Saturday 15 April 2023

పద్భ్యాం శూద్రో అజాయత। పాదములనుండి శూద్రుడు జన్మించెను.

పాదాలంటే అంత లోకువా?

పద్భ్యాం శూద్రో అజాయత

(పాదములనుండి శూద్రుడు జన్మించెను.)

అవును.  అయితే ఏమిటట?

ఎవరి పాదాలనుండి జన్మించెను?  సమాజాన్నే తన దేహంగా కలిగిన విరాట్ పురుషుని పాదాలనుండి. అయితే ఏమిట్ట?  ఎందుకు అల్లరి?  సరే, ఆ విరాట్ పురుషునికి పాదాలే తప్ప మిగిలిన అవయవాలు లేవా?  ఉన్నాయి కదా?. 

బ్రాహ్మణోస్య ముఖమాసీత్(బ్రాహ్మణుడు అతడి ముఖముగానుండెను.)  బాహూ రాజన్యః కృతః (బాహువులు క్షత్రియుడాయెను.) ఊరూ తదస్య యద్వైశ్యః (అతని ఊరువులు ఏవైతే ఉన్నాయో అవి వైశ్యుడు) - ఈ మాటలు కూడా అక్కడే ఉన్నాయి. 

వీటిని పట్టుకుని, అల్లరల్లరి చేస్తున్నారు. 

ముఖము, బాహువులు, ఊరువులు చాలా గొప్పవని, పాదాలు మాత్రం చాల నీచమైనవని, ఈ విధంగా శూద్రుని జన్మను నీచమైనదిగా చిత్రీకరించారని అల్లరి.  ఎవరు చెప్పారలా?  అలా ప్రచారం చేస్తున్న జనాలకు పాదాలంటే అంత లోకువా? 

శ్రీరాముడు తనపై దండెత్తిన పరశురాముని ఓడించాడు. ఓ పరశురామా, నీవు చేసిన అపరాధానికి పరిహారంగా నీ పాదగతిని (పాదాలతో సంచరించే శక్తిని) నాశనం చేయమంటావా లేక నీ తపశ్శక్తితో నీవు సాధించుకున్న ఎన్నో పుణ్యలోకాలను నీకు చెందకుండా నాశనం చేయమంటావా అని అడిగాడు.

అపుడు పరశురాముడు తన తపశ్శక్తితో ఆర్జించిన సమస్త పుణ్యలోకాలనే నశింపజేయమన్నాడు.  తనను కరుణించి తన పాదగతిని మాత్రం నాశనం చేయవద్దని వేడుకున్నాడు.  (రామాయణం. బాలకాండం, 76వ సర్గ)

అంటే, తపస్సు కంటె, తపశ్శక్తి కంటె, సమస్త పుణ్యలోకాల కంటె, పాదాలు, పాదాల కున్న శక్తి చాల ముఖ్యమైనవనే కదా అర్థం?

అటువంటి పాదాలంటే కొందరు జనాలకు అంత లోకువైనాయా?

సరే, సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఎవరు?  ఆ విరాట్ పురుషుని, కుమారుడే కదా?

ఆ బ్రహ్మగారు –

1 సనక-సనందన-సనత్సుజాత-సనత్కుమారులనే పరమయోగులకు తండ్రి.

2  నారదుడు మొదలైన దేవఋషులకు తండ్రి.

3 వసిష్ఠుడు భృగువు మొదలైన బ్రహ్మఋషులకు తండ్రి.

4 పులస్త్యుడు, మరీచి, దక్షుడు, కశ్యపుడు మొదలైన నవ ప్రజాపతులకు తండ్రి.

5 ఆ ప్రజాపతుల సంతానమే దేవతలు,

6 ఆ ప్రజాపతుల సంతానమే అష్ట దిక్పాలకులు.

7 ఆ ప్రజాపతుల సంతానమే చతుర్దశ ఇంద్రులు.

8 ఆ ప్రజాపతుల సంతానమే చతుర్దశ మనువులు.

9 ఆ ప్రజాపతుల సంతానమే...

9.1 అసురులు

9.2 పితరులు

9.3 సిద్ధులు

9.4 గంధర్వులు

9.5 కిన్నరులు

9.6 కింపురుషులు

9.7 విద్యాధరులు

9.8 అష్టవసువులు

9.9 ఏకాదశరుద్రులు,

9.10 ఇరువురు అశ్వినులు,

9.11 దానవులు

9.12 యక్షులు

9.13 రాక్షసులు

9.14 పిశాచులు

9.15 గుహ్యకులు

9.16 మానవులు

9.17 సమస్తజంతుజాలం

9.18 సమస్తవృక్షజాలం

ఇందరు మహామహులకు, ఇంతటి మహాసృష్టికి తండ్రి లేదా తాత అయిన ఆ బ్రహ్మగారు ఏం చేశారు? ఆ విరాట్ పురుషుని పాదాలను కడిగి, తన ముఖాన ధరించాడు.  విరాట్ పురుషుని పాదాలు నీచమైనవైతే బ్రహ్మగారు స్వయంగా తన కమండలు జలాన్ని ఉపయోగించి, తన చేతులను ఉపయోగించి ఎందుకు కడుగుతారు?  పాదాల కంటె ముఖం శ్రేష్ఠమైనది అని భావిస్తే  ఆ పాదజలాన్ని తన ముఖాన ఎందుకు ధరిస్తాడు?  

అసలు ఒక్క బ్రహ్మగారని ఏముంది?  మనమంతా కూడా మన బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖము ఉండే తలను వంచి నమస్కరించేది ఆ పాదాలకే కదా? 

అంతేకాదు, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధినివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీమహావిష్ణుపాదోదకం పావనం, శుభం అంటూ భక్తితో స్వీకరించి, బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖంలో ఉండే కనులకు అద్దుకుని, ముఖంలోనే ఉండే నోటితో సేవించే ఆ తీర్థం ఆ పాదాలను కడిగిన జలమే కదా?

భారతదేశంలో వివాహపద్ధతిని కన్యాదానం అని కూడా అంటారు.  కన్య తల్లిదండ్రులు వరుని శ్రీమహావిష్ణువుగాను, తమ కుమార్తెను శ్రీమహాలక్ష్మిగాను భావన చేసి, వరుని పాదాలను కడిగి పెండ్లి చేస్తారు.  ఆ సమయంలో వారి దృష్టి - అంటే బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖంలో ఉన్న కండ్లు పూర్తిగా పాదాలమీదనే ఉంటుంది. ఆ సమయంలో బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖంలోని నోరు చాల శ్రద్ధగా ఇయం కన్యా మమ సుతా అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది.  అలాగే క్షత్రియుడు అని చెప్పబడిన చేతులే ఆ పాదాలను శ్రద్ధగా కడుగుతాయి.  అవునా కాదా? 

ముఖంలో ఉండే కళ్లు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ ఐదింటినీ జ్ఞానేంద్రియాలు అంటారు.  ఈ జ్ఞానేంద్రియాలు మంచినీ చెడ్డనూ రెండింటినీ గ్రహించి తెలియజేస్తాయి.  కళ్లు పూవులనూ చూస్తాయి, బురదగుంటను కూడా చూస్తాయి.  ముక్కు సుగంధాన్ని, దుర్గంధాన్ని కూడా గ్రహిస్తాయి.  చెవి అన్నమయ్యపాటలనూ వింటుంది, అర్థం పర్థం లేని చెత్త సినిమాపాటలను కూడా వింటుంది.  నాలుక షడ్రుచులనూ గ్రహిస్తుంది.  చర్మం వెచ్చదనాన్ని చల్లదనాన్ని కూడా గ్రహిస్తుంది.  అయితే ఆ జ్ఞానేంద్రియాల పని కేవలం తెలియజేయడం మాత్రమే. శాసించడం కాదు.  మనకు ఏది శ్రేయస్కరమో దానిని ఎంచుకుని, ఏది హానికరమో దానికి దూరంగా ఉండడం మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది.  

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు కదా, అటువంటి కండ్లు ఒక వ్యక్తికి లేవనుకోండి, అతడు దారిలో ముల్లు మీద అడుగువేసి, అవి పాదంలోపలికి గ్రుచ్చుకుని, జివ్వుమని బాధ కలిగేదాకా నేను ముండ్లదారిలో నడుస్తున్నాను అని తెలుసుకోలేడు. అయితే కండ్లున్న మనిషి కొద్దిగా దూరంగా ఉండగానే ఆ ముండ్లను చూడగలుగుతాడు, ముండ్లను త్రొక్కకుండా ముందడుగు వేస్తాడు.  లేదా కండ్లున్న మరో మనిషి బాబూ ఆ దారిన పోవద్దు, కొంచెం ఎడమవైపుకు తిరుగు అంటే చెవిద్వారా విని ఆలా చేస్తాడు. దృష్టిపూతం న్యసేత్ పాదంఅంటారు.  అంటే మార్గాన్ని జాగ్రత్తగా చూసి అడుగు వేయాలని.  కాని, ఎవడో పాశ్చాత్యుడు ఎవడో పాషండుడు చెప్పాడని ముఖంలో ఉండే మన కండ్లను మనమే ద్వేషించి ఎడాపెడా నడుస్తామా?  అలా అయితే మనం ముండ్లను త్రొక్కడం మాత్రమే కాదు, బురదను కూడా తొక్కవచ్చు, లేదా  ఒక నిలువెత్తు గోతిలో పడవచ్చు.  అలా జరిగితే కేవలం పాదాలకు మాత్రమే నష్టం కాదు, సమస్తశరీరానికీ కూడా నష్టం జరగవచ్చు.  పడరానివిధంగా పడితే మనకెంతో ఉపయోగకరమైన కళ్లు కూడా శాశ్వతంగా పోవచ్చు.  కండ్లను ద్వేషించి మన కండ్లను మనమే ఓ ముల్లుతో పొడుచుకుంటే మనకు కాక, ఇంకెవరికి నష్టం?  పురుషసూక్తంలో సాంకేతికంగా (సింబాలిక్ గా) చెప్పిన మాటలను అవి మన భారతసమాజంలో ఎక్కువ తక్కువలను నిర్ణయించిన మాటలుగా వక్రీకరించి, మనలో మనకు విద్వేషాలను రేకెత్తించాలని పాశ్చాత్యులు పాషండులు చేసిన విద్రోహపూర్వకమైన కుట్రలను మనం ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటాం? 

కాబట్టి, బ్రాహ్మణుడు ముఖమాయెను అంటే, మనకు మంచిచెడ్డల జ్ఞానం తెలియజేసేవారు బ్రాహ్మణులు అని అర్థం.  శూద్రులలో కూడా ఆ విధంగా జ్ఞానం చెప్పినవారు ఎందరో ఉన్నారు.  మహాభారతంలో కౌశికుడు అనే బ్రాహ్మణవంశంలో పుట్టిన మునికి కసాయివృత్తివాడైన (శూద్రుడైన) ధర్మవ్యాధుడు జ్ఞానం బోధించే ఘట్టాన్ని వ్యాసుడు అద్భుతంగా వ్రాశాడు.  అదే మహాభారతంలో కౌరవపాండవులకు రాజనీతిని బోధించిన శూద్రుడైన విదురుని కథ ఉన్నది.  విదురుని మాటలను ఎంతో గౌరవంతో ఆదరించిన పాండవులు లోకప్రియులు, అంతిమవిజేతలు అయ్యారు.  విదురుని మాటలను పెడచెవిన పెట్టిన కౌరవులు లోకవిద్విష్టులు, అంతిమపరాజితులు అయ్యారు.  తమిళంలో ప్రసిద్ధమైన తిరుక్కురళ్ చెప్పిన తిరువళ్లువర్ కూడా శూద్రజాతివాడే.  కాని, సమస్తవర్ణాలకు చెందిన ప్రజలందరూ ఆ తిరువళ్లువర్ ను గొప్పగా ప్రేమిస్తారు.  ఉత్తరభారతదేశంలో సంత్ రవిదాసు, కర్ణాటకంలో కనకదాసరు, తెలుగునేలలో వేమన వీరందరూ శూద్రులే.  కాని, వారి జ్ఞానసంపదకు ముగ్ధులై గౌరవించనివారంటూ ఎవరూ ఉండరు.  ఇలా భారతదేశంలో ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. 

రామాయణంలో శ్రీరామునికి తన ఎంగిలి పండ్లను తినిపించిన శబరి శూద్రురాలే.  శ్రీరామునికి ప్రాణమిత్రుడైన గుహుడు కూడా చేపలు పట్టే జాలరి శూద్రుడే.  నువు శూద్రుడివి, నువు పాదంనుంచి పుట్టావు అంటూ శ్రీరాముడు వారితో ఎన్నడూ మాట్లాడలేదే?  పైగా గుహుని తనివితీరా ఆలింగనం చేసుకున్నాడు.  మరి ఆనాడు లేని అంటరానితనం భారతదేశంలోనికి ఎప్పుడు వచ్చింది?  ఎడారులలో పుట్టిన మతాలు మన దేశాన్ని వేయి ఏండ్లు పరిపాలించిన కాలంలో, వారు పాటించిన Divide and Rule పథకం ప్రకారం భారతీయులలో పరస్పరవిద్వేషం పెంచడానికి ఈ అంటరానితనమనే భావనను తమ అధికారబలంతో చొప్పించారు.  పదే పదే కొందరిని untouchables అంటరానివారు అంటూ బ్రెయిన్ వాష్ చేస్తే వచ్చిపడిన ఒక భయంకరమైన రోగం అది.  అంతేగాని, వర్ణాన్నిబట్టి అంటరానితనం ఏ వేదంలోనూ లేదు, ఏ పురాణంలోనూ లేదు.  ఉంటే ఎవరైనా చూపించవచ్చును.

తరువాత - ముఖము, చేతులు, తొడలు, పాదాలు అనే తేడా లేకుండా సమస్తశరీరంపైనా ప్రతిదినం  మలినాలు ఏర్పడతాయి.  ఇక్కడ శరీరం అంటే సమాజం.  మలినాలు అంటే దుర్బుద్ధులు, దుష్టశక్తులు.  ప్రతిరోజూ శరీరంపై ఏర్పడే మలినాలను అసహ్యించుకోకుండా వాటిని తొలగించి శుభ్రం చేసేది చేతులే కదా?.  ముఖంలో ఉండే చూపు, వాసన వంటి జ్ఞానేంద్రియాలతో ఆ మలినాల జాడను పసిగడతాం. ఆ దుర్బుద్ధులను దుష్టశక్తులను తొలగించే బాధ్యతను నిర్వర్తించేవారు చేతులతో సమానం. ఆ పని చేసే రాజులను అంటే క్షత్రియులను చేతులు అన్నారు.  తప్పేముంది?

శరీరాన్ని ఎక్కడినుండి ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగింది పాదాలే.  అలాగే సమాజాన్ని ఏ స్థాయికైనా తీసుకుపోగలిగేది శూద్రులే.  పాదాలతో సంచరించే శక్తి లేకుంటే అందమైన కళ్లున్నా ఏమి లాభం?  బలమైన చేతులు బలిష్ఠమైన తొడలు ఉన్నప్పటికీ ఏమి లాభం?  పాదాలు లేకుంటే ఆ వ్యక్తి వికలాంగుడు అయిట్టుగానే, శూద్రులు లేని సమాజం కకావికలం అయిపోతుంది.

పాదాలను, మిగిలిన శరీరానికి అనుసంధానం చేసేవి ఊరువులు (తొడలు).  అలాగే మన సమాజంలో వైశ్యులు.  మనం ఉండే స్థలానికి దూరంగా ఎక్కడో పొలంలో పండిన బియ్యమూ గోధుమలు చిరుధాన్యాలు కూరగాయలు మనం రోజూ ఎలా తెచ్చుకోగలం? అలాగే రైతులు కూడా తమ ఉత్పత్తులు అవసరమైన వినియోగదారులను వెతుక్కుంటూ ఎన్ని ఊర్లని, ఎన్ని వీధులని తిరుగుతారు? వారికి అలా తిరగగలిగిన ఓపిక ఉన్నప్పటికీ, వారు అలా తిరుగుతూ ఉంటే వ్యవసాయం చేసేదెవరు?  ఈ రోజున వారు పండిస్తేనే రేపటికి మన కడుపు నిండుతుంది.  వారు ఈ రోజు పని చేయకుంటే రేపటికి మనకు పస్తులే.  

కాబట్టి, రైతులకు వినియోగదారులకు అనుసంధానంగా వైశ్యులు పని చేస్తారు.  ఈ రోజున మండీలలో కూర్చుని ముఠాలుగా ఏర్పడి రైతులనుండి చాల చౌక ధరలకే వారి ఉత్పత్తులను కొని, వినియోగదారులకు చాల ఎక్కువ ధరలకు అమ్ముకునే దళారీలను వైశ్యులుగా మనం భ్రమపడరారదు.  వారి దోపిడీలను అరికట్టాలని, తమ ఉత్పత్తులకు న్యాయమైన ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని రైతులకే ఇవ్వాలని, తద్వారా అటు రైతులు, ఇటు వినియోగదారులు ఉభయులూ కూడా లాభపడాలనే సదుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం క్రొత్త వ్యవసాయచట్టాన్ని రూపొందిస్తే దానిని అమలు చేయరాదని ఢిల్లీ వీధులలో నెలల తరబడి కూర్చుని అల్లర్లు చేసినవారందరూ ఇటువంటి దళారీలే.  వీరిని వైశ్యులు అనలేం.  భారతీయత ఇటువంటివారిలో మచ్చుకైనా కనబడదు.  

కరోనా లాక్ డౌన్ రోజుల్లో మనం ఎలా బ్రతికామో గుర్తు తెచ్చుకోండి.  ఎందరో శ్రమజీవులు రైతుల దగ్గర వివిధ ఉత్పత్తులను కొని, మనముండే నగరాలకు వచ్చి, చాల చౌక ధరలకే అమ్మేవారు.  ప్రభుత్వాలు మహమ్మారి విజృంభించి ఉన్న ఆ రోజుల్లో ఇంతకంటె ఎక్కువధరకు అమ్మరాదని ప్రభుత్వం వారిపై ఆంక్షలు విధించింది.  వారు కూడా సంతోషంగా ఆ ధరలకే అమ్ముకుని సంతృప్తి పడ్డారు.  వారు వైశ్యులంటే.  వారు శూద్రులేమో కదా అని మనకు సందేహాలు అక్కరలేదు.  ఒక వ్యక్తి వర్ణం అతడి గుణాన్ని బట్టి, అతడు చేసే పనిని బట్టి నిర్ణయింపబడుతుందని భగవద్గీత పేర్కొంది.  ఏ ఇంట పుట్టినా వైద్యం చేసేవారినే డాక్టర్లు అని, చదువు చెప్పేవారినే అధ్యాపకులు అని ఈ రోజుల్లో మనం వ్యవహరించటం లేదా? వారి జాతితో సంబంధం లేకుండా వారిని మనం గౌరవించటం లేదా?  ఆలాగే ఆ రోజుల్లో కూడా వ్యవహరించారు.  

వైశ్యులంటే బానపొట్టతో, పట్టు పరుపుమీద గల్లాపెట్టె ముందు కూర్చుని, తీరికగా తాంబూలం నములుతూ, భయంకరమైన వడ్డీలకు అప్పులిచ్చి, ఆ అప్పులు సక్రమమైన కాలానికి తిరిగిరాకపోతే గూండాల ద్వారా ఇంటిలోని వస్తువులను దౌర్జన్యంగా బయటకు గిరవాటు వేయిస్తూ క్రూరాతిక్రూరంగా వసూలు చేసుకుంటూ ఉంటారన్నట్టుగా మన సంస్కృతిని ద్వేషించే డైరెక్టర్లు తమ సినిమాలలో పదే పదే చిత్రీకరించి వారంటే ఒక రకమైన ద్వేషభావాన్ని నింపేశారు.  పాఠ్యపుస్తకాలలో జాతిపితగా కీర్తించబడిన గాంధీ వైశ్యుడే.  ఆంధ్రరాష్ట్రావతరణ కోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు వైశ్యుడే. 

మన పూర్వుల కాలంలో ఈనాడు ఉన్నట్టుగా అతి వేగవంతమైన కారు, బస్సు, రైలు, విమానం వంటి వాహనాలు ఉండేవి కావు.  ఆ రోజులలో రోజుల తరబడి, నెలలతరబడి ప్రయాణం చేస్తూ ఉండిన బాటసారులకోసం, ఇంకా గ్రామస్థులకోసం మార్గాలలో ఆయా గ్రామాలు నగరాలలో అనేకమైన అన్నసత్రాలను నిర్మించింది, మంచినీటి కోనేరులను నిర్మించింది, బాటలలో ఫలవృక్షాలను, ఛాయావృక్షాలను విరివిగా నాటించింది, ఉత్సవదినాలలో ఆయా పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు అన్నదానాలు, వస్త్రదానాలు చేసింది ప్రధానంగా వైశ్యులే.  దేవాలయాలకు భూములను విరివిగా దానం చేసింది వారే.  తద్వారా శాశ్వతంగా ఆ భూములను పేద రైతులకు అతి చౌకగా కౌలుకు ఇచ్చి, అటు రైతులకు జీవనోపాధి కల్పించడం, దేవాలయాలకు శాశ్వత ఆదాయన్ని సమకూర్చడం చేసింది వైశ్యులే.  ఆ సత్రాలను, కోనేరులను కొందరు దుండగులు గుప్తనిధులకోసం పడగొట్టి త్రవ్వేసి నాశనం చేసినా రక్షించవలసిన నేటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి.  

కాబట్టి I Lie Yeah దుష్ప్రచారం చేసి కించపరుస్తున్నట్టు వైశ్యులు సామాజిక స్మగ్లర్లు కాదు, వారు సమాజసేవకులు.  తాము వృత్తిధర్మం ప్రకారం సంపాదించవలసినది ధనమే అయినప్పటికీ, మానవధర్మం ప్రకారం సంపాదించవలసినది పుణ్యం అని, చేయవలసింది ధర్మం అని త్రికరణశుద్ధిగా నమ్మి, ఎంతో సేవాభావంతో జీవితాలను ధన్యం చేసుకున్న మహానుభావులు వారు.

అందువల్ల, అటువంటి పాదాలనుండి జన్మించారు అనడం కేవలం సాంకేతికమై సూచన మాత్రమే తప్ప దాని అర్థం శూద్రుడు తక్కువ కాడు అని కాదు, ముఖమైనంత మాత్రాన బ్రాహ్మణుడు వారికంటె సర్వథా అధికుడైపోయాడు అని అర్థమూ కాదు. 

పాదాలనుండి శూద్రుడు జన్మించాడు అంటే అది వారిని అవమానించడమేనని ప్రచారం చేస్తున్నవారు పాశ్చాత్యులు అంటే పాశ్చాత్యభావజాలనికి దాసులు మాత్రమే.  మనలో inferiority/superiority complex లను పెంచేందుకు, తద్ద్వారా మన సమాజంలో చీలికలు తెచ్చి తాము బాగుపడేందుకు వారు ప్రచారం చేస్తున్న ఆ పనికిమాలిన భావాలను సమూలంగా తుడిచి పారేద్దాం.

ఆ బ్రహ్మగారు కడిగిన, ఆ శూద్రుడు జన్మించిన పాదాల గొప్పతనాన్ని ఒక బ్రాహ్మణుడైన అన్నమయ్య ఎంత తన్మయంతో కీర్తించాడో!  ఆ కీర్తన ఒక బ్రాహ్మణజాతి స్త్రీ అయిన ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మిగారి ముఖంనుండి ఎంత శ్రావ్యంగా వెలువడిందో విందాం.

 బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మము తానె నీ పాదము

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము -పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము

 

బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మము తానె నీ పాదము

 https://www.youtube.com/watch?v=IX2BuosmFHk

 

శ్రీనివాసకృష్ణ, రాష్ట్రియసంస్కృతవిశ్వవిద్యాలయం

చైత్ర-కృష్ణ-ఏకాదశీ, శోభకృత్

 

 

 

 


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...