ఎర్రనేల చేను. అక్కడ బలిష్ఠులైన వస్తాదుల్లాంటి మనుషులు గునపాలు, పారలు, తట్టలు ముందేసుకుని కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో వారిదప్ప దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే అతని భార్య దిగులుగా కూర్చుంది. వారి బిడ్డ వారిద్దరి మధ్య దిగులుగా కూర్చుంది.
ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ నిశ్శబ్దంగా మౌనవ్రతం పాటిస్తున్నట్టు ఉన్నారు. ఏమైంది? వారికేమైంది? జరిగిన విషయం తెలుసుకుంటే గాని, వారి అయోమయపు అవస్థ ఏమిటో అర్థం కాదు. పదండి తెలుసుకుందాం.
<><><>
<><><>
వేసవి కాలం. చిటపటలాడిస్తున్న ఎండ. వేడిగా వీస్తున్న గాలి. క్రింద ఎర్రనేలపై కణకణలాడుతున్న చిన్నా పెద్దా రాళ్లు. నెత్తి మీద ఒక నీళ్ల కడవను మోస్తూ ఆ రాళ్లమీద ఒక స్త్రీ జాగ్రత్తగా నడుచుకుని వస్తోంది. ఆమె ప్రక్కనే ఒక పదేండ్ల పిల్ల కూడా చిన్నపాటి మరో కడవలో నీళ్లు మోసుకొస్తోంది.
ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. "మాట్లాడితే అందుకు వొంట్లో ఉన్న కొంత శక్తి ఖర్చు అవుతుందేమో, దానిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి" అన్న పట్టుదలతో ఉన్నట్లు నిశ్శబ్దంగా నెమ్మదిగా నడుస్తున్నారు.
అప్పుడప్పుడు ఆ పిల్ల, "అమ్మా! మోసి మోసి తలకాయ నస్తా వుంది" అంటే కాసేపు ఆగి, బరువు దించుకుని మరలా తలల మీదికి ఎత్తుకొని బయలుదేరుతున్నారు. పాపం, ఓ చెట్టు క్రింద నీడలోనైనా ఆగుదామంటే, చుట్టుపక్కల అక్కడక్కడ చిన్న చిన్న పొదలే తప్ప, చెట్లే లేవాయెను!
ఇంతలో ఉన్నట్టుండి రాళ్లకు తట్లుకొని ఆ పిల్ల ముందుకు తూలి పడినంత పని అయింది. "ఇట్లైతే దెబ్బలు తగులుతాయి పాపయ్యా, నీకేమన్నా అయితేగిన మీ యప్పకి పానం బోతాది. యాడన్నా ఉన్నీలే, ఆ నీళ్లు పారబోసి ఉత్త కడవ మోసుకురా. నాతానుండే నీళ్లు సాలు" అంది ఆమె.
"లేదమ్మా! ఈట్నుంచి సక్కగా నడుస్తాలే" అంది ఆ పిల్ల.
తల్లి కంట్లో చిన్న నీటి తెర పరచుకుంది. అట్లే తుడుచుకుని ముందుకు నడిచింది. ఆ పిల్ల అనుసరించింది.
ఇంతలో వారికి దూరం నుండి గుఱ్ఱాల డెక్కల చప్పుడు వినిపించింది. ఇద్దరూ ఒక్క క్షణం ఆగి ఆ వైపు చూశారు. ఇద్దరు రౌతులు తమవైపే వస్తూ ఉండటం కనిపించింది.
"ఎవరమ్మా వారు?"
"ఏమో పాపయ్యా!"
వారు చూస్తూ ఉండగానే ఆ రౌతులు వారి వద్దకు వచ్చారు. వారి దగ్గర ఉన్న కత్తులను చూసేసరికి తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసింది. కానీ వారు మాత్రం వీరి భయాన్ని పోగొట్టేందుకన్నట్టు చిరునవ్వు నవ్వారు. వారి ముఖాలు సౌమ్యంగా, ప్రశాంతంగా ఉన్నాయి. తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసినంతసేపు పట్టలేదు, ఆ భయం పోవడానికి.
"ఎవరమ్మా మీరు? పాపం చాలా దూరం నుండి నీళ్లు మోసుకువస్తున్నట్టున్నారు?" అన్నాడు వారిద్దరిలో ఒకాయన.
"అవును అన్నా, కరువు కాలం కదా, వానలు పడక మూడేండ్లాయె. పంటల్లేక జనమంతా మా వూరిడిసి పాయిరి. మా చేనితాన నీళ్లు లేవు. వీళ్ళయ్య ఆడ బాయి తోగుతాండాడు. ఆయప్పకి నీళ్లు కొండబోతాండాము."
"బాయి తోగుతాండారా? ఆడ నీళ్లు పడకోకుంటే ఏమి జేస్తారు మడి?" అన్నాడు రెండో ఆయన.
"పడతాయి అన్నా, వీళ్ళయ్యకి నీళ్ల శాస్త్రుము తెలుసు. ఆరు మొట్లులో నీళ్లు పడతాయన్న్యాడు."
"నీళ్ల శాస్త్రం తెలుసునా?" అన్నాడు మొదటి ఆయన. "అయితే నీళ్లు పడతాయా మరి?" అని అడిగాడు చిరునవ్వుతో.
"ఊ, పడతాయి!" అన్నది ఆ చిన్న పిల్ల కళ్ళలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా.
"సరే పదప్పా, ఆ వింత ఏమిటో చూద్దాము మనం కూడా" అన్నాడు మొదటి ఆయన.
***
***
తన భార్యాబిడ్డలు పరిచయం చేయగా వారిదప్ప తవ్వకం పని కాసేపు ఆపి, ఆ ఆగంతుకులకు స్వాగతం పలికాడు. వారిదప్ప భార్య పరచిన తుంగ చాప మీద ఎండలోనే కూర్చున్నారు వారిద్దరూ.
"ఏమప్పా, నీకు నీళ్ల శాస్త్రం తెలుసునంట కదా! మడి మూడేండ్లనుండి కరువుంటే ముందరే బాయి తోక్కొని ఏంటికి సేజ్జెం సేసుకోకుపోతివి?"
"ఈ సేన్లోనే గాని, ఈ సగాల్లో యేడ్యాడా నీళ్లు లేవు పెద్దయ్యా!
అబుడు ఈ సేనేమో మాది గాకపాయె. ఆటికీ ఈ సేనాయప్పకి సెప్పితి, ఇట్ల ఊరందురుమూ గలిసి ఈ సేన్లాన వొగ బాయి తోక్కొందామప్పా, ఊర్లా సేన్లన్నిటికీ సరిపోయినన్ని నీళ్ళుండాయీడ అని. సెప్పి సెప్పి సాలైపాయ గాని ఈ సేనాయప్ప యినకపాయ, ఊర్లా జనాలు కూడా యినకపాయిరి. అందరూ ఈ మూడేండ్లలో ఊరిడిసి పాయిరి. ఈ సేనాయప్ప పోతా పోతా నాకు ఈ సేను అమ్మిడిసి పాయ. ఇంక నేనొగుణ్ణ్యే ఈడ మిగిలినాను. దానికే, నేనొగుడే బాయి తోగుతుండాను. నీళ్లు బడినంక ఊరిడిసి పోయినోళ్ళందర్నీ మళ్ళీ రమ్మనల్ల. మళ్ళీ మా వూరు మనుషులతో కలకలలాడల్ల!" అన్నాడు వారిదప్ప.
అబుడు ఈ సేనేమో మాది గాకపాయె. ఆటికీ ఈ సేనాయప్పకి సెప్పితి, ఇట్ల ఊరందురుమూ గలిసి ఈ సేన్లాన వొగ బాయి తోక్కొందామప్పా, ఊర్లా సేన్లన్నిటికీ సరిపోయినన్ని నీళ్ళుండాయీడ అని. సెప్పి సెప్పి సాలైపాయ గాని ఈ సేనాయప్ప యినకపాయ, ఊర్లా జనాలు కూడా యినకపాయిరి. అందరూ ఈ మూడేండ్లలో ఊరిడిసి పాయిరి. ఈ సేనాయప్ప పోతా పోతా నాకు ఈ సేను అమ్మిడిసి పాయ. ఇంక నేనొగుణ్ణ్యే ఈడ మిగిలినాను. దానికే, నేనొగుడే బాయి తోగుతుండాను. నీళ్లు బడినంక ఊరిడిసి పోయినోళ్ళందర్నీ మళ్ళీ రమ్మనల్ల. మళ్ళీ మా వూరు మనుషులతో కలకలలాడల్ల!" అన్నాడు వారిదప్ప.
"సరేనప్పా, బాయి తోగుతావు, సరే, కానీ, వానలు రాకుంటే రానురాను ఈ బాయి కూడా యెండిపోదా? అప్పుడేమి సేసేకుంది మడి?"
"పెద్దయ్యా! నిజమే! వానలు రాకుంటే ఎంత పెద్ద బాయిలయినా ఎండిపోతాయి. దానికే మడి, బాగా సెట్లు పెంచల్ల. సెట్లు బాగుండేతలికే వానలు బాగొస్తాయి. నీళ్ళుండేతప్పుడే సెట్లు నాటుకొని వాటిని బాగా సాకల్ల! బాతు ఉంటే గుడ్డు వస్తుంది. గుడ్డు ఉంటే బాతు వస్తుంది. బాతును సంపితే గుడ్డు రాదు, గుడ్డు లేకుంటే బాతూ పుట్టదు. అట్లే, సెట్లుంటే వానలు వస్తాయి, వానలు ఉంటే సెట్లు ఉంటాయి. మా జనాలందరూ శానా తిక్కోళ్లు. సెట్లూ గుట్టలూ కొడతాంటారు. గుట్టలు కొడితే సేజ్జం భూమి ఎక్కువైతాది అనుకుంటారు. సెట్ల నీడ పడితే పంట సరిగా రాదని సెట్లు కొడతారు. ఇట్లా ఊర్లా ఉండే సెట్లూ గుట్టలూ కొట్టి కొట్టి వానలు లేకుండా సేసుకొని, ఇబుడిట్లా ఊరిడిసిపాయిరి సుడి!"
"ఊరికే నీళ్ల శాస్త్రమంటివి, నువు సూస్తే వానలశాస్త్రము కూడా సదివినట్లుండావే వారిదప్పా?"
"వానల శాస్త్రం కాదులే పెద్దయ్యా, ఏదో వానాకాలం చదువుల శాస్త్రం" అన్నాడు వారిదప్ప సిగ్గుపడుతూ.
"సరేనప్పా, ఆరు మొట్ల బాయంటే నువ్వొగుడే తోగేకి యెబుడయ్యీని? అంతకాలుము నీ భార్య, నీ బిడ్డ యిట్ల ఎంతదూరమునుండి నీళ్లు బువ్వ మోసుకురావల్ల?"
"నాదేముందిలే పెద్దయ్యా, గుంత తోగేదొకటే పని. కానీ, వీళ్లదే పాపుము అసలైన కష్టుము" అన్నాడు వారిదప్ప మొగం సన్నది జేసుకొని.
"మా కష్టుము ఏమిలే అన్నా, నీళ్లు మోసుకొచ్చేది మాకు కొత్తపనేమీ గాదు. ఈయప్పే, ఎర్రటి ఎండలో మాడుకుంటా తోగేది సూస్తుంటే మాకు యేమేమో ఐతాది" అన్నది వారిదప్ప భార్య కన్నీళ్లు పెట్టుకుంటా.
"రైతన్నెంక యెండలో బొతుకు జేయక నీడలో గూకుని ఉత్తుత్త మాటల్తో పొద్దుబుచ్చే వాడనుకుంటివా?" అంటూ వారిదప్ప గట్టిగా నవ్వేశాడు. "ఈయమ్మ మాటలకేమిలే పెద్దయ్యా, మంచి ఆకలి పొద్దుకొచ్చినారు. మీరు గూడా రొవంత బువ్వ తినిపొండి." అన్నాడు.
ఆ ఆగంతుకులు సంతోషంగా అందుకు అంగీకరించి, ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారు. వారు వెళ్ళబోతూ ఇవ్వబోయిన డబ్బును ఆ దంపతులు వద్దంటే వద్దన్నారు. దాంతో మొదటి ఆయన తన మెడలో నున్న ఒక ఖరీదైన ముత్యాలహారాన్ని తీసి వారి కూతురి మెడలో వేశాడు.
"అయ్యో, వద్దన్నా" అని వారిదప్ప భార్య అంటే, "తల్లీ, నువ్వు నన్ను నోరారా అన్నా అన్నావు. మరి ఈ హారం మేనమామ తన మేనకోడలికి ఇచ్చిన కానుక అనుకో" అన్నాడు ఆయన చిరునవ్వుతో.
***
***
ఆ మరుసటి రోజు పొద్దునే వారిదప్ప, ఆయన భార్యాబిడ్డలు చేనులో తాము బావి తవ్వుతున్న స్థలానికి వచ్చేసరికి అక్కడ చాలామంది మనుషులు బావిని తవ్వే పనిముట్లతో సిద్ధంగా కనిపించారు.
"యెవురయ్యా మీరందరూ? యేమిటికి ఇట్లొచ్చినారు?" అన్నాడు వారిదప్ప వారిని ఆశ్చర్యంగా చూస్తూ.
"సామీ, తిమ్మరాయ ప్రభువులు మీరు ఎట్లా చెబితే అట్లా, ఎంత లోతుకంటే అంత లోతుకు మీ సేనులో బాయి తోగి రమ్మని పంపిచ్చినారు" అన్నాడు ఆ మనుషుల నాయకుడు.
తిమ్మరాయప్రభువంటే కళ్యాణదుర్గం ప్రభువు. వారిదప్ప ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు.
"ఆయప్పకి తాను బాయి తోగుతున్నట్ల ఎట్లా తెలిసింది? తెలిసినా గాని, ఇట్లా మనుషులను పంపిచ్చే అవసరము ఆయప్పకేముంది? ఇంత మంది మనుషులు తనకి సాయం జేస్తే బాగానే ఉంటుంది కానీ, కరువు కాలంలో నీళ్లు పడేదంకన్నా ఇంతమందిని బువ్వ బెట్టి సాకి, నీళ్లు బడినంక వీళ్లికి దుడ్లిచ్చి పంపిచ్చేకి తాను పెద్ద సావుకారేమీ కాదే? అట్లని మీ సాయమేమీ నాకొద్దు, మీ దారిన మీరు పోండప్పా అనేకి వాళ్ళు మామూలు మనుషులు కారే? ప్రభువులు పంపిన మనుషులను వద్దు పొమ్మని తిరస్కరిస్తే ప్రభువులకు ఆగ్రహం రాదా?"
ఆశ్చర్యంతో మొదలైన వారిదప్ప ఆలోచన కాస్త విషాదంగా పరిణమించింది. పాపం, ప్రభువుల అనుగ్రహం కూడా సామాన్యులకు మహాభారం అని ఆ ప్రభువులకు ఎట్లా తెలిసేది?
వారిదప్ప ఏమీ మాట్లాడకుండా, ఏమి చేయాలో, ఎలా చేయాలో కూడా చెప్పకుండా నిశ్శబ్దంగా తలపట్టుకు కూర్చున్నాడు. పాపం, వారిదప్ప భార్య, ఆయన బిడ్డ కూడా ఏమి చేయాలో తెలియక బిక్కు బిక్కు మంటూ అలాగే కూర్చున్నారు. నిన్నటి వరకు ఎవరి సాయమూ లేకపోయినా హాయిగా సాగిన వారి పని, ఇప్పుడు ఇంతమంది సహాయానికి వచ్చినా ముందుకు సాగలేక ఆగిపోయింది. వచ్చిన మనుషులు కూడా ఏం చేయాలో తెలియక అలాగే వారి చుట్టూ కూర్చుండి పోయారు. ఎవ్వరూ ఒకరితో ఒకరు ఏమి మాట్లాడాలో తెలియక సామూహిక మౌనవ్రతం ఆచరిస్తున్న మనుషుల్లా ఉండిపోయారు. అదీ జరిగిన కథ!
<><><>
<><><>
మధ్యాహ్నసమయానికి వారిదప్ప బిడ్డ తన మెడలో ఉన్న గొలుసును తడుముకుంటూ ఉత్సాహంగా ఒక కేక వేసింది. "అమ్మా! అదిగో మామ వస్తున్నాడు"
దూరంగా వస్తున్న వారిని చూసి చుట్టూ కూర్చున్న మనుషులందరూ లేచి నిలబడ్డారు. వారు దగ్గరకు వచ్చి గుఱ్ఱాలు దిగగానే అందరూ తలలు వంచి, "ప్రభువులకు వందనాలు" అన్నారు.
వారిదప్ప కుటుంబం పొందిన భయసంభ్రమాశ్చర్యాలకు అంతే లేదు. తిమ్మరాయ ప్రభువు దగ్గరకు వచ్చి తన మేనకోడలిని ఎత్తుకున్నాడు. "ఏమి వారిదప్పా? వారికి పని చెప్పకుండా అట్లే కూర్చోబెట్టినావంట?" అన్నాడు నవ్వుతూ.
వారిదప్ప ఏమి మాట్లాడాలో తెలియక వినయంగా నమస్కారం చేసి నిలుచున్నాడు.
"వారిదప్పా! నేటినుండి నీవు రాజోద్యోగివి. ఇకపై నుండి వీరందరూ నీ అనుచరులు. నువ్వు వారిపై అధికారివి. నీకు, మా చెల్లెలికి ఇష్టమైతేనే సుమా! ముందు నీ చేనిలో బావి త్రవ్వకం పూర్తి చేసుకో. చెట్లు నాటు. ఆ తరువాత మన రాజ్యంలో పర్యటించి ఎక్కడ నీరు ఉందని నీకు అనిపిస్తే అక్కడ బావులు తవ్వించడం, చెట్లు నాటించడం నీపని. నీ చేతులమీదుగా మన రాజ్యం హరితసౌభాగ్యాన్ని పొందాలి. అది నా కోరిక!" అన్నాడు తిమ్మరాయ ప్రభువు.
"మహాప్రసాదం ప్రభూ!"
“"సరే, అందరికీ భోజనాలు కూడా తెప్పించాము, ప్రొద్దున నుండి అందరూ ఉపవాసం చేసి పుణ్యం బాగానే సంపాదించారు, ఇప్పుడు భోజనం చేసి కార్యరంగంలోకి ప్రవేశించండి! వారిదప్పా! నువ్వు మొదట చెట్లు నాటించబోయే నీ స్వగ్రామం ఇకపై నుండి "చెట్టూరు" గా పిలవబడుతుంది. మీ యింటిపేరు కూడా చెట్టూరు అవుతుంది!” అన్నారు ప్రభువులు చిరునవ్వు నవ్వుతూ.
"ధన్యుడిని ప్రభూ!" అన్నాడు శెట్టూరు వారిదప్ప.
((గమనిక: కథ కల్పితమే కానీ, కథలో వర్ణించబడిన పరిస్థితులు రాయలసీమలో నిజంగా ఉన్నవేనని, ఆ పరిస్థితులను నివారించేందుకు మన శెట్టూరు వారిదప్ప చెప్పిన విషయాలు పాటించదగినవే అని చదువరులు గ్రహించగలరు.))
No comments:
Post a Comment