Saturday, 27 April 2019

తిరుగుబాటు

అది విశాలమైన గంభీరమైన మహాసముద్రం. ఒకానొక చోట దానికి నిర్మానుష్యమైన అతి సుందరమైన ప్రశాంతతీరం. అక్కడ టిట్టిభజాతికి చెందిన పక్షిదంపతులు సుఖంగా నివసించేవి.
ఒకరోజు ఆడపక్షి భర్తతో సిగ్గుపడుతూ చెప్పింది - "నాథా! నేను గుడ్లు పెట్టే సమయం దగ్గరపడింది. ఈ సముద్రానికి దూరంగా ఉపద్రవాలేమీ ఉండని స్థానం చూడండి".
"భద్రే! ఈ సముద్రతీరం ఎంత రమ్యంగా ఉన్నదో చూడు! మన పిల్లలు పుట్టి పెరిగేందుకు ఇదే అనుకూలమైన స్థలం. ప్రసవం ఇక్కడే జరగనీ" అన్నాడు భర్త.
"అలా కాదు, పూర్ణిమనాడు పర్వవేలాతరంగాలు విజృంభిస్తాయి. అవి మత్తగజేంద్రాలను కూడా అవలీలగా లాక్కుని పోగలవు. మనం దూరంగా ఉంటేనే మంచిది" అన్నది భార్య.
భర్తకు కొంచెం ఈగో ఉంది. గప్పాలు కొట్టాడు. "ఈ సముద్రుడు నా సంతానాన్ని అపహరించగలడా? మత్తగజేంద్రాల కుంభస్థలాలను చీల్చి అలసి సొలసి నిద్రిస్తున్న సింహాన్ని ఎవడైనా లేపగలడా? లేపితే వాడు యమసదనానికి పోయినట్లే! నీ భర్త జోలికి వచ్చినా అంతే!" అన్నాడు.
సరేనని భార్య సముద్రతీరంలోనే గుడ్లను ప్రసవించింది.
తరువాత ఒకసారి ఆ ఇద్దరూ ఆహారసంపాదనకోసం గూడు విడిచి వెళ్లారు. ఆ సమయంలో వేలాతరంగాలు చేతులు చాచాయి. గుడ్లను గూటితో సహా లోనికి లాక్కునిపోయాయి. పక్షిదంపతులు తిరిగివచ్చి జరిగిన ఘోరాన్ని చూశాయి.
భార్యకు దుఃఖం ముంచుకొచ్చింది. "మూర్ఖుడా! మంచి చెబితే విన్నావు కావు!" అని విలపించింది.
అపుడు టిట్టిభం తోటిపక్షులతో సమావేశమై, "సముద్రుడు మా గుడ్లను అపహరించాడు. రండి, అతడికి బుద్ధి చెబుదాం. అతడిని ఎండగట్టేద్దాం" అన్నది.
"ఒరే తిక్కోడా! ఎంత బలమున్నా ఏనుగు పోయి కొండను ఢీకొడితే దాని దంతాలే విరిగిపోతాయి. మనం సంఘటితమైనప్పటికీ మహాబలవంతుడైన సముద్రుణ్ణి మనమేం చేయలేం. కాబట్టి, మన పక్షిరాజైన గరుత్మంతునికి ఈ విషయాన్ని నివేదిద్దాం. తరువాత ఆ సంగతేమిటో ఆయనే చూసుకుంటాడు." అన్నాయి మిగిలిన పక్షులు.
టిట్టిభానికి కలిగిన కష్టం తెలుసుకున్న గరుత్మంతునికి కూడా కష్టం కలిగింది. దుఃఖం కలిగింది. కోపం వచ్చింది. "పదండి! పోయి సముద్రుణ్ణి ఎండగట్టేద్దాం!" అంటూ లేచాడు.
అలా లేచాడో లేదో - విష్ణుదూత వచ్చాడు. "గరుత్మంతులవారు సత్వరం వేంచేయాలని నారాయణులవారు చెప్పమన్నారు. ఏదో దేవకార్యం ఉన్నదట. అమరావతికి పోయిరావలెనట!" అని సందేశం చెప్పాడు.
గరుత్మంతునికి అభిమానం పొడుచుకొచ్చింది. "మాలాంటి పనికిమాలినవాళ్లు నారాయణసేవకు ఎందుకు లెండి? నా బదులు మరొక సమర్థుడైన పనివాణ్ణి వాహనంగా పెట్టుకోమనండి. నారాయణునికి నా నమస్కారాలు తెలియజేయండి" అన్నాడు.
విష్ణుదూత ఆశ్చర్యపోయి "స్వామిన్! గరుత్మన్! నారాయణుని గూర్చి మీరు ఇటువంటి నిష్ఠురోక్తులాడడం నేనెన్నడూ వినలేదు. భగవంతులవారు మిమ్ములను ఎన్నడూ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని అవమానించినట్లుగా గాని బాధ పెట్టినట్లుగా గాని నేనెరుగను. అసలేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు?" అని అడిగాడు.
గరుత్మంతుడు జరిగినదంతా చెప్పాడు.
"ఇపుడు నేను సముద్రుణ్ణి దండిస్తే మా నాన్నగారిని దండించావు కదా అని అమ్మవారు నాపై అలగవచ్చు. మా మామనే దండించేంతటివాడివా అని స్వామివారే స్వయంగా అలగవచ్చు. వారు నాపై అలుగుతారనే భయంతో నేను ఈ టిట్టిభదంపతులకు న్యాయం చేయలేక ఇలా రెక్కలు ముడుచుకుని కూర్చున్నాను. మరి ఇది నా అసమర్థత కాక మరేమిటి? అందువల్ల నన్ను ఆశ్రయించినవారికి న్యాయం జరగకుంటే ఇకపై స్వామివారికి సేవకునిగా ఉండే అర్హత నాకు లేదని నా మాటగా స్వామివారికి విన్నవించు" అని చెప్పాడు.
దూత ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న స్వామివారికి గరుత్మంతుని ప్రణయకోపంలో సామంజస్యం ఉందనిపించింది. గరుత్మంతుని వంటి సేవకుని ఆయన పోగొట్టుకొనదలచుకోలేదు. భక్తుడు శక్తుడు అయిన ఆ భృత్యుని పుత్రుడిలా లాలించాలని భావించాడు. స్వయంగా గరుత్మంతుడు ఉండే రుక్మపురానికి తరలి వెళ్లాడు.
తన ఇంటికి స్వయంగా స్వామివారు విచ్చేసేసరికి గరుత్మంతుడు సంభ్రమాశ్చర్యాలకు లోనైనాడు. తన మొండితనానికి సిగ్గుపడి తలదించుకున్నాడు. స్వామివారికి తగిన అతిథిసత్కారం చేసి, ఆ మీదట జరిగిన విషయమంతా చెప్పాడు.
"స్వామిన్! మీకు ఆశ్రయాన్నిచ్చిన సముద్రుడు ఇలా మా టిట్టిభదంపతులకు అన్యాయం చేశాడు. మీరున్నారని నేను ఇంతసేపు ఆగాను గాని, లేకుంటే సముద్రుడిని ఎపుడో దండించేవాడిని. యజమాని బాగా కలిగినవాడు అయితే కరిచిన అతని కుక్కను కొట్టేందుకు కూడా అందరూ భయపడతారు కదా? स्वामिभयात् शुनोऽपि प्रहारो न दीयते। ఇదీ నా పరిస్థితి" అని వినయంగా విన్నవించుకున్నాడు.
స్వామివారు అందుకు చాల చింతించి, "సముద్రుడా సముద్రుడా! టిట్టిభదంపతుల గుడ్లను తిరిగి ఇవ్వకుంటే నిన్ను నీళ్లు లేని భూమిగా చేసేస్తాను" అని హుంకరించిన మీదట సముద్రుడు భయపడి గుడ్లను తిరిగి తెచ్చి ఇచ్చాడు.
అందరూ హర్షించారు. టిట్టిభదంపతులను అభినందించారు. గరుత్మంతునికి ధన్యవాదాలు తెలిపారు. స్వామివారికి నమస్కారాలు చేసుకున్నారు.
గరుత్మంతుడు ఎంతో సంతోషపడుతూ "పదండి స్వామిన్! అమరావతికి వెళ్లేందుకు ఆలస్యమౌతుంది" అని స్వామివారిని తనపై ఎక్కించుకుని రివ్వున ఎగిరిపోయాడు.

🧒👧👦👩👨🧑👩‍⚕️🧓

వినడానికి చిన్న పిల్లల కథలా ఉంది కదా?
కాని, ఇది మహాపండితుడైన విష్ణుశర్మ రాజపుత్రులకు చెప్పిన రాజనీతికథ. 
పంచతంత్రకథ. మిత్రభేదం లోనిది.

సామాన్యప్రజలపై బలవంతుల దౌర్జన్యాలు ఎలా ఉంటాయో ఇందులో చెప్పారు.
సామాన్యప్రజలు సంఘటితశక్తిగా ఉన్నా అధికారబలం ఉన్నవారితో తలపడడం ఎంత కష్టమో వివరించారు.
తమపై నిజంగా ప్రేమ సానుభూతి ఉన్న నాయకుని అవసరం ప్రజలకు ఎంతగా ఉంటుందో చెప్పారు.
నాయకుడు తన ప్రజల సమస్యలను ఎంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలో చెప్పారు.
ఒక నాయకుడు తన అధినాయకునిపై తిరుగుబాటు చేస్తే అది తన పదవిని తన పలుకుబడిని పెంచుకొనడం కోసం కాక ప్రజల మేలుకోసం చేయాలని చెప్పారు.
తన క్రిందివారు తనపై తిరుగుబాటు చేసినా అధినాయకుడు ఆగ్రహించకుండా వారి సమస్యలను జాగ్రత్తగా తెలుసుకుని పరిష్కరించాలని చెప్పారు.
సమర్థుడైన వాడు తిరుగుబాటు చేసినంతమాత్రాన అతడిని దూరం చేసుకోరాదని, అతడి సమస్యలు తీర్చి, ఆత్మీయుడిగా చేసుకోవాలని చెప్పారు.
యజమాని ఉన్నాడనే భయంతో కరిచిన కుక్కను కూడా కొట్టరు అని గరుత్మంతుడు అన్నాడు. - అంటే అధికారంలో ఉన్నాడనే భయంతో తమను పీడించే వాళ్లను కూడా ప్రజలు కొట్టరు అనే కదా అర్థం?
యజమాని ఆ కుక్కను వదిలించుకుంటే, మరుక్షణమే ఆ కరిచే కుక్కను వెంటదరిమి వెంటదరిమి కొడతారు. అలాగే అధికారం కోల్పోయినపుడు ఆ పీడించిన వాణ్ణి జనం చావగొట్టి చెవులు మూస్తారు.
కొన్ని రోజుల క్రితమే ప్రత్యక్షంగా చూశాం కదా?

👊👊👊

ఎప్పటి విష్ణుశర్మ!
ఎప్పటి పంచతంత్రం!
ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉంది!

మనదేశంలో వెలుగు చూసి, ఈనాటికీ సమాజానికి ప్రతిబింబంలా కనిపించే గ్రంథం ఏనాటిదో ఇప్పటికీ సరైన నిర్ణయం జరగలేదు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు లిపి కలిగిన సమస్త భాషలలోనికీ అనువదింపబడి అందరిచేత ఆదరణ పొందిన జనప్రియగ్రంథం.
ఇది విష్ణుశర్మ చేసిన ప్రతిజ్ఞ -

अधीते य इदं नित्यं
नीतिशास्त्रं शृणोति च।
न पराभवमवाप्नोति
शक्रादपि कदाचन।।

"ఈ నీతిశాస్త్రాన్ని నిత్యమూ ఎవరు చదువుతారో, ఎవరు వింటారో, ఇంద్రునినుండి కూడా వారు పరాభవం పొందరు" (ఇంద్రుడు అంటే ఇక్కడ అత్యంతశక్తిమంతుడైన పాలకుడు అనుకుందాం.)

చదవడం వినడం అంటే - చదివినదాన్ని విన్నదాన్ని ఆచరణలో పెట్టడమని అర్థం సుమా.
పంచతంత్రం రాజనీతిశాస్త్రమని స్వయంగా విష్ణుశర్మే తన ప్రతిజ్ఞలో వెల్లడించాడు.
కాదు,
లోకరీతి అంటారా? అవును.
పిల్లల కథలంటారా? అవునవును. 
(అయినా, కొన్ని చోట్ల జాగ్రత్త అవసరం.)

1 comment:

  1. అద్భుతమైన కథ అన్నా. ఇలాంటి కథలు అజారామరం. కాలాతీతమైనవి ఇవి.

    ReplyDelete

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...