Showing posts with label Bhattatiri. Show all posts
Showing posts with label Bhattatiri. Show all posts

Saturday, 7 November 2026

మహావధాని శూర్పణఖ









🙂
ముక్కుచెవులు కోశాడని అందరూ లక్ష్మణుడిని ఆడిపోసుకుంటారు గాని, శూర్పణఖలో దాగివున్న పాండిత్యప్రకర్షను తన స్పర్శతో బయటకు రప్పించిన అతడి గొప్పదనాన్ని ఎవరూ మెచ్చుకోరు ఎందుకో మరి!

అష్టావధానం గూర్చి అంతో ఇంతో తెలియని తెలుగువారు ఉండరు. సమస్యాపూరణం, వర్ణన, దత్తపది, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, అప్రస్తుతప్రసంగం, వ్యస్తాక్షరి వంటివి ఇందులో అంశాలు. అందులో సమస్యాపూరణంగూర్చి బోలెడు ఉదాహరణలు మనం వింటూనే ఉంటాం. సరే. నిషిద్ధాక్షరి తెలుసా. పద్యం చెప్పేటప్పుడు ఫలానా అక్షరాలను ఉపయోగించకండి అని చెబుతారు. అవధానిగారు (ఉభయలింగాలలోనూ ఇదే పదం. లేదా స్త్రీలింగంలో కాదాచిత్కేన అవధానిని అని అంటూండవచ్చు.) నిషేధింపబడిన అక్షరాలను వాడకుండా పద్యం చెప్పాలన్న మాట.

ఫలానా అక్షరాలను వాడకుండా మాట్లాడండి అని ఎవరైనా మనకు సవాలు విసిరారే అనుకోండి. మనం అలా మాట్లాడగలమా? పద్యం చెప్పమనడం లేదు. ఎప్పుడూ మాట్లాడే భాషలోనే మాట్లాడండి, కాని, ఫలానా అక్షరం వాడకండి అంటే అలా మాట్లాడగలమా, ధాటిగా ఒక ఐదు నిమిషాలపాటైనా?

అటువంటిది లక్ష్మణులవారు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు అక్షరాలను నిషేధించారు మాటలలో వాటిని వాడకూడదని. అయినప్పటికీ శూర్పణఖ ఆ సమస్యను దిగ్విజయంగా అధిగమించింది. ఆహా, మరి ఎంతటి పాండితీప్రకర్ష ఉంటే అలా చేయగలరు!

లక్ష్మణుడు నిషేధించింది ఐదు అక్షరాలను. అవి – 1. ఙ 2. ఞ 3. ణ 4. న 5. మ. శూర్పణఖ వాటిని వాడకుండా అద్భుతంగా పద్యాలను చెప్పింది. అదే పద్ధతిలో చివరన పొడుగాటి గద్యాన్ని కూడా చెప్పింది.

ఉదాహరణకు, స్థాలీపులాకన్యాయంగా ఒక పద్యం చూడండి –

హా హా! రాక్షసరాజ! దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజా
విద్యుజ్జిహ్వవిపత్తిరేవ సుకరా క్షుద్రప్రతాప! త్వయా।
ధ్వస్తాపత్రప! పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిరేతాదృశీ
జాతా కస్యచిదేవ తాపసశిశోః శస్త్రాత్ తవైవ స్వసా ॥

లక్ష్మణుడు తన ముక్కుచెవులు కోసేశాక శూర్పణఖ అన్నగారైన రావణాసురునికి తన గోడును విన్నవించుకుంటూ ఈ పద్యాన్ని చెప్పిందన్నమాట. కావాలంటే ఈ శ్లోకాన్ని వెదికి వెదికి చూడండి. ఎక్కడా నిషేధింపబడిన అక్షరాలు కనబడవు. మరి శూర్పణఖ మహాపండితురాలా కాదా మీరే చెప్పండి. సరే, ఈ పద్యానికి అర్థం కూడా చూద్దాం.

“హా హా రాక్షసరాజ” అని సంబోధించింది.
“అన్నా రావణా” అని పిలవలేదు.

అదెట్లా పిలుస్తుందండీ, పెద్దవాడు కదా. గౌరవం కొద్దీ ఏకవచనప్రయోగం చేయలేదు అనుకోకండి. లేదా - “జ్యేష్ఠులను ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా” అని కూడా అనుకోకండి.

విషయమేమిటంటే 'రావణ' అనే పదంలో ‘ణ’ అనే అక్షరం ఉన్నది కదా, అది నిషిద్ధం కదా మరి.

“మీరు అట్లాగే అంటారు లెండి. రావణా అని పేరు పెట్టి ఎట్లా పిలుస్తుందండీ, మీకు శూర్పణఖ అంటే పడక అలా చెబుతున్నారు కాని, మా శూర్పణఖ మీరనుకున్నలాంటిది కాదు, ఆవిడకు అన్నగారంటే చాల గౌరవం” అని దబాయించబోతున్నారా?

సరే కాసేపు అలాగే అనుకుందాం. కాని, చూడండి, ఆ వెంటనే -

“దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజాః” అనేసింది.

“దుష్పరాభవానికి గురైన తమరి చేతులకు ఛీ ఛీ” – అనేసింది.

ధిక్ అంటే ధిక్కరిస్తున్నాను. తిరస్కరిస్తున్నాను. ఛీ ఛీ అని అర్థం. అంటే ఆయన చేతులు బొత్తిగా పనికిరానివంటోందా – కాదు. కొన్ని పనులను ఆ చేతులు చాల సులువుగా చేసేయగలవుట. అవి ఎట్లాంటి పనులో కూడా చెప్పేసింది.

“విద్యుజ్జిహ్వవిపత్తిరేవ సుకరా క్షుద్రప్రతాప! త్వయా।” - అని తన మనసులో ఎప్పటినుండో ఉన్న మాటను యథాతథంగా చెప్పేసింది.

“ఒరే క్షుద్రప్రతాపుడా, (పనికిమాలిన పరాక్రమం కలిగినవాడా) నా భర్త అయిన విద్యుజ్జిహ్వుడికి విపత్తిని కలిగించడం (చంపడం అనే పని) మాత్రం తమరికున్న ఇరవై చేతులకు చాల సులువైన పని కదరా!” అని ఆ మాటలకు అర్థం.

పాపం ఎప్పట్నుంచి కడుపులో పెట్టుకున్నదో ఈ కోపం, మొత్తానికి వెళ్లగ్రక్కేసింది. ఇంకా -

“ధ్వస్తాపత్రప” – అన్నది. అంటే “సిగ్గు చచ్చినవాడా” – “ఒరే సిగ్గు లేనోడా” “You, shameless fellow!”- అని అర్ధం. ఇవి తిట్లు కావు, శూర్పణఖ తన అన్నగారికి ఇచ్చిన దీవెనలు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల ఇష్టం. తరువాత -

“పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిః” – అన్నది.

అంటే – “చూడు, చూడు, తమరికున్న అన్ని కళ్లతోనూ జాగ్రత్తగా చూడు” – అని అర్థం.

అందరికీ ఉన్నట్టుగా అన్నగారికి ఉన్నది రెండు కళ్లు కాదు. తలకొక జత చొప్పున పది తలలకు కలసి ఏకంగా ఇరవై కళ్లు ఉన్నాయి పేరుకు. అయినా ఆయనగారు ముక్కు చెవులు కోల్పోయి తన ముందుకు వచ్చిన చెల్లెలిని ఏమైందని అలా మాటవరసకు కూడా అడగని గొప్ప అన్నగారు. అందుకని ఒళ్లుమండి అలా దెప్పి పొడుస్తోందన్న మాట.

సరే ఏమి చూడాలట? తననే. తననే చూడాలట, ఇరవై కళ్లు వేసుకుని. ఏమైందట పాపం తనకు?

“ఏతాదృశీ జాతా తవైవ స్వసా” – అన్నది.
“తమరి చెల్లెలైన నాకు ఇటువంటి గతి పట్టింది!” అన్నది.

అంటే - "మీరేమో సమస్త రాక్షసజాతిని ఉద్ధరిస్తున్నారని అందరిచేత బాగా పొగిడించుకుంటున్నారు. కాని, స్వయానా తమరికి చెల్లెలైన నన్ను మాత్రం కాపాడలేకపోయారు" - అని ఉక్రోషం వెళ్లగ్రక్కింది.

పాపం, తన ఇరవై కళ్లకు కూడా దొరక్కుండా ఎక్కడెక్కడకు ఎప్పుడెప్పుడు వెళ్లి ఈవిడ ఏయే చేష్టలు చేస్తోందో గమనించడం ఆయనకు మాత్రం ఎట్లా సాధ్యం?

సరే, ఇటువంటి గతి పట్టింది అన్నది కదా, ఇటువంటి అంటే ఎటువంటి గతో తన నోటితో చెప్పనేలేదు. ఎందుకంటే లక్ష్మణుడు విధించిన నిషిద్ధాక్షరి నియమాన్ని పాటించాలి కదా మరి.

“నా నాసిక (ముక్కు) తెగింది” అనలేదు. ఎందుకంటే ‘నా’ అనే అక్షరం నిషిద్ధం.

“నా కర్ణాలు (చెవులు) తెగాయి” అనకూడదు. ఎందుకంటే ‘ణ’ అనే అక్షరం నిషిద్ధం కాబట్టి.

అందుకనే పాపం! నాకేం గతి పట్టిందో చూడు చూడు అని మాత్రం అన్నది.

సరే. మొత్తానికి ఆవిడ చూడు చూడు అని బలవంతం చేయగా అన్నగారు చూశారు. కాని, "ఎవరు చేశారు ఈ పని" అని మొహమాటానికి కూడా అడగలేదు. ఎందుకంటే ఆయనకు చెల్లెలంటే అంత ప్రేమ. తన చెల్లెలు ఎటువంటిదో అన్నగారికి బాగా తెలుసు. అందువల్లనే శూర్పణఖను లంకలోనే తన దగ్గరనే పెట్టుకుని ప్రేమతో చూసుకోకుండా, దూరంగా దండకారణ్యానికి పంపేశాడు. అందువల్ల అన్నగారు అడగకపోయినా ఆ పని ఎవరు చేశారో కూడా ఆవిడే చెప్పవలసి వచ్చింది.

“కస్యచిదేవ తాపసశిశోః శస్త్రాత్” - అని చెప్పింది.
“అడవిలో ఒకానొక తాపసశిశువు ఆయుధం వల్ల నాకు ఈ గతి పట్టింది” అని అర్ధం.

చూడండి. ఆవిడ ముక్కుచెవులు కోసిన ఆయన శిశువట. పాపం పిల్లాడు, తెలియక చేశాడు అనడం ఆవిడ ఉద్దేశ్యం కాదు.

లక్ష్మణుడు అని పేరు చెప్పవచ్చు కదా. చెప్పదు. ఎందుకంటే ఆయన పేరులో ఉన్న ‘ణ’ అనేది నిషిద్ధాక్షరం.
పోనీ రాముడి పేరైనా చెప్పిందా? లేదు. ఎందుకు? రామపదంలో ఉన్న ‘మ’ అనే అక్షరం కూడా నిషిద్ధాక్షరమే మరి!

ఈరకంగా ఆవిడ ఏకధాటిగా ఐదు పద్యాలు చెప్పింది. ఆ తరువాత ఇంత పొడుగు గద్యం కూడా చెప్పింది.

ఏమిటీ, గద్యం కూడానా? అసలు రామాయణంలో అటువంటి నిషిద్ధాక్షరి పద్యాలూ లేవు, గద్యం అనేది అసలు లేనే లేదు కదా అని అడుగబోతున్నారా?

అవును. మీరు అడుగుదామనుకున్న ప్రశ్న సమంజసమైనదే. ఈ పద్యాలు, గద్యమూ రామాయణంలోనివి కావు.
మరెక్కడివి?

శూర్పణఖాప్రలాపప్రబంధః అనే ఒక లఘుకావ్యంలోనివి.

సామాన్యశకం 16 వ శతాబ్దానికి చెందిన మేల్పుత్తూర్ నారాయణభట్టతిరి అనే ఒకానొక భక్తకవి ప్రబంధశైలిలో వ్రాసిన కావ్యమిది. “కూడియాట్టం, చాక్యార్ కూతు” అనే దృశ్యరూపక సంప్రదాయాలకు అనుగుణంగా ఆయన ఈ కావ్యం వ్రాశారు.

చాక్యార్ సంప్రదాయానికి చెందిన కళాకారుడు తన అద్భుతమైన అభినయంతో, శ్లోకాలను, గద్యాన్ని కూడా వ్యంగ్యభరితంగా రంగస్థలంపై ప్రదర్శిస్తాడు. కేరళదేశపు వైభవోపేతమైన సంస్కృతి అది.

సరే, ఈ ప్రబంధం పేరు శూర్పణఖాప్రలాపః.
(ప్రలాపము అది – విలాపము కాదు – అంటే ఆవిడ ఏడవటం లేదు. పేలుతోంది అన్నమాట.)

ఈ ప్రబంధానికి నిరనునాసికాప్రబంధము అని పేరు. అంటే – మనం నిషిద్ధాక్షరాలు అనుకున్నామే - ఙ,ఞ,ణ,న,మ – అనేవి అనునాసికాక్షరాలు. అవి పలుకకూడదు కాబట్టి, నిరనునాసికాప్రబంధము అని దీనికి పేరు.

సరే. మరో విషయం గమనించారా – అనునాసికాక్షరాలు మాత్రమే ఎందుకు ఇక్కడ నిషేధింపబడినట్టు?

ఎందుకంటారేమటి మహోదయులారా – ఆవిడ పలుకలేదు కాబట్టి. ఆవిడంటే ఎవరు – ఇంకెవరు? శూర్పణఖ.
అదిగో – మళ్లీ - "ఎందుకు పలుకలేదు" అని అడగబోరు కదా –

ఎట్లా పలుకగలదు చెప్పండి పాపం.

తన శస్త్రంతో ఆ తాపసశిశువు తన ముక్కు కోసేశాడు అని స్వయంగా శూర్పణఖే చెప్పింది కదా. మరి ముక్కిడి ముక్కుతో అనునాసికాక్షరాలు పలకడం అసాధ్యం కదా.

అందువల్ల, లక్ష్మణుడు అనునాసికాక్షరాలను నిషేధించాడు అని ఏదో సరదాగా అంటే నిజంగానే వారిద్దరి మధ్య ఏదో పాండిత్యస్పర్ధ కలిగిందని, చివరకు శూర్పణఖ నిషిద్ధాక్షరి నియమాలను పాటించి గెలిచేసిందని అనుకోవద్దు సుమా. 🙂

ఈ రకంగా ఎప్పుడో 16వ శతాబ్దంలోనే శూర్పణఖను troll చేస్తూ ఒక కేరళంలోనే ఒక ప్రబంధకావ్యం వెలిసింది.
ఆ విషయం అందరికీ తెలియవలసిన విషయం కదా మరి. అందుకని తెలియజేశాను.

శూర్పణఖ అభిమానుల మనోభావాలు దెబ్బతింటే నా పూచీ ఏమీ లేదు.
ఓ సినిమా డైరెక్టర్ వాల్మీకి రామాయణాన్ని ఎడాపెడా మార్చేస్తే తప్పు లేదంటారు గాని, పాపం, ఒక భట్టతిరిగారు కొన్ని పద్యాలు గద్యము వ్రాస్తే మాత్రం తప్పంటారా?

(వాల్మీకిరామాయణం ప్రకారమే శూర్పణఖ ఎటువంటిదో మునుపు మూడు పోస్టులు వ్రాసి ఉన్నాను. వీలు దొరికినపుడు వాటి లింకులు ఈ పోస్టుకు జత చేస్తాను.)

అందరికీ దీపావళీశుభాకాంక్షలు.
శూర్పణఖ ప్రేలాపన కంటె మన టపాసులు గట్టిగా ప్రేలాలి.
)))(((
నరకచతుర్దశీ, శ్రీపరాభవః. మన్దవాసరః
సామాన్యశకం, 07 నవంబర్, 2026

మహావధాని శూర్పణఖ

ముక్కుచెవులు కోశాడని అందరూ లక్ష్మణుడిని ఆడిపోసుకుంటారు గాని, శూర్పణఖలో దాగివున్న పాండిత్యప్రకర్షను తన స్పర్శతో బయటకు రప్పించిన అతడి గొప్పద...