Monday 23 March 2020

భాషలో కూడా DNA ఉంటుంది



ఒక ఆఫ్రికన్ జానపద కథ ఉంది.

ఒక అడవిలో బోయ అనే పిల్లవాడు ఉండేవాడు.  ఒక చిన్న గుడిసెలో అతడు తన తండ్రితోను తల్లితోను పిన్నితోను కలిసి ఉండేవాడు.  

ఆ పిన్ని  నిశ్శబ్దంగా ఉండే రకం కాదు.  ఆ పిల్లవాణ్ణి నిత్యం ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉండేది.  

ఒక రోజు బోయ పండ్లను ఏరుకురావడానికి అడవికి వెళ్ళాడు.   ఒక నది ఒడ్డున పండ్లను సేకరిస్తూ ఉండగా అతడికి ఒక వింత జంతువు కనిపించింది.  

బోయ అటువంటి జంతువును ఎన్నడూ చూసి ఎరుగడు.  దాంతో అది ఎటువంటి జంతువో అర్థం చేసుకోలేక భయపడి పండ్లను వదిలి పరుగు పెట్టాడు.  ఆ వింత జంతువు అతడి వెంట పడింది.  అది తన కంటే చాలా వేగంగా పరుగెట్టి తనను సమీపిస్తూ ఉండడంతో బోయ మరింత మరింత భయపడిపోయాడు.  తాను పరుగెత్తి తప్పించుకోలేనని అతడికి అర్థమైంది.  

దాంతో తానే ఆ జంతువును భయ పెడదామని అతడు తన దగ్గర ఉన్న ఒక చిన్నపాటి డప్పును వాయించడం మొదలుపెట్టాడు.  అప్పుడు విచిత్రంగా ఆ జంతువు కూడా పరుగును ఆపేసి నాట్యం చేయడం ప్రారంభించింది.  

బోయ డప్పును వాయిస్తూనే ఉన్నాడు.  ఆ జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  డప్పును ఒక్కక్షణం అతడు ఆపి వేసేసరికి మీదకు వస్తోంది.  అందుకని అతను ఆపకుండా డప్పును వాయిస్తూనే ఉండిపోయాడు.  ఆ జంతువు కూడా అలా నాట్యం చేస్తూనే ఉంది.  

అలా సాయంత్రమై చీకటి పడేంతవరకు డప్పు మోగుతునే ఉంది. ఆ  జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  పాపం నాట్యం చేసి చేసి అది బాగా అలసిపోయినట్లు కనిపించింది.  దాని కాళ్లు చేతులు నొప్పెడుతున్నట్లు తోచింది.  చాల ఆయాసపడుతోంది.  

బోయకు దాని మీద చాల జాలి కలిగింది.  ఒక్క క్షణం డప్పును మోగించడం ఆపేశాడు.  దాంతో అది బతుకుజీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.

బోయ ఉత్త చేతులతో ఇంటికి వచ్చాడు.   పిన్ని కోపానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.  నోటికొచ్చినట్లు బోయను తిట్టి పోసింది.  బోయ ఆరోజు పండ్లు లేకుండా వచ్చినందుకు కారణం చెప్పాడు.  

"సరే గొడవ ఎందుకు?  మన పిల్లవాడు బోయ క్షేమంగా వచ్చాడు, అదే చాలు" అన్నాడు తండ్రి.

కానీ పిన్ని నమ్మలేదు.  "బోయ అబద్ధం చెపుతున్నాడు" అంటూ అరిచింది.  "రేపు వీడితోనే కలిసి అడవికి పోదాం.  ఈరోజు వచ్చిన జంతువు రేపు రాదా?  ఈ పిల్లవాడి మాటలు నిజమో అబద్ధమో అప్పుడు తేల్చుకుందాం" అన్నది.

ఆ మరుసటి రోజు అందరూ కలిసి అడవికి వెళ్ళారు.  ఆ జంతువు ఎక్కడా కనబడలేదు.  

"చూశారా? వీడు అబద్ధం చెప్పాడని నాకు ముందే తెలుసును" అంటూ పిన్ని అరిచింది.  

బోయ మౌనంగా నది ఒడ్డున పండ్లను ఏరడం ప్రారంభించాడు.  అంతే!  ఉన్నట్టుండి మరల ఎక్కడనుంచో ఆ వింత జంతువు వచ్చేసింది.  

బోయ గమనించే లోపలే అతడి పిన్నిని తల్లిని తండ్రిని కూడా మింగేసింది.  తరువాత బోయను కూడా మింగేద్దామని ప్రయత్నించింది.

కానీ బోయ ఒడుపుగా తప్పుకున్నాడు.  తన డప్పును తీసి వాయించడం మొదలు పెట్టాడు.  ఆ జంతువు మరల నాట్యం చేయడం ప్రారంభించింది.

బోయ డప్పు కొడుతూనే ఉన్నాడు.  ఆ జంతువు అలా నాట్యం చేస్తూనే ఉంది.  అలా చాలాకాలం జరిగాక జంతువు ఒకవైపు నాట్యం చేస్తూనే డప్పును మోగించడం ఆపమని బోయను ప్రాధేయపడింది.  

"మా అమ్మా నాన్నలను విడిచిపెట్టే దాకా నేను వాయిస్తోనే ఉంటాను" అని బోయ సమాధానం చెప్పాడు.  

చేసేదేమీ లేక ఆ జంతువు అతడి అమ్మానాన్నలను బయటకు కక్కేసింది.  



ఒప్పందం ప్రకారం బోయ డప్పును మోగించడం మానేశాడు.  ఆ జంతువు పారిపోవడం మొదలుపెట్టింది.  

అప్పుడు బోయ తల్లి "డప్పు మోతను ఆపవద్దు" అని చెప్పింది.  "మీ పిన్ని కూడా బయటకు రానీ" అని కోరింది.  

బోయకు అలా జరగడం ఇష్టం లేదు.  అయినప్పటికీ తల్లి కోరికను మన్నించి డప్పును మరలా మోగించడం మొదలుపెట్టాడు.  

ఆ జంతువు నీరసంగా నాట్యం చేయడం మొదలు పెట్టింది.  "మీ అమ్మానాన్నలను తిరిగి ఇచ్చేశానుగా? మరలా ఎందుకు వాయిస్తున్నావు?" అని అడిగింది.

"మా పిన్నిని కూడా నువ్వు పొట్టన పెట్టుకున్నావు కదా? ఆమెను కూడా విడిచిపెట్టు" అని సమాధానం చెప్పాడు బోయ.

చేసేదేమీ లేక ఆ జంతువు ఆమె పిన్నిని కూడా బయటకు కక్కేసింది.

బోయ మోగించడం ఆపేశాడు.  అప్పుడా జంతువు బ్రతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.  

తరువాత అందరూ కావలసినన్ని పండ్లను ఏరుకొని ఇంటికి తిరిగి వచ్చేశారు.  

ఆ తరువాత ఇన్ని ఇంకెప్పుడు బోయను తిట్టలేదు. అతడిని జీవితాంతం తల్లిదండ్రుల కంటే ఎంతో ప్రేమతో దయతో చూసుకుంది.  
🍎🍎🍎🍎🍎🍎

ఇదీ కథ.

సరే, ఇందులో బోయ అనే పదాన్ని Boje అని వ్రాస్తారు.  దాన్ని మనం బోజే అని పలుకరాదు.  బోయ అని పలకాలిట. (నిజానికి భోజ అనే ప్రకృతిపదానికి బోయ అనేది వికృతిరూపం అని కొన్ని వాదనలు తెలుగుదేశంలో కూడా ఉన్నాయి.  చాల ఆశ్చర్యం కదూ?)   దక్షిణాఫ్రికా క్రికెట్ టీములో ఒకప్పుడు నికీ బోయె అనే ఒక ఆటగాడు ఉండేవాడు.   బోయ అది జర్మన్ పదమట.  దానికి అర్థం ఒక తాడుకు (మోకుకు) కట్టబడి నీళ్లలో తేలుతున్న కర్ర (కొయ్య మొద్దు) అని అర్థమట.  ఈ పదానికి లాటిన్ మూలాలు కూడా ఉన్నాయంటారు.

ఆఫ్రికాలో స్థిరపడిన యూరోప్ తెల్లజాతివారికి బోయర్లని పేరు.  (Boers)  బోయర్ అంటే యోధుడట.  వారు స్థానికులైన ఆటవిక-ఆఫ్రికన్లనుండి ఆ పేరును సంగ్రహించి ఉండవచ్చు. ఇంగ్లండ్ పెత్తనాన్ని సహించలేక వారు చేసిన యుద్ధాలకు ఆంగ్లో-బోయర్ యుద్ధాలంటారు.  

ఇంగ్లీషులో buoy అని వ్రాస్తారు.  పడవలు/నౌకలు కొట్టుకుపోకుండా ఆపే బోయకట్టె అని‌ ఆ పదానికి అర్థం.  విశాఖపట్నంలో పోర్టు దగ్గర వేంకటేశ్వరుని గుడినుండి స్టీమరులో సాగరదుర్గ గుడికి పోయేటపుడు హార్బరు కాలువలో ఈ విధమైన buoy లు కనిపిస్తాయి.



ఆ పదం నుండే buoyant అనే విశేషణం పుట్టుకొచ్చింది.  తేలికపరిచేది/తేలికైనది, ఉత్సాహపరిచేది/ఉత్సాహపూరితమైనది అనే అర్థంలో ఆ పదాన్ని వాడుతారు.  లైఫ్‌బాయ్ సబ్బు ప్రకటన గుర్తుందా?

సరే, మన తెలుగుదేశంలో కూడా బోయ అనే పదం వ్యవహారంలో ఉంది.  జంతువులను వేటాడి జీవించే ఆటవికుడు అనే అర్థంలో వాడుతాం.  దేశ జనాభా పెరిగి నాగరకత (నగరజీవనం) ప్రబలుతున్న కొద్దీ అడవులు నశించిపోతున్నకొద్దీ బోయలు కూడా క్రమంగా నాగరకులైనారు.  ఈనాటికి కూడా వారు భారతదేశమంతటా సమాజంలో అవిభాజ్యంగా ఉన్నారు.  

మాండలిక పదకోశం బోయ అనే పదానికి బెస్తవారు, మత్స్యకారులు అనే అర్థాన్ని కూడా చెబుతోంది.  పడవలు లేకుండా బెస్తవారిని ఎలా ఊహించగలం?  కాబట్టి, బోయలు ఒకప్పుడు చక్కని నౌకలను తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని (technology) కలిగి ఉండేవారని అర్థం చేసుకోవచ్చు.

రామాయణంలో కూడా అందుకు సాక్ష్యముంది.  ఆటవికుడైన బోయడు ఒకాయన రామునికి ప్రాణమివ్వగల మిత్రుడు.  గుర్తొచ్చిందా?  అతడి పేరు గుహుడు.  నిషాదరాజు (బోయల రాజు)  అతడికి ఐదువందల యుద్ధ నౌకలు ఉండేవట.  (చిన్న పడవలు కావు.)  ఒకొక్క నౌకలో నూరేసి కైవర్తయోధులు (బోయజాతికి చెందిన సైనికులు) ఉండేవారట.  వారు గొప్ప ధనుర్ధారులు కూడా.  వారు అడవులలో పనిబడినవారికి దగ్గరుండి దారి చూపేవారు.  రాముని మాత్రమే కాక, భరతుని సైన్యాన్ని సైతం గంగానదిని దాటించి చిత్రకూటంలో ఉన్న రాముని చెంతకు భరతుని తీసుకుపోయింది వారే.



అంతవరకు ఎందుకు?  స్వయంగా వందే వాల్మీకికోకిలమ్ అని మనం పూజించే మహర్షి పూర్వాశ్రమంలో బోయవాడని, ఋష్యనుగ్రహంతో తారకమంత్రం గ్రహించి తత్ప్రభావం వలన పరమభాగవతుడైనాడని ఐతిహ్యముంది కదా?




మనం పరమపూజ్యంగా భావించే భగవద్గీతను మహాభారతమనే ఇతిహాసపేటికలో భద్రపరచి మనకందించిన వ్యాసమహర్షి ఒక బోయకన్య (మత్స్యకన్య) అయిన సత్యవతి కుమారుడే కదా?  సత్యవతి తండ్రికి దాశరాజు అని వ్యవహారం.  ఆయన కూడా తన జాతికి ఒక రాజే.  నీ కూతురైన సత్యవతిని నాకు రాణిగా ఇవ్వమని శంతనుమహారాజు ఆయనను ప్రాధేయపడ్డాడు.  భీష్మప్రతిజ్ఞ జరిగిన తరువాతగాని, ఆమెను శంతనుడు తన రాణిగా చేసుకొనలేకపోయాడు.  ఆమె ఉపరిచరుడనే వసువు కుమార్తె అట.




అనుమానం రాకూడదు గాని, గంగపుత్రుడైన దేవవ్రతుడు (భీష్ముడు) పూర్వం ఒక బోస్ (వసు/వసువు) కదా?  (చూడండి - వసు>బసు>బోసు>బోష>బోజ>బోయ అంటూ దేశాంతరాల ఉచ్చారణలో మార్పు కలిగే అవకాశం ఉండవచ్చేమో.)  గంగపుత్రుడు అంటే మరలా మత్స్యకారుడే, బెస్తవాడే.

రామాయణకాలానికే బోయనాయకులు చిన్నపాటి రాజ్యాలు ఏలేవారని, తమ సైన్యంతో మహారాజులకు అవసరమైనపుడు తోడ్పడేవారని తెలుస్తోంది.   తెలుగుదేశాలలో వారి నివాసాలను కొట్టం అనేవారు.  తూర్పు చాళుక్యుల శాసనాలలో బోయ అనే ఇంటిపేరు కలిగిన బ్రాహ్మణుల ప్రసక్తి ఉన్నదంటారు.  

గ్రామనాయకుడు అనే అర్థం కలిగిన భోజ అనే పదం బోయగా మారిందని కొందరి వాదన.  కుంతిదేవిని పెంచుకున్నది భోజుడే.  కాళిదాసును పోషించిన భోజరాజు కథలు ప్రసిద్ధాలు.  మహాభారతకాలం నాటికి విదర్భరాజులకు భోజులు అని వ్యవహారం.  రుక్మిణి భోజకన్య.  ఆమె శ్రీకృష్ణుని పట్టపురాణి.  ఆమెను కృష్ణుడు ఎత్తుకొచ్చి మరీ పెండ్లి చేసుకున్నాడు.  వివాహవయస్సు వచ్చినప్పటికీ చాలకాలం పెళ్లికాని కన్యకలకు ఆ రుక్మిణీకల్యాణఘట్టాన్ని వింటే వెంటనే వివాహయోగం కలుగుతుందని తత్పఠన/శ్రవణఫలానుకీర్తనం కూడా చేస్తారు.



కాళహస్తిలో తన దైవమైన శివుని కంటె ఎత్తైన కొండపై వెలసిన కణ్ణప్ప కూడా బోయడే కదా?

ఆహా!
ఈ బోయ అనే పదం "ఆటవిక" అనే అర్థంలో భారత-ఆఫ్రికాదేశాలలోను, "మత్స్యకార/నావిక" అనే అర్థంలో భారత-యూరోపు దేశాలలోను ఉండడం గమనిస్తే DNA అనేది మనుషుల శరీరాలలోనే కాక భాషలలో కూడా ఉంటుందని తెలుస్తోంది కదా?


2 comments:

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...