Friday 29 March 2019

మామా అల్లుళ్ల సవాల్

By శ్రీనివాసకృష్ణ
***

టేబుల్ మీద వైబ్రేషన్.
వెంటనే ఫోను లోనుంచి పాట.
కల యిదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే.
చూస్తే ఏదో అన్ నోన్ నంబర్.
*
😎
హలో? ఎవరదీ?
🤥
అల్లుడూ, నేను!
😎
ఎవరు? గొత్తు చిక్కలే?
🤥
నేను అల్లుడూ, మీ సెంద్రాలు మామని!
😎
ఓ! మామా! మీరా! ఎన్నాళ్లైంది మీరు ఫోన్ చేసి! బాగున్నారా?
🤥
నేను చేయకపోతేనేం? నువే చేయచ్చుగా అల్లుడూ?
😎
2014లో మీరు గెలిచినాక ఫోన్ నంబర్ తో సహా అన్నీ మార్చిపారేశారు. ఎలా చేసేది మామా?
🤥
అంటే, మా సెక్యూరిటీ ఆఫీసరు అలా మార్చమని సలహా ఇచ్చారులే అల్లుడూ. నీకు కొత్త నంబరు ఇవ్వడం మర్చిపోయాను.
😎
ఆ తరువాత మళ్లీ 2019లోనే గుర్తొచ్చానా మామా?
🤥
అంతమాట అనకు అల్లుడూ!
😎
సరేలే మామా! చెప్పండి, ఏమిటి విశేషాలు?
🤥
ఏమీ లేదల్లుడూ! నిద్ర పట్టక ఫోన్ చేశాను. అంతే.
😎
నిజంగా అంతేనా మామా? 😄
🤥
నిజమే అల్లుడూ, అరె, అలా ఎందుకు నవ్వుతావు?
😎
మరి కొన్ని రోజుల్లో కురుక్షేత్రయుద్ధం ప్రారంభం కానుండగా ధృతరాష్ట్రుడు కూడా విదురుడితో ఇదే మాట అన్నాడు మామా. అది గుర్తుకు వచ్చింది.
🤥
ఏమన్నాడు?
😎
"విదురా విదురా, నాకు నిద్ర పట్టటం లేదు, నా మనశ్శాంతి కోసం కొన్ని మంచి మాటలు చెప్పవయ్యా" అన్నాడు.
🤥
మరి విదురుడు ఏం చెప్పాడు?
😎
అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనమ్।
హృతస్వం కామినం చోరమ్ ఆవిశంతి ప్రజాగరాః।।
🤥
ఏమీ అర్థం కాలేదు అల్లుడూ.
😎
"బలవంతుడితో పెట్టుకున్న వాడికీ, గెలిచేందుకు ఎటువంటి సాధనాలూ లేని బలహీనుడికీ, సొమ్ము పోగొట్టుకున్నవాడికీ, కాముకుడికీ, దొంగకూ నిద్ర పట్టదు" అని అర్థం మామా.
🤥
అంటే నువ్వు కూడా నన్ను దొంగ అంటావా అల్లుడూ?
😎
అది కాదు మామా! నీకు మోడీ డబ్బులు ఇచ్చాడు. అభివృద్ధి చేసుకో అన్నాడు. లెక్కలు చెప్పమన్నాడు. చెప్పాలి కదా? చెబితే సరిపాయె కదా? ఆ కత ఆనాడే ముగిసిపోతా ఉండె కదా? ఆమాత్రం దానికి నువ్వు ఆయప్పని నానా తిట్లు తిట్టి, తెగతెంపులు చేసుకుంటివి కదా? పైగా అదేదో పెద్ద ఘనకార్యమన్నట్లు, లెక్కలు చెప్పకుండా తప్పిచ్చుకొనేది నీకు తప్ప ఇంకెవడికీ చేతకాని పెతాపం అన్నట్లు రాధాకృష్ణ రామోజీ రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి మొదటి పేజీల్లో ప్రజలకు చాటింపు చాటింపు వేసి పెట్టినారు కదా? అట్లా ఏ పిచ్చోడైనా నేను దొంగని నేను దొంగని అని సొంత పేపర్లలో రాపిచ్చుకుంటాడా? ఆ విధంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ అందరికీ బ్రెయిన్ వాష్ చేసి నేను దొంగను అని ఎందుకు రాపించుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కాదు మామా! మీ సెంద్రాలు మామ దొంగ అటగా? రోజూ వాళ్ల పేపర్లలోనే రాస్తున్నారు అని జనాలు నన్ను మొహం మీదనే అడుగుతూ ఉంటే మొహం యాడ బెట్టుకోవాల్నో నాకు అర్థం కాలే!
🤥
కేంద్రంలో సోనియాను ఎదిరిచ్చిన మొనగాడు జగన్ అని అందరూ ఆ పిల్లోన్ని పొగడతా ఉంటే, కేంద్రంలో మోడీని ఎదిరిచ్చిన చంద్రబాబు అని నేను కూడా అనిపిచ్చుకుందామని అట్లా రాపిచ్చుకున్న్యాను అల్లుడూ!
😎
అదా అసలు సంగతి! 😅😂🤣 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్ల అయింది కద మామా నీ కత!
🤥
అదేంటి అల్లుడూ అట్లా అంటివి?
😎
కాదా మామా? జగన్ ఎదిరిచ్చినాడు అంటే దానికో లెక్క ఉంది. తన పదవులకు రాజీనామా చేసినాడు. అన్ని పార్టీలకు ఒంటరిగా ఎదురొడ్డి నిలిచి, ఐదులక్షల మెజారిటీ తెచ్చుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టి రిమాండులో వేసి పదహారు నెలలు బయటి ప్రపంచంంలో అడుగు పెట్టనివ్వక పోయినా అదరలేదు, బెదరలేదు. ఆ తరువాత ఆ కేసులన్నీ ఒకొక్కటీ తప్పుడు కేసులని, కేవలం దురుద్దేశంతో పెట్టినవనీ తేలిపోతున్నాయి. అతడిని మీరు దొంగ అన్నారు. పొగరు అన్నారు. దురాశ అన్నారు. అధికారలాలస అన్నారు. ఐదేళ్ల నుండి మీరు, మీ మీడియా, మీరు చెప్పిన ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మే మీ పార్టీకార్యకర్తలు, మీ సోషల్ మీడియా సైన్యము, ఇంకాా మిగిలిన మీ మిత్ర పార్టీలు, మీ శత్రు పార్టీలు, మీ పార్ట్ నర్లు ఎంతలా అపహాస్యం చేస్తూ అవమానించినా, అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ధైర్యం కోల్పోలేదు. పోరాడుతున్నాడు. ఈరోజు మీకు నిద్రపట్టకుండా చేశాడు.
🤥
అల్లుడూ, అక్కడితో ఆపు. నా శత్రువును నా ముందే పొగడుతావా?
😎
పొగుడుతున్నానా? జనాలందరూ ఏమనుకుంటున్నారో చెబుతున్నాను. సరేలే మామా! నీ శత్రువును నీముందే తిట్టేవాళ్లు ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు. వాళ్లతో మాటాడుకో. ఫోన్ పెట్టేస్తాను.
🤥
అల్లుడూ, ఆగాగు! మరి నా పోరాటం గురించి చెప్పవా?
😎
నీ మీడియా మొత్తం నువ్వు ఎందుకు లెక్కలు చెప్పాలని నీ తరపున పోరాడిందిగా? కొత్తగా నేను చెప్పేదేముంది?
🤥
అయినా, నేను మంచి పనులు చేశానుగా అల్లుడూ?
😎
ఏమి చేశావు?
🤥
ఎన్టీయార్ వైద్యశ్రీ...
😎
ఆరోగ్యశ్రీ పేరు మార్చావు. అంతేగా? పోనీ అదైనా సరిగా చేశావా? బిల్లులు కట్టడం మానేసి డాక్టర్లందరి చేత తిట్లు తిన్నావు. 108 అంటే అందరికీ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తాడని ఆ వాహనాలన్నిటినీ మూలబడేశావు.
🤥
అన్న క్యాంటీన్ పెట్టించాగా?
😎
భోజనం ఖర్చు ఎనబై రూపాయలు కదా?
🤥
అదేంటి అల్లుడూ? జనాల దగ్గర్నుండి ఐదు రూపాయలే తీసుకుంటున్నాం కదా? మిగిలిన సొమ్ము ప్రభుత్వమే భరిస్తుంది కదా?
😎
అవును. ప్రభుత్వమే ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఆ క్యాంటీన్లు నడిపే మీ పార్టీ వాళ్లకి ఇస్తుంది. ప్రభుత్వం దగ్గరున్నది మీ సొంత సొమ్మా? డైరెక్టుగా ఇస్తే తిడతారు కాబట్టి ఇండైరెక్టుగా ఇప్పిస్తున్నావు.
🤥
ఇండ్లు కట్టిచ్చినాం కదా?
😎
ఎవరికీ? మీ పనులన్నీ చేసిపెట్టే మీ పార్టీ కార్యకర్తలకా? పైగా ఆ ఇండ్ల గుంపులకు దేవాన్షు కాలనీ లాంటి పేర్లా? అసలు అవన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతో కట్టినవి కదా? ఆ మాట యాడా చెప్పరేం? పైగా అసలు వాళ్లు నిధులే ఇవ్వలేదు అంటూ అల్లరి అల్లరి చేస్తారా? పెట్టే చేయికి వాత పెట్టి తప్పు వారిదే అంటారా? ఏమిటి మామా ఈ వయసులో మీకు ఈ ఆకతాయితనం?
🤥
అన్నిటిలోనూ ఇలా తప్పు పడితే ఎలా అల్లుడూ?
😎
అదేంటి మామా? నేను తప్పు అని ఎప్పుడన్నాను? జరుగుతున్న విషయం చెప్పగానే మీరు చేస్తున్నది తప్పు అని మీ అంతరాత్మే మీతో పలికించింది.
🤥
అమరావతి కడుతున్నాగా? పోలవరం కడుతున్నాగా?
😎
ఎందుకులే మామా గ్రాఫిక్కులు? కట్టి చూపించు. నీ మంచి కోరి చెబుతున్నాను. అప్పుడు మాటాడుకుందాం. ఇప్పుడే మాట్లాడ్డం మొదలు పెడితే నువ్వు జన్మలో మళ్లీ నిద్ర పోలేవు.
🤥
అయితే కట్టి చూపిస్తా. మళ్లీ బాబు రావాలి అని అందరికీ చెప్పు అల్లుడూ. వస్తేనే కదా కట్టేది?
😎
నేను చెబితే జనాలు వింటారా మామా? వినేట్టు ఉంటే ఈ ఐదేండ్లు నాకు ఫోన్ చేయకుండా వదిలేసేవాడివేనా మామా?
🤥
అల్లుడూ, సరైన సమయం చూసి వెన్నుపోటు పొడుస్తున్నావు కదా?
😎
నువ్వు యాడున్నావు, నేను యాడున్నాను మామా పొడిసేకి? ఇట్లా మాటలు నాతో మాట్లాడొద్దు. ఫోన్ పెట్టేయ్.
🤥
అల్లుడూ, ఐదేండ్లు గడిసినంక ఫోన్ జేసినా. మాట్లాడతా ఉంటే ఫోన్ పెట్టేస్తా అనడం నీకు న్యాయమా?
😎
సరే, చెప్పు మామా!
🤥
మీ రాయలసీమ చివరి గ్రామానికి నీరు పారిచ్చినా. అదైనా చెబుతావా పోనీ?
😎
చివరిగ్రామానికి నీరిచ్చినా అనే ప్రచారం చేసుకొనడం కోసం మధ్యలో వేలాది గ్రామాలను ఎందుకు వదిలేశారు మామా? సెంటు పూసుకుని, అదే స్నానమంటే నమ్మడానికి మా రాయలసీమ జనాలు ఏమైనా పిచ్చోళ్లా? వాళ్లకు కండ్లు లేవా? నేను చెబితే నమ్మేయడానికి?
🤥
రాయలసీమ వాళ్లు నమ్మొద్దు లేబా. కోస్తా వాండ్లు నమ్ముతారుగా? వాళ్లు అవన్నీ యాడ చూసొచ్చినారు? నిజమే అనుకుంటారు.
😎
రాయలసీమలో నీరు పారితే కోస్తా వాళ్లు చూడలేరు. కాని, పోలవరం పూర్తి అయిందో లేదో కోస్తా వాళ్లకు తెలియదా? కోస్తా వాళ్లు ఏమైనా పిచ్చోళ్లా? వాళ్లకు కండ్లు లేవా? నేను చెబితే నమ్మేయడానికి?
🤥
అల్లుడూ, నీకు రాజకీయాలు తెలియవు, చెబితే అర్థం చేసుకోవు. రాయలసీమలో పూర్తి అయిందని కోస్తా వాళ్లకు చెప్పాల. కోస్తాలో ఐపోవచ్చిందని రాయలసీమలో చెప్పాల.
😎
అవన్నీ చెప్పడానికి నీకు రామోజీ ఉన్నాడు, రాధాకృష్ణ ఉన్నాడు. మధ్యలో నేనెందుకు మామా, బక్క ప్రాణాన్ని? పైగా ఇలాంటివన్నీమీ ఎన్నికల ప్రకటనలలో జనాలను కొట్టించి కొట్టించి మరీ చెప్పిస్తున్నావటగా మామా? అలా ప్రకటనలలో మీవాళ్లు జనాలను కొడుతుంటే అందరికీ చింతమనేని గుర్తొస్తున్నాడంట.
🤥
అల్లుడూ, ఎన్నికల ప్రకటనలు బాగులేవా అయితే?
😎
మాకు ప్రాంతీయ భేదాలు లేవు అని ప్రకటనలలో ఎందుకు చెప్పించుకున్నారు మామా? యాడో తునిలో రైలు తగలబెడితే, రాయలసీమనుండి గూండాలు వచ్చి తగలబెట్టినారు అని అప్పుడు చెప్పినావే? అది అందరికీ గుర్తొచ్చింది. మాకు కులభేదాలు లేవు అని ఎందుకు చెప్పించుకున్నారు మామా? ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరన్నది అందరికీ గుర్తుకొచ్చింది. న్యాయమూర్తులుగా బీసీలు ఉండడానికి తగరు అని మీరన్నది అందరికీ గుర్తుకు వచ్చింది. పార్టీలకు అతీతంగా అందరికీ మేలు చేస్తామని ఎందుకు చెప్పించుకున్నారు మామా? స్వయంగా గౌరు చరితమ్మ వచ్చి అడిగితే నువ్వు ఇంకో పార్టీ కాబట్టి నేను పని చేయను పో అని మీరే స్వయంగా చెప్పుకున్నారు. ఇంకా...
🤥
అల్లుడూ, చాలు, చాలు, ఇంక ఆపు. నేనేదో బుద్ధి తక్కువై నీకు ఐదేండ్లపాటు ఫోన్ చేయలేదే అనుకో? నువ్వైనా స్వయంగా రావచ్చు కదా? మామా నువ్విట్లా తప్పులు చేస్తున్నావు అని ముందే చెప్పొచ్చు కదా?
😎
అంత మాట అనకు మామా. నీకు ప్రేమలు లేకపోవచ్చు గాని, నాకు ఉండవా మామా? వచ్చినా మామా, నేను వచ్చినా. మిమ్మల్ని ఈ కండ్లతో ఒక్కసారి చూసిపోదామని వచ్చినా. కాని, అప్పుడు మీరు దేశాభివృద్ధి కోసం చాలా బిజీ బిజీగా ప్రపంచమంతా స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ ఉన్నారు మామా. మొదటి సారి వస్తే మీరు సింగపూర్ వెళ్లారట. రెండో సారి వస్తే చైనా జపాన్ వెళ్లారట. మూడోసారి వస్తే కజకస్తాన్ వెళ్లారట. నాలుగోసారి వస్తే టర్కీ వెళ్లారట. ఐదోసారి వస్తే లండన్ వెళ్లారట. ఆరోసారి వస్తే దావోస్ వెళ్లారట. ఏడోసారి వస్తే ...
🤥
అల్లుడూ ఆపేయ్. ఆపేయ్. చాలు. చాలు లిస్టు చదవకు.
😎
సరే మామా. కాని, ఇది గమనించారా మామా? మీరు తిరిగిన దేశాల లిస్టు చెబితే నాకు అలసట వచ్చింది, చివరకు మీకే చిరాకు వేసింది. ఇన్ని దేశాలు తిరిగారు కదా, ఆ అభివృద్ధి ఏదీ? ఎక్కడా కనబడటం లేదే? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా.
🤥
జనాలు ఆశ్చర్యపోతున్నారా? శభాష్. ఇంత సేపటికి ఒక్క మంచి మాట చెప్పావ్.
😎
జనాలు ఆశ్చర్యపోతున్నారు అంటే మీకు సంతోషం కలిగిందా మామా? మీకు అలా అర్థమైందా మామా? అయితే జనాలు ఆశ్చర్యపోతున్న విషయాలు మీకు మరి కొన్ని చెప్పనా?
🤥
చెప్పు అల్లుడూ, నేను అందుకోసమేగా ఫోన్ చేసింది. నీ ఫీడ్ బ్యాక్ కోసం!
😎
మీరు ప్రతియేటా వైజాగ్ లో పెట్టుబడుల సమ్మేళనాలు నిర్వహించారు కదా? ఏటేటా కనీసం పదిలక్షలకోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేవారు కదా? మరి, ఈ ఐదేండ్లకాలంలో యాభైలక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా? కనీసం కోటికొక ఉద్యోగం వచ్చినా యాభైలక్షలమందికి ఉద్యోగాలు రావాలి కదా? అవన్నీ యాడ వచ్చినాయ్? ఎవరికొచ్చినాయ్? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా!
🤥
వెరీ గుడ్. కోస్తాలో వచ్చినాయని రాయలసీమ వాళ్లకి చెబుదాం, రాయలసీమలో వచ్చినాయని కోస్తాలో వాళ్లకి చెబుదాం. ఇంకా?
😎
పెనుగొండలో కియా కియా అనుకుంటూ ఆమధ్య హడావుడి చేశారు. ఆ తరువాత చడీ చప్పుడు లేదు. ఆ కియా కంపెనీ కార్లు యాడ్యాడా రోడ్ల మీద కానరావటం లేదు ఏమైందబ్బా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా.
🤥
వెరీ గుడ్. అక్కడ తయారు అవుతున్న కార్లన్నీ ఒక్కటి కూడా మిగలకుండా విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయని అందరికీ చెప్పుకోవచ్చు. ఇంకా?
😎
మామా. నువ్వు సూపర్ మామా. నువ్వు చాణక్యుడివి మామా. నువ్వు మాకియవెల్లీవి మామా. నువ్వు అది మామా. నువ్వు ఇది మామా. సంక్షోభాలనుండి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారే, అది ఎలా సాధ్యం అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని మామా. అది ఎలానో నాకు ఇప్పుడే కొద్దికొద్దిగా తెలుస్తోంది మామా. మీలాంటి మహాత్ములతో మాటలాడితే వేరే చదువులు ఎందుకు మామా? ఈ ఐదేండ్లలో మీరు ఎంతో ఎదిగిపోయారు మామా. ఈ ఐదేండ్లు మీతో మాట్లాడకుండా దూరంగా ఉండడం వల్ల, నేను ఎంతటి మేధావి యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోయానో, మరెంతటి విజ్ఞానాన్ని కోల్పోయానో తలచుకుంటూ ఉంటే నా కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి మామా. కనిపిస్తున్నాయా మామా?
🤥
ఫోన్లో ఎట్లా కనబడతాయిరా బడుద్దాయ్?
😎
నేను కాస్త పొగిడేసరికి నాకు అల్లుడు స్థానం నుంచి బడుద్దాయ్ స్థానానికి ప్రమోషన్ ఇచ్చేశావా మామా?
🤥
సరే సరే, తరువాత ఏడుద్దువు గాని, ఇంకా? జనాలు ఆశ్చర్యపోతున్న విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా?
😎
ఉంకొక్కటుంది మామా. మీరు సత్య నాదెండ్లను మైక్రోసాఫ్ట్ సీయీవో గా చేశారు. సింధు చేత ఒలింపిక్ మెడల్ గెలిపించారు. అబ్దుల్ కలాం ను, అలెగ్జాండర్ ను రాష్ట్రపతులుగా చేశారు. అప్పుడు వాజ్ పాయిని, రీసెంటుగా మోడీని ప్రైం మినిస్టర్లుగా చేశారు. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు. జగన్ ను కనీసం ప్రతిపక్షనేతగా అయినా చేశారు, ఇంతమందికి ఇంత ఉపకారం చేసిన మీరు, మీ కొడుకును మాత్రం మాట్లాడ్డం కూడా చేతకానివాడిగా ఎందుకు తయారు చేసి వదిలేశారని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా.
🤥
*******
😎
మామా?
🤥
*******
😎
హలో హలో, మామా, ఏడుస్తున్నావా మామా?
🤥
నోర్ముయ్. నేను ఏడవడమేంది? ఫోన్లో నీకేమైనా కనిపించిందా?
😎
వెక్కిళ్లు వినిపిస్తున్నాయి మామా! అందుకని అలా అనుకున్నాను. చూడండి పాపం, మీ గొంతు కూడా బొంగురు పోయింది!
🤥
నోర్ముయ్ వెధవా. ఆ వినుకొండ వీడియో చూసినతరువాత నేను నిద్రపట్టక చస్తూ నీకు ఫోన్ చేస్తే, ఓదార్చవలసింది పోయి, వెక్కిరిస్తావా?
😎
ఓదార్పా? మీకు ఓదార్పు ఇష్టమేనా మామా? మీరు ఓదార్పును వెక్కిరిస్తూ ఆమధ్య ఉపన్యాసాలిచ్చేవారు కదా?
😡😠
ఏయ్? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఏం తమషాలుగా ఉందా నీకు? నేను తలచుకుంటే నువ్వు యాడుంటావో తెలుసా నీకు? నాతో పెట్టుకోకు. ఫినిష్ చేసేస్తా.
😰
స స స సార్.... మి మి మి మీరు... మీరు మా మామ అనుకున్నా సార్. లేకపోతే నాకు అంత ధైర్యం యాడిది సార్.
😡😠
పెట్టేయ్‌రా ఫోను.
*
ఠక్కున పెట్టేశా.
ఇంకా గుండెలు గుబగుబలాడుతున్నాయి.
ఇంతలోనే మళ్లీ వైబ్రేషన్.
మళ్లీ ఫోను మ్రోగింది.
మళ్లీ పాట వచ్చింది.
భయపడుతూనే ఫోన్ ఎత్తా.
మళ్లీ మా మామే.
*
🤥
అల్లుడూ?
(గొంతు చాల మృదువుగా ఉంది.)
😰
ఆ మామా... సారీ... సారీ.... సారీ సార్. అలవాటైపోయి పొరబాట్న మామా అనేశా సార్.
🤥
సరే అల్లుడూ, మన సంభాషణను నువ్వు రికార్డు చెయ్యలేదు కదా?
😰
లేదు మామా. సారీ సార్, లేదు సార్.
🤥
జాగ్రత్త. చూసుకో. రికార్డు అయి ఉంటే డిలీట్ చేసేయ్. అందరికీ మంచిది.
😰
సరే మా.. సారీ, సరే సార్. తప్పకుండా సార్.
🤥
ఒకే. (ఫోన్ కట్టైంది.)
*
మా మామ సారీ, సారు, నాకు కొత్త ఐడియా ఇచ్చాడు. మా సంభాషణ ఆటో రికార్డు ఏమైనా అయిందా అని చూశాను.
కాలేదు.
నా దురదృష్టం.
నాకు కల వచ్చిందనుకుంటారు.
నాకు కాల్ వచ్చిందంటే నిజమని ఎవరూ నమ్మరు.
పోన్లే.
గతం గతః.
ఎవరు నమ్మితేనేం, నమ్మకపోతేనేం?
జరిగేది జరిగి తీరుతుంది.
😷😷😷

Tuesday 26 March 2019

సంతృప్తి లేని రాజు


డా|| పాటీలు శ్రీనివాసకృష్ణ

          పూర్వం సదయుడు అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి విమలుడు అనే కుమారుడు ఉండేవాడు.  ఒక సమయం వచ్చేసరికి, సదయుడు తనకు వార్ధక్యం వచ్చిందని అర్థం చేసుకుని, విమలుడు రాజ్యపరిపాలనకు సమర్థుడు అని భావించి, అతడికి పట్టాభిషేకం చేశాడు.  పిమ్మట రాజధానికి దూరంగా, ఒక వనంలో తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు. తన కుమారుని రాజ్యపాలనావిశేషాలను గూర్చిన సమాచారం ఎప్పటికప్పుడు అతనికి తెలుస్తూనే ఉండేది.

          తాను నేర్చిన మంచి విద్యల ప్రభావం వలన విమలుని పాలన మొదట సక్రమంగానే ఉండింది.  కాని, అతడి చుట్టూ క్రమంగా కొందరు దుష్టమంత్రులు చేరారు.  అసంతుష్టో ద్విజో నష్టః, సంతుష్టస్తు మహీపతిః” (సంతృప్తి లేని ద్విజుడు నశిస్తాడు, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు) అని పెద్దలు చెప్పిన సుభాషితాన్ని అతనికి చెప్పి, “రాజు తనకున్నదానితోనే సంతృప్తి చెందితే నశించిపోతాడు, అందువల్ల మరింత అధికంగా సంపదలను పొందేందుకు ప్రయత్నించాలిఅని ఉపదేశించారు.

          దానితో విమలుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.  అందుకు పెద్ద సైన్యం అవసరం.  ఆ సైన్యాన్ని పోషించేందుకు పెద్ద మొత్తంలో ధనం అవసరం.  అందువల్ల, ధనాన్ని సేకరించేందుకు గాను ప్రజలపై క్రొత్త క్రొత్త పన్నులు విధించి, వసూలు చేయసాగాడు.  ప్రజలలో రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

          ఇది తెలుసుకున్న సదయుడు ఆందోళన పడి, తన కుమారుని రమ్మని కబురు చేశాడు.  విమలుడు అడవికి వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు.  తన కుమారుని ఉద్దేశాన్ని కనుగొని, సదయుడు విచారం వ్యక్తం చేశాడు. 

          “నాయనా, పరాక్రమం చూపడం, యుద్ధం చేయడం క్షత్రియధర్మమే.  నేను కాదనను.  కాని, సాధారణపరిస్థితులలో స్వదేశాన్ని కాపాడుకొనేందుకు యుద్ధం చేయడం మాత్రమే ధర్మం.  అసాధారణపరిస్థితులు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి.  ఇతరరాజులు అధర్మపరులైనపుడు ధర్మరక్షణకు గాను వారిపై యుద్ధం ప్రకటించవచ్చు.  విదేశాలలో రాజు క్రూరుడై, ప్రజాసంక్షోభకారకుడు అయినపుడు, ఆ ప్రజలను సంరక్షించేందుకు దండయాత్ర చేయవచ్చు.  లేదా, సువిశాలమైన దేశంలో, ఆయా రాజ్యాల రాజులు నిష్కారణంగా కలహించుకుంటూ అలజడులు రేకెత్తిస్తున్నపుడు, వారినందరినీ అదుపులో ఉంచేందుకుగాను అశ్వమేథం వంటి యాగాలు కూడా చేయవచ్చును.  కాని, ఇటువంటి కారణాలు ఏమీ లేకుండా, స్వయంగా నువే, దురాశతో, ఇతరదేశాలమీదకు దండెత్తి ఆక్రమింపజూడటం అధర్మం.  నువు బలవంతుడవైనందువల్ల గాని, కాలం అనుకూలించినందువల్ల గాని, తాత్కాలికంగా గెలిచినప్పటికీ, చిరకాలంపాటు ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోలేవుఅని నచ్చజెప్పజూశాడు.
     
          “మరి, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడుఅని పెద్దలు చెప్పిన మాట అసత్యమా?” అని విమలుడు తండ్రిని ప్రశ్నించాడు.

          “అసత్యం కాదు, నిజమే!

          “మరి, యుద్ధానికి పోవద్దని మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు?”

          “నాయనా!  రాజు, రాజ్యసంపాదనవిషయంలో సంతృప్తిని కలిగి ఉండాలి.  దానివల్ల హాని లేదు.  అందువల్లనే, పాండవులు తమకు మొత్తం రాజ్యం అవసరం లేదని, ఐదు ఊళ్లు ఇచ్చినా చాలని దుర్యోధనునికి సందేశం పంపించారు.  అంతవరకు ధర్మం.  కాని, అసంతృప్తి కలిగిన దుర్యోధనుడు మాత్రం సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని తిరస్కరించాడు.  అది అధర్మం.  చివరకు సంతృప్తి కలిగిన పాండవులే జయించారు.  తనకున్న మహాసామ్రాజ్యంలో, కేవలం ఐదు ఊళ్లు తక్కువైనప్పటికీ తట్టుకోలేని అసంతృప్తిని కలిగిన దుర్యోధనుడు మాత్రం తన మిత్రులతో సహా నశించాడు కదా?” అని చెప్పాడు సదయుడు.

          “నిజమే నాన్నగారూ!  కాని, ఓవైపు ఆ సుభాషితం నిజమే అని మీరు చెప్పారు.  మరోవైపు, వాస్తవంగా ఆ సుభాషితంలో చెప్పబడి ఉన్నదానికి విరుద్ధంగా జరిగిందని కూడా మీరే ఉదాహరణ చూపుతున్నారు.  ఇపుడు, ఈ రెండిటిలో నేను దేనిని గ్రహించి ఆచరించాలి?” అని విమలుడు ప్రశ్నించాడు.

          “నాయనా!  సుభాషితంలో చెప్పబడినదీ నిజమే, కౌరవపాండవుల కథ కూడా నిజమే!  కాని, ఆ సుభాషితాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొనడం వల్ల, ‘ఇక్కడ వైరుద్ధ్యం ఉన్నది కదాఅని సంశయం కలుగుతుంది. 

రాజుకు సంతృప్తి ఉండరాదుఅనేది ఆ సుభాషితం యొక్క ఆశయం.  ‘ఏవిషయంలో అటువంటి సంతృప్తి ఉండరాదు?’ – అంటే – ‘నేను నా ప్రజలను ధర్మంలో నడిపిస్తున్నాను కదా, ఇక నేను చేయవలసిన పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు అని భావించాలి.  ఎందువల్లనంటే, ఆ ధర్మాన్ని దారి తప్పించే శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి.  రాజు అప్రమత్తంగా ఉంటూ వాటినుండి ప్రజలను కాపాడుతూ ఉండాలి.  ‘నా ప్రజలకు దొంగలనుండి రక్షణ కల్పించాను, అగ్నిప్రమాదాలనుండి రక్షణ కల్పించాను, ఈతిబాధలనుండి రక్షణ కల్పించాను.  కనుక, ఇంతకంటె నేను చేయవలసిన గొప్ప పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు.  

ఆ రాజు ప్రజలను కామక్రోధాది-అరిషడ్వర్గాల నుండి కూడా కాపాడుకోవాలి.  ఎందుకంటే, ఆ శత్రువుల దాడికి గురైనవారు జీవితంలో సుఖపడలేరు.  మిగిలిన శత్రువులు ఒక జన్మకు మాత్రమే పరిమితమౌతారేమో గాని, ఈ అంతర్గతశత్రువులు మాత్రం జన్మజన్మలకూ వదలకుండా వేధిస్తూనే ఉంటారు.  ఆ శత్రువులనుండి ప్రజలను కాపాడడానికి ఒకటే మార్గం.  వారందరికీ చక్కని ఆధ్యాత్మవిద్యను  అందించాలి.  ప్రజలందరూ తమ తమ శక్తిసామర్థ్యాలు, అభిరుచులమేరకు వివిధవృత్తినైపుణ్యాలను సంపాదించేందుకు, పెంపొందించుకొనేందుకు, తదనుగుణంగా జీవనోపాధిని పొందేందుకు తగిన ఏర్పాట్లను చేయడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మికప్రవృత్తిని పెంపొందించేందుకు కూడా తగిన కార్యక్రమాలను చేపట్టాలి.  అత్యంతబలవంతమైన ఈ అంతఃశత్రువులను జయించిన వ్యక్తి అరిందమనుడు అని పిలువబడతాడు.   

నాయనా!  ఈ విధంగా, తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించేందుకు గాను, రాజు, ఎక్కడ ఎటువంటి లోటు జరుగుతుందో అనే భయంతో, తాను మాత్రం సంతృప్తి లేకుండా, నిత్యజాగరూకుడై ఉంటూ, పరిపాలన చేస్తూనే ఉండాలి.  ఇది ఆ సుభాషితం యొక్క అంతర్గతభావం.  అంతేగాని, తనకున్న రాజ్యభూభాగం చాలదనే అసంతృప్తిని చెందుతూ, ఇతరదేశాలమీదకు దండెత్తి, సంక్షోభం సృష్టించమని దాని అర్థం కాదుఅని సదయుడు వివరించాడు.

          విమలునికి చాల సంతోషం కలిగింది.  అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి.  “తండ్రీ!  నాకు చక్కని ఉపదేశం చేసి, జ్ఞానోదయం కలిగించారు.  ఆ సుభాషితం యొక్క ఉదాత్తమైన భావాన్ని నేను మీ అనుగ్రహం ద్వారా చక్కగా గ్రహించాను.  మీ ఆజ్ఞతో, మీరు చెప్పిన విధంగా, సక్రమమైన పరిపాలనను ప్రజలకు అందిస్తూ, వారిని అన్నిరకాల అంతర్గతశత్రువులనుండి కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానుఅని సదయునికి పాదాభివందనం చేశాడు.

          అప్పటినుండి విమలుని పాలన చాల చక్కగా కొనసాగింది.  ఆదర్శపరిపాలకునిగా, ధర్మప్రభువుగా అతడు గొప్ప కీర్తిని సంపాదించాడు.

          చదువు చాల విలువైనది.   అయితే, ‘తేభ్యః క్రియాపరాః శ్రేష్ఠాః’.  చదువుకుని, విషయజ్ఞానం పొందిన వారికంటె, దానిని సక్రమంగా ఆచరించేవారే శ్రేష్ఠులని స్మృతివచనం.  అయినప్పటికీ, సరిగా అర్థం చేసుకున్నపుడే సరియైన ఆచరణ సాధ్యమౌతుంది.  చదువుకున్న విషయం యొక్క సారాన్ని సరిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆచరించేందుకు పూనుకుంటే వ్యతిరేకఫలాలు వస్తాయి.  అందువల్ల, గురుముఖతః విద్యను నేర్చుకొమ్మని మన పెద్దవారు చెబుతారు.  అందువల్ల, పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కంటె, పాఠశాలలకు చక్కగా హాజరౌతూ, పాఠాలను శ్రద్ధతో వినడం చాల ముఖ్యం.

(ఈ వ్యాసంయథార్థభారతి - మార్చ్ నెల, 2019 సంచికలో ప్రచురింపబడింది.) 


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...