Friday 16 April 2021

మన రాముని కథలు 3


“శస్త్తేణాజీవనం రాజ్ఞో భూతానాం చాభిరక్షణమ్” అని రాజనీతిశాస్త్రాలు రాజధర్మాన్ని ఉద్ఘోషించాయి. రాజులకు ఆయుధవిద్యలతోనే బ్రతుకుతెరువు. బ్రహ్మసృష్టిని యథాతథంగా సంరక్షించడం అనేది వారికి అప్పజెప్పబడిన విధి.

అయితే అది అంత సులువు కాదు. నిత్యం అధర్మపరులను అదుపులో ఉంచడం, రకరకాల దండనల ద్వారా వారిలో మార్పు తేవడం, తమ తమ సామాజికధర్మాలను ప్రజలందరూ అసూయారహితులై పరిపాలించేలా చూడటం, ధర్మసంరక్షణకోసం అవసరమైతే నిస్సంకోచంగా ప్రాణత్యాగం చేయడం - ఇవన్నీ వారి బాధ్యతలు. అందువల్లనే దశరథమహారాజు తన నలుగురు కుమారులను చక్కని విద్యావంతులను చేశాడు. అశ్వగజరథచాలనాదులలోను, ధనుర్వేదంలోను, పితృశుశ్రూషణలోను కుమారులందరూ నిష్ణాతులైనారు. రాజకుమారులందరూ గొప్ప తేజస్వులు, అయినప్పటికీ మన రాముడు పరమప్రశాంతుడై సదానందలసదంతరంగుడై నిత్యసత్యవ్రతుడై సమస్తప్రజలందరికీ ప్రేమపాత్రుడైనాడు. నిత్యం అన్నను తమ ఆదర్శమూర్తిగా భావించే తమ్ములు కూడా క్రమంగా అటువంటివారే ఐనారు. అటువంటి మన రాముడే లోకకంటకుడైన రావణాసురుని పీడను తొలగించేందుకు సమర్థుడు అని దేవగణాలు, ఋషిసంఘాలు నిశ్చయించుకున్నాయి. బాల్యం నుండే అతనికి తగిన శిక్షణనివ్వాలని నిశ్చయించాయి. ఆ కార్యాన్ని కార్యసాధకుడైన విశ్వామిత్రునకు అప్పగించాయి. విశ్వామిత్రుడు పరమానందంతో ఆ బాధ్యతను అంగీకరించాడు. నా యాగసంరక్షణకోసం రాముడు అవసరం అని దశరథుని అడిగి, అతడు వెనుకంజ వేస్తే కాస్త బెదిరించి మరీ రాముని తీసుకుని తన ఆశ్రమానికి పోతున్నాడు. మన రాముని అనుసరించి మన లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. తనతో పాటు కొండలు కోనలు ఎక్కుతూ దిగుతూ, నదులను దాటుతూ, కంటకావృతమైన అరణ్యమార్గాలలో ఎఱ్ఱని ఎండలో కాసేపు ఆగుదాం అని కూడా అడుగకుండా నడచివస్తున్న ఈ చిన్నారి కుఱ్ఱలను చూసేసరికి విశ్వామిత్రునికి జాలి కలిగింది. శిక్షణలో భాగంగా వారిని విచక్షణాపరులైన మహావీరులుగా తీర్చిదిద్దడం తన బాధ్యత. అందువలన మన రామునికి బల అతిబల అనే విద్యలను ప్రసాదించాడు. రామా, వీటి ప్రభావం వలన నీకు అలసట కలుగదు, జ్వరం రాదు, నీ వన్నె తఱుగదు, నీవు నిద్రిస్తున్నపుడు గాని, ఏమరుపాటుగా ఉన్నపుడూ గాని, ఆసురశక్తులు నీకు హాని కలిగించలేరు. బాహుబలంలో నీకు సాటిరాగలవారు ఈ ముల్లోకాలలోనూ ఎవరూ ఉండరు. సౌభాగ్యంలో గాని, దాక్షిణ్యంలోగాని, జ్ఞానంలోగాని, నిశ్చయబుద్ధిలోగాని, సమాధానాలు ఇవ్వటంలోగాని నీతో సరిసమానులు ఎవరూ ఉండరు. నిన్ను ఆకలిదప్పులు బాధించవు అని ఆ విద్యల ప్రభావాన్ని వివరించాడు. ప్రదాతుం తవ కాకుత్స్థ సదృశస్త్వం హి ధార్మిక (రా.1.22.18) నీవు ధర్మాత్ముడవు కాబట్టే ఈ విద్యలను స్వీకరించేందుకు పాత్రుడవైనావు అని స్పష్టంగా సూచించాడు. ఆ తరువాత గురువుగారి ఆదేశానుసారం తాటకావధ చేసిన మన రాముని చూసి ఆనందించిన దేవతలందరూ విశ్వామిత్రునితో, మునే కౌశిక భద్రం తే... స్నేహం దర్శయ రాఘవే... తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ। కర్తవ్యం చ మహత్ కర్మ సురాణాం రాజసూనునా... (రా.1.26.28-30) బ్రహ్మర్షీ, రాముడు చేయవలసిన గొప్ప దేవకార్యం ఉన్నది (రావణనిర్మూలనం, ధర్మసంరక్షణం) అందువలన రామునిపై స్నేహం ప్రదర్శించి, నీవు తపోబలంతో సాధించిన దివ్యాస్త్రాలను అతడికి ప్రసాదించు అని పలికారు. విశ్వామిత్రుడు పరమప్రీతితో సరేనని అనేకమైన దివ్యాస్త్రప్రయోగమంత్రాలను రామునికి ఉపదేశించాడు. బాల్యం నుండి చక్కని యోగాభ్యాసం చేసి నిశ్చలమైన మనఃస్థితిని సాధించివున్న మన రాముడు అన్ని మంత్రాలనూ ఏకసంథాగ్రాహియై స్వీకరించాడు. జీవితంలో మరలా ఎన్నడూ వాటిని అతడు మరువలేదు. అటువంటి యోగాభ్యాసం లేకుంటే అంతటి దృఢమైన జ్ఞాపకశక్తి ఎవరికైనా కష్టమే. ఆ తరువాత లోకహితంకరుడైన రాముడు తనకు దివ్యాస్త్ర-ఉపసంహారమంత్రాలను కూడా ఉపదేశింపమని విశ్వామిత్రుని ప్రార్థించాడు. ఎందుకంటే ఒకొక్కసారి కొన్ని దివ్యాస్త్రాలను ఉపసంహరించకుంటే అవి లోకసంక్షోభకారకాలు కావచ్చును. విశ్వామిత్రుడు మన రాముని అభిప్రాయం గ్రహించి వాటిని కూడా ఎంతో సంతోషంతో ప్రసాదించాడు. ఆ తరువాత మన రాముడు గురువుగారి ఆదేశానుసారం విశ్వామిత్రునినుండి తాను పొందిన సమస్తవిద్యలను మన లక్ష్మణునికి కూడా ఉపదేశించాడు. తతస్తు రామః కాకుత్స్థః శాసనాద్ బ్రహ్మవాదినః లక్ష్మణాయ చ తాన్ సర్వాన్ వరాస్త్రాన్ రఘునందనః సంహారాంశ్చ సంహృష్టః శ్రీమాంస్తస్మై న్యవేదయత్ (రా.1.28.16) ఈ విధంగా మన రాముడు మన లక్ష్మణునికి జన్మతః జ్యేష్ఠసోదరుడే కాదు, కర్మతః గురువు కూడా ఐనాడు. ఆ విధంగా దివ్యాస్త్రవరసంపన్నులైన రామలక్ష్మణులు ఎన్నో ఘనకార్యాలు చేశారు. విశ్వామిత్రయాగసంరక్షణం చేశారు. అరణ్యవాసం చేస్తూ తాపసులను పీడిస్తూ ఉన్న రాక్షసగణాలను పారద్రోలారు. బలగర్వంతో తమను ఎదిరించిన విరాధుని సంహరించారు. ఆ తరువాత కాలంలో నిత్యం మునిసంతాపకారకులైన ఖరదూషణత్రిశురలను సంహరించారు. వారి అనుచరులైన పద్నాలుగువేల రాక్షసులను తెగటార్చారు. సుగ్రీవుని భార్యను అధర్మపరుడై అపహరించిన వాలిని హతమార్చారు. ఈ విధంగా మన రామలక్ష్మణులు ఆయుధధారులుగా ఉండటం కొందరు దుర్మార్గులకు సుతరామూ నచ్చలేదు. ఎందుకంటే వారు తమ దుష్టచేష్టలను అరికట్టగలరు కాబట్టి. విరాధుడైతే - యువాం జటాచీరధరౌ శరచాపాసిధారిణౌ (రా.3.2.10) ఏమయ్యా మీరు చూస్తే మునుల వేషాన్ని ధరించారు. మరి మీ చేతులలో విల్లుబాణాలు ఎందుకయ్యా అని ఆక్షేపించాడు. అయితే ఎవడో ఏదో అన్నంతమాత్రాన తమ క్షత్రియధర్మానికి విరుద్ధంగా ఆయుధాలను విడిచిపెట్టేంత అమాయికులు కారు మన రామలక్ష్మణులు. అసలు ఎవరో మరెవరో ఎందుకు, సాక్షాత్తు మన సీతమ్మ కూడా రామునితో ఒకసారి అలాగే అన్నది. వనవాసం చేస్తూ ఉండగా సీతమ్మ ఒకసారి మన రామయ్యతో “ఆర్యపుత్రా, ఆర్తాభిరక్షణకోసమే క్షత్రియులు ఆయుధాలను ధరించాలి. కాని, మీరు ప్రస్తుతం వనవాసం చేస్తున్నారు కదా, అటువంటి మీ చేత ఆయుధాలెందుకు? వనవాసధర్మంగా మీరు చేయవవలసిన తపస్సును విడిచి క్షత్రియధర్మపరులై ఆయుధాలను ధరించడమేమిటి? వ్యావిద్ధమిదమస్మాభిః దేశధర్మస్తు పూజ్యతామ్. (రా.3.9.27) ఇది విరుద్ధమైన ధర్మాచరణం. కాబట్టి (ఆయుధాలను విడిచిపెట్టి తపస్సు చేస్తూ) మనం దేశధర్మాన్ని పాటిద్దాం. (ఇక్కడ దేశం అంటే ప్రదేశం – ఈ సందర్భంలో అడవి అని అర్థం) కావాలంటే పునర్గత్వా త్వయోధ్యాయాం క్షత్త్రధర్మం చరిష్యసి (రా.3.9.28) కావాలంటే మరలా అయోధ్యకు తిరిగిపోయిన తరువాత క్షత్రియధర్మాన్ని పాటిస్తూ ఆయుధాలను ధరించవచ్చు” అన్నది. అపుడు మన రామయ్య కూడా మృదుస్వరంతో దేవీ, క్షత్రియైర్ధార్యతే చాపో నార్తశబ్దో భవేదితి (రా.3.10.3) ఆర్తశబ్దం వినిపించరాదనే ఉద్దేశ్యంతోనే క్షత్రియులు ఆయుధాన్ని ధరిస్తారని నీవే స్వయంగా అన్నావు కదా, దండకారణ్యంలోని మునులు రాక్షసులబారినుంచి మమ్మల్ని కాపాడమని వేడుకున్నారు. నేను సరేనని వారికి మాట కూడా ఇచ్చాను. నా ప్రాణాలను, నిన్ను, లక్ష్మణుని సైతం నేను వదులుకోగలను కాని, ఆడిన మాట తప్పలేను సంశ్రుత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవమ్। అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణామ్।। అని పలికాడు. అదీ మన రాముడు మాటకిచ్చే విలువ. ఈ విధంగా మన రాముడు ధర్మాత్ముడై దుష్టశిక్షణకు శిష్టరక్షణకు కట్టుబడినవాడు కాబట్టే అతడికి సమస్త ఋషులు, సమస్తదేవతలు, సహకరించారు. సమస్తప్రకృతి సహకరించింది. శరభంగాదిమహామునులు తమ తపశ్శక్తిఫలితాన్ని మన రామునికి ధారవోశారు. సముద్రాన్ని ఆపోశన పట్టిన మహాముని అగస్త్యుడు మన రామునికి విశ్వకర్మనిర్మితమైన వైష్ణవచాపాన్ని, బ్రహ్మదత్తమైన ఒక ఉత్తమశరాన్ని, మహేంద్రదత్తములూ అగ్నిసంకాశమైన బాణములు కలిగిన రెండు తూణీరాలను, బంగారు ఒరతో కూడిన హేమఖడ్గాన్ని సమర్పించాడు. జటాయువు రావణుని దురాగతాన్ని ఎదిరించి రామబంధువైంది. సీతను అపహరించినప్పటికీ, బ్రహ్మశాపభయంతోను, నలకూబరశాపభయంతోను రావణుడు సీతను కేవలం బెదిరించగలిగాడు. త్రికరణశుద్ధమైన ఆమె పాతివ్రత్యతేజస్సుకు బెదిరి దూరంగానే ఉండిపోయాడు. రామకార్యనిరతుడైన హనుమంతుని తోకకు రావణానుచరులు కాల్చదలచినప్పటికీ, అగ్ని అతనిని ఎంతమాత్రం దహించలేదు. కాని, అదే అగ్ని మరలా సమస్తలంకానగరాన్నీ భస్మీపటలం చేసింది. విచిత్రంగా సముద్రం మీద బరువైన బండరాళ్లు కూడా తేలడం మొదలుపెట్టి సేతునిర్మాణానికి సహకరించాయి. యుద్ధంలో రామలక్ష్మణులను నాగాస్త్రాలు బంధించగా పక్షిరాజు గరుడుడు విచ్చేసి వాటిని తరిమేశాడు. హనుమంతుడు తెచ్చిన సంజీవనిపర్వతంలోని దివ్యౌషధులప్రభావంతో లక్ష్మణుడు, హతులైన వానరులు కూడా మరలా నిద్రనుండి లేచినట్లు లేచారు. రాముని అగస్త్యమహర్షి మరలా యుద్ధరంగానికి విచ్చేసి రామునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. రథంమీద రావణుడూ, పాదచారియై రాముడు యుద్ధం చేస్తుంటే సహించలేక దేవతలు మాతలి సారథిగా మన రామునికోసం దివ్యరథాన్ని పంపారు. చివరకు రావణసంహారం జరిగింది. లోకమంతా హర్షించింది. ఈవిధంగా ఒక రాజు తన క్షత్రియధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తే సమస్తప్రకృతులూ సంతోషంగా సహకరిస్తాయని రామాయణం ఈవిధంగా వివరించింది. రావణవధ జరిగినప్పటికీ ఇంకా కొందరు దుష్టపాలకులు అక్కడక్కడ మిగిలిపోయారు. రామాజ్ఞపై శత్రుఘ్నుడు లవణాసురుని జయించాడు, భరతుడు సింధునదికి ఇరుతీరాలలోనూ వ్యాపించిన గంధర్వులను జయించి అక్కడ శాంతిని నెలకొల్పారు. మన రాముడు ఆ ప్రాంతంలో తక్షశిల, పుష్కలావతి అనే నగరాలను నిర్మింపజేసి భరతుని కుమారులను ధర్మపరిపాలకులుగా నియమించాడు. కారుపథదేశంలో చంద్రకాంతపురాన్ని, అంగదీయపురాన్ని నిర్మింపజేసి అక్కడ లక్ష్మణకుమారులను ధర్మరక్షకులుగా నియమించాడు. కుశావతి, శ్రావస్తి నగరాలలో తన కుమారులైన కుశలవులను ధర్మపరిరక్షణకు నియోగించాడు. రామాదేశంపై శత్రుఘ్నుడు మధురానగరానకి, విదిశానగరానికి తన కుమారులను అధిపతులుగా చేసి ధర్మరక్షణకర్తవ్యాన్ని వారికి అప్పజెప్పాడు. మన రాముడు అశ్వమేధయాగం చేసి, సమస్తరాజులను ఓడించి తన బలాధిక్యంతో వారిని తన మిత్రులుగా మార్చుకుని, మీరంతా ప్రజానురంజకులై ధర్మబద్ధంగా మీ మీ రాజ్యాలను సుఖంగా ఏలుకొండని ఆదేశించాడు. ఈ విధంగా, క్షత్రియధర్మానుసారం తాను ధరించిన ఆయుధాన్ని ఎంతమాత్రం వదలకుండా, సమస్తప్రజల ఆర్తిని తొలగించి, వారికి పరమశాంతియుతమైన, పరమాహ్లాదకారకమైన, సమస్తపురుషార్థసాధనకు ఉపయుక్తమైన పరిపాలనను అందిస్తూ సమస్తక్షత్రియజాతిని ధర్మపథంలో నిలిపిన మన రాముని పరిపాలన రామరాజ్యమనే పేరిట అందరికీ ఆదర్శమైంది. అటువంటి సీతాలక్మ్షణహనుమత్సమేతకోదండపాణి అయిన రాముని దివ్యవిగ్రహం మనకు నిత్యం మదిలో మెదులుతూ ఉండుగాక. #జయశ్రీరామ

Wednesday 14 April 2021

మన రాముని కథలు 2



అయోధ్య అంటేనే ఎంతటి యోధులకైనా జయింపరానిది (invincible) అని అర్థం. అటువంటి అయోధ్యసైన్యం నడుస్తూ ఉంటే ఒకొక్క సైనికుని అడుగు శత్రువులకు గుండెల్లో యుద్ధభేరీశబ్దంలా ప్రతిధ్వనిస్తూ ఉంది. తొమ్మిదివేల ఏనుగులు, అరవై వేల రథాలు, వాటినిండా అమితశూరులైన అరవైవేల ధానుష్కులు, వివిధ ఆయుధధారులు లక్షమంది అశ్వయోధులు ఒక్కమారుగా దండు బయలుదేరేసరికి భూమి వారి పదధ్వనుల ఘట్టనలకు, రథచక్రఘోషలకు కంపించిపోసాగింది. ఆ సైన్యం అంతులేని మహాసముద్రంలా గోచరిస్తోంది.
మహతీయమితః సేనా
సాగరాభా ప్రదృశ్యతే।
నాఽస్యాంతమధిగచ్ఛామి
మనసాపి విచింతయన్।। (రా.2.84.2)
వారందరికీ ముందుగా భరతశత్రుఘ్నుల రథం నడుస్తోంది. భరతుని కేవలం సైన్యం మాత్రమే కాక, అయోధ్యాపౌరులలో సగం కంటె ఎక్కువమందే అనుసరించి వస్తున్నారు.
“దురదృష్టవశాత్తు అడవులపాలైన మన రామన్నను నేను తిరిగి అయోధ్యకు తీసుకువస్తాను” - అని భరతుడు నిండు పేరోలగంలో అయోధ్యాప్రజలకు మాట ఇచ్చాడు. అదుగో, ఆ మాటను నిలబెట్టుకొనేందుకే, ఇలా సైన్యసముపేతుడై బయలుదేరాడు. రథాలమీద, గుఱ్ఱాలమీద, ఏనుగులమీద, ఎడ్లబండ్లమీద వేలాది జనాలు అతనిని అనుసరించి వస్తున్నారు. దారిలో కోసల జనపదానికి చెందిన గ్రామాలు తాము వెనుక ఉండలేక, మన రాముని తాము కూడా వెంటనే చూడాలనే ఆత్రుతతో భరతుని అనుసరించి వస్తున్నాయి. చివరకు అందరూ గంగాతీరానికి చేరుకున్నారు. అప్పటికి సాయంసంధ్య అయింది. అందువల్ల అందరూ విశ్రమించారు.
సీతారామలక్ష్మణులు నావలో గంగను దాటి అడవిలోనికి ప్రవేశించారు. అంతవరకు మాత్రమే సుమంత్రుడు తెలిపాడు. అయితే దట్టమైన ఆ అడవులలో నా రామన్న ఎక్కడ నివసిస్తున్నాడో? అతడిని కనుగొనటం ఎలాగో అని భరతుడు నిద్ర రాక చింతామగ్నుడై ఉన్నాడు.
ఇంతలో కొందరు వేగులు హడావుడిగా వచ్చారు. “జయము జయము భరతకుమారా! మన సైన్యానికి వేరొక సైన్యం అడ్డు నిలిచింది. మనలను ముందుకు పోనీయకుండా ఆపడమే వారి లక్ష్యంలాగా ఉంది. తెల్లవారగానే వారితో మనకు ఘర్షణ తప్పకపోవచ్చు” అని సమాచారం అందించారు.
శత్రుఘ్నుడు ఆశ్చర్యపోయాడు. “కోసలజనపదంలో విప్లవమా? అసాధ్యం. దశరథమహారాజుగారిని ప్రతిసామంతరాజూ కన్నతండ్రిలా ప్రేమించాడు. ఇప్పుడు ఆయన మరణించగానే అయోధ్యపై వారు తిరుగుబాటు యుద్ధం చేస్తారా? నమ్మశక్యంగా లేదు. అయినా, మనం అన్నిటికీ సన్నద్ధులమై ఉండాలి. అగ్రజా భరతా, మీ ఆజ్ఞ ఏమిటి?” అని అడిగాడు.
త్రికరణాలలోనూ అచ్చంగా రాముని పోలి ఉంటాడని అందరూ మెచ్చుకునే భరతుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. “వేగులారా, ఎవరిదా సైన్యం? వారు మనలను అడ్డుకుంటారని మీకెందుకు అనిపించింది?” అని ప్రశ్నించాడు.
“కుమారా, ఆది దాశరాజైన (జాలరి వారి నాయకుడైన) గుహుని సైన్యం. రాత్రి అయినప్పటికీ వారందరూ తమ తమ నావలను విడిచి తమ గూడెంలో విశ్రమించడానికి పోకుండా ఆయుధాలు ధరించి యుద్ధసన్నద్ధులై ఉన్నారు. ఏ క్షణంలోనైనా మనమీదకు దాడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నారని వారి మాటలను బట్టి తెలుసుకున్నాము.”
“ఎంతమాత్రం సైన్యం వారిది?”
“కుమారా, ఐదునూర్ల పెద్ద నావలు వారివి, ఒకొక్క నావలో నూర్గురు యోధులు ఉన్నారు.”
“సరే” అన్నాడు భరతుడు. అతని కైసైగపై వేగులు అక్కడనుండి నిష్క్రమించారు.
శత్రుఘ్నుని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. “అగ్రజా, ఆ గుహునిది ఎంతటి సాహసం! అగ్నిలోనికి దుమికే శలభాలలాగ వారంతా మన సైన్యం ధాటికి క్షణంలో నశించిపోతారు. అయినా, పరమరాజభక్తుడైన గుహుడేమిటి? హఠాత్తుగా మనమీద అతడు ఈ విధంగా నిష్కారణమైన వైరం పూనడమేమిటి? నమ్మలేకుండా ఉన్నాను” అన్నాడు.
“అనుజా, మన వేగులు చూసినట్టు గుహుని దాశగణమంతా యుద్ధసన్నద్ధులై ఉండటం నిజమే అయినా, వారు ఊహించినట్టు ఆ యుద్ధం మనమీద చేయడానికి కాకపోవచ్చును” అన్నాడు భరతుడు.
“మరి?”
“మనము అయోధ్యాపురవాసులమని, దశరథపుత్రులమని గుహునికి తెలిసి ఉండకపోవచ్చును. మనము ఈ విధంగా సైన్యసమేతులమై వస్తున్నామని వారికి ముందుగా మనము సమాచారం అందించలేదు. అందువల్ల మనం శత్రువులం కావచ్చునని భావించి మనలను అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని నా అనుమానం.”
“అయితే ఈ అపార్థాన్ని తొలగించేందుకు మనం వారి వద్దకు మన దూతను వెంటనే పంపాలి అగ్రజా.”
ఇంతలో కావలి భటుడు ఒకడు శిబిరంలో ప్రవేశించి, “జయము జయము కుమారా, అయోధ్యాప్రభుభక్తుడైన దాశరాజు గుహుడు మీ దర్శనం కోరి వచ్చారు” అని విన్నవించాడు.
భరతుడు శత్రుఘ్నునివైపు చూసి మందహాసం చేశాడు. బదులుగా శత్రుఘ్నుడు కూడా ప్రసన్నమనస్కుడై నవ్వాడు.
“నాయనా భరతా, మనం వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుంది. గంగను దాటిపోయిన మన రాముడు అరణ్యంలో ఎక్కడ ఉన్నాడో మనకు చెప్పగలిగినవాడు ఈ గుహుడు ఒక్కడే. అతినిని వెంటనే అనుమతించండి” అని పలికాడు సుమంత్రుడు.
“మీ అభీష్టం ప్రకారమే జరుగుతుంది పితృవ్యా” అన్నాడు భరతుడు.
కొన్ని క్షణాలలోనే గుహుడు శిబిరంలోనికి ప్రవేశించాడు. ఆయన భరతుని కోసం ఎన్నెన్నో మధురాతిమధురమైన వన్యభక్ష్యపదార్థాలను కానుకలుగా తెచ్చి సమర్పించాడు. భరతునికి ప్రణమిల్లాడు.
“రాజపుత్రా, మీకు మా నివాసప్రాంతాలన్నీ విహారయోగ్యమైన ఉద్యానవనాలవంటివి. అయితే మీ రాక మాకు ముందుగా తెలియకపోవడం వలన, మేము మరెవ్వరు వచ్చారో, ఎందుకు వచ్చారో అని భ్రమించాము. మేము మీ వారము. మా ఇంట మీరు మహారాజులవలె నివసించవచ్చును. మా కానుకలను స్వీకరించి మమ్ములను ధన్యులను చేయండి” అని వినయంగా పలికాడు.
భరతుడు అతని పట్ల తనకు కలిగిన ప్రీతిని దాచుకోలేకపోయాడు. ఎంతో సంతోషించాడు. కొంత సంభాషణ జరిగిన పిమ్మట, “ఓ గుహా, ఈ అరణ్యం చాల దట్టమైనది. గంగానదీపరీవాహకప్రాంతం. బురదనేలలు చాల అధికంగా ఉన్నాయి. చాల ప్రమాదభరితంగా ఉన్నాయి. వీటిని దాటి మా రామన్న భరద్వాజమహర్షి ఆశ్రమం చేరినట్లు మాకు తెలిసింది. నీవు మాకు అక్కడకు వెళ్లేందుకు నీవు మాకు మార్గం చూపగలవా?” అని అడిగాడు.
ఆ మాటలు వినగానే గుహుని ముఖం కొంత అప్రసన్నంగా మారింది. అంతవరకు కొంత మృదువుగా ఉన్న అతడి కంఠస్వరం కూడా కొంత కరకుబారింది.
“ఓ రాజపుత్రా, మహాధనుర్ధారులైన నా అనుచరులతో సహా నేనే స్వయంగా మీకు దారి చూపిస్తాను. కాని, నాకు నీపై చాల సందేహం ఉన్నది. మా రామన్న అంతటి అసాధ్యసాధకుడే, నీవు అతడి దగ్గరకు ఎందుకు వెడుతున్నావు? అతడికి కీడు తలపెట్టాలనే దుర్బుద్ధితో వెడుతున్నావేమో! లేకపోతే, ఇంతటి మహాసైన్యంతో నీవు ఎందుకు అతడిని వెదుకుకుంటూ వచ్చావు? ఆ సందేహం తొలగితే కాని, నిన్ను అక్కడకు తీసుకుపోవడం సాధ్యం కాదు. నీవు నీ సైన్యం కూడా నేను ప్రాణాలతో ఉండగా దాటిపోవడం అసాధ్యం” అన్నాడు మొరటుగా, ఏమాత్రం మొగమాటం లేకుండా.
కచ్చిన్న దుష్టో వ్రజసి
రామస్యాక్లిష్టకర్మణః।।
ఇయం తే మహతీ సేనా
శంకాం జనయతీవ మే।। (రా.2.85.7)
సుమంత్రుడు, శత్రుఘ్నుడు గుహుని అమాయికత్వానికి నవ్వారు. అతడి రామభక్తికి ఆశ్చర్యపోయారు కూడా. తన చిన్న సైన్యంతో అపారమూ అజేయమూ అయోధ్యసైన్యంతో యుద్ధం చేయడానికి కూడా అతడు ఎందుకు సన్నద్ధుడై ఉన్నాడో వారికి అర్థమైంది. భరతునికి కూడా గుహుని సందేహం అర్థమైంది.
“ఓ గుహా, రామన్న మాకు జ్యేష్ఠసోదరుడు. మాకు తండ్రి తరువాత తండ్రివంటివాడు. అతడిని వనవాసంనుండి తిరిగి అయోధ్యకు తీసుకుపోవాలనే సంకల్పంతోనే వచ్చాను. సత్యం బ్రవీమి తే. నిజం చెబుతున్నానయ్యా” అని భరతుడు సానునయంగా పలికాడు.
ప్రసన్నంగా ఉన్న భరతుని ముఖచిహ్నాలను, మాటతీరును గమనించాక, గుహుడు భరతుని నమ్మగలిగాడు. భరతుని సంకల్పాన్ని ప్రశంసించాడు. రాత్రంతా వారికి నిద్ర లేదు. మన రాముని గూర్చి, తత్సేవానిరతుడూ భాగ్యవంతుడూ అయిన లక్ష్మణుని గూర్చి, వారి సంరక్షణలో ఉన్న సీతమ్మను గూర్చి వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
మరుసటి రోజు గుహుని మార్గదర్శకత్వంలో అయోధ్యాసైన్యమంతా రాముడున్న ప్రాంతానికి కదిలింది. దారిలో వారు ఒక రాత్రి భరద్వాజమహర్షి ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించారు. తరువాత రోజున దూరంగా కొండపై పొగలను చూసి, మన రాముడు అక్కడ ఉండవచ్చునని తలచి అక్కడకు దారి తీశారు. అదిగో, చివరకు వారికి సీతాలక్ష్మణసమేతుడైన శ్రీరాముని దివ్యదర్శనం లభించింది.
శ్రీరాముని కోసం తన సమస్తసైన్యంతో సహా ప్రాణాలను కూడా యుద్ధంలో తృణప్రాయంగా భావించి పోరాడేందుకు నిశ్చయించిన ఆ గుహునికి కూడా శ్రీరామసందర్శనభాగ్యం మరలా కలిగింది.
జన్మతః చేపలను పట్టే వృత్తిని చేపట్టిన జాలరి అయిన అతడు రామభక్తులలో అగ్రేసరుడని, పరమభాగవతోత్తముడని అందరిచేతా ప్రస్తుతింపబడ్డాడు. శ్రీరాముని ఆలింగనభాగ్యం పొందినవారిలో అతడు కూడా ఒకడు.

Tuesday 13 April 2021

మన రాముని కథలు - 1

 



త్వం వయస్యోఽసి మే హృద్యో
హ్యేకం దుఃఖం సుఖం చ నౌ।

“ఓ రామా, నీవు నాకు స్నేహితుడవు. నా హృదయానికి ఎంతో ప్రియమైన వాడవు. మన దుఃఖసుఖాలు ఒక్కటే” అన్నాడు సుగ్రీవుడు. వారిద్దరూ అగ్నిసాక్షిగా మిత్రులైనారు. ఒకరి పట్ల మరొకరు వారిరువురి మనస్సులూ చాల ప్రీతిని పొందాయట. ఒకరినొకరు ఎంతగా చూసుకుంటున్నా తనివి తీరలేదట.

తతః సుప్రీతమనసౌ
తావుభౌ హరిరాఘవౌ।
అన్యోఽన్యమభివీక్షన్తౌ
న తృప్తిముపజగ్మతుః।।

రాజు అన్న తరువాత అతడికి ఎన్నో చేయవలసిన పనులు ఉంటాయి. తానొక్కడే చేయలేని పనులను అతడు తన పరివారం ద్వారా సాధిస్తాడు. అయినా సాధ్యం కాని పనులు కొన్ని ఉంటాయి. వాటిని అతడు తన మిత్రుల ద్వారా సాధిస్తాడు.

స్వామి (రాజు), అమాత్యుడు (మంత్రులు), రాష్ట్రం (భూమి/ప్రజలు), దుర్గం (కోట/రాజధాని), కోశం (ఖజానా) బలం (చట్టం/సైన్యం) అని ఆరింటిని పేర్కొన్న తరువాత, సుహృత్ (మిత్రుడు) అనే ఏడవ అంగాన్ని కూడా పేర్కొని, ఇవన్నీ కలిపి సప్తాంగరాజ్యమని భారతీయరాజనీతిశాస్త్రాలు పేర్కొన్నాయి. కాబట్టి కార్యసాధనలో మిత్రుడు చాల అవసరమని రాజనీతిధురంధరులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు.

మిత్రుల అవసరాన్నిఎంత ప్రధానమో చెబుతూ విష్ణుశర్మ తన పంచతంత్రంలో మిత్రసంప్రాప్తి అనే అధ్యాయాన్ని, నారాయణపండితుడు తన హితోపదేశంలో మిత్రలాభమనే అధ్యాయాన్ని వెలయించారు. వాటిలో చిన్నపిల్లలకు కూడా అర్థమయే రీతిలో మిత్రుల నడుమ ఉండవలసిన సుహృద్భావాన్ని, సహకారాన్ని చక్కగా అనేకమైన కథల రూపంలో వివరించారు.

అంతేకాదు, తమ మైత్రితో తమ ఐకమత్యంతో అజేయులు, దుర్నిరీక్ష్యులుగా మారిన మంచి మిత్రుల నడుమ వారి శత్రువులు ఏ విధంగా పొరపొచ్చాలు సృష్టించి వారిని విడదీసి నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారో వారు తమ తమ గ్రంథాలలో సుహృద్భేదము, మిత్రభేదము అనే అధ్యాయాలలో చాల చక్కగా వివరించారు.

ఈ కథలన్నీ పిల్లలకోసం మాత్రమే అని అభిప్రాయపడితే అది చాల తప్పు. పంచతంత్రం, హితోపదేశం నేటి భారతరాజకీయనాయకులకు నిత్యపారాయణగ్రంథాలుగా ఉండేందుకు చాల యోగ్యమైనవి.

మన దాశరథి శ్రీరాముడు రాజనీతిశాస్త్రంలో ఆరితేరినవాడు. పంచవటిలో మన సీతమ్మ రాక్షసుల చేత అపహరింపబడింది అని తెలుసుకున్న తరువాత, ఆమె ఎక్కడున్నదో వెతికి తిరిగి సాధించేందుకు తగిన మిత్రులు అవసరమని అతడు భావించాడు.

తన అన్న అయిన వాలి తరిమివేయగా గతిలేక ఋశ్యమూకపర్వతంపై కాలక్షేపం చేస్తున్న సుగ్రీవుడు నీకు సీతాన్వేషణంలో తోడ్పడగలడు అని శాపవిమోచనం చెందిన కబంధుడు మన శ్రీరామునికి సలహా చెప్పాడు.

వాలిసుగ్రీవులు వానరులు. వానరులు నాకు సహాయం చేయడమేమిటి అని మన శ్రీరాముడు ఎంత మాత్రం భావించలేదు.

ఈనాటి రాజకీయనాయకులైతే, వారిద్దరిలోనూ బలవంతుడైన వాలి మాత్రమే నాకు తోడ్పడగలడు, పైగా అతడు ప్రస్తుతం సమస్తవానరరాజ్యానికి ఏకచ్ఛత్రాధిపతి, తమ్ముడైన సుగ్రీవుడేమో అన్న చేతిలో చిత్తుగా ఓడిపోయాడు, రాజ్యాధికారం కోల్పోయాడు, రాజ్యం విడిచి పారిపోయాడు, అటువంటి బలహీనుడు నాకు ఎలా సహాయపడగలడు అని భావించి, సుగ్రీవుని స్నేహాన్ని కాదని, వాలి దగ్గరకు పోయి సహాయం అర్థించేవారేమో.

ఎందువల్లనంటే ఈనాటి రాజకీయనాయకులకు అర్థం (అంటే డబ్బు లేదా ఏదో ఒక స్వార్థప్రయోజనం) మాత్రమే ముఖ్యం. అది ఉంటే ముందూ వెనుకా చూడకుండా తమకు తాత్కాలికంగా లాభం అనుకున్నవారినే మిత్రులుగా చేసుకుంటారు. లాభం లేదనుకుంటే వదులుకుంటారు.

మన శ్రీరాముడికి కూడా అర్థం ప్రధానమైనదే. కాని, దానికంటె అతడికి ధర్మం చాల చాల ప్రధానమైనది. నేటి రాజకీయనాయకులు విగ్రహవంతః అర్థాః (రూపు దాల్చినప్రయోజనాకాంక్షులు) అయితే రామో విగ్రహవాన్ ధర్మః. అంటే మన శ్రీరాముడు రూపు దాల్చిన ధర్మం. అందువల్ల మన శ్రీరాముని ఆలోచనే వేరుగా ఉన్నది.

వాలి చాల బలవంతుడు. మామూలు బలవంతుడు కూడా కాదు, మునుపు రావణాసురుని చిత్తుగా ఓడించిన అమితబలసంపన్నుడు. పైగా మహారాజు. అందువల్ల మన శ్రీరాముడు వాలితో స్నేహం చేసినట్లైతే, అటుపిమ్మట రావణుడు సీతమ్మను అపహరించిన విషయాన్ని మన శ్రీరాముడు వాలికి వివరించి, ఆ విషయంలో తనకు సహాయం చేయమని అడిగితే వాలి మాటకు భయపడి రావణాసురుడు వెంటనే సీతమ్మను మర్యాదగా మన శ్రీరామునికి అప్పజెప్పేవాడే.

మరి ఆ మాత్రం గోటితో పోయేదానికి మన శ్రీరాముడు గొడ్డలిని ఎందుకు ఎంచుకున్నట్లు?

రావణాసురుని కంటె మహాబలవంతుడైన వాలితో స్నేహం చేయకుండా, వాలికంటె బలహీనుడైన సుగ్రీవునితో ఎందుకు స్నేహం చేసినట్లు?

మన శ్రీరాముని లెక్కలు వేరు. వాలి ఎంతటి బలవంతుడైనప్పటికీ అతడు అధర్మపరుడు. అతడు తన తమ్ముడైన సుగ్రీవుడు ఇంకా బ్రతికి ఉండగానే అతడి భార్య అయిను రుమను బలాత్కారపూర్వకంగా తన స్వాధీనం చేసుకున్నాడు. అటువంటి వాలిని తనకు సహాయం చేయమని మన శ్రీరాముడు ఎలా అర్థించగలడు? ఏ తప్పు చేయడం ద్వారా రావణాసురుడు శ్రీరామునికి శత్రువైనాడో, అదే తప్పును చేసిన వాలిని శ్రీరాముడు ఎలా తన మిత్రునిగా అంగీకరించగలడు?

అందువల్ల, ఆ విధమైన స్నేహం చేసివుంటే మన శ్రీరామునికి మన సీతమ్మ సులువుగా తిరిగి లభించి ఉండేదే. కాని, అందువల్ల అధర్మాత్ములు, పరమపాపిష్ఠులు అయిన వాలి, రావణాసురుడు బ్రతికిపోయేవారు. వారి వలన లోకాలన్నీ పీడింపబడుతూనే ఉండేవి. కేవలం మన సీతమ్మను దక్కించుకొనడం కోసం మన శ్రీరాముడు వారు చేసే లోకపీడను సహించి దురాగతాలను భరించి ఊరుకోవాలా? కుదిరే పని కానే కాదు.

అందువల్లనే, అర్థానికంటె ధర్మానికి ప్రథమప్రాధాన్యతనిచ్చే మన శ్రీరాముడు వాలితో స్నేహం చేయాలని ఎంతమాత్రం భావించలేదు. బలహీనుడైనప్పటికీ ధర్మాత్ముడైన సుగ్రీవునితోనే స్నేహం చేశాడు. ఆ సుగ్రీవునికోసం రావణాసురునికి కూడా భయం కలిగించిన వాలిని హతమార్చాడు. బలహీనుడైన మిత్రునికి బలం చేకూర్చాడు. సమస్తవానరాలూ సుగ్రీవుని తమ నాయకునిగా అంగీకరించేలా చేశాడు. అప్పుడే సీతాన్వేషణంలోనూ, రావణవధలోనూ సుగ్రీవుని సహాయాన్ని ప్రీతిపూర్వకంగా అంగీకరించాడు.

ఆవిధంగా మిత్రులిరువురూ పరస్పరప్రయోజనాలను సాధించారు. జీవితాంతం వారి మైత్రి వర్ధిల్లింది. ఈనాటికీ వారి స్నేహం అందరికీ ఆదర్శపాత్రంగా నిలిచింది.

అదీ ధర్మం పట్ల మన శ్రీరామునికి ఉన్న నిబద్ధత. ఎటువంటివారి పొత్తును తిరస్కరించాలో, ఎటువంటివారితో పొత్తును కుదుర్చుకోవాలో, ఎలా కుదుర్చుకోవాలో మన శ్రీరాముని చూసి ఈనాటి రాజకీయనాయకులు, ఈనాటి రాజకీయపార్టీలు నేర్చుకోవాలి.

అంటే తాత్కాలికమైన స్వార్థపూరితమైన పొత్తులను మొగమాటం లేకుండా తిరస్కరించి శాశ్వతంగా ధర్మబద్ధాలు,, ధర్మపరిపుష్టకాలు అయిన పొత్తులను మాత్రమే అంగీకరించాలి.

రామాయణం అంటే కేవలం పారాయణగ్రంథంగా పరిగణించేవారు మూర్ఖులు. రామాయణం అంటే మన శ్రీరాముని పయనం. అంటే మన శ్రీరాముని నడవడిక. మన శ్రీరాముని నడవడికను మనం ఆదర్శంగా మార్గదర్శకంగా గ్రహించాలి. అప్పుడే మనం రామాయణం చదివినా, మన శ్రీరామునికి గుడికట్టుకున్నా సార్థకత!

#జయశ్రీరామ

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...