Sunday, 25 October 2026

హంసోదకం

స్థలం - తిరుపతి, తత్పరిసరాలు. 
 ఇద్దరు మిత్రులు సంభాషించుకుంటూ ఉన్నారు. 

 ఒకడు - 
అయ్యో, దుర్దినాలు సంప్రాప్తించాయి గదరా. 

 రెండవవాడు - 
 ఏమైందిరా? 

 1)
దినాలకు దినాలు ముసురు పట్టి పగలు సూర్యదర్శనం లేదు, రాత్రి చంద్రదర్శనం లేదు. 

 2) 
అప్పుడప్పుడు ఇలా జరగడం మామూలే కదా. ఇప్పుడెందుకు బాధ పడుతున్నావు. 

1) 
ఏముందిరా, ఆశ్వయుజమాసం సగం గడచిపోయింది, మన వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా గడచిపోయాయి. అన్నీ వర్షమేఘాల క్రిందనే ముగిసిపోయాయి. 
 
2) 
స్వామివారికి అలాగే బాగుందనిపించిందేమో. 

1) 
ఆయనకేమిలేరా, ఆయన అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు. ఆయనకు ఏమైనా జరుగుతుంది. 

2) 
నీకేమి లోటు వచ్చింది ఇప్పుడు. 

1) 
 హంసోదకస్నానం హంసోదకపానం చేద్దామనుకుంటే వీలు కావడం లేదు కదా. 

 2) 
 హంసోదకమంటే ఏమిటి 

 1) 
तप्तं तप्तांशुकिरणैः शीतं शीतांशुरश्मिभिः । 
समन्तादप्यहोरात्रमगस्त्योदयनिर्विषम् ॥ 
शुचि हंसोदकं नाम । 

 2) 
 తెలుగులో చెప్పరా 

 1) 
తప్తం తప్తాంశుకిరణైః శీతం శీతాంశురశ్మిభిః । 
సమన్తాదప్యహోరాత్రమగస్త్యోదయనిర్విషమ్ ॥ 
శుచి హంసోదకం నామ 

 2) ఇప్పుడు లిపి మార్చావు. కాని, సంస్కృతమే కదా. 

 1) 
 సరే విను. ఒక సరస్సులో లేదా చెఱువులో పగలంతా సూర్యకిరణాలతో తపించి, రాత్రంతా చంద్రకిరణాలతో చల్లనై, అహోరాత్రం గడచి అగస్త్యనక్షత్రోదమయ్యే సమయానికి లబ్ధమయ్యే నీటికి హంసోదకమని పేరు. 

 2) ఏమిటి దాని విశిష్టత. 

 1)
 निर्मलं मलजिज्जलम् । 
नाभिष्यन्दि न वा रूक्षं पानादिष्वमृतोपमम् 

 2) 
మళ్లీ సంస్కృతమేనా 

 1) 
 నిర్మలం మలజిజ్జలమ్ । 
నాభిష్యన్ది న వా రూక్షం పానాదిష్వమృతోపమమ్ 

 2) 
అదిగో 

 1) 
హంసోదకం నిర్మలమైనది. విషరహితమైది. పవిత్రమైనది. కల్మషాలు లేనిది, అభిష్యంది కాదు. రూక్షం కాదు, త్రాగితే అమృతంతో సమానమైనది. 

 2) 
 అభిష్యంది అంటే 

 1) 
 మన శరీరంలో ఆహారరసము, రక్తము, ప్రాణవాయువు, మూత్రము, మలము మొదలైనవి తమ తమ మార్గాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ మార్గాలను స్రోతస్సులు అంటారు. ఆ స్రోతస్సులు సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆ స్రోతస్సులకు అడ్డం పడే ద్రవ్యాలకు అభిష్యంది అని పేరు. కాని, హంసోదకం అనభిష్యంది. అంటే అభిష్యంది కాదు. కాబట్టి త్రాగడానికి అత్యంతం శ్రేష్ఠమైన నీరు. 

 2) 
 రూక్షం అంటే 

 1) 
అంటే పొడి పొడిగా ఉండేది. రూక్షమైన ద్రవాలను త్రాగితే గొంతు పట్టేస్తుంది. దాహం పెరుగుతుంది. కాని హంసోదకం రూక్షం కాదు కాబట్టి, ఆరోగ్యానికి చాల మంచిది. 

 2) 
ఓహో, ఇలా ముసురు పట్టి ఉండటం వల్ల పగలంతా సూర్యకిరణాలు లేవు. రాత్రంతా చంద్రకిరణాలు లేవు, అందువల్ల హంసోదకం దుర్లభం అని బాధపడుతున్నావా. 

 1) 
అవును 🙁 

 2) 
 మరి ముసురు పట్టకమునుపు ఏమి చేశావు. అప్పుడు త్రాగి ఉండవచ్చు కదా. 

 1) 
 అట్లా కాదు, హంసోదకం శరత్కాలంలోనే త్రాగాలి. అది అమృతంతో సమానం. మహాలయ-అమావాస్య తరువాత రోజునుండి శరదృతువు ప్రవేశించింది. కాని అప్పటినుండి అహోరాత్రాలు మేఘాలు ముసురుకునే ఉన్నాయి. ఈరోజు చతుర్దశి. రేపు ఆశ్వయుక్-పూర్ణిమ. సగం నెల గడచిపోయింది. ఇప్పటికీ మేఘాలు ముసురుకునే ఉన్నాయి. సూర్యచంద్రదర్శనమే లేదు. ఇక హంసోదకం ఎప్పుడు దొరుకుతుంది ? అదీ నా విచారం. 

 2) 
సరేలేవోయ్. ఆశ్వయుజంలో ఇంకా కృష్ణపక్షం ఉన్నది. ఆ తరువాత ఇంకా కార్తికమాసం ఉన్నది. అందులో కూడా శుద్ధబహుళపక్షాలు రెండూ ఉంటాయి. ఆలోగా ఏదో ఒకరోజు నీకు హంసోదకం దొరక్కపోదులే. 

 1) 
అది కాదు. 

 2) 
ఇంకేమిటి 

 1) 
ఆ చెఱువులు సరస్సుల ఒడ్డున చెట్లు కూడా ఉండకూడదు. ఎందువల్లనంటే చెట్ల కొమ్మలు అడ్డం వస్తే, సూర్యచంద్రకిరణాలు నీటిమీద సరిగా పడవు కదా. అప్పుడది హంసోదకం కాదు. కనీసం ఆ చెట్లకు చెందిన ఆకులు నీటిమీద ఆవరించుకున్నా సరే, అది హంసోదకం కాలేదు. 

 2) 
అయ్యా సామీ, ఇలాగైతే నీకు ఈ జన్మకు హంసోదకం లభించే యోగం లేదు పో. 

 1) 
అదేమిటి, అలాంటి చెఱువులు సరస్సులు ఎక్కడా ఉండవా. 

 2) 
 ఎందుకు ఉండవు, మానససరోవరానికి పో. మన చెఱువులు సరస్సులు ఎట్లా ఉంటాయో నీవు ఎరుగవా. ఎక్కడ చూసినా, వాటిలోనికి చెత్తా చెదారం గుమ్మరిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా నీటిమీద ప్లాస్టిక్ డబ్బాలు తేలాడుతూ కనబడుతుంటాయి. నీవేమో నీటిమీద ఒక మామిడాకు పడినా అది హంసోదకం కాదుపో అని తిరస్కరిస్తున్నావు. ఇంకెక్కడ హంసోదకంరా పిచ్చోడా. నీవన్నీ తీరని కోరికలు. 

 1) 
అయ్యయ్యో. ఎంత మాటన్నావురా. 

 2) 
సరే. మరి ఈ బొమ్మ చూపిస్తున్నావు. కాని దీనిపై తామరాకులు పద్మాలు ఉన్నాయి కదా, అవి అడ్డు ఉండడంవల్ల కూడా సంపూర్ణంగా సూర్యచంద్రకిరణాలు ఆ నీటికి సోకవు కదా. మరి అది హంసోదకం ఎలా అవుతుంది 

 1) 
పద్మాలలో ఉండే ఔషధగుణాలు నీటిలో కరిగి హంసోదకం మరింతగా అమృతతుల్యమౌతుంది. 

 2) 
సరే. స్వచ్ఛభారత్ ఉద్యమానికి నడుం కట్టు మరి. న హి కార్యం నిష్ఫలం భవేత్ అన్నారు కదా. Every action has an equivalent opposite reaction కదా. నీ ఉద్యమానికి ఫలితంగా ఎప్పుడో ఒకప్పుడు హంసోదకం లభించకపోదులే. 

 1) 
లభిస్తే నా ఒక్కడికేనా లభించేది, అందరికీ లభిస్తుంది. అందరం నడుం కడదాం. 

 (ఇంతలో మూడోవాడు ప్రవేశించాడు) 

 3) 
 స్వచ్ఛభారత్ డౌన్ డౌన్. స్వచ్ఛభారత్ ఉద్యమం నశించాలి. 

 1) & 2) 
ఎవరయ్యా నువ్వు, స్వచ్ఛభారత్ జరిగితే అందరికీ మంచిదే కదా. 

 3) 
హిందువులు హంసోదకం గింసోదకం అంటూ మతోన్మాదులై స్వచ్ఛభారత్ కావాలని కోరుకుంటున్నారు. వారి ఆటలు మేము సాగనివ్వం. స్వచ్ఛభారత్ రాజ్యాంగంలో చెప్పబడిన సెక్యులరిజానికి వ్యతిరేకం. కాబట్టి స్వచ్ఛభారత్ డౌన్ డౌన్. 

 1) 
ఎవడ్రా వీడు 

 2) 
పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే నశించిపోయే పురుగులు కీటకాలజాతికి చెందినవాడు వీడు. సందేహం లేదు. 

 1) 
శివ శివా. సమస్తమైన అమంగళాలు ప్రతిహతాలు అగుగాక. సమస్తజనాలకు సద్బుద్ధులు కలిగి సమస్తసన్మంగళాలు సర్వులకు చెందుగాక. 

 2) 
 తథాస్తు. 

 )))(((

ఆశ్వయుజశుక్లచతుర్దశీ, భానువాసరః, శ్రీపరాభవః
సామాన్యశకం 25 అక్టోబర్, 2026
ఆశ్వయుజశుక్లచతుర్దశీ, భానువాసరః, శ్రీపరాభవః సామాన్యశకం 25 అక్టోబర్, 2026

No comments:

Post a Comment

హంసోదకం

స్థలం - తిరుపతి, తత్పరిసరాలు.   ఇద్దరు మిత్రులు సంభాషించుకుంటూ ఉన్నారు.   ఒకడు -  అయ్యో, దుర్దినాలు సంప్రాప్తించాయి గదరా.   రెండవవాడు -   ...