“చిడియోం సే మైం బాజ్ లడావూం, సవా లాఖ్ సే ఏక్ లడావూం. తబై గోవింద నామ్ కహావూం” అని గర్జించాడు గురుగోవిందసింగ్.
అంతే. “బోలే సో నిహాల్ – సత్ శ్రీ అకాల్” - అనే నినాదాలతో భూనభోऽన్తరాళాలు ప్రతిధ్వనించి పోయాయి.
గురువు గారు చేసిన ప్రతిజ్ఞ శిష్యులందరిలోను పరమోత్సాహాన్ని నింపింది.
ముగల్ సుల్తానుల దౌర్జన్యాలు అత్యాచారాలు మితిమీరి సామాన్యప్రజలు కన్నగచాట్లపాలౌతూ తమను కాపాడమని గురుగోవిందసింహుని కాపాడమని వేడుకుంటే ఆయన 1699 వైశాఖినాడు ఖల్సా పంథ్ ను తయారుచేశాడు. ఆ సందర్భంలోని వాక్యాలు ఇవి.
“చిడియోం సే మైం బాజ్ లడావూం, సవా లాఖ్ సే ఏక్ లడావూం. తబై గోవింద నామ్ కహావూం” – “నేను పిచ్చుకలతోనే యుద్ధం చేయిస్తాను. ఒక్క ఖల్సాదళయోధునితో ఒకటింపావు లక్షసైన్యాన్ని ఎదిరిస్తాను. అప్పుడే నా పేరు గోవిందసింగ్” అని దాని అర్థం.
ఆయన ఆశించినట్లే ఖల్సాయోధులు ముగల్ దౌర్జన్యకారులకు సింహస్వప్నంగా మారారు. ప్రజలు తమ రక్షకులైన ఖల్సా యోధులను ఎంతగానో ప్రేమించారు. ఆదరించారు. వారిని తమ కుటుంబసభ్యులుగా భావించారు. ముగల్ సుల్తానులకు ఇది ఏమాత్రం నచ్చలేదు.
ఆనందపూర్ సాహిబ్ పరిసరాలలోని పహాడీ రాజులతో జత కట్టి గురుగోవింద్ సింగ్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఒక్కసారిగా లక్షకు పైగా సైన్యంతో, పహాడీరాజులతో సహా వచ్చి కోటను ముట్టడించారు. సంఖ్యలో అతి తక్కువగా ఉన్న ఖల్సాయోధులు కోటలో నిర్బంధింపబడ్డారు. ముట్టడి నెలల తరబడి కొనసాగింది.
క్రమంగా కోటలో నీరు, ఆహారపదార్థాలు తరిగిపోయాయి. సమయం కనిపెట్టి, ముగలులు ఒక దొంగ రాయబారం పంపించారు. “కురాను మీద ప్రమాణం చేసి చెబుతున్నాము. మాకు కావలసింది ఆనందపూర్ సాహిబ్ కోట మాత్రమే. గురు గోవిందసింగ్ కోటను విడిచి వెళ్లిపోతే మేము ఎటువంటి హాని చేయము” అని. తన సైనికుల రక్షణకోసం గురుగోవింద్ ఆ షరతుకు అంగీకరించాడు. పరిమిత సంఖ్యలో ఉన్న తన సైనికులతోను, తన పుత్రులతోను కోట విడిచి బయలుదేరాడు.
అయితే ముగలులు తమ ఒట్టును తీసి గట్టున పెట్టారు. కోటలో ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తరువాత గురుగోవిందసింగ్ పై వెనుకనుండి దాడి చేసేందుకు పూనుకున్నారు. ఖల్సాదళం సిర్సానదిని దాటుతూ ఉండగా ఒక్క ఉదుటున పెద్ద వరదలు వచ్చాయి. ఖల్సాదళయోధులు చెదురుమదురైపోయారు. కేవలం 40 మంది అనుచరులతోను, తన ఇద్దరు పుత్రులతోను గోవిందసింగ్ అక్కడకు దగ్గరలో ఉన్న చమకౌర్ కోటను చేరుకున్నాడు. ముగలులు కూడా ఆ జాడలు కనిపెట్టి ఆ కోటను చేరుకునేందుకు ఎంతో సేపు పట్టలేదు. అయితే ఇది కేవలం మట్టి కోట. దృఢమైనది కాదు. అందువల్ల ఎక్కువకాలం దానిని కాపాడుకొనడం సాధ్యమయ్యే పని కాదు. అయితే బయట లక్షలాది ముగల్ సైన్యం. తనతో పాటు పూర్తిగా అలసిపోయి ఆకలిదప్పులతో అలమటించిపోతున్న యోధాగ్రేసరులు కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు.
గురుగోవింద సింగ్ ను తమకు ప్రాణాలతో అప్పగిస్తే మిగిలిన వారికి ఏమాత్రం హాని చేయకుండా వదిలిపెడతామని వజీర్ ఖాన్ మరోసారి కురాను మీద ప్రమాణం చేస్తూ సందేశం పంపించాడు. అయితే ఖల్సా యోధులు ఏ ఒక్కరూ అందుకు అంగీకరించలేదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ గురువును కాపాడుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు.
ముగల్ సైనికులు దాడిని ప్రారంభించారు. వారు కోటను ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే వారిని ఖల్సా యోదులు పైనుండి బాణాలతో కొట్టి తరిమివేశారు. వారు కోట తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవి బద్దలైతే గురువుగారు పట్టుబడేందుకు ఎంతో సమయం పట్టదని వారు గ్రహించారు. ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఖల్సాపంథ్ ఎంత వేగంగా ఎదిగిందో అంత త్వరగానే నశించిపోతుంది. మరలా ప్రజలందరికీ నరకప్రాయమైన ఇక్కట్లు తప్పవు. తాము కేవలం నలబైమంది యోధులు మాత్రమే. ఈ వనరులను పరిమితంగా ఉపయోగించుకోవాలి.
అందువల్ల వారు అపూర్వమైన ధైర్యసాహసాలతో ఒక ఉపాయం పన్నారు. ఉన్నట్టుండి కేవలం ఐదుగురు యోధులు మాత్రమే హఠాత్తుగా కోట తలుపులు తెరుచుకుని బయటకు దూకి దొరికిన శత్రువులను దొరికినట్టు ఊచకోత కోయసాగారు. మొగల్ సైన్యం చెల్లా చెదురైపోయింది. వారికి వచ్చినవారు కేవలం అయిదుమంది మాత్రమే అని తెలియలేదు. ఐదువందలమంది వచ్చి తమ మీద పడ్డారని భ్రమపడి భయభ్రాంతులయ్యే విధంగా భీకరమైన యుద్ధం జరిగింది. క్షణాలలో వందల కొద్ది ముగల్ సైన్యం, అశ్వికులు హతమారిపోయారు.
అయితే తీవ్రంగా గాయపడిన ఆ అయిదుగురు యోధులు యుద్ధరంగంలోనే ప్రాణాలు వదిలారు. కాని, ఆ దెబ్బనుండి తేరుకునేందుకు ముగల్ సైన్యానికి చాలసేపు పట్టింది.
ఆ తరువాత మరలా కోట తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం జరిగింది. అంతే, మరలా ఒక్కసారి మరొక అయిదుమంది వీరులు లోపలనుండి పిడుగుల్లా బయటపడ్డారు. మరలా అదే ఊచకోత. రక్తం ఏరులై పారింది. పీనుగులు గుట్టలు గుట్టలుగా పడ్డాయి. కాని చివరకు ఆ అయిదుగురు కూడా వీరమరణం పొందారు. వారిలో గోవిందసింగ్ కుమారులైన పద్దెనిమిదేండ్ల సాహిబ్జాదా అజిత్ సింగ్, పద్నాలుగేండ్ల సాహిబ్జాదా జుజూర్ సింగ్ కూడా ఉన్నారు.
మూడవసారి ప్రయత్నం చేసినపుడు మరలా అయిదుమంది యోధులు బయటకు వచ్చి ఘోరయుద్ధం చేశారు. ఇలా చేస్తూ ఉండడం వల్ల గురుగోవిందసింగ్ పట్టుబడేందుకు ఆలస్యమౌతోందే తప్ప అందరూ వీరమరణం పొందాక ఆయన ముగలులకు దొరకడం ఖాయమనిపించింది. చివరకు కోటలో ఐదు పదిమంది మాత్రమే మిగిలారు. అపుడు పాంచ్ ప్యారేలు చక్కని ఉపాయం పన్నారు. వారి ఆదేశం మేరకు సంగత్ సింగ్ తాను స్వయంగా గురువుగారి వేషం ధరించాడు.
హఠాత్తుగా కోట తలుపులు తెరచుకున్నాయి. గురుగోవింద్ సింగ్ స్వయంగా బయటకు వచ్చాడు. “పీరే ఏ హింద్ రవ్వద్” అని ఆయన శిష్యులు నినాదం చేశారు. “భారతదేశపు ఆధ్యాత్మిక నేత బయలుదేరుతున్నాడు. చేతనైతే పట్టుకోండి” అని సవాలు చేయడం అన్నమాట. ముగల్ సైన్యంలో అయోమయం బయలుదేరింది. చడీ చప్పుడు కాకుండా పలాయనమైపోకుండా ఆయన నిజంగా తనంతట తాను బయటకు వస్తాడా, వచ్చినా “దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాలు చేస్తాడా, నిజంగా అతడేనా కాదా” అని సందేహించి ఏమి చేయాలో పాలుపోకుండా ఉన్నారు.
ఈలోగా గురువు వేషంలో ఉన్న సంగత్ సింగ్ కూడా కోటనుండి బయటపడి, మరోవైపు వేగంగా ప్రయాణమయ్యాడు. అది చూసి, అతడే నిజమైన గురుగోవిందసింగ్ అని అందరూ అతడి వెంట పడ్డారు. మొత్తానికి అటు గురుగోవిందసింగు, ఇటు సంగత్ సింగు కూడా ముగల్ సైన్యాన్ని బురిడీ కొట్టించి క్షేమంగా సురక్షితప్రాంతానికి చేరుకున్నారు.
ఈ విదంగా చిన్నపాటి చమకౌర్ సాహిబ్ మట్టికోటలో కేవలం 40 మంది ఖల్సా యోధులు లక్షమంది గొప్ప ఆయుధసంపత్తి కలిగిన సుశిక్షితులైన లక్షలాది ముగల్ సైనికులను ధైర్యంగా ఎదిరించి, నిలువరించి, తమ గురువును కాపాడుకున్న ఘట్టం చరిత్రలో అపూర్వమైన సాహసంగా నిలిచిపోయింది.
ఇప్పటికి కూడా ఆ అమరవీరుల ధైర్యసాహసాలను స్మరించుకుంటే రోమాంచం పొందని భారతీయులు ఉండరు. ఇది మన అందరిలోను అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కలిగించే పోరాట పటిమ.
బోలే నిహాల్ - సత్ శ్రీ అకాల్!
)))(((
కార్తికశుక్లషష్ఠీ, భానువాసరః, శ్రీపరాభవః.
సామాన్యశకం, 15 నవంబర్, 2026




