Saturday 27 April 2019

తిరుగుబాటు

అది విశాలమైన గంభీరమైన మహాసముద్రం. ఒకానొక చోట దానికి నిర్మానుష్యమైన అతి సుందరమైన ప్రశాంతతీరం. అక్కడ టిట్టిభజాతికి చెందిన పక్షిదంపతులు సుఖంగా నివసించేవి.
ఒకరోజు ఆడపక్షి భర్తతో సిగ్గుపడుతూ చెప్పింది - "నాథా! నేను గుడ్లు పెట్టే సమయం దగ్గరపడింది. ఈ సముద్రానికి దూరంగా ఉపద్రవాలేమీ ఉండని స్థానం చూడండి".
"భద్రే! ఈ సముద్రతీరం ఎంత రమ్యంగా ఉన్నదో చూడు! మన పిల్లలు పుట్టి పెరిగేందుకు ఇదే అనుకూలమైన స్థలం. ప్రసవం ఇక్కడే జరగనీ" అన్నాడు భర్త.
"అలా కాదు, పూర్ణిమనాడు పర్వవేలాతరంగాలు విజృంభిస్తాయి. అవి మత్తగజేంద్రాలను కూడా అవలీలగా లాక్కుని పోగలవు. మనం దూరంగా ఉంటేనే మంచిది" అన్నది భార్య.
భర్తకు కొంచెం ఈగో ఉంది. గప్పాలు కొట్టాడు. "ఈ సముద్రుడు నా సంతానాన్ని అపహరించగలడా? మత్తగజేంద్రాల కుంభస్థలాలను చీల్చి అలసి సొలసి నిద్రిస్తున్న సింహాన్ని ఎవడైనా లేపగలడా? లేపితే వాడు యమసదనానికి పోయినట్లే! నీ భర్త జోలికి వచ్చినా అంతే!" అన్నాడు.
సరేనని భార్య సముద్రతీరంలోనే గుడ్లను ప్రసవించింది.
తరువాత ఒకసారి ఆ ఇద్దరూ ఆహారసంపాదనకోసం గూడు విడిచి వెళ్లారు. ఆ సమయంలో వేలాతరంగాలు చేతులు చాచాయి. గుడ్లను గూటితో సహా లోనికి లాక్కునిపోయాయి. పక్షిదంపతులు తిరిగివచ్చి జరిగిన ఘోరాన్ని చూశాయి.
భార్యకు దుఃఖం ముంచుకొచ్చింది. "మూర్ఖుడా! మంచి చెబితే విన్నావు కావు!" అని విలపించింది.
అపుడు టిట్టిభం తోటిపక్షులతో సమావేశమై, "సముద్రుడు మా గుడ్లను అపహరించాడు. రండి, అతడికి బుద్ధి చెబుదాం. అతడిని ఎండగట్టేద్దాం" అన్నది.
"ఒరే తిక్కోడా! ఎంత బలమున్నా ఏనుగు పోయి కొండను ఢీకొడితే దాని దంతాలే విరిగిపోతాయి. మనం సంఘటితమైనప్పటికీ మహాబలవంతుడైన సముద్రుణ్ణి మనమేం చేయలేం. కాబట్టి, మన పక్షిరాజైన గరుత్మంతునికి ఈ విషయాన్ని నివేదిద్దాం. తరువాత ఆ సంగతేమిటో ఆయనే చూసుకుంటాడు." అన్నాయి మిగిలిన పక్షులు.
టిట్టిభానికి కలిగిన కష్టం తెలుసుకున్న గరుత్మంతునికి కూడా కష్టం కలిగింది. దుఃఖం కలిగింది. కోపం వచ్చింది. "పదండి! పోయి సముద్రుణ్ణి ఎండగట్టేద్దాం!" అంటూ లేచాడు.
అలా లేచాడో లేదో - విష్ణుదూత వచ్చాడు. "గరుత్మంతులవారు సత్వరం వేంచేయాలని నారాయణులవారు చెప్పమన్నారు. ఏదో దేవకార్యం ఉన్నదట. అమరావతికి పోయిరావలెనట!" అని సందేశం చెప్పాడు.
గరుత్మంతునికి అభిమానం పొడుచుకొచ్చింది. "మాలాంటి పనికిమాలినవాళ్లు నారాయణసేవకు ఎందుకు లెండి? నా బదులు మరొక సమర్థుడైన పనివాణ్ణి వాహనంగా పెట్టుకోమనండి. నారాయణునికి నా నమస్కారాలు తెలియజేయండి" అన్నాడు.
విష్ణుదూత ఆశ్చర్యపోయి "స్వామిన్! గరుత్మన్! నారాయణుని గూర్చి మీరు ఇటువంటి నిష్ఠురోక్తులాడడం నేనెన్నడూ వినలేదు. భగవంతులవారు మిమ్ములను ఎన్నడూ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని అవమానించినట్లుగా గాని బాధ పెట్టినట్లుగా గాని నేనెరుగను. అసలేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు?" అని అడిగాడు.
గరుత్మంతుడు జరిగినదంతా చెప్పాడు.
"ఇపుడు నేను సముద్రుణ్ణి దండిస్తే మా నాన్నగారిని దండించావు కదా అని అమ్మవారు నాపై అలగవచ్చు. మా మామనే దండించేంతటివాడివా అని స్వామివారే స్వయంగా అలగవచ్చు. వారు నాపై అలుగుతారనే భయంతో నేను ఈ టిట్టిభదంపతులకు న్యాయం చేయలేక ఇలా రెక్కలు ముడుచుకుని కూర్చున్నాను. మరి ఇది నా అసమర్థత కాక మరేమిటి? అందువల్ల నన్ను ఆశ్రయించినవారికి న్యాయం జరగకుంటే ఇకపై స్వామివారికి సేవకునిగా ఉండే అర్హత నాకు లేదని నా మాటగా స్వామివారికి విన్నవించు" అని చెప్పాడు.
దూత ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న స్వామివారికి గరుత్మంతుని ప్రణయకోపంలో సామంజస్యం ఉందనిపించింది. గరుత్మంతుని వంటి సేవకుని ఆయన పోగొట్టుకొనదలచుకోలేదు. భక్తుడు శక్తుడు అయిన ఆ భృత్యుని పుత్రుడిలా లాలించాలని భావించాడు. స్వయంగా గరుత్మంతుడు ఉండే రుక్మపురానికి తరలి వెళ్లాడు.
తన ఇంటికి స్వయంగా స్వామివారు విచ్చేసేసరికి గరుత్మంతుడు సంభ్రమాశ్చర్యాలకు లోనైనాడు. తన మొండితనానికి సిగ్గుపడి తలదించుకున్నాడు. స్వామివారికి తగిన అతిథిసత్కారం చేసి, ఆ మీదట జరిగిన విషయమంతా చెప్పాడు.
"స్వామిన్! మీకు ఆశ్రయాన్నిచ్చిన సముద్రుడు ఇలా మా టిట్టిభదంపతులకు అన్యాయం చేశాడు. మీరున్నారని నేను ఇంతసేపు ఆగాను గాని, లేకుంటే సముద్రుడిని ఎపుడో దండించేవాడిని. యజమాని బాగా కలిగినవాడు అయితే కరిచిన అతని కుక్కను కొట్టేందుకు కూడా అందరూ భయపడతారు కదా? स्वामिभयात् शुनोऽपि प्रहारो न दीयते। ఇదీ నా పరిస్థితి" అని వినయంగా విన్నవించుకున్నాడు.
స్వామివారు అందుకు చాల చింతించి, "సముద్రుడా సముద్రుడా! టిట్టిభదంపతుల గుడ్లను తిరిగి ఇవ్వకుంటే నిన్ను నీళ్లు లేని భూమిగా చేసేస్తాను" అని హుంకరించిన మీదట సముద్రుడు భయపడి గుడ్లను తిరిగి తెచ్చి ఇచ్చాడు.
అందరూ హర్షించారు. టిట్టిభదంపతులను అభినందించారు. గరుత్మంతునికి ధన్యవాదాలు తెలిపారు. స్వామివారికి నమస్కారాలు చేసుకున్నారు.
గరుత్మంతుడు ఎంతో సంతోషపడుతూ "పదండి స్వామిన్! అమరావతికి వెళ్లేందుకు ఆలస్యమౌతుంది" అని స్వామివారిని తనపై ఎక్కించుకుని రివ్వున ఎగిరిపోయాడు.

🧒👧👦👩👨🧑👩‍⚕️🧓

వినడానికి చిన్న పిల్లల కథలా ఉంది కదా?
కాని, ఇది మహాపండితుడైన విష్ణుశర్మ రాజపుత్రులకు చెప్పిన రాజనీతికథ. 
పంచతంత్రకథ. మిత్రభేదం లోనిది.

సామాన్యప్రజలపై బలవంతుల దౌర్జన్యాలు ఎలా ఉంటాయో ఇందులో చెప్పారు.
సామాన్యప్రజలు సంఘటితశక్తిగా ఉన్నా అధికారబలం ఉన్నవారితో తలపడడం ఎంత కష్టమో వివరించారు.
తమపై నిజంగా ప్రేమ సానుభూతి ఉన్న నాయకుని అవసరం ప్రజలకు ఎంతగా ఉంటుందో చెప్పారు.
నాయకుడు తన ప్రజల సమస్యలను ఎంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలో చెప్పారు.
ఒక నాయకుడు తన అధినాయకునిపై తిరుగుబాటు చేస్తే అది తన పదవిని తన పలుకుబడిని పెంచుకొనడం కోసం కాక ప్రజల మేలుకోసం చేయాలని చెప్పారు.
తన క్రిందివారు తనపై తిరుగుబాటు చేసినా అధినాయకుడు ఆగ్రహించకుండా వారి సమస్యలను జాగ్రత్తగా తెలుసుకుని పరిష్కరించాలని చెప్పారు.
సమర్థుడైన వాడు తిరుగుబాటు చేసినంతమాత్రాన అతడిని దూరం చేసుకోరాదని, అతడి సమస్యలు తీర్చి, ఆత్మీయుడిగా చేసుకోవాలని చెప్పారు.
యజమాని ఉన్నాడనే భయంతో కరిచిన కుక్కను కూడా కొట్టరు అని గరుత్మంతుడు అన్నాడు. - అంటే అధికారంలో ఉన్నాడనే భయంతో తమను పీడించే వాళ్లను కూడా ప్రజలు కొట్టరు అనే కదా అర్థం?
యజమాని ఆ కుక్కను వదిలించుకుంటే, మరుక్షణమే ఆ కరిచే కుక్కను వెంటదరిమి వెంటదరిమి కొడతారు. అలాగే అధికారం కోల్పోయినపుడు ఆ పీడించిన వాణ్ణి జనం చావగొట్టి చెవులు మూస్తారు.
కొన్ని రోజుల క్రితమే ప్రత్యక్షంగా చూశాం కదా?

👊👊👊

ఎప్పటి విష్ణుశర్మ!
ఎప్పటి పంచతంత్రం!
ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉంది!

మనదేశంలో వెలుగు చూసి, ఈనాటికీ సమాజానికి ప్రతిబింబంలా కనిపించే గ్రంథం ఏనాటిదో ఇప్పటికీ సరైన నిర్ణయం జరగలేదు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు లిపి కలిగిన సమస్త భాషలలోనికీ అనువదింపబడి అందరిచేత ఆదరణ పొందిన జనప్రియగ్రంథం.
ఇది విష్ణుశర్మ చేసిన ప్రతిజ్ఞ -

अधीते य इदं नित्यं
नीतिशास्त्रं शृणोति च।
न पराभवमवाप्नोति
शक्रादपि कदाचन।।

"ఈ నీతిశాస్త్రాన్ని నిత్యమూ ఎవరు చదువుతారో, ఎవరు వింటారో, ఇంద్రునినుండి కూడా వారు పరాభవం పొందరు" (ఇంద్రుడు అంటే ఇక్కడ అత్యంతశక్తిమంతుడైన పాలకుడు అనుకుందాం.)

చదవడం వినడం అంటే - చదివినదాన్ని విన్నదాన్ని ఆచరణలో పెట్టడమని అర్థం సుమా.
పంచతంత్రం రాజనీతిశాస్త్రమని స్వయంగా విష్ణుశర్మే తన ప్రతిజ్ఞలో వెల్లడించాడు.
కాదు,
లోకరీతి అంటారా? అవును.
పిల్లల కథలంటారా? అవునవును. 
(అయినా, కొన్ని చోట్ల జాగ్రత్త అవసరం.)

Sunday 14 April 2019

చెప్పండయ్యా చెప్పండి - సమాజాన్ని ఉద్ధరించండి (5)

అంటరానితనం శాస్త్రవిరుద్ధమని చెప్పండి.
తాత్కాలికమైన అంటరానితనం చాలచోట్ల ఉంది. అది కేవలం ఆరోగ్యహేతువు మాత్రమే.
డాక్టర్లు చేతులకు గ్లౌజులు వేసుకొని ముఖానికి మాస్కు వేసుకుని తమ పేషంటుకు సర్జరీ చేయబోతే వారికి పేషంటు అంటరానివాడనే చిన్నతనముందని ఆరోపిస్తామా?
అసలు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సందర్భంలో అంటరానితనం ఉండనే ఉంటుంది. పిల్లలు బయట ఆడుకుని తమ కాళ్లుచేతులకు మట్టి పూసుకుని ఒంటినిండా బురద పూసుకుని వస్తే అమ్మ కోప్పడుతుంది. ఆ పిల్లల కోసమే తాను ప్రేమతో లడ్డులు చేసినప్పటికీ శుభ్రంగా స్నానం చేసుకొని వస్తే గాని చేతికి ఒక్క లడ్డు కూడా ఇవ్వదు. ఇంట్లో అంటరానితనం అంతటితో సమాప్తం.
అసలు స్వయంగా ఇంటి యజమాని అయినా సరే, ఇంట్లోనికి ప్రవేశించే ముందు ఇంటి బయటనే ముఖము, కాళ్లు, చేతులు కడుక్కొని రావాలని నియమం. స్నానం చేస్తే మరీ మంచిది. పూర్వకాలం ఇండ్లలో, ఇంటి బయటనే అందుకు తగిన ఏర్పాట్లు ఉండేవి. ఈనాటి ఇరుకిండ్ల నిర్మాణనాగరికత, నీటి కొఱత ఆ రకమైన అంటరానితనాన్ని రూపుమాపాయి.
కాని మన సమాజంలో మరొకవిధమైన అంటరానితనం వచ్చి చేరింది. అది నేరం అంటూ ప్రభుత్వం ఎన్ని శాసనాలు చేసినా ఈనాటికీ కొన్ని ప్రాంతాలలో ఆ దురాచారం ఉందని వినడం చాల బాధాకరంగా ఉంది.
<><><><><><>
శౌచం (పరిశుభ్రత) అనేది గొప్ప సుగుణమని భారతీయ వైద్యశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, యోగశాస్త్రాలు కూడా శ్లాఘించాయి. రకరకాల అశౌచాలను పేర్కొని అవి దుర్భరమన్నాయి. ఆ అశౌచాలను తొలగించేందుకు వివిధమైన ఉపాయాలను చెప్పాయి. ( అమ్మో అవేమిటో అని భయపడవలసిన పని లేదు. శారీరక అశౌచానికి తలంటు స్నానం ప్రధానమైన ఉపాయం) అలా అశౌచాన్ని దూరం చేసుకుంటే పవిత్రతకు లోటేమీ లేదని ఢంకా బజాయించి చెప్పాయి.
అయినా, ఏ కాలంలో జరిగిందో కాని, కొందరు వ్యక్తులు ఎక్కడా ఏ శాస్త్రంలోనూ పేర్కొనబడని భయంకరమైన శాశ్వత అంటరానితనాన్ని కొన్ని కులాలకు అంటగట్టేశారు. ఎంత చక్కగా స్నానం చేసి వచ్చినా దేవాలయాలలో దర్శనానికి కూడా రానివ్వమన్నారు. గుళ్లలో పూజాదులు చేయడానికి మరింత ప్రత్యేక అర్హతలు కావాలంటే సరే. కాని దర్శనానికి కొందరి పుట్టుక అనేది ఒక అనర్హత అంటే అది కొందరి ఆభిజాత్య అహంకారానికి, కొందరి విద్యాగర్వానికి, కొందరి ధనమదాంధత్వానికి పరాకాష్ఠ! ఎవరైనా ఇక్కడ మానసికపవిత్రతను ప్రశ్నిస్తే ఆ గురివిందగింజల మానసికపవిత్రతకు ఛీఛీ!
అసలు ఈ అంటరానితనానికి కారణం కేవలం అశౌచమేనా? అశౌచం అనేది నిత్యమని ఏ శాస్త్రంలో ఉంది? అశౌచం నిత్యం కానపుడు అంటరానితనం శాశ్వతంగా ఎలా ఉంటుంది?
ఇన్నేసి సందేహాలు వచ్చినపుడు మనకు పెద్దలు అందించిన అనేకానేక case studies లలో ఒకదాన్ని చూద్దాం.
<><><><><><>
శ్రీశ్రీశ్రీ108 విద్యారణ్యస్వాములవారు శంకరవిజయమనే మహాగ్రంథరాజాన్ని వెలయించారు. అందులో ఒకానొక సన్నివేశం ఇది...
शड़्करो दिवसमध्यमभागे

पड़्कजोत्पलपरागकषायाम्।

जाह्नवीमभिययौ सह शिष्यै
राह्निकं वधिवदेष विधित्सुः।।
सोऽन्त्यजं पथि निरीक्ष्य
चतुर्भिर्भीषणैश्श्वभिरनुद्रुतमारात्।
(6.24,25)

విధిప్రోక్తంగా త్రిషవణస్నానమాచరించే శంకరాచార్యులవారు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం గంగలో స్నానం చేసేందుకు శిష్యసహితంగా వెళుతుండగా దారిలో అతి దగ్గరగా భయంకరమైన నాలుగు కుక్కలను వెంటబెట్టుకుని ఒక చండాలుడు ఎదురయ్యాడుట. వెంటనే శంకరుల వారు అతనిని ఉద్దేశించి -
गच्छ दूरमिति तं निजगाद 
प्रत्युवाच स च शड़्करमेनम्।
(6.25)

దూరం పోవయ్యా అంటే పోకుండా శంకరునికి తిరిగి సమాధానం చెప్పాడుట.
गच्छ दूरमिति देहमुताहो 
देहिनं परिजिहीर्षसि विद्वन्।

भिद्यतेऽन्नमयतोऽन्नमयं किं 
साक्षिणश्च यतिपुड़्गव साक्षी।।
(6.28)

ఓ విద్వాంసుడా! ఓ యతిపుంగవా!
1 దూరం పో అని నువు దేనిని అడుగుతున్నావు?
2 దేహాన్ని పొమ్మంటున్నావా లేక దేహిని (దేహంలో ఉన్న ఆత్మపదార్థాన్ని) పొమ్మంటున్నావా?
3 అన్నమయం, పాంచభౌతికం అయిన దేహాన్ని
పొమ్మన్న పక్షంలో - నీ దేహం కూడా అన్నమయం, పాంచభౌతికమే కదా? వాటిమధ్య భేదమేముంది? (రెండూ జడపదార్థాలే. స్వతంత్రత లేనివే. ప్రాణం లేని జడపదార్థాలు పొమ్మంటే ఎలా పోతాయి?)
4 అలా కాదు, శరీరంలో సాక్షిగా ఉన్నటువంటి ఆత్మపదార్థాన్ని పొమ్మంటున్న పక్షంలో - రెండు ఆత్మలంటూ లేవు కదా? దానిని ఎలా విడగొడతావు? (ఆత్మ ఉన్నది ఒకటే, సర్వవ్యాపి అని శంకరుల అద్వైతసిద్ధాంతసారాంశం)

అని తిరుగులేని ప్రశ్నను అడిగాడు ఆ చండాలుడు. ఆ మాత్రం మాటలతో వదిలేసి తన దారిన తాను పోయాడా?
दण्डमण्डितकरा धृतकुण्डाः 
पाटलाभवसनाः पटुवाचः।

ज्ञानदग्धरहिता गृहसंस्थान् 
वञ्चयन्ति किल केचन वेषैः।।
(6.27)

"జ్ఞానశూన్యులైన కొందరు ఒకచేత దండాన్ని మరొకచేత కమండలాన్ని ఒంటిమీద పాటలవర్ణ (కషాయ) వస్త్రాన్ని ధరించి విశృంఖలోపన్యాసాలు చేస్తూ సన్న్యాసివేషాలు వేసి గృహస్థభక్తులను కొందరు మోసం చేస్తున్నారు కదయ్యా?" అని దులిపేశాడు.
विद्यामवाप्यापि विमुक्तिपद्यां 
जागर्ति तुच्छा जनसड़्ग्रहेच्छा।

अहो महान्तोऽपि महेन्द्रजाले 
मज्जन्ति मायाविवरस्य तस्य।।
(6.32)

"గొప్ప విద్యనార్జించి విముక్తిపథంలో ఉండవలసిన సన్న్యాసులకు జనాలను పోగేసుకునే కోరిక (శిష్యగణాన్ని పెంచుకొనే కోరిక లేక కీర్తికాంక్ష) ఎలా కలుగుతోందయ్యా? అయ్యో! ఎంతెంతటి గొప్పవారు కూడా మాయాచ్ఛిద్రానికి చెందిన ఆ మహేంద్రజాలంలో పడి మునిగిపోతున్నారు కదయ్యా?" అని జాలిని కూడా కురిపించేశాడు.
<><><><><><>
ఆ మాటలకు జగద్గురువైన శంకరులకు కోపం మిన్నంటిందా? ఆగ్రహం అంబరాన్నంటిందా?
లేదే?

అన్నివిధాలా తమ శంకరులవారికి సాటి అనిపించుకున్న, మహోద్దండవిద్వద్వరేణ్యులు కలిగిన ఆయన శిష్యబృందమైనా ఒరే నువ్వు మా గురువుగారిని అంత మాట అనేటోడివా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిందా?
అలాంటిదేం జరగలేదు మరి.

పైగా శంకరులవారు సంభ్రమానందమానసులు అయిపోయారట! అది ఆయన ఉదారవ్యక్తిత్వానికి గుర్తు అని విద్యారణ్యులు అన్నారు. అంటే అటువంటి ప్రవర్తనను ఆదర్శంగా గ్రహించాలని ఆదేశిస్తున్నారన్నమాట!
<><><><><><>
శంకరులవారి ఆనందానికి అంతులేకుండా పోయింది.
सत्यमेव भवता यदिदानीं 
प्रत्यवादि तनुभृत्प्रवरैतत्।

अन्त्यजोऽयमिति सम्प्रति बुद्धिं
सन्त्यजामि वचसाऽऽत्मविदस्ते।।
(6.34)

"ఓ శరీరధారులలోకెల్లా ఉత్కృష్టజన్ముడా!
తమరు ఇపుడు చెప్పిన జవాబు సత్యమే. 
ఓ ఆత్మజ్ఞానీ! 
మీ మాటలను విన్నాక మీరు అంత్యజుడు అన్న బుద్ధిని తక్షణం వదిలిపెడుతున్నాను"

అన్నారు శంకరులవారు. 
అంతే కాదు,

स द्विजोऽस्तु भवतु श्वपचो वा 
वन्दनीय इति मे दृढनिष्ठा।।

(6.36)
"ఇంతటి మహనీయమైన జ్ఞానం కలిగినవాడు బ్రాహ్మణుడైనా శ్వపచుడైనా (కుక్కమాంసాన్ని కూడా తినే చండాలుడైనా సరే) నాడు వందనీయుడే (గురువే) అన్నది నా దృఢనిశ్చయమని" వినీతుడై పలికారు.

((Note: సన్న్యాసులు తమ తల్లికి తమ గురువుకు తప్ప వేరెవరికీ నమస్కరించవలసిన అవసరం లేదు.))
అంటరానితనం అనేదాన్ని కులాలకు అంటగట్టడం ఒక దురహంకారపూరితమైన దురాచారం అని ఖరాఖండీగా ఋజువు చేసే శంకరులవారి ఈ ప్రబోధాన్ని
''చండాలోऽస్తు, స తు ద్విజోऽస్తు గురురిత్యేషా మనీషా మమ"
అని పదే పదే చాటి చెప్పే మనీషాపంచకమనే స్తుతిని మనం పదే పదే అర్థసహితంగా పారాయణ చేయాలి. చేయించాలి. అప్పుడే కొంత కాలానికి నెమ్మది నెమ్మదిగా ఈ విషయం అందరికీ తలకెక్కుతుంది.
దుర్భరమైన inferiority - ఆత్మన్యూనతతో బాధపడుతున్న కొన్ని కులాలకు చెందిన కోట్లాది ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుని ఇక మీద మాకు రిజర్వేషన్లు అవసరం లేదనే స్థాయికి ఎదగగలరు.
ఇవేమీ అతిశయోక్తులు కావబ్బా.
((Note: చండాలుని వేషంలో వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడే అని, అందువల్ల చండాలుని గొప్ప ఏముందని ఎవరైనా భావించి వాదనకు దిగాలనుకుంటే - ముందుగా - ఆ పరమేశ్వరుడే స్వయంగా, "జన్మను బట్టి అంటరానితనం అంటగట్టడం తప్పు" అనే విషయాన్ని చెప్పడానికి స్వయంగా ఆ చండాలుని ఆకారం ధరించివచ్చాడని అర్థం చేసుకోండి!))
<><><><><><>
శంకరవిజయమనే గ్రంథంలో పైన పేర్కొన్న సంఘటనను వ్రాసిన శ్రీవిద్యారణ్యమహాస్వాములవారు పద్నాల్గవ శతాబ్దానికి చెందినవారు. తుంగభద్రానదీతీరాన ఆనెగొందిలో జన్మించారు.
ఏదో సాధారణ పండితులు కారాయన. షడంగసహితచతుర్వేదపారంగతులు. మహద్ధర్మశాస్త్రాధ్యేత. మహామహోపాధ్యాయదుర్విజ్ఞేయములు మహావాచస్పతిప్రవరదురవగాహ్యములూ అయిన చతుర్వేదాలకు ఆయన భాష్యం వ్రాశారు. ఉపనిషద్భాష్యాలు, బ్రహ్మసూత్రభాష్యము కూడా వెలయించారు.
ఆ భాష్యాలే ఈనాటికి కూడా మహాపండితప్రకాండులని పేరుగాంచినవారికి కూడా పాఠ్యపుస్తకాలై వారికి సర్వసంశయకంటకతరువిచ్ఛేదకపటునిశితకుఠారాలై విరాజిల్లుతున్నాయి.
మహమ్మదీయమతంలోనికి బలవంతంగా లాగివేయబడ్డ హరిహరరాయ బుక్కరాయలకు మరలా హిందూధర్మదీక్షను ప్రసాదించి, వారిచేత 1336 సం" ప్రాంతాలలో విజయనగరమహాసామ్రాజ్యస్థాపన చేయించింది ఈ మహానుభావులే.
అంతటి శ్రీవిద్యారణ్యస్వాములవారే ఒక కులానికి లేదా ఒక జాతికి బలవంతంగా అంటరానితనాన్ని అంటగట్టే విధానాన్ని నిరసించారు. అప్పటికీ ఇప్పటికీ ఆ మహానుభావులను మించిన శాస్త్రపండితులున్నారా ఎక్కడైనా?
వినయానికి విషయానికి మారుపేరుగా నిలిచిన జగద్గురువులైన శ్రీశంకరభగవత్పాదుల నిర్ణయాన్ని ఆక్షేపించగలిగిన వేదవేత్తలెవరూ లేరు.
నేడు దళితులు అని పిలువబడుతున్న/పిలిపించుకుంటున్న వారి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికెత్తే ఇటువంటి విషయాలను చెప్పండయ్యా చెప్పండి.
సమాజాన్ని ఉద్ధరించండి.

<><><><><><>

Friday 12 April 2019

ప్రజలు కోరుకున్న రాజలక్షణాలు


దశరథుడు ఒక సుప్రసిద్ధుడైన ఇక్ష్వాకువంశపు మహారాజు.  అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని, కోసలరాజ్యాన్ని ఆయన చాల కాలం పరిపాలించాడు.  ఆయన గొప్ప విద్యావంతుడు.  దేవదానవయుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధం చేసి, వారికి ప్రీతిపాత్రుడైన మహావీరుడు.  వందలాది యజ్ఞాలను చేసినవాడు.  గొప్ప దానాలు చేసి అందరినీ సంతృప్తిపరచినవాడు.  దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం, విప్ర ఋణం, ఆత్మ ఋణం మొదలైన పంచఋణాల నుండి విముక్తుడైనవాడు.  తన పూర్వుల వలెనే ప్రజల శ్రేయస్సు కోరి, యథాశక్తి, ఎంతో జాగ్రత్తగా పరిపాలించినవాడు.  అరవైవేల సంవత్సరాలు అలా పరిపాలించిన తరువాత, ఆయన అలసిపోయాడు.  తన వారసుడైన రామునికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకొనదలిచాడు.  
ఒకనాడు ఆయన కొలువుదీర్చి, తన అభిమతాన్ని ప్రజలందరి సమక్షంలో వెల్లడించాడు.  ఆ మాటలను విని, ప్రజలందరూ హర్షించారు.  ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలియజేశారు.
రాముని పట్ల ప్రజలకున్న ఇష్టాన్ని తెలుసుకుని దశరథుడు  సంతోషపడినప్పటికీ, “ఎందువల్ల మీరు రాముని కోరుకుంటున్నారు?  నేను ధర్మానుగుణంగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాను కదా?  నా పరిపాలన మీకు నచ్చలేదా?  రాముడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పవలసింది” అని ప్రజలనే అడిగాడు.
అపుడు ప్రజలు తాము రాముని ఎందుకు ఇష్టపడ్డారో స్పష్టంగా చెప్పారు.  
“మహారాజా!  రాముడు గొప్ప విద్యావంతుడు.  గురువుల మెప్పుకు పాత్రుడైనవాడు. 
(సమ్యక్ విద్యావ్రతస్నాతః)  

అతడు పరిపాలనకు తగిన శిక్షణను చక్కగా పొందినవాడు.  (ద్విజైరభివినీతశ్చ)  

ధర్మం తెలిసినవాడు. (ధర్మజ్ఞః)  అందువలన ప్రజలలో ఎటువంటి వైషమ్యాలు తలెత్తకుండా, ఒకరి పనికి ఇంకొకరు అడ్డు తగలకుండా అన్ని వ్యవహారాలూ సక్రమంగా జరిగేటట్లు చూడగలడు.   ప్రజాజీవనం ప్రశాంతంగా సాగేటట్లు చేయగలడు.  

అతడు ధర్మానికి కట్టుబడినా, అర్థాన్ని (అంటే ఆర్ధికరంగాన్ని) నిర్లక్ష్యం చేసేవాడు కాదు.  అట్లని, అర్థానికి అధికప్రాధాన్యతను ఇచ్చి, ధర్మాన్ని తక్కువచేసేవాడు కాదు.  (ధర్మశ్చాపి శ్రియా సహ)
రాముడు ఎల్లపుడూ సత్యమే పలుకుతాడు.  (సత్యసంధః)  అందువల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.  అవసరం కోసం అబద్ధమాడటం, అవసరం తీరిన తరువాత ముఖం చాటువేయటం వంటి దుర్గుణాలు ఆయనలో లేవు.
 
రాముడు సహజంగానే మంచివాడు.  (సత్పురుషః)   అందువల్ల అతనికి మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు.  చెడ్డవారైనా అతడితో స్నేహం చేస్తే మంచివారౌతారు.

అతడు శీలవంతుడు (శీలవాన్).  లోకంలో మంచిపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని చేస్తాడు.  చెడ్డపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని ఎన్నడూ చేయడు.  

అతడు అసూయ లేనివాడు.  (అనసూయకః)  ఇతరులలో ఉండే సద్గుణాలను చూసి ఆనందిస్తాడు, అభినందిస్తాడే తప్ప, వారిలో తప్పులు ఎంచడు.  

అతడు చిన్న చిన్న తప్పులు చేసే వారిని క్షమించి, వారు మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు సహకరిస్తాడు.  (క్షాంతః)  

అతడు కష్టాలలో ఉన్నవారిని ఓదార్చి, యథాశక్తి సహాయం చేస్తాడు.  (సాన్త్వయితా)  

అతడు గొప్ప మనఃస్థైర్యం కలిగినవాడు.  (స్థిరచిత్తః)  ఎన్ని కష్టాలు ఎదురైనా చలించని తత్త్వం కలిగినవాడు.  తనకుండే వైభవాలకు, తనకు లభించే విజయాలకు, ఒళ్లు మరచి పొంగిపోయేవాడు కాదు.  

అతడు ఇతరులు తనకు చేసిన సహాయాలను ఎన్నడూ మరచేవాడు కాదు.  (కృతజ్ఞః)     

అతడు ప్రజలందరితోనూ మంచిగా మాట్లాడతాడు (ప్రియవాదీ)  

ఎదుటివారు తనను పలకరిస్తే అపుడు బదులు పలుకుదామని ఎదురుచూడకుండా, తానే మొదట చిరునవ్వుతో వారిని పలుకరిస్తాడు.  (స్మితపూర్వాభిభాషీ
ఎంతటి సత్పురుషులైనప్పటికీ, అధికారం లభించిన తరువాత వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.  కాని, రాముడు అటువంటి వాడు కాదు.  అతడు తన ఇంద్రియాలమీద సంపూర్ణమైన అదుపు సాధించినవాడు.  (విజితేన్ద్రియః)  అందువలన అన్ని రకాల వ్యసనాలకు, బలహీనతలకు దూరంగా ఉంటాడు.  

రాముడు అత్యంతసమర్థుడై, ఎంతటి భారాన్ని వహిస్తున్నప్పటికీ, గొప్ప సహనం కలిగినవాడు.  
(వసుధాయాః క్షమా)  

అతడు బుద్ధిలో బృహస్పతివంటివాడు.  (బుద్ధ్యా బృహస్పతేః తుల్యః)  అందువల్ల, ఇతరులు తనను తప్పు దారిలో నడిపేందుకు ప్రయత్నిస్తే, వివేకంతో అటువంటి వారిని దూరం పెట్టగలిగినవాడు.  

అతడు మహా పరాక్రమవంతుడు కూడా.  (వీర్యే సాక్షాత్ శచీపతేః)  అందువల్ల, ఎవ్వరూ అతడి మీద వత్తిడి తీసుకువచ్చి, తమకు అనుకూలమైన పనులు తప్పుదారిలో చేయించుకొనలేరు.  

తనకు వ్యతిరేకులైన వారిని విమర్శించేందుకు గాని, ఆడిపోసుకొనేందుకు అతడు ఆసక్తిని కనబరచడు, తన అమూల్యమైన సమయాన్ని ఆ విధంగా ఎన్నడూ వ్యర్థం చేసుకోడు. 
(న విగృహ్య కథారుచిః)   

తన పరిపాలనలో లోటుపాట్లను తెలుసుకొనేందుకు, వాటిని తొలగించుకునేందుకు, సరిదిద్దుకునేందుకు, తన పరిపాలన గాడి తప్పకుండా, మెరుగుగా, సక్రమంగా కొనసాగించేందుకు మేధావులు, పెద్దలు, పండితులు, అయినవారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, వారి సలహాలను ఆదరిస్తూ, పాటిస్తూ ఉంటాడు. 
(బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానామ్ ఉపాసితా।)
 
పరిపాలనాభారం అనే నెపంతో అతడు ప్రజలకు దూరంగా ఉండడు.  ప్రజలతో సమావేశమై, వారు తన కుటుంబసభ్యులే అయినట్లు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.  (పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి।)   

ప్రజలకు కష్టాలు కలిగినపుడు అతడు చాల బాధ పడతాడు.  వారు ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నపుడు ఒక ఇంటి పెద్ద పిల్లల ఆటలను చూసి ఆనందపడినట్లు సంతోషిస్తాడు.
(వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః।  
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి।।)  

పక్షపాతరహితంగా అందరికీ శ్రేయస్సును చేకూర్చేందుకు ప్రయత్నిస్తాడు.  
(సమ్యగ్ యోక్తా శ్రేయసామ్)
రామునికి అసలు కోపమే రాదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని ఎవరివల్లనైనా హాని కలిగితే అతనికి కోపం వస్తుంది.  రామునికి పక్షపాతం అనేది లేదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని విశేషమైన ఉపకారం చేసినవారి పట్ల అతడికి అనుగ్రహం కలుగుతుంది.  అటువంటి రాముని కోపం గాని, అనుగ్రహం కాని ఎన్నడూ వృథా కావు.  
(నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోऽస్తి కదాచన।)  

దండనార్హుడైనవానిని నియమం ప్రకారం, అంటే చట్టం ప్రకారం, దండించే తీరుతాడు.  నిర్దోషి పట్ల ఎన్నడూ కోపం చూపనే చూపడు.  (హన్త్యేవ నియమాద్ వధ్యాన్ అవధ్యే చ న కుప్యతి।)  అలాగే, తన అనుగ్రహానికి పాత్రుడైన వాడు మరింత మంచి పనులు చేసేందుకు ప్రేరణగా అతడికి సకల ప్రయోజనాలను చేకూరుస్తాడు. (యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి।)      
అటువంటి రాముడికి సంపూర్ణమైన బలము, ఆరోగ్యము, ఆయుష్షు చేకూరాలని, రాష్ట్రంలోనూ రాజధానిలోనూ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
(బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః।  
ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా।।)           
అందరూ ధనంతో శ్రీమంతులౌతారేమో గాని, రాముడు మాత్రం ఇటువంటి గుణాలతో కూడా శ్రీమంతుడైనవాడు.  అందువల్ల, ప్రజలు అతనిని తమ రాజుగా కోరుకుంటున్నారు.  (తమేవంగుణసంపన్నమ్ అకామయత మేదినీ।)     
ఈవిధంగా, స్వయంగా ప్రజలే, తాము రాముని ఎందుకు కోరుకుంటున్నామో తమకు ఎటువంటి పాలకుడు ఇష్టుడు అవుతాడో దశరథునికి వివరించారు.  దశరథుడు తన కుమారుని గుణగణాలను ప్రజల నోటినుండి విని “అహోऽస్మి పరమప్రీతః” అంటూ ఎంతగానో సంతోషపడ్డాడు.
ఆనాడైనా, ఈనాడైనా ఇటువంటి గుణాలు పాలకులకు ఎంతో ఆదర్శప్రాయమైనవి.  ఈ గుణాలను అలవరచుకునే పాలకులు, తప్పకుండా ప్రజల ప్రేమకు పాత్రులౌతారు అనడంలో సందేహం లేదు.

(పరాయి పాలకుల చెరనుండి విడివిడిన తరువాత. భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది అని చరిత్ర చెబుతుంది.  అంటే, ప్రజల అభిప్రాయం ప్రకారం పరిపాలన కొనసాగే దేశం అన్న మాట.  ఇది ఎంతో గొప్ప పద్ధతిగా ఈనాటి రాజకీయశాస్త్రజ్ఞులు కీర్తిస్తారు.  భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యపు పద్ధతి రామాయణకాలంలోనే ఉన్నట్లుగా వాల్మీకిమహర్షి రచన ద్వారా తెలుస్తుంది.  దశరథుడు, అతని కుమారుడైన రాముడు ప్రజల అభిప్రాయానికి ఎంతో విలువనిచ్చేవారని రామాయణం వర్ణిస్తుంది.  ముఖ్యంగా, తమకు ఎటువంటి రాజు కావాలి అనే విషయంలో ఆనాటి ప్రజలు ఒక స్పష్టమైన, అందరికీ అంగీకారయోగ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.  ఆ అభిప్రాయాలు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తాయి.  ఎందువల్లనంటే, ఆ అభిప్రాయాలు రాజును నియంత కాకుండా ఆపుతాయి.  అవి సమాజంలో ధర్మాచరణకు, ధర్మరక్షణకు అనుకూలమైనవిగా కూడా ఉన్నాయి.  అవే ఈ వ్యాసంలో చెప్పబడ్డాయి.)

{ఈ వ్యాసం 2019 ఏప్రిల్ నెల, ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ప్రచురించే యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.}

Friday 5 April 2019

వికారి ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు.
వికారి-నామ-సంవత్సర-శుభాకాంక్షలు.
వికారి అనే పేరు విని
ఏమిటిది అని ఎవరూ ముఖం చిట్లించుకొనవలసిన పని లేదు.
అదేమీ చెడ్డ పేరు కానే కాదు.
ధనము కలిగినవాడు ధని.
బలము కలిగినవాడు బలి. (బలిచక్రవర్తి తెలుసుగా)
చక్రము కలిగినవాడు చక్రి (విష్ణువు)
శూలము కలిగిన వాడు శూలి (శివుడు)
హస్తము అంటే తొండము కలిగినది హస్తి. (అంటే ఏనుగు)
అదే పరంపరలో వికారము కలిగినది/కలిగినవాడు వికారి అన్న మాట.
మరి వికారము అనేది చెడ్డపేరు కాదా?
కాదు.
ఆకారము అనే పదాన్ని ఆకృతి అని కూడా అంటాము.
అలాగే, వికారము అనే పదాన్ని వికృతి అని కూడా అంటాము.
వికృతి అనగానే తెలుగు వ్యాకరణంలో ప్రకృతి – వికృతులు గుర్తుకు వచ్చాయా? రథము అనే ప్రకృతి పదానికి అరదము అనే పదం వికృతి. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి బొమ్మ అనే పదం వికృతి. విష్ణువు అనే ప్రకృతిపదానికి వెన్నుడు అనే పదం వికృతి. ఇలా చాలానే చదువుకున్నాం కదా? ఈ విధంగా వికృతిపదాలు ప్రకృతి నుండి వచ్చినవే తప్ప, వేరే కావు. కాని, ఇది భాషకు సంబంధించిన ప్రకృతి-వికృతి సంబంధం.
దర్శనశాస్త్రాన్ని అనుసరించి ఈ కనిపిస్తున్న, మన తర్కానికి గాని, మన ఊహకు గాని అందుతున్న ఈ సమస్తవిశ్వము కూడా వికృతే! దీనికి మూలమైన ప్రకృతి మన కంటికి కూడా కనబడదు. “మూలప్రకృతిరవికృతిః. మహదాద్యాః ప్రకృతివికృతయః సప్త. షోడశకస్తు వికారః.” అని సాంఖ్యకారికలలో (3) ఈశ్వరకృష్ణుడు చెబుతాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే వేరొకదాని పుట్టుకకు ఆధారభూమిగా ఉండేది. వికృతి అంటే, వేరొకదానినుండి ఉద్భవించేది. ప్రకృతివికృతులు అంటే, తాము స్వయంగా వేరొకదానినుండి పుడుతూ మరొకదాని పుట్టుకకు కారణమయ్యేవి అన్నమాట.
అటువంటి మూలప్రకృతి (కేవల ప్రకృతి) ఒక్కటే ఉందట.
ప్రకృతివికృతులు ఏడు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు అన్నారు కదా?
ఆ వికృతులు ఏమిటో తెలుసా?
అందులో మొట్టమొదటిది మనస్సు.
తరువాత, కన్ను ముక్కు చెవి వంటి జ్ఞానేంద్రియాలు ఐదు,
కాళ్లు చేతులు వంటి కర్మేంద్రియాలు ఐదు,
భూమి, గాలి, నీరు వంటి పంచభూతాలు ఐదు.
(1+5+5+5=16)
అర్థమైందా?
ఈ మనస్సు, ఈ పంచభూతాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచకర్మేంద్రియాలు – ఇవన్నీ వికృతులు. అంటే వికారాలు. ఈ వికారాలతో తయారైనదే శరీరం. ఈ వికారాలు కలిగినది వికారి. అంటే ఎవరు? మనమే. కాబట్టి, వికారి నామ సంవత్సరం అంటే మన సంవత్సరమే.
సరే, ఇంతకీ మనం ఎవరం?
ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఆరుణి అని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. అతడికి శ్వేతకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతడు గురుకులానికి వెళ్లి విద్యాభాసం చేసి వచ్చాడు. అపుడు వారి నడుమ ఒక గొప్ప సంభాషణ జరిగింది.
"నాయనా శ్వేతకేతూ, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అవుతుందో దానిని నువు తెలుసుకున్నావా?”
శ్వేతకేతువుకు ఆశ్చర్యం కలిగింది.
“లేదు నాన్నగారూ, అదేమిటో చెప్పండి” అని అడిగాడు.
అపుడు ఆరుణి చక్కగా వివరించి చెప్పాడు –
యథా సోమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్। వాచారంభణం వికారో నామధేయో మృత్తికేత్యేవ సత్యమ్।।’ (ఛాందోగ్యం 6.1.4)
కుండ, మూకుడు, కడవ, తొట్టి వంటి వస్తువులు తయారు అవుతున్నాయి. అవన్నీ మట్టితోనే తయారు అవుతున్నాయి. అదే మట్టితో రాజు బొమ్మ, రాణి బొమ్మ, గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ, తయారు అవుతున్నాయి. వాటి ఆకారాలు వేరు, వాటి పేర్లు వేరు. వాటి ఉపయోగాలు కూడా వేరే. అయినప్పటికీ వాటి మూలపదార్థం ఒకటే. అదే మట్టి. కాబట్టి, ఆ మట్టి స్వభావాన్ని తెలుసుకుంటే, దానితో చేయబడిన, చేయబడుతున్న, చేయబడబోతున్న సమస్తవస్తువులను గూర్చి సమగ్రంగా తెలుసుకున్నట్టే” అని చెప్పాడు ఆరుణి.
ఆ వస్తువులన్నీ వికారాలు.
వాటికి ఆ మట్టి మూలపదార్థం.
ఈ వికారాలన్నీ కూడా మట్టిముద్దకంటె అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అయినప్పటికీ, ఆ వికారాల ఆయుష్కాలం తీరినతరువాత అవి నెమ్మదిగా కలసిపోయేది తమ మూలపదార్ధంలోనికే. (అయితే ఆ మట్టి కూడా, మూలప్రకృతి నుండి పుట్టుకొచ్చిన వికారమే అని మరచిపోరాదు.)
అలాగే, ఉంగరము, గొలుసు, కంకణము మొదలైన నగలన్నీవికారాలు.
వాటికి బంగారం మూలపదార్థం.
ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది. దానికి విశాలంగా విస్తరించిన బోలెడు కొమ్మలున్నాయి. బోలెడు ఊడలు ఉన్నాయి. లెక్కపెట్టడం మొదలు పెడితే మనకు ఆయాసం కలిగించేంత సంఖ్యలో ఆకులు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి. పండ్లలో విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ వికారాలు. ఆ విత్తనాలలో మళ్లీ ఇంత పెద్ద మఱ్ఱి చెట్లు అనేకం దాక్కుని ఉన్నాయి. ఆ విత్తనాలలో ఆ మఱ్ఱిచెట్లను మనం చూడలేము. ఐనప్పటికీ, అవి ఉన్నమాట సత్యం. అవి ఆ విత్తనాలలో అత్యంత సూక్ష్మపదార్థరూపంలో దాక్కుని ఉన్నాయి. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థమే మూలప్రకృతి అని చెప్పవచ్చు. అది క్రమంగా కాలానుగుణంగా విస్తరిస్తుంది. అయితే, తనంత తానుగా విస్తరించే శక్తి దానికి లేదు. చైతన్యంతో కలసినపుడే అది అలా విస్తరిస్తుంది.
అలాగే ఈ సమస్తవిశ్వం కూడా వికారం. ఇది తనంత తానుగా విస్తరించలేదు. దీనికి మూలం మూలప్రకృతి. ఆ మూలప్రకృతి కూడా చైతన్యంతో కలసినపుడు విశ్వంగా విస్తరిస్తుంది. ఆ చైతన్యపదార్థాన్ని సాంఖ్య దర్శనంలో పురుషుడు అంటారు. (ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు.)
మనం ఎవరం అని అనే ప్రశ్నకు సమాధానం అదే.
మనం పురుషులం.
చైతన్యస్వరూపులం.
(పైన చెప్పినట్లుగా ఇక్కడ ఆడ-మగ అనే తేడాలు లేవు. పురుష అనేది చైతన్యపదార్థానికి ఒక సాంకేతికనామం మాత్రమే.) మనం వికారాలు కలిగి ఉండడం చేత మాత్రమే మనం వికారి అనబడతాము.
ఆరుణి చెప్పిన కథలో వలె, మన నామరూపాలు కూడా వికారాలే.
నన్ను నేను శ్రీనివాసులు అనే పేరుతో పరిచయం చేసుకున్నాను కాబట్టి, మీరందరూ నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. మొదట్లోనే నా పేరు వేంకటేశులు అనో రామయ్య అనో చెప్పుంటే, మీరు నన్ను అదే పేరుతోనే పిలిచేవారు కదా? కాబట్టి, నామం వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికంగా అసత్యం అని తెలుస్తోంది. అవునా?
అలాగే, నా తిండిని బట్టి నా రూపం, అంటే ఒడ్డు, పొడుగు, బరువు మొదలైనవి ఉంటాయి. నేను నివసించే ప్రదేశాన్ని బట్టి నా రంగు ఉంటుంది. ఈవిధంగా, రూపం కూడా వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికసత్యం కాదు అని తెలుస్తోంది కదా?
నా మనస్సు కూడా వ్యావహారికమే. నా మనసు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, నేను ఈ ప్రదేశం గురించే ఆలోచిస్తాను. ఇక్కడ మంచి జరిగితే సంతోషిస్తాను. ఇక్కడ బాగులేదు అనుకుంటే బాధపడతాను. నా మనస్సు ఇక్కడ కాకుండా ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఒక అందమైన దీవిలో ఉందనుకోండి. అక్కడి సుఖాలను అక్కడి బాధలను మాత్రమే నా మనస్సు అనుభవిస్తుంది. కాబట్టి, మనం సుఖాలు, బాధలు అనుకుంటున్నవి అన్నీ కూడా మన మనసు పడుతున్న వికారాలే. అవి కూడా వ్యావహారికసత్యాలే కాని, పారమార్థికసత్యాలు కావు.
మనకు ఇన్ని వికారాలు ఉన్నాయి కదా, అందుకే మనం వికారి అయినాము. ఇటువంటి రకరకాల వికారాలు వదులుకోగలిగితే, మనం మనంగా, (శుద్ధచైతన్యస్వరూపంగా) ఉంటాము అనేది సాంఖ్యదర్శనశాస్త్రం చెబుతుంది. మోక్షం అంటే అదే అని వారు చెబుతారు.
అయితే, మోక్షం కావాలంటే, ముందు మనం వికారి అని తెలుసుకోవాలి. అప్పుడే, మన వికారాలు ఏమిటో మనం తెలుసుకొనగలం. అవి తెలిస్తేనే, వాటిని వదిలించుకొనేందుకు ప్రయత్నించగలం. చైతన్యస్వరూపులం కాగలం.
వికారము అనే పదాన్ని కురూపత్వము అనే అర్థంలో కూడా వాడుతారు.
వికారి అంటే కురూపి (సౌందర్యవిహీనుడు) అన్నమాట.
"ఓ పార్వతీ! శివుడు విరూపాక్షుడు కదా? కాబట్టి వికారి కదా? మరి అటువంటివాడిని ఎందుకు నువు ఇష్టపడ్డావు?" అని అడిగితే పార్వతికి కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పింది. అలా అడిగినవాడు స్వయంగా మారువేషం వేసుకొచ్చిన శివుడే అనుకోండి. ఆ ముచ్చటలు కాళిదాసుని కుమారసంభవంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఆ మాటలు ఒకసారి చూద్దాం.
మానవులు ఏమైనా తక్కువ తిన్నారా?
భౌతికంగా వికారులైనవారిని చూసి నవ్వే మానసికవికారులు కూడా ఉంటారు.
జనకమహారాజు సభలో ప్రవేశించిన అష్టావక్రమహర్షిని చూసి అక్కడ ఉన్న పండితులు నవ్వారట. అపుడు, అష్టావక్రుడు కూడా నవ్వాడట. "మేము నవ్వితే దానికి ఒక అర్థం ఉంది, మరి నువ్వెందుకయ్యా నవ్వావు?" అని వారు అడిగారట.
కండ్లు ఉండవలసిన స్థానంలో ముక్కు, ముక్కు ఉండవలసిన స్థానంలో చెవులు, - ఇలా ఉంటే అది వికారం కదా? అలాగే, ఈ సభలో ఉన్న వికారాన్ని చూసి నవ్వాను అన్నాడట అష్టావక్రుడు.
ఈ సభలో నీకేమి వికారం కనిపించింది? అని వారు అడిగారట. క్షత్రియుల దృష్టి ఆయుధాల ఉంటుంది. పండితుల దృష్టి శాస్త్రజ్ఞానం మీద ఉంటుంది. కాని, ఇక్కడున్న వారు నా శాస్త్రజ్ఞానాన్ని చూడలేకపోయారు. కేవలం నా చర్మాన్ని చూసి నవ్వారు. అందుకని వారు చర్మకారులే. పండితాసనాలలో పండితులు ఉండాలి. కాని, ఈ సభలో అక్కడ చర్మకారులు కూర్చున్నారు. అందువల్ల, ఈ సభ నాకు వికారంగా కనబడింది. అందువల్ల నవ్వాను పొమ్మన్నాడు అష్టావక్రుడు.
దాంతో అందరికీ బుద్ధి వచ్చిందట. అష్టావక్రునికి అందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. (ఇక్కడ చర్మకారుడు అనేది వెక్కిరింపు మాట కాదు. కన్ను ఉండవలసిన చోట ముక్కు ఉంది అన్నామనుకోండి. అది ముక్కును వెక్కిరించినట్టు కాదు కదా?)
ఒడిషా బెంగాలు ప్రజలు ‘వ’ అనే అక్షరాన్ని ‘బ’ అని పలుకుతారు. వంగదేశాన్ని బంగదేశం అంటారు. రవీంద్ర అనకుండా రబీంద్ర అంటారు. అలాగే వారు 'వికారి' అనే పదాన్ని 'బికారి' అని పలుకుతారేమో. అపుడు అర్థం మారిపోదా? ఆయా ప్రాంతంలో పలుకుబడి అలాగే ఉంటుంది కాబట్టి, అర్థం మారిపోదు.
సరే, ఇంతకూ మన భాషలో బికారి అంటే ఏమిటి? బికారి అంటే బిచ్చగాడు, ఇల్లూవాకిలీ లేని వాడు, అనాథ, పేదవాడు అనే నానార్థాలలో మన తెలుగువారు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు.
కాని, నిజానికి బే-కార్ అనే రెండు పదాల కలయిక అది. ‘బేషరతు’ అంటే షరతులు లేకుండా అనే అర్థం మనకు తెలుసు కదా? అలాగే, ‘బేకార్’ అంటే పనిలేనివాడు అని అర్థం. అంటే, చేయడానికి పని లేనివాడు అని అర్థం కాదు. వాడిని నిరుద్యోగి అని కాస్త మర్యాదగా పిలుస్తారు. బేకార్ అనేది ఒకరకంగా తిట్టు. చేయడానికి పని ఉన్నప్పటికీ, చేయకుండా జులాయిగా తిరిగేవాడిని అలా తిడతారు.
నిరుద్యోగులకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పే మన రాజకీయనాయకులకు ఈ తేడా తెలిస్తే బాగుంటుంది అని ఆశిద్దాం.
భౌతికమైన వికారాల కంటె, మనోవికారాలు చాల శక్తిమంతమైనవి. ప్రేమ, కరుణ, వాత్సల్యము, మొదలైనవి కూడా శాస్త్రం ప్రకారం మనోవికారాలే. అయినప్పటికీ, వ్యవహారంలో వాటిని మంచి వాటిగా పరిగణిస్తారు.
కాని, మరికొన్ని మనోవికారాలు చెడ్డవి అని వ్యవహారం. కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు మనోవికారాలే. ఇవి తగుమాత్రంలో అందరికీ ఉంటాయి. సాధువులు మాత్రం మంచివని, చెడ్డవని తేడా చూపకుండా, సమస్తమనోవికారాలను వదిలించుకోవాలని ప్రయత్నిస్తారు.
మంచివైనా చెడ్డవైనా మితిమీరితే మాత్రం చాల ప్రమాదం. రాయలసీమలో ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే, "యేమిరా ఆ మనిషి శానా యికారాలు బడతా ఉండాడే?" అని అంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా?
ప్రేమ అనే మనోవికారం మంచిదని మనం అనుకుంటాం. కాని, దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడు అతి ప్రేమ చూపినందువలన ఆ దుర్యోధనుడు ఎలా చెడిపోయాడో మహాభారతం చెప్పింది.
కామం అనే మనోవికారం చెడ్డదని మనం అనుకుంటాం. కాని, "ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ(ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే అర్జునా) అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. గంగను స్వర్గం నుండి భూమికి దించాలి అనే కామంతో (కోరికతో) భగీరథుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి, సఫలుడై, సమస్తప్రజలకు చాల మేలును చేకూర్చాడని రామాయణం వర్ణిస్తుంది.
ఈ రామాయణమహాభారతాలను మనం ఇతిహాసాలుగా పరిగణిస్తాము. అంటే చరిత్ర అన్నమాట. అయితే, పాశ్చాత్యులు వచ్చి వాటిని మైథాలజీ అనేశారు. అంటే కట్టుకథలు అని.
అస్తు. వారికైనా మనకైనా యద్భావం తద్భవతి.
అందువలన, వికారాలు స్వతః మంచివి అని చెడ్డవి అని ఉండవు. వాటితో మనం చేసే వ్యవహారాలను బట్టి అవి మంచివా చెడ్డవా అని లోకులు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అధికమాత్రంగా ఉన్నవాటిని మనం వదిలించుకోవాలి. మనం స్వయంగా అటువంటి వికారాలను వదిలించుకొనలేకుంటే రామదాసుని, హనుమంతుని త్రికరణశుద్ధిగా స్మరిద్దాం. ఆయన వదిలించగలడు. హనుమంతుడే ఎందుకు అంటే, హనుమంతుడే మరి! బురదగుంటలో పడినవాడిని పైకి లాగాలి అంటే, ఆ బురదగుంటలో లేకుండా బయట ఉన్నవారే శరణ్యం కదా, అలాగన్న మాట.
తులసీదాసమహాకవి హనుమాన్ చాలీసా మొదలుపెట్టే ముందు హనుమత్స్మరణం చేశాడు.
'బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి బిద్యా దేహు మొహి హరహు కలేశ బికార'
(దోహా 2)
(ఓ పవనకుమారుడా! హనుమన్! నన్ను నేను ఒక తెలివితక్కువవాడిగా పరిగణించుకుని, నిన్ను స్మరిస్తూ శరణు వేడుతున్నాను. నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నా కష్టాలను, నా వికారాలను హరించు)
తులసీదాసు ప్రార్థన ఫలించింది. అతడు మహాకవులలో ఒకడుగా కీర్తింపబడ్డాడు. భక్తాగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు. ఆవిధంగా వికారాలను వదిలించగల శక్తి, ఆసక్తి రెండూ మెండుగా ఉన్న స్వామి హనుమంతుడు కదా, అందుకని అతనిని ప్రార్థించాలి. పైగా మరికొన్ని రోజులలో శ్రీరామనవమి కూడా రానుంది మరి!
క్రొత్త సంవత్సరం వేళ, మన ప్రార్థన కూడా తప్పక ఫలిస్తుంది.
ఈ వికారినామ సంవత్సరంలో వారికి, వీరికి అని కాకుండా, అందరికీ సకలశుభాలు ఆనందాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
డా. శ్రీనివాసకృష్ణ పాటిల్

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...