Saturday 19 February 2022

ఉత్తరదక్షిణాలుగా భారతవర్షం



ఉత్తరదక్షిణాలుగా భారతవర్షవిస్తీర్ణం మత్స్యపురాణంలో చెప్పబడింది.
"ఆయతస్తు కుమారీతో గంగాయాః ప్రవాహావధి"
(మత్స్య.114.10)
కుమారీతో = కుమారీతః = కన్యాకుమారి నుండి
గంగాయాః ప్రవాాహావధి = గంగాపరీవాహకప్రాంతం (Water basin) మొత్తం.
కన్యాకుమారి భారతదేశపు దక్షిణాగ్రంలో ఉందని మనకు స్పష్టంగా తెలుసు.
కాని, గంగ అంటే నేటి పాఠ్యపుస్తకాలు చెబుతున్నట్లు గంగోత్రిలో పుట్టి బంగాళాఖాతం వరకు ప్రవహించే పుణ్యనది ఒక్కటే కాదు.
గంగకు సప్తస్రోతస్సులు (ఏడు ప్రవాహాలు) ఉన్నాయి.
పరమశివుడు తన శిరస్సునుండి గంగను బిందుసరస్సు వైపు విడిచాడు.
(విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి - అని రామాయణవచనం ప్రమాణం. బాలకాండం, 43.11)
ప్రస్తుతం బిందుసరోవరం అనే పేరిట భారతదేశంలో చాల క్షేత్రాలలో దేవాలయపుష్కరిణులు ఉన్నాయి. కాని, అవేవీ రామాయణంలో చెప్పబడిన బిందుసరస్సు కావు. బిందుసరస్సు అంటే హిమాలయాలలోని మానససరోవరమే. లేదా నేడు మానససరోవరం ఉన్న అప్పటి ప్రాంతం బిందుసరస్సు అనే పేరింట వ్యవహరింపబడుతూ ఉండవచ్చు.
ఒక దేశం పేరిట ఒక జలాశయం ఉండటం, లేదా ఒక జలాశయం పేరిట ఒక దేశం ఉండటం ఈరోజున కూడా మనం గమనించగలం, బెంగాల్ పేరిట ఒక సముద్రాన్ని మనం బే ఆఫ్ బెంగాల్ గా వ్యవహరిస్తున్నాం. అరేబియా దేశం పేరిట అరేబియా సముద్రం ఉన్నది. భారతదేశం పేరిట Indian Ocean ఉన్నది. అలాగే బిందుసరోవరం ఉన్న విశాలభూభాగాన్ని ఆ రోజున బిందుసరోవరంగా వ్యవహరించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
అక్కడనుండి గంగ ఏడు పాయలుగా విడిపోయిందట.
తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే (రా.బా.43.12)
బిందుసరస్సు ప్రాంతం నుండి తూర్పుదిశగా -
1 హ్లాదిని, 2 పావని, 3 నళిని
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.12)
{ఇవన్నీ ప్రాచీనమైన పేర్లు. ఇందులో ఒకదానిని మనం ఇపుడు బ్రహ్మపుత్రగా పిలుస్తున్నాం. మిగిలిన రెండూ నేటి సాల్వీన్ (Salween) మెకాంగ్ (Mekong) నదులు కావచ్చు.}

బిందుసరస్సు ప్రాంతం నుండి పడమటిదిశగా -
1 సుచక్షువు 2 సీత 3 సింధు
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.13-14)
{వీటిలో సింధునది ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధమే.}

సింధు పరీవాహకప్రాంతం

సింధునది - నేటి భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో


బిందుసరస్సు ప్రాంతం నుండి మొదట దక్షిణదిశగా, అక్కడనుండి మరలా తూర్పు దిశగా భాగీరథి పేరిట మరొక పాయ ప్రవహించింది. (రా.బా.43.14)

భాగీరథి


మొదట చెప్పినట్టుగా ఈ సప్త గంగా స్రోతస్సుల ప్రవాహావధి – (అంటే సమస్తపరీవాహకప్రాంతం) అంతా భారతవర్షమే. అంటే నేటి మానససరోవరప్రాంతం, అలాగే నేడు టిబెట్ అని పిలవబడుతున్న ప్రాంతం మొత్తం భారతవర్షమే. అలాగే టిబెట్ లో పుట్టిన సాల్వీన్ (Salween) నది ప్రవహిస్తున్న బర్మా, థాయిలండ్ ప్రాంతాలు, టిబెట్ లో పుట్టిన మెకాంగ్ (Mekong) ప్రవహిస్తున్న లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాల ప్రాంతాలు ఇవన్నీ ఒకనాడు భారతవర్షంగానే పిలువబడిందని భావించవచ్చు. ఈ నదులు ఆ ప్రాంతాలలో ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రవహించినట్లుగా కనబడినప్పటికీ, కన్యాకుమారి ప్రాంతం నుండి చూస్తే ఆ విశాలమైన పరిధిలో అవి తూర్పుకు ప్రవహించినట్లుగానే గోచరిస్తాయి. అవన్నీ చివరకు కలిసేది కన్యాకుమారికి తూర్పున ఉన్న సముద్రంలోనే.

బ్రహ్మపుత్ర పరీవాహకప్రాంతం


సాల్వీన్ పరీవాహకప్రాంతం


మెకాంగ్ పరీవాహకప్రాంతం

ఈనాటికి కూడా ఆ ప్రాంతాలలో రామాయణభారతాల కథలు ప్రచారంలో ఉండటం, అక్కడి రంగస్థలాలపై ఇప్పటికీ ఆ కథలు నాటకాల రూపంలోనూ నృత్యాల రూపంలోనూ ప్రదర్శింపబడుతూ ఉండటం, ఇప్పటికీ పురాణపురుషుల పేర్లను తమ సంతానానికి ఆక్కడి ప్రజలు పెట్టుకుంటూ ఉండటం, అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాలు అక్కడ ఉండటం అందుకు సజీవసాక్ష్యాలుగా మనం పరిగణించవచ్చు.
ఇంతటి విశాలమైన ప్రాంతాన్ని అంతటి ప్రాచీనకాలంలోనే భారతవర్షమనే పేరిట వ్యవహరించారు. కాని కొందరు అజ్ఞానులు మాత్రం బ్రిటిషువాళ్లు వచ్చి కలిపేదాకా భారతదేశంలో సాంస్కృతికసమైక్యత లేదన్నట్లు మాట్లాడటం ఎంతటి తెలివితక్కువతనం!
మాఘకృష్ణచతుర్థీ, ప్లవః
శ్రీనివాసకృష్ణః

#Mekong 

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/4816802028440439


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...