Friday 20 March 2020

అలిపిరిలో ఫణిమర్దనుడు




కశ్యపమహర్షికి ప్రియమైన భార్యలు ఇద్దరు. కద్రువ, వినత. ఇద్దరికీ పరస్పరమాత్సర్యం ఎక్కువ. ఒకసారి కద్రువ ఒకానొక పందెంలో తన కుమారులైన సర్పాల సహాయంతో వినతను మోసం చేసి తనకు దాసిగా చేసుకుంది. వైనతేయుడు కూడా (వినత కుమారుడైన గరుత్మంతుడు కూడా) ఆ కద్రువకు, కాద్రవేయులకు (కద్రువ కుమారులైన సర్పాలకు) దాసుడై వారు చెప్పిన ప్రతి పని చేయవలసి వచ్చేది.

ఇలా కాదు, మమ్మల్ని దాస్యం నుండి విడిచిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి అన్నాడు గరుత్మంతుడు.

అమృతం తీసుకురా వదిలి పెడతాం అన్నారు సర్పాలు. గరుత్మంతుడు ఇంద్రుని ఓడించి వారికి అమృతం తెచ్చి ఇచ్చాడు. తనను, తన తల్లిని దాస్యం నుండి విడిపించుకున్నాడు. అయితే సర్పాలు అమృతం త్రాగకముందే ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. తనకు సహకరించినందుకు వరమిస్తానన్నాడు. అయితే నన్ను ఇంతకాలం ఏడిపించిన సర్పాలే నాకు ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. తథాస్తు అన్నాడు ఇంద్రుడు.

ఆ విషయం తెలిసి సర్పాలన్నీ భయపడి రమణకద్వీపానికి పారిపోయాయి. అయినా గరుత్మంతుడు వాటిని వదలలేదు. అపుడు సర్పాలు గరుత్మంతుని వేడుకున్నాయి. తమ్ముడూ, మీ సోదరులమైన మమ్మల్ని చంపకు. మానవులు మాకు భయపడి మేము వారిని ఏమీ చేయకుండా ఉండేందుకు గాను ఆహారం సమర్పిస్తూ ఉంటారు. అందులో నీకు కూడా భాగమిస్తాం. అది స్వీకరించి మమ్మల్ని వదిలి పెట్టు అన్నారు. గొడవ ఎందుకులెమ్మని గరుత్మంతుడు సరేనన్నాడు.

అయితే సర్పాలన్నిటిలో కాళియునికి కాస్త బలగర్వం ఎక్కువ. ఒకరోజు గరుత్మంతునికి భాగం పెట్టకుండా తానే మొత్తం ఆహారం భుజించేశాడు. దాంతో గరుత్మంతుడు కోపగించి "వీని తలలు చీరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణములఁ బాపి వచ్చెద" అని విజృంభించాడు. కాళియుడు ధైర్యంగానే ఎదిరించాడు గాని, అప్పటికి గాని తన బలం గరుత్మంతుని ముందు ఎందుకూ కొరగానిది అని తెలిసిరాలేదు.

వెంటనే పాకిపోయి కాళింది మడుగు చేరాడు. ఆపత్కాలంలో వాలినుండి ఆత్మరక్షణకోసం సుగ్రీవునికి ఋశ్యమూకం దొరికినట్టు కాళియుడికి కాళింది మడుగు దొరికింది. కాళింది మడుగులోని జీవాలకు హాని చేస్తే గరుత్మంతుడు మరణిస్తాడు అని సౌభరి ముని శాపం ఉన్నది. ఆ విధంగా కాళియుడు యుక్తితో చావు తప్పించుకున్నాడు. గరుత్మంతుడు ఊరకున్నాడు.

ఆ తరువాత కాళియుడు కాళింది మడుగులో విజృంభించాడు. మడుగులోని సమస్తజలాన్ని విషమయం చేశాడు. దానిపైనుండి పక్షులు ఎగిరితే అందులో పడి చచ్చేవి. దాని మీదనుండి వచ్చిన గాలి సోకితే గట్టున దూరంగా ఉండే జీవులు కూడా చచ్చిపడవలసిందే! ఈ వ్యవహారం తమ పశువులకు, తమ మిత్రులకు ప్రమాదకరంగా పరిణమించే సరికి కృష్ణుడు ఈ సంగతేమిటో తేల్చేయాలనుకున్నాడు.

కటి చేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దోస్తటసంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి తత్కుటశాఖాగ్రముమీఁదనుండి యురికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్.

కాళియుడికి కోపం వచ్చింది.
"బాలుండొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు మత్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేడు నా కోపంబు దీపింపగన్"
అనుకున్నాడట.

చూడండి.
అదే పొగరంటే.
అది మామూలు పొగరు కాదు.
దానిని తల పొగరు అంటారు.

బలవంతుడైన శత్రువుకు భయపడి తలదాచుకొనేందుకు వచ్చినవాడు, ఆ మడుగు చొచ్చిన వాడు, ఆ మడుగులో మొదటినుండి ఉన్న మిగిలిన ప్రాణులతో స్నేహంగా ఉండక, అన్నిటినీ హతమార్చి, దురాక్రమణ చేసి, ఇపుడు నా మడుఁగు నా మడుఁగు అని రక్షకుడైన కృష్ణునిపైనే దౌర్జన్యం చేయబూనుకున్నాడు. ఆ తలపొగరు ఒక్క తలది కాదు. అది నూరు తలల పొగరు!

కాళియుడు నూరుతలలతోనూ బాలకృష్ణుని కరిచాడు. పెనవేసుకున్నాడు. ఒడ్డున చూస్తున్న వారందరూ భయభ్రాంతులైనారు. అయ్యయ్యో అని ఆర్తనాదాలు చేశారు.

ఆపై కృష్ణుని విజృంభణం మొదలైంది. కాళియుని తలలపై నృత్యం చేశాడు. కాళింది కెరటాల ఘోషలు మృదంగరావాలైనాయి. "మహితకాళియఫణిఫణామండపమున నళినలోచనవిఖ్యాతనర్తకుండు నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె" నట!

ఆ దెబ్బకు ఆ ఫణి (పాము) పడగలు బెండుపడిపోయాయి. యొండొండ ముఖంబుల రక్తమాంసంబులుమియ వచ్చాయి. కన్నుల విషంబు వెలిగ్రక్కబడింది. పాము ఉక్కు చెడింది. చిక్కింది. దిక్కులు చూచింది. కంఠగతప్రాణమైంది.

"బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కియాడెడిన్" అని భావించాడు.

అంతలోనే తటాలున కాస్త తెలివి తళుక్కుమంది.
మామూలు బాలుడు ఇంతటి పని చేయగలడా?

"ఈతడు సర్వచరాచరభూతేశుండైన పరమపురుషుండు" అని తెలుసుకున్నాడు.

ఇంతలో కాళియుని భార్యలు ఏడుస్తున్న తమ పిల్లలను వెంటేసుకుని వచ్చారు.

"క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా" అని కృష్ణుని ప్రశంసించారు.

చివరకు తమ భర్తను క్షమించమన్నారు. "చాలున్ నీ పదతాండవంబు పతిభిక్షంబెట్టి రక్షింపవే!" అని వేడుకున్నారు.

కాళియుడు కూడా శరణువేడాడు. "మనిచెదేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవేనియు నిగ్రహింపుమింక సర్వేశ్వరా" నన్నేమి చేసినా నీ యిష్టము" అనేశాడు.

"చూడు నాయనా! గోవులు, మనుషులు ఈ మడుగులో నీరు త్రాగుతూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు, నీ బంధువులు, మీ మీ భార్యాబిడ్డలతో సహా, ఈ మడుగును వదిలి సముద్రానికి పొండి. నీవును నీ బాంధవులును, నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁడంబుధికిన్" అని ఆజ్ఞాపించాడు.

అపుడు కాళియునికి తాను చేసిన పాత తప్పులు గుర్తుకొచ్చాయి. కాళింది మడుగులోనే తన ప్రతాపమంతా. బయటకు అడుగు పెడితే తక్షణమే గరుత్మంతుడు చీల్చి చెండాడేస్తాడు. ఇక్కడే ఉంటానంటే కృష్ణుడు దండిస్తాడు. తన మూర్ఖత్వం వల్ల, నూరు తలకాయలనిండా ఉన్న పొగరుల వల్ల, తాను సర్వస్థలభ్రష్టుడనైనానని తెలిసివచ్చింది పాపం.

కృష్ణుడు అతడి ఆలోచనను గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. "భయపడకు కాళియా, నీ పడగలపై నా పాదముద్రలను చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు పో - మత్పదాబ్జలాంఛనములు నీ తలనుంటఁ జూచి యా పక్షిరాజు నిన్నుఁ బట్టఁడింక" అని వరమిచ్చాడు.

కాళియుడు సంతోషించి పుత్రమిత్రకళత్రసమేతంగా కృష్ణునికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి సముద్రానికి తరలిపోయాడు.

కాళింది మరలా సుధావారిం బొలు పారె నెల్లవారికిఁ బ్రియమై.

అదీ కథ.
)()()()()(

ఈ ఫోటో చూశారా?
ఫణిందమనుడు. ఫణిమర్దనుడు. "ఫొణి"ని సముద్రంలోనికి తరిమిన జగన్నాథుడు.

ఈ బాలుడు మత్ఫణాశతమును భగ్నము చేయుచున్నాడని కాళియుడు భావించాడు కదా? మరి నూరు పడగలేవీ? ఒకటే పడగను శిల్పి చిత్రీకరించాడు.

కృష్ణుడెపుడూ అంతేనని ఆ శిల్పి భావించాడో ఏమో.

మరోసారి "కరసహస్రంబుల కండూతి వాయు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తున్నుమానాయకా? యుద్ధం చేయాలనే నా వేయిచేతుల తీట ఎపుడు తీరుతుందో అని సరదాపడిన బాణాసురుని వేయిచేతులలో ఓ నాలుగింటిని వదిలేసి మిగిలిన తొమ్మిన్నూట తొంబైయారు చేతులు నరకలేదా అదే కృష్ణుడు?

అట్లే, కాళియుని నూరు తలకాయల పొగరు దించేసి, ఒక తలకాయను అట్లే వదిలేసి ఉంటాడని ఆ శిల్పిగారి ఉద్దేశమేమో.
)()()()(

ఈ కథలు సాంకేతికమనిపిస్తూ ఉంటాయి. కశ్యపుడు అంటే ఒక paternal gene పేరు, కద్రువ వినత అనేవి maternal genes పేర్లు కావచ్చు. రామాయణభారతాలలో ఈ కశ్యపుడు సమస్తజీవజాలనికీ (జంతువులకు, పక్షలకు, చెట్లకు, మనుషులకు కూడా) మూలబీజమనే సిద్ధాంతం కనిపిస్తుంది.

కశ్యపునికి ఇంకా చాలమంది భార్యలున్నారు. ఉదాహరణకు దితి, అదితి. వారి నడుమ కూడా మాత్సర్యమున్నదట. వారి సంతానమే దైత్యులు (రాక్షసులు), అదైత్యులు (దేవతలు) అంటారు. రాక్షసులు దేవతలు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే మూలపదార్థాలు అయ్యుండవచ్చు. క్షీరసాగరమంటే మనస్సు అని, చెడుతలంపులు విషమని, మంచి తలంపులు అమృతమని చెప్పడం తెలిసిన విషయమే. కాబట్టి, దేవతలు రాక్షసులు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే వివిధ హార్మోన్లకు పెట్టిన సాంకేతికనామాలు అయ్యుండవచ్చు. దితి అదితి అనేవి ఆ హార్మోన్లను ఉత్పాదన చేసే glands అయ్యుండవచ్చేమో!

కాబట్టి, సమస్తప్రాణులన్నిటికీ paternal gene సమానమే అయినా maternal gene మాత్రం భిన్నమనిపిస్తుంది. కాబట్టి, కశ్యప దితి అదితి కద్రువ వినత అనేవి సాంకేతిక నామాలే తప్ప మనుషుల పేర్లు కాకపోవచ్చును. ఒక సిద్ధాంతాన్ని కథలా చెబితే కలకాలం గుర్తుంచుకుంటారని ఇలా చెప్పారేమో అనిపిస్తుంది.

అలాగే కాళియుని కథ, అది విషపూరితమైన జలావరణాన్ని మనిషి కాపాడుకున్న కథ కావచ్చును.

ఎన్ని వేలయేండ్లనాటివో ఈ కథలు! ఉన్నతమైన చదువు కొందరికే పరిమితం కావడం, వారు కూడా కాలక్రమేణా ఇతరసంస్కృతుల సమ్మేళనంతో ఆనువంశికమైన చదువులను, విజ్ఞానాన్ని కోల్పోవడం, ఈ కథలను మతానికి అంటగట్టడం, పుక్కిటి పురాణాలు అని గేలి చేయడం, విదేశీయుల చేతిలో మనకు కలిగిన పరాజయానికి మనం వివశులమై, ఆత్మన్యూనతాభావంచేత నిలువెల్లా ఆక్రమింపబడి మన కథలను, మన పురాణాలను మనమే వెక్కిరించుకొనడం ప్రారంభమైంది. ఈ పతనం ఇప్పటికి మరింత వేగమౌతోందే తప్ప ఆగటం లేదు.

చిటారు కొమ్మన మిఠాయిపొట్లమంటే తేనె గూడు కాదు. ఇటువంటి జ్ఞానఫలమే! చూడనివారికి అది దక్కదు. ప్రయత్నం చేయనివారికి అది దక్కదు. ప్రయత్నం చేసినా పొట్టిచేతులవారికి దక్కదు. శాఖాగ్రానికి చేరుకున్నా, అందుకోలేక అక్కడనుండి పతనం చెందేవారికి అది దక్కదు. కష్టించి పైకెక్కగలిగి, చాల జాగ్రత్తలు కలిగిన వారికే అది దక్కేది!

అందని ద్రాక్షలు పుల్లన అని వెక్కిరించే గుంటనక్కలకు వాటి అనుచరులకు ఈ లోకంలో కొదవ లేదు.
)()()()(

ఈ శిల్పం అలిపిరిలో గరుడవిగ్రహానికి అనతి దూరంలో ఉన్న లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలోనిది.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...