సహజంగానే ప్రత్యర్థిని గెలిచేందుకు బలగం చాల ముఖ్యమైనది.
ఒకొక్కసారి బలగం కంటె కూడా వ్యూహం ముఖ్యమైనది.
(విశ్వనాథన్ ఆనంద్, కార్ల్ సేన్ వంటి వారు తమ మంత్రిని ఆటకు ముందుగానే ప్రక్కన పెట్టి ఆడినా కూడా నాలాంటి అనామకులైన ఆటగాళ్లను చిత్తుగా ఓడించగలరు.)
మరొకసారి అవకాశం చాల ప్రధానమైనది. ఎవరు మొదట తమ ఎత్తును వేయాలో వారు గెలిచే అవకాశాలు ఎక్కువ.
(అందుకే తెల్ల పావులతో ఆడేవారికి విజయం సాధించే అవకాశం 0.5% ఎక్కువని అంటారు.)
మొత్తానికి చతురంగక్రీడలో బల్లమీద చూసి ఆడే ఆటగాళ్లకంటె మెదడులోనే ఊహించుకొని ఆడగల ఆటగాళ్లు చాల బలవంతులు. వారు కళ్లకు గంతలు కట్టుకొని కూడా ఆడి గెలవగలరు. Cash transactions అందరూ చేయగలరు. Cashless transactions చేయగలిగినవారు వారికంటె తెలివైనవారని ఈనాడు లోకంలో ప్రసిద్ధి చెందారు కదా!
ప్రత్యర్థి బలగర్వంతో ఏమరుపాటుగా ఉంటే బలహీనుడు కూడా ఊహించని ఎత్తు వేసి బలవంతుని చిత్తు చేయవచ్చు.
ఈ క్రింద చదరంగపు బల్లను చూడండి:
నల్లరాజు బలం చాల ఎక్కువగా ఉంది.
మంత్రి(9) + రెండు ఏనుగులు(10) + ఒక శకటం (3) + ముగ్గురు బంట్లు(3) = 25
మంత్రి(9) + రెండు ఏనుగులు(10) + ఒక శకటం (3) + ముగ్గురు బంట్లు(3) = 25
అతనితో పోలిస్తే తెల్లరాజు బలహీనుడు.
రెండు ఏనుగులు(10) + ఒక గుఱ్ఱం(3) = 13
రెండు ఏనుగులు(10) + ఒక గుఱ్ఱం(3) = 13
కాని, వ్యూహరీత్యా ఈ సందర్భంలో మొదటి ఎత్తు ఎవరిదైతే వారిదే గెలుపు!
నల్లరాజుది మొదటి ఎత్తైతే Qg8 అనే ఒకే ఎత్తుతో తెల్లరాజు ఆటను కట్టించగలడు.
అదే తెల్లరాజుది గనుక మొదటి ఎత్తైతే నల్లరాజుకు గుక్క తిప్పుకొనే అవకాశం ఇవ్వకుండా మూడెత్తులలో ఆటకట్టించగలడు.
1) Rh5+ చెక్ = తెల్ల ఏనుగు నల్లరాజు కుడివైపునుండి దాడి చేసి మరుసటి ఎత్తులోనే చంపేస్తానని బెదిరిస్తోంది.
ఈ పరిస్థితిలో నల్లరాజే స్వయంగా ఆ ఏనుగును చంపవచ్చు. కాని అలా చేస్తే తెల్లగుఱ్ఱం అతని ప్రాణాలు తీస్తుంది. అందువల్ల Kxh5 అనే ఎత్తును వేయలేడు. అలా అని, కాని కు పక్కకు తప్పుకొనే అవకాశం లేదు. f4 గడిలో ప్రవేశిస్తే మరో నల్ల ఏనుగు అతనిని మట్టగించి చంపేసేందుకు సిద్ధంగా ఉంది. g6 గడికి పోతే తెల్లరాజు చంపుతాడు. g4 గడిలో ప్రవేశించేందుకు తన బంటే తనకు అడ్డంగా ఉంది. కాబట్టి Bh5 ఎత్తు వేసి తీరాలి! గత్యంతరం లేదు. దీన్నే forced step అంటారు. నల్లరాజు తన శకటంతో, తనను బెదిరిస్తున్న తెల్ల ఏనుగును చంపేయాలి!
ఈ దెబ్బతో నల్లరాజు బలం పెరగకపోయినా, తెల్లరాజు బలం 5 పాయింట్లు తగ్గి బలాబలాలు 8:25 గా మారి నల్లరాజు బలం పెరిగింది. తెల్లరాజుకు ప్రతికారం తీర్చుకొనే అవకాశం ఉంది. గుఱ్ఱంతో ఆ శకటాన్ని చంపి బలశాతాన్ని 8:22 గా మార్చుకోవచ్చు. కాని, ప్రతికారాలకంటె గెలుపు ముఖ్యం కదా!
2) ఆత్మవిశ్వాసం కోల్పోని తెల్లరాజు మరుసటి ఎత్తు ఇదీ! Rf5+ చెక్.
ఈసారి f గడిలోని ఏనుగును తెచ్చి నల్లరాజును చంపేస్తానంటున్నాడు. ఆ ఏనుగును నల్లరాజుగారు చంపితే తెల్లగుఱ్ఱం మీదకు దూకుతుంది. అలా అని దాన్ని తప్పించుకొనేందుకు g6 లేదా h6 గడులలోనికి పోతే తెల్లరాజు చంపేస్తాడు. అలా అని g4 లేదా h4 గడులలోనికి పోదలిస్తే తన బంట్లే తనకడ్డంకి. అందువల్ల మరొక forced step తప్పదు. నల్లరాజు తన ఏనుగుతో తెల్ల ఏనుగును చంపి తీరాలి! కాబట్టి ఎత్తు Rf5. తెల్లరాజు బలం మరింత తగ్గింది. 3:25 గా మారిపోయింది. తెల్లరాజుకు ఇపుడు ఒక్క గుఱ్ఱం తప్ప వేరే బలం లేదు. కాని ఆ తెల్లరాజు తన రెండు ఏనుగులనూ త్యాగం చేసి నల్లరాజు చుట్టూ బలమైన ఉచ్చు బిగించేశాడు! అటువంటి ఎత్తులను చదరంగపు పరిభాషలో sacrifice అంటారు. ఈ పరిస్థితులలో, మరొక్క ఎత్తులో అంతటి బలవంతుడైన నల్లరాజు కూడా శరణు శరణు, దాసోऽహం అనక తప్పదు!!!
అదే ఈ చెప్పబోతున్న మూడో ఎత్తు!!!
3) Ne6#!!! ఆటకట్టు. e గడిలోనికి వచ్చిన తెల్లగుఱ్ఱం నల్లరాజుగారి ప్రాణాలను తీస్తానంటోంది. నల్లరాజుగారికి కావలసినంత బలగం ఉన్నా దానిని చంపేందుకు ఎవరూ అందుబాటులో లేరు. పోనీ తాను గుఱ్ఱం వేటునుండి తప్పించుకొనేందుకు కూడా అవకాశం లేకుండా f5, h5, f6, g4, h4, గడులలో తన ఏనుగు, తన శకటం, తన బంట్లే తనకు అడ్డంకిగా ఉన్నాయి. f4 గడిలోనికి వెళ్లినా చలాకీ తెల్ల గుఱ్ఱం అక్కడకు కూడా దూకగలదు. పోనీ g6 లేదా h6 గడులలోనికి వెడితే తెల్లరాజు తన కరవాలం ఝళిపిస్తూ తల తెగవేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరో దారి లేదు, లేదు, లేదు.
కాబట్టి, తన మంత్రి, తన రెండేనుగులు, ఒక శకటం, ముగ్గురు బంట్లు, వీరిలో ఎవరూ కూడా అవసరానికి సరిపోక ఆదుకునే దిక్కులేక నల్లరాజుకు ఓటమి తప్పలేదు!!!
***
2014 సంవత్సరమధ్యంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో మోడీగారు, రాష్ట్రంలో చంద్రబాబుగారు ఘనవిజయాలు సాధించి గద్దెనెక్కారు. ఇపుడు 2017 వ సంవత్సరం ప్రవేశించింది. సరిగా రెండున్నరేళ్లు గడిచాయి. ఈ కాలమంతటా వారు ప్రజలకోసం ఏవేవో చేశామంటున్నారు గాని, ఎవరైనా లబ్ధి పొందినవారికి తప్ప మరెవరికీ ఆ పనులు గుర్తుండే అవకాశాలు లేవు. డీమానిటైజేషన్ పేరుతో మోడీగారు, అమరావతి, పోలవరం పేర్లతో బాబుగారు సృష్టించిన విధ్వంసాలు (ఈమాటను ఎవరైనా ఇష్టపడకుంటే కలకలం అని నిరభ్యంతరంగా చదువుకోవచ్చును.) మాత్రమే ప్రజలకు చిరకాలం గుర్తున్నాయి.
ఇదే కాలంలో ఈ ఇద్దరూ కూడా తమ ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేసి చాలావరకు సఫలీకృతులు కూడా అయ్యారు. ఈ చదరంగం బల్లపై చూపిన పరిస్థితులు ఇప్పుడున్నాయి. బలమైన అధికారపక్షాలు, కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ సమయంలో, అధికారపక్షాలా లేక ప్రతిపక్షాలా? వేటికి రాబోయే ఎన్నికల్లో ఏవి మొదట వ్యూహాత్మకంగా కదిలి అద్భుతమైన ఎత్తులు వేయగలిగితే 2019లో వారిదే గెలుపు. మరో రెండున్నరేళ్లు వీరినడుమ రసవత్తరమైన పోటీని ఆస్వాదించేందుకు మనం సిద్ధంగా ఉండటంలో తప్పేముంది?
(ఈ నా వ్యాసం మునుపు ఏసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)
No comments:
Post a Comment