అంటరానితనం శాస్త్రవిరుద్ధమని చెప్పండి.
తాత్కాలికమైన అంటరానితనం చాలచోట్ల ఉంది. అది కేవలం ఆరోగ్యహేతువు మాత్రమే.
డాక్టర్లు చేతులకు గ్లౌజులు వేసుకొని ముఖానికి మాస్కు వేసుకుని తమ పేషంటుకు సర్జరీ చేయబోతే వారికి పేషంటు అంటరానివాడనే చిన్నతనముందని ఆరోపిస్తామా?
అసలు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సందర్భంలో అంటరానితనం ఉండనే ఉంటుంది. పిల్లలు బయట ఆడుకుని తమ కాళ్లుచేతులకు మట్టి పూసుకుని ఒంటినిండా బురద పూసుకుని వస్తే అమ్మ కోప్పడుతుంది. ఆ పిల్లల కోసమే తాను ప్రేమతో లడ్డులు చేసినప్పటికీ శుభ్రంగా స్నానం చేసుకొని వస్తే గాని చేతికి ఒక్క లడ్డు కూడా ఇవ్వదు. ఇంట్లో అంటరానితనం అంతటితో సమాప్తం.
అసలు స్వయంగా ఇంటి యజమాని అయినా సరే, ఇంట్లోనికి ప్రవేశించే ముందు ఇంటి బయటనే ముఖము, కాళ్లు, చేతులు కడుక్కొని రావాలని నియమం. స్నానం చేస్తే మరీ మంచిది. పూర్వకాలం ఇండ్లలో, ఇంటి బయటనే అందుకు తగిన ఏర్పాట్లు ఉండేవి. ఈనాటి ఇరుకిండ్ల నిర్మాణనాగరికత, నీటి కొఱత ఆ రకమైన అంటరానితనాన్ని రూపుమాపాయి.
కాని మన సమాజంలో మరొకవిధమైన అంటరానితనం వచ్చి చేరింది. అది నేరం అంటూ ప్రభుత్వం ఎన్ని శాసనాలు చేసినా ఈనాటికీ కొన్ని ప్రాంతాలలో ఆ దురాచారం ఉందని వినడం చాల బాధాకరంగా ఉంది.
<><><><><><>
శౌచం (పరిశుభ్రత) అనేది గొప్ప సుగుణమని భారతీయ వైద్యశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, యోగశాస్త్రాలు కూడా శ్లాఘించాయి. రకరకాల అశౌచాలను పేర్కొని అవి దుర్భరమన్నాయి. ఆ అశౌచాలను తొలగించేందుకు వివిధమైన ఉపాయాలను చెప్పాయి. ( అమ్మో అవేమిటో అని భయపడవలసిన పని లేదు. శారీరక అశౌచానికి తలంటు స్నానం ప్రధానమైన ఉపాయం) అలా అశౌచాన్ని దూరం చేసుకుంటే పవిత్రతకు లోటేమీ లేదని ఢంకా బజాయించి చెప్పాయి.
అయినా, ఏ కాలంలో జరిగిందో కాని, కొందరు వ్యక్తులు ఎక్కడా ఏ శాస్త్రంలోనూ పేర్కొనబడని భయంకరమైన శాశ్వత అంటరానితనాన్ని కొన్ని కులాలకు అంటగట్టేశారు. ఎంత చక్కగా స్నానం చేసి వచ్చినా దేవాలయాలలో దర్శనానికి కూడా రానివ్వమన్నారు. గుళ్లలో పూజాదులు చేయడానికి మరింత ప్రత్యేక అర్హతలు కావాలంటే సరే. కాని దర్శనానికి కొందరి పుట్టుక అనేది ఒక అనర్హత అంటే అది కొందరి ఆభిజాత్య అహంకారానికి, కొందరి విద్యాగర్వానికి, కొందరి ధనమదాంధత్వానికి పరాకాష్ఠ! ఎవరైనా ఇక్కడ మానసికపవిత్రతను ప్రశ్నిస్తే ఆ గురివిందగింజల మానసికపవిత్రతకు ఛీఛీ!
అసలు ఈ అంటరానితనానికి కారణం కేవలం అశౌచమేనా? అశౌచం అనేది నిత్యమని ఏ శాస్త్రంలో ఉంది? అశౌచం నిత్యం కానపుడు అంటరానితనం శాశ్వతంగా ఎలా ఉంటుంది?
ఇన్నేసి సందేహాలు వచ్చినపుడు మనకు పెద్దలు అందించిన అనేకానేక case studies లలో ఒకదాన్ని చూద్దాం.
<><><><><><>
శ్రీశ్రీశ్రీ108 విద్యారణ్యస్వాములవారు శంకరవిజయమనే మహాగ్రంథరాజాన్ని వెలయించారు. అందులో ఒకానొక సన్నివేశం ఇది...
शड़्करो दिवसमध्यमभागे
पड़्कजोत्पलपरागकषायाम्।
जाह्नवीमभिययौ सह शिष्यै
राह्निकं वधिवदेष विधित्सुः।।
सोऽन्त्यजं पथि निरीक्ष्य
चतुर्भिर्भीषणैश्श्वभिरनुद्रुतमारात्।
(6.24,25)
విధిప్రోక్తంగా త్రిషవణస్నానమాచరించే శంకరాచార్యులవారు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం గంగలో స్నానం చేసేందుకు శిష్యసహితంగా వెళుతుండగా దారిలో అతి దగ్గరగా భయంకరమైన నాలుగు కుక్కలను వెంటబెట్టుకుని ఒక చండాలుడు ఎదురయ్యాడుట. వెంటనే శంకరుల వారు అతనిని ఉద్దేశించి -
गच्छ दूरमिति तं निजगाद
प्रत्युवाच स च शड़्करमेनम्।
(6.25)
దూరం పోవయ్యా అంటే పోకుండా శంకరునికి తిరిగి సమాధానం చెప్పాడుట.
गच्छ दूरमिति देहमुताहो
देहिनं परिजिहीर्षसि विद्वन्।
भिद्यतेऽन्नमयतोऽन्नमयं किं
साक्षिणश्च यतिपुड़्गव साक्षी।।
(6.28)
ఓ విద్వాంసుడా! ఓ యతిపుంగవా!
1 దూరం పో అని నువు దేనిని అడుగుతున్నావు?
2 దేహాన్ని పొమ్మంటున్నావా లేక దేహిని (దేహంలో ఉన్న ఆత్మపదార్థాన్ని) పొమ్మంటున్నావా?
3 అన్నమయం, పాంచభౌతికం అయిన దేహాన్ని
పొమ్మన్న పక్షంలో - నీ దేహం కూడా అన్నమయం, పాంచభౌతికమే కదా? వాటిమధ్య భేదమేముంది? (రెండూ జడపదార్థాలే. స్వతంత్రత లేనివే. ప్రాణం లేని జడపదార్థాలు పొమ్మంటే ఎలా పోతాయి?)
4 అలా కాదు, శరీరంలో సాక్షిగా ఉన్నటువంటి ఆత్మపదార్థాన్ని పొమ్మంటున్న పక్షంలో - రెండు ఆత్మలంటూ లేవు కదా? దానిని ఎలా విడగొడతావు? (ఆత్మ ఉన్నది ఒకటే, సర్వవ్యాపి అని శంకరుల అద్వైతసిద్ధాంతసారాంశం)
అని తిరుగులేని ప్రశ్నను అడిగాడు ఆ చండాలుడు. ఆ మాత్రం మాటలతో వదిలేసి తన దారిన తాను పోయాడా?
दण्डमण्डितकरा धृतकुण्डाः
पाटलाभवसनाः पटुवाचः।
ज्ञानदग्धरहिता गृहसंस्थान्
वञ्चयन्ति किल केचन वेषैः।।
(6.27)
"జ్ఞానశూన్యులైన కొందరు ఒకచేత దండాన్ని మరొకచేత కమండలాన్ని ఒంటిమీద పాటలవర్ణ (కషాయ) వస్త్రాన్ని ధరించి విశృంఖలోపన్యాసాలు చేస్తూ సన్న్యాసివేషాలు వేసి గృహస్థభక్తులను కొందరు మోసం చేస్తున్నారు కదయ్యా?" అని దులిపేశాడు.
विद्यामवाप्यापि विमुक्तिपद्यां
जागर्ति तुच्छा जनसड़्ग्रहेच्छा।
अहो महान्तोऽपि महेन्द्रजाले
मज्जन्ति मायाविवरस्य तस्य।।
(6.32)
"గొప్ప విద్యనార్జించి విముక్తిపథంలో ఉండవలసిన సన్న్యాసులకు జనాలను పోగేసుకునే కోరిక (శిష్యగణాన్ని పెంచుకొనే కోరిక లేక కీర్తికాంక్ష) ఎలా కలుగుతోందయ్యా? అయ్యో! ఎంతెంతటి గొప్పవారు కూడా మాయాచ్ఛిద్రానికి చెందిన ఆ మహేంద్రజాలంలో పడి మునిగిపోతున్నారు కదయ్యా?" అని జాలిని కూడా కురిపించేశాడు.
<><><><><><>
ఆ మాటలకు జగద్గురువైన శంకరులకు కోపం మిన్నంటిందా? ఆగ్రహం అంబరాన్నంటిందా?
లేదే?
అన్నివిధాలా తమ శంకరులవారికి సాటి అనిపించుకున్న, మహోద్దండవిద్వద్వరేణ్యులు కలిగిన ఆయన శిష్యబృందమైనా ఒరే నువ్వు మా గురువుగారిని అంత మాట అనేటోడివా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిందా?
అలాంటిదేం జరగలేదు మరి.
పైగా శంకరులవారు సంభ్రమానందమానసులు అయిపోయారట! అది ఆయన ఉదారవ్యక్తిత్వానికి గుర్తు అని విద్యారణ్యులు అన్నారు. అంటే అటువంటి ప్రవర్తనను ఆదర్శంగా గ్రహించాలని ఆదేశిస్తున్నారన్నమాట!
<><><><><><>
శంకరులవారి ఆనందానికి అంతులేకుండా పోయింది.
सत्यमेव भवता यदिदानीं
प्रत्यवादि तनुभृत्प्रवरैतत्।
अन्त्यजोऽयमिति सम्प्रति बुद्धिं
सन्त्यजामि वचसाऽऽत्मविदस्ते।।
(6.34)
"ఓ శరీరధారులలోకెల్లా ఉత్కృష్టజన్ముడా!
తమరు ఇపుడు చెప్పిన జవాబు సత్యమే.
ఓ ఆత్మజ్ఞానీ!
మీ మాటలను విన్నాక మీరు అంత్యజుడు అన్న బుద్ధిని తక్షణం వదిలిపెడుతున్నాను"
అన్నారు శంకరులవారు.
అంతే కాదు,
स द्विजोऽस्तु भवतु श्वपचो वा
वन्दनीय इति मे दृढनिष्ठा।।
(6.36)
"ఇంతటి మహనీయమైన జ్ఞానం కలిగినవాడు బ్రాహ్మణుడైనా శ్వపచుడైనా (కుక్కమాంసాన్ని కూడా తినే చండాలుడైనా సరే) నాడు వందనీయుడే (గురువే) అన్నది నా దృఢనిశ్చయమని" వినీతుడై పలికారు.
((Note: సన్న్యాసులు తమ తల్లికి తమ గురువుకు తప్ప వేరెవరికీ నమస్కరించవలసిన అవసరం లేదు.))
అంటరానితనం అనేదాన్ని కులాలకు అంటగట్టడం ఒక దురహంకారపూరితమైన దురాచారం అని ఖరాఖండీగా ఋజువు చేసే శంకరులవారి ఈ ప్రబోధాన్ని
''చండాలోऽస్తు, స తు ద్విజోऽస్తు గురురిత్యేషా మనీషా మమ"
అని పదే పదే చాటి చెప్పే మనీషాపంచకమనే స్తుతిని మనం పదే పదే అర్థసహితంగా పారాయణ చేయాలి. చేయించాలి. అప్పుడే కొంత కాలానికి నెమ్మది నెమ్మదిగా ఈ విషయం అందరికీ తలకెక్కుతుంది.
దుర్భరమైన inferiority - ఆత్మన్యూనతతో బాధపడుతున్న కొన్ని కులాలకు చెందిన కోట్లాది ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుని ఇక మీద మాకు రిజర్వేషన్లు అవసరం లేదనే స్థాయికి ఎదగగలరు.
ఇవేమీ అతిశయోక్తులు కావబ్బా.
((Note: చండాలుని వేషంలో వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడే అని, అందువల్ల చండాలుని గొప్ప ఏముందని ఎవరైనా భావించి వాదనకు దిగాలనుకుంటే - ముందుగా - ఆ పరమేశ్వరుడే స్వయంగా, "జన్మను బట్టి అంటరానితనం అంటగట్టడం తప్పు" అనే విషయాన్ని చెప్పడానికి స్వయంగా ఆ చండాలుని ఆకారం ధరించివచ్చాడని అర్థం చేసుకోండి!))
<><><><><><>
శంకరవిజయమనే గ్రంథంలో పైన పేర్కొన్న సంఘటనను వ్రాసిన శ్రీవిద్యారణ్యమహాస్వాములవారు పద్నాల్గవ శతాబ్దానికి చెందినవారు. తుంగభద్రానదీతీరాన ఆనెగొందిలో జన్మించారు.
ఏదో సాధారణ పండితులు కారాయన. షడంగసహితచతుర్వేదపారంగతులు. మహద్ధర్మశాస్త్రాధ్యేత. మహామహోపాధ్యాయదుర్విజ్ఞేయములు మహావాచస్పతిప్రవరదురవగాహ్యములూ అయిన చతుర్వేదాలకు ఆయన భాష్యం వ్రాశారు. ఉపనిషద్భాష్యాలు, బ్రహ్మసూత్రభాష్యము కూడా వెలయించారు.
ఆ భాష్యాలే ఈనాటికి కూడా మహాపండితప్రకాండులని పేరుగాంచినవారికి కూడా పాఠ్యపుస్తకాలై వారికి సర్వసంశయకంటకతరువిచ్ఛేదకపటునిశితకుఠారాలై విరాజిల్లుతున్నాయి.
మహమ్మదీయమతంలోనికి బలవంతంగా లాగివేయబడ్డ హరిహరరాయ బుక్కరాయలకు మరలా హిందూధర్మదీక్షను ప్రసాదించి, వారిచేత 1336 సం" ప్రాంతాలలో విజయనగరమహాసామ్రాజ్యస్థాపన చేయించింది ఈ మహానుభావులే.
అంతటి శ్రీవిద్యారణ్యస్వాములవారే ఒక కులానికి లేదా ఒక జాతికి బలవంతంగా అంటరానితనాన్ని అంటగట్టే విధానాన్ని నిరసించారు. అప్పటికీ ఇప్పటికీ ఆ మహానుభావులను మించిన శాస్త్రపండితులున్నారా ఎక్కడైనా?
వినయానికి విషయానికి మారుపేరుగా నిలిచిన జగద్గురువులైన శ్రీశంకరభగవత్పాదుల నిర్ణయాన్ని ఆక్షేపించగలిగిన వేదవేత్తలెవరూ లేరు.
నేడు దళితులు అని పిలువబడుతున్న/పిలిపించుకుంటున్న వారి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికెత్తే ఇటువంటి విషయాలను చెప్పండయ్యా చెప్పండి.
సమాజాన్ని ఉద్ధరించండి.
<><><><><><>
No comments:
Post a Comment