Monday, 17 December 2018

వాళ్లు కూడా భారతీయులే

"పలువిద్య లెన్ని నేర్చిన కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!"
అనే మాటను ఇంకా పట్టుకుని నిష్ఠగా పాటించే వారు ఉన్నారా?
అనంతపురంలో ఒక మిత్రుడు తన యువమిత్రుని ఒకరిని నాకు పరిచయం చేశాడు. ఆ యువకుడు ఫేస్ బుక్ లో కూడా ఉండేవాడు. మాంచి హుషారైనవాడు. తన వయసుకు తగిన పోస్టులు పెట్టుకుంటూ సందడి సందడి చేస్తూ ఉండేవాడు.
అయితే గత రెండు మాసాలుగా ఫేస్బుక్ లో లేకుండా అదృశ్యమై పోయాడు. ఏమయ్యాడు అని అతని గూర్చి మా మిత్రుని అడిగితే -

"అతడు పెద్దగా చదువుకున్నది లేదు,  అతనికి అతని వృత్తివిద్య ఒకటే వచ్చేది.  దాన్ని చేసుకుంటూ వయసులో చిన్నవాడైనా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ కాలం గడిపేస్తూ ఉండేవాడు.   కానీ, అతని పని కాస్త మోడీ గారి డీమానిటైజేషన్ సంస్కరణతో ఒడిదుడుకులకు లోనైంది. అందువల్ల ఎలా సంపాదించుకోవాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అనే చింతలో ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాడు పాపం!"  అని విచారం వ్యక్తం చేశాడు.
ఈకాలంలో కూడా వృత్తివిద్యను మాత్రమే మనసా వాచా కర్మణా నమ్ముకొని మరొకదాని జోలికి వెళ్లని వారు కూడా ఉన్నారా అని నాకు ఆశ్చర్యం వేసింది.
పరిశ్రమలు వచ్చి గ్రామీణ కులవిద్యలను చిన్నాభిన్నం చేసేశాయి.

మనకు నేతవాడు అక్కరలేదు,
డిగ్ జామ్, బాంబే డయింగ్, రేమాండ్ కంపెనీల బట్టలు దొరుకుతున్నాయి.
మనకు కంసాలివాడు అక్కరలేదు,
కళ్యాణ్, తనిష్క్, జోయాలుక్కాస్, కంపెనీల నగలు దొరుకుతున్నాయి.
మనం పశువులనే పోషించం, కాబట్టి గొల్లవాడు అక్కరలేదు.
వీధి వీధిలోనూ హెరిటేజ్ పాలు దొరుకుతున్నాయి.
మనకు చెప్పులు కుట్టేవాడు కూడా అక్కరలేదు,
బాటలు, ఆదిదాసులు, రీబాకులు, నైకులు పిలిచి కాళ్ళొత్తుతున్నాయి.
అసలెవరూ అక్కర్లేదు.
రెడీమేడ్ ప్రపంచం మనలను ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది!

మరెవరు కావాలి?
పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారుడు కావాలి.
వాళ్ళ దగ్గర జీతం తీసుకుని పనిచేసి పెట్టే పెద్ద పాలేరులం మనమే కావాలి.

సరే, అలాగే.
కానీ,
ఆ నేతగాడు, కంసాలి, గొల్లవాడు, చెప్పులు కుట్టేవాడు - ఇలాంటి వృత్తివిద్యలను నమ్ముకున్నవాళ్ళు పొట్టమాడ్చుకుని అలాగే చావాలా?

వేలాది సంవత్సరాలుగా ఆయా కులవిద్యలు తప్ప మరొకటి తెలియని వారు హఠాత్తుగా మరొక భాషలో చదువులను నేర్చుకొనడం ఎంత కష్టం? మాకు కూడా పైకి ఎదిగేందుకు అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చేందుకు ఎందుకు మనం మనసు కష్టపెట్టుకోవాలి ?

పుట్టి ఎదుగుతున్న మన ఇంటి శిశువు మనంత తెలివిగా ప్రవర్తించలేడు. మనంత హుషారుగా ప్రపంచంలో జొరబడి పనులు చేసుకురాలేడు. వెచ్చాల అంగడికి ఒక్కడే పోయి ఒక వస్తువును తీసుకువస్తే వాడు మోసపోయాడా లేక చిల్లర సరిగా తీసుకువచ్చాడా అని పదే పదే చూస్తూ, హెచ్చరిస్తూ, వాడు ఎదిగేందుకు తోడ్పడుతూ, స్వతంత్రంగా వ్యవహరించే వయసు వచ్చే వరకు అనుక్షణం రక్షిస్తూ ఉంటాం.

ఆపద్ధర్మాలు అందరికీ ఉన్నాయని మనువు చెప్పాడు. మరి, ఎంతో ప్రేమతో, మమకారంతో, తరతరాలుగా తాము గొప్ప నైపుణ్యం గడించిన వృత్తివిద్యలను శాశ్వతంగా కోల్పోయి, కూటికి ఉపయోగపడే క్రొత్తవిద్యలను అభ్యసించేందుకు, బ్రతికేందుకు తాపత్రయపడుతూ, తప్పటడుగులు వేస్తున్న చిన్ని శిశువులవంటి మనుషులను మనం ప్రేమాభిమానాలతో ఆదరించాలి కదా? ప్రోత్సహించాలి కదా? వారందరూ మన ఇంటివారు కాదేమో అని ఎవరికీ సందేహం వద్దు.

మానవులందరూ ఒక తల్లి నుండి పుట్టినవారేనని మనమందరం ఆరాధించే రామాయణమే స్వయంగా చెబుతోంది. 

)))(((

(నేను వ్రాసిన ఈ క్రింది వ్యాసం మునుపు ఆసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

మనుస్మృతిని తగలబెడతాం అని కొందరు అంటారు. 
అయ్యయ్యో ఏమిటీ ఘోరకలి అని నెత్తీనోర్లు బాదుకుంటారు మరికొందరు. 
 భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తాం కదా?  మరి సహోదరుల నడుమ ఈ గొడవలేమిటి?  భారతీయులలో కనిపించే కులమే దీనికి కారణం అంటారు అందరూ.  ఈ కులాల వారు ఈ పనులే చేయాలి, ఆ కులాల వారు ఆ పనులే చేయాలి అని మనుస్మృతిలో చెప్పబడింది.  సరే, ఈ రోజుల్లో ఆయా పనులను వారు మాత్రమే చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు.    నాలుగు వర్ణాలు ఉన్నాయట.  (వాటినే కులాలుగా అందరూ అనుకుంటున్నారు.  ఆయా వర్ణాలలో లెక్క లేనన్ని శాఖోపశాఖలు ఉన్నప్పటికీ) 
అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా.
దానం ప్రతిగ్రహశ్చైవ షట్కర్మాణ్యగ్రజన్మనః   (మనుస్మృతి 10.75)
చదువు చెప్పడం, చదువుకొనడం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం చేయడం, దానం స్వీకరించడం –
ఈ ఆరు పనులు బ్రాహ్మణుల ధర్మాలు అన్నారు.
కానీ, భృగువంశపు బ్రాహ్మణుడైన పరశురాముడు ఆయుధం పట్టి క్షత్రియజాతిని నామావశిష్టం చేసేశాడు.  ఆ పాపం పోగొట్టుకొనడం కోసం ఘోరమైన తపస్సు  చేశాడు.
బ్రహ్మగారి మునిమనుమడు, పులస్త్యవంశపు  బ్రాహ్మణుడైన రావణుడు ఆయుధాలు ధరించి లోకాలన్నింటినీ పీడించి పీడించి పెట్టాడు.  ఆయనను దుష్టశిక్షణలో భాగంగా రాముడు హతమార్చాడు.  చివరకు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకునేందుకు శివలింగప్రతిష్ఠను గావించాడంటారు.
ఈ విధంగా బ్రాహ్మణులు స్వధర్మం వదిలి పెట్టి యుద్ధాలు చేబట్టడం తప్పు  కదా? 
ఏదైనా కారణం చేత ఆ ఆరు పనులు చేయలేకపోతే పరిస్థితి ఏమిటి? 
అందుకని ముందుగానే ఆ పరిస్థితులను ఊహించి ఆపద్ధర్మాలు వచ్చాయి.
జీవేత్ క్షత్రియధర్మేణ స హ్యస్య ప్రత్యనన్తరః (10.81)
"అలా అయితే బ్రాహ్మణులు క్షత్రియధర్మాన్ని (ఆయుధాలను ధరించి ప్రజారక్షణ చేయడం) అనుసరించి జీవించవచ్చు" అన్నారు.
భారతంలో ద్రోణుడు, అశ్వత్థామ ఇలాగే జీవించినవారు.  కానీ, వారు మహా తేజస్వులు, ధీరసత్త్వులు.  అందరికీ వారిలా జీవించడం చేతకాదు కదా?   మరి క్షత్రియుల పని కూడా అందరికీ చేతగాకపోతే?
ఉభాభ్యామప్యజీవంస్తు కథం స్యాదితి చేద్భవేత్
కృషిగోరక్షమాస్థాయ జీవేద్వైశ్యస్య జీవికామ్. (10.82)
"అటు బ్రాహ్మణుల పనిని గాని, ఇటు క్షత్రియుల పనిని గాని చేయలేకపోతే వ్యవసాయం చేసుకోవచ్చు,  గోరక్షణ చేసుకుంటూ ఉండవచ్చు.  వైశ్యుడిలా బ్రతకవచ్చు"  అన్నారు.
సద్యః పతతి మాంసేన లాక్షయా లవణేన చ
త్ర్యహేణ శూద్రో భవతి బ్రాహ్మణః క్షీరవిక్రయాత్. (10.92)
బ్రాహ్మణుడు మాంసాన్ని కానీ, లక్కను కానీ, ఉప్పునుగాని అమ్మితే వెంటనే శూద్రుడు అవుతాడు, పాల అమ్మకం మొదలు పెడితే కేవలం మూడంటే మూడురోజులలోనే ఆ బ్రాహ్మణుడు కాస్త శూద్రుడు అయిపోతాడు అన్నారు. 
ఈ క్రమాన్ని చూస్తుంటే చతుర్వర్ణాల ఆవిర్భావం ఎలా జరిగిందో అర్థం అవుతున్నట్టు లేదూ?  బ్రాహ్మణుడిని ముఖంగా, క్షత్రియుడిని భుజాలుగా, వైశ్యుని ఊరువులుగా, శూద్రుని పాదాలుగా కలిగిన సమాజమనే పురుషస్వరూపం గోచరించటం లేదా?  ఒకే వ్యక్తి సంతానం చిన్నా పెద్దా  తమకు చేతనైన పనులను చేస్తూ క్రమంగా,  బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా విస్తరించినట్లు, ఒక Clue దొరికినట్లు లేదూ?  
వాల్మీకి రామాయణం - అరణ్యకాండం, పద్నాల్గవ సర్గ చదివితే - దక్షప్రజాపతి కూతురైన మనువును కాశ్యపమహర్షి వివాహం ఆడారని,  ఆ మనుసంతానమే - క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని స్పష్టంగా ఉంది.  (అరణ్యకాండం, 14.29)  ఆ మనువు సంతానపరంపరనే మనం మానవులు అంటున్నాం.   బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు ఎవరైనా అందరూ మానవులే -
ఈ లెక్కన అగ్రకులం అంటే తల్లిదండ్రులకు ముందుగా పుట్టిన బిడ్డ యొక్క సంతానం, వారి పరంపర అన్నమాట.  (అగ్ర అంటే మొదట అని అర్థం.)  నిమ్నకులాలు అంటే సంతానక్రమంలో క్రిందుగా (తరువాత) పుట్టిన బిడ్డల సంతానం అన్నమాట. 
అంటే అందరికంటే ముందుగా పుట్టిన బ్రాహ్మణుని సంతానం అందరికీ అగ్రజులు.  అలాగే - రెండవ సంతానమైన క్షత్రియుడు బ్రాహ్మణుడికి నిమ్నకులం వాడు, తన తరువాత పుట్టిన వైశ్యునికి అగ్రకులం వాడు.  అలాగే వైశ్యుడు తన ముందుపుట్టిన బ్రాహ్మణ క్షత్రియులకు నిమ్నకులం వాడు, తన తరువాత పుట్టిన శూద్రునికి అగ్రకులం వాడు.  అందరికంటే చివరగా పుట్టిన శూద్రుడు అంత్యజుడు.  ఈ రోజుల్లో పెద్దవాణ్ణి అన్నా అని, పెద్దోడా అని, చిన్న వాడిని తమ్ముడూ అని, ఒరే చిన్నోడా అని అందరూ పిలుస్తున్నట్లే  అప్పట్లో అగ్రజా అనడం, అంత్యజా అనడం సహజం అయి ఉంటుంది. 
కాబట్టి ఈ నలుగురూ పూర్వకాలంలో ఒకే తల్లిదండ్రుల బిడ్డలైన సహోదరులు!  వీరు కాక పంచములనబడే ఐదవ జాతి లేదు గాక లేదు అని మనుస్మృతి స్పష్టంగా చెబుతోంది.   (నాస్తి తు పంచమః  10.5)
మొదటి సంతానానికే రాజ్యాన్ని, పెత్తనాన్ని అప్పగించే సంస్కృతి, చిన్నవారిని వివిధ పనులకు పురమాయించే పధ్ధతి, ఇప్పటికీ భారతీయ గృహాల్లో సహజమే  కదా!  
కానీ క్రమంగా తరాలు గడుస్తున్నా కొద్దీ అన్నల పిల్లలు తమ్ముళ్ల  పిల్లల మీద పెత్తనం చెలాయించడం తమ హక్కులా భావించడం మొదలైంది.  పైగా చదువుకున్న అన్న తప్పు చేసినా శిక్ష స్వల్పంగా ఉండటం, చదువుకోకుండా గొడ్డు చాకిరీ చేస్తున్న తమ్ముడు ఎపుడైనా అన్న నిర్దాక్షిణ్యంగా చేయిస్తున్న  శ్రమపురితమైన పనికి తట్టుకోలేక  కోపమొచ్చి కేకలేసినా వాడికి కఠినమైన దండన ఉండటంతో, మానసికమైన దూరం బాగా ఎక్కువైపోయింది.  చిన్నోడా అనే పిలుపు అవమానానికి ప్రతీకగా భావించడం మొదలైంది.   
అసలు ఈ రోజుల్లో రెండు మూడు తరాలు గడిచే సరికి తమ బంధువులెవరో కూడా తెలియటం లేదు.  అటువంటిది, కొన్ని వేల తరాలకు పూర్వం మేమందరం అన్నదమ్ముల బిడ్డలం అని తెలుసుకొనడం సాధ్యమేనా? 
మనుస్మృతి కాలం నాటి ఆయా వర్ణధర్మాలను ఈ రోజుల్లో ఎవరు ఖచ్చితంగా పాటిస్తున్నారు గనుక?   అధ్యయనం (చదువు) అనేది మొదటి ముగ్గురన్నదమ్ముల బిడ్డలకు మాత్రమే చెప్పి తమ్ముని బిడ్డను వేలాది సంవత్సరాల అజ్ఞానపు దిగుడుబావిలో అట్టడుగున సొరంగంలో అంధకారంలో ఉంచడం తప్పుగాక మరేమిటి?  ఆ బ్రాహ్మణుల విద్యలు చాలా గొప్పవే -  సందేహం లేదు - కానీ, అనేక శారీరకశ్రమలకోర్చి అందరినీ సేవించుకొనే అంత్యజునికి ఆ విద్యలు ఎంతమాత్రం సుఖాన్ని కలిగించాయి?  పోనీ ఈ అగ్రజులైనా తాము వేలాది సంవత్సరాలుగా అంత్యజులకు చెప్పకుండా దాచుకున్న విద్యను తాము రక్షించుకోగలుగుతున్నారా?  వారు కూడా తమ విద్యలను నిర్దాక్షిణ్యంగా వదిలి పరదేశపు విద్యలకు ఎగబడుతున్నారే? 
ఇటువంటి కాలంలో కూడా తమ మీద అగ్రజుల పెత్తనం ఏమిటి అని తమ్ముళ్లు అనుకోరా?  సహజంగానే తమ్ముళ్ల పిల్లలకు  ఈ పెత్తనం నచ్చటం లేదు.  తిరుగుబాటు చేస్తున్నారు. 
1 అప్పట్లో పురాణాలలో కనబడే  బ్రాహ్మణక్షత్రియుల సంఘర్షణలైతే నేమి,
2 ఆ తరువాత సార్థవాహులపై దాడి చేసి దస్యులు దోచుకొనడమైతే ఏమిటి,
3 ఈరోజుల్లో మనుస్మృతి తగులబెట్టి, మాకు రిజర్వేషన్లు ఉండాలి, మాకు కూడా అధికారం కావాలి అనడం అయితే ఏమిటి,  ఇవన్నీ కూడా ఆ తిరుగుబాట్లలో భాగాలే.    
పైవాటిలో
మొదటి రకం తిరుగుబాట్లను "పురాణకథలుగా భావించి ఆహా" అని అనుకొనడం,
రెండవ రకం తిరుగుబాట్లను "ఓహో చరిత్ర ఇలా ఉండిందా" అని భావించడం,
మూడవ రకం తిరుగుబాట్లను "దేశద్రోహంగా, జాతిద్రోహంగా, సంస్కృతి పట్ల ద్రోహంగా   భావించడం" ఎంతవరకు సమంజసం?
"తమ పనిని తాము చేయలేకపోతే ఇతరుల పనులను చేయవచ్చును" అని మనుస్మృతిని వ్రాసుకున్న అగ్రజులు,  వేలాది తరాలుగా కట్టుబానిసల్లా తమకు సేవలు చేసిన  అంత్యజులు మేము ఇకపై ఇటువంటి పనులను చేయలేము అని చెబుతూ ఉంటే - "సరేలే తమ్ముళ్లూ" అంటూ వారిని అవమానించడం మానివేసి, వారికి కూడా ప్రేమాభిమానాలను పంచుతూ, ఆదరిస్తూ, చిరునవ్వుతో వారు చేయగలిగిన పనులను వారిని చేయనిస్తే ఎంత హాయిగా ఉంటుంది?  

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...