Showing posts with label Family. Show all posts
Showing posts with label Family. Show all posts

Wednesday, 19 December 2018

యాదవులంటే ఎవరు?



మహా కోపిష్టి అయిన దూర్వాసమహర్షి కూడా తాను పొందిన సేవలకు ఆనందించి "నాయనలారా ఏ వరం కావాలో కోరుకోండి" అని అడిగితే - "మహర్షీ! మా రాజ్యాధికారం శాశ్వతం కావాలని దీవించండి" అని నోరారా కమ్మని కోరికను కోరుకోవచ్చుగా ఆ కౌరవులు? అబ్బే! వాళ్లు అంతటి సౌజన్యవంతులైతే ఇక అంతటి మహాభారతం కొనసాగేదేనా? దురదృష్టవశాత్తు వాళ్లకు తాము బాగుపడటం కన్నా పక్కవాడు చెడిపోవటమే ఇష్టం.
అందుకనే "అడవిలో ఉన్న పాండవులు భోజనం ముగించిన తరువాత, వారి చెంతకు వెళ్లి ఆతిథ్యం కోరండి" అంటూ ఉసిగొలిపారు. ఆవేళకు సరైన ఆతిథ్యం ఇవ్వడం కష్టమని, దాంతో దుర్వాసుడు ఆగ్రహించి పాండవులను శపించేస్తాడని ఆ కౌరవులు తెలివిగా పన్నిన కుట్ర అది. ఆ పన్నాగం పారినట్లే అనిపించింది. పాండవులు నిజంగానే చిక్కుల్లో పడ్డారు. వారు మహాప్రతాపవంతులే. మహా మేధావులే. కాని, వారి ప్రతాపాలు తెలివితేటలు ఎందుకూ కొరగాని కాలం అలా వచ్చేసింది.
ఆ సమయంలో ధర్మపత్నీసమేతులైన పాండవులు మనసారా ధ్యానించింది ఒక యాదవుని. యాదవవంశశిరోమణి అయిన శ్రీకృష్ణుడు వారి సమస్యను చిటికెలో పరిష్కరించేశాడు.
ఇలా తమ స్వార్థం కొద్దీ ఎవరో ఎవర్నో మరెవరిమీదకో రెచ్చగొట్టి పంపే అల్పబుద్ధులు ఆకాలంలోనే కాదు, ఈకాలంలో కూడా ఉన్నారు. పేర్లు మారి ఉండవచ్చు గాని, ఆ కుళ్లుబుద్ధులు క్రూరబుద్ధులు మాత్రం సమసిపోలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాదవులు ఈ రోజుల్లో "మేము మా వంశం" అంటూ తొడగొట్టేవారికంటే ఎంతో ఘనమైన చరిత్ర కలిగినవారు.
సరే, శ్రీకృష్ణుడు కోరి కోరి ఎంచుకొని పుట్టిన యాదవవంశచరిత్ర పురాణాలప్రకారం - ఇదుగో -  ఇక్కడ - మిత్రులకోసం:

(ఈ క్రింది వ్యాసం మునుపు ఏసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

పురాణాలలో యాదవుల సంక్షిప్తఘనచరిత్ర  
రఘువంశం వారికి రాఘవులు అని ఏవిధంగా వ్యవహారమో, అదే విధంగా యదువంశం వారికి యాదవులు అని వ్యవహారం.
 యదువు తల్లి దేవయాని.  ఆమె మృతసంజీవనీవిద్య ను కనుగొన్న భృగువంశీయుడైన  శుక్రాచార్యుని కుమార్తె.  యదువు తండ్రి యయాతి.  ఆయన చంద్రవంశానికి చెందిన సుక్షత్రియుడు.  యదువు తాతగారు నహుషుడు.  ఆయన  దేవలోకంలో ఇంద్రపదవిని అధిష్ఠించిన ఘనచరిత్ర కలవాడు.  
 యదువు సోదరుడు అనువు.  అతని వంశంలో పుట్టినవాడే శిబి చక్రవర్తి.  ఒక పావురాన్ని గ్రద్దబారినుండి కాపాడేందుకు తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన మహాదాత.  అతని సంతానం బలి.   అతనికి ఆరుగురు పుత్రులు.  అంగుడు,  వంగుడు,  కళింగుడు,  సుహ్ముడు, పుండ్రుడు, ఆంధ్రుడు.  వారందరూ మహావీరులు.  తమతమ పేర్ల పేరిట భారతదేశం తూర్పు  ప్రాంతాలలో రాజ్యాలను ఏర్పరచుకున్నారు.  
 అంగరాజు పుత్రుడు రోమపాదమహారాజు.   అతడు రాముని తండ్రి అయిన దశరథమహారాజుకు మంచి మిత్రుడు.  దశరథుని కూతురైన శాంతను దత్తపుత్రికగా స్వీకరించి ఆమెను ఋష్యశృఙ్గ మహర్షికి ఇచ్చి వివాహం చేసినవాడు.  ఆ  ఋష్యశృఙ్గ మహర్షి పుత్రకామేష్టి చేయడంవలననే దశరథునికి రామలక్ష్మణభరతశత్రుఘ్నులు జన్మించారు.
 యయాతి తన రాజ్యంలో దక్షిణభాగానికి యదువును ప్రభువుగా చేశాడు.  ఆ యదువుకు సహస్రజిత్తు,  క్రోష్టుడు, నలుడు రిపుడు అని నలుగురు కొడుకులు.  ఈ నలుగురు, ఆ నలుగురి కొడుకులు, వారి మనుమలు, మునిమనుమలు, ఇలా వారి వంశంలోని తరతరాలన్నిటికీ యాదవులు అని పేరు.
 సరే, అందులో సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు.  అతని కుమారుడు హైహయుడు.  వీరందరూ ఆకాలంలో మహావీరులైన క్షత్రియులు.  హైహయవంశంలోనే కార్తవీర్యార్జునుడు జన్మించాడు.  అతడు దత్తాత్రేయుని భక్తుడు.  మహాయోగి.  మహాపండితుడు.  తరగని సంపద కలిగినవాడు.  అసంఖ్యాకమైన యజ్ఞయాగాదులను చేసి గొప్ప దానాలు చేసిన మహాదాత.  అంతేకాదు, తనపై పోరాటానికి దిగిన రావణాసురుని పట్టుకుని అతనిని పిల్లకోతిలా ఆడించిన మహాబలుడు.  అయితే అంతటి వాడు కూడా విధి వక్రించి జమదగ్నిమహర్షి ధేనువును ఆశించి దానిని బలవంతంగా లాక్కుని పోయాడు. దానితో పరశురాముడు ఆగ్రహించి కార్తవీర్యుని చంపేశాడు.  అప్పటినుండి అతని వంశం నామమాత్రావశిష్టం అయిపోయింది.  
 యదువు రెండవ కుమారుడు క్రోష్టుడు కదా - అతడు, అతని సంతానం తరతరాలుగా గొప్పగా రాజ్యాలనేలుతూ వచ్చారు.     వారిలో శశబిందు మహారాజు ఆరోజులలోనే విమానాలలో విహరించిన చరిత్ర కలవాడు.  సప్తద్వీపాధిపతిగా పేరుగాంచినవాడు.  ఆయన మునిమనుమలలో ఒకడు విదర్భుడు.  విదర్భుని మనుమలలో ఒకడైన చేది తన పేరుమీద ఒక రాజ్యాన్ని ఆరభించినవాడు. విదర్భుని మరొక కుమారుడైన క్రతుని మునిమునిమానులలో ఒకడు సాత్వతుడు.  అతని కుమారుడైన మహాభోజుని కుమారులందరూ భోజరాజులుగా పిలువబడ్డారు.  సాత్వతుని మరొక కుమారుడు వృష్ణి.  ఈ వృష్ణికి మునిమునిమనుమడు సాత్యకి.  ఇతడు మహాభారతంలోని అర్జునునికి శిష్యుడు.   వృష్ణికి మరొక కుమారుడైన యుధాజిత్తు వంశంలో కొన్ని తరాల తరువాతి వాడే మనకు వినాయకచవితి కథలో వినవచ్చే శ్యమంతకమణి సత్రాజిత్తు.  ఆయన కూతురే సత్యభామ.  
 సాత్వతుని మరొక కుమారుడు అంధకుడు.  ఆయనకు ఇద్దరు కుమారులు.  దేవకుడు, ఉగ్రసేనుడు.  దేవకుని కూతురే వసుదేవుని భార్య, భగవంతుని గర్భాన మోసి కన్న ధన్యురాలు దేవకి.  ఉగ్రసేనుని కుమారుడే మేనల్లుళ్ళను క్రూరంగా చంపదలచిన కంసుడు.  
 యుధాజిత్తు తన మనుమడికి తన తాతగారిపేరే పెట్టుకున్నాడు - వృష్ణి.  అతనికి చిత్రరథుడు అనే కుమారుడు.  అతని మనుమడు శూరుడు.  ఆ శూరునికి మారిష అనే భార్య.   వారి పుత్రుడే వసుదేవుడు.  దేవదేవుని కన్నతండ్రి.  వ్రేపల్లెలో గోపాలకుడైన నందునికి ప్రాణమిత్రుడు.  తన మిత్రుని భార్య అయిన యశోదకు జగన్మోహనమూర్తి అయిన తన కుమారుని పెంచే భాగ్యం కలిగించినవాడు.  
 ఆ వసుదేవునికి ఐదుగురు చెల్లెండ్రు.  అందులో ఒకరు పృథ.  ఆమెను కుంతిభోజుడు పెంచుకున్నాడు.  ఆమె స్వయంవరంలో పాండురాజును వరించింది.  వారి సంతానమే ధర్మరాజభీమార్జునులు.  పాండవులు.  రెండవ చెల్లెలు శ్రుతదేవి.  కరూషదేశాధిపతి  అయిన వృద్ధశర్మ ఆమె భర్త.  వారి కుమారుడే దంతవక్త్రుడు.  కృష్ణునితో విరోధించి హతమార్చబడ్డాడు.  మూడవచెల్లెలు శ్రుతకీర్తి.  ఆమె కేకయరాజైన ధృష్టకేతువును వివాహమాడి సంవర్ధనుడు మొదలైన మహావీరులను కన్నది.  నాల్గవచెల్లి రాజాధిదేవి.  ఆమె అవంతిమహారాజైన జయసేనుని వివాహమాడింది.  ఆమె కూతురు మిత్రవింద.  ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషులలో ఒకరు.  రాజాధిదేవి కుమారులు మహావీరులైన విందానువిందులు.  దురదృష్టవశాత్తు వారు కురుక్షేత్రంలో దుర్యోధనుని తరపున పోరాడవలసివచ్చింది.  
 దుర్యోధనుడు మొదలైన వారు పాండవులకు పెదనాన్న కొడుకులైతే, ఈ విందానువిందులు పినతల్లి కుమారులన్నమాట.  విధివశాత్తు వీరు యుద్ధంలో అర్జునుని చేతిలో మరణించారు.  వసుదేవుని ఐదవ చెల్లి శ్రుతశ్రవ.  ఆమె చేదిరాజైన  దమఘోషుని వివాహమాడింది.  వారి కుమారుడే శిశుపాలుడు.  కంసుడి మామ అయిన జరాసంధుడికి ఇతడు అనుంగు అనుచరుడిగా వ్యవహరించాడు.  రుక్మిణిని ఇతడిని ఇచ్చి చేద్దాం అనుకుంటే రుక్మిణికి అది ఇష్టం లేక శ్రీకృష్ణునికి రాయబారం పంపడం, శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి తెచ్చి పెండ్లి చేసుకొనడం తెలిసిందే.  మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం ఈ శిశుపాలుడు చేసిన నూరు తప్పులను సహించిన శ్రీకృష్ణుడు ధర్మజుని రాజసూయయాగం ముగింపుసభలో శిశుపాలుని అనుచితమైన ఔద్ధత్యాన్ని సహించలేక హతమార్చేశాడు.  
 ఈవిధంగా యదువంశంలో పుట్టడం వల్ల శ్రీకృష్ణుడు యాదవుడని, వృష్ణి వంశంలో పుట్టడం వల్ల వృష్ణివంశప్రదీపకుడని, వార్ష్ణేయుడని, శూరుని మనుమడు కావడంవల్ల శౌరి అని పిలవబడ్డాడు.  
 తన చెల్లెలు సుభద్రను తన ప్రియమిత్రుడు, మేనత్తకొడుకు అయిన అర్జునునికి ఇచ్చి పెళ్లి చేశాడు.  తన అల్లుడైన కంసుని చంపాడనే కోపంతో జరాసంధుడు పదే పదే మధురమీదకు దండయాత్రకు వస్తూంటే సముద్రమధ్యంలో ద్వారక అనే జలదుర్గాన్ని నిర్మింపజేసి యాదవులను కాపాడాడు.  భీముని చేత ఆ జరాసంధుని చంపించేశాడు.  
 కలియుగంలో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడబోయే జనాలకు భగవద్గీత అనే జ్ఞానదీపాన్ని వెలిగించాడు.  భూభారాన్ని తగ్గించేందుకే అవతరించిన మహానుభావుడు కాబట్టి కురుక్షేత్రయుద్ధం జరిపించి ధర్మానికి పట్టాభిషేకం చేశాడు.  యుద్ధం ముగిసిన తరువాత  మదోన్మత్తులైన తన యాదవులను గమనించి వారి సంఖ్యను కూడా తగ్గించాలని భావించాడు.  
 ఫలితంగా మునుల శాపం.  యాదవులలో ముసలం జన్మించింది. పరస్పరకలహాలతో యాదవులు నశించారు.  శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు.  ఆ పిమ్మటనే కలియుగం ప్రారంభం అయింది.  పాండవులు హస్తినాపురానికి తమ మనుమడైన పరీక్షిత్తును, ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణుని మనుమడైన యాదవవంశాంకురం అయిన వజ్రుడిని రాజులుగా అభిషేకించి తమ మహాప్రస్థానాన్ని ప్రారంభించారు.  
 ఇంతటి ఘనచరిత్ర కలిగిన యాదవులు ఇప్పటికీ భారతదేశంలో తమదైన ప్రాముఖ్యతను చాటుకుంటూ చిరంజీవులై ఉన్నారు.  

Monday, 17 December 2018

వాళ్లు కూడా భారతీయులే

"పలువిద్య లెన్ని నేర్చిన కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!"
అనే మాటను ఇంకా పట్టుకుని నిష్ఠగా పాటించే వారు ఉన్నారా?
అనంతపురంలో ఒక మిత్రుడు తన యువమిత్రుని ఒకరిని నాకు పరిచయం చేశాడు. ఆ యువకుడు ఫేస్ బుక్ లో కూడా ఉండేవాడు. మాంచి హుషారైనవాడు. తన వయసుకు తగిన పోస్టులు పెట్టుకుంటూ సందడి సందడి చేస్తూ ఉండేవాడు.
అయితే గత రెండు మాసాలుగా ఫేస్బుక్ లో లేకుండా అదృశ్యమై పోయాడు. ఏమయ్యాడు అని అతని గూర్చి మా మిత్రుని అడిగితే -

"అతడు పెద్దగా చదువుకున్నది లేదు,  అతనికి అతని వృత్తివిద్య ఒకటే వచ్చేది.  దాన్ని చేసుకుంటూ వయసులో చిన్నవాడైనా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ కాలం గడిపేస్తూ ఉండేవాడు.   కానీ, అతని పని కాస్త మోడీ గారి డీమానిటైజేషన్ సంస్కరణతో ఒడిదుడుకులకు లోనైంది. అందువల్ల ఎలా సంపాదించుకోవాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అనే చింతలో ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాడు పాపం!"  అని విచారం వ్యక్తం చేశాడు.
ఈకాలంలో కూడా వృత్తివిద్యను మాత్రమే మనసా వాచా కర్మణా నమ్ముకొని మరొకదాని జోలికి వెళ్లని వారు కూడా ఉన్నారా అని నాకు ఆశ్చర్యం వేసింది.
పరిశ్రమలు వచ్చి గ్రామీణ కులవిద్యలను చిన్నాభిన్నం చేసేశాయి.

మనకు నేతవాడు అక్కరలేదు,
డిగ్ జామ్, బాంబే డయింగ్, రేమాండ్ కంపెనీల బట్టలు దొరుకుతున్నాయి.
మనకు కంసాలివాడు అక్కరలేదు,
కళ్యాణ్, తనిష్క్, జోయాలుక్కాస్, కంపెనీల నగలు దొరుకుతున్నాయి.
మనం పశువులనే పోషించం, కాబట్టి గొల్లవాడు అక్కరలేదు.
వీధి వీధిలోనూ హెరిటేజ్ పాలు దొరుకుతున్నాయి.
మనకు చెప్పులు కుట్టేవాడు కూడా అక్కరలేదు,
బాటలు, ఆదిదాసులు, రీబాకులు, నైకులు పిలిచి కాళ్ళొత్తుతున్నాయి.
అసలెవరూ అక్కర్లేదు.
రెడీమేడ్ ప్రపంచం మనలను ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది!

మరెవరు కావాలి?
పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారుడు కావాలి.
వాళ్ళ దగ్గర జీతం తీసుకుని పనిచేసి పెట్టే పెద్ద పాలేరులం మనమే కావాలి.

సరే, అలాగే.
కానీ,
ఆ నేతగాడు, కంసాలి, గొల్లవాడు, చెప్పులు కుట్టేవాడు - ఇలాంటి వృత్తివిద్యలను నమ్ముకున్నవాళ్ళు పొట్టమాడ్చుకుని అలాగే చావాలా?

వేలాది సంవత్సరాలుగా ఆయా కులవిద్యలు తప్ప మరొకటి తెలియని వారు హఠాత్తుగా మరొక భాషలో చదువులను నేర్చుకొనడం ఎంత కష్టం? మాకు కూడా పైకి ఎదిగేందుకు అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చేందుకు ఎందుకు మనం మనసు కష్టపెట్టుకోవాలి ?

పుట్టి ఎదుగుతున్న మన ఇంటి శిశువు మనంత తెలివిగా ప్రవర్తించలేడు. మనంత హుషారుగా ప్రపంచంలో జొరబడి పనులు చేసుకురాలేడు. వెచ్చాల అంగడికి ఒక్కడే పోయి ఒక వస్తువును తీసుకువస్తే వాడు మోసపోయాడా లేక చిల్లర సరిగా తీసుకువచ్చాడా అని పదే పదే చూస్తూ, హెచ్చరిస్తూ, వాడు ఎదిగేందుకు తోడ్పడుతూ, స్వతంత్రంగా వ్యవహరించే వయసు వచ్చే వరకు అనుక్షణం రక్షిస్తూ ఉంటాం.

ఆపద్ధర్మాలు అందరికీ ఉన్నాయని మనువు చెప్పాడు. మరి, ఎంతో ప్రేమతో, మమకారంతో, తరతరాలుగా తాము గొప్ప నైపుణ్యం గడించిన వృత్తివిద్యలను శాశ్వతంగా కోల్పోయి, కూటికి ఉపయోగపడే క్రొత్తవిద్యలను అభ్యసించేందుకు, బ్రతికేందుకు తాపత్రయపడుతూ, తప్పటడుగులు వేస్తున్న చిన్ని శిశువులవంటి మనుషులను మనం ప్రేమాభిమానాలతో ఆదరించాలి కదా? ప్రోత్సహించాలి కదా? వారందరూ మన ఇంటివారు కాదేమో అని ఎవరికీ సందేహం వద్దు.

మానవులందరూ ఒక తల్లి నుండి పుట్టినవారేనని మనమందరం ఆరాధించే రామాయణమే స్వయంగా చెబుతోంది. 

)))(((

(నేను వ్రాసిన ఈ క్రింది వ్యాసం మునుపు ఆసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

మనుస్మృతిని తగలబెడతాం అని కొందరు అంటారు. 
అయ్యయ్యో ఏమిటీ ఘోరకలి అని నెత్తీనోర్లు బాదుకుంటారు మరికొందరు. 
 భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తాం కదా?  మరి సహోదరుల నడుమ ఈ గొడవలేమిటి?  భారతీయులలో కనిపించే కులమే దీనికి కారణం అంటారు అందరూ.  ఈ కులాల వారు ఈ పనులే చేయాలి, ఆ కులాల వారు ఆ పనులే చేయాలి అని మనుస్మృతిలో చెప్పబడింది.  సరే, ఈ రోజుల్లో ఆయా పనులను వారు మాత్రమే చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు.    నాలుగు వర్ణాలు ఉన్నాయట.  (వాటినే కులాలుగా అందరూ అనుకుంటున్నారు.  ఆయా వర్ణాలలో లెక్క లేనన్ని శాఖోపశాఖలు ఉన్నప్పటికీ) 
అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా.
దానం ప్రతిగ్రహశ్చైవ షట్కర్మాణ్యగ్రజన్మనః   (మనుస్మృతి 10.75)
చదువు చెప్పడం, చదువుకొనడం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం చేయడం, దానం స్వీకరించడం –
ఈ ఆరు పనులు బ్రాహ్మణుల ధర్మాలు అన్నారు.
కానీ, భృగువంశపు బ్రాహ్మణుడైన పరశురాముడు ఆయుధం పట్టి క్షత్రియజాతిని నామావశిష్టం చేసేశాడు.  ఆ పాపం పోగొట్టుకొనడం కోసం ఘోరమైన తపస్సు  చేశాడు.
బ్రహ్మగారి మునిమనుమడు, పులస్త్యవంశపు  బ్రాహ్మణుడైన రావణుడు ఆయుధాలు ధరించి లోకాలన్నింటినీ పీడించి పీడించి పెట్టాడు.  ఆయనను దుష్టశిక్షణలో భాగంగా రాముడు హతమార్చాడు.  చివరకు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకునేందుకు శివలింగప్రతిష్ఠను గావించాడంటారు.
ఈ విధంగా బ్రాహ్మణులు స్వధర్మం వదిలి పెట్టి యుద్ధాలు చేబట్టడం తప్పు  కదా? 
ఏదైనా కారణం చేత ఆ ఆరు పనులు చేయలేకపోతే పరిస్థితి ఏమిటి? 
అందుకని ముందుగానే ఆ పరిస్థితులను ఊహించి ఆపద్ధర్మాలు వచ్చాయి.
జీవేత్ క్షత్రియధర్మేణ స హ్యస్య ప్రత్యనన్తరః (10.81)
"అలా అయితే బ్రాహ్మణులు క్షత్రియధర్మాన్ని (ఆయుధాలను ధరించి ప్రజారక్షణ చేయడం) అనుసరించి జీవించవచ్చు" అన్నారు.
భారతంలో ద్రోణుడు, అశ్వత్థామ ఇలాగే జీవించినవారు.  కానీ, వారు మహా తేజస్వులు, ధీరసత్త్వులు.  అందరికీ వారిలా జీవించడం చేతకాదు కదా?   మరి క్షత్రియుల పని కూడా అందరికీ చేతగాకపోతే?
ఉభాభ్యామప్యజీవంస్తు కథం స్యాదితి చేద్భవేత్
కృషిగోరక్షమాస్థాయ జీవేద్వైశ్యస్య జీవికామ్. (10.82)
"అటు బ్రాహ్మణుల పనిని గాని, ఇటు క్షత్రియుల పనిని గాని చేయలేకపోతే వ్యవసాయం చేసుకోవచ్చు,  గోరక్షణ చేసుకుంటూ ఉండవచ్చు.  వైశ్యుడిలా బ్రతకవచ్చు"  అన్నారు.
సద్యః పతతి మాంసేన లాక్షయా లవణేన చ
త్ర్యహేణ శూద్రో భవతి బ్రాహ్మణః క్షీరవిక్రయాత్. (10.92)
బ్రాహ్మణుడు మాంసాన్ని కానీ, లక్కను కానీ, ఉప్పునుగాని అమ్మితే వెంటనే శూద్రుడు అవుతాడు, పాల అమ్మకం మొదలు పెడితే కేవలం మూడంటే మూడురోజులలోనే ఆ బ్రాహ్మణుడు కాస్త శూద్రుడు అయిపోతాడు అన్నారు. 
ఈ క్రమాన్ని చూస్తుంటే చతుర్వర్ణాల ఆవిర్భావం ఎలా జరిగిందో అర్థం అవుతున్నట్టు లేదూ?  బ్రాహ్మణుడిని ముఖంగా, క్షత్రియుడిని భుజాలుగా, వైశ్యుని ఊరువులుగా, శూద్రుని పాదాలుగా కలిగిన సమాజమనే పురుషస్వరూపం గోచరించటం లేదా?  ఒకే వ్యక్తి సంతానం చిన్నా పెద్దా  తమకు చేతనైన పనులను చేస్తూ క్రమంగా,  బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా విస్తరించినట్లు, ఒక Clue దొరికినట్లు లేదూ?  
వాల్మీకి రామాయణం - అరణ్యకాండం, పద్నాల్గవ సర్గ చదివితే - దక్షప్రజాపతి కూతురైన మనువును కాశ్యపమహర్షి వివాహం ఆడారని,  ఆ మనుసంతానమే - క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని స్పష్టంగా ఉంది.  (అరణ్యకాండం, 14.29)  ఆ మనువు సంతానపరంపరనే మనం మానవులు అంటున్నాం.   బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు ఎవరైనా అందరూ మానవులే -
ఈ లెక్కన అగ్రకులం అంటే తల్లిదండ్రులకు ముందుగా పుట్టిన బిడ్డ యొక్క సంతానం, వారి పరంపర అన్నమాట.  (అగ్ర అంటే మొదట అని అర్థం.)  నిమ్నకులాలు అంటే సంతానక్రమంలో క్రిందుగా (తరువాత) పుట్టిన బిడ్డల సంతానం అన్నమాట. 
అంటే అందరికంటే ముందుగా పుట్టిన బ్రాహ్మణుని సంతానం అందరికీ అగ్రజులు.  అలాగే - రెండవ సంతానమైన క్షత్రియుడు బ్రాహ్మణుడికి నిమ్నకులం వాడు, తన తరువాత పుట్టిన వైశ్యునికి అగ్రకులం వాడు.  అలాగే వైశ్యుడు తన ముందుపుట్టిన బ్రాహ్మణ క్షత్రియులకు నిమ్నకులం వాడు, తన తరువాత పుట్టిన శూద్రునికి అగ్రకులం వాడు.  అందరికంటే చివరగా పుట్టిన శూద్రుడు అంత్యజుడు.  ఈ రోజుల్లో పెద్దవాణ్ణి అన్నా అని, పెద్దోడా అని, చిన్న వాడిని తమ్ముడూ అని, ఒరే చిన్నోడా అని అందరూ పిలుస్తున్నట్లే  అప్పట్లో అగ్రజా అనడం, అంత్యజా అనడం సహజం అయి ఉంటుంది. 
కాబట్టి ఈ నలుగురూ పూర్వకాలంలో ఒకే తల్లిదండ్రుల బిడ్డలైన సహోదరులు!  వీరు కాక పంచములనబడే ఐదవ జాతి లేదు గాక లేదు అని మనుస్మృతి స్పష్టంగా చెబుతోంది.   (నాస్తి తు పంచమః  10.5)
మొదటి సంతానానికే రాజ్యాన్ని, పెత్తనాన్ని అప్పగించే సంస్కృతి, చిన్నవారిని వివిధ పనులకు పురమాయించే పధ్ధతి, ఇప్పటికీ భారతీయ గృహాల్లో సహజమే  కదా!  
కానీ క్రమంగా తరాలు గడుస్తున్నా కొద్దీ అన్నల పిల్లలు తమ్ముళ్ల  పిల్లల మీద పెత్తనం చెలాయించడం తమ హక్కులా భావించడం మొదలైంది.  పైగా చదువుకున్న అన్న తప్పు చేసినా శిక్ష స్వల్పంగా ఉండటం, చదువుకోకుండా గొడ్డు చాకిరీ చేస్తున్న తమ్ముడు ఎపుడైనా అన్న నిర్దాక్షిణ్యంగా చేయిస్తున్న  శ్రమపురితమైన పనికి తట్టుకోలేక  కోపమొచ్చి కేకలేసినా వాడికి కఠినమైన దండన ఉండటంతో, మానసికమైన దూరం బాగా ఎక్కువైపోయింది.  చిన్నోడా అనే పిలుపు అవమానానికి ప్రతీకగా భావించడం మొదలైంది.   
అసలు ఈ రోజుల్లో రెండు మూడు తరాలు గడిచే సరికి తమ బంధువులెవరో కూడా తెలియటం లేదు.  అటువంటిది, కొన్ని వేల తరాలకు పూర్వం మేమందరం అన్నదమ్ముల బిడ్డలం అని తెలుసుకొనడం సాధ్యమేనా? 
మనుస్మృతి కాలం నాటి ఆయా వర్ణధర్మాలను ఈ రోజుల్లో ఎవరు ఖచ్చితంగా పాటిస్తున్నారు గనుక?   అధ్యయనం (చదువు) అనేది మొదటి ముగ్గురన్నదమ్ముల బిడ్డలకు మాత్రమే చెప్పి తమ్ముని బిడ్డను వేలాది సంవత్సరాల అజ్ఞానపు దిగుడుబావిలో అట్టడుగున సొరంగంలో అంధకారంలో ఉంచడం తప్పుగాక మరేమిటి?  ఆ బ్రాహ్మణుల విద్యలు చాలా గొప్పవే -  సందేహం లేదు - కానీ, అనేక శారీరకశ్రమలకోర్చి అందరినీ సేవించుకొనే అంత్యజునికి ఆ విద్యలు ఎంతమాత్రం సుఖాన్ని కలిగించాయి?  పోనీ ఈ అగ్రజులైనా తాము వేలాది సంవత్సరాలుగా అంత్యజులకు చెప్పకుండా దాచుకున్న విద్యను తాము రక్షించుకోగలుగుతున్నారా?  వారు కూడా తమ విద్యలను నిర్దాక్షిణ్యంగా వదిలి పరదేశపు విద్యలకు ఎగబడుతున్నారే? 
ఇటువంటి కాలంలో కూడా తమ మీద అగ్రజుల పెత్తనం ఏమిటి అని తమ్ముళ్లు అనుకోరా?  సహజంగానే తమ్ముళ్ల పిల్లలకు  ఈ పెత్తనం నచ్చటం లేదు.  తిరుగుబాటు చేస్తున్నారు. 
1 అప్పట్లో పురాణాలలో కనబడే  బ్రాహ్మణక్షత్రియుల సంఘర్షణలైతే నేమి,
2 ఆ తరువాత సార్థవాహులపై దాడి చేసి దస్యులు దోచుకొనడమైతే ఏమిటి,
3 ఈరోజుల్లో మనుస్మృతి తగులబెట్టి, మాకు రిజర్వేషన్లు ఉండాలి, మాకు కూడా అధికారం కావాలి అనడం అయితే ఏమిటి,  ఇవన్నీ కూడా ఆ తిరుగుబాట్లలో భాగాలే.    
పైవాటిలో
మొదటి రకం తిరుగుబాట్లను "పురాణకథలుగా భావించి ఆహా" అని అనుకొనడం,
రెండవ రకం తిరుగుబాట్లను "ఓహో చరిత్ర ఇలా ఉండిందా" అని భావించడం,
మూడవ రకం తిరుగుబాట్లను "దేశద్రోహంగా, జాతిద్రోహంగా, సంస్కృతి పట్ల ద్రోహంగా   భావించడం" ఎంతవరకు సమంజసం?
"తమ పనిని తాము చేయలేకపోతే ఇతరుల పనులను చేయవచ్చును" అని మనుస్మృతిని వ్రాసుకున్న అగ్రజులు,  వేలాది తరాలుగా కట్టుబానిసల్లా తమకు సేవలు చేసిన  అంత్యజులు మేము ఇకపై ఇటువంటి పనులను చేయలేము అని చెబుతూ ఉంటే - "సరేలే తమ్ముళ్లూ" అంటూ వారిని అవమానించడం మానివేసి, వారికి కూడా ప్రేమాభిమానాలను పంచుతూ, ఆదరిస్తూ, చిరునవ్వుతో వారు చేయగలిగిన పనులను వారిని చేయనిస్తే ఎంత హాయిగా ఉంటుంది?  

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...