Monday 17 December 2018

అభ్యంతరాలు ఎదురైనా సంస్కృతప్రచారం ఆపకండి.

18-04-2017 నాడు ఫేస్ బుక్ లో నేను వ్రాసిన పోస్టు ఇది.

)))(((
#హిందూపురంలోని సోదరీసోదరులారా!
#సంస్కృతం మాట్లాడటం చాలా సులువు!
పదిరోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు కేటాయించగలరా?
నేను మాట్లాడటం నేర్చుకున్నది ఒక్క వారంరోజుల్లోనే! 
మీరు నాకంటే త్వరగా నేర్చుకోగలరు! నాకంటే బాగా మాట్లాడగలరు!
#సంస్కృతభారతి వారి బోధనప్రణాళిక అటువంటిది!
***
సంస్కృత భారతి సంస్థ వారు సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు నడుం బిగించి దశాబ్దాలు దాటారు. మన దేశంలో కొన్ని లక్షలమంది ఇపుడు సంస్కృతం మాట్లాడుతున్నారు. సంస్కృతం మృతభాష అని వెక్కిరించినవారు, అభిప్రాయపడినవారు పాపం, ఇపుడు తెల్లబోయి చూస్తున్నారు.
***
(ఎప్పుడు?)
2017 వ సంవత్సరం మే నెల 9 వ తేదీనుండి ఒక పది రోజులు.
(అర్హులు ఎవరు?)
12 సంవత్సరాలు నిండిన ఆడా మగా చిన్నా పెద్దా ఎవరైనా సరే!
(ఎక్కడ?)
అనంతపురం జిల్లా - హిందూపురంలో - నింకంపల్లి రోడ్డు - కంచి కామాక్షీ కళ్యాణ మంటపం వెనుక -
(ఎవరిని సంప్రదించాలి?)
డాక్టర్ పోతరాజు త్రిశూలపాణి, అనంతపురం - 94400 06439
డాక్టర్ కె కె వి శర్మ, అనంతపురం - 94403 61342
శ్రీ జి నాగేంద్ర, హిందూపురం - 96660 02100
శ్రీమతి పేరా సుధాస్రవంతి, హిందూపురం - 98665 55689
(శుల్కం - అంటే ఫీజు ఎంత?)
డబ్బు రూపేణా వస్తు రూపేణా మీరు ఏమీ ఇవ్వనవసరం లేదు.
మీ శ్రద్ధ, మీ ఆసక్తి, మీరు నేర్చుకున్నదాన్ని అవసరమైనపుడు ఇతరులకు నేర్పే ఓర్పు ఉంటే చాలు.
***
సరే, ఆ విధంగా ఒక పది రోజులు నేర్పించి మళ్ళీ మాదారిన మమ్మల్ని వదిలేస్తారా అని ముందే ఒక అభిప్రాయానికి రాకండి.
1 ప్రతివారం ఒక రోజు ఒక గంటపాటు సమావేశమై మరిన్ని నైపుణ్యాలను సంతరించుకొనేందుకు గాను - సాప్తాహిక సమ్మేళనం - ఉంటుంది.
2 మీకు ఉత్సాహం ఉంటే - మీరే స్వయంగా 3 - 10 సంవత్సరాల పిల్లలకు బాలసంస్కృతకేంద్రాలు నిర్వహించడానికి తగిన ప్రోత్సాహం శిక్షణ ఇస్తారు.
ఇంకా ఆసక్తి ఉన్నవాళ్లు ఉంటే -
3 సంస్కృతం ద్వారా భగవద్గీతను అధ్యయనం చేసేందుకు గీతాశిక్షణ కేంద్రం ప్రారంభిస్తారు.
4 & 5 & 6 మీరు సంస్కృతంలో నైపుణ్యాన్ని సాధిస్తున్న కొద్దీ మరింతగా నేర్చుకునేందుకు రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. సంస్కృతభారతి వారు మీ తోబుట్టువుల్లా మీకు తోడ్పడతారు.
***
#రాయలసీమలో దాదాపు మన ఇంటి ముంగిట మనకు లభిస్తున్న ఈ చక్కని అవకాశాన్ని జారిపోకుండా అందిపుచ్చుకుందాం. మన సోదరీసోదరులు మరో పదిమందికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దాం!
#జైరాయలసీమ
#జైసంస్కృతం

)))(((
దానికి అరుణ్ విరసం గారు తమ అభ్యంతరం తెలియజేసిన విధం ఇది.

Arun Virasam హిందూపురం ప్రజలకు నేర్పవలసింది సంస్కృతం కాదు
తాగునీరు లేకపోయినా బతకాగలిగే నేర్పు.ప్రజల మౌళికావసరాలు పట్టించుకోకుండా ఎమ్ చేసినా ప్రచారం వస్తుందేమో గాని,ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.కూడుపెట్టే చదువు చెప్పండి.
అన్నీ ఉండి, తీరికావున్నవాళ్ళు సంస్కృతం నేర్చుకోవచ్చు,అరబ్,ఫ్రెంచి భాషలు నేర్వవచ్చు,, బతుకుతెరువుకోసం,పిల్లల్ని,పెద్దల్ని ఊర్లో వదలి వలపోతున్న వాళ్ళ విషయం ఆలోచించండి,

)))(((
ఆయన అభ్యంతరానికి నేను చెప్పిన సమాధానం ఇది.

श्रीनिवास कृष्णः Arun Virasam మహోదయా! 
మీరన్నది నిజం! ప్రశంసనీయం! తక్షణమాచరణీయం! 
సంస్కృతం లేకుండా జీవితాంతం బ్రతకవచ్చునేమో గాని, త్రాగునీరు లేకుండా ఒక్కరోజు కూడా బ్రతికే పరిస్థితి లేదు!


అయితే, కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది.
ప్రపంచం వైవిధ్యభరితమైనది. ప్రతిదానికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మనకు ఎక్కువ అవసరమైనదాన్ని ఎక్కువగా ఆదరించి అక్కరలేనిదాన్ని తక్కువచేయడం మానవనైజం. మీరు కూడా చేస్తున్నది అదే. మీ మాటలకు అర్థం అదే. 

కాని, మనమేం చేసినా మామిడి చెట్టు మామిడికాయల్నే ఇస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయల్నే కాస్తుంది. అడివిలోనూ మానససరోవరంలోనూ వొయ్యారాలు పోయే నెమళ్లనూ హంసలనూ తన్ని తరిమేసి కోళ్లూ గొర్లూ పెంచుకొందాం, మనకు ఆకలేసినపుడు వాటిని కోసుకు తినొచ్చు అని ఎవరికైనా ఆలోచన వస్తే నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే క్షుద్బాధ ఎంత భయంకరమైనదో నాకు తెలుసు కాబట్టి. అలాగని ఎవరికో పనికిరామనే బెంగతో నెమళ్లు కోళ్లు కాలేవు, హంసలు గొర్లు కాలేవు. అంత ఆకలేస్తే నెమళ్లనూ హంసలనూ పట్టుకొని అలాగే తినేసినా అవి ఏమీ చేయలేవు కూడా. పాపం కవులూ భావుకులూ వాటిని ఎంతెంతగా పొగిడినప్పటికీ, after all అవి కూడా, అమాయికప్ప్రాణులే కదా!

అలాగే ఇక్కడ సంస్కృతం కాస్తో కూస్తో చదువుకున్నవారు కూడా అలాగే ఉన్నారు. వారికి తెలిసిన విద్యను వారు బోధిస్తున్నారు. వారు ఎవరినీ సహాయం యాచించటం లేదు. ముందే చెప్పాను కదా? చక్కగా ఎదిగిన మామిడి చెట్టు మామిడి కాయలను ఇతరులకోసం ఎలా కాస్తుందో, అలాగే వారు తమకు తెలిసిన సంస్కారవిద్యాఫలాలను తాము అందిస్తున్నారు.

అన్నీ ఉండి తీరిక ఉన్నవాళ్లు మాత్రమే సంస్కృతం నేర్చుకోవాలి అని మీరు శాసిస్తున్నారు. పోనీ అలాగే కానివ్వండి. అటువంటి వాళ్లనే రానివ్వండి. ఎటువంటి వాళ్లు వచ్చినా వాళ్లు నేర్పిస్తారు.

కూడు పెట్టే చదువులు చెప్పండి అంటున్నారు. కూడు పెడుతుందో లేదో? ఏం పెట్టినా పెట్టకున్నా వారు సంస్కృతం సంస్కారం తప్ప మరొకటి మరొకటి నేర్పలేరు. మార్కెట్లో డిమాండు ఉన్నా లేకున్నా, రేటు ఆకాశాన్ని తాకినా, పాతాళంలోనికి కుంగినా ఓ టమోటా మొక్క టమోటాకాయలే కాస్తుంది గాని, రేగు కాయల్ని, నేరేడుకాయల్ని మరొక మరొక ఆపిల్ కాయల్ని ద్రాక్షలనూ కాయలేదు. 

మరోమాట. సంస్కృతభారతివారు ప్రచారం కోసం ఇలాంటి పని చేయటం లేదు. హిందూపురంలో మాత్రమే చేయటం లేదు. తమ కర్తవ్యం అని భావించి వారు చేస్తున్న పనుల వల్ల ప్రజలకు ఏమైనా ఒరుగుతుందో లేదో - అది ప్రజలే తేల్చుకుంటారు.

పిల్లల్ని పెద్దల్ని ఊళ్లో వదలి వలసపోతున్న వాళ్ల విషయం చూడండి అంటున్నారు. మంచి విషయమే. కాని, సంస్కృతభారతి వారు కోటీశ్వరులేం కాదు అందరినీ పోషించడానికి. అవన్నీ చూసుకోవలసింది ప్రభుత్వాలు. సంస్కృతభారతి రాజకీయసంస్థ కాదు. సంస్కృతప్రేమికుల సంస్థ. వారు చేయగలిగింది మాత్రమే వారు చేయగలరు. మీరు చేయగలిగింది మీరు చేయండి. లేదా వారిని కలుపుకుంటే ఫలానా ప్రజాప్రయోజనకరమైన పనిని చేయగలం అనుకుంటే వారితో ఆ విషయం ప్రస్తావించి, ఒప్పించి చేసేందుకు ప్రయత్నించండి.

ధన్యవాదాలు

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...