Friday 12 April 2019

ప్రజలు కోరుకున్న రాజలక్షణాలు


దశరథుడు ఒక సుప్రసిద్ధుడైన ఇక్ష్వాకువంశపు మహారాజు.  అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని, కోసలరాజ్యాన్ని ఆయన చాల కాలం పరిపాలించాడు.  ఆయన గొప్ప విద్యావంతుడు.  దేవదానవయుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధం చేసి, వారికి ప్రీతిపాత్రుడైన మహావీరుడు.  వందలాది యజ్ఞాలను చేసినవాడు.  గొప్ప దానాలు చేసి అందరినీ సంతృప్తిపరచినవాడు.  దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం, విప్ర ఋణం, ఆత్మ ఋణం మొదలైన పంచఋణాల నుండి విముక్తుడైనవాడు.  తన పూర్వుల వలెనే ప్రజల శ్రేయస్సు కోరి, యథాశక్తి, ఎంతో జాగ్రత్తగా పరిపాలించినవాడు.  అరవైవేల సంవత్సరాలు అలా పరిపాలించిన తరువాత, ఆయన అలసిపోయాడు.  తన వారసుడైన రామునికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకొనదలిచాడు.  
ఒకనాడు ఆయన కొలువుదీర్చి, తన అభిమతాన్ని ప్రజలందరి సమక్షంలో వెల్లడించాడు.  ఆ మాటలను విని, ప్రజలందరూ హర్షించారు.  ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలియజేశారు.
రాముని పట్ల ప్రజలకున్న ఇష్టాన్ని తెలుసుకుని దశరథుడు  సంతోషపడినప్పటికీ, “ఎందువల్ల మీరు రాముని కోరుకుంటున్నారు?  నేను ధర్మానుగుణంగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాను కదా?  నా పరిపాలన మీకు నచ్చలేదా?  రాముడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పవలసింది” అని ప్రజలనే అడిగాడు.
అపుడు ప్రజలు తాము రాముని ఎందుకు ఇష్టపడ్డారో స్పష్టంగా చెప్పారు.  
“మహారాజా!  రాముడు గొప్ప విద్యావంతుడు.  గురువుల మెప్పుకు పాత్రుడైనవాడు. 
(సమ్యక్ విద్యావ్రతస్నాతః)  

అతడు పరిపాలనకు తగిన శిక్షణను చక్కగా పొందినవాడు.  (ద్విజైరభివినీతశ్చ)  

ధర్మం తెలిసినవాడు. (ధర్మజ్ఞః)  అందువలన ప్రజలలో ఎటువంటి వైషమ్యాలు తలెత్తకుండా, ఒకరి పనికి ఇంకొకరు అడ్డు తగలకుండా అన్ని వ్యవహారాలూ సక్రమంగా జరిగేటట్లు చూడగలడు.   ప్రజాజీవనం ప్రశాంతంగా సాగేటట్లు చేయగలడు.  

అతడు ధర్మానికి కట్టుబడినా, అర్థాన్ని (అంటే ఆర్ధికరంగాన్ని) నిర్లక్ష్యం చేసేవాడు కాదు.  అట్లని, అర్థానికి అధికప్రాధాన్యతను ఇచ్చి, ధర్మాన్ని తక్కువచేసేవాడు కాదు.  (ధర్మశ్చాపి శ్రియా సహ)
రాముడు ఎల్లపుడూ సత్యమే పలుకుతాడు.  (సత్యసంధః)  అందువల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.  అవసరం కోసం అబద్ధమాడటం, అవసరం తీరిన తరువాత ముఖం చాటువేయటం వంటి దుర్గుణాలు ఆయనలో లేవు.
 
రాముడు సహజంగానే మంచివాడు.  (సత్పురుషః)   అందువల్ల అతనికి మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు.  చెడ్డవారైనా అతడితో స్నేహం చేస్తే మంచివారౌతారు.

అతడు శీలవంతుడు (శీలవాన్).  లోకంలో మంచిపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని చేస్తాడు.  చెడ్డపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని ఎన్నడూ చేయడు.  

అతడు అసూయ లేనివాడు.  (అనసూయకః)  ఇతరులలో ఉండే సద్గుణాలను చూసి ఆనందిస్తాడు, అభినందిస్తాడే తప్ప, వారిలో తప్పులు ఎంచడు.  

అతడు చిన్న చిన్న తప్పులు చేసే వారిని క్షమించి, వారు మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు సహకరిస్తాడు.  (క్షాంతః)  

అతడు కష్టాలలో ఉన్నవారిని ఓదార్చి, యథాశక్తి సహాయం చేస్తాడు.  (సాన్త్వయితా)  

అతడు గొప్ప మనఃస్థైర్యం కలిగినవాడు.  (స్థిరచిత్తః)  ఎన్ని కష్టాలు ఎదురైనా చలించని తత్త్వం కలిగినవాడు.  తనకుండే వైభవాలకు, తనకు లభించే విజయాలకు, ఒళ్లు మరచి పొంగిపోయేవాడు కాదు.  

అతడు ఇతరులు తనకు చేసిన సహాయాలను ఎన్నడూ మరచేవాడు కాదు.  (కృతజ్ఞః)     

అతడు ప్రజలందరితోనూ మంచిగా మాట్లాడతాడు (ప్రియవాదీ)  

ఎదుటివారు తనను పలకరిస్తే అపుడు బదులు పలుకుదామని ఎదురుచూడకుండా, తానే మొదట చిరునవ్వుతో వారిని పలుకరిస్తాడు.  (స్మితపూర్వాభిభాషీ
ఎంతటి సత్పురుషులైనప్పటికీ, అధికారం లభించిన తరువాత వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.  కాని, రాముడు అటువంటి వాడు కాదు.  అతడు తన ఇంద్రియాలమీద సంపూర్ణమైన అదుపు సాధించినవాడు.  (విజితేన్ద్రియః)  అందువలన అన్ని రకాల వ్యసనాలకు, బలహీనతలకు దూరంగా ఉంటాడు.  

రాముడు అత్యంతసమర్థుడై, ఎంతటి భారాన్ని వహిస్తున్నప్పటికీ, గొప్ప సహనం కలిగినవాడు.  
(వసుధాయాః క్షమా)  

అతడు బుద్ధిలో బృహస్పతివంటివాడు.  (బుద్ధ్యా బృహస్పతేః తుల్యః)  అందువల్ల, ఇతరులు తనను తప్పు దారిలో నడిపేందుకు ప్రయత్నిస్తే, వివేకంతో అటువంటి వారిని దూరం పెట్టగలిగినవాడు.  

అతడు మహా పరాక్రమవంతుడు కూడా.  (వీర్యే సాక్షాత్ శచీపతేః)  అందువల్ల, ఎవ్వరూ అతడి మీద వత్తిడి తీసుకువచ్చి, తమకు అనుకూలమైన పనులు తప్పుదారిలో చేయించుకొనలేరు.  

తనకు వ్యతిరేకులైన వారిని విమర్శించేందుకు గాని, ఆడిపోసుకొనేందుకు అతడు ఆసక్తిని కనబరచడు, తన అమూల్యమైన సమయాన్ని ఆ విధంగా ఎన్నడూ వ్యర్థం చేసుకోడు. 
(న విగృహ్య కథారుచిః)   

తన పరిపాలనలో లోటుపాట్లను తెలుసుకొనేందుకు, వాటిని తొలగించుకునేందుకు, సరిదిద్దుకునేందుకు, తన పరిపాలన గాడి తప్పకుండా, మెరుగుగా, సక్రమంగా కొనసాగించేందుకు మేధావులు, పెద్దలు, పండితులు, అయినవారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, వారి సలహాలను ఆదరిస్తూ, పాటిస్తూ ఉంటాడు. 
(బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానామ్ ఉపాసితా।)
 
పరిపాలనాభారం అనే నెపంతో అతడు ప్రజలకు దూరంగా ఉండడు.  ప్రజలతో సమావేశమై, వారు తన కుటుంబసభ్యులే అయినట్లు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.  (పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి।)   

ప్రజలకు కష్టాలు కలిగినపుడు అతడు చాల బాధ పడతాడు.  వారు ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నపుడు ఒక ఇంటి పెద్ద పిల్లల ఆటలను చూసి ఆనందపడినట్లు సంతోషిస్తాడు.
(వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః।  
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి।।)  

పక్షపాతరహితంగా అందరికీ శ్రేయస్సును చేకూర్చేందుకు ప్రయత్నిస్తాడు.  
(సమ్యగ్ యోక్తా శ్రేయసామ్)
రామునికి అసలు కోపమే రాదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని ఎవరివల్లనైనా హాని కలిగితే అతనికి కోపం వస్తుంది.  రామునికి పక్షపాతం అనేది లేదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని విశేషమైన ఉపకారం చేసినవారి పట్ల అతడికి అనుగ్రహం కలుగుతుంది.  అటువంటి రాముని కోపం గాని, అనుగ్రహం కాని ఎన్నడూ వృథా కావు.  
(నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోऽస్తి కదాచన।)  

దండనార్హుడైనవానిని నియమం ప్రకారం, అంటే చట్టం ప్రకారం, దండించే తీరుతాడు.  నిర్దోషి పట్ల ఎన్నడూ కోపం చూపనే చూపడు.  (హన్త్యేవ నియమాద్ వధ్యాన్ అవధ్యే చ న కుప్యతి।)  అలాగే, తన అనుగ్రహానికి పాత్రుడైన వాడు మరింత మంచి పనులు చేసేందుకు ప్రేరణగా అతడికి సకల ప్రయోజనాలను చేకూరుస్తాడు. (యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి।)      
అటువంటి రాముడికి సంపూర్ణమైన బలము, ఆరోగ్యము, ఆయుష్షు చేకూరాలని, రాష్ట్రంలోనూ రాజధానిలోనూ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
(బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః।  
ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా।।)           
అందరూ ధనంతో శ్రీమంతులౌతారేమో గాని, రాముడు మాత్రం ఇటువంటి గుణాలతో కూడా శ్రీమంతుడైనవాడు.  అందువల్ల, ప్రజలు అతనిని తమ రాజుగా కోరుకుంటున్నారు.  (తమేవంగుణసంపన్నమ్ అకామయత మేదినీ।)     
ఈవిధంగా, స్వయంగా ప్రజలే, తాము రాముని ఎందుకు కోరుకుంటున్నామో తమకు ఎటువంటి పాలకుడు ఇష్టుడు అవుతాడో దశరథునికి వివరించారు.  దశరథుడు తన కుమారుని గుణగణాలను ప్రజల నోటినుండి విని “అహోऽస్మి పరమప్రీతః” అంటూ ఎంతగానో సంతోషపడ్డాడు.
ఆనాడైనా, ఈనాడైనా ఇటువంటి గుణాలు పాలకులకు ఎంతో ఆదర్శప్రాయమైనవి.  ఈ గుణాలను అలవరచుకునే పాలకులు, తప్పకుండా ప్రజల ప్రేమకు పాత్రులౌతారు అనడంలో సందేహం లేదు.

(పరాయి పాలకుల చెరనుండి విడివిడిన తరువాత. భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది అని చరిత్ర చెబుతుంది.  అంటే, ప్రజల అభిప్రాయం ప్రకారం పరిపాలన కొనసాగే దేశం అన్న మాట.  ఇది ఎంతో గొప్ప పద్ధతిగా ఈనాటి రాజకీయశాస్త్రజ్ఞులు కీర్తిస్తారు.  భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యపు పద్ధతి రామాయణకాలంలోనే ఉన్నట్లుగా వాల్మీకిమహర్షి రచన ద్వారా తెలుస్తుంది.  దశరథుడు, అతని కుమారుడైన రాముడు ప్రజల అభిప్రాయానికి ఎంతో విలువనిచ్చేవారని రామాయణం వర్ణిస్తుంది.  ముఖ్యంగా, తమకు ఎటువంటి రాజు కావాలి అనే విషయంలో ఆనాటి ప్రజలు ఒక స్పష్టమైన, అందరికీ అంగీకారయోగ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.  ఆ అభిప్రాయాలు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తాయి.  ఎందువల్లనంటే, ఆ అభిప్రాయాలు రాజును నియంత కాకుండా ఆపుతాయి.  అవి సమాజంలో ధర్మాచరణకు, ధర్మరక్షణకు అనుకూలమైనవిగా కూడా ఉన్నాయి.  అవే ఈ వ్యాసంలో చెప్పబడ్డాయి.)

{ఈ వ్యాసం 2019 ఏప్రిల్ నెల, ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ప్రచురించే యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.}

1 comment:

  1. అద్భుతమైన వ్యాసం.. నేటి పాలకులు వీటిలో పది శాతం పాటించినా దేశం బాగుపడుతుంది. జనాలు ప్రశాంతంగా ఉంటారు..

    ReplyDelete

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...