Showing posts with label Indian Wisdom. Show all posts
Showing posts with label Indian Wisdom. Show all posts

Saturday, 24 June 2023

మధురవాణి

గీతాప్రెస్, గోరఖ్ పుర్ వారి కల్యాణ్ పత్రిక (జూన్ 2023) లోని వ్యాసం


 

మధురవాణి వలన ఉపయోగాలు


వాక్సంయమో హి నృపతే సుదుష్కరతమో మతః।

అర్థవచ్చ విచిత్రం చ న శక్యం బహు భాషితుమ్।।

ఓ రాజా, మాటలను అదుపులో ఉంచుకుని పలకడం చాల కష్టమైన పని.  అయినప్పటికీ, అర్థవంతములు, నేర్పుతో కూడినవి అయిన మాటలను నిత్యం పలుకుతూ ఉండటం (అందరికీ) సాధ్యం కాదు.


అభ్యావహతి కల్యాణం వివిధం వాక్ సుభాషితా।

సైవ దుర్భాషితా రాజన్ననర్థాయోపపద్యతే।।

ఓ రాజా, చక్కగా మాటలాడటం వల్ల వివిధములైన శుభాలు చేకూరుతాయి.  కాని, చెడ్డ మాటలు పలికితే అవి వివిధములైన అనర్థాలను చేకూరుస్తాయి.

  

రోహతే సాయకైర్విద్ధం వనం పరశునా హతమ్।

వాచా దురుక్తం బీభత్సం న సంరోహతి వాక్క్షతమ్।।

బాణాలతో దెబ్బ తిన్నప్పటికీ, గొడ్డళ్లతో నరుకబడినప్పటికీ అడవి మరల చిగురిస్తుంది.  కాని, చెడ్డ మాటలతో బీభత్సంగా దెబ్బ తిన్నది ఏదీ కూడా (ఉదాహరణకు స్నేహం) మరల మొలకెత్తదు.


కర్ణినాలీకనారాచాన్నిర్హరన్తి శరీరతః।

వాక్శల్యస్తు న నిర్హర్తుం శక్యో హృదిశయో హి సః।।

శరీరంలో కర్ణి, నాళీకము, నారాచము మొదలైన రకరకాల బాణాలు గ్రుచ్చుకున్నప్పటికీ వాటిని మరలా పెరికివేయవచ్చును.  కాని, చెడ్డమాట అనే బాణం హృదయంలో గ్రుచ్చుకుంటే దానిని మరలా బయటకు పెరకడం సాధ్యం కాదు.


వాక్సాయకా వదనాన్నిష్పతన్తి యైరాహతః శోచతి రాత్ర్యహని।

పరస్య నామర్మసు తే పతన్తి తాన్ పణ్డితో నావసృజేత్ పరేభ్యః।।

నోటినుండి వెలువడే పదునైన బాణాల వంటి మాటలతో దెబ్బ తిన్న వ్యక్తి రాత్రింబగళ్లు బాధపడుతునే ఉంటాడు.  అవి సున్నితమైన మనస్సును దెబ్బ తీసి ఇతరుల ప్రాణాలను కూడా తీయగలవు.  అందువల్ల పండితుడు అటువంటి మాటలను పలుకరాదు. 


అతివాదం న ప్రవదేన్న వాదయేద్ యోనాహతః ప్రతిహన్యాన్న ఘాతయేత్।

హన్తుం చ యో నేచ్ఛతి పాపకం వై తస్మై దేవాః స్పృహయన్త్యాగతాయ।।

ఎవడు ఇతరులను దుర్భాషలతో బాధించడో, ఎవడు ఇతరులు తన పట్ల దుర్భాషలాడేందుకు అవకాశం ఇవ్వడో, ఎవడు ఇతరుల దుర్భాషలకు తాను బాధపడకుండా ఉంటాడో, ఎవడు ఇతరుల దుర్భాషలకు తాను స్వయంగా గురి అయినప్పటికీ, వారిని క్షమించి తిరిగి దుర్భాషలాడకుండా ఉంటాడో అటువంటి వాని ఆగమనం కోసం దేవతలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు.

{{విదురనీతి (2.76-80, 4.11)}} 



ఆషాఢశుక్లషష్ఠీ, శోభకృత్, స్థిరవాసరః

శ్రీనివాసకృష్ణ



Saturday, 16 July 2022

జనకసభ


                 పూర్వం విదేహరాజ్యాన్ని పరిపాలించే రాజులకు జనకుడు అనే నామాంతరం ఉండేది.  వారిలో ఒకానొక జనక మహారాజు ఒకసారి బహుదక్షిణం అనే పేరు కలిగిన గొప్ప యజ్ఞం చేశాడు.  ఆ యజ్ఞానికి నానా ప్రాంతాల నుండి అనేకమంది వేదపండితులు శాస్త్రపండితులు విచ్చేశారు.  వారిని, వారి అపరిమేయమైన వైదుష్యాన్ని గమనించిన జనకమహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.  ఆ సమయంలోనే అతడికి ఒక జిజ్ఞాస కూడా కలిగింది.  కో ను ఖలు అత్ర బ్రహ్మిష్ఠః?” (వీరందరిలోనూ అతి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వారు ఎవరు?) అని.  కాని, ఆ మాటను నేరుగా ఆ విద్వత్పరిషత్తులోనే అడగటం మర్యాద కాదు.  అందువలన జనకమహారాజు ఒక ఉపాయం చేశాడు.

             తన గోశాలనుండి వేయి మంచి ఆవులను తెప్పించాడు.  ప్రతి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి కదా.  ఒక్కొక్క కొమ్ముకు ఐదేసి పాదముల బంగారాన్ని కట్టించాడు.  తరువాత అక్కడ చేరిన విద్వత్పరిషత్తును ఉద్దేశించి, “మహాత్ములారా! యో వో యుష్మాకం బ్రహ్మిష్ఠః సః ఏతాః గాః ఉదజతామ్ (మీ అందరిలోనూ అతిశయించిన బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో, వారు ఈ ఆవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చును.) అని ప్రకటించాడు.

             అప్పుడు అక్కడున్న వారు ఎవరూ నేనే అందరికంటే గొప్ప బ్రహ్మిష్టుడను అని చెప్పలేక మౌనంగా ఉండి పోయారు.

             అప్పుడు అక్కడున్న యాజ్ఞవల్క్యమహర్షి తన శిష్యుడిని పిలిచి, “ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా3 (సామశ్రవా, ఈ ఆవులను మన ఇంటికి తోలుకుపో నాయనా) అని చెప్పాడు.

             ఆ మాట విన్న పండితులందరికీ చాల కోపం వచ్చింది.  వారిలో అశ్వలుడు ఒకడు.  ఆయన జనక మహారాజు గారి యాజ్ఞికులలో హోత.  త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి?” (ఓ యాజ్ఞవల్క్యా, మన అందరిలోనూ నువ్వేనా అతి గొప్ప బ్రహ్మవేత్తవు?)  అని తీవ్రంగా అడిగాడు.

             మనలో ఎవరైతే అతి గొప్ప బ్రహ్మిష్ఠుడో అతడికి నా నమస్కారం.  నాకు ఆవుల అవసరం చాలా ఉన్నది.  అందుకనే నేను తోలుకుపోదామని అనుకున్నాను అని యాజ్ఞవల్క్యుడు మందహాసం చేశాడు.

             నీకు ఎంత అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆవులు అతి గొప్ప బ్రహ్మవేత్త కోసం ఉద్దేశింపబడ్డాయి.  కాబట్టి మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీవు ఆవులను తీసుకొని పోవచ్చును అని అశ్వలుడు సవాలు చేశాడు.

         యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి, సరే ప్రశ్నించండి అని అడిగాడు.

         అశ్వలుడు యజ్ఞానికి, యజ్ఞము చేయించే విధానానికి, యజ్ఞం చేయించేవారికి సంబంధించిన అతి కఠినమైన ప్రశ్నలను వేశాడు.  యాజ్ఞవల్క్యుడు వాటికి అతి సులువుగా సమాధానం చెప్పాడు.  అశ్వలుడు యాజ్ఞవల్క్యుని సమాధానాలను ఆమోదించి, ఇక అడుగవలసిన ప్రశ్నలు తన వద్ద లేవని విరమించుకున్నాడు.

     అప్పుడు జరత్కారువంశీయుడైన కృతభాగుని పుత్రుడైన ఆర్తభాగుడు అనే మహర్షి ప్రశ్నించేందుకు పూనుకున్నాడు.  అతడు గ్రహములను గూర్చి అతిగ్రహములను గూర్చి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చక్కగా సమాధానం చెప్పాడు.  (ఇక్కడ గ్రహములు అంటే planets కావు.  గ్రహించే వాటిని గ్రహములు అంటారు.). మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు.  అప్పుడు యాజ్ఞవల్క్యుడు అజేయుడు అని గ్రహించిన ఆర్తభాగుడు మౌనం వహించాడు.

         అప్పుడు లహ్యుని కుమారుడైన భుజ్యుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.  పారిక్షితుల స్థానాన్ని గూర్చి అతడు అడిగాడు.  (పారిక్షితులు అంటే అశ్వమేధయాగాన్ని చేసిన మహాత్ములు). యాజ్ఞవల్క్యుడు దానికి కూడా సరైన సమాధానం చెప్పాడు.  దాంతో భుజ్యుడు కూడా మౌనం వహించాడు. 

         అప్పుడు చక్రుని కుమారుడైన ఉషస్తి ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు.  ఆత్మకు సంబంధించిన అతని ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు సులువుగా సమాధానం చెప్పాడు.  దాంతో ఉషస్తి కూడా తన ప్రయత్నాలను విరమించుకున్నాడు.

         అప్పుడు కుషీతకుని పుత్రుడైన కహోలుడు తన ప్రశ్నలను ప్రారంభించాడు.  అతడు కూడా ఆత్మను గురించి విభిన్నంగా ప్రశ్నించాడు.  యాజ్ఞవల్క్యునినుండి తనకు సరైన సమాధానం లభించడంతో మౌనం వహించాడు.

         అప్పుడు వచక్నుని కుమార్తె అయిన గార్గి తన ప్రశ్నలను ప్రారంభించింది.  వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది -

 

గార్గి

ఒక వస్త్రం దారాలలో ఓత ప్రోతంగా ఎలా వ్యాపించి ఉన్నది కదా, ఆ విధంగా నీరు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

వాయువులో

 

గార్గి

వాయువు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

అంతరిక్షలోకాలలో

 

గార్గి

అంతరిక్షలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

గంధర్వలోకాలలో

 

గార్గి

గంధర్వలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి

 

యాజ్ఞవల్క్యుడు

ఆదిత్యలోకాలలో

 

గార్గి

ఆదిత్యలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

చంద్రలోకాలలో

 

గార్గి

చంద్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

నక్షత్రలోకాలలో

 

గార్గి

నక్షత్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

దేవలోకాలలో

 

గార్గి

దేవలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇంద్ర లోకాలలో

 

గార్గి

ఇంద్రలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ప్రజాపతిలోకాలలో

 

గార్గి

ప్రజాపతిలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

బ్రహ్మలోకాలలో

 

గార్గి

బ్రహ్మలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

గార్గి ఆ ప్రశ్నను వేసేసరికి యాజ్ఞవల్క్యుడు ఆమెను కనికరం నిండిన దృష్టులతో చూశాడు.  ఓ గార్గీ, అతిప్రశ్నలను వేయకు. నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.

         (బ్రహ్మలోకం అనిర్వచనీయమని, అతీంద్రియమని, అవాఙ్మానసగోచరమని శాస్త్రం చెబుతుంది.  ఆ విధంగా కన్నులకు గాని, మనసుకు గాని ఇతర-ఇంద్రియాలకు గాని అందని విషయాన్ని గురించి ప్రశ్నించడాన్ని అతిప్రశ్న అంటారు.  ఎందుకంటే ఇంద్రియాలకు మనసుకు అందని దానిని ఎవరికి వారు స్వీయానుభవంతో తెలుసుకోవాలి.  బ్రహ్మలోకాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ విధంగా ప్రయత్నించకుండా అవి ఎలా ఉంటాయి అవి ఎందులో ఉంటాయి అని ప్రశ్నించడమే ఈ సందర్భంలో అతి ప్రశ్న.  అంతేకాక, వేదవాక్కును మించిన ప్రమాణం లేదు.  దానిని పక్కకు త్రోసి అనుమానప్రమాణాన్ని ఆశ్రయించి అది వేదం కంటె గొప్పదనటం కూడా అతి.  ఆ విధంగా వేదాన్ని అతిక్రమించి అనుమానప్రమాణానికి అధికప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే అప్పుడు కూడా అది అతి ప్రశ్న అవుతుంది.)

         యాజ్ఞవల్క్యుడు అలా చెప్పేసరికి తన పొరపాటున గ్రహించిన గార్గి కూడా మౌనం వహించింది.

         అప్పుడు అరుణపుత్రుడైన ఉద్దాలకుడు ప్రశ్నించడం ప్రారంభించాడు.  ఓ యాజ్ఞవల్క్యా! నాకు సూత్రాత్మగా ఉన్న అంతర్యామిని గూర్చి తెలుసును. నీకు కూడా ఆ అంతర్యామి తెలిసినట్లయితే సరే.  కాని, అంతర్యామిని గూర్చి ఏమీ తెలియకుండా నీవు ఆవులను తీసుకువెళ్లదలిస్తే నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.  యాజ్ఞవల్క్యుడు అంతర్యామిని గురించి చక్కగా వివరించాడు.  సరైన సమాధానం లభించేసరికి ఉద్దాలకుడు మౌనం వహించాడు.

         అప్పుడు గార్గి మరలా నిలబడింది.  యాజ్ఞవల్క్యుని మరొకసారి ప్రశ్నించేందుకు పండితసభ అనుమతిని కోరింది.  ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగలిగితే ఇక ఈ సభలో ఎవరూ యాజ్ఞవల్క్యుని ఓడించలేరు.  అటువంటి ప్రశ్న వేసేందుకు మీ అనుమతిని కోరుతున్నాను అని వినయంగా అడిగింది. సభ అందుకు అనుమతినిచ్చింది.  అప్పుడు గార్గి ఈ విధంగా సవాలు చేసింది. 

            ఓ యాజ్ఞవల్క్యా, నేను వేయబోయే ప్రశ్న ధనుస్సును ఎక్కు పెట్టి సంధింపబడి విడుదలకాబోతున్న పదునైన బాణం వంటి ప్రశ్న.  నీ దగ్గర సమాధానం ఉందా?” అని అడిగింది.




             యాజ్ఞవల్క్యుడు మందహాసం చేసి "వెంటనే ప్రయోగించవమ్మా నీ బాణాన్ని" అన్నాడు. 

ద్యు లోకానికి పైన, పృథ్వీలోకానికి క్రిందన, ఏది వ్యాపించి ఉన్నదో, ఈ ధ్యావాపృథ్వీలోకాలకు నడుమ ఏది ఉన్నదో, దేనికి భూతము భవము భవిష్యత్తు (Past, Present, Future) అనేవి ఉండవో, అయ్యది దేనిలో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నది?”

         ఈ విధంగా గార్గి అడిగిన ప్రశ్నను విని అందరూ దిగ్భ్రాంతి చెందారు.  అసలు ఆ ప్రశ్నలోని విషయం కూడా ఊహకు అందదు.  ఇక దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అనుకున్నారు.  మునుపు గార్గి వేసిన ప్రశ్న మాటలకు అందనిదైనందున అతి ప్రశ్న అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.  కాని, ఇప్పుడు గార్గి తన మాటలతో వర్ణించినందువలన అది అతి ప్రశ్న కాజాలదు.  యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం వచ్చింది.

         అయితే ఆ విద్వత్పరిషత్తులోని మిగిలిన విద్వాంసులందరూ వేరు, యాజ్ఞవల్క్యుడు వేరు.  అతడికి గార్గి వేసిన ప్రశ్న కరతలామలకంలా అనిపించింది. 

         ఓ గార్గీ, అది ఆకాశంలో వ్యాపించి ఉన్నది అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు. 

     సభ నిశ్చేష్టమై నిశ్శబ్దంగా మారిపోయింది.  గార్గి మ్రాన్పడిపోయింది.  తన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు అంత సులువుగా సమాధానం చెబుతాడని ఆమె ఊహించనేలేదు.  నిజానికి ఆమె అడిగినది ఊహాతీతమైన పరబ్రహ్మ గురించి.  పరబ్రహ్మ వర్ణింప వీలుకానిది. కాబట్టి, యాజ్ఞవల్క్యుడు మౌనం వహించాలి.  గార్గి అడిగినది అతిప్రశ్న కాకపోయినప్పటికీ, సమాధానం చెప్పలేక మౌనం వహిస్తే, ఆమె ప్రశ్నకు సమాధానం నావద్ద లేదని యాజ్ఞవల్క్యుడు తన పరాజయాన్ని అంగీకరించినట్లే.  అందువల్ల గార్గి చాల తెలివిగా యాజ్ఞవల్క్యుని ఇరుకున పెడదామని ఆ విధంగా ప్రశ్నించింది.  కాని, ఆమె తన ప్రశ్నలో ఒక పొరపాటు చేసింది.  ద్యావాపృథ్వీలోకాలు అని ఆమె ఉచ్చరించడంతో అవి కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే అయినాయి.  అందువల్ల అవి ఆకాశంలో ఉంటాయని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.  ఆ సమాధానం లౌకికంగానూ శాస్త్రీయంగాను కూడా సత్యమే.  మొదటి సారి నీవు అడిగినది అతిప్రశ్న అయితే రెండవసారి నీవు అడిగిన ప్రశ్న అతి సాధారణమైన ప్రశ్న అన్నట్లుగా యాజ్ఞవల్క్యుడు తేల్చేశాడు.  అంతే కాదు, ఆకాశం కంటె కూడా నీవడగదలుచుకున్న పరబ్రహ్మ మరింత గొప్పది అని పరోక్షంగా తగిన సమాధానం కూడా సూచించాడు.  (తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని తైత్తిరీయవాక్కు.)

         తెల్లబోయిన గార్గి కాసేపటికి తేరుకుని, “ఆ ఆకాశం దేనిలో వ్యాపించి ఉన్నది?” అని అడిగింది.  దానిని అక్షరం అంటారు (అక్షరం = క్షరము కానిది = నాశనం లేనిది) అని యాజ్ఞవల్క్యుడు చెప్పి, దాని స్వరూపం వర్ణింప వీలులేనిది కాబట్టి, నేతి (న+ఇతి) వాదం ప్రకారం సమాధానం చెప్పాడు.  (ఆ అక్షరస్వరూపం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండదు అంటూ వర్ణించాడు.). అటువంటి అక్షరంలో ఈ ఆకాశం వ్యాపించి ఉన్నది అని చెప్పాడు.  గార్గికి తగిన సమాధానం లభించింది.  ఆమె పన్నిన ఉచ్చులో యాజ్ఞవల్క్యుడు ఇరుకున పడలేదు.  తామరతూడు ఏనుగును బంధించలేదు కదా.

ఆ సమాధానం విన్న గార్గి వినమ్రురాలయింది. యాజ్ఞవల్క్యునికి సవినయం నమస్కారం చేసింది.  వినీతులు ఎంతటి జిగీషులైనప్పటికీ, మహాత్ముల చెంత వారి సహజస్వభావం పెల్లుబుకుతూనే ఉంటుంది కదా. అయ్యా పండితులారా! మీరు కూడా ఈయనకు నమస్కారం చేసి, ఈయన మనలో అతి గొప్ప బ్రహ్మవేత్త అని అంగీకరించండి.  సత్యాన్ని అంగీకరిస్తే అది మనకు విజయమే కాని పరాజయం కాదు. మీరెవరు ఈయనను జయింపలేరు అని సభలోని విద్వాంసులతో హితవు పలికింది.

         అయితే గార్గి మాటలను శాకల్యుడు సహించలేకపోయాడు.  తాను కూడా ప్రశ్నించి యాజ్ఞవల్క్యుని పరీక్షిద్దామని ముందుకు వచ్చాడు.

 

శాకల్యుడు

వైశ్వదేవంలో దేవతల సంఖ్య ఎంత?”

 

యాజ్ఞవల్క్యుడు

3306 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

33 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఆరుగురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ముగ్గురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇద్దరు

 

శాకల్యుడు

సరే, ఎంత మంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒకటిన్నర మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒక్కరు

 ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు తాను చెప్పిన ఆయా దేవతల సంఖ్యలను గురించి కూడా చక్కగా వివరించాడు.

         అయినప్పటికీ శాకల్యుడు శాంతించలేదు.  ఏ విధంగానైనా యాజ్ఞవల్క్యుడిని జయించాలనే కోరికతో ప్రశ్న మీద ప్రశ్నలను అడుగుతూ పోయాడు.  (సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కాకుండా, తనకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ఎంతమాత్రం ప్రతిపాదించకుండా, కేవలం తన ప్రత్యర్థి మాటలను నిరాధారంగా నిష్కారణంగా అసూయతో ఖండిస్తూ వాదించడాన్ని వితండవాదం అంటారు.).

         చివరకు శాకల్యుని దురాగ్రహాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు, ఓ శాకల్యా, నీకు సమాధానం తెలియని ప్రశ్నను నన్ను అడుగవద్దు.  సమాధానం తెలియకుండా నన్ను ప్రశ్నించినట్లయితే నీ తల తెగిపడుతుంది అని హెచ్చరించాడు.  అయినప్పటికీ, శాకల్యుడు తనకు సమాధానం తెలియని ప్రశ్నను అడిగేశాడు.  దాంతో శాకల్యుని తల అందరి సమక్షంలోను తెగి క్రింద పడింది.

      అప్పుడు యాజ్ఞవల్క్యుడు, సభను ఉద్దేశించి, “అయ్యా, మీలో ఇంకా ఎవరెవరు ఏమేమి ప్రశ్నలను అడగదలుచుకున్నారో విడివిడిగా అడగవచ్చు.  లేదా అందరూ కలిసి ఒకే ప్రశ్నను వేయవచ్చు.  నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నాను అని పలికాడు.

         అప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. 

       అప్పుడు యాజ్ఞవల్క్యుడే స్వయంగా పండితపరిషత్తును ఉద్దేశించి ప్రశ్నించాడు.  ఆత్మ అనే పురుషుని వృక్షంతో పోల్చి చెప్పి, చెట్టును వేళ్లతో సహా విత్తనంతో సహా నాశనం చేస్తే ఆ చెట్టు మరల మొలకెత్తదు.  కాని, మన ముందే మరణించి, శరీరం కాల్చివేయబడినప్పటికీ, ఆ వ్యక్తి మరలా జన్మిస్తాడు. (ధ్రువం జన్మ మృతస్య అని శాస్త్రం)  కో న్వేయం జనయేత్ పునః?  (మరణించిన వ్యక్తిని మరలా పుట్టేట్లుగా చేస్తున్న ఆ శక్తి ఏమిటి?) అని అడిగాడు.

     ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.  యాజ్ఞవల్క్యుడు సభకు నమస్కరించి, ఆవులను తోలుకొని పోయాడు. 

విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతుః పరాయణం తిష్ఠమానస్య తద్విద ఇతి – అని బృహదారణ్యకోపనిషత్తు ఆ శక్తిని గూర్చి చెబుతుంది.  ఆ శక్తి పేరు విజ్ఞానం.  ఆ శక్తి పేరు ఆనందం.  ఆ శక్తి పేరు బ్రహ్మ.  అదే పరమగతి.

 

ఇతి శమ్

Saturday, 19 February 2022

ఉత్తరదక్షిణాలుగా భారతవర్షం



ఉత్తరదక్షిణాలుగా భారతవర్షవిస్తీర్ణం మత్స్యపురాణంలో చెప్పబడింది.
"ఆయతస్తు కుమారీతో గంగాయాః ప్రవాహావధి"
(మత్స్య.114.10)
కుమారీతో = కుమారీతః = కన్యాకుమారి నుండి
గంగాయాః ప్రవాాహావధి = గంగాపరీవాహకప్రాంతం (Water basin) మొత్తం.
కన్యాకుమారి భారతదేశపు దక్షిణాగ్రంలో ఉందని మనకు స్పష్టంగా తెలుసు.
కాని, గంగ అంటే నేటి పాఠ్యపుస్తకాలు చెబుతున్నట్లు గంగోత్రిలో పుట్టి బంగాళాఖాతం వరకు ప్రవహించే పుణ్యనది ఒక్కటే కాదు.
గంగకు సప్తస్రోతస్సులు (ఏడు ప్రవాహాలు) ఉన్నాయి.
పరమశివుడు తన శిరస్సునుండి గంగను బిందుసరస్సు వైపు విడిచాడు.
(విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి - అని రామాయణవచనం ప్రమాణం. బాలకాండం, 43.11)
ప్రస్తుతం బిందుసరోవరం అనే పేరిట భారతదేశంలో చాల క్షేత్రాలలో దేవాలయపుష్కరిణులు ఉన్నాయి. కాని, అవేవీ రామాయణంలో చెప్పబడిన బిందుసరస్సు కావు. బిందుసరస్సు అంటే హిమాలయాలలోని మానససరోవరమే. లేదా నేడు మానససరోవరం ఉన్న అప్పటి ప్రాంతం బిందుసరస్సు అనే పేరింట వ్యవహరింపబడుతూ ఉండవచ్చు.
ఒక దేశం పేరిట ఒక జలాశయం ఉండటం, లేదా ఒక జలాశయం పేరిట ఒక దేశం ఉండటం ఈరోజున కూడా మనం గమనించగలం, బెంగాల్ పేరిట ఒక సముద్రాన్ని మనం బే ఆఫ్ బెంగాల్ గా వ్యవహరిస్తున్నాం. అరేబియా దేశం పేరిట అరేబియా సముద్రం ఉన్నది. భారతదేశం పేరిట Indian Ocean ఉన్నది. అలాగే బిందుసరోవరం ఉన్న విశాలభూభాగాన్ని ఆ రోజున బిందుసరోవరంగా వ్యవహరించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
అక్కడనుండి గంగ ఏడు పాయలుగా విడిపోయిందట.
తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే (రా.బా.43.12)
బిందుసరస్సు ప్రాంతం నుండి తూర్పుదిశగా -
1 హ్లాదిని, 2 పావని, 3 నళిని
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.12)
{ఇవన్నీ ప్రాచీనమైన పేర్లు. ఇందులో ఒకదానిని మనం ఇపుడు బ్రహ్మపుత్రగా పిలుస్తున్నాం. మిగిలిన రెండూ నేటి సాల్వీన్ (Salween) మెకాంగ్ (Mekong) నదులు కావచ్చు.}

బిందుసరస్సు ప్రాంతం నుండి పడమటిదిశగా -
1 సుచక్షువు 2 సీత 3 సింధు
అనే మూడు పాయలు ప్రవహించాయి. (రా.బా.43.13-14)
{వీటిలో సింధునది ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధమే.}

సింధు పరీవాహకప్రాంతం

సింధునది - నేటి భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో


బిందుసరస్సు ప్రాంతం నుండి మొదట దక్షిణదిశగా, అక్కడనుండి మరలా తూర్పు దిశగా భాగీరథి పేరిట మరొక పాయ ప్రవహించింది. (రా.బా.43.14)

భాగీరథి


మొదట చెప్పినట్టుగా ఈ సప్త గంగా స్రోతస్సుల ప్రవాహావధి – (అంటే సమస్తపరీవాహకప్రాంతం) అంతా భారతవర్షమే. అంటే నేటి మానససరోవరప్రాంతం, అలాగే నేడు టిబెట్ అని పిలవబడుతున్న ప్రాంతం మొత్తం భారతవర్షమే. అలాగే టిబెట్ లో పుట్టిన సాల్వీన్ (Salween) నది ప్రవహిస్తున్న బర్మా, థాయిలండ్ ప్రాంతాలు, టిబెట్ లో పుట్టిన మెకాంగ్ (Mekong) ప్రవహిస్తున్న లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాల ప్రాంతాలు ఇవన్నీ ఒకనాడు భారతవర్షంగానే పిలువబడిందని భావించవచ్చు. ఈ నదులు ఆ ప్రాంతాలలో ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రవహించినట్లుగా కనబడినప్పటికీ, కన్యాకుమారి ప్రాంతం నుండి చూస్తే ఆ విశాలమైన పరిధిలో అవి తూర్పుకు ప్రవహించినట్లుగానే గోచరిస్తాయి. అవన్నీ చివరకు కలిసేది కన్యాకుమారికి తూర్పున ఉన్న సముద్రంలోనే.

బ్రహ్మపుత్ర పరీవాహకప్రాంతం


సాల్వీన్ పరీవాహకప్రాంతం


మెకాంగ్ పరీవాహకప్రాంతం

ఈనాటికి కూడా ఆ ప్రాంతాలలో రామాయణభారతాల కథలు ప్రచారంలో ఉండటం, అక్కడి రంగస్థలాలపై ఇప్పటికీ ఆ కథలు నాటకాల రూపంలోనూ నృత్యాల రూపంలోనూ ప్రదర్శింపబడుతూ ఉండటం, ఇప్పటికీ పురాణపురుషుల పేర్లను తమ సంతానానికి ఆక్కడి ప్రజలు పెట్టుకుంటూ ఉండటం, అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాలు అక్కడ ఉండటం అందుకు సజీవసాక్ష్యాలుగా మనం పరిగణించవచ్చు.
ఇంతటి విశాలమైన ప్రాంతాన్ని అంతటి ప్రాచీనకాలంలోనే భారతవర్షమనే పేరిట వ్యవహరించారు. కాని కొందరు అజ్ఞానులు మాత్రం బ్రిటిషువాళ్లు వచ్చి కలిపేదాకా భారతదేశంలో సాంస్కృతికసమైక్యత లేదన్నట్లు మాట్లాడటం ఎంతటి తెలివితక్కువతనం!
మాఘకృష్ణచతుర్థీ, ప్లవః
శ్రీనివాసకృష్ణః

#Mekong 

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/4816802028440439


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...