Thursday 12 March 2020

జలదానమహిమ

అనగా అనగా...
పూర్వం శ్రుతసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు.  అతడి రాజధాని ఉజ్జయిని. అతనికి సుదేవి అని ఒక కుమార్తె ఉండేది.  ఆమె చాల అందమైనది.  చక్కని నడవడిక కలిగినది.  మంచి స్వభావం కలిగినది.  అందరితోనూ చక్కగా మాట్లాడేది.  దయతో వ్యవహరించేది.  ధర్మమార్గంలో సంచరించాలి అని దృఢమైన వ్రతాన్ని కలిగి ఉండేది.

ఆమె చిన్నతనం నుంచి కూడా జలదానం చేస్తూ ఉండేది.  (పానీయదానమకరోత్ సర్వధర్మోత్తమోత్తమమ్।)  

తన స్నేహితురాళ్లకు బంగారుపాత్రలలో లవంగాలు కలిపిన సుగంధభరితమైన నీరు తెచ్చి ఇస్తూ సంతోషపెట్టేది. 

మిగిలిన పనులన్నీ విడిచిపెట్టి జింకపిల్లలకు, చిలుకలకు, నెమళ్లకు, హంసలకు నీరుపోసి సంతోషపెట్టేది.  కాలువలు తవ్వించి వాటిగుండా ఉద్యానవనాలలోని చెట్లకు నీరు పెట్టేది.

బాటసారులు ప్రయాణించే దారులలో విశ్రాంతి కోసం తోటలను ఏర్పాటు చేసేది.  నూతులను త్రవ్వించేది.  వాటిలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకొనేది.  మరుభూములలో బావులను త్రవ్వించి నీరు పోయించేది.  దట్టమైన అడవులలో ప్రయాణించే వారికి కూడా నీళ్లను అందించి వారిని ఆనందింపజేసేది. (కాంతారేషు దురంతేషు పాంథానందవిధాయినీ।)

ఆవిడ త్రవ్వించిన పుష్కరిణులలో వికసించిన తెల్లని పద్మాలు ఉండేవి. నీటిపక్షులు అందులో సేద దీరుతూ ఉండేవి.  తటాకాలు పూడి పోకుండా వాటి గట్లు గట్టిగా ఉండేలా చేసింది.  అందులో చల్లటి నీరు ఉండేలా చేసింది.  ఇవన్నీ కేవలం తమ రాజ్యంలోనే కాక, ఇతర రాజ్యాలలో కూడా చేసింది.

ఈవిధంగా ఆమె జలదానాన్ని మించి మరొక ధర్మం లేదని భావించింది.  (జలదానాత్ పరం ధర్మం నాన్యం సా బహ్వమన్యత।) 

రాజపుత్రి చేస్తున్న పనులను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేవారు. ఆమె స్నేహితురాళ్ళు పౌరులు ఎంతో ఆశ్చర్యపోయేవారు.  జానపదులు తీర్థయాత్రికులు, అందరూ ఆ రాజపుత్రిని ఎంతో గౌరవించేవారు. మహామునులు కూడా ఆమెను ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారు.  (మునయశ్చ ప్రశస్తాస్తాం ప్రశసంసురితస్తతః।)

ఒకసారి ధర్మతత్త్వజ్ఞులు అయిన మహర్షులు కొందరు రాజును కలుసుకొనేందుకు వచ్చారు.  రాజుచేత యథోచితంగా సత్కరింపబడి, రాజుకు ధర్మోపదేశం చేశారు.  ఆశీర్వదించారు.  ఇంతలో, వారు ఇంతకు మునుపే ఎవరిని గూర్చి విన్నారో ఆ రాజపుత్రి రాజుగారి సేవకులకు నీరు అందిస్తూ ఉండటం చూశారు.  రాజపుత్రి కూడా మహర్షులను చూసి వినయంగా నమస్కారం చేసింది.  వారు చాల సంతోషించి ఆమెను ప్రశంసించి దీవించారు. 

ఆ మహర్షులకు ఆమె విషయంలో ఎప్పటినుండో ఒక సందేహం ఉన్నది.  సమస్త-అభీష్టాలను తీర్చే ఎన్నో విధములైన ధర్మాలు ఉండగా,  ఆమె జలదానవ్రతాన్ని మాత్రమే ఎందుకు స్వీకరించిందో వారికి తెలియదు.  అందువల్ల, ఆ విషయాన్ని గూర్చి వారు రాజుగారి ఎదుటనే అడిగి, తమ సందేహాన్ని తీర్చమని అడిగారు.

అపుడు రాజపుత్రి వారికి ఒక కథను చెప్పింది. 

“గంగాకాళిందీతీరాలలో ఉండే వనాలలో కొందరు పుళిందులు ఉన్నారు.  వారు పక్షులను మృగాలను వేటాడుతూ ఉంటారు.  వారిలో అతి క్రూరుడైన ఒక పుళిందుడు ఉండేవాడు. 

ఒకసారి వేసవికాలంలో అతడు తన భార్యతో సహా అడవిలో వేటకోసం వెళ్లాడు.  అడవిలో ఎంతగా సంచరించినా వారికి ఒక్క జంతువు కూడా కనబడలేదు.  కాని, ఎండలో తిరిగి తిరిగి బాగా అలసిపోయారు.  అందువల్ల గంగానదిలో దిగి స్నానం చేయసాగారు. 

ఇంతలో పుళిందుడికి ఒడ్డున ఒక జింక కనిపించింది.  వెంటనే అతడు స్నానం మాని,ఆ జింకను వేటాడదలచి తన భార్యను నదిలో అలాగే వదిలిపెట్టి, ధనుస్సును అందుకుని దాని వెంట పడ్డాడు.  ఆమె స్నానం పూర్తిచేసుకుని నదినుండి బయటకు  వచ్చింది.  నిప్పులాగా కాలిపోతున్న ఆ ఇసుక తిన్నెల మీద తన భర్త వెళ్లిన దిశగా పరుగెత్తింది. 

అయితే ఆమెకు ఎంతో దూరం ముందుకు పోలేకపోయింది.  తీక్ష్ణమైన ఆ ఎండలో ఆమెకు బాగా దాహం ఎక్కువ అయింది.  ముందుకు కదలడానికి కూడా శక్తి లేకపోయింది. కాసేపు ఆ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు క్రింద చల్లటి నీడలో నిలబడింది. 

ఇంతలో ఆమెకు అదే చెట్టు నీడలో ఉన్న ఒక బకోటపక్షి (కొంగజాతికి చెందిన ఒక పక్షి) కనిపించింది.  అది కూడా అతి తీవ్రమైన సూర్యకిరణాల దెబ్బకు నిశ్చేష్టమై పడిపోయి ఉంది.  ఎంతో దాహంతో పరితపిస్తోంది.  దాని ప్రాణాలు కంఠంలోనికి వచ్చి ఉన్నాయి.  నోరు తెరిచి ఆయాసపడుతూ కదలలేకుండా ఉన్నది. 

దానిని చూసిన ఆ పుళిందుని భార్య ఎంతో జాలి పడింది.  ఆమె మనసు కరుణతో నిండి పోయింది.  "అయ్యో, ఇది దాహంతో ప్రాణాలు వదిలేలా ఉన్నదే!  పాపం దీనికి కాసిని నీళ్ళు పోయాలి" అనుకుంది.

నిర్దాక్షిణ్యంగా జంతువుల ప్రాణాలు తీసే ఆమెకు ఆ కొంగ మీద జాలి కలగడం చాలా ఆశ్చర్యం. 

ఎంతటి పాపాత్మునికైనా ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం చేసే బుద్ధి తప్పకుండా కలుగుతుంది.  (పాపినోऽపి మతిః పుణ్యా కదాచిత్ జాయతే భృశమ్।)  

అందువల్లనే ఆ పుళిందస్త్రీకి అటువంటి మంచి బుద్ధి పుట్టింది. 

అప్పుడు ఆమె తన జుత్తుముడిని విప్పి, ఆ జుత్తును తన చేతులతో పట్టుకొని, కొంగ నోటిలో నీటిని పడేలా పిండింది.  అంతకు మునుపే ఆమె గంగలో మునకలు వేసి స్నానం చేసి ఉండటం వలన ఆమె తడి జుత్తులో నీరు ఉండింది. 

దాంతో ఆ కొంగకు కొద్దిగా ఆశ్వాసన కలిగింది.  పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చాయి.  నెమ్మదిగా తల ఎత్తింది.  ముక్కుపుటాలను కొంచెం కదిలించింది.  పుళిందస్త్రీ మళ్లీ మరోసారి తన జుత్తును పిండి దాని నీటిలోనికి నీళ్లు పడేలా చేసింది. 

ఆ కొంగ ఒకొక్క చుక్క ఒకొక్క చుక్కగా నీటిని త్రాగింది.  నెమ్మదిగా అది తిరిగి నిలబడగలిగింది.

అయితే, అప్పటికి కూడా తన భర్త ఇంకా తిరిగి రాకపోవడం చూసి, ఎండ కూడా కాస్త తగ్గడం చూసి, ఆమె తన భర్తను వెతుకుతూ, ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయింది.

ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ పుళిందస్త్రీ మరణించింది.”

ఇలా చెప్పి రాజపుత్రి తన కథను ముగిస్తూ, “ఓ మహర్షులారా! తాను చేసిన జలదానం ఫలితంగా ఆ పుళిందస్త్రీ మరుసటి జన్మలో రాజపుత్రికగా పుట్టింది.  మరెవరో కాదు, నేనే ఆ రాజపుత్రికను.  ఇప్పటికీ ఆ పూర్వజన్మజ్ఞానం ఉండటం వల్ల నాకు జరిగినదంతా గుర్తున్నది.  అందువలన, జలదానమనే అంతటి పుణ్యకార్యాన్ని ఈ జన్మలో కూడా నేను వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నాను” అని తెలియజేసింది.

ఆమె కథను విన్నవారందరూ ఎంతో ఆశ్చర్యపోతూ ఉండగా, రాజపుత్రి ఇంకా ఇలా చెప్పింది -

“కేవలం కొన్ని నీటిచుక్కలతో ఒక ప్రాణిని సంతోషపెట్టడం వల్లనే ఇంతటి గొప్ప పుణ్యం వచ్చింది కదా, అటువంటిది తటాకాలు మొదలైన వాటిని నిర్మించి జలదానం చేస్తూ ఉంటే మరెంతటి పుణ్యం వస్తుందో కదా! 

నాకు సనాతనమైన సూక్ష్మమైన ధర్మం గురించి పెద్దగా తెలియదు.  కాని, మీవంటి మహాత్ముల నోటి నుండి నేను విన్నదాన్ని మాత్రమే నేను గ్రహించాను.

దాహంతో బాధపడుతున్న వాడికి నీటిని దానం చేసి సంతోషపెడితే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.  ఒక నూతిని త్రవ్వించిన వాడికి వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన వాడికి మించి నూరు రెట్లు ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఎన్నడూ ఎండిపోని ఒక పెద్ద దిగుడు బావిని త్రవ్విస్తారో, అతడికి నూతిని త్రవ్వించిన వానికి మించి వేయి రెట్లు ఫలితం లభిస్తుంది.  అలాగే, ఒక పుష్కరిణిని త్రవ్వించిన వానికి దిగుడుబావిని తవ్వించిన వానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఒక సరస్సును నిర్మిస్తారో వారికి పుష్కరిణిని త్రవ్వించిన వానిని మించి పదివేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  అలాగే, కాలువను త్రవ్వించి అందులో నీటిని ప్రవహింపజేసే వాళ్లకు వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే అది వేయితలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యం.  నిత్యం నీళ్లు ఊరే తటాకాన్ని త్రవ్వించిన వానికి వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే సాక్షాత్తు పరమశివుడికే సాధ్యం. 

అందువల్ల మనుషులు జలదానం చేయాలనే బుద్ధిని కలిగి ఉండాలి.  అందువల్ల ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అతనికి సిద్ధి కలుగుతుంది” అని రాజపుత్రి ముగించింది. 

మహర్షులు, రాజు, పౌరులు, సభాసదులు అందరూ ఆమె కథను విని, ఆమె దృఢనిశ్చయానికి తగిన కారణం విని ఎంతో ఆనందించారు.  ఆమెను ప్రశంసించారు.  దీవించారు.

(ఫిబ్రవరి,2020 యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.)
🌳🌳🌳

మనం కూడా మనుషులమే కదా?
మనం కూడా జలదానం చేయవచ్చు.  ముఖ్యంగా ఎండలు క్రమంగా ముదురుతున్న కాలంలో మొదలు పెట్టి మంచి వర్షాలు పడేంత కాలం వరకు ఏదో ఒకవిధంగా చేయవచ్చు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...