పుకునేది అంటూ ఆమె మాటలాడేందుకు తడబడుతోంది. ఆమె మనసు ఆమెనే ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నది.

ఆమె ఎంతకూ తన మౌనాన్ని వీడి మాట్లాడకపోవడంతో తన కష్టాన్ని ఇతరుల ముందు చెప్పుకునేందుకు ఆమె సంకోచిస్తున్నదేమో అనే భావించి హరిసింగ్ సూర్యసింగును కాస్త దూరంగా పొమ్మని సంజ్ఞ చేశాడు.

సూర్యసింగ్ దూరంగా పోయాడు. కాని, మరీ దూరంగా కాదు. పరాఙ్ముఖుడై నిలబడినప్పటికీ చీమ చిటుక్కుమన్నా వినగలిగేంత జాగరూకతతో ఎవరైనా శత్రువు తన ప్రభువుకు అపకారం తలపెట్టే ఉద్దేశంతో మారువేషంలో వచ్చివుంటే, ఏమైనా ద్రోహం తలపెట్టదలిస్తే మెరుపులా అడ్డుపడి అతడి తలను ఒక్క వేటుతో ఎగురగొట్టగలిగినంత దూరంలోనే అప్రమత్తంగా ఉన్నాడు.

కాని, సూర్యసింగ్ దూరంగా పోయినప్పటికీ నూర్ భాను ఏమీ మాట్లాడలేక పోయింది. హరిసింగ్ వంటి వ్యక్తిని ఆమె ఇంతవరకూ తమ బంధువులలో గాని, పరిచయస్థులలో గాని ఎన్నడూ చూడలేదు. అటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడని ఆమె ఎన్నడూ విని ఉండలేదు. అసలు అలాంటి వ్యక్తిత్వం ఒకటి ఉంటుందని కూడా ఆమె ఎన్నడూ ఊహించి ఉండలేదు.

“చెప్పండమ్మా” అన్నాడు హరిసింగ్ మృదువుగా. “మీకు వచ్చిన కష్టం ఎటువంటిదైనా శాయశక్తులా తీరుస్తాను. ఆ కష్టాన్ని తీర్చలేకుంటే పెషావర్ పాలకుడనే ఈ పదవి నాకు తృణప్రాయమైనది. తత్క్షణమే వదులుకుంటాను” అన్నాడు. తాను ఆమె కోర్కెను తీర్చలేమోననే సందేహంతో ఆమె మాట్లాడటానికి సంశయిస్తుందేమోనని అతడు భావించాడు.

ఆ మాటలతో నూర్ భాను చలించిపోయింది. తన తండ్రి, ఇతర బంధువులు పదవీకాంక్షతోనే నిత్యం యుద్ధాలలో నిమగ్నమై నరమేధం చేస్తున్నారు. ఎంతోమందిని చిత్రహింసల పాలు చేస్తున్నారు. తమకు అనుకూలురు కానివారిని పదవీచ్యుతులను చేసేందుకు ఎంతో అసహ్యకరమైన కుట్రలు కుతంత్రాలు పన్నుతుంటారు. వారు నిత్యరక్తపిపాసులు. వారిలో ఎన్నడూ కూడా మనసా వాచా కర్మణా హరిసింగ్ వంటి ప్రశాంతుడైన ఒక్క మనిషిని కూడా తాను చూచి ఎరుగదు.

అంతవరకూ ఆమె ఊహాప్రపంచంలో హరిసింగ్ ఒక పురుషుడు, తాను ఒక స్త్రీ. అంతే. కాని, ఇప్పుడు హరిసింగ్ సమక్షానికి వచ్చాక, కేవలం ఒకటి రెండు మాటలలోనే అతడి మహోన్నతవ్యక్తిత్వం అర్థమైనాక ఆమెకు అతడు భగవత్స్వరూపంలా తోచాడు. అతడి పట్ల భక్తిభావం పెరిగింది. తాను అతడిని కోరదలచిన కోరిక చాల తుచ్ఛమైనదిగా అనిపించింది. అటువంటి కోరిక కోరమని తనను పంపిన తల్లిదండ్రులమీద ఆమెకు కోపం కూడా వచ్చింది.

కాని... కాని... “నీవు హరిసింగును కాకుండా ఇంకెవరిని నిఖా చేసుకున్నా దోస్త్ మహమ్మద్ ఖాన్ అతడిని చంపేసి నిన్ను ఎత్తుకుపోతాడు” అని తండ్రి చెప్పిన మాట గుర్తుకు రాగానే ఆమె భయంతో వణికిపోయింది. నెమ్మదిగా నోరు విప్పి అస్పష్టంగా చెప్పింది. “నాకు కుమారుడు కావాలి.”

వినీవినిపించకుండా ఆమె పలికిన మాటలు హరిసింగుకు అర్థం కాలేదు. “ఏమన్నారమ్మా?” అని స్పష్టతకోసం మరలా అడిగాడు.

“నేను మీవంటి కుమారుని కోరుతున్నాను” అన్నది నూర్ భాను నెమ్మదిగా, స్పష్టంగా.

ఆ మాటలు విని హరిసింగ్ ఒక్క క్షణం మౌనం వహించాడు. ఆ మాటలకు అర్థం ఏమిటో అతడికి తెలుసును. ఒక ప్రియురాలు తనను పెండ్లాడమని తన ప్రియుడిని అడిగే సందర్భంలో ఆ విధంగా పలుకడం ఆ ప్రాంతంలో ఒక వాడుక.

హరిసింగ్ ఎటువంటి బదులూ పలుకకపోయేసరికి నూర్ భాను నెమ్మదిగా తల ఎత్తి అతడి వైపు చూసింది. హరిసింగ్ మునుపటిలాగానే నిశ్చలంగా ఉన్నాడు. ఆమె మాటలు విన్న తరువాత కూడా అతడి మనస్సు వదనం రెండూ ప్రశాంతంగానే ఉన్నాయి. దూరంగా ఉద్యానంలో ఉన్న ఎత్తైన వృక్షాగ్రభాగాన్ని తదేకంగా చూస్తున్నాడు.

అతడి నిశ్చలత ఆమెకు కొంత భయం కలిగించింది. తనను అతడు తిరస్కరిస్తే తన గతి ఏమిటి? ఇతడు మాత్రమే తనను రక్షించగల ధీరపురుషుడు. వెంటనే “ప్రభుజీ” అని అతడిని సంబోధించింది. ఎటో ఉన్న అతడి చూపును తనవైపు మళ్లించుకునే ఉద్దేశ్యం ఆమెది.

హరిసింగ్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. వెంటనే ఆమె తన మేలిముసుగును తొలగించింది. “నీ అందానికి ఏ మగవాడైనా బానిస కాక తప్పదు” అని ఆమె తల్లిదండ్రులు ఆమెకు బాగా తలకెక్కించి పంపించారు. ఆ మాటలను నమ్మిన ఆ అమాయికురాలు వారి బోధనల ప్రకారమే ఆ విధంగా తన ముఖారవిందాన్ని తనవాడనుకున్న పురుషునికి చూపే ప్రయత్నం చేసింది.

ఒకే ఒక్క క్షణం ఆమె ముఖాన్ని చూసిన హరిసింగ్ వెంటనే మరలా తలను పక్కకు తిప్పుకున్నాడు. హరిసింగ్ చర్య నూర్ భానుకు శరాఘాతంలా తోచింది. తన అందచందాలపై ఆమెకున్న నమ్మకం నడిసముద్రంలో నావలా మునిగిపోయింది. కరువుకాలంలో చివరి గింజకూడా ఖర్చైపోయిన బికారిలా ఆమె నిస్సహాయురాలైపోయింది. ఆమె కండ్లలో నీళ్లు పెల్లుబికాయి. కంఠం గద్గదమైపోగా “ప్రభుజీ” అని అతి కష్టంగా పలికింది.

ఆమె కంఠంలోని ఆర్తస్వరాన్ని హరిసింగ్ గుర్తుపట్టగలిగాడు. ఈసారి తలతిప్పి ఆమెను భక్తి ఉట్టిపడుతుండగా చూశాడు. తాను కూడా నెమ్మదిగా మోకాళ్లమీద కూర్చున్నాడు. మరలా అలాగే ఆమెను సంబోధించాడు – “అమ్మా” అని.

“అమ్మా, నావంటి కుమారుడు ఎందుకమ్మా? ఇంతటివాడిని మీ ఎదురుగా నేనున్నాను. నన్నే మీ కుమారునిగా భావించండి. మిమ్మల్ని నేను నా మాతృమూర్తిగా భావిస్తున్నాను. మీరు కూడా కనికరించి నన్ను మీ కుమారునిగా స్వీకరించండి” అన్నాడు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ.

ఆ పదహారేండ్ల యువతి ఈ మాటలు విని కంపించిపోయింది. ఎంతటి మహోన్నతమూర్తి ఇతడు? ఇతడి చెంతకు తాను ఎంత హీనమైన కోరికతో వచ్చింది? బేలతనంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. గద్గదస్వరంతో ప్రభుజీ అని మాత్రం పలికింది.

“అమ్మా, నన్ను ప్రభుజీ అనకండి. నేను పెషావర్ లో అందరికీ ప్రభువును కావచ్చును గాని, మీకు, మా తల్లిగారికి మాత్రం కుమారుడనే. అందువల్ల మా తల్లిలాగానే మీరు కూడా నన్ను పుత్తర్ అని పిలవండి. బేటా హరీ అని పిలవండి” అన్నాడు హరిసింగ్.

ఎంతో మృదువుగా, దయాపూరితంగా అతడు పలికిన మాటలు వినేసరికి నేను చేయరాని తప్పు చేశాను అని తనను తానే నిందించుకుంటున్న నూర్ భాను మనసులోని అపరాధబావం సమూలంగా తొలగిపోయింది.
)))(((

జరిగిన విషయం తెలుసుకున్న కమాల్ ఖాన్ హరిసింగ్ అంతటి ఔదార్యవంతుడు అంటే నమ్మలేకపోయాడు. అతడు ఎందరో పర్షియన్ ఆఫ్ఘన్ రాజుల చెంత పని చేశాడు. వారందరూ నరరూపరాక్షసులు, హింసాప్రియులు, పశుప్రవృత్తి కలిగినవారు, డబ్బుకోసం ఆడవాళ్లకోసం ఎంతటి ఘోరానికైనా వెనుదీయని వాళ్లే తప్ప హరిసింగ్ లాంటి వాడు ఒక్కడూ తారసపడలేదు. అతడి ప్రవర్తనను గూర్చి తన కూతురు మాటలు విన్న తరువాత హరిసింగ్ పై అతడికి ఏదో మూల గౌరవం కలిగింది.

నూర్ భాను తల్లుల ఆశ్చర్యానికి మేర లేకపోయింది. వారెరిగిన ప్రపంచంలో అటువంటి పురుషుడు ఒకడు ఉంటాడని వారు ఊహలో కూడా ఎరుగరు. ఎంతమంది స్తీలను తన జనానాలో చేర్చుకుంటే అంత గొప్ప మగవాడిగా కీర్తింపబడుతున్న వ్యక్తులను గూర్చి మాత్రమే వారు చిన్నతనం నుండి వింటున్నారు. అటువంటి గొప్పతనాలు తమకు కంపరం పుట్టించేవిగా ఉన్నప్పటికీ స్త్రీలకు, వారి భావాలకు, వారి మాటలకు ఏమాత్రం విలువనివ్వని సమాజంలో పుట్టిన దురదృష్టానికి గాను తమను తామే నిందించుకుంటూ నిస్సహాయులుగా బ్రతికేస్తున్నారు. హిందువులలో ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునిగూర్చి, భీష్ముడు వంటి ఆజన్మబ్రహ్మచారులను గూర్చి వారు విన్నారు గాని, కథలలో తప్ప అటువంటివారు నిజంగా ఉంటారని వారు ఎన్నడూ భావించలేదు. ఇప్పుడు హరిసింగ్ ప్రవర్తన తెలిశాక అటువంటి వ్యక్తి పెషావర్ పాలకుడుగా ఉండటం తమ అదృష్టంగా భావించారు.

నూర్ భాను సమచారాన్ని చారుల ద్వారా తెలుసుకున్న హరిసింగ్ ఆ మరుసటి రోజే కమాల్ ఖానును పిలిపించాడు. నూర్ భానుకు మీరు యోగ్యుడైన ఒక వరుని చూడండి. ఆమె పెండ్లి ఖర్చులన్నీ నేనే ఇస్తాను. మా తల్లిగారు ఎటువంటి భవనంలో ఉంటారో అటువంటి భవనం ఇస్తాను. మా తల్లిగారికి ఉన్న సౌకర్యాలన్నిటినీ నేనే కల్పిస్తాను అని సాదరంగా చెప్పాడు.

కమాల్ ఖాన్ ఈ విషయాన్ని నూర్ భాను తల్లులకు తెలుపగానే వారు ఎంతో సంతోషించారు. హరిసింగ్ అండ ఉండగా దోస్త్ మహమ్మద్ ఖాన్ భయం తమకు ఎంతమాత్రం ఉండదు!

సరిగా రెండు నెలలు తిరిగేసరికి నూర్ భానుకు గొప్ప అందగాడు, వీరుడూ అయిన ఒక పఠాన్ యువకునితో వివాహం జరిగింది. హరిసింగ్ పరివారం మొత్తం ఆ పెండ్లికి హాజరైనారు. పెషావర్ ప్రజలందరూ కమాల్ ఖాను కుటుంబాన్ని రాజబంధుకుటుంబంగా పరిగణించి గౌరవించసాగారు.

తాను అనుకున్నట్లు జరుకగపోయినా, తాను మాత్రం ఎంతో అదృష్టవంతుడినని కమాల్ ఖాన్ సంతోషించాడు. కాని అతడి సంతోషం ఎంతో కాలం నిలబడలేదు.

కాబూల్ నుండి ఒక రహస్యదూత వచ్చి కమాల్ ఖాన్ తనకిచ్చిన మాట నిలబెట్టుకోనందుకు గాను అతడికి దోస్త్ మహమ్మద్ ఖాను మరణశిక్ష విధించాడనే సమాచారం అందించాడు. అతడి క్రూరత్వాన్ని ప్రత్యక్షంగా ఎరిగిన కమాల్ ఖాను నిలువెల్లా వణికిపోయాడు.
“హుజూర్, అల్లాకీ కసం. నేను మాట తప్పేవాడిని కాను. నా కూతురు ద్వారా హరిసింగును చంపడానికి చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు మీకు అనిపించవచ్చును. కానీ, ఆ ప్రయత్నం చేయడం ద్వారా నేను హరిసింగుకు చాలా చేరువ అయ్యాను. అతడు నన్ను ఇపుడు నమ్ముతున్నాడు. కాబట్టి, త్వరలోనే హరిసింగును నేను మంచి అవకాశం చూసుకుని ఏదో ఒక విధంగా చంపగలను. నన్ను నమ్మండి” అంటూ మహమ్మద్ ఖానుకు రహస్యసందేశం పంపించాడు.

(ఇది మూడవ భాగం. తరువాత కథ నాల్గవ భాగంలో...)

మొదటిభాగం లింకు
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3757991060988213

రెండవభాగం లింకు
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3760406447413341


No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...