Showing posts with label యథార్థ భారతి. Show all posts
Showing posts with label యథార్థ భారతి. Show all posts

Thursday, 12 March 2020

జలదానమహిమ

అనగా అనగా...
పూర్వం శ్రుతసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు.  అతడి రాజధాని ఉజ్జయిని. అతనికి సుదేవి అని ఒక కుమార్తె ఉండేది.  ఆమె చాల అందమైనది.  చక్కని నడవడిక కలిగినది.  మంచి స్వభావం కలిగినది.  అందరితోనూ చక్కగా మాట్లాడేది.  దయతో వ్యవహరించేది.  ధర్మమార్గంలో సంచరించాలి అని దృఢమైన వ్రతాన్ని కలిగి ఉండేది.

ఆమె చిన్నతనం నుంచి కూడా జలదానం చేస్తూ ఉండేది.  (పానీయదానమకరోత్ సర్వధర్మోత్తమోత్తమమ్।)  

తన స్నేహితురాళ్లకు బంగారుపాత్రలలో లవంగాలు కలిపిన సుగంధభరితమైన నీరు తెచ్చి ఇస్తూ సంతోషపెట్టేది. 

మిగిలిన పనులన్నీ విడిచిపెట్టి జింకపిల్లలకు, చిలుకలకు, నెమళ్లకు, హంసలకు నీరుపోసి సంతోషపెట్టేది.  కాలువలు తవ్వించి వాటిగుండా ఉద్యానవనాలలోని చెట్లకు నీరు పెట్టేది.

బాటసారులు ప్రయాణించే దారులలో విశ్రాంతి కోసం తోటలను ఏర్పాటు చేసేది.  నూతులను త్రవ్వించేది.  వాటిలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకొనేది.  మరుభూములలో బావులను త్రవ్వించి నీరు పోయించేది.  దట్టమైన అడవులలో ప్రయాణించే వారికి కూడా నీళ్లను అందించి వారిని ఆనందింపజేసేది. (కాంతారేషు దురంతేషు పాంథానందవిధాయినీ।)

ఆవిడ త్రవ్వించిన పుష్కరిణులలో వికసించిన తెల్లని పద్మాలు ఉండేవి. నీటిపక్షులు అందులో సేద దీరుతూ ఉండేవి.  తటాకాలు పూడి పోకుండా వాటి గట్లు గట్టిగా ఉండేలా చేసింది.  అందులో చల్లటి నీరు ఉండేలా చేసింది.  ఇవన్నీ కేవలం తమ రాజ్యంలోనే కాక, ఇతర రాజ్యాలలో కూడా చేసింది.

ఈవిధంగా ఆమె జలదానాన్ని మించి మరొక ధర్మం లేదని భావించింది.  (జలదానాత్ పరం ధర్మం నాన్యం సా బహ్వమన్యత।) 

రాజపుత్రి చేస్తున్న పనులను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేవారు. ఆమె స్నేహితురాళ్ళు పౌరులు ఎంతో ఆశ్చర్యపోయేవారు.  జానపదులు తీర్థయాత్రికులు, అందరూ ఆ రాజపుత్రిని ఎంతో గౌరవించేవారు. మహామునులు కూడా ఆమెను ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారు.  (మునయశ్చ ప్రశస్తాస్తాం ప్రశసంసురితస్తతః।)

ఒకసారి ధర్మతత్త్వజ్ఞులు అయిన మహర్షులు కొందరు రాజును కలుసుకొనేందుకు వచ్చారు.  రాజుచేత యథోచితంగా సత్కరింపబడి, రాజుకు ధర్మోపదేశం చేశారు.  ఆశీర్వదించారు.  ఇంతలో, వారు ఇంతకు మునుపే ఎవరిని గూర్చి విన్నారో ఆ రాజపుత్రి రాజుగారి సేవకులకు నీరు అందిస్తూ ఉండటం చూశారు.  రాజపుత్రి కూడా మహర్షులను చూసి వినయంగా నమస్కారం చేసింది.  వారు చాల సంతోషించి ఆమెను ప్రశంసించి దీవించారు. 

ఆ మహర్షులకు ఆమె విషయంలో ఎప్పటినుండో ఒక సందేహం ఉన్నది.  సమస్త-అభీష్టాలను తీర్చే ఎన్నో విధములైన ధర్మాలు ఉండగా,  ఆమె జలదానవ్రతాన్ని మాత్రమే ఎందుకు స్వీకరించిందో వారికి తెలియదు.  అందువల్ల, ఆ విషయాన్ని గూర్చి వారు రాజుగారి ఎదుటనే అడిగి, తమ సందేహాన్ని తీర్చమని అడిగారు.

అపుడు రాజపుత్రి వారికి ఒక కథను చెప్పింది. 

“గంగాకాళిందీతీరాలలో ఉండే వనాలలో కొందరు పుళిందులు ఉన్నారు.  వారు పక్షులను మృగాలను వేటాడుతూ ఉంటారు.  వారిలో అతి క్రూరుడైన ఒక పుళిందుడు ఉండేవాడు. 

ఒకసారి వేసవికాలంలో అతడు తన భార్యతో సహా అడవిలో వేటకోసం వెళ్లాడు.  అడవిలో ఎంతగా సంచరించినా వారికి ఒక్క జంతువు కూడా కనబడలేదు.  కాని, ఎండలో తిరిగి తిరిగి బాగా అలసిపోయారు.  అందువల్ల గంగానదిలో దిగి స్నానం చేయసాగారు. 

ఇంతలో పుళిందుడికి ఒడ్డున ఒక జింక కనిపించింది.  వెంటనే అతడు స్నానం మాని,ఆ జింకను వేటాడదలచి తన భార్యను నదిలో అలాగే వదిలిపెట్టి, ధనుస్సును అందుకుని దాని వెంట పడ్డాడు.  ఆమె స్నానం పూర్తిచేసుకుని నదినుండి బయటకు  వచ్చింది.  నిప్పులాగా కాలిపోతున్న ఆ ఇసుక తిన్నెల మీద తన భర్త వెళ్లిన దిశగా పరుగెత్తింది. 

అయితే ఆమెకు ఎంతో దూరం ముందుకు పోలేకపోయింది.  తీక్ష్ణమైన ఆ ఎండలో ఆమెకు బాగా దాహం ఎక్కువ అయింది.  ముందుకు కదలడానికి కూడా శక్తి లేకపోయింది. కాసేపు ఆ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు క్రింద చల్లటి నీడలో నిలబడింది. 

ఇంతలో ఆమెకు అదే చెట్టు నీడలో ఉన్న ఒక బకోటపక్షి (కొంగజాతికి చెందిన ఒక పక్షి) కనిపించింది.  అది కూడా అతి తీవ్రమైన సూర్యకిరణాల దెబ్బకు నిశ్చేష్టమై పడిపోయి ఉంది.  ఎంతో దాహంతో పరితపిస్తోంది.  దాని ప్రాణాలు కంఠంలోనికి వచ్చి ఉన్నాయి.  నోరు తెరిచి ఆయాసపడుతూ కదలలేకుండా ఉన్నది. 

దానిని చూసిన ఆ పుళిందుని భార్య ఎంతో జాలి పడింది.  ఆమె మనసు కరుణతో నిండి పోయింది.  "అయ్యో, ఇది దాహంతో ప్రాణాలు వదిలేలా ఉన్నదే!  పాపం దీనికి కాసిని నీళ్ళు పోయాలి" అనుకుంది.

నిర్దాక్షిణ్యంగా జంతువుల ప్రాణాలు తీసే ఆమెకు ఆ కొంగ మీద జాలి కలగడం చాలా ఆశ్చర్యం. 

ఎంతటి పాపాత్మునికైనా ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం చేసే బుద్ధి తప్పకుండా కలుగుతుంది.  (పాపినోऽపి మతిః పుణ్యా కదాచిత్ జాయతే భృశమ్।)  

అందువల్లనే ఆ పుళిందస్త్రీకి అటువంటి మంచి బుద్ధి పుట్టింది. 

అప్పుడు ఆమె తన జుత్తుముడిని విప్పి, ఆ జుత్తును తన చేతులతో పట్టుకొని, కొంగ నోటిలో నీటిని పడేలా పిండింది.  అంతకు మునుపే ఆమె గంగలో మునకలు వేసి స్నానం చేసి ఉండటం వలన ఆమె తడి జుత్తులో నీరు ఉండింది. 

దాంతో ఆ కొంగకు కొద్దిగా ఆశ్వాసన కలిగింది.  పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చాయి.  నెమ్మదిగా తల ఎత్తింది.  ముక్కుపుటాలను కొంచెం కదిలించింది.  పుళిందస్త్రీ మళ్లీ మరోసారి తన జుత్తును పిండి దాని నీటిలోనికి నీళ్లు పడేలా చేసింది. 

ఆ కొంగ ఒకొక్క చుక్క ఒకొక్క చుక్కగా నీటిని త్రాగింది.  నెమ్మదిగా అది తిరిగి నిలబడగలిగింది.

అయితే, అప్పటికి కూడా తన భర్త ఇంకా తిరిగి రాకపోవడం చూసి, ఎండ కూడా కాస్త తగ్గడం చూసి, ఆమె తన భర్తను వెతుకుతూ, ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయింది.

ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ పుళిందస్త్రీ మరణించింది.”

ఇలా చెప్పి రాజపుత్రి తన కథను ముగిస్తూ, “ఓ మహర్షులారా! తాను చేసిన జలదానం ఫలితంగా ఆ పుళిందస్త్రీ మరుసటి జన్మలో రాజపుత్రికగా పుట్టింది.  మరెవరో కాదు, నేనే ఆ రాజపుత్రికను.  ఇప్పటికీ ఆ పూర్వజన్మజ్ఞానం ఉండటం వల్ల నాకు జరిగినదంతా గుర్తున్నది.  అందువలన, జలదానమనే అంతటి పుణ్యకార్యాన్ని ఈ జన్మలో కూడా నేను వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నాను” అని తెలియజేసింది.

ఆమె కథను విన్నవారందరూ ఎంతో ఆశ్చర్యపోతూ ఉండగా, రాజపుత్రి ఇంకా ఇలా చెప్పింది -

“కేవలం కొన్ని నీటిచుక్కలతో ఒక ప్రాణిని సంతోషపెట్టడం వల్లనే ఇంతటి గొప్ప పుణ్యం వచ్చింది కదా, అటువంటిది తటాకాలు మొదలైన వాటిని నిర్మించి జలదానం చేస్తూ ఉంటే మరెంతటి పుణ్యం వస్తుందో కదా! 

నాకు సనాతనమైన సూక్ష్మమైన ధర్మం గురించి పెద్దగా తెలియదు.  కాని, మీవంటి మహాత్ముల నోటి నుండి నేను విన్నదాన్ని మాత్రమే నేను గ్రహించాను.

దాహంతో బాధపడుతున్న వాడికి నీటిని దానం చేసి సంతోషపెడితే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.  ఒక నూతిని త్రవ్వించిన వాడికి వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన వాడికి మించి నూరు రెట్లు ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఎన్నడూ ఎండిపోని ఒక పెద్ద దిగుడు బావిని త్రవ్విస్తారో, అతడికి నూతిని త్రవ్వించిన వానికి మించి వేయి రెట్లు ఫలితం లభిస్తుంది.  అలాగే, ఒక పుష్కరిణిని త్రవ్వించిన వానికి దిగుడుబావిని తవ్వించిన వానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఒక సరస్సును నిర్మిస్తారో వారికి పుష్కరిణిని త్రవ్వించిన వానిని మించి పదివేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  అలాగే, కాలువను త్రవ్వించి అందులో నీటిని ప్రవహింపజేసే వాళ్లకు వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే అది వేయితలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యం.  నిత్యం నీళ్లు ఊరే తటాకాన్ని త్రవ్వించిన వానికి వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే సాక్షాత్తు పరమశివుడికే సాధ్యం. 

అందువల్ల మనుషులు జలదానం చేయాలనే బుద్ధిని కలిగి ఉండాలి.  అందువల్ల ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అతనికి సిద్ధి కలుగుతుంది” అని రాజపుత్రి ముగించింది. 

మహర్షులు, రాజు, పౌరులు, సభాసదులు అందరూ ఆమె కథను విని, ఆమె దృఢనిశ్చయానికి తగిన కారణం విని ఎంతో ఆనందించారు.  ఆమెను ప్రశంసించారు.  దీవించారు.

(ఫిబ్రవరి,2020 యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.)
🌳🌳🌳

మనం కూడా మనుషులమే కదా?
మనం కూడా జలదానం చేయవచ్చు.  ముఖ్యంగా ఎండలు క్రమంగా ముదురుతున్న కాలంలో మొదలు పెట్టి మంచి వర్షాలు పడేంత కాలం వరకు ఏదో ఒకవిధంగా చేయవచ్చు.

Tuesday, 26 March 2019

సంతృప్తి లేని రాజు


డా|| పాటీలు శ్రీనివాసకృష్ణ

          పూర్వం సదయుడు అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి విమలుడు అనే కుమారుడు ఉండేవాడు.  ఒక సమయం వచ్చేసరికి, సదయుడు తనకు వార్ధక్యం వచ్చిందని అర్థం చేసుకుని, విమలుడు రాజ్యపరిపాలనకు సమర్థుడు అని భావించి, అతడికి పట్టాభిషేకం చేశాడు.  పిమ్మట రాజధానికి దూరంగా, ఒక వనంలో తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు. తన కుమారుని రాజ్యపాలనావిశేషాలను గూర్చిన సమాచారం ఎప్పటికప్పుడు అతనికి తెలుస్తూనే ఉండేది.

          తాను నేర్చిన మంచి విద్యల ప్రభావం వలన విమలుని పాలన మొదట సక్రమంగానే ఉండింది.  కాని, అతడి చుట్టూ క్రమంగా కొందరు దుష్టమంత్రులు చేరారు.  “అసంతుష్టో ద్విజో నష్టః, సంతుష్టస్తు మహీపతిః” (సంతృప్తి లేని ద్విజుడు నశిస్తాడు, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు) అని పెద్దలు చెప్పిన సుభాషితాన్ని అతనికి చెప్పి, “రాజు తనకున్నదానితోనే సంతృప్తి చెందితే నశించిపోతాడు, అందువల్ల మరింత అధికంగా సంపదలను పొందేందుకు ప్రయత్నించాలి” అని ఉపదేశించారు.

          దానితో విమలుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.  అందుకు పెద్ద సైన్యం అవసరం.  ఆ సైన్యాన్ని పోషించేందుకు పెద్ద మొత్తంలో ధనం అవసరం.  అందువల్ల, ధనాన్ని సేకరించేందుకు గాను ప్రజలపై క్రొత్త క్రొత్త పన్నులు విధించి, వసూలు చేయసాగాడు.  ప్రజలలో రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

          ఇది తెలుసుకున్న సదయుడు ఆందోళన పడి, తన కుమారుని రమ్మని కబురు చేశాడు.  విమలుడు అడవికి వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు.  తన కుమారుని ఉద్దేశాన్ని కనుగొని, సదయుడు విచారం వ్యక్తం చేశాడు. 

          “నాయనా, పరాక్రమం చూపడం, యుద్ధం చేయడం క్షత్రియధర్మమే.  నేను కాదనను.  కాని, సాధారణపరిస్థితులలో స్వదేశాన్ని కాపాడుకొనేందుకు యుద్ధం చేయడం మాత్రమే ధర్మం.  అసాధారణపరిస్థితులు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి.  ఇతరరాజులు అధర్మపరులైనపుడు ధర్మరక్షణకు గాను వారిపై యుద్ధం ప్రకటించవచ్చు.  విదేశాలలో రాజు క్రూరుడై, ప్రజాసంక్షోభకారకుడు అయినపుడు, ఆ ప్రజలను సంరక్షించేందుకు దండయాత్ర చేయవచ్చు.  లేదా, సువిశాలమైన దేశంలో, ఆయా రాజ్యాల రాజులు నిష్కారణంగా కలహించుకుంటూ అలజడులు రేకెత్తిస్తున్నపుడు, వారినందరినీ అదుపులో ఉంచేందుకుగాను అశ్వమేథం వంటి యాగాలు కూడా చేయవచ్చును.  కాని, ఇటువంటి కారణాలు ఏమీ లేకుండా, స్వయంగా నువే, దురాశతో, ఇతరదేశాలమీదకు దండెత్తి ఆక్రమింపజూడటం అధర్మం.  నువు బలవంతుడవైనందువల్ల గాని, కాలం అనుకూలించినందువల్ల గాని, తాత్కాలికంగా గెలిచినప్పటికీ, చిరకాలంపాటు ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోలేవు” అని నచ్చజెప్పజూశాడు.
     
          “మరి, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు” అని పెద్దలు చెప్పిన మాట అసత్యమా?” అని విమలుడు తండ్రిని ప్రశ్నించాడు.

          “అసత్యం కాదు, నిజమే!”

          “మరి, యుద్ధానికి పోవద్దని మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు?”

          “నాయనా!  రాజు, రాజ్యసంపాదనవిషయంలో సంతృప్తిని కలిగి ఉండాలి.  దానివల్ల హాని లేదు.  అందువల్లనే, పాండవులు తమకు మొత్తం రాజ్యం అవసరం లేదని, ఐదు ఊళ్లు ఇచ్చినా చాలని దుర్యోధనునికి సందేశం పంపించారు.  అంతవరకు ధర్మం.  కాని, అసంతృప్తి కలిగిన దుర్యోధనుడు మాత్రం సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని తిరస్కరించాడు.  అది అధర్మం.  చివరకు సంతృప్తి కలిగిన పాండవులే జయించారు.  తనకున్న మహాసామ్రాజ్యంలో, కేవలం ఐదు ఊళ్లు తక్కువైనప్పటికీ తట్టుకోలేని అసంతృప్తిని కలిగిన దుర్యోధనుడు మాత్రం తన మిత్రులతో సహా నశించాడు కదా?” అని చెప్పాడు సదయుడు.

          “నిజమే నాన్నగారూ!  కాని, ఓవైపు ఆ సుభాషితం నిజమే అని మీరు చెప్పారు.  మరోవైపు, వాస్తవంగా ఆ సుభాషితంలో చెప్పబడి ఉన్నదానికి విరుద్ధంగా జరిగిందని కూడా మీరే ఉదాహరణ చూపుతున్నారు.  ఇపుడు, ఈ రెండిటిలో నేను దేనిని గ్రహించి ఆచరించాలి?” అని విమలుడు ప్రశ్నించాడు.

          “నాయనా!  సుభాషితంలో చెప్పబడినదీ నిజమే, కౌరవపాండవుల కథ కూడా నిజమే!  కాని, ఆ సుభాషితాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొనడం వల్ల, ‘ఇక్కడ వైరుద్ధ్యం ఉన్నది కదా’ అని సంశయం కలుగుతుంది. 

‘రాజుకు సంతృప్తి ఉండరాదు’ అనేది ఆ సుభాషితం యొక్క ఆశయం.  ‘ఏవిషయంలో అటువంటి సంతృప్తి ఉండరాదు?’ – అంటే – ‘నేను నా ప్రజలను ధర్మంలో నడిపిస్తున్నాను కదా, ఇక నేను చేయవలసిన పనులేమీ లేవు’ అని రాజు సంతృప్తిని చెందరాదు అని భావించాలి.  ఎందువల్లనంటే, ఆ ధర్మాన్ని దారి తప్పించే శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి.  రాజు అప్రమత్తంగా ఉంటూ వాటినుండి ప్రజలను కాపాడుతూ ఉండాలి.  ‘నా ప్రజలకు దొంగలనుండి రక్షణ కల్పించాను, అగ్నిప్రమాదాలనుండి రక్షణ కల్పించాను, ఈతిబాధలనుండి రక్షణ కల్పించాను.  కనుక, ఇంతకంటె నేను చేయవలసిన గొప్ప పనులేమీ లేవు’ అని రాజు సంతృప్తిని చెందరాదు.  

ఆ రాజు ప్రజలను కామక్రోధాది-అరిషడ్వర్గాల నుండి కూడా కాపాడుకోవాలి.  ఎందుకంటే, ఆ శత్రువుల దాడికి గురైనవారు జీవితంలో సుఖపడలేరు.  మిగిలిన శత్రువులు ఒక జన్మకు మాత్రమే పరిమితమౌతారేమో గాని, ఈ అంతర్గతశత్రువులు మాత్రం జన్మజన్మలకూ వదలకుండా వేధిస్తూనే ఉంటారు.  ఆ శత్రువులనుండి ప్రజలను కాపాడడానికి ఒకటే మార్గం.  వారందరికీ చక్కని ఆధ్యాత్మవిద్యను  అందించాలి.  ప్రజలందరూ తమ తమ శక్తిసామర్థ్యాలు, అభిరుచులమేరకు వివిధవృత్తినైపుణ్యాలను సంపాదించేందుకు, పెంపొందించుకొనేందుకు, తదనుగుణంగా జీవనోపాధిని పొందేందుకు తగిన ఏర్పాట్లను చేయడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మికప్రవృత్తిని పెంపొందించేందుకు కూడా తగిన కార్యక్రమాలను చేపట్టాలి.  అత్యంతబలవంతమైన ఈ అంతఃశత్రువులను జయించిన వ్యక్తి అరిందమనుడు అని పిలువబడతాడు.   

నాయనా!  ఈ విధంగా, తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించేందుకు గాను, రాజు, ఎక్కడ ఎటువంటి లోటు జరుగుతుందో అనే భయంతో, తాను మాత్రం సంతృప్తి లేకుండా, నిత్యజాగరూకుడై ఉంటూ, పరిపాలన చేస్తూనే ఉండాలి.  ఇది ఆ సుభాషితం యొక్క అంతర్గతభావం.  అంతేగాని, తనకున్న రాజ్యభూభాగం చాలదనే అసంతృప్తిని చెందుతూ, ఇతరదేశాలమీదకు దండెత్తి, సంక్షోభం సృష్టించమని దాని అర్థం కాదు” అని సదయుడు వివరించాడు.

          విమలునికి చాల సంతోషం కలిగింది.  అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి.  “తండ్రీ!  నాకు చక్కని ఉపదేశం చేసి, జ్ఞానోదయం కలిగించారు.  ఆ సుభాషితం యొక్క ఉదాత్తమైన భావాన్ని నేను మీ అనుగ్రహం ద్వారా చక్కగా గ్రహించాను.  మీ ఆజ్ఞతో, మీరు చెప్పిన విధంగా, సక్రమమైన పరిపాలనను ప్రజలకు అందిస్తూ, వారిని అన్నిరకాల అంతర్గతశత్రువులనుండి కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను” అని సదయునికి పాదాభివందనం చేశాడు.

          అప్పటినుండి విమలుని పాలన చాల చక్కగా కొనసాగింది.  ఆదర్శపరిపాలకునిగా, ధర్మప్రభువుగా అతడు గొప్ప కీర్తిని సంపాదించాడు.

          చదువు చాల విలువైనది.   అయితే, ‘తేభ్యః క్రియాపరాః శ్రేష్ఠాః’.  చదువుకుని, విషయజ్ఞానం పొందిన వారికంటె, దానిని సక్రమంగా ఆచరించేవారే శ్రేష్ఠులని స్మృతివచనం.  అయినప్పటికీ, సరిగా అర్థం చేసుకున్నపుడే సరియైన ఆచరణ సాధ్యమౌతుంది.  చదువుకున్న విషయం యొక్క సారాన్ని సరిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆచరించేందుకు పూనుకుంటే వ్యతిరేకఫలాలు వస్తాయి.  అందువల్ల, గురుముఖతః విద్యను నేర్చుకొమ్మని మన పెద్దవారు చెబుతారు.  అందువల్ల, పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కంటె, పాఠశాలలకు చక్కగా హాజరౌతూ, పాఠాలను శ్రద్ధతో వినడం చాల ముఖ్యం.

(ఈ వ్యాసం, యథార్థభారతి - మార్చ్ నెల, 2019 సంచికలో ప్రచురింపబడింది.) 


హంసోదకం

స్థలం - తిరుపతి, తత్పరిసరాలు.   ఇద్దరు మిత్రులు సంభాషించుకుంటూ ఉన్నారు.   ఒకడు -  అయ్యో, దుర్దినాలు సంప్రాప్తించాయి గదరా.   రెండవవాడు -   ...