Showing posts with label King. Show all posts
Showing posts with label King. Show all posts

Friday, 12 April 2019

ప్రజలు కోరుకున్న రాజలక్షణాలు


దశరథుడు ఒక సుప్రసిద్ధుడైన ఇక్ష్వాకువంశపు మహారాజు.  అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని, కోసలరాజ్యాన్ని ఆయన చాల కాలం పరిపాలించాడు.  ఆయన గొప్ప విద్యావంతుడు.  దేవదానవయుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధం చేసి, వారికి ప్రీతిపాత్రుడైన మహావీరుడు.  వందలాది యజ్ఞాలను చేసినవాడు.  గొప్ప దానాలు చేసి అందరినీ సంతృప్తిపరచినవాడు.  దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం, విప్ర ఋణం, ఆత్మ ఋణం మొదలైన పంచఋణాల నుండి విముక్తుడైనవాడు.  తన పూర్వుల వలెనే ప్రజల శ్రేయస్సు కోరి, యథాశక్తి, ఎంతో జాగ్రత్తగా పరిపాలించినవాడు.  అరవైవేల సంవత్సరాలు అలా పరిపాలించిన తరువాత, ఆయన అలసిపోయాడు.  తన వారసుడైన రామునికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకొనదలిచాడు.  
ఒకనాడు ఆయన కొలువుదీర్చి, తన అభిమతాన్ని ప్రజలందరి సమక్షంలో వెల్లడించాడు.  ఆ మాటలను విని, ప్రజలందరూ హర్షించారు.  ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలియజేశారు.
రాముని పట్ల ప్రజలకున్న ఇష్టాన్ని తెలుసుకుని దశరథుడు  సంతోషపడినప్పటికీ, “ఎందువల్ల మీరు రాముని కోరుకుంటున్నారు?  నేను ధర్మానుగుణంగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాను కదా?  నా పరిపాలన మీకు నచ్చలేదా?  రాముడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పవలసింది” అని ప్రజలనే అడిగాడు.
అపుడు ప్రజలు తాము రాముని ఎందుకు ఇష్టపడ్డారో స్పష్టంగా చెప్పారు.  
“మహారాజా!  రాముడు గొప్ప విద్యావంతుడు.  గురువుల మెప్పుకు పాత్రుడైనవాడు. 
(సమ్యక్ విద్యావ్రతస్నాతః)  

అతడు పరిపాలనకు తగిన శిక్షణను చక్కగా పొందినవాడు.  (ద్విజైరభివినీతశ్చ)  

ధర్మం తెలిసినవాడు. (ధర్మజ్ఞః)  అందువలన ప్రజలలో ఎటువంటి వైషమ్యాలు తలెత్తకుండా, ఒకరి పనికి ఇంకొకరు అడ్డు తగలకుండా అన్ని వ్యవహారాలూ సక్రమంగా జరిగేటట్లు చూడగలడు.   ప్రజాజీవనం ప్రశాంతంగా సాగేటట్లు చేయగలడు.  

అతడు ధర్మానికి కట్టుబడినా, అర్థాన్ని (అంటే ఆర్ధికరంగాన్ని) నిర్లక్ష్యం చేసేవాడు కాదు.  అట్లని, అర్థానికి అధికప్రాధాన్యతను ఇచ్చి, ధర్మాన్ని తక్కువచేసేవాడు కాదు.  (ధర్మశ్చాపి శ్రియా సహ)
రాముడు ఎల్లపుడూ సత్యమే పలుకుతాడు.  (సత్యసంధః)  అందువల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.  అవసరం కోసం అబద్ధమాడటం, అవసరం తీరిన తరువాత ముఖం చాటువేయటం వంటి దుర్గుణాలు ఆయనలో లేవు.
 
రాముడు సహజంగానే మంచివాడు.  (సత్పురుషః)   అందువల్ల అతనికి మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు.  చెడ్డవారైనా అతడితో స్నేహం చేస్తే మంచివారౌతారు.

అతడు శీలవంతుడు (శీలవాన్).  లోకంలో మంచిపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని చేస్తాడు.  చెడ్డపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని ఎన్నడూ చేయడు.  

అతడు అసూయ లేనివాడు.  (అనసూయకః)  ఇతరులలో ఉండే సద్గుణాలను చూసి ఆనందిస్తాడు, అభినందిస్తాడే తప్ప, వారిలో తప్పులు ఎంచడు.  

అతడు చిన్న చిన్న తప్పులు చేసే వారిని క్షమించి, వారు మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు సహకరిస్తాడు.  (క్షాంతః)  

అతడు కష్టాలలో ఉన్నవారిని ఓదార్చి, యథాశక్తి సహాయం చేస్తాడు.  (సాన్త్వయితా)  

అతడు గొప్ప మనఃస్థైర్యం కలిగినవాడు.  (స్థిరచిత్తః)  ఎన్ని కష్టాలు ఎదురైనా చలించని తత్త్వం కలిగినవాడు.  తనకుండే వైభవాలకు, తనకు లభించే విజయాలకు, ఒళ్లు మరచి పొంగిపోయేవాడు కాదు.  

అతడు ఇతరులు తనకు చేసిన సహాయాలను ఎన్నడూ మరచేవాడు కాదు.  (కృతజ్ఞః)     

అతడు ప్రజలందరితోనూ మంచిగా మాట్లాడతాడు (ప్రియవాదీ)  

ఎదుటివారు తనను పలకరిస్తే అపుడు బదులు పలుకుదామని ఎదురుచూడకుండా, తానే మొదట చిరునవ్వుతో వారిని పలుకరిస్తాడు.  (స్మితపూర్వాభిభాషీ
ఎంతటి సత్పురుషులైనప్పటికీ, అధికారం లభించిన తరువాత వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.  కాని, రాముడు అటువంటి వాడు కాదు.  అతడు తన ఇంద్రియాలమీద సంపూర్ణమైన అదుపు సాధించినవాడు.  (విజితేన్ద్రియః)  అందువలన అన్ని రకాల వ్యసనాలకు, బలహీనతలకు దూరంగా ఉంటాడు.  

రాముడు అత్యంతసమర్థుడై, ఎంతటి భారాన్ని వహిస్తున్నప్పటికీ, గొప్ప సహనం కలిగినవాడు.  
(వసుధాయాః క్షమా)  

అతడు బుద్ధిలో బృహస్పతివంటివాడు.  (బుద్ధ్యా బృహస్పతేః తుల్యః)  అందువల్ల, ఇతరులు తనను తప్పు దారిలో నడిపేందుకు ప్రయత్నిస్తే, వివేకంతో అటువంటి వారిని దూరం పెట్టగలిగినవాడు.  

అతడు మహా పరాక్రమవంతుడు కూడా.  (వీర్యే సాక్షాత్ శచీపతేః)  అందువల్ల, ఎవ్వరూ అతడి మీద వత్తిడి తీసుకువచ్చి, తమకు అనుకూలమైన పనులు తప్పుదారిలో చేయించుకొనలేరు.  

తనకు వ్యతిరేకులైన వారిని విమర్శించేందుకు గాని, ఆడిపోసుకొనేందుకు అతడు ఆసక్తిని కనబరచడు, తన అమూల్యమైన సమయాన్ని ఆ విధంగా ఎన్నడూ వ్యర్థం చేసుకోడు. 
(న విగృహ్య కథారుచిః)   

తన పరిపాలనలో లోటుపాట్లను తెలుసుకొనేందుకు, వాటిని తొలగించుకునేందుకు, సరిదిద్దుకునేందుకు, తన పరిపాలన గాడి తప్పకుండా, మెరుగుగా, సక్రమంగా కొనసాగించేందుకు మేధావులు, పెద్దలు, పండితులు, అయినవారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, వారి సలహాలను ఆదరిస్తూ, పాటిస్తూ ఉంటాడు. 
(బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానామ్ ఉపాసితా।)
 
పరిపాలనాభారం అనే నెపంతో అతడు ప్రజలకు దూరంగా ఉండడు.  ప్రజలతో సమావేశమై, వారు తన కుటుంబసభ్యులే అయినట్లు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.  (పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి।)   

ప్రజలకు కష్టాలు కలిగినపుడు అతడు చాల బాధ పడతాడు.  వారు ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నపుడు ఒక ఇంటి పెద్ద పిల్లల ఆటలను చూసి ఆనందపడినట్లు సంతోషిస్తాడు.
(వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః।  
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి।।)  

పక్షపాతరహితంగా అందరికీ శ్రేయస్సును చేకూర్చేందుకు ప్రయత్నిస్తాడు.  
(సమ్యగ్ యోక్తా శ్రేయసామ్)
రామునికి అసలు కోపమే రాదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని ఎవరివల్లనైనా హాని కలిగితే అతనికి కోపం వస్తుంది.  రామునికి పక్షపాతం అనేది లేదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని విశేషమైన ఉపకారం చేసినవారి పట్ల అతడికి అనుగ్రహం కలుగుతుంది.  అటువంటి రాముని కోపం గాని, అనుగ్రహం కాని ఎన్నడూ వృథా కావు.  
(నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోऽస్తి కదాచన।)  

దండనార్హుడైనవానిని నియమం ప్రకారం, అంటే చట్టం ప్రకారం, దండించే తీరుతాడు.  నిర్దోషి పట్ల ఎన్నడూ కోపం చూపనే చూపడు.  (హన్త్యేవ నియమాద్ వధ్యాన్ అవధ్యే చ న కుప్యతి।)  అలాగే, తన అనుగ్రహానికి పాత్రుడైన వాడు మరింత మంచి పనులు చేసేందుకు ప్రేరణగా అతడికి సకల ప్రయోజనాలను చేకూరుస్తాడు. (యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి।)      
అటువంటి రాముడికి సంపూర్ణమైన బలము, ఆరోగ్యము, ఆయుష్షు చేకూరాలని, రాష్ట్రంలోనూ రాజధానిలోనూ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
(బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః।  
ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా।।)           
అందరూ ధనంతో శ్రీమంతులౌతారేమో గాని, రాముడు మాత్రం ఇటువంటి గుణాలతో కూడా శ్రీమంతుడైనవాడు.  అందువల్ల, ప్రజలు అతనిని తమ రాజుగా కోరుకుంటున్నారు.  (తమేవంగుణసంపన్నమ్ అకామయత మేదినీ।)     
ఈవిధంగా, స్వయంగా ప్రజలే, తాము రాముని ఎందుకు కోరుకుంటున్నామో తమకు ఎటువంటి పాలకుడు ఇష్టుడు అవుతాడో దశరథునికి వివరించారు.  దశరథుడు తన కుమారుని గుణగణాలను ప్రజల నోటినుండి విని “అహోऽస్మి పరమప్రీతః” అంటూ ఎంతగానో సంతోషపడ్డాడు.
ఆనాడైనా, ఈనాడైనా ఇటువంటి గుణాలు పాలకులకు ఎంతో ఆదర్శప్రాయమైనవి.  ఈ గుణాలను అలవరచుకునే పాలకులు, తప్పకుండా ప్రజల ప్రేమకు పాత్రులౌతారు అనడంలో సందేహం లేదు.

(పరాయి పాలకుల చెరనుండి విడివిడిన తరువాత. భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది అని చరిత్ర చెబుతుంది.  అంటే, ప్రజల అభిప్రాయం ప్రకారం పరిపాలన కొనసాగే దేశం అన్న మాట.  ఇది ఎంతో గొప్ప పద్ధతిగా ఈనాటి రాజకీయశాస్త్రజ్ఞులు కీర్తిస్తారు.  భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యపు పద్ధతి రామాయణకాలంలోనే ఉన్నట్లుగా వాల్మీకిమహర్షి రచన ద్వారా తెలుస్తుంది.  దశరథుడు, అతని కుమారుడైన రాముడు ప్రజల అభిప్రాయానికి ఎంతో విలువనిచ్చేవారని రామాయణం వర్ణిస్తుంది.  ముఖ్యంగా, తమకు ఎటువంటి రాజు కావాలి అనే విషయంలో ఆనాటి ప్రజలు ఒక స్పష్టమైన, అందరికీ అంగీకారయోగ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.  ఆ అభిప్రాయాలు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తాయి.  ఎందువల్లనంటే, ఆ అభిప్రాయాలు రాజును నియంత కాకుండా ఆపుతాయి.  అవి సమాజంలో ధర్మాచరణకు, ధర్మరక్షణకు అనుకూలమైనవిగా కూడా ఉన్నాయి.  అవే ఈ వ్యాసంలో చెప్పబడ్డాయి.)

{ఈ వ్యాసం 2019 ఏప్రిల్ నెల, ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ప్రచురించే యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.}

Tuesday, 26 March 2019

సంతృప్తి లేని రాజు


డా|| పాటీలు శ్రీనివాసకృష్ణ

          పూర్వం సదయుడు అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి విమలుడు అనే కుమారుడు ఉండేవాడు.  ఒక సమయం వచ్చేసరికి, సదయుడు తనకు వార్ధక్యం వచ్చిందని అర్థం చేసుకుని, విమలుడు రాజ్యపరిపాలనకు సమర్థుడు అని భావించి, అతడికి పట్టాభిషేకం చేశాడు.  పిమ్మట రాజధానికి దూరంగా, ఒక వనంలో తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు. తన కుమారుని రాజ్యపాలనావిశేషాలను గూర్చిన సమాచారం ఎప్పటికప్పుడు అతనికి తెలుస్తూనే ఉండేది.

          తాను నేర్చిన మంచి విద్యల ప్రభావం వలన విమలుని పాలన మొదట సక్రమంగానే ఉండింది.  కాని, అతడి చుట్టూ క్రమంగా కొందరు దుష్టమంత్రులు చేరారు.  అసంతుష్టో ద్విజో నష్టః, సంతుష్టస్తు మహీపతిః” (సంతృప్తి లేని ద్విజుడు నశిస్తాడు, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు) అని పెద్దలు చెప్పిన సుభాషితాన్ని అతనికి చెప్పి, “రాజు తనకున్నదానితోనే సంతృప్తి చెందితే నశించిపోతాడు, అందువల్ల మరింత అధికంగా సంపదలను పొందేందుకు ప్రయత్నించాలిఅని ఉపదేశించారు.

          దానితో విమలుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.  అందుకు పెద్ద సైన్యం అవసరం.  ఆ సైన్యాన్ని పోషించేందుకు పెద్ద మొత్తంలో ధనం అవసరం.  అందువల్ల, ధనాన్ని సేకరించేందుకు గాను ప్రజలపై క్రొత్త క్రొత్త పన్నులు విధించి, వసూలు చేయసాగాడు.  ప్రజలలో రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

          ఇది తెలుసుకున్న సదయుడు ఆందోళన పడి, తన కుమారుని రమ్మని కబురు చేశాడు.  విమలుడు అడవికి వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు.  తన కుమారుని ఉద్దేశాన్ని కనుగొని, సదయుడు విచారం వ్యక్తం చేశాడు. 

          “నాయనా, పరాక్రమం చూపడం, యుద్ధం చేయడం క్షత్రియధర్మమే.  నేను కాదనను.  కాని, సాధారణపరిస్థితులలో స్వదేశాన్ని కాపాడుకొనేందుకు యుద్ధం చేయడం మాత్రమే ధర్మం.  అసాధారణపరిస్థితులు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి.  ఇతరరాజులు అధర్మపరులైనపుడు ధర్మరక్షణకు గాను వారిపై యుద్ధం ప్రకటించవచ్చు.  విదేశాలలో రాజు క్రూరుడై, ప్రజాసంక్షోభకారకుడు అయినపుడు, ఆ ప్రజలను సంరక్షించేందుకు దండయాత్ర చేయవచ్చు.  లేదా, సువిశాలమైన దేశంలో, ఆయా రాజ్యాల రాజులు నిష్కారణంగా కలహించుకుంటూ అలజడులు రేకెత్తిస్తున్నపుడు, వారినందరినీ అదుపులో ఉంచేందుకుగాను అశ్వమేథం వంటి యాగాలు కూడా చేయవచ్చును.  కాని, ఇటువంటి కారణాలు ఏమీ లేకుండా, స్వయంగా నువే, దురాశతో, ఇతరదేశాలమీదకు దండెత్తి ఆక్రమింపజూడటం అధర్మం.  నువు బలవంతుడవైనందువల్ల గాని, కాలం అనుకూలించినందువల్ల గాని, తాత్కాలికంగా గెలిచినప్పటికీ, చిరకాలంపాటు ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోలేవుఅని నచ్చజెప్పజూశాడు.
     
          “మరి, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడుఅని పెద్దలు చెప్పిన మాట అసత్యమా?” అని విమలుడు తండ్రిని ప్రశ్నించాడు.

          “అసత్యం కాదు, నిజమే!

          “మరి, యుద్ధానికి పోవద్దని మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు?”

          “నాయనా!  రాజు, రాజ్యసంపాదనవిషయంలో సంతృప్తిని కలిగి ఉండాలి.  దానివల్ల హాని లేదు.  అందువల్లనే, పాండవులు తమకు మొత్తం రాజ్యం అవసరం లేదని, ఐదు ఊళ్లు ఇచ్చినా చాలని దుర్యోధనునికి సందేశం పంపించారు.  అంతవరకు ధర్మం.  కాని, అసంతృప్తి కలిగిన దుర్యోధనుడు మాత్రం సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని తిరస్కరించాడు.  అది అధర్మం.  చివరకు సంతృప్తి కలిగిన పాండవులే జయించారు.  తనకున్న మహాసామ్రాజ్యంలో, కేవలం ఐదు ఊళ్లు తక్కువైనప్పటికీ తట్టుకోలేని అసంతృప్తిని కలిగిన దుర్యోధనుడు మాత్రం తన మిత్రులతో సహా నశించాడు కదా?” అని చెప్పాడు సదయుడు.

          “నిజమే నాన్నగారూ!  కాని, ఓవైపు ఆ సుభాషితం నిజమే అని మీరు చెప్పారు.  మరోవైపు, వాస్తవంగా ఆ సుభాషితంలో చెప్పబడి ఉన్నదానికి విరుద్ధంగా జరిగిందని కూడా మీరే ఉదాహరణ చూపుతున్నారు.  ఇపుడు, ఈ రెండిటిలో నేను దేనిని గ్రహించి ఆచరించాలి?” అని విమలుడు ప్రశ్నించాడు.

          “నాయనా!  సుభాషితంలో చెప్పబడినదీ నిజమే, కౌరవపాండవుల కథ కూడా నిజమే!  కాని, ఆ సుభాషితాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొనడం వల్ల, ‘ఇక్కడ వైరుద్ధ్యం ఉన్నది కదాఅని సంశయం కలుగుతుంది. 

రాజుకు సంతృప్తి ఉండరాదుఅనేది ఆ సుభాషితం యొక్క ఆశయం.  ‘ఏవిషయంలో అటువంటి సంతృప్తి ఉండరాదు?’ – అంటే – ‘నేను నా ప్రజలను ధర్మంలో నడిపిస్తున్నాను కదా, ఇక నేను చేయవలసిన పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు అని భావించాలి.  ఎందువల్లనంటే, ఆ ధర్మాన్ని దారి తప్పించే శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి.  రాజు అప్రమత్తంగా ఉంటూ వాటినుండి ప్రజలను కాపాడుతూ ఉండాలి.  ‘నా ప్రజలకు దొంగలనుండి రక్షణ కల్పించాను, అగ్నిప్రమాదాలనుండి రక్షణ కల్పించాను, ఈతిబాధలనుండి రక్షణ కల్పించాను.  కనుక, ఇంతకంటె నేను చేయవలసిన గొప్ప పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు.  

ఆ రాజు ప్రజలను కామక్రోధాది-అరిషడ్వర్గాల నుండి కూడా కాపాడుకోవాలి.  ఎందుకంటే, ఆ శత్రువుల దాడికి గురైనవారు జీవితంలో సుఖపడలేరు.  మిగిలిన శత్రువులు ఒక జన్మకు మాత్రమే పరిమితమౌతారేమో గాని, ఈ అంతర్గతశత్రువులు మాత్రం జన్మజన్మలకూ వదలకుండా వేధిస్తూనే ఉంటారు.  ఆ శత్రువులనుండి ప్రజలను కాపాడడానికి ఒకటే మార్గం.  వారందరికీ చక్కని ఆధ్యాత్మవిద్యను  అందించాలి.  ప్రజలందరూ తమ తమ శక్తిసామర్థ్యాలు, అభిరుచులమేరకు వివిధవృత్తినైపుణ్యాలను సంపాదించేందుకు, పెంపొందించుకొనేందుకు, తదనుగుణంగా జీవనోపాధిని పొందేందుకు తగిన ఏర్పాట్లను చేయడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మికప్రవృత్తిని పెంపొందించేందుకు కూడా తగిన కార్యక్రమాలను చేపట్టాలి.  అత్యంతబలవంతమైన ఈ అంతఃశత్రువులను జయించిన వ్యక్తి అరిందమనుడు అని పిలువబడతాడు.   

నాయనా!  ఈ విధంగా, తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించేందుకు గాను, రాజు, ఎక్కడ ఎటువంటి లోటు జరుగుతుందో అనే భయంతో, తాను మాత్రం సంతృప్తి లేకుండా, నిత్యజాగరూకుడై ఉంటూ, పరిపాలన చేస్తూనే ఉండాలి.  ఇది ఆ సుభాషితం యొక్క అంతర్గతభావం.  అంతేగాని, తనకున్న రాజ్యభూభాగం చాలదనే అసంతృప్తిని చెందుతూ, ఇతరదేశాలమీదకు దండెత్తి, సంక్షోభం సృష్టించమని దాని అర్థం కాదుఅని సదయుడు వివరించాడు.

          విమలునికి చాల సంతోషం కలిగింది.  అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి.  “తండ్రీ!  నాకు చక్కని ఉపదేశం చేసి, జ్ఞానోదయం కలిగించారు.  ఆ సుభాషితం యొక్క ఉదాత్తమైన భావాన్ని నేను మీ అనుగ్రహం ద్వారా చక్కగా గ్రహించాను.  మీ ఆజ్ఞతో, మీరు చెప్పిన విధంగా, సక్రమమైన పరిపాలనను ప్రజలకు అందిస్తూ, వారిని అన్నిరకాల అంతర్గతశత్రువులనుండి కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానుఅని సదయునికి పాదాభివందనం చేశాడు.

          అప్పటినుండి విమలుని పాలన చాల చక్కగా కొనసాగింది.  ఆదర్శపరిపాలకునిగా, ధర్మప్రభువుగా అతడు గొప్ప కీర్తిని సంపాదించాడు.

          చదువు చాల విలువైనది.   అయితే, ‘తేభ్యః క్రియాపరాః శ్రేష్ఠాః’.  చదువుకుని, విషయజ్ఞానం పొందిన వారికంటె, దానిని సక్రమంగా ఆచరించేవారే శ్రేష్ఠులని స్మృతివచనం.  అయినప్పటికీ, సరిగా అర్థం చేసుకున్నపుడే సరియైన ఆచరణ సాధ్యమౌతుంది.  చదువుకున్న విషయం యొక్క సారాన్ని సరిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆచరించేందుకు పూనుకుంటే వ్యతిరేకఫలాలు వస్తాయి.  అందువల్ల, గురుముఖతః విద్యను నేర్చుకొమ్మని మన పెద్దవారు చెబుతారు.  అందువల్ల, పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కంటె, పాఠశాలలకు చక్కగా హాజరౌతూ, పాఠాలను శ్రద్ధతో వినడం చాల ముఖ్యం.

(ఈ వ్యాసంయథార్థభారతి - మార్చ్ నెల, 2019 సంచికలో ప్రచురింపబడింది.) 


Wednesday, 26 December 2018

కల్యాణదుర్గం పూటకూళ్లవ్వ కథ



కొన్ని వందల సంవత్సరాల క్రితం...
కల్యాణదుర్గం ముఖద్వారం. సూర్యాస్తమయం కావస్తోంది.


కోట పై బురుజున ఉన్న కాలగణనయంత్రం సూచన ఇవ్వగానే అక్కడి భటులు ఆరు గంటలు మ్రోగించారు. ద్వారం వద్ద ఉన్న కావలి వారు వాకిలి మూసేందుకు సంసిద్ధులయ్యారు. గంట మ్రోగిన ఐదు నిమిషాలలో ఖచ్చితంగా వాకిలి మూతబడవలసిందేనని రాజాజ్ఞ. అందువలన కోట లోపలి పోవలసిన వారు పరుగు పరుగున వస్తున్నారు. "బిరీన రాండి, బిరీన రాండి" అంటూ భటులు వారిని తొందర పెట్టి, కనబడుతున్నవారిలో చివరి వ్యక్తి లోనికి రాగానే తాము కూడా లోనికి వెళ్లి వాకిలి బిగించేశారు.

అలా బిగించిన కాసేపటికి గుఱ్ఱాలు నురగలు కక్కుతూ ఉండగా ఓ పెద్దాయన, ఆయనతో పాటు మరో నలుగురు యువకులూ స్వారీ చేసుకుంటూ వచ్చారు. "ఓ కావలివాండ్రూ! కాస్త వాకిలి తీయండయ్యా! అనుకోకుండా ఆలస్యమైపోయింది!" అన్నాడా పెద్దాయన కోటగోడపై కనిపిస్తున్న భటులతో.

"క్షమించండి సామీ, మళ్ళీ పొద్దున్నే వాకిలి తెరిచేది! రాజాజ్ఞ!" అన్నారు వారు.

"మా ఆలస్యానికి సుంకం చెల్లిస్తామయ్యా. మీ రాజుగారి ఖజానాకు లాభమే కదా!" అన్నాడాయన.
"మా కోటలో అట్లాంటి సుంకాలేమీ లేవు. మళ్ళీ రేప్పొద్దు పొడిసినంకే తెరిసేది! అప్పుడు రాండి" అన్నారు కావలి వాళ్ళు.

"యాంపా? అంతసేపు రాత్రంతా సల్లో మేము యాడుండేది?" అన్నాడో యువకుడు నిస్సహాయతను కనబరుస్తూ.

"రొవంతట్ల పడమటికి కూతవేటంత దూరం పోండి. ఆడొగ పూటకూళ్ళవ్వ వుండాది. మీయాకట్లోళ్లందురూ రాత్రికి ఆడుండి పొద్దునే వస్తుంటారు".

"సరేనపా, అట్లైతే అట్లే జేస్తాంలే" అన్నాడు ఆ పెద్దాయన. ఆయన, ఆయనతో పాటు వచ్చిన నలుగురు యువకులు ఆ పూటకూళ్ళవ్వ ఇంటికి చేరుకున్నారు.

పూటకూళ్ళవ్వ వారికి ప్రేమతో స్వాగతం పలికి, అప్పటికప్పుడు వంట చేసి వారికి కడుపు నిండా అన్నం పెట్టింది. అప్పుడు వారిని అడిగింది - "ఎక్కడ ఎంత పని ఉన్నా పొద్దుముణిగేతలికే కోటలోపలికి పోవల్ల గదా? మడి ఏమిటికాలస్యమైంది?" అని అడిగింది.

"యెబుడూ పొద్దుముణిగేతలికే వస్తుంటిమి అవా! ఈపొద్దు దావలో కొందురు దొంగోళ్లు నామిందకొచ్చినారు. అబుడు ఈ పిల్లోళ్ళొచ్చి వచ్చి నన్ను కాపాడినారు" అన్నాడు ఆ పెద్దాయన.

"అవునా! ఏమప్పా మడి నువ్వు సూస్తే సావుకారాకట్ల ఉండావు. ఈ పిల్లోళ్ళు సూస్తే యాదో బతుకెదుక్కుంటా తిరుగుతున్నట్ల ఉండారు. నువ్వేమన్న జేసి ఈ పిల్లోళ్ల బొదుకు నిలబెట్టరాదా?" అని అడిగేసింది పూటకూళ్ళవ్వ.

"అట్లేమడగొద్దు లేవా! ఈయప్ప కూడా అట్లే జెప్పి మమ్మల్ని ఎనకేసుకొచ్చినాడు. మేము ఈయప్పని కాపాడినామని శానా మురిసిపోయి రమ్మంటే సరేనని వొచ్చినాము" అన్నాడొక యువకుడు నవ్వుతూ.

"అవునా! సరే, మంచోడేలే ఈయప్ప! వొప్పుకుణ్ణ్యాను. మడి మీ కథ ఏమి, చెప్పండి."

"నా పేరు ప్రతాపుడు. మావూరు గుమ్మఘట్ట."
"నా పేరు తపనుడు. మావూరు రంగసముద్రం."
"నాపేరు పద్మనాభుడు. మావూరు చిన్నపల్లి."
"నాపేరు జయవంతుడు . మావూరు జయపురం".

"సరే, యాటికిట్లా బయల్దేరినారు?"

"ఇంకేమిటికవా? యాడన్నా యేమన్నా వుజ్జోగం జిక్కితే సేసుకుందామని రాజధానికి బయల్దేరినాము. దావలో ఈ పెద్దాయప్ప దొంగులకు చిక్కి కానొచ్చ. కాపాడితిమి. వొరే పిల్లోండ్లూ, నాతో రాండ్రా, యాడన్నా వుజ్జోగం యేపిస్తానంటే సరే పదాని యిట్లా ఆయప్పెనికినే వచ్చినాము."

"బాగుందే మీ కథ! యాంపా పెద్దమనిషీ, మడేమి వుజ్జోగమిప్పిస్తావప్పా యీ పిల్లోండ్లికి?"
"యాదో వొగుట్లేవా! ఆయప్ప ఆ మాట అనే తలికే మాకు ప్రాణాలు లేచొచ్చినయ్!" అన్నాడు జయవంతుడు.

"సరే, యింక అందరూ పండుకోండి. పొద్దునే పోదురంట!"

"సరే, మడి నీ కథ యేందవా? జనాలందరూ కోట లోపల్నే వుంటే నువ్వేమిట్ల కోట బయల్లో గుడిసేసుకోనుండావు? దొంగలు రారా? బయమేసెల్దా?"

"దొంగలు కూడా మనుషులే కదా? వాళ్ళు కూడా ఇంత బువ్వ తినిపోతారు. నాదగ్గర ఏముందని వాళ్ళు దోసుకుపొయ్యేకి?" అంది అవ్వ నవ్వి.
*****
పొద్దు పుట్టగానే ఆ పెద్దమనిషి వెనక కోటలోనికి పోయాక గాని ఆ యువకులకు తెలిసిరాలేదు, తాము కాపాడింది సాక్షాత్తు కళ్యాణదుర్గం ప్రభువైన తిమ్మరాయుడిని అని. ఆయన ఒంటరిగా ప్రజల మంచిచెడ్డలను తెలుసుకొనేందుకు మారువేషంలో కోట బయటకు వెళ్లి వస్తూ ఉండగా దారిలో దొంగలు దాడి చేయడం తాము ఆయనను కాపాడడం యాదృచ్ఛికంగా జరిగిపోయింది.

వారంతా సంభ్రమాశ్చర్యాలతో, భయభక్తులతో తెలియక అనుచితంగా ప్రవర్తించినా, మాట్లాడినా క్షమించమని కోరారు. తిమ్మరాయడు నిండు సభలో ఆ నలుగురు యువకులు తనను దొంగలబారినుండి కాపాడిన వైనాన్ని తెలియజేసి కృతజ్ఞతగా వారికేమి కావాలో కోరుకోమన్నాడు. వారు "తమ కొలువులో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తే అదే చాలు" అన్నారు.

"సరే లెండయ్యా! ఉద్యోగం ఎట్లాగూ ఇస్తాను. అది కాకుండా, మీకు ఇంకేం కావాల్నో కోరుకోండి" అన్నాడు ప్రభువు.

"మా వూర్లో నాకొక మంచి ఇల్లు కావాలి" అన్నాడు ప్రతాపుడు.

"ఓయీ భవననిర్మాణమంత్రీ! రాబోయే పండుగ లోపు ప్రతాపునికి ఒక అద్భుతమైన ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయించాలి" అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"కళ్యాణదుర్గం నుండి మా వూరికి మంచి రహదారి కావాలి ప్రభూ, మావూరి ప్రజలకు మంచి సౌకర్యంగా ఉంటుంది." అన్నాడు తపనుడు.

"ఓయీ రహదారుల మంత్రీ! ఏ కాలంలోనైనా చెక్కుచెదరని చక్కని రహదారి ఒక నెలరోజులలో వేయించు." అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"నాకు మంచి కుటుంబంలో పిల్లను చూసి పెళ్లి చేయండి ప్రభూ!'' అన్నాడు కాసింత సిగ్గుతో, పద్మనాభుడు.

"ఏమయ్యా జనసంక్షేమశాఖామంత్రీ! మీ అమ్మాయికి యోగ్యుడైన వరుడు కావాలని వెదుకుతున్నావు కదా! ఇటువంటి పరాక్రమశాలికంటే యోగ్యుడు ఎక్కడుంటాడయ్యా! వధువుకు, ఆమె తల్లికి ఇతనిని చూపించి, ఎవరికీ అభ్యంతరం లేకుంటే ఇతనికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా!" అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"ప్రభూ, ప్రతియేటా ఒకసారి తమరు మావూరికొచ్చి నా యింట భోంచేసి పోవాలి. ఇదే నా కోరిక" అన్నాడు జయవంతుడు.

అందరూ అది విని ఆశ్చర్యపోయారు. వీడేమి తిక్కలోడురా? ప్రభువంతటి ప్రభువు అనుగ్రహించి వరం కోరుకొమ్మంటే ఇలా అడిగేశాడు అనుకున్నారు. తిమ్మరాయప్రభువు మాత్రమే చిరునవ్వు నవ్వి సరే అన్నాడు.

ఆ తరువాత జయవంతుని కోర్కెను నెరవేర్చే పనిలో పడ్డారు రాజోద్యోగులు. జయవంతుని స్వగ్రామమైన జయపురానికి ప్రభువుగారి రాకపోకలు సౌకర్యంగా ఉండడం కోసం చక్కని రహదారి వేశారు. సాధారణంగా ప్రభువుగారితో పాటు ఆయన పరివారం కూడా వస్తుంది. వారందరికీ మంచి విడిది అవసరం. కాబట్టి, జయపురంలో గొప్ప భవనం కట్టి, దాని చుట్టూ గుఱ్ఱాలు, ఏనుగులు, భటులు విశ్రమించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రభువు గారికి ప్రభువుల ఇండ్లలో మాత్రమే భోజనం చేసే నియమం ఉంది. అందువల్ల జయవంతుని జయపురానికి, చుట్టుపక్కల గ్రామాలకు ప్రభువుగా ప్రకటించేశారు. బ్రహ్మచారి ఇంట ప్రభువు భోజనం చేయడం చిన్నతనం. కాబట్టి జయవంతునికి మరొక ప్రభువుల పిల్లను తెచ్చి పెళ్లి చేశారు. అప్పటికి గాని అందరికీ తెలియలేదు జయవంతుని కోరికలోని అంతరార్థం. 
***

మీకేమైనా సందేహం వచ్చిందా? జయవంతునికి వచ్చింది.
***

జయవంతునికి రోజులు బాధ్యతాయుతంగా, సుఖంగా, హాయిగా గడుస్తుండగా ఓరోజు -
"మరి - ప్రభువుల ఇండ్లలో మాత్రమే భోంచేసే ప్రభువు ఆరోజు రాత్రి పూటకూళ్ళవ్వ ఇంట ఎలా తిన్నాడు?" అనే సందేహం వచ్చింది.

వచ్చిందే తడవుగా పూటకూళ్ళవ్వ గుడిసెకు పోయి - "అవ్వా! నీకెవ్వరూ లేరు కదా? మావూరికొచ్చేయ్. నాతో పాటు ఉండిపో" అని అడిగాడు.

అపుడా అవ్వ నవ్వి,
"నాయనా జయవంతా! వొగు ముప్పై యేండ్ల ముందర మేము కూడా కోటలోనే వుంటిమి. నా కొడుకూ, వాళ్ళప్పా వొగుసారి యిట్లే బయటికి పొయ్యి లోనికొచ్చేతలికే వాకిలి మూసేసిండ్రి. వాళ్ళు అట్లే బయట్నే ఉంటే రాత్రి వాళ్ళని మెకాలు ఈడ్సుకుపోయి తిన్న్యాయి. అబుట్నుంచి మాయా కట్ల కష్టం ఎవురికీ రాగూడదని నేను ఇట్లా కోట బయట మా చేన్లో గుడిసేసుకుని ఉండాను.

ఈ విషయం తిమ్మరాయ ప్రభువుకు తెలిసింది. ఆయన చాలా బాధపడినాడు. ఇబుడు నువ్వొచ్చినట్లే అబుడు ఆయప్ప కూడా వచ్చి కోటలో తన యింట్లోనే తనకు తల్లిలా ఉండమని బ్రతిమలాడినాడు. అయినా నేను ఒప్పుకోలేదు. కోట వాకిలి పొద్దుమునిగే తలికి వేసి తీరల్ల! ఆ నియమాన్ని దాటేకి లేదు. చివరకు అలా ఆలస్యంగా వచ్చింది స్వయంగా ప్రభువైన సరే, కోట తలుపు తీయరాదు అని కఠిన నియమం!

కానీ కొందరు అదృష్టం బాగులేనోళ్ళు రాత్రికి బయటే వుంటే వారి గతి ఏమి కాను? అందుకే నేను కోట బయటనే గుడిసెలోనే ఉంటానంటిని. ప్రభువు చేసేదేమీ లేక సరేననె. కానీ, వచ్చినోళ్ళకి నేను యెట్లో వండిపెడతాను గాని దానికి అవసరమైన గింజలూ అవీ ఎట్లా సంపాదిచ్చేది? అందుకే, అవన్నీ తిమ్మరాయప్రభువే నాకు పంపిస్తాంటాడు. ఆయప్ప నెలకొగసారైనా వచ్చి నేను వొండింది తిని పోతాంటాడు. నేను వాళ్ళ అమ్మనంటాడు. ఆయప్ప యా వేషంలో వచ్చినా నాగ్గొత్తే కానీ కొత్త కాదు. దానికే ఆపొద్దట్ల మీ పిల్లోళ్ల బొతుకు నిలబెట్టమని ఆయప్పని అట్లా అడిగినాను." అని మొత్తం కథ అంతా చెప్పింది.

"అవ్వా! ఇపుడు అర్థమైంది. ప్రభువుల ఇండ్లలో తప్ప యాడా తినని రాజు నీ చేతి వంట ఎట్లా తిన్నాడో! నువ్వు మహా యోగినివి! ప్రభువులకన్నా గొప్పదానివి!" అంటూ పాదాభివందనం చేశాడు జయవంతుడు.

{ Disclaimer: రాజును రక్షించిన యువకులు అనే ఒక చిన్న పాత చందమామ కథకు మా కళ్యాణదుర్గం కథ పూటకూళ్ళవ్వ కథ కల్పించి ఏదో సరదాగా వ్రాశాను సుమా! మళ్ళీ నిజమనుకొనేరు!  }
Photo Credits: Internet

Thursday, 20 December 2018

బలం కంటే వ్యూహం బలమైనది.

సహజంగానే ప్రత్యర్థిని గెలిచేందుకు బలగం చాల ముఖ్యమైనది.
 ఒకొక్కసారి బలగం కంటె కూడా వ్యూహం ముఖ్యమైనది.
(విశ్వనాథన్ ఆనంద్, కార్ల్ సేన్ వంటి వారు తమ మంత్రిని ఆటకు ముందుగానే ప్రక్కన పెట్టి ఆడినా కూడా నాలాంటి అనామకులైన ఆటగాళ్లను చిత్తుగా ఓడించగలరు.)
 మరొకసారి అవకాశం చాల ప్రధానమైనది.  ఎవరు మొదట తమ ఎత్తును వేయాలో వారు గెలిచే అవకాశాలు ఎక్కువ.
(అందుకే తెల్ల పావులతో ఆడేవారికి విజయం సాధించే అవకాశం 0.5% ఎక్కువని అంటారు.)
 మొత్తానికి చతురంగక్రీడలో బల్లమీద చూసి ఆడే ఆటగాళ్లకంటె మెదడులోనే ఊహించుకొని ఆడగల ఆటగాళ్లు చాల బలవంతులు.  వారు కళ్లకు గంతలు కట్టుకొని కూడా ఆడి గెలవగలరు.  Cash transactions అందరూ చేయగలరు.  Cashless transactions చేయగలిగినవారు వారికంటె తెలివైనవారని ఈనాడు లోకంలో ప్రసిద్ధి చెందారు కదా! 
 ప్రత్యర్థి బలగర్వంతో ఏమరుపాటుగా ఉంటే బలహీనుడు కూడా ఊహించని ఎత్తు వేసి బలవంతుని చిత్తు చేయవచ్చు.
ఈ క్రింద చదరంగపు బల్లను చూడండి:


నల్లరాజు బలం చాల ఎక్కువగా ఉంది.
మంత్రి(9) + రెండు ఏనుగులు(10) + ఒక శకటం (3) + ముగ్గురు బంట్లు(3) = 25
అతనితో పోలిస్తే తెల్లరాజు బలహీనుడు.
రెండు ఏనుగులు(10) + ఒక గుఱ్ఱం(3) = 13
కాని, వ్యూహరీత్యా ఈ సందర్భంలో మొదటి ఎత్తు ఎవరిదైతే వారిదే గెలుపు!
నల్లరాజుది మొదటి ఎత్తైతే Qg8 అనే ఒకే ఎత్తుతో తెల్లరాజు ఆటను కట్టించగలడు.
అదే తెల్లరాజుది గనుక మొదటి ఎత్తైతే నల్లరాజుకు గుక్క తిప్పుకొనే అవకాశం ఇవ్వకుండా మూడెత్తులలో ఆటకట్టించగలడు.
 1) Rh5+ చెక్ = తెల్ల ఏనుగు నల్లరాజు కుడివైపునుండి దాడి చేసి మరుసటి ఎత్తులోనే చంపేస్తానని బెదిరిస్తోంది.
ఈ పరిస్థితిలో నల్లరాజే స్వయంగా ఆ ఏనుగును చంపవచ్చు.  కాని అలా చేస్తే తెల్లగుఱ్ఱం అతని ప్రాణాలు తీస్తుంది.  అందువల్ల Kxh5 అనే ఎత్తును వేయలేడు.  అలా అని, కాని కు పక్కకు తప్పుకొనే అవకాశం లేదు. f4 గడిలో ప్రవేశిస్తే మరో నల్ల ఏనుగు అతనిని మట్టగించి చంపేసేందుకు సిద్ధంగా ఉంది.  g6 గడికి పోతే తెల్లరాజు చంపుతాడు. g4 గడిలో ప్రవేశించేందుకు తన బంటే తనకు అడ్డంగా ఉంది.  కాబట్టి Bh5 ఎత్తు వేసి తీరాలి!  గత్యంతరం లేదు.  దీన్నే forced step అంటారు.  నల్లరాజు తన శకటంతో, తనను బెదిరిస్తున్న తెల్ల ఏనుగును చంపేయాలి!
 ఈ దెబ్బతో నల్లరాజు బలం పెరగకపోయినా, తెల్లరాజు బలం 5 పాయింట్లు తగ్గి బలాబలాలు 8:25 గా మారి నల్లరాజు బలం పెరిగింది.  తెల్లరాజుకు ప్రతికారం తీర్చుకొనే అవకాశం ఉంది.  గుఱ్ఱంతో ఆ శకటాన్ని చంపి బలశాతాన్ని 8:22 గా మార్చుకోవచ్చు.  కాని, ప్రతికారాలకంటె గెలుపు ముఖ్యం కదా!
 2) ఆత్మవిశ్వాసం కోల్పోని తెల్లరాజు మరుసటి ఎత్తు ఇదీ! Rf5+ చెక్.  
ఈసారి f గడిలోని ఏనుగును తెచ్చి నల్లరాజును చంపేస్తానంటున్నాడు. ఆ ఏనుగును నల్లరాజుగారు చంపితే తెల్లగుఱ్ఱం మీదకు దూకుతుంది.  అలా అని దాన్ని తప్పించుకొనేందుకు g6 లేదా h6 గడులలోనికి పోతే తెల్లరాజు చంపేస్తాడు.  అలా అని g4 లేదా h4 గడులలోనికి పోదలిస్తే తన బంట్లే తనకడ్డంకి.  అందువల్ల మరొక forced step తప్పదు.  నల్లరాజు తన ఏనుగుతో తెల్ల ఏనుగును చంపి తీరాలి!  కాబట్టి ఎత్తు Rf5.  తెల్లరాజు బలం మరింత తగ్గింది.  3:25 గా మారిపోయింది.  తెల్లరాజుకు ఇపుడు ఒక్క గుఱ్ఱం తప్ప వేరే బలం లేదు.  కాని ఆ తెల్లరాజు తన రెండు ఏనుగులనూ త్యాగం చేసి నల్లరాజు చుట్టూ బలమైన ఉచ్చు బిగించేశాడు!  అటువంటి ఎత్తులను చదరంగపు పరిభాషలో  sacrifice అంటారు.  ఈ పరిస్థితులలో, మరొక్క ఎత్తులో అంతటి బలవంతుడైన నల్లరాజు కూడా శరణు శరణు, దాసోऽహం అనక తప్పదు!!!
అదే ఈ చెప్పబోతున్న మూడో ఎత్తు!!!
 3) Ne6#!!! ఆటకట్టు. e గడిలోనికి వచ్చిన తెల్లగుఱ్ఱం నల్లరాజుగారి ప్రాణాలను తీస్తానంటోంది.  నల్లరాజుగారికి కావలసినంత బలగం ఉన్నా దానిని చంపేందుకు ఎవరూ అందుబాటులో లేరు.  పోనీ తాను గుఱ్ఱం వేటునుండి తప్పించుకొనేందుకు కూడా అవకాశం లేకుండా f5, h5, f6, g4, h4, గడులలో తన ఏనుగు, తన శకటం, తన బంట్లే తనకు అడ్డంకిగా ఉన్నాయి.  f4 గడిలోనికి వెళ్లినా చలాకీ తెల్ల గుఱ్ఱం అక్కడకు కూడా దూకగలదు.  పోనీ g6 లేదా h6 గడులలోనికి వెడితే తెల్లరాజు తన కరవాలం ఝళిపిస్తూ తల తెగవేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.  మరో దారి లేదు, లేదు, లేదు.
 కాబట్టి, తన మంత్రి, తన రెండేనుగులు, ఒక శకటం, ముగ్గురు బంట్లు, వీరిలో ఎవరూ కూడా అవసరానికి సరిపోక ఆదుకునే దిక్కులేక నల్లరాజుకు ఓటమి తప్పలేదు!!!
 ***
2014 సంవత్సరమధ్యంలో ఎన్నికలు జరిగాయి.  కేంద్రంలో మోడీగారు, రాష్ట్రంలో చంద్రబాబుగారు ఘనవిజయాలు సాధించి గద్దెనెక్కారు.  ఇపుడు 2017 వ సంవత్సరం ప్రవేశించింది.  సరిగా రెండున్నరేళ్లు గడిచాయి.  ఈ కాలమంతటా వారు ప్రజలకోసం ఏవేవో చేశామంటున్నారు గాని, ఎవరైనా లబ్ధి పొందినవారికి తప్ప మరెవరికీ ఆ పనులు గుర్తుండే అవకాశాలు లేవు.  డీమానిటైజేషన్ పేరుతో మోడీగారు, అమరావతి, పోలవరం పేర్లతో బాబుగారు సృష్టించిన విధ్వంసాలు  (ఈమాటను ఎవరైనా ఇష్టపడకుంటే కలకలం అని నిరభ్యంతరంగా చదువుకోవచ్చును.) మాత్రమే ప్రజలకు చిరకాలం గుర్తున్నాయి. 
 ఇదే కాలంలో ఈ ఇద్దరూ కూడా తమ ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేసి చాలావరకు సఫలీకృతులు కూడా అయ్యారు.  ఈ చదరంగం బల్లపై చూపిన పరిస్థితులు ఇప్పుడున్నాయి.  బలమైన అధికారపక్షాలు,  కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్షాలు ఉన్నాయి.  ఈ సమయంలో, అధికారపక్షాలా లేక ప్రతిపక్షాలా?  వేటికి రాబోయే ఎన్నికల్లో  ఏవి మొదట వ్యూహాత్మకంగా కదిలి అద్భుతమైన ఎత్తులు వేయగలిగితే 2019లో వారిదే గెలుపు.  మరో రెండున్నరేళ్లు వీరినడుమ రసవత్తరమైన పోటీని ఆస్వాదించేందుకు మనం సిద్ధంగా ఉండటంలో తప్పేముంది?
(ఈ నా వ్యాసం మునుపు ఏసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...