Saturday, 7 November 2026

మహావధాని శూర్పణఖ









🙂
ముక్కుచెవులు కోశాడని అందరూ లక్ష్మణుడిని ఆడిపోసుకుంటారు గాని, శూర్పణఖలో దాగివున్న పాండిత్యప్రకర్షను తన స్పర్శతో బయటకు రప్పించిన అతడి గొప్పదనాన్ని ఎవరూ మెచ్చుకోరు ఎందుకో మరి!

అష్టావధానం గూర్చి అంతో ఇంతో తెలియని తెలుగువారు ఉండరు. సమస్యాపూరణం, వర్ణన, దత్తపది, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, అప్రస్తుతప్రసంగం, వ్యస్తాక్షరి వంటివి ఇందులో అంశాలు. అందులో సమస్యాపూరణంగూర్చి బోలెడు ఉదాహరణలు మనం వింటూనే ఉంటాం. సరే. నిషిద్ధాక్షరి తెలుసా. పద్యం చెప్పేటప్పుడు ఫలానా అక్షరాలను ఉపయోగించకండి అని చెబుతారు. అవధానిగారు (ఉభయలింగాలలోనూ ఇదే పదం. లేదా స్త్రీలింగంలో కాదాచిత్కేన అవధానిని అని అంటూండవచ్చు.) నిషేధింపబడిన అక్షరాలను వాడకుండా పద్యం చెప్పాలన్న మాట.

ఫలానా అక్షరాలను వాడకుండా మాట్లాడండి అని ఎవరైనా మనకు సవాలు విసిరారే అనుకోండి. మనం అలా మాట్లాడగలమా? పద్యం చెప్పమనడం లేదు. ఎప్పుడూ మాట్లాడే భాషలోనే మాట్లాడండి, కాని, ఫలానా అక్షరం వాడకండి అంటే అలా మాట్లాడగలమా, ధాటిగా ఒక ఐదు నిమిషాలపాటైనా?

అటువంటిది లక్ష్మణులవారు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు అక్షరాలను నిషేధించారు మాటలలో వాటిని వాడకూడదని. అయినప్పటికీ శూర్పణఖ ఆ సమస్యను దిగ్విజయంగా అధిగమించింది. ఆహా, మరి ఎంతటి పాండితీప్రకర్ష ఉంటే అలా చేయగలరు!

లక్ష్మణుడు నిషేధించింది ఐదు అక్షరాలను. అవి – 1. ఙ 2. ఞ 3. ణ 4. న 5. మ. శూర్పణఖ వాటిని వాడకుండా అద్భుతంగా పద్యాలను చెప్పింది. అదే పద్ధతిలో చివరన పొడుగాటి గద్యాన్ని కూడా చెప్పింది.

ఉదాహరణకు, స్థాలీపులాకన్యాయంగా ఒక పద్యం చూడండి –

హా హా! రాక్షసరాజ! దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజా
విద్యుజ్జిహ్వవిపత్తిరేవ సుకరా క్షుద్రప్రతాప! త్వయా।
ధ్వస్తాపత్రప! పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిరేతాదృశీ
జాతా కస్యచిదేవ తాపసశిశోః శస్త్రాత్ తవైవ స్వసా ॥

లక్ష్మణుడు తన ముక్కుచెవులు కోసేశాక శూర్పణఖ అన్నగారైన రావణాసురునికి తన గోడును విన్నవించుకుంటూ ఈ పద్యాన్ని చెప్పిందన్నమాట. కావాలంటే ఈ శ్లోకాన్ని వెదికి వెదికి చూడండి. ఎక్కడా నిషేధింపబడిన అక్షరాలు కనబడవు. మరి శూర్పణఖ మహాపండితురాలా కాదా మీరే చెప్పండి. సరే, ఈ పద్యానికి అర్థం కూడా చూద్దాం.

“హా హా రాక్షసరాజ” అని సంబోధించింది.
“అన్నా రావణా” అని పిలవలేదు.

అదెట్లా పిలుస్తుందండీ, పెద్దవాడు కదా. గౌరవం కొద్దీ ఏకవచనప్రయోగం చేయలేదు అనుకోకండి. లేదా - “జ్యేష్ఠులను ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా” అని కూడా అనుకోకండి.

విషయమేమిటంటే 'రావణ' అనే పదంలో ‘ణ’ అనే అక్షరం ఉన్నది కదా, అది నిషిద్ధం కదా మరి.

“మీరు అట్లాగే అంటారు లెండి. రావణా అని పేరు పెట్టి ఎట్లా పిలుస్తుందండీ, మీకు శూర్పణఖ అంటే పడక అలా చెబుతున్నారు కాని, మా శూర్పణఖ మీరనుకున్నలాంటిది కాదు, ఆవిడకు అన్నగారంటే చాల గౌరవం” అని దబాయించబోతున్నారా?

సరే కాసేపు అలాగే అనుకుందాం. కాని, చూడండి, ఆ వెంటనే -

“దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజాః” అనేసింది.

“దుష్పరాభవానికి గురైన తమరి చేతులకు ఛీ ఛీ” – అనేసింది.

ధిక్ అంటే ధిక్కరిస్తున్నాను. తిరస్కరిస్తున్నాను. ఛీ ఛీ అని అర్థం. అంటే ఆయన చేతులు బొత్తిగా పనికిరానివంటోందా – కాదు. కొన్ని పనులను ఆ చేతులు చాల సులువుగా చేసేయగలవుట. అవి ఎట్లాంటి పనులో కూడా చెప్పేసింది.

“విద్యుజ్జిహ్వవిపత్తిరేవ సుకరా క్షుద్రప్రతాప! త్వయా।” - అని తన మనసులో ఎప్పటినుండో ఉన్న మాటను యథాతథంగా చెప్పేసింది.

“ఒరే క్షుద్రప్రతాపుడా, (పనికిమాలిన పరాక్రమం కలిగినవాడా) నా భర్త అయిన విద్యుజ్జిహ్వుడికి విపత్తిని కలిగించడం (చంపడం అనే పని) మాత్రం తమరికున్న ఇరవై చేతులకు చాల సులువైన పని కదరా!” అని ఆ మాటలకు అర్థం.

పాపం ఎప్పట్నుంచి కడుపులో పెట్టుకున్నదో ఈ కోపం, మొత్తానికి వెళ్లగ్రక్కేసింది. ఇంకా -

“ధ్వస్తాపత్రప” – అన్నది. అంటే “సిగ్గు చచ్చినవాడా” – “ఒరే సిగ్గు లేనోడా” “You, shameless fellow!”- అని అర్ధం. ఇవి తిట్లు కావు, శూర్పణఖ తన అన్నగారికి ఇచ్చిన దీవెనలు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల ఇష్టం. తరువాత -

“పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిః” – అన్నది.

అంటే – “చూడు, చూడు, తమరికున్న అన్ని కళ్లతోనూ జాగ్రత్తగా చూడు” – అని అర్థం.

అందరికీ ఉన్నట్టుగా అన్నగారికి ఉన్నది రెండు కళ్లు కాదు. తలకొక జత చొప్పున పది తలలకు కలసి ఏకంగా ఇరవై కళ్లు ఉన్నాయి పేరుకు. అయినా ఆయనగారు ముక్కు చెవులు కోల్పోయి తన ముందుకు వచ్చిన చెల్లెలిని ఏమైందని అలా మాటవరసకు కూడా అడగని గొప్ప అన్నగారు. అందుకని ఒళ్లుమండి అలా దెప్పి పొడుస్తోందన్న మాట.

సరే ఏమి చూడాలట? తననే. తననే చూడాలట, ఇరవై కళ్లు వేసుకుని. ఏమైందట పాపం తనకు?

“ఏతాదృశీ జాతా తవైవ స్వసా” – అన్నది.
“తమరి చెల్లెలైన నాకు ఇటువంటి గతి పట్టింది!” అన్నది.

అంటే - "మీరేమో సమస్త రాక్షసజాతిని ఉద్ధరిస్తున్నారని అందరిచేత బాగా పొగిడించుకుంటున్నారు. కాని, స్వయానా తమరికి చెల్లెలైన నన్ను మాత్రం కాపాడలేకపోయారు" - అని ఉక్రోషం వెళ్లగ్రక్కింది.

పాపం, తన ఇరవై కళ్లకు కూడా దొరక్కుండా ఎక్కడెక్కడకు ఎప్పుడెప్పుడు వెళ్లి ఈవిడ ఏయే చేష్టలు చేస్తోందో గమనించడం ఆయనకు మాత్రం ఎట్లా సాధ్యం?

సరే, ఇటువంటి గతి పట్టింది అన్నది కదా, ఇటువంటి అంటే ఎటువంటి గతో తన నోటితో చెప్పనేలేదు. ఎందుకంటే లక్ష్మణుడు విధించిన నిషిద్ధాక్షరి నియమాన్ని పాటించాలి కదా మరి.

“నా నాసిక (ముక్కు) తెగింది” అనలేదు. ఎందుకంటే ‘నా’ అనే అక్షరం నిషిద్ధం.

“నా కర్ణాలు (చెవులు) తెగాయి” అనకూడదు. ఎందుకంటే ‘ణ’ అనే అక్షరం నిషిద్ధం కాబట్టి.

అందుకనే పాపం! నాకేం గతి పట్టిందో చూడు చూడు అని మాత్రం అన్నది.

సరే. మొత్తానికి ఆవిడ చూడు చూడు అని బలవంతం చేయగా అన్నగారు చూశారు. కాని, "ఎవరు చేశారు ఈ పని" అని మొహమాటానికి కూడా అడగలేదు. ఎందుకంటే ఆయనకు చెల్లెలంటే అంత ప్రేమ. తన చెల్లెలు ఎటువంటిదో అన్నగారికి బాగా తెలుసు. అందువల్లనే శూర్పణఖను లంకలోనే తన దగ్గరనే పెట్టుకుని ప్రేమతో చూసుకోకుండా, దూరంగా దండకారణ్యానికి పంపేశాడు. అందువల్ల అన్నగారు అడగకపోయినా ఆ పని ఎవరు చేశారో కూడా ఆవిడే చెప్పవలసి వచ్చింది.

“కస్యచిదేవ తాపసశిశోః శస్త్రాత్” - అని చెప్పింది.
“అడవిలో ఒకానొక తాపసశిశువు ఆయుధం వల్ల నాకు ఈ గతి పట్టింది” అని అర్ధం.

చూడండి. ఆవిడ ముక్కుచెవులు కోసిన ఆయన శిశువట. పాపం పిల్లాడు, తెలియక చేశాడు అనడం ఆవిడ ఉద్దేశ్యం కాదు.

లక్ష్మణుడు అని పేరు చెప్పవచ్చు కదా. చెప్పదు. ఎందుకంటే ఆయన పేరులో ఉన్న ‘ణ’ అనేది నిషిద్ధాక్షరం.
పోనీ రాముడి పేరైనా చెప్పిందా? లేదు. ఎందుకు? రామపదంలో ఉన్న ‘మ’ అనే అక్షరం కూడా నిషిద్ధాక్షరమే మరి!

ఈరకంగా ఆవిడ ఏకధాటిగా ఐదు పద్యాలు చెప్పింది. ఆ తరువాత ఇంత పొడుగు గద్యం కూడా చెప్పింది.

ఏమిటీ, గద్యం కూడానా? అసలు రామాయణంలో అటువంటి నిషిద్ధాక్షరి పద్యాలూ లేవు, గద్యం అనేది అసలు లేనే లేదు కదా అని అడుగబోతున్నారా?

అవును. మీరు అడుగుదామనుకున్న ప్రశ్న సమంజసమైనదే. ఈ పద్యాలు, గద్యమూ రామాయణంలోనివి కావు.
మరెక్కడివి?

శూర్పణఖాప్రలాపప్రబంధః అనే ఒక లఘుకావ్యంలోనివి.

సామాన్యశకం 16 వ శతాబ్దానికి చెందిన మేల్పుత్తూర్ నారాయణభట్టతిరి అనే ఒకానొక భక్తకవి ప్రబంధశైలిలో వ్రాసిన కావ్యమిది. “కూడియాట్టం, చాక్యార్ కూతు” అనే దృశ్యరూపక సంప్రదాయాలకు అనుగుణంగా ఆయన ఈ కావ్యం వ్రాశారు.

చాక్యార్ సంప్రదాయానికి చెందిన కళాకారుడు తన అద్భుతమైన అభినయంతో, శ్లోకాలను, గద్యాన్ని కూడా వ్యంగ్యభరితంగా రంగస్థలంపై ప్రదర్శిస్తాడు. కేరళదేశపు వైభవోపేతమైన సంస్కృతి అది.

సరే, ఈ ప్రబంధం పేరు శూర్పణఖాప్రలాపః.
(ప్రలాపము అది – విలాపము కాదు – అంటే ఆవిడ ఏడవటం లేదు. పేలుతోంది అన్నమాట.)

ఈ ప్రబంధానికి నిరనునాసికాప్రబంధము అని పేరు. అంటే – మనం నిషిద్ధాక్షరాలు అనుకున్నామే - ఙ,ఞ,ణ,న,మ – అనేవి అనునాసికాక్షరాలు. అవి పలుకకూడదు కాబట్టి, నిరనునాసికాప్రబంధము అని దీనికి పేరు.

సరే. మరో విషయం గమనించారా – అనునాసికాక్షరాలు మాత్రమే ఎందుకు ఇక్కడ నిషేధింపబడినట్టు?

ఎందుకంటారేమటి మహోదయులారా – ఆవిడ పలుకలేదు కాబట్టి. ఆవిడంటే ఎవరు – ఇంకెవరు? శూర్పణఖ.
అదిగో – మళ్లీ - "ఎందుకు పలుకలేదు" అని అడగబోరు కదా –

ఎట్లా పలుకగలదు చెప్పండి పాపం.

తన శస్త్రంతో ఆ తాపసశిశువు తన ముక్కు కోసేశాడు అని స్వయంగా శూర్పణఖే చెప్పింది కదా. మరి ముక్కిడి ముక్కుతో అనునాసికాక్షరాలు పలకడం అసాధ్యం కదా.

అందువల్ల, లక్ష్మణుడు అనునాసికాక్షరాలను నిషేధించాడు అని ఏదో సరదాగా అంటే నిజంగానే వారిద్దరి మధ్య ఏదో పాండిత్యస్పర్ధ కలిగిందని, చివరకు శూర్పణఖ నిషిద్ధాక్షరి నియమాలను పాటించి గెలిచేసిందని అనుకోవద్దు సుమా. 🙂

ఈ రకంగా ఎప్పుడో 16వ శతాబ్దంలోనే శూర్పణఖను troll చేస్తూ ఒక కేరళంలోనే ఒక ప్రబంధకావ్యం వెలిసింది.
ఆ విషయం అందరికీ తెలియవలసిన విషయం కదా మరి. అందుకని తెలియజేశాను.

శూర్పణఖ అభిమానుల మనోభావాలు దెబ్బతింటే నా పూచీ ఏమీ లేదు.
ఓ సినిమా డైరెక్టర్ వాల్మీకి రామాయణాన్ని ఎడాపెడా మార్చేస్తే తప్పు లేదంటారు గాని, పాపం, ఒక భట్టతిరిగారు కొన్ని పద్యాలు గద్యము వ్రాస్తే మాత్రం తప్పంటారా?

(వాల్మీకిరామాయణం ప్రకారమే శూర్పణఖ ఎటువంటిదో మునుపు మూడు పోస్టులు వ్రాసి ఉన్నాను. వీలు దొరికినపుడు వాటి లింకులు ఈ పోస్టుకు జత చేస్తాను.)

అందరికీ దీపావళీశుభాకాంక్షలు.
శూర్పణఖ ప్రేలాపన కంటె మన టపాసులు గట్టిగా ప్రేలాలి.
)))(((
నరకచతుర్దశీ, శ్రీపరాభవః. మన్దవాసరః
సామాన్యశకం, 07 నవంబర్, 2026

Sunday, 25 October 2026

హంసోదకం

స్థలం - తిరుపతి, తత్పరిసరాలు. 
 ఇద్దరు మిత్రులు సంభాషించుకుంటూ ఉన్నారు. 

 ఒకడు - 
అయ్యో, దుర్దినాలు సంప్రాప్తించాయి గదరా. 

 రెండవవాడు - 
 ఏమైందిరా? 

 1)
దినాలకు దినాలు ముసురు పట్టి పగలు సూర్యదర్శనం లేదు, రాత్రి చంద్రదర్శనం లేదు. 

 2) 
అప్పుడప్పుడు ఇలా జరగడం మామూలే కదా. ఇప్పుడెందుకు బాధ పడుతున్నావు. 

1) 
ఏముందిరా, ఆశ్వయుజమాసం సగం గడచిపోయింది, మన వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా గడచిపోయాయి. అన్నీ వర్షమేఘాల క్రిందనే ముగిసిపోయాయి. 
 
2) 
స్వామివారికి అలాగే బాగుందనిపించిందేమో. 

1) 
ఆయనకేమిలేరా, ఆయన అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు. ఆయనకు ఏమైనా జరుగుతుంది. 

2) 
నీకేమి లోటు వచ్చింది ఇప్పుడు. 

1) 
 హంసోదకస్నానం హంసోదకపానం చేద్దామనుకుంటే వీలు కావడం లేదు కదా. 

 2) 
 హంసోదకమంటే ఏమిటి 

 1) 
तप्तं तप्तांशुकिरणैः शीतं शीतांशुरश्मिभिः । 
समन्तादप्यहोरात्रमगस्त्योदयनिर्विषम् ॥ 
शुचि हंसोदकं नाम । 

 2) 
 తెలుగులో చెప్పరా 

 1) 
తప్తం తప్తాంశుకిరణైః శీతం శీతాంశురశ్మిభిః । 
సమన్తాదప్యహోరాత్రమగస్త్యోదయనిర్విషమ్ ॥ 
శుచి హంసోదకం నామ 

 2) ఇప్పుడు లిపి మార్చావు. కాని, సంస్కృతమే కదా. 

 1) 
 సరే విను. ఒక సరస్సులో లేదా చెఱువులో పగలంతా సూర్యకిరణాలతో తపించి, రాత్రంతా చంద్రకిరణాలతో చల్లనై, అహోరాత్రం గడచి అగస్త్యనక్షత్రోదమయ్యే సమయానికి లబ్ధమయ్యే నీటికి హంసోదకమని పేరు. 

 2) ఏమిటి దాని విశిష్టత. 

 1)
 निर्मलं मलजिज्जलम् । 
नाभिष्यन्दि न वा रूक्षं पानादिष्वमृतोपमम् 

 2) 
మళ్లీ సంస్కృతమేనా 

 1) 
 నిర్మలం మలజిజ్జలమ్ । 
నాభిష్యన్ది న వా రూక్షం పానాదిష్వమృతోపమమ్ 

 2) 
అదిగో 

 1) 
హంసోదకం నిర్మలమైనది. విషరహితమైది. పవిత్రమైనది. కల్మషాలు లేనిది, అభిష్యంది కాదు. రూక్షం కాదు, త్రాగితే అమృతంతో సమానమైనది. 

 2) 
 అభిష్యంది అంటే 

 1) 
 మన శరీరంలో ఆహారరసము, రక్తము, ప్రాణవాయువు, మూత్రము, మలము మొదలైనవి తమ తమ మార్గాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ మార్గాలను స్రోతస్సులు అంటారు. ఆ స్రోతస్సులు సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆ స్రోతస్సులకు అడ్డం పడే ద్రవ్యాలకు అభిష్యంది అని పేరు. కాని, హంసోదకం అనభిష్యంది. అంటే అభిష్యంది కాదు. కాబట్టి త్రాగడానికి అత్యంతం శ్రేష్ఠమైన నీరు. 

 2) 
 రూక్షం అంటే 

 1) 
అంటే పొడి పొడిగా ఉండేది. రూక్షమైన ద్రవాలను త్రాగితే గొంతు పట్టేస్తుంది. దాహం పెరుగుతుంది. కాని హంసోదకం రూక్షం కాదు కాబట్టి, ఆరోగ్యానికి చాల మంచిది. 

 2) 
ఓహో, ఇలా ముసురు పట్టి ఉండటం వల్ల పగలంతా సూర్యకిరణాలు లేవు. రాత్రంతా చంద్రకిరణాలు లేవు, అందువల్ల హంసోదకం దుర్లభం అని బాధపడుతున్నావా. 

 1) 
అవును 🙁 

 2) 
 మరి ముసురు పట్టకమునుపు ఏమి చేశావు. అప్పుడు త్రాగి ఉండవచ్చు కదా. 

 1) 
 అట్లా కాదు, హంసోదకం శరత్కాలంలోనే త్రాగాలి. అది అమృతంతో సమానం. మహాలయ-అమావాస్య తరువాత రోజునుండి శరదృతువు ప్రవేశించింది. కాని అప్పటినుండి అహోరాత్రాలు మేఘాలు ముసురుకునే ఉన్నాయి. ఈరోజు చతుర్దశి. రేపు ఆశ్వయుక్-పూర్ణిమ. సగం నెల గడచిపోయింది. ఇప్పటికీ మేఘాలు ముసురుకునే ఉన్నాయి. సూర్యచంద్రదర్శనమే లేదు. ఇక హంసోదకం ఎప్పుడు దొరుకుతుంది ? అదీ నా విచారం. 

 2) 
సరేలేవోయ్. ఆశ్వయుజంలో ఇంకా కృష్ణపక్షం ఉన్నది. ఆ తరువాత ఇంకా కార్తికమాసం ఉన్నది. అందులో కూడా శుద్ధబహుళపక్షాలు రెండూ ఉంటాయి. ఆలోగా ఏదో ఒకరోజు నీకు హంసోదకం దొరక్కపోదులే. 

 1) 
అది కాదు. 

 2) 
ఇంకేమిటి 

 1) 
ఆ చెఱువులు సరస్సుల ఒడ్డున చెట్లు కూడా ఉండకూడదు. ఎందువల్లనంటే చెట్ల కొమ్మలు అడ్డం వస్తే, సూర్యచంద్రకిరణాలు నీటిమీద సరిగా పడవు కదా. అప్పుడది హంసోదకం కాదు. కనీసం ఆ చెట్లకు చెందిన ఆకులు నీటిమీద ఆవరించుకున్నా సరే, అది హంసోదకం కాలేదు. 

 2) 
అయ్యా సామీ, ఇలాగైతే నీకు ఈ జన్మకు హంసోదకం లభించే యోగం లేదు పో. 

 1) 
అదేమిటి, అలాంటి చెఱువులు సరస్సులు ఎక్కడా ఉండవా. 

 2) 
 ఎందుకు ఉండవు, మానససరోవరానికి పో. మన చెఱువులు సరస్సులు ఎట్లా ఉంటాయో నీవు ఎరుగవా. ఎక్కడ చూసినా, వాటిలోనికి చెత్తా చెదారం గుమ్మరిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా నీటిమీద ప్లాస్టిక్ డబ్బాలు తేలాడుతూ కనబడుతుంటాయి. నీవేమో నీటిమీద ఒక మామిడాకు పడినా అది హంసోదకం కాదుపో అని తిరస్కరిస్తున్నావు. ఇంకెక్కడ హంసోదకంరా పిచ్చోడా. నీవన్నీ తీరని కోరికలు. 

 1) 
అయ్యయ్యో. ఎంత మాటన్నావురా. 

 2) 
సరే. మరి ఈ బొమ్మ చూపిస్తున్నావు. కాని దీనిపై తామరాకులు పద్మాలు ఉన్నాయి కదా, అవి అడ్డు ఉండడంవల్ల కూడా సంపూర్ణంగా సూర్యచంద్రకిరణాలు ఆ నీటికి సోకవు కదా. మరి అది హంసోదకం ఎలా అవుతుంది 

 1) 
పద్మాలలో ఉండే ఔషధగుణాలు నీటిలో కరిగి హంసోదకం మరింతగా అమృతతుల్యమౌతుంది. 

 2) 
సరే. స్వచ్ఛభారత్ ఉద్యమానికి నడుం కట్టు మరి. న హి కార్యం నిష్ఫలం భవేత్ అన్నారు కదా. Every action has an equivalent opposite reaction కదా. నీ ఉద్యమానికి ఫలితంగా ఎప్పుడో ఒకప్పుడు హంసోదకం లభించకపోదులే. 

 1) 
లభిస్తే నా ఒక్కడికేనా లభించేది, అందరికీ లభిస్తుంది. అందరం నడుం కడదాం. 

 (ఇంతలో మూడోవాడు ప్రవేశించాడు) 

 3) 
 స్వచ్ఛభారత్ డౌన్ డౌన్. స్వచ్ఛభారత్ ఉద్యమం నశించాలి. 

 1) & 2) 
ఎవరయ్యా నువ్వు, స్వచ్ఛభారత్ జరిగితే అందరికీ మంచిదే కదా. 

 3) 
హిందువులు హంసోదకం గింసోదకం అంటూ మతోన్మాదులై స్వచ్ఛభారత్ కావాలని కోరుకుంటున్నారు. వారి ఆటలు మేము సాగనివ్వం. స్వచ్ఛభారత్ రాజ్యాంగంలో చెప్పబడిన సెక్యులరిజానికి వ్యతిరేకం. కాబట్టి స్వచ్ఛభారత్ డౌన్ డౌన్. 

 1) 
ఎవడ్రా వీడు 

 2) 
పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే నశించిపోయే పురుగులు కీటకాలజాతికి చెందినవాడు వీడు. సందేహం లేదు. 

 1) 
శివ శివా. సమస్తమైన అమంగళాలు ప్రతిహతాలు అగుగాక. సమస్తజనాలకు సద్బుద్ధులు కలిగి సమస్తసన్మంగళాలు సర్వులకు చెందుగాక. 

 2) 
 తథాస్తు. 

 )))(((

ఆశ్వయుజశుక్లచతుర్దశీ, భానువాసరః, శ్రీపరాభవః
సామాన్యశకం 25 అక్టోబర్, 2026
ఆశ్వయుజశుక్లచతుర్దశీ, భానువాసరః, శ్రీపరాభవః సామాన్యశకం 25 అక్టోబర్, 2026

Friday, 8 December 2023

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. 

ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. 

విధర్మీయులు మనకు పాలకులై, వారే స్వయంగా ప్రజలమైన మనలను శత్రువులుగా భావించి, ఒకవైపు మన శ్రేయస్కాములుగా నటిస్తూ, మరోవైపు మనపై ప్రత్యక్ష-పరోక్షయుద్ధాలను ప్రకటించి నాశనం చేయడానికి పూనుకున్న కాలమిది. 

సనాతనధర్మావలంబకులమైన మనకు ఇది అతి గడ్డుకాలం. మనలో తగినంత ఐకమత్యం నశించింది. కారణాలు అనేకం. కాలానుగుణంగా మన ఆహారపుటలవాట్లు మారాయి. దానితో పాటు మన జీవనవిధానం కూడా మన పూర్వికులవలె లేకుండా పోయింది. మనలను నాశనం చేయాలనే వారి మాటలను మనం వింటున్నా సరే, మనకు అర్థం కాని భాషలో వారు మాట్లాడుతున్నట్లుగా మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మనకు తెలియడం లేదు. విధర్మీయులందరూ రాజాశ్రయం రాజాభయం పొంది, మన కండ్లముందే మనవారిని ఎందరినో వివిధరకరకాలుగా హతమారుస్తున్నా, అదేదో మన కలలో జరుగుతోంది అన్నట్లుగా ఆత్మరక్షణకోసం మనం బలవంతులం కావాలనే స్పృహ మనకు కలగటం లేదు. ఆ విధర్మీయులు ఒకవైపు మనకు మిత్రులుగా నటిస్తూ మరొకవైపు సంస్కృతిసంప్రదాయాలపై దాడులు చేయడం మాత్రమే కాదు, మన జీవనమార్గాలను కూడా క్రమంగా మూసివేస్తూ వస్తున్నా మనం అర్థం చేసుకోకుండా వినోదాలలో కాలం గడిపివేస్తున్నాం. శత్రువును వ్యసనాలలో ముంచి నాశనం చేయాలనేది ఒక యుద్ధపద్ధతి. వారు ఆ పద్ధతిలో ఆరితేరి మనలను వినాశపుటంచులకు చేరుస్తున్నప్పటికీ మనలో అసంఖ్యాకులైన జనాలు సెక్యులర్ మద్యపు మత్తులో జోగుతున్నారు. 

అర్థం చేసుకున్నవారిలో కొందరు మాత్రం శాయశక్తులా పోరాడుతున్నారు. వారికి ఆ మత్తును వదిలించి సనాతనజీవనస్రవంతిలోనికి తీసుకువచ్చేందుకు శతధా సహస్రధా ప్రయత్నిస్తున్నారు. వారి ఋణం తీర్చుకోలేనిది. 

రామరావణయుద్ధంలో అదృశ్యరూపుడై ఇంద్రజిత్తు చేసిన భీషణమైన మాయాయుద్ధంలో రామలక్ష్మణులతో సహా సమస్తవానరసైన్యం సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు జాంబవంతుడు, "నైరృత, హనుమాన్ వానరశ్రేష్ఠః ప్రాణాన్ ధారయతే క్వచిత్?" (ఓ విభీషణా, హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా?) అని అడిగాడట. అప్పుడు విభీషణుడు "అదేమిటి ఆర్యా, రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా అని అడుగకుండా, హనుమంతుని క్షేమం గూర్చి అడుగుతున్నారే?" అని ప్రశ్నించాడట. అప్పుడు జాంబవంతుడు, "తస్మిన్ జీవతి వీరే తు హతమప్యహతం బలమ్। హనుమత్యుజ్ఝితప్రాణే జీవన్తోఽపి వయం హతాః।। [[నాయనా విభీషణా, వీరహనుమాన్ ఒక్కడు ప్రాణంతో ఉంటే మన సమస్తవానరసైన్యం హతమారిపోయినా, బ్రతికివున్నట్లే, ఆ హనుమంతుడు ఒక్కడు లేకుంటే సమస్తవానరసైన్యం పేరుకు జీవించివున్నా మరణించినట్లే]]" అని బదులిచ్చాడు. ఈ సందర్భంలో, ఆత్మరక్షణకోసం ఎవరికి సాధ్యమైన రీతిలో వారు పోరాడాలనే మనలోని స్వభావమే ఆ హనుమంతుడు. ఆ స్వభావం నశిస్తే మనం నశించినట్లే. అది సజీవంగా ఉన్నంతవరకు, మనము, మన ధర్మము సురక్షితంగా ఉన్నట్లే. 

ధర్మో రక్షతి రక్షితః. మనం ఆస్తికులం. అంటే వేదవాక్కులను విశ్వసించేవారం. మన రక్షణకోసం వేదంలోని సురక్షా సూక్తాన్ని అర్థసహితంగా ప్రతిదినం పఠించుదాం. ఆహుతులను ఎలా సమర్పించాలో ఎవరికివారు తమ తమ గురువులను అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. మన శక్తి, మన పోరాటం, ఎంత గొప్పవైనా వేదమాత ఆశీస్సులను కూడా పొందుదాం. 

ఇదిగో ఆ సురక్షా సూక్తం. ఇది చదివేేందుకు చాల సరళమైనది. కఠినమైన పదాలు లేనిది. పరిమాణంలో చాల చిన్నది కూడా. 

((())) సురక్షాసూక్తము (అథర్వవేదము, ద్వితీయకాండము, 16వ సూక్తము) ఋషి - బ్రహ్మ దేవత - ప్రాణము, అపానము, ఆయువు ఛందస్సు - ఏకపాదాసురీ త్రిష్టుప్ (1,3) ఏకపాదాసురీ ఉష్ణిక్ (2) ద్విపాదాసురీ గాయత్రీ (4,5) 

1 ప్రాణాపానౌ మృత్యోర్మా పాతం స్వాహా।। {{ఓ ప్రాణ-అపానములారా, మీరిరువురు మమ్ములను మృత్యువునుండి కాపాడండి. మా ఆహుతిని స్వీకరించండి.}} 

2 ద్యావాపృథివీ ఉపశ్రుత్యా మా పాతం స్వాహా।। {{ఓ ద్యావా-పృథివీ, మీరిరువురు మాకు చక్కని వినికిడి శక్తిని ప్రసాదించి మమ్ములను కాపాడండి. మా ఆహుతిని స్వీకరించండి.}} 

3 సూర్య చక్షుషా మా పాహి స్వాహా।। {{ఓ సూర్యదేవా, మాకు చక్కగా చూడగల శక్తిని ప్రసాదించి మమ్ములను కాపాడు. మా ఆహుతిని స్వీకరించు.}} 

4 అగ్నే వైశ్వానర విశ్వైర్మా దేవైః పాహి స్వాహా।। {{ఓ వైశ్వానర-అగ్నిదేవ, నీవు సమస్తదేవతలతో కలసి మమ్ములను కాపాడు. మా ఆహుతిని స్వీకరించు.}} 

5 విశ్వంభర విశ్వేన మా భరసా పాహి స్వాహా।। {{సమస్త-స్థావరజంగమ-పోషకుడవైన ఓ విశ్వంభరదేవా, నీవు నీ సమస్తశక్తితో మమ్ములను కాపాడు. మా ఆహుతిని స్వీకరించు.}} 

)))((( 
కార్తికకృష్ణద్వాదశీ, శోభకృత్, మందవాసరః

 

Saturday, 24 June 2023

మధురవాణి

గీతాప్రెస్, గోరఖ్ పుర్ వారి కల్యాణ్ పత్రిక (జూన్ 2023) లోని వ్యాసం


 

మధురవాణి వలన ఉపయోగాలు


వాక్సంయమో హి నృపతే సుదుష్కరతమో మతః।

అర్థవచ్చ విచిత్రం చ న శక్యం బహు భాషితుమ్।।

ఓ రాజా, మాటలను అదుపులో ఉంచుకుని పలకడం చాల కష్టమైన పని.  అయినప్పటికీ, అర్థవంతములు, నేర్పుతో కూడినవి అయిన మాటలను నిత్యం పలుకుతూ ఉండటం (అందరికీ) సాధ్యం కాదు.


అభ్యావహతి కల్యాణం వివిధం వాక్ సుభాషితా।

సైవ దుర్భాషితా రాజన్ననర్థాయోపపద్యతే।।

ఓ రాజా, చక్కగా మాటలాడటం వల్ల వివిధములైన శుభాలు చేకూరుతాయి.  కాని, చెడ్డ మాటలు పలికితే అవి వివిధములైన అనర్థాలను చేకూరుస్తాయి.

  

రోహతే సాయకైర్విద్ధం వనం పరశునా హతమ్।

వాచా దురుక్తం బీభత్సం న సంరోహతి వాక్క్షతమ్।।

బాణాలతో దెబ్బ తిన్నప్పటికీ, గొడ్డళ్లతో నరుకబడినప్పటికీ అడవి మరల చిగురిస్తుంది.  కాని, చెడ్డ మాటలతో బీభత్సంగా దెబ్బ తిన్నది ఏదీ కూడా (ఉదాహరణకు స్నేహం) మరల మొలకెత్తదు.


కర్ణినాలీకనారాచాన్నిర్హరన్తి శరీరతః।

వాక్శల్యస్తు న నిర్హర్తుం శక్యో హృదిశయో హి సః।।

శరీరంలో కర్ణి, నాళీకము, నారాచము మొదలైన రకరకాల బాణాలు గ్రుచ్చుకున్నప్పటికీ వాటిని మరలా పెరికివేయవచ్చును.  కాని, చెడ్డమాట అనే బాణం హృదయంలో గ్రుచ్చుకుంటే దానిని మరలా బయటకు పెరకడం సాధ్యం కాదు.


వాక్సాయకా వదనాన్నిష్పతన్తి యైరాహతః శోచతి రాత్ర్యహని।

పరస్య నామర్మసు తే పతన్తి తాన్ పణ్డితో నావసృజేత్ పరేభ్యః।।

నోటినుండి వెలువడే పదునైన బాణాల వంటి మాటలతో దెబ్బ తిన్న వ్యక్తి రాత్రింబగళ్లు బాధపడుతునే ఉంటాడు.  అవి సున్నితమైన మనస్సును దెబ్బ తీసి ఇతరుల ప్రాణాలను కూడా తీయగలవు.  అందువల్ల పండితుడు అటువంటి మాటలను పలుకరాదు. 


అతివాదం న ప్రవదేన్న వాదయేద్ యోऽనాహతః ప్రతిహన్యాన్న ఘాతయేత్।

హన్తుం చ యో నేచ్ఛతి పాపకం వై తస్మై దేవాః స్పృహయన్త్యాగతాయ।।

ఎవడు ఇతరులను దుర్భాషలతో బాధించడో, ఎవడు ఇతరులు తన పట్ల దుర్భాషలాడేందుకు అవకాశం ఇవ్వడో, ఎవడు ఇతరుల దుర్భాషలకు తాను బాధపడకుండా ఉంటాడో, ఎవడు ఇతరుల దుర్భాషలకు తాను స్వయంగా గురి అయినప్పటికీ, వారిని క్షమించి తిరిగి దుర్భాషలాడకుండా ఉంటాడో అటువంటి వాని ఆగమనం కోసం దేవతలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు.

{{విదురనీతి (2.76-80, 4.11)}} 



ఆషాఢశుక్లషష్ఠీ, శోభకృత్, స్థిరవాసరః

శ్రీనివాసకృష్ణ



Thursday, 4 May 2023

అమృతమహల్ - భారతీయగోజాతి (1)

అమృతమహల్ అనే భారతీయగోజాతి అధికంగా కర్ణాటకలోని హసన, చిక్కమగళూరు, చిత్రదుర్గ జిల్లాలలో కనిపిస్తుంది.

ఇది కరువును చాల చక్కగా తట్టుకోగలదు. ఇది బలానికి, చురుకుదనానికి, పనిలో నైపుణ్యానికి పెట్టింది పేరు. ఈ జాతి ఎద్దులు వ్యవసాయపు పనులకు, రవాణాకు చాల చక్కగా ఉపయోగపడతాయి. ఆవులు తక్కువగా పాలను ఇస్తాయి. కాని వాటి సంతానం చాల బలంగా చురుకుగా ఉండేందుకు వాటి పాలే కారణం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అనడంలో ఇదే అంతరార్థం.

సామాన్యశకం 1572 – 1636 కాలంలో మైసూరు పాలకులు పాలకోసం, పాల ఉత్పత్తులకోసం ఈ జాతి ఆవులను ప్రత్యేకమైన శ్రద్ధతో పెంచారు. ఈ జాతి ఎద్దులను యుద్ధసామగ్రి తరలింపుకోసం వాడేవారు. అమృతమహల్ జాతిలో మరలా హల్లికర్, హగల్ వాడి, చితల్ దుర్గ అనే మూడు ఉపజాతులు ఉన్నాయి.

అమృతమహల్ గోజాతి తెలుపునుండి నలుపువరకు వివిధ చాయలలో ఉంటాయి. కొన్ని పశువులలో ముఖం మీద, గంగడోలు మీద బూడిదరంగు మచ్చలు కూడా ఉంటాయి. వాటి మూతి, ముక్కు, తోక సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి. వయసు పైబడుతున్న కొద్దీ ఆ నలుపు క్రమంగా పల్చబడుతుంది. ఈ జాతికి చెందిన పశువుల తల, కొమ్ముల ఆకృతి ప్రత్యేకంగా ఉంటుంది. వీటి దూడల తల పొడుగ్గా, మూతివైపు కూచిగా ఉంటుంది. వీటి నుదురు సన్నగా ఉండి మధ్యభాగం బయటకు ఉబ్బి ఉంటుంది. వీటి కొమ్ములు తమ కుదుళ్లనుండి కొద్దిగా వెనుకవైపుకు వంగి చివరి భాగంలో పదునుదేలి ఒకదానివైపుకు ఒకటి ఒరిగినట్టు ఉంటాయి. వాటి చివరిభాగం నలుపు రంగులో ఉంటుంది. వీటి కండ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. చెవులు చిన్నవిగా, ఎటువైపూ వాలక సమతలంగా ఉండి, చివర ఆదోకగా ఉంటాయి. దీని మూపురం ఎత్తుగా పెరిగి, కొద్దిగా ముందుకు ఒరిగినట్టు ఉంటుంది. దీని గంగడోలు మరీ పొడుగైనది కాదు. వీటి చర్మం నూగుతో కూడి, పల్చగా, మృదువుగా, శరీరానికి బిగుతుగా ఉంటుంది. వీటి కాళ్లు మరీ పొడుగ్గా ఉండవు కాని, సమపాళ్లలో బలంగా ఉంటాయి. వీటి గిట్టలు చిన్నవిగా, దగ్గరగా, చాల గట్టిగా ఉంటాయి.

ఆవు పొదుగు చిన్నది. చనుమొనలు చిన్నగా దృఢంగా ఉంటాయి. ఎదిగిన ఆబోతు సరాసరి 500 కేజీలు, ఆవు 318 కేజీలు బరువు తూగుతాయి.

#గోవత్స_రాధేశ్యాం_రవోరియా గారి #భారతీయగోవంశ్ పుస్తకంలో ఒక వ్యాసానికి నా స్వేచ్ఛానువాదం. (1)

మరిన్ని వివరాలకు - Amrit Mahal Cattle Breed Facts, Features, Characteristics | Agri Farming

చిత్రం - Agri Farming వారిది.

వైశాఖపూర్ణిమా, శోభకృత్, శుక్రవాసరః

Saturday, 15 April 2023

పద్భ్యాం శూద్రో అజాయత। పాదములనుండి శూద్రుడు జన్మించెను.

పాదాలంటే అంత లోకువా?

పద్భ్యాం శూద్రో అజాయత।

(పాదములనుండి శూద్రుడు జన్మించెను.)

అవును.  అయితే ఏమిటట?

ఎవరి పాదాలనుండి జన్మించెను?  సమాజాన్నే తన దేహంగా కలిగిన విరాట్ పురుషుని పాదాలనుండి. అయితే ఏమిట్ట?  ఎందుకు అల్లరి?  సరే, ఆ విరాట్ పురుషునికి పాదాలే తప్ప మిగిలిన అవయవాలు లేవా?  ఉన్నాయి కదా?. 

బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ – (బ్రాహ్మణుడు అతడి ముఖముగానుండెను.)  బాహూ రాజన్యః కృతః (బాహువులు క్షత్రియుడాయెను.) ఊరూ తదస్య యద్వైశ్యః (అతని ఊరువులు ఏవైతే ఉన్నాయో అవి వైశ్యుడు) - ఈ మాటలు కూడా అక్కడే ఉన్నాయి. 

వీటిని పట్టుకుని, అల్లరల్లరి చేస్తున్నారు. 

ముఖము, బాహువులు, ఊరువులు చాలా గొప్పవని, పాదాలు మాత్రం చాల నీచమైనవని, ఈ విధంగా శూద్రుని జన్మను నీచమైనదిగా చిత్రీకరించారని అల్లరి.  ఎవరు చెప్పారలా?  అలా ప్రచారం చేస్తున్న జనాలకు పాదాలంటే అంత లోకువా? 

శ్రీరాముడు తనపై దండెత్తిన పరశురాముని ఓడించాడు. ఓ పరశురామా, నీవు చేసిన అపరాధానికి పరిహారంగా నీ పాదగతిని (పాదాలతో సంచరించే శక్తిని) నాశనం చేయమంటావా లేక నీ తపశ్శక్తితో నీవు సాధించుకున్న ఎన్నో పుణ్యలోకాలను నీకు చెందకుండా నాశనం చేయమంటావా అని అడిగాడు.

అపుడు పరశురాముడు తన తపశ్శక్తితో ఆర్జించిన సమస్త పుణ్యలోకాలనే నశింపజేయమన్నాడు.  తనను కరుణించి తన పాదగతిని మాత్రం నాశనం చేయవద్దని వేడుకున్నాడు.  (రామాయణం. బాలకాండం, 76వ సర్గ)

అంటే, తపస్సు కంటె, తపశ్శక్తి కంటె, సమస్త పుణ్యలోకాల కంటె, పాదాలు, పాదాల కున్న శక్తి చాల ముఖ్యమైనవనే కదా అర్థం?

అటువంటి పాదాలంటే కొందరు జనాలకు అంత లోకువైనాయా?

సరే, సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఎవరు?  ఆ విరాట్ పురుషుని, కుమారుడే కదా?

ఆ బ్రహ్మగారు –

1 సనక-సనందన-సనత్సుజాత-సనత్కుమారులనే పరమయోగులకు తండ్రి.

2  నారదుడు మొదలైన దేవఋషులకు తండ్రి.

3 వసిష్ఠుడు భృగువు మొదలైన బ్రహ్మఋషులకు తండ్రి.

4 పులస్త్యుడు, మరీచి, దక్షుడు, కశ్యపుడు మొదలైన నవ ప్రజాపతులకు తండ్రి.

5 ఆ ప్రజాపతుల సంతానమే దేవతలు,

6 ఆ ప్రజాపతుల సంతానమే అష్ట దిక్పాలకులు.

7 ఆ ప్రజాపతుల సంతానమే చతుర్దశ ఇంద్రులు.

8 ఆ ప్రజాపతుల సంతానమే చతుర్దశ మనువులు.

9 ఆ ప్రజాపతుల సంతానమే...

9.1 అసురులు

9.2 పితరులు

9.3 సిద్ధులు

9.4 గంధర్వులు

9.5 కిన్నరులు

9.6 కింపురుషులు

9.7 విద్యాధరులు

9.8 అష్టవసువులు

9.9 ఏకాదశరుద్రులు,

9.10 ఇరువురు అశ్వినులు,

9.11 దానవులు

9.12 యక్షులు

9.13 రాక్షసులు

9.14 పిశాచులు

9.15 గుహ్యకులు

9.16 మానవులు

9.17 సమస్తజంతుజాలం

9.18 సమస్తవృక్షజాలం

ఇందరు మహామహులకు, ఇంతటి మహాసృష్టికి తండ్రి లేదా తాత అయిన ఆ బ్రహ్మగారు ఏం చేశారు? ఆ విరాట్ పురుషుని పాదాలను కడిగి, తన ముఖాన ధరించాడు.  విరాట్ పురుషుని పాదాలు నీచమైనవైతే బ్రహ్మగారు స్వయంగా తన కమండలు జలాన్ని ఉపయోగించి, తన చేతులను ఉపయోగించి ఎందుకు కడుగుతారు?  పాదాల కంటె ముఖం శ్రేష్ఠమైనది అని భావిస్తే  ఆ పాదజలాన్ని తన ముఖాన ఎందుకు ధరిస్తాడు?  

అసలు ఒక్క బ్రహ్మగారని ఏముంది?  మనమంతా కూడా మన బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖము ఉండే తలను వంచి నమస్కరించేది ఆ పాదాలకే కదా? 

అంతేకాదు, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధినివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీమహావిష్ణుపాదోదకం పావనం, శుభం అంటూ భక్తితో స్వీకరించి, బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖంలో ఉండే కనులకు అద్దుకుని, ముఖంలోనే ఉండే నోటితో సేవించే ఆ తీర్థం ఆ పాదాలను కడిగిన జలమే కదా?

భారతదేశంలో వివాహపద్ధతిని కన్యాదానం అని కూడా అంటారు.  కన్య తల్లిదండ్రులు వరుని శ్రీమహావిష్ణువుగాను, తమ కుమార్తెను శ్రీమహాలక్ష్మిగాను భావన చేసి, వరుని పాదాలను కడిగి పెండ్లి చేస్తారు.  ఆ సమయంలో వారి దృష్టి - అంటే బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖంలో ఉన్న కండ్లు పూర్తిగా పాదాలమీదనే ఉంటుంది. ఆ సమయంలో బ్రాహ్మణుడు అని చెప్పబడిన ముఖంలోని నోరు చాల శ్రద్ధగా ‘ఇయం కన్యా మమ సుతా’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది.  అలాగే క్షత్రియుడు అని చెప్పబడిన చేతులే ఆ పాదాలను శ్రద్ధగా కడుగుతాయి.  అవునా కాదా? 

ముఖంలో ఉండే కళ్లు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ ఐదింటినీ జ్ఞానేంద్రియాలు అంటారు.  ఈ జ్ఞానేంద్రియాలు మంచినీ చెడ్డనూ రెండింటినీ గ్రహించి తెలియజేస్తాయి.  కళ్లు పూవులనూ చూస్తాయి, బురదగుంటను కూడా చూస్తాయి.  ముక్కు సుగంధాన్ని, దుర్గంధాన్ని కూడా గ్రహిస్తాయి.  చెవి అన్నమయ్యపాటలనూ వింటుంది, అర్థం పర్థం లేని చెత్త సినిమాపాటలను కూడా వింటుంది.  నాలుక షడ్రుచులనూ గ్రహిస్తుంది.  చర్మం వెచ్చదనాన్ని చల్లదనాన్ని కూడా గ్రహిస్తుంది.  అయితే ఆ జ్ఞానేంద్రియాల పని కేవలం తెలియజేయడం మాత్రమే. శాసించడం కాదు.  మనకు ఏది శ్రేయస్కరమో దానిని ఎంచుకుని, ఏది హానికరమో దానికి దూరంగా ఉండడం మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది.  

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు కదా, అటువంటి కండ్లు ఒక వ్యక్తికి లేవనుకోండి, అతడు దారిలో ముల్లు మీద అడుగువేసి, అవి పాదంలోపలికి గ్రుచ్చుకుని, జివ్వుమని బాధ కలిగేదాకా నేను ముండ్లదారిలో నడుస్తున్నాను అని తెలుసుకోలేడు. అయితే కండ్లున్న మనిషి కొద్దిగా దూరంగా ఉండగానే ఆ ముండ్లను చూడగలుగుతాడు, ముండ్లను త్రొక్కకుండా ముందడుగు వేస్తాడు.  లేదా కండ్లున్న మరో మనిషి బాబూ ఆ దారిన పోవద్దు, కొంచెం ఎడమవైపుకు తిరుగు అంటే చెవిద్వారా విని ఆలా చేస్తాడు. ‘దృష్టిపూతం న్యసేత్ పాదం’ అంటారు.  అంటే మార్గాన్ని జాగ్రత్తగా చూసి అడుగు వేయాలని.  కాని, ఎవడో పాశ్చాత్యుడు ఎవడో పాషండుడు చెప్పాడని ముఖంలో ఉండే మన కండ్లను మనమే ద్వేషించి ఎడాపెడా నడుస్తామా?  అలా అయితే మనం ముండ్లను త్రొక్కడం మాత్రమే కాదు, బురదను కూడా తొక్కవచ్చు, లేదా  ఒక నిలువెత్తు గోతిలో పడవచ్చు.  అలా జరిగితే కేవలం పాదాలకు మాత్రమే నష్టం కాదు, సమస్తశరీరానికీ కూడా నష్టం జరగవచ్చు.  పడరానివిధంగా పడితే మనకెంతో ఉపయోగకరమైన కళ్లు కూడా శాశ్వతంగా పోవచ్చు.  కండ్లను ద్వేషించి మన కండ్లను మనమే ఓ ముల్లుతో పొడుచుకుంటే మనకు కాక, ఇంకెవరికి నష్టం?  పురుషసూక్తంలో సాంకేతికంగా (సింబాలిక్ గా) చెప్పిన మాటలను అవి మన భారతసమాజంలో ఎక్కువ తక్కువలను నిర్ణయించిన మాటలుగా వక్రీకరించి, మనలో మనకు విద్వేషాలను రేకెత్తించాలని పాశ్చాత్యులు పాషండులు చేసిన విద్రోహపూర్వకమైన కుట్రలను మనం ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటాం? 

కాబట్టి, బ్రాహ్మణుడు ముఖమాయెను అంటే, మనకు మంచిచెడ్డల జ్ఞానం తెలియజేసేవారు బ్రాహ్మణులు అని అర్థం.  శూద్రులలో కూడా ఆ విధంగా జ్ఞానం చెప్పినవారు ఎందరో ఉన్నారు.  మహాభారతంలో కౌశికుడు అనే బ్రాహ్మణవంశంలో పుట్టిన మునికి కసాయివృత్తివాడైన (శూద్రుడైన) ధర్మవ్యాధుడు జ్ఞానం బోధించే ఘట్టాన్ని వ్యాసుడు అద్భుతంగా వ్రాశాడు.  అదే మహాభారతంలో కౌరవపాండవులకు రాజనీతిని బోధించిన శూద్రుడైన విదురుని కథ ఉన్నది.  విదురుని మాటలను ఎంతో గౌరవంతో ఆదరించిన పాండవులు లోకప్రియులు, అంతిమవిజేతలు అయ్యారు.  విదురుని మాటలను పెడచెవిన పెట్టిన కౌరవులు లోకవిద్విష్టులు, అంతిమపరాజితులు అయ్యారు.  తమిళంలో ప్రసిద్ధమైన తిరుక్కురళ్ చెప్పిన తిరువళ్లువర్ కూడా శూద్రజాతివాడే.  కాని, సమస్తవర్ణాలకు చెందిన ప్రజలందరూ ఆ తిరువళ్లువర్ ను గొప్పగా ప్రేమిస్తారు.  ఉత్తరభారతదేశంలో సంత్ రవిదాసు, కర్ణాటకంలో కనకదాసరు, తెలుగునేలలో వేమన వీరందరూ శూద్రులే.  కాని, వారి జ్ఞానసంపదకు ముగ్ధులై గౌరవించనివారంటూ ఎవరూ ఉండరు.  ఇలా భారతదేశంలో ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. 

రామాయణంలో శ్రీరామునికి తన ఎంగిలి పండ్లను తినిపించిన శబరి శూద్రురాలే.  శ్రీరామునికి ప్రాణమిత్రుడైన గుహుడు కూడా చేపలు పట్టే జాలరి శూద్రుడే.  నువు శూద్రుడివి, నువు పాదంనుంచి పుట్టావు అంటూ శ్రీరాముడు వారితో ఎన్నడూ మాట్లాడలేదే?  పైగా గుహుని తనివితీరా ఆలింగనం చేసుకున్నాడు.  మరి ఆనాడు లేని అంటరానితనం భారతదేశంలోనికి ఎప్పుడు వచ్చింది?  ఎడారులలో పుట్టిన మతాలు మన దేశాన్ని వేయి ఏండ్లు పరిపాలించిన కాలంలో, వారు పాటించిన Divide and Rule పథకం ప్రకారం భారతీయులలో పరస్పరవిద్వేషం పెంచడానికి ఈ అంటరానితనమనే భావనను తమ అధికారబలంతో చొప్పించారు.  పదే పదే కొందరిని untouchables అంటరానివారు అంటూ బ్రెయిన్ వాష్ చేస్తే వచ్చిపడిన ఒక భయంకరమైన రోగం అది.  అంతేగాని, వర్ణాన్నిబట్టి అంటరానితనం ఏ వేదంలోనూ లేదు, ఏ పురాణంలోనూ లేదు.  ఉంటే ఎవరైనా చూపించవచ్చును.

తరువాత - ముఖము, చేతులు, తొడలు, పాదాలు అనే తేడా లేకుండా సమస్తశరీరంపైనా ప్రతిదినం  మలినాలు ఏర్పడతాయి.  ఇక్కడ శరీరం అంటే సమాజం.  మలినాలు అంటే దుర్బుద్ధులు, దుష్టశక్తులు.  ప్రతిరోజూ శరీరంపై ఏర్పడే మలినాలను అసహ్యించుకోకుండా వాటిని తొలగించి శుభ్రం చేసేది చేతులే కదా?.  ముఖంలో ఉండే చూపు, వాసన వంటి జ్ఞానేంద్రియాలతో ఆ మలినాల జాడను పసిగడతాం. ఆ దుర్బుద్ధులను దుష్టశక్తులను తొలగించే బాధ్యతను నిర్వర్తించేవారు చేతులతో సమానం. ఆ పని చేసే రాజులను అంటే క్షత్రియులను చేతులు అన్నారు.  తప్పేముంది?

శరీరాన్ని ఎక్కడినుండి ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగింది పాదాలే.  అలాగే సమాజాన్ని ఏ స్థాయికైనా తీసుకుపోగలిగేది శూద్రులే.  పాదాలతో సంచరించే శక్తి లేకుంటే అందమైన కళ్లున్నా ఏమి లాభం?  బలమైన చేతులు బలిష్ఠమైన తొడలు ఉన్నప్పటికీ ఏమి లాభం?  పాదాలు లేకుంటే ఆ వ్యక్తి వికలాంగుడు అయిట్టుగానే, శూద్రులు లేని సమాజం కకావికలం అయిపోతుంది.

పాదాలను, మిగిలిన శరీరానికి అనుసంధానం చేసేవి ఊరువులు (తొడలు).  అలాగే మన సమాజంలో వైశ్యులు.  మనం ఉండే స్థలానికి దూరంగా ఎక్కడో పొలంలో పండిన బియ్యమూ గోధుమలు చిరుధాన్యాలు కూరగాయలు మనం రోజూ ఎలా తెచ్చుకోగలం? అలాగే రైతులు కూడా తమ ఉత్పత్తులు అవసరమైన వినియోగదారులను వెతుక్కుంటూ ఎన్ని ఊర్లని, ఎన్ని వీధులని తిరుగుతారు? వారికి అలా తిరగగలిగిన ఓపిక ఉన్నప్పటికీ, వారు అలా తిరుగుతూ ఉంటే వ్యవసాయం చేసేదెవరు?  ఈ రోజున వారు పండిస్తేనే రేపటికి మన కడుపు నిండుతుంది.  వారు ఈ రోజు పని చేయకుంటే రేపటికి మనకు పస్తులే.  

కాబట్టి, రైతులకు వినియోగదారులకు అనుసంధానంగా వైశ్యులు పని చేస్తారు.  ఈ రోజున మండీలలో కూర్చుని ముఠాలుగా ఏర్పడి రైతులనుండి చాల చౌక ధరలకే వారి ఉత్పత్తులను కొని, వినియోగదారులకు చాల ఎక్కువ ధరలకు అమ్ముకునే దళారీలను వైశ్యులుగా మనం భ్రమపడరారదు.  వారి దోపిడీలను అరికట్టాలని, తమ ఉత్పత్తులకు న్యాయమైన ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని రైతులకే ఇవ్వాలని, తద్వారా అటు రైతులు, ఇటు వినియోగదారులు ఉభయులూ కూడా లాభపడాలనే సదుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం క్రొత్త వ్యవసాయచట్టాన్ని రూపొందిస్తే దానిని అమలు చేయరాదని ఢిల్లీ వీధులలో నెలల తరబడి కూర్చుని అల్లర్లు చేసినవారందరూ ఇటువంటి దళారీలే.  వీరిని వైశ్యులు అనలేం.  భారతీయత ఇటువంటివారిలో మచ్చుకైనా కనబడదు.  

కరోనా లాక్ డౌన్ రోజుల్లో మనం ఎలా బ్రతికామో గుర్తు తెచ్చుకోండి.  ఎందరో శ్రమజీవులు రైతుల దగ్గర వివిధ ఉత్పత్తులను కొని, మనముండే నగరాలకు వచ్చి, చాల చౌక ధరలకే అమ్మేవారు.  ప్రభుత్వాలు మహమ్మారి విజృంభించి ఉన్న ఆ రోజుల్లో ఇంతకంటె ఎక్కువధరకు అమ్మరాదని ప్రభుత్వం వారిపై ఆంక్షలు విధించింది.  వారు కూడా సంతోషంగా ఆ ధరలకే అమ్ముకుని సంతృప్తి పడ్డారు.  వారు వైశ్యులంటే.  వారు శూద్రులేమో కదా అని మనకు సందేహాలు అక్కరలేదు.  ఒక వ్యక్తి వర్ణం అతడి గుణాన్ని బట్టి, అతడు చేసే పనిని బట్టి నిర్ణయింపబడుతుందని భగవద్గీత పేర్కొంది.  ఏ ఇంట పుట్టినా వైద్యం చేసేవారినే డాక్టర్లు అని, చదువు చెప్పేవారినే అధ్యాపకులు అని ఈ రోజుల్లో మనం వ్యవహరించటం లేదా? వారి జాతితో సంబంధం లేకుండా వారిని మనం గౌరవించటం లేదా?  ఆలాగే ఆ రోజుల్లో కూడా వ్యవహరించారు.  

వైశ్యులంటే బానపొట్టతో, పట్టు పరుపుమీద గల్లాపెట్టె ముందు కూర్చుని, తీరికగా తాంబూలం నములుతూ, భయంకరమైన వడ్డీలకు అప్పులిచ్చి, ఆ అప్పులు సక్రమమైన కాలానికి తిరిగిరాకపోతే గూండాల ద్వారా ఇంటిలోని వస్తువులను దౌర్జన్యంగా బయటకు గిరవాటు వేయిస్తూ క్రూరాతిక్రూరంగా వసూలు చేసుకుంటూ ఉంటారన్నట్టుగా మన సంస్కృతిని ద్వేషించే డైరెక్టర్లు తమ సినిమాలలో పదే పదే చిత్రీకరించి వారంటే ఒక రకమైన ద్వేషభావాన్ని నింపేశారు.  పాఠ్యపుస్తకాలలో జాతిపితగా కీర్తించబడిన గాంధీ వైశ్యుడే.  ఆంధ్రరాష్ట్రావతరణ కోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు వైశ్యుడే. 

మన పూర్వుల కాలంలో ఈనాడు ఉన్నట్టుగా అతి వేగవంతమైన కారు, బస్సు, రైలు, విమానం వంటి వాహనాలు ఉండేవి కావు.  ఆ రోజులలో రోజుల తరబడి, నెలలతరబడి ప్రయాణం చేస్తూ ఉండిన బాటసారులకోసం, ఇంకా గ్రామస్థులకోసం మార్గాలలో ఆయా గ్రామాలు నగరాలలో అనేకమైన అన్నసత్రాలను నిర్మించింది, మంచినీటి కోనేరులను నిర్మించింది, బాటలలో ఫలవృక్షాలను, ఛాయావృక్షాలను విరివిగా నాటించింది, ఉత్సవదినాలలో ఆయా పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు అన్నదానాలు, వస్త్రదానాలు చేసింది ప్రధానంగా వైశ్యులే.  దేవాలయాలకు భూములను విరివిగా దానం చేసింది వారే.  తద్వారా శాశ్వతంగా ఆ భూములను పేద రైతులకు అతి చౌకగా కౌలుకు ఇచ్చి, అటు రైతులకు జీవనోపాధి కల్పించడం, దేవాలయాలకు శాశ్వత ఆదాయన్ని సమకూర్చడం చేసింది వైశ్యులే.  ఆ సత్రాలను, కోనేరులను కొందరు దుండగులు గుప్తనిధులకోసం పడగొట్టి త్రవ్వేసి నాశనం చేసినా రక్షించవలసిన నేటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి.  

కాబట్టి I Lie Yeah దుష్ప్రచారం చేసి కించపరుస్తున్నట్టు వైశ్యులు సామాజిక స్మగ్లర్లు కాదు, వారు సమాజసేవకులు.  తాము వృత్తిధర్మం ప్రకారం సంపాదించవలసినది ధనమే అయినప్పటికీ, మానవధర్మం ప్రకారం సంపాదించవలసినది పుణ్యం అని, చేయవలసింది ధర్మం అని త్రికరణశుద్ధిగా నమ్మి, ఎంతో సేవాభావంతో జీవితాలను ధన్యం చేసుకున్న మహానుభావులు వారు.

అందువల్ల, అటువంటి పాదాలనుండి జన్మించారు అనడం కేవలం సాంకేతికమై సూచన మాత్రమే తప్ప దాని అర్థం శూద్రుడు తక్కువ కాడు అని కాదు, ముఖమైనంత మాత్రాన బ్రాహ్మణుడు వారికంటె సర్వథా అధికుడైపోయాడు అని అర్థమూ కాదు. 

పాదాలనుండి శూద్రుడు జన్మించాడు అంటే అది వారిని అవమానించడమేనని ప్రచారం చేస్తున్నవారు పాశ్చాత్యులు అంటే పాశ్చాత్యభావజాలనికి దాసులు మాత్రమే.  మనలో inferiority/superiority complex లను పెంచేందుకు, తద్ద్వారా మన సమాజంలో చీలికలు తెచ్చి తాము బాగుపడేందుకు వారు ప్రచారం చేస్తున్న ఆ పనికిమాలిన భావాలను సమూలంగా తుడిచి పారేద్దాం.

ఆ బ్రహ్మగారు కడిగిన, ఆ శూద్రుడు జన్మించిన పాదాల గొప్పతనాన్ని ఒక బ్రాహ్మణుడైన అన్నమయ్య ఎంత తన్మయంతో కీర్తించాడో!  ఆ కీర్తన ఒక బ్రాహ్మణజాతి స్త్రీ అయిన ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మిగారి ముఖంనుండి ఎంత శ్రావ్యంగా వెలువడిందో విందాం.

 బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మము తానె నీ పాదము

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము -పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము

 

బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మము తానె నీ పాదము

 https://www.youtube.com/watch?v=IX2BuosmFHk

 

శ్రీనివాసకృష్ణ, రాష్ట్రియసంస్కృతవిశ్వవిద్యాలయం

చైత్ర-కృష్ణ-ఏకాదశీ, శోభకృత్

 

 

 

 


మహావధాని శూర్పణఖ

ముక్కుచెవులు కోశాడని అందరూ లక్ష్మణుడిని ఆడిపోసుకుంటారు గాని, శూర్పణఖలో దాగివున్న పాండిత్యప్రకర్షను తన స్పర్శతో బయటకు రప్పించిన అతడి గొప్పద...