Tuesday, 26 March 2019

సంతృప్తి లేని రాజు


డా|| పాటీలు శ్రీనివాసకృష్ణ

          పూర్వం సదయుడు అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి విమలుడు అనే కుమారుడు ఉండేవాడు.  ఒక సమయం వచ్చేసరికి, సదయుడు తనకు వార్ధక్యం వచ్చిందని అర్థం చేసుకుని, విమలుడు రాజ్యపరిపాలనకు సమర్థుడు అని భావించి, అతడికి పట్టాభిషేకం చేశాడు.  పిమ్మట రాజధానికి దూరంగా, ఒక వనంలో తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు. తన కుమారుని రాజ్యపాలనావిశేషాలను గూర్చిన సమాచారం ఎప్పటికప్పుడు అతనికి తెలుస్తూనే ఉండేది.

          తాను నేర్చిన మంచి విద్యల ప్రభావం వలన విమలుని పాలన మొదట సక్రమంగానే ఉండింది.  కాని, అతడి చుట్టూ క్రమంగా కొందరు దుష్టమంత్రులు చేరారు.  అసంతుష్టో ద్విజో నష్టః, సంతుష్టస్తు మహీపతిః” (సంతృప్తి లేని ద్విజుడు నశిస్తాడు, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు) అని పెద్దలు చెప్పిన సుభాషితాన్ని అతనికి చెప్పి, “రాజు తనకున్నదానితోనే సంతృప్తి చెందితే నశించిపోతాడు, అందువల్ల మరింత అధికంగా సంపదలను పొందేందుకు ప్రయత్నించాలిఅని ఉపదేశించారు.

          దానితో విమలుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.  అందుకు పెద్ద సైన్యం అవసరం.  ఆ సైన్యాన్ని పోషించేందుకు పెద్ద మొత్తంలో ధనం అవసరం.  అందువల్ల, ధనాన్ని సేకరించేందుకు గాను ప్రజలపై క్రొత్త క్రొత్త పన్నులు విధించి, వసూలు చేయసాగాడు.  ప్రజలలో రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

          ఇది తెలుసుకున్న సదయుడు ఆందోళన పడి, తన కుమారుని రమ్మని కబురు చేశాడు.  విమలుడు అడవికి వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు.  తన కుమారుని ఉద్దేశాన్ని కనుగొని, సదయుడు విచారం వ్యక్తం చేశాడు. 

          “నాయనా, పరాక్రమం చూపడం, యుద్ధం చేయడం క్షత్రియధర్మమే.  నేను కాదనను.  కాని, సాధారణపరిస్థితులలో స్వదేశాన్ని కాపాడుకొనేందుకు యుద్ధం చేయడం మాత్రమే ధర్మం.  అసాధారణపరిస్థితులు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి.  ఇతరరాజులు అధర్మపరులైనపుడు ధర్మరక్షణకు గాను వారిపై యుద్ధం ప్రకటించవచ్చు.  విదేశాలలో రాజు క్రూరుడై, ప్రజాసంక్షోభకారకుడు అయినపుడు, ఆ ప్రజలను సంరక్షించేందుకు దండయాత్ర చేయవచ్చు.  లేదా, సువిశాలమైన దేశంలో, ఆయా రాజ్యాల రాజులు నిష్కారణంగా కలహించుకుంటూ అలజడులు రేకెత్తిస్తున్నపుడు, వారినందరినీ అదుపులో ఉంచేందుకుగాను అశ్వమేథం వంటి యాగాలు కూడా చేయవచ్చును.  కాని, ఇటువంటి కారణాలు ఏమీ లేకుండా, స్వయంగా నువే, దురాశతో, ఇతరదేశాలమీదకు దండెత్తి ఆక్రమింపజూడటం అధర్మం.  నువు బలవంతుడవైనందువల్ల గాని, కాలం అనుకూలించినందువల్ల గాని, తాత్కాలికంగా గెలిచినప్పటికీ, చిరకాలంపాటు ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోలేవుఅని నచ్చజెప్పజూశాడు.
     
          “మరి, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడుఅని పెద్దలు చెప్పిన మాట అసత్యమా?” అని విమలుడు తండ్రిని ప్రశ్నించాడు.

          “అసత్యం కాదు, నిజమే!

          “మరి, యుద్ధానికి పోవద్దని మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు?”

          “నాయనా!  రాజు, రాజ్యసంపాదనవిషయంలో సంతృప్తిని కలిగి ఉండాలి.  దానివల్ల హాని లేదు.  అందువల్లనే, పాండవులు తమకు మొత్తం రాజ్యం అవసరం లేదని, ఐదు ఊళ్లు ఇచ్చినా చాలని దుర్యోధనునికి సందేశం పంపించారు.  అంతవరకు ధర్మం.  కాని, అసంతృప్తి కలిగిన దుర్యోధనుడు మాత్రం సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని తిరస్కరించాడు.  అది అధర్మం.  చివరకు సంతృప్తి కలిగిన పాండవులే జయించారు.  తనకున్న మహాసామ్రాజ్యంలో, కేవలం ఐదు ఊళ్లు తక్కువైనప్పటికీ తట్టుకోలేని అసంతృప్తిని కలిగిన దుర్యోధనుడు మాత్రం తన మిత్రులతో సహా నశించాడు కదా?” అని చెప్పాడు సదయుడు.

          “నిజమే నాన్నగారూ!  కాని, ఓవైపు ఆ సుభాషితం నిజమే అని మీరు చెప్పారు.  మరోవైపు, వాస్తవంగా ఆ సుభాషితంలో చెప్పబడి ఉన్నదానికి విరుద్ధంగా జరిగిందని కూడా మీరే ఉదాహరణ చూపుతున్నారు.  ఇపుడు, ఈ రెండిటిలో నేను దేనిని గ్రహించి ఆచరించాలి?” అని విమలుడు ప్రశ్నించాడు.

          “నాయనా!  సుభాషితంలో చెప్పబడినదీ నిజమే, కౌరవపాండవుల కథ కూడా నిజమే!  కాని, ఆ సుభాషితాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొనడం వల్ల, ‘ఇక్కడ వైరుద్ధ్యం ఉన్నది కదాఅని సంశయం కలుగుతుంది. 

రాజుకు సంతృప్తి ఉండరాదుఅనేది ఆ సుభాషితం యొక్క ఆశయం.  ‘ఏవిషయంలో అటువంటి సంతృప్తి ఉండరాదు?’ – అంటే – ‘నేను నా ప్రజలను ధర్మంలో నడిపిస్తున్నాను కదా, ఇక నేను చేయవలసిన పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు అని భావించాలి.  ఎందువల్లనంటే, ఆ ధర్మాన్ని దారి తప్పించే శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి.  రాజు అప్రమత్తంగా ఉంటూ వాటినుండి ప్రజలను కాపాడుతూ ఉండాలి.  ‘నా ప్రజలకు దొంగలనుండి రక్షణ కల్పించాను, అగ్నిప్రమాదాలనుండి రక్షణ కల్పించాను, ఈతిబాధలనుండి రక్షణ కల్పించాను.  కనుక, ఇంతకంటె నేను చేయవలసిన గొప్ప పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు.  

ఆ రాజు ప్రజలను కామక్రోధాది-అరిషడ్వర్గాల నుండి కూడా కాపాడుకోవాలి.  ఎందుకంటే, ఆ శత్రువుల దాడికి గురైనవారు జీవితంలో సుఖపడలేరు.  మిగిలిన శత్రువులు ఒక జన్మకు మాత్రమే పరిమితమౌతారేమో గాని, ఈ అంతర్గతశత్రువులు మాత్రం జన్మజన్మలకూ వదలకుండా వేధిస్తూనే ఉంటారు.  ఆ శత్రువులనుండి ప్రజలను కాపాడడానికి ఒకటే మార్గం.  వారందరికీ చక్కని ఆధ్యాత్మవిద్యను  అందించాలి.  ప్రజలందరూ తమ తమ శక్తిసామర్థ్యాలు, అభిరుచులమేరకు వివిధవృత్తినైపుణ్యాలను సంపాదించేందుకు, పెంపొందించుకొనేందుకు, తదనుగుణంగా జీవనోపాధిని పొందేందుకు తగిన ఏర్పాట్లను చేయడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మికప్రవృత్తిని పెంపొందించేందుకు కూడా తగిన కార్యక్రమాలను చేపట్టాలి.  అత్యంతబలవంతమైన ఈ అంతఃశత్రువులను జయించిన వ్యక్తి అరిందమనుడు అని పిలువబడతాడు.   

నాయనా!  ఈ విధంగా, తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించేందుకు గాను, రాజు, ఎక్కడ ఎటువంటి లోటు జరుగుతుందో అనే భయంతో, తాను మాత్రం సంతృప్తి లేకుండా, నిత్యజాగరూకుడై ఉంటూ, పరిపాలన చేస్తూనే ఉండాలి.  ఇది ఆ సుభాషితం యొక్క అంతర్గతభావం.  అంతేగాని, తనకున్న రాజ్యభూభాగం చాలదనే అసంతృప్తిని చెందుతూ, ఇతరదేశాలమీదకు దండెత్తి, సంక్షోభం సృష్టించమని దాని అర్థం కాదుఅని సదయుడు వివరించాడు.

          విమలునికి చాల సంతోషం కలిగింది.  అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి.  “తండ్రీ!  నాకు చక్కని ఉపదేశం చేసి, జ్ఞానోదయం కలిగించారు.  ఆ సుభాషితం యొక్క ఉదాత్తమైన భావాన్ని నేను మీ అనుగ్రహం ద్వారా చక్కగా గ్రహించాను.  మీ ఆజ్ఞతో, మీరు చెప్పిన విధంగా, సక్రమమైన పరిపాలనను ప్రజలకు అందిస్తూ, వారిని అన్నిరకాల అంతర్గతశత్రువులనుండి కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానుఅని సదయునికి పాదాభివందనం చేశాడు.

          అప్పటినుండి విమలుని పాలన చాల చక్కగా కొనసాగింది.  ఆదర్శపరిపాలకునిగా, ధర్మప్రభువుగా అతడు గొప్ప కీర్తిని సంపాదించాడు.

          చదువు చాల విలువైనది.   అయితే, ‘తేభ్యః క్రియాపరాః శ్రేష్ఠాః’.  చదువుకుని, విషయజ్ఞానం పొందిన వారికంటె, దానిని సక్రమంగా ఆచరించేవారే శ్రేష్ఠులని స్మృతివచనం.  అయినప్పటికీ, సరిగా అర్థం చేసుకున్నపుడే సరియైన ఆచరణ సాధ్యమౌతుంది.  చదువుకున్న విషయం యొక్క సారాన్ని సరిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆచరించేందుకు పూనుకుంటే వ్యతిరేకఫలాలు వస్తాయి.  అందువల్ల, గురుముఖతః విద్యను నేర్చుకొమ్మని మన పెద్దవారు చెబుతారు.  అందువల్ల, పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కంటె, పాఠశాలలకు చక్కగా హాజరౌతూ, పాఠాలను శ్రద్ధతో వినడం చాల ముఖ్యం.

(ఈ వ్యాసంయథార్థభారతి - మార్చ్ నెల, 2019 సంచికలో ప్రచురింపబడింది.) 


1 comment:

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...