Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Thursday, 14 February 2019

కాశ్మీరం కోసం ఆర్టికల్ 370 ని రద్దు చేయాలి.

పాక్ ప్రభుత్వానికి ఉగ్రవాదమూకలపై అదుపు లేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. పాక్ ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఉగ్రవాదం తగ్గుతుందనుకొనడం మన భ్రమ. అనేకానేక భారతప్రభుత్వాలు చాల చొరవ చేశాయి. కాని, అది తగ్గినట్టు ఎక్కడా జాడ లేదు.

బలవంతుడు తనకంటె బలవంతుడికే భయపడతాడు. అమెరికా లాడెన్‌ను హతం చేసి తన ఆధిపత్యాన్ని చాటడం ఒక ఉదాహరణ మాత్రమే.

వారు కాశ్మీరం పాకిస్తాన్ కు చెందాలని కోరుతున్నారు. వారితో చర్చలు చేస్తే వారు అడిగేది అదే. అది మనం ఇచ్చే సమస్య లేదు, వారు ఉగ్రవాదం ఆపేది లేదు.

కాబట్టి, వారి ఉగ్రవాదాన్ని ఆపేందుకు ప్రయత్నించవలసింది మనమే. నిజమే, కాని, ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించడానికి మనకు తగినంత అనుకూలంగా లేవు.

పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది పాకిస్తాన్ ప్రజలే అయినా, అంతటితో వారి ప్రమేయం ముగిసిపోతుంది. అక్కడ ప్రధానమంత్రి పేరుకు మాత్రమే ప్రభుత్వాధినేత. భారత్‌లో నిన్న పులవామాలో జరిగిన సంఘటనకు మమ్మల్ని తప్పు పట్టవద్దు, అని భుజాలు తడుముకుంటూ వారి విదేశాంగశాఖ తక్షణమే ఒక లేఖను జారీ చేసింది కూడా.

ఈవిధంగా భారత్ లో ఉగ్రవాదం మేము చేస్తున్న పని కాదు, మామీద యుద్ధమేమిటి అని పాకిస్తాన్ వాళ్లు అంతర్జాతీయస్థాయిలో గొంతు ఎత్తుతారు. అచ్చం, ఇపుడు చంద్రబాబు తన అవినీతిని, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఢిల్లీకి పోయి అరుస్తున్నట్లుగా.

అందరూ ఉగ్రవాదాన్ని ఒక ఫార్మాలిటీ కోసం అంతర్జాతీయంగా ఖండించేవారే కాని, యుద్ధం అంటూ వస్తే, మనకు సంపూర్ణసహకారం అందించే వారు ఎవరో ఎందరో అనేది సందేహాస్పదం. అందువల్ల, మనం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, చిరకాలం పాటు మన సామాజిక ఆర్థిక పరిస్థితులను ఛిన్నాభిన్నం చేసే ప్రత్యక్షయుద్ధం కంటె మరొక వ్యూహాన్ని అమలు పరచవలసిన అవసరం ఉంది.

భారతీయులు ఎప్పటినుండో కోరుతున్నట్టు, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి, భారతదేశంలోని మిగిలిన ఏ రాష్ట్రంలోనైనా మనకు స్వేచ్ఛగా నివసించే హక్కు ఉన్నట్టు కాశ్మీర్‌లో కూడా నివసించే హక్కు, అక్కడ భూమిని, ఇతర స్థిరాస్తులను కొనే హక్కు, అక్కడ శాశ్వతనివాసం ఏర్పరచుకునే హక్కు భారతీయులందరికీ కల్పించాలి. అందుకు బలమైన ఏర్పాట్లు చేయాలి.

అప్పుడు కాశ్మీరు నాయకులు తిరుగుబాటు చేస్తారు. వారిని నిర్బంధించవలసి రావచ్చు. అల్లర్లు రేగుతాయి. ప్రారంభంలో ఉగ్రవాదం మరింత తీవ్రతను సంతరించుకున్నట్టు కనిపిస్తుందేమో కూడా. ప్రభుత్వం వాటిని తీవ్రంగా అణచివేయాలి. అంతర్జాతీయమైన వత్తిడులు వస్తాయి. కాని, భారత్ కు సంబంధించి, ఇది తమ అంతర్గతమైన సమస్య. వివిధరాష్ట్రాలనుండి భారతీయులు కాశ్మీరానికి వెళ్లి స్థిరపడుతున్నకొద్దీ క్రమంగా శాంతిభద్రతలు చేకూరుతాయి. దీనికి దీర్ఘకాలం పట్టవచ్చు గాక. కాని, ఇంతకు మించిన పరిష్కారం లేదు.

1989 లో తియానన్మెన్ స్క్వేర్ లో చైనా ప్రభుత్వం తన స్వంత పౌరులపై దాడి చేసి 10000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నది. అప్పుడు అంతర్జాతీయంగా రేగిన గగ్గోలు అసామాన్యమైనది. కాని, చైనా ప్రభుత్వం ఎవ్వరినీ లెక్క చేయలేదు.

భారతప్రభుత్వం తీవ్రవాదుల మీద అంతటి తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్పు ఏమీ లేదు. ప్రభుత్వం పిరికిది కాకుంటే తక్షణమే ఇటువంటి పనిని చేసి తీరాలి.

ఒక ప్రాంతంలో తమ జనాభాను బాగా పెంచుకొనడం, తరువాత ఆ ప్రాంతం తమదే అనడం, తమకు అచ్చంగా ఇచ్చేయాలి అనడం ఆ ఉగ్రవాదుల దీర్ఘకాలికవ్యూహం. అందువల్ల ముల్లును ముల్లుతోనే తీయాలి అనే వ్యూహం అనుసరిస్తూ, ఆర్టికిల్ 370 ని రద్దు చేయడం ఒక బలమైన చర్య.

కాశ్మీరచరిత్ర రాజకీయంగానూ, సాహిత్యరంగంలోనూ, కళారంగంలోనూ అవినాభావంగా భారతీయసంస్కృతితో ముడిపడి ఉంది. దానిని సమగ్రభారతంలో ప్రచారం చేయాలి. గత వంద ఏళ్లుగా జరుగుతున్నది మాత్రమే అసలైన కాశ్మీరచరిత్ర అయినట్టు, అంతకు ముందు కాశ్మీర్‌కు ఒక అస్తిత్వమనేదే లేనట్టు కుహనాచరిత్రకారులు చిత్రీకరిస్తూ ఉండడాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అక్కడ అశాంతికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వపు రహస్యచర్యలే అనేది అందరికీ స్పష్టంగా అవగాహన కలిగేలా చక్కని ప్రచారం చేయాలి.

దాదాపు భారతభూభాగం మొత్తం తమదే అన్నట్టుగా, భారతీయులు తమను అన్యాయం చేసి ఏదో కొంతభాగం మాత్రమే తమకు ఇస్తున్నట్టుగా పాకిస్తాన్‌లో విద్యార్థులకు చిత్రపటాలు వేసి మరీ నూరి పోస్తున్నారు.

మనం మాత్రం కనీసం కాశ్మీరు కూడా మనదే అని గట్టిగా చెప్పకుండా చర్చలు చర్చలు అంటూ శతాబ్దాలతరబడి ఆ సూత్రాన్ని తెంచేయకుండా ఆలస్యం చేస్తూ ఉంటే, మన తరువాత తరాల మన వారసులకు కూడా కాశ్మీరం మనది కాదేమో అని సందేహం కలిగి తీరుతుంది.

బలవంతుడు బలవంతుని గౌరవిస్తాడు. మూర్ఖుడు భయపడతాడు. ఉగ్రవాదులు మూర్ఖులు. తనకు ఎక్కడో జన్నత్ లో ఏదో లభిస్తుందని ఇక్కడ నరకం సృష్టించడం మూర్ఖత్వం మాత్రమే.

{2019/ఫిబ్రవరి/14 నాడు కాశ్మీరంలోని పులవామాలో భారతసైనిక పటాలంపై ఒక మతమౌఢ్యపు ఆత్మాహుతికారుడు దాడి చేసి 44 మంది భారతవీరజవానుల మృతికి కారకుడైనాడు.} 

Wednesday, 19 December 2018

యాదవులంటే ఎవరు?



మహా కోపిష్టి అయిన దూర్వాసమహర్షి కూడా తాను పొందిన సేవలకు ఆనందించి "నాయనలారా ఏ వరం కావాలో కోరుకోండి" అని అడిగితే - "మహర్షీ! మా రాజ్యాధికారం శాశ్వతం కావాలని దీవించండి" అని నోరారా కమ్మని కోరికను కోరుకోవచ్చుగా ఆ కౌరవులు? అబ్బే! వాళ్లు అంతటి సౌజన్యవంతులైతే ఇక అంతటి మహాభారతం కొనసాగేదేనా? దురదృష్టవశాత్తు వాళ్లకు తాము బాగుపడటం కన్నా పక్కవాడు చెడిపోవటమే ఇష్టం.
అందుకనే "అడవిలో ఉన్న పాండవులు భోజనం ముగించిన తరువాత, వారి చెంతకు వెళ్లి ఆతిథ్యం కోరండి" అంటూ ఉసిగొలిపారు. ఆవేళకు సరైన ఆతిథ్యం ఇవ్వడం కష్టమని, దాంతో దుర్వాసుడు ఆగ్రహించి పాండవులను శపించేస్తాడని ఆ కౌరవులు తెలివిగా పన్నిన కుట్ర అది. ఆ పన్నాగం పారినట్లే అనిపించింది. పాండవులు నిజంగానే చిక్కుల్లో పడ్డారు. వారు మహాప్రతాపవంతులే. మహా మేధావులే. కాని, వారి ప్రతాపాలు తెలివితేటలు ఎందుకూ కొరగాని కాలం అలా వచ్చేసింది.
ఆ సమయంలో ధర్మపత్నీసమేతులైన పాండవులు మనసారా ధ్యానించింది ఒక యాదవుని. యాదవవంశశిరోమణి అయిన శ్రీకృష్ణుడు వారి సమస్యను చిటికెలో పరిష్కరించేశాడు.
ఇలా తమ స్వార్థం కొద్దీ ఎవరో ఎవర్నో మరెవరిమీదకో రెచ్చగొట్టి పంపే అల్పబుద్ధులు ఆకాలంలోనే కాదు, ఈకాలంలో కూడా ఉన్నారు. పేర్లు మారి ఉండవచ్చు గాని, ఆ కుళ్లుబుద్ధులు క్రూరబుద్ధులు మాత్రం సమసిపోలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాదవులు ఈ రోజుల్లో "మేము మా వంశం" అంటూ తొడగొట్టేవారికంటే ఎంతో ఘనమైన చరిత్ర కలిగినవారు.
సరే, శ్రీకృష్ణుడు కోరి కోరి ఎంచుకొని పుట్టిన యాదవవంశచరిత్ర పురాణాలప్రకారం - ఇదుగో -  ఇక్కడ - మిత్రులకోసం:

(ఈ క్రింది వ్యాసం మునుపు ఏసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

పురాణాలలో యాదవుల సంక్షిప్తఘనచరిత్ర  
రఘువంశం వారికి రాఘవులు అని ఏవిధంగా వ్యవహారమో, అదే విధంగా యదువంశం వారికి యాదవులు అని వ్యవహారం.
 యదువు తల్లి దేవయాని.  ఆమె మృతసంజీవనీవిద్య ను కనుగొన్న భృగువంశీయుడైన  శుక్రాచార్యుని కుమార్తె.  యదువు తండ్రి యయాతి.  ఆయన చంద్రవంశానికి చెందిన సుక్షత్రియుడు.  యదువు తాతగారు నహుషుడు.  ఆయన  దేవలోకంలో ఇంద్రపదవిని అధిష్ఠించిన ఘనచరిత్ర కలవాడు.  
 యదువు సోదరుడు అనువు.  అతని వంశంలో పుట్టినవాడే శిబి చక్రవర్తి.  ఒక పావురాన్ని గ్రద్దబారినుండి కాపాడేందుకు తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన మహాదాత.  అతని సంతానం బలి.   అతనికి ఆరుగురు పుత్రులు.  అంగుడు,  వంగుడు,  కళింగుడు,  సుహ్ముడు, పుండ్రుడు, ఆంధ్రుడు.  వారందరూ మహావీరులు.  తమతమ పేర్ల పేరిట భారతదేశం తూర్పు  ప్రాంతాలలో రాజ్యాలను ఏర్పరచుకున్నారు.  
 అంగరాజు పుత్రుడు రోమపాదమహారాజు.   అతడు రాముని తండ్రి అయిన దశరథమహారాజుకు మంచి మిత్రుడు.  దశరథుని కూతురైన శాంతను దత్తపుత్రికగా స్వీకరించి ఆమెను ఋష్యశృఙ్గ మహర్షికి ఇచ్చి వివాహం చేసినవాడు.  ఆ  ఋష్యశృఙ్గ మహర్షి పుత్రకామేష్టి చేయడంవలననే దశరథునికి రామలక్ష్మణభరతశత్రుఘ్నులు జన్మించారు.
 యయాతి తన రాజ్యంలో దక్షిణభాగానికి యదువును ప్రభువుగా చేశాడు.  ఆ యదువుకు సహస్రజిత్తు,  క్రోష్టుడు, నలుడు రిపుడు అని నలుగురు కొడుకులు.  ఈ నలుగురు, ఆ నలుగురి కొడుకులు, వారి మనుమలు, మునిమనుమలు, ఇలా వారి వంశంలోని తరతరాలన్నిటికీ యాదవులు అని పేరు.
 సరే, అందులో సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు.  అతని కుమారుడు హైహయుడు.  వీరందరూ ఆకాలంలో మహావీరులైన క్షత్రియులు.  హైహయవంశంలోనే కార్తవీర్యార్జునుడు జన్మించాడు.  అతడు దత్తాత్రేయుని భక్తుడు.  మహాయోగి.  మహాపండితుడు.  తరగని సంపద కలిగినవాడు.  అసంఖ్యాకమైన యజ్ఞయాగాదులను చేసి గొప్ప దానాలు చేసిన మహాదాత.  అంతేకాదు, తనపై పోరాటానికి దిగిన రావణాసురుని పట్టుకుని అతనిని పిల్లకోతిలా ఆడించిన మహాబలుడు.  అయితే అంతటి వాడు కూడా విధి వక్రించి జమదగ్నిమహర్షి ధేనువును ఆశించి దానిని బలవంతంగా లాక్కుని పోయాడు. దానితో పరశురాముడు ఆగ్రహించి కార్తవీర్యుని చంపేశాడు.  అప్పటినుండి అతని వంశం నామమాత్రావశిష్టం అయిపోయింది.  
 యదువు రెండవ కుమారుడు క్రోష్టుడు కదా - అతడు, అతని సంతానం తరతరాలుగా గొప్పగా రాజ్యాలనేలుతూ వచ్చారు.     వారిలో శశబిందు మహారాజు ఆరోజులలోనే విమానాలలో విహరించిన చరిత్ర కలవాడు.  సప్తద్వీపాధిపతిగా పేరుగాంచినవాడు.  ఆయన మునిమనుమలలో ఒకడు విదర్భుడు.  విదర్భుని మనుమలలో ఒకడైన చేది తన పేరుమీద ఒక రాజ్యాన్ని ఆరభించినవాడు. విదర్భుని మరొక కుమారుడైన క్రతుని మునిమునిమానులలో ఒకడు సాత్వతుడు.  అతని కుమారుడైన మహాభోజుని కుమారులందరూ భోజరాజులుగా పిలువబడ్డారు.  సాత్వతుని మరొక కుమారుడు వృష్ణి.  ఈ వృష్ణికి మునిమునిమనుమడు సాత్యకి.  ఇతడు మహాభారతంలోని అర్జునునికి శిష్యుడు.   వృష్ణికి మరొక కుమారుడైన యుధాజిత్తు వంశంలో కొన్ని తరాల తరువాతి వాడే మనకు వినాయకచవితి కథలో వినవచ్చే శ్యమంతకమణి సత్రాజిత్తు.  ఆయన కూతురే సత్యభామ.  
 సాత్వతుని మరొక కుమారుడు అంధకుడు.  ఆయనకు ఇద్దరు కుమారులు.  దేవకుడు, ఉగ్రసేనుడు.  దేవకుని కూతురే వసుదేవుని భార్య, భగవంతుని గర్భాన మోసి కన్న ధన్యురాలు దేవకి.  ఉగ్రసేనుని కుమారుడే మేనల్లుళ్ళను క్రూరంగా చంపదలచిన కంసుడు.  
 యుధాజిత్తు తన మనుమడికి తన తాతగారిపేరే పెట్టుకున్నాడు - వృష్ణి.  అతనికి చిత్రరథుడు అనే కుమారుడు.  అతని మనుమడు శూరుడు.  ఆ శూరునికి మారిష అనే భార్య.   వారి పుత్రుడే వసుదేవుడు.  దేవదేవుని కన్నతండ్రి.  వ్రేపల్లెలో గోపాలకుడైన నందునికి ప్రాణమిత్రుడు.  తన మిత్రుని భార్య అయిన యశోదకు జగన్మోహనమూర్తి అయిన తన కుమారుని పెంచే భాగ్యం కలిగించినవాడు.  
 ఆ వసుదేవునికి ఐదుగురు చెల్లెండ్రు.  అందులో ఒకరు పృథ.  ఆమెను కుంతిభోజుడు పెంచుకున్నాడు.  ఆమె స్వయంవరంలో పాండురాజును వరించింది.  వారి సంతానమే ధర్మరాజభీమార్జునులు.  పాండవులు.  రెండవ చెల్లెలు శ్రుతదేవి.  కరూషదేశాధిపతి  అయిన వృద్ధశర్మ ఆమె భర్త.  వారి కుమారుడే దంతవక్త్రుడు.  కృష్ణునితో విరోధించి హతమార్చబడ్డాడు.  మూడవచెల్లెలు శ్రుతకీర్తి.  ఆమె కేకయరాజైన ధృష్టకేతువును వివాహమాడి సంవర్ధనుడు మొదలైన మహావీరులను కన్నది.  నాల్గవచెల్లి రాజాధిదేవి.  ఆమె అవంతిమహారాజైన జయసేనుని వివాహమాడింది.  ఆమె కూతురు మిత్రవింద.  ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషులలో ఒకరు.  రాజాధిదేవి కుమారులు మహావీరులైన విందానువిందులు.  దురదృష్టవశాత్తు వారు కురుక్షేత్రంలో దుర్యోధనుని తరపున పోరాడవలసివచ్చింది.  
 దుర్యోధనుడు మొదలైన వారు పాండవులకు పెదనాన్న కొడుకులైతే, ఈ విందానువిందులు పినతల్లి కుమారులన్నమాట.  విధివశాత్తు వీరు యుద్ధంలో అర్జునుని చేతిలో మరణించారు.  వసుదేవుని ఐదవ చెల్లి శ్రుతశ్రవ.  ఆమె చేదిరాజైన  దమఘోషుని వివాహమాడింది.  వారి కుమారుడే శిశుపాలుడు.  కంసుడి మామ అయిన జరాసంధుడికి ఇతడు అనుంగు అనుచరుడిగా వ్యవహరించాడు.  రుక్మిణిని ఇతడిని ఇచ్చి చేద్దాం అనుకుంటే రుక్మిణికి అది ఇష్టం లేక శ్రీకృష్ణునికి రాయబారం పంపడం, శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి తెచ్చి పెండ్లి చేసుకొనడం తెలిసిందే.  మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం ఈ శిశుపాలుడు చేసిన నూరు తప్పులను సహించిన శ్రీకృష్ణుడు ధర్మజుని రాజసూయయాగం ముగింపుసభలో శిశుపాలుని అనుచితమైన ఔద్ధత్యాన్ని సహించలేక హతమార్చేశాడు.  
 ఈవిధంగా యదువంశంలో పుట్టడం వల్ల శ్రీకృష్ణుడు యాదవుడని, వృష్ణి వంశంలో పుట్టడం వల్ల వృష్ణివంశప్రదీపకుడని, వార్ష్ణేయుడని, శూరుని మనుమడు కావడంవల్ల శౌరి అని పిలవబడ్డాడు.  
 తన చెల్లెలు సుభద్రను తన ప్రియమిత్రుడు, మేనత్తకొడుకు అయిన అర్జునునికి ఇచ్చి పెళ్లి చేశాడు.  తన అల్లుడైన కంసుని చంపాడనే కోపంతో జరాసంధుడు పదే పదే మధురమీదకు దండయాత్రకు వస్తూంటే సముద్రమధ్యంలో ద్వారక అనే జలదుర్గాన్ని నిర్మింపజేసి యాదవులను కాపాడాడు.  భీముని చేత ఆ జరాసంధుని చంపించేశాడు.  
 కలియుగంలో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడబోయే జనాలకు భగవద్గీత అనే జ్ఞానదీపాన్ని వెలిగించాడు.  భూభారాన్ని తగ్గించేందుకే అవతరించిన మహానుభావుడు కాబట్టి కురుక్షేత్రయుద్ధం జరిపించి ధర్మానికి పట్టాభిషేకం చేశాడు.  యుద్ధం ముగిసిన తరువాత  మదోన్మత్తులైన తన యాదవులను గమనించి వారి సంఖ్యను కూడా తగ్గించాలని భావించాడు.  
 ఫలితంగా మునుల శాపం.  యాదవులలో ముసలం జన్మించింది. పరస్పరకలహాలతో యాదవులు నశించారు.  శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు.  ఆ పిమ్మటనే కలియుగం ప్రారంభం అయింది.  పాండవులు హస్తినాపురానికి తమ మనుమడైన పరీక్షిత్తును, ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణుని మనుమడైన యాదవవంశాంకురం అయిన వజ్రుడిని రాజులుగా అభిషేకించి తమ మహాప్రస్థానాన్ని ప్రారంభించారు.  
 ఇంతటి ఘనచరిత్ర కలిగిన యాదవులు ఇప్పటికీ భారతదేశంలో తమదైన ప్రాముఖ్యతను చాటుకుంటూ చిరంజీవులై ఉన్నారు.  

గోడలుంటే... దూకాలనిపించదా?

చిన్నప్పుడు వినేవాళ్ళం.
మన ముందుతరాలవారి చదువుల ముచ్చటలు.
వారి గురువులు
"యస్య జ్ఞానదయాసింధోః" - అని అమరకోశం మొదలుపెట్టగానే 
కొందరు మొద్దబ్బాయిలు "గోడదూకితే అదే సందో" అని పారిపోయేవారట.
అన్యాయం కదా?
మొద్దబ్బాయిలు మాత్రమేనా గోడ దూకేది?
జామకాయలకోసం మనం గోడలు దూకలేదా?
చుట్టూ తిరిగి వెళ్లే ఓపిక లేక క్రికెట్ గ్రౌండు లోనికి గోడ దూకి పోలేదా?
అసలు జంపింగ్ ఈతరం కుర్రకారుకు భలే సరదా అయిన ఆట. సినిమాహాళ్లలో టికెట్ల క్యూలలో ఈ జంపింగ్ చేస్తుంటారు. రోడ్లమీద పచ్చ సిగ్నల్ కోసం నిరీక్షించలేని తొందరపాటులో తమ బైకులను కూడా జంపింగ్ చేయిస్తూ ఉంటారు.
ఒక గజదొంగోడెవడో ఒక దొమ్మరి కుర్రవాడు గడకర్ర సాయంతో చాలా ఎత్తుకు దూకడం చూసి, వీడు నాకు పనికి వస్తాడు, నాదగ్గరే పెట్టుకోవాలి అని భావించి, పిల్లనిచ్చి పెళ్లి చేశాడట. తరువాత ఒక అర్ధరాత్రి రాజుగారి ఖజానా గోడదగ్గరకు తీసుకువెళ్లి గోడదూకి లోపలనుండి గడి తీయమన్నాడట.
"సరే మామా, నువ్వు డోలు కొట్టు, చప్పట్లు కొడుతూ ఈలలు వెయ్, అప్పుడు నాకు హుషారొచ్చి అవలీలగా ఈ గోడ దూకేస్తా" అన్నాడట ఆ కొత్తల్లుడు. పాపం ఆ గజదొంగకు తలతిరిగిపోయిందట. డోలు చప్పట్లు ఈలలు కొడితే, అల్లుడు గోడ దూకాక మునుపే రాజభటులు వచ్చి వీరిని పట్టుకుని ఎత్తి జైలు గోడల లోపలకు విసిరేయరా?
ఇది చిన్నప్పుడు చదువుకున్న ఒక చందమామ కథ. గుర్తుందా? 
విద్యార్థులు, పిల్లలు, యువకులు, దొంగలు మాత్రమే గోడలు దూకుతారు అనుకొనడం భ్రమ! గోడలు దూకినవారు హీరోలు కూడా అయ్యారు.
అసలు ఏమిట్రా ఈ గోడ గొడవ? ఆ గోడలను గెంతడమేమిటి? దాని కథేమిటో చూద్దామనుకుంటే చదివేయండి:

(ఈ క్రింది వ్యాసం మునుపు ఏసియానెట్ న్యూస్ వారు ప్రచురించారు)

అసలు గోడల చరిత్ర ఏమిటి?
గోడలెందుకు పుట్టినట్టు?
మనిషి తన రక్షణకోసం కనిపెట్టుకున్నవేనా గోడలు?
 ఈ మనిషి మొదట్లో శీతవాతాతపాలవంటి ప్రాకృతికాపత్తులనుండి రక్షణకోసం సహజమైన కొండగుహలనో లేక పెద్ద చెట్టు తొఱ్ఱలనో ఆశ్రయించి ఉంటాడు.  క్రమేణా ఆయా ఆశ్రయాలనాశించేవారి సంఖ్య ఎక్కువై పోటీ పెరిగి ఉంటుంది.  ఆవిధంగా అవసరాలు నూతనావిష్కారాలకు నాంది పలికి ఉంటాయి.  గోడలు పుట్టుకొచ్చి ఉంటాయి.  చెట్లగోడలు, చెక్కగోడలు, రాళ్లగోడలు, బంకమట్టి పూసిన అతికించిన రాళ్లగోడలు,  మట్టినే రాళ్లుగా మార్చి (ఇటుకలు చేసి) కట్టిన గోడలు, రాళ్లనే మట్టిగా మార్చి (సిమెంటు చేసి) కట్టిన గోడలు... ఇలా క్రమాభివృద్ధిని సాధించి ఉంటాడు.
 తన కుటుంబసభ్యుల రక్షణకోసం ఇంటి గోడలు
తన గ్రామ/నగరరక్షణకోసం కోట గోడలు 
తన చేను రక్షణకోసం ముండ్లకంచెల గోడలు
తన పంటల రక్షణకోసం గాదెలు పాతరల గోడలు
త్రాగునీటి రక్షణకోసం ప్రవాహాలకు అడ్డంగా ఆనకట్టల గోడలు
ఆయా దేశాల నడుమ సరిహద్దుల రక్షణకోసం గోడలు
చివరకు లోకరక్షకుడని మనసారా భావించే జగన్నాథవిశ్వనాథాదినామాంకితుడైన స్వామివారి రక్షణకోసం దేవాలయపు గోడలు కూడా!
చెప్పలేనన్ని ఎన్నో రకాలు!
 ప్రపంచంలోకెల్లా మొదటి ఇంజనీర్లు ఇలా గోడలు కట్టడం మొదలు పెట్టినవారా లేక నిప్పును తయారు చేయడం నేర్చినవారా లేక పరుగెత్తే జంతువును పడగొట్టడానికి లేదా పట్టడానికి అవసరమైన పరికరాలు తయారుచేసినవారా అని నాకు పెద్ద సందేహం.  వీరిలో ఒకరికి మాత్రమే ఎక్కువ మార్కులు వేయలేక అందరికీ సమానప్రతిపత్తిని ఇస్తూ ఉంటాను.
 భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు సహజమైన గోడల్లా నిలిచి ఉన్నాయని చదువుకున్నాము.  ఆ గోడల నడుమ సందు కనిపెట్టడం వల్లనే విదేశీయుల దండయాత్రలు ప్రారంభమై ప్రశాంతమైన భారతాన్ని అల్లకల్లోలం చేసిపెట్టాయని సంప్రదాయవాదులు వాపోతూ ఉంటారు.  అలా కాదు, హిమాలయాలు అడ్డుగోడల్లా నిలవటం చేత భారతదేశం మిగిలిన ప్రపంచదేశాలతో కలవకుండా చాలాకాలం ఏకాకిగా మిగిలిపోయిందని మరికొందరు వాదిస్తూ ఉంటారు.
 ప్రసిద్ధమైన మానవనిర్మితమైన గోడలు చాలా ఉన్నాయి.
వాటిలో చైనా గోడ, బెర్లిన్ గోడ కూడా ఉన్నాయి.
మొదటిదాన్ని ప్రపంచపు అద్భుతమైన కట్టడాలలో ఒకటిగా గుర్తిస్తారు.
రెండవదాన్ని ప్రపంచపు దురహంకారానికి క్రూరత్వానికి చిహ్నంగా అసహ్యించుకున్నారు.  ద్వేషించారు.  చివరకు కూలదోశారు.
 అదేమిటి?
గోడల చరిత్ర ఎక్కడనుండి ఎక్కడకు చేరుకుంటోంది?
ఒక చోట అద్భుతమనిపించుకున్న గోడ మరో చోట ఎందుకు ద్వేషింపబడింది? 
 గోడ అందరి రక్షణకు చిహ్నంగా ఉన్నంతకాలం నిజంగానే ప్రేమించబడింది.  కాని అది క్రమంగా అసమానతలకు చిహ్నంగా మారుతూ ఉండేసరికి దానిపై ద్వేషం కూడా పెరగడం మొదలైంది.
ఒకప్పుడు అందరూ సమానులుగా ఉన్న కాలాన్ని మార్చి కొందరిని పేదలుగా కొందరిని సంపన్నులుగా గుర్తించే కాలాన్ని ఈ గోడే సృష్టించింది.  అందుకు పూర్తిగా గోడదే బాధ్యత!
 గోడ బయట చలిలో వణుకుతూ ఆకలితో మాడుతున్నవారు కొందరు ఉండగా, గోడల నడుమ వెచ్చదనాన్ని అనుభవిస్తూ, కడుపునిండా తింటూ త్రాగుతూ కొందరు ఉండిన కాలం వచ్చింది.  అరిషడ్వర్గాలనబడే కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు కలకాలంలో అమాంతంగా పెరిగాయని పెద్దలు చెబుతూ ఉంటారు.  మరి గోడలు తమ ప్రధానమైన విధ్యుక్తధర్మమైన రక్షణను విస్మరించి ఇలా అసమానతలను పెంచుతూ మనుషులను విడదీసిపారేస్తూ ఉంటే కలికాలం కాక సత్తెకాలం నడుస్తుందా?  
"మీ యింటికి మా యింటికి అడ్డుగోడ ఉందీ" అంటూ ఇద్దరు ప్రేమికులు ఓ సినిమాలో ఓ పాటను బాధగా పాడుకున్నారు.  అసలు గోడలుంటేనే కదా ఒక ఇల్లయ్యేది?  మరి వీరి బాధేమిటి?  ఇళ్లను కూల్చేసి రోడ్లమీద పడి ఉందాం అనే ఉద్దేశమా?  కాదు కదా?  ఆ ఇంట్లో వారికి ఈ ఇంట్లో వారికి మధ్యలో ఏవో గొడవలు ఉన్నాయని కదా వారి ఉద్దేశం?  అంటే వారు చెప్పిన గోడలు ఆ ఇండ్లలోని మనుషుల మనసుల్లో ఉన్నాయన్న మాట!  "ఓ!  అవునా!  అర్థమైంది కాని, ఈ మనుషుల మనసుల్లో గోడలను ఏ మెటీరియల్ తో కడతారబ్బా" అనే సందేహం కూడా రావచ్చు.  పైన చెప్పిన అరిషడ్వర్గాలలో ఏదో ఒకటి ఇటువంటి గోడలకు మెటీరియల్ అయ్యుంటుంది.
 ఇలా గోడలు అసమానతలు సృష్టించడం ప్రారంభించేసరికి, ఆ గోడలను సాహసించి దూకేవారు కూడా తయారయ్యారు.  ఆ దూకినవారు  మునుపటి కాలంలో ఉండిన సమానతను మరలా తెచ్చిపెట్టగల ధీరులని సామాన్యులు భావించడం వల్ల వారిపట్ల గౌరవం ఆరాధనభావం కలిగాయి.  వారు గొప్ప కథానాయకులయ్యారు. పాతాళభైరవి తోటరాముడు, కోటగోడను గెంతి రాకుమారి మనసునే కాక జనాల అభిమానాన్ని కూడా గెలుచుకున్నాడు.  మల్లీశ్వరికోసం కోటగోడ దూకిన నాగరాజుపై మహాప్రభువులు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహించక అనుగ్రహించారు.  బజిరంగీ భాయిజాన్ సరిహద్దును గెంతి పాకిస్తాన్ ప్రజల మెప్పును కూడా పొందాడు.  అత్తారింటికి దారేదంటూ పోయి ఆమె మనసులోని గోడలను కూలగొట్టి పుట్టింటికి రప్పించిన అల్లుడు అందరి మెప్పునూ పొందాడు.  ఇలా గోడలు దూకిన కథలు, గోడలు పగలగొట్టిన కథలు ప్రపంచసాహిత్యం నిండా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.  జనాలు వాటిని ఎంతగానో అభిమానించారు. అభిమానిస్తూనే ఉన్నారు.  నిజంగా అసమానతలు లేకుంటే ఈ కథలకు ఇంతటి ఆదరణ లభించి ఉండేది కాదు.  గోడలు దూకినందుకు ఈ కథానాయకులందరూ తప్పక దండనార్హులై ఉండేవారు.
 ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికో సరిహద్దులో గోడ కడతానంటున్నాడు.  కొన్ని దేశాల వలసదారులు, శరణార్థులు తమ దేశంలోనికి రాకూడదంటూ శాసనాల గోడలు కడుతున్నాడు.  ఈ పనులన్నీ  అమెరికా ప్రజల రక్షణకోసమేనని ఆయన అంటున్నాడు.  కాదు కాదు, మీ విద్వేషమే దీనికి కారణమని కొందరు ప్రపంచవ్యాప్తంగా గొంతెత్తుతున్నారు.  ఇదో పెద్ద రగడైంది. 
ఇవన్నీ రక్షణ కోసం కడుతున్న గోడలా లేక అరిషడ్వర్గాల మెటీరియల్ తో కట్టబడుతున్న గోడలా అనేది జరగబోయే చరిత్రలో తేలిపోతుంది.  ఈ గోడలకు మన కాలంలో పునాదులు త్రవ్వబడుతూ ఉండటం మాత్రమే మనం చూస్తున్నాం.  ఇవి శాశ్వతంగా నిలిచే గోడలా కాదా అన్నది మన కాలంలోనే తెలియవచ్చు, లేదా తెలియకపోవచ్చు కూడా.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...