Showing posts with label Purana. Show all posts
Showing posts with label Purana. Show all posts

Sunday, 13 June 2021

పరువు ఎవడబ్బ సొమ్ము


అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.

దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.

తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.

దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.

ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.

ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు

విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు. కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు. అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు. అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు. రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.

రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది. కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.

రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.
చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి, ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ వారు ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.

अहो धिगस्मान् यश आत्तधन्वनां
गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)

అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత, రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు

హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ. ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది. తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీముని హెచ్చరించింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.

ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“
(భారతం.1.152.18) అన్నాడు. ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువు తక్కువ పనిగా అనిపించింది!

“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.

ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు. “నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు దూరం పో పో” అన్నాడు. అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది

పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు. కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.

ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. ఆ రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు సంబంధించి ఒక సవాలుగా అనిపించింది.

“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.

“ఈ క్షత్రియకన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు గాను ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.😎 అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.

వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.

ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు

తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.

సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది.

శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రైవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.

భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.

అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”

योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)

అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.

బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!

न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)

అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.

अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”

అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు.

యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.

వారికి ఇదొక పరువు సమస్య అయింది!

కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.

శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు

జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.

సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.

बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येऽस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)

అని మీదపడి బంధించారు.

యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!

ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు.

భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.

“ఆహా! కాలమహిమ కాకుంటే, కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?

अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)

మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.

బలరాముడికి వొళ్లు మండింది.
“ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?

उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)

ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను.

अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”

అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది.

కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు.

దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.

గొడవ చల్లబడింది.

6 మధువు

రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు. కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.

ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు.

వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.

రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అందరినీ అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.

दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)

ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది.
“ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా”

स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)

అంటూ వారు శపించేశారు.

ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం?

మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!

అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.

అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.

రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.

क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)

మొత్తానికి అలా రాజీ కుదిరింది.

తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.

అయితే రావణుడి బావ అయిన మధువు మహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు. కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది గృహస్థులకు ఒక మానసికమైన పీడ.

కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు.

ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు. ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు. లేకపోతే చచ్చారు. అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా?
అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏ ఒక్కటీ లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, సమాజంలో గగ్గోలు పుట్టించడాలు మానుకోండి. 

Friday, 20 March 2020

అలిపిరిలో ఫణిమర్దనుడు




కశ్యపమహర్షికి ప్రియమైన భార్యలు ఇద్దరు. కద్రువ, వినత. ఇద్దరికీ పరస్పరమాత్సర్యం ఎక్కువ. ఒకసారి కద్రువ ఒకానొక పందెంలో తన కుమారులైన సర్పాల సహాయంతో వినతను మోసం చేసి తనకు దాసిగా చేసుకుంది. వైనతేయుడు కూడా (వినత కుమారుడైన గరుత్మంతుడు కూడా) ఆ కద్రువకు, కాద్రవేయులకు (కద్రువ కుమారులైన సర్పాలకు) దాసుడై వారు చెప్పిన ప్రతి పని చేయవలసి వచ్చేది.

ఇలా కాదు, మమ్మల్ని దాస్యం నుండి విడిచిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి అన్నాడు గరుత్మంతుడు.

అమృతం తీసుకురా వదిలి పెడతాం అన్నారు సర్పాలు. గరుత్మంతుడు ఇంద్రుని ఓడించి వారికి అమృతం తెచ్చి ఇచ్చాడు. తనను, తన తల్లిని దాస్యం నుండి విడిపించుకున్నాడు. అయితే సర్పాలు అమృతం త్రాగకముందే ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. తనకు సహకరించినందుకు వరమిస్తానన్నాడు. అయితే నన్ను ఇంతకాలం ఏడిపించిన సర్పాలే నాకు ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. తథాస్తు అన్నాడు ఇంద్రుడు.

ఆ విషయం తెలిసి సర్పాలన్నీ భయపడి రమణకద్వీపానికి పారిపోయాయి. అయినా గరుత్మంతుడు వాటిని వదలలేదు. అపుడు సర్పాలు గరుత్మంతుని వేడుకున్నాయి. తమ్ముడూ, మీ సోదరులమైన మమ్మల్ని చంపకు. మానవులు మాకు భయపడి మేము వారిని ఏమీ చేయకుండా ఉండేందుకు గాను ఆహారం సమర్పిస్తూ ఉంటారు. అందులో నీకు కూడా భాగమిస్తాం. అది స్వీకరించి మమ్మల్ని వదిలి పెట్టు అన్నారు. గొడవ ఎందుకులెమ్మని గరుత్మంతుడు సరేనన్నాడు.

అయితే సర్పాలన్నిటిలో కాళియునికి కాస్త బలగర్వం ఎక్కువ. ఒకరోజు గరుత్మంతునికి భాగం పెట్టకుండా తానే మొత్తం ఆహారం భుజించేశాడు. దాంతో గరుత్మంతుడు కోపగించి "వీని తలలు చీరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణములఁ బాపి వచ్చెద" అని విజృంభించాడు. కాళియుడు ధైర్యంగానే ఎదిరించాడు గాని, అప్పటికి గాని తన బలం గరుత్మంతుని ముందు ఎందుకూ కొరగానిది అని తెలిసిరాలేదు.

వెంటనే పాకిపోయి కాళింది మడుగు చేరాడు. ఆపత్కాలంలో వాలినుండి ఆత్మరక్షణకోసం సుగ్రీవునికి ఋశ్యమూకం దొరికినట్టు కాళియుడికి కాళింది మడుగు దొరికింది. కాళింది మడుగులోని జీవాలకు హాని చేస్తే గరుత్మంతుడు మరణిస్తాడు అని సౌభరి ముని శాపం ఉన్నది. ఆ విధంగా కాళియుడు యుక్తితో చావు తప్పించుకున్నాడు. గరుత్మంతుడు ఊరకున్నాడు.

ఆ తరువాత కాళియుడు కాళింది మడుగులో విజృంభించాడు. మడుగులోని సమస్తజలాన్ని విషమయం చేశాడు. దానిపైనుండి పక్షులు ఎగిరితే అందులో పడి చచ్చేవి. దాని మీదనుండి వచ్చిన గాలి సోకితే గట్టున దూరంగా ఉండే జీవులు కూడా చచ్చిపడవలసిందే! ఈ వ్యవహారం తమ పశువులకు, తమ మిత్రులకు ప్రమాదకరంగా పరిణమించే సరికి కృష్ణుడు ఈ సంగతేమిటో తేల్చేయాలనుకున్నాడు.

కటి చేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దోస్తటసంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి తత్కుటశాఖాగ్రముమీఁదనుండి యురికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్.

కాళియుడికి కోపం వచ్చింది.
"బాలుండొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు మత్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేడు నా కోపంబు దీపింపగన్"
అనుకున్నాడట.

చూడండి.
అదే పొగరంటే.
అది మామూలు పొగరు కాదు.
దానిని తల పొగరు అంటారు.

బలవంతుడైన శత్రువుకు భయపడి తలదాచుకొనేందుకు వచ్చినవాడు, ఆ మడుగు చొచ్చిన వాడు, ఆ మడుగులో మొదటినుండి ఉన్న మిగిలిన ప్రాణులతో స్నేహంగా ఉండక, అన్నిటినీ హతమార్చి, దురాక్రమణ చేసి, ఇపుడు నా మడుఁగు నా మడుఁగు అని రక్షకుడైన కృష్ణునిపైనే దౌర్జన్యం చేయబూనుకున్నాడు. ఆ తలపొగరు ఒక్క తలది కాదు. అది నూరు తలల పొగరు!

కాళియుడు నూరుతలలతోనూ బాలకృష్ణుని కరిచాడు. పెనవేసుకున్నాడు. ఒడ్డున చూస్తున్న వారందరూ భయభ్రాంతులైనారు. అయ్యయ్యో అని ఆర్తనాదాలు చేశారు.

ఆపై కృష్ణుని విజృంభణం మొదలైంది. కాళియుని తలలపై నృత్యం చేశాడు. కాళింది కెరటాల ఘోషలు మృదంగరావాలైనాయి. "మహితకాళియఫణిఫణామండపమున నళినలోచనవిఖ్యాతనర్తకుండు నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె" నట!

ఆ దెబ్బకు ఆ ఫణి (పాము) పడగలు బెండుపడిపోయాయి. యొండొండ ముఖంబుల రక్తమాంసంబులుమియ వచ్చాయి. కన్నుల విషంబు వెలిగ్రక్కబడింది. పాము ఉక్కు చెడింది. చిక్కింది. దిక్కులు చూచింది. కంఠగతప్రాణమైంది.

"బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కియాడెడిన్" అని భావించాడు.

అంతలోనే తటాలున కాస్త తెలివి తళుక్కుమంది.
మామూలు బాలుడు ఇంతటి పని చేయగలడా?

"ఈతడు సర్వచరాచరభూతేశుండైన పరమపురుషుండు" అని తెలుసుకున్నాడు.

ఇంతలో కాళియుని భార్యలు ఏడుస్తున్న తమ పిల్లలను వెంటేసుకుని వచ్చారు.

"క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా" అని కృష్ణుని ప్రశంసించారు.

చివరకు తమ భర్తను క్షమించమన్నారు. "చాలున్ నీ పదతాండవంబు పతిభిక్షంబెట్టి రక్షింపవే!" అని వేడుకున్నారు.

కాళియుడు కూడా శరణువేడాడు. "మనిచెదేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవేనియు నిగ్రహింపుమింక సర్వేశ్వరా" నన్నేమి చేసినా నీ యిష్టము" అనేశాడు.

"చూడు నాయనా! గోవులు, మనుషులు ఈ మడుగులో నీరు త్రాగుతూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు, నీ బంధువులు, మీ మీ భార్యాబిడ్డలతో సహా, ఈ మడుగును వదిలి సముద్రానికి పొండి. నీవును నీ బాంధవులును, నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁడంబుధికిన్" అని ఆజ్ఞాపించాడు.

అపుడు కాళియునికి తాను చేసిన పాత తప్పులు గుర్తుకొచ్చాయి. కాళింది మడుగులోనే తన ప్రతాపమంతా. బయటకు అడుగు పెడితే తక్షణమే గరుత్మంతుడు చీల్చి చెండాడేస్తాడు. ఇక్కడే ఉంటానంటే కృష్ణుడు దండిస్తాడు. తన మూర్ఖత్వం వల్ల, నూరు తలకాయలనిండా ఉన్న పొగరుల వల్ల, తాను సర్వస్థలభ్రష్టుడనైనానని తెలిసివచ్చింది పాపం.

కృష్ణుడు అతడి ఆలోచనను గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. "భయపడకు కాళియా, నీ పడగలపై నా పాదముద్రలను చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు పో - మత్పదాబ్జలాంఛనములు నీ తలనుంటఁ జూచి యా పక్షిరాజు నిన్నుఁ బట్టఁడింక" అని వరమిచ్చాడు.

కాళియుడు సంతోషించి పుత్రమిత్రకళత్రసమేతంగా కృష్ణునికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి సముద్రానికి తరలిపోయాడు.

కాళింది మరలా సుధావారిం బొలు పారె నెల్లవారికిఁ బ్రియమై.

అదీ కథ.
)()()()()(

ఈ ఫోటో చూశారా?
ఫణిందమనుడు. ఫణిమర్దనుడు. "ఫొణి"ని సముద్రంలోనికి తరిమిన జగన్నాథుడు.

ఈ బాలుడు మత్ఫణాశతమును భగ్నము చేయుచున్నాడని కాళియుడు భావించాడు కదా? మరి నూరు పడగలేవీ? ఒకటే పడగను శిల్పి చిత్రీకరించాడు.

కృష్ణుడెపుడూ అంతేనని ఆ శిల్పి భావించాడో ఏమో.

మరోసారి "కరసహస్రంబుల కండూతి వాయు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తున్నుమానాయకా? యుద్ధం చేయాలనే నా వేయిచేతుల తీట ఎపుడు తీరుతుందో అని సరదాపడిన బాణాసురుని వేయిచేతులలో ఓ నాలుగింటిని వదిలేసి మిగిలిన తొమ్మిన్నూట తొంబైయారు చేతులు నరకలేదా అదే కృష్ణుడు?

అట్లే, కాళియుని నూరు తలకాయల పొగరు దించేసి, ఒక తలకాయను అట్లే వదిలేసి ఉంటాడని ఆ శిల్పిగారి ఉద్దేశమేమో.
)()()()(

ఈ కథలు సాంకేతికమనిపిస్తూ ఉంటాయి. కశ్యపుడు అంటే ఒక paternal gene పేరు, కద్రువ వినత అనేవి maternal genes పేర్లు కావచ్చు. రామాయణభారతాలలో ఈ కశ్యపుడు సమస్తజీవజాలనికీ (జంతువులకు, పక్షలకు, చెట్లకు, మనుషులకు కూడా) మూలబీజమనే సిద్ధాంతం కనిపిస్తుంది.

కశ్యపునికి ఇంకా చాలమంది భార్యలున్నారు. ఉదాహరణకు దితి, అదితి. వారి నడుమ కూడా మాత్సర్యమున్నదట. వారి సంతానమే దైత్యులు (రాక్షసులు), అదైత్యులు (దేవతలు) అంటారు. రాక్షసులు దేవతలు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే మూలపదార్థాలు అయ్యుండవచ్చు. క్షీరసాగరమంటే మనస్సు అని, చెడుతలంపులు విషమని, మంచి తలంపులు అమృతమని చెప్పడం తెలిసిన విషయమే. కాబట్టి, దేవతలు రాక్షసులు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే వివిధ హార్మోన్లకు పెట్టిన సాంకేతికనామాలు అయ్యుండవచ్చు. దితి అదితి అనేవి ఆ హార్మోన్లను ఉత్పాదన చేసే glands అయ్యుండవచ్చేమో!

కాబట్టి, సమస్తప్రాణులన్నిటికీ paternal gene సమానమే అయినా maternal gene మాత్రం భిన్నమనిపిస్తుంది. కాబట్టి, కశ్యప దితి అదితి కద్రువ వినత అనేవి సాంకేతిక నామాలే తప్ప మనుషుల పేర్లు కాకపోవచ్చును. ఒక సిద్ధాంతాన్ని కథలా చెబితే కలకాలం గుర్తుంచుకుంటారని ఇలా చెప్పారేమో అనిపిస్తుంది.

అలాగే కాళియుని కథ, అది విషపూరితమైన జలావరణాన్ని మనిషి కాపాడుకున్న కథ కావచ్చును.

ఎన్ని వేలయేండ్లనాటివో ఈ కథలు! ఉన్నతమైన చదువు కొందరికే పరిమితం కావడం, వారు కూడా కాలక్రమేణా ఇతరసంస్కృతుల సమ్మేళనంతో ఆనువంశికమైన చదువులను, విజ్ఞానాన్ని కోల్పోవడం, ఈ కథలను మతానికి అంటగట్టడం, పుక్కిటి పురాణాలు అని గేలి చేయడం, విదేశీయుల చేతిలో మనకు కలిగిన పరాజయానికి మనం వివశులమై, ఆత్మన్యూనతాభావంచేత నిలువెల్లా ఆక్రమింపబడి మన కథలను, మన పురాణాలను మనమే వెక్కిరించుకొనడం ప్రారంభమైంది. ఈ పతనం ఇప్పటికి మరింత వేగమౌతోందే తప్ప ఆగటం లేదు.

చిటారు కొమ్మన మిఠాయిపొట్లమంటే తేనె గూడు కాదు. ఇటువంటి జ్ఞానఫలమే! చూడనివారికి అది దక్కదు. ప్రయత్నం చేయనివారికి అది దక్కదు. ప్రయత్నం చేసినా పొట్టిచేతులవారికి దక్కదు. శాఖాగ్రానికి చేరుకున్నా, అందుకోలేక అక్కడనుండి పతనం చెందేవారికి అది దక్కదు. కష్టించి పైకెక్కగలిగి, చాల జాగ్రత్తలు కలిగిన వారికే అది దక్కేది!

అందని ద్రాక్షలు పుల్లన అని వెక్కిరించే గుంటనక్కలకు వాటి అనుచరులకు ఈ లోకంలో కొదవ లేదు.
)()()()(

ఈ శిల్పం అలిపిరిలో గరుడవిగ్రహానికి అనతి దూరంలో ఉన్న లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలోనిది.

Thursday, 12 March 2020

జలదానమహిమ

అనగా అనగా...
పూర్వం శ్రుతసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు.  అతడి రాజధాని ఉజ్జయిని. అతనికి సుదేవి అని ఒక కుమార్తె ఉండేది.  ఆమె చాల అందమైనది.  చక్కని నడవడిక కలిగినది.  మంచి స్వభావం కలిగినది.  అందరితోనూ చక్కగా మాట్లాడేది.  దయతో వ్యవహరించేది.  ధర్మమార్గంలో సంచరించాలి అని దృఢమైన వ్రతాన్ని కలిగి ఉండేది.

ఆమె చిన్నతనం నుంచి కూడా జలదానం చేస్తూ ఉండేది.  (పానీయదానమకరోత్ సర్వధర్మోత్తమోత్తమమ్।)  

తన స్నేహితురాళ్లకు బంగారుపాత్రలలో లవంగాలు కలిపిన సుగంధభరితమైన నీరు తెచ్చి ఇస్తూ సంతోషపెట్టేది. 

మిగిలిన పనులన్నీ విడిచిపెట్టి జింకపిల్లలకు, చిలుకలకు, నెమళ్లకు, హంసలకు నీరుపోసి సంతోషపెట్టేది.  కాలువలు తవ్వించి వాటిగుండా ఉద్యానవనాలలోని చెట్లకు నీరు పెట్టేది.

బాటసారులు ప్రయాణించే దారులలో విశ్రాంతి కోసం తోటలను ఏర్పాటు చేసేది.  నూతులను త్రవ్వించేది.  వాటిలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకొనేది.  మరుభూములలో బావులను త్రవ్వించి నీరు పోయించేది.  దట్టమైన అడవులలో ప్రయాణించే వారికి కూడా నీళ్లను అందించి వారిని ఆనందింపజేసేది. (కాంతారేషు దురంతేషు పాంథానందవిధాయినీ।)

ఆవిడ త్రవ్వించిన పుష్కరిణులలో వికసించిన తెల్లని పద్మాలు ఉండేవి. నీటిపక్షులు అందులో సేద దీరుతూ ఉండేవి.  తటాకాలు పూడి పోకుండా వాటి గట్లు గట్టిగా ఉండేలా చేసింది.  అందులో చల్లటి నీరు ఉండేలా చేసింది.  ఇవన్నీ కేవలం తమ రాజ్యంలోనే కాక, ఇతర రాజ్యాలలో కూడా చేసింది.

ఈవిధంగా ఆమె జలదానాన్ని మించి మరొక ధర్మం లేదని భావించింది.  (జలదానాత్ పరం ధర్మం నాన్యం సా బహ్వమన్యత।) 

రాజపుత్రి చేస్తున్న పనులను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేవారు. ఆమె స్నేహితురాళ్ళు పౌరులు ఎంతో ఆశ్చర్యపోయేవారు.  జానపదులు తీర్థయాత్రికులు, అందరూ ఆ రాజపుత్రిని ఎంతో గౌరవించేవారు. మహామునులు కూడా ఆమెను ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారు.  (మునయశ్చ ప్రశస్తాస్తాం ప్రశసంసురితస్తతః।)

ఒకసారి ధర్మతత్త్వజ్ఞులు అయిన మహర్షులు కొందరు రాజును కలుసుకొనేందుకు వచ్చారు.  రాజుచేత యథోచితంగా సత్కరింపబడి, రాజుకు ధర్మోపదేశం చేశారు.  ఆశీర్వదించారు.  ఇంతలో, వారు ఇంతకు మునుపే ఎవరిని గూర్చి విన్నారో ఆ రాజపుత్రి రాజుగారి సేవకులకు నీరు అందిస్తూ ఉండటం చూశారు.  రాజపుత్రి కూడా మహర్షులను చూసి వినయంగా నమస్కారం చేసింది.  వారు చాల సంతోషించి ఆమెను ప్రశంసించి దీవించారు. 

ఆ మహర్షులకు ఆమె విషయంలో ఎప్పటినుండో ఒక సందేహం ఉన్నది.  సమస్త-అభీష్టాలను తీర్చే ఎన్నో విధములైన ధర్మాలు ఉండగా,  ఆమె జలదానవ్రతాన్ని మాత్రమే ఎందుకు స్వీకరించిందో వారికి తెలియదు.  అందువల్ల, ఆ విషయాన్ని గూర్చి వారు రాజుగారి ఎదుటనే అడిగి, తమ సందేహాన్ని తీర్చమని అడిగారు.

అపుడు రాజపుత్రి వారికి ఒక కథను చెప్పింది. 

“గంగాకాళిందీతీరాలలో ఉండే వనాలలో కొందరు పుళిందులు ఉన్నారు.  వారు పక్షులను మృగాలను వేటాడుతూ ఉంటారు.  వారిలో అతి క్రూరుడైన ఒక పుళిందుడు ఉండేవాడు. 

ఒకసారి వేసవికాలంలో అతడు తన భార్యతో సహా అడవిలో వేటకోసం వెళ్లాడు.  అడవిలో ఎంతగా సంచరించినా వారికి ఒక్క జంతువు కూడా కనబడలేదు.  కాని, ఎండలో తిరిగి తిరిగి బాగా అలసిపోయారు.  అందువల్ల గంగానదిలో దిగి స్నానం చేయసాగారు. 

ఇంతలో పుళిందుడికి ఒడ్డున ఒక జింక కనిపించింది.  వెంటనే అతడు స్నానం మాని,ఆ జింకను వేటాడదలచి తన భార్యను నదిలో అలాగే వదిలిపెట్టి, ధనుస్సును అందుకుని దాని వెంట పడ్డాడు.  ఆమె స్నానం పూర్తిచేసుకుని నదినుండి బయటకు  వచ్చింది.  నిప్పులాగా కాలిపోతున్న ఆ ఇసుక తిన్నెల మీద తన భర్త వెళ్లిన దిశగా పరుగెత్తింది. 

అయితే ఆమెకు ఎంతో దూరం ముందుకు పోలేకపోయింది.  తీక్ష్ణమైన ఆ ఎండలో ఆమెకు బాగా దాహం ఎక్కువ అయింది.  ముందుకు కదలడానికి కూడా శక్తి లేకపోయింది. కాసేపు ఆ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు క్రింద చల్లటి నీడలో నిలబడింది. 

ఇంతలో ఆమెకు అదే చెట్టు నీడలో ఉన్న ఒక బకోటపక్షి (కొంగజాతికి చెందిన ఒక పక్షి) కనిపించింది.  అది కూడా అతి తీవ్రమైన సూర్యకిరణాల దెబ్బకు నిశ్చేష్టమై పడిపోయి ఉంది.  ఎంతో దాహంతో పరితపిస్తోంది.  దాని ప్రాణాలు కంఠంలోనికి వచ్చి ఉన్నాయి.  నోరు తెరిచి ఆయాసపడుతూ కదలలేకుండా ఉన్నది. 

దానిని చూసిన ఆ పుళిందుని భార్య ఎంతో జాలి పడింది.  ఆమె మనసు కరుణతో నిండి పోయింది.  "అయ్యో, ఇది దాహంతో ప్రాణాలు వదిలేలా ఉన్నదే!  పాపం దీనికి కాసిని నీళ్ళు పోయాలి" అనుకుంది.

నిర్దాక్షిణ్యంగా జంతువుల ప్రాణాలు తీసే ఆమెకు ఆ కొంగ మీద జాలి కలగడం చాలా ఆశ్చర్యం. 

ఎంతటి పాపాత్మునికైనా ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం చేసే బుద్ధి తప్పకుండా కలుగుతుంది.  (పాపినోऽపి మతిః పుణ్యా కదాచిత్ జాయతే భృశమ్।)  

అందువల్లనే ఆ పుళిందస్త్రీకి అటువంటి మంచి బుద్ధి పుట్టింది. 

అప్పుడు ఆమె తన జుత్తుముడిని విప్పి, ఆ జుత్తును తన చేతులతో పట్టుకొని, కొంగ నోటిలో నీటిని పడేలా పిండింది.  అంతకు మునుపే ఆమె గంగలో మునకలు వేసి స్నానం చేసి ఉండటం వలన ఆమె తడి జుత్తులో నీరు ఉండింది. 

దాంతో ఆ కొంగకు కొద్దిగా ఆశ్వాసన కలిగింది.  పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చాయి.  నెమ్మదిగా తల ఎత్తింది.  ముక్కుపుటాలను కొంచెం కదిలించింది.  పుళిందస్త్రీ మళ్లీ మరోసారి తన జుత్తును పిండి దాని నీటిలోనికి నీళ్లు పడేలా చేసింది. 

ఆ కొంగ ఒకొక్క చుక్క ఒకొక్క చుక్కగా నీటిని త్రాగింది.  నెమ్మదిగా అది తిరిగి నిలబడగలిగింది.

అయితే, అప్పటికి కూడా తన భర్త ఇంకా తిరిగి రాకపోవడం చూసి, ఎండ కూడా కాస్త తగ్గడం చూసి, ఆమె తన భర్తను వెతుకుతూ, ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయింది.

ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ పుళిందస్త్రీ మరణించింది.”

ఇలా చెప్పి రాజపుత్రి తన కథను ముగిస్తూ, “ఓ మహర్షులారా! తాను చేసిన జలదానం ఫలితంగా ఆ పుళిందస్త్రీ మరుసటి జన్మలో రాజపుత్రికగా పుట్టింది.  మరెవరో కాదు, నేనే ఆ రాజపుత్రికను.  ఇప్పటికీ ఆ పూర్వజన్మజ్ఞానం ఉండటం వల్ల నాకు జరిగినదంతా గుర్తున్నది.  అందువలన, జలదానమనే అంతటి పుణ్యకార్యాన్ని ఈ జన్మలో కూడా నేను వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నాను” అని తెలియజేసింది.

ఆమె కథను విన్నవారందరూ ఎంతో ఆశ్చర్యపోతూ ఉండగా, రాజపుత్రి ఇంకా ఇలా చెప్పింది -

“కేవలం కొన్ని నీటిచుక్కలతో ఒక ప్రాణిని సంతోషపెట్టడం వల్లనే ఇంతటి గొప్ప పుణ్యం వచ్చింది కదా, అటువంటిది తటాకాలు మొదలైన వాటిని నిర్మించి జలదానం చేస్తూ ఉంటే మరెంతటి పుణ్యం వస్తుందో కదా! 

నాకు సనాతనమైన సూక్ష్మమైన ధర్మం గురించి పెద్దగా తెలియదు.  కాని, మీవంటి మహాత్ముల నోటి నుండి నేను విన్నదాన్ని మాత్రమే నేను గ్రహించాను.

దాహంతో బాధపడుతున్న వాడికి నీటిని దానం చేసి సంతోషపెడితే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.  ఒక నూతిని త్రవ్వించిన వాడికి వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన వాడికి మించి నూరు రెట్లు ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఎన్నడూ ఎండిపోని ఒక పెద్ద దిగుడు బావిని త్రవ్విస్తారో, అతడికి నూతిని త్రవ్వించిన వానికి మించి వేయి రెట్లు ఫలితం లభిస్తుంది.  అలాగే, ఒక పుష్కరిణిని త్రవ్వించిన వానికి దిగుడుబావిని తవ్వించిన వానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఒక సరస్సును నిర్మిస్తారో వారికి పుష్కరిణిని త్రవ్వించిన వానిని మించి పదివేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  అలాగే, కాలువను త్రవ్వించి అందులో నీటిని ప్రవహింపజేసే వాళ్లకు వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే అది వేయితలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యం.  నిత్యం నీళ్లు ఊరే తటాకాన్ని త్రవ్వించిన వానికి వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే సాక్షాత్తు పరమశివుడికే సాధ్యం. 

అందువల్ల మనుషులు జలదానం చేయాలనే బుద్ధిని కలిగి ఉండాలి.  అందువల్ల ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అతనికి సిద్ధి కలుగుతుంది” అని రాజపుత్రి ముగించింది. 

మహర్షులు, రాజు, పౌరులు, సభాసదులు అందరూ ఆమె కథను విని, ఆమె దృఢనిశ్చయానికి తగిన కారణం విని ఎంతో ఆనందించారు.  ఆమెను ప్రశంసించారు.  దీవించారు.

(ఫిబ్రవరి,2020 యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.)
🌳🌳🌳

మనం కూడా మనుషులమే కదా?
మనం కూడా జలదానం చేయవచ్చు.  ముఖ్యంగా ఎండలు క్రమంగా ముదురుతున్న కాలంలో మొదలు పెట్టి మంచి వర్షాలు పడేంత కాలం వరకు ఏదో ఒకవిధంగా చేయవచ్చు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...