ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును
((మొదటి భాగం))
స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి వల్కులకేల కల్గెనో యతులిత మాధురీమహిమ?
అని శ్రీకృష్ణదేవరాయలు తన ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేయగా తెనాలి రామలింగడు దొరికిందే అవకాశమని దిగ్గున లేచి, వికటమైన సమాధానంతో తన వికటకవిత్వాన్ని నిరూపించుకున్నాడని తెలుసు కదా?
•○●□•○●□•○●□
((ఇంత వరకు చదివిన వారికి ముందస్తు క్షమాపణలతో ఒక చిన్న విన్నపం:
చదవబోయే మాటల్లో ఒక వాక్యానికి మరో వాక్యానికి గాని - ఒక పేరాకు మరో పేరాకు గాని సంబంధమేమిటనే చింతలను విడిచి ముందుకు సాగగలరు -అని.))
•○●□•○●□•○●□
రామలింగడి కళ్లు నెత్తికెక్కాయని అపుడెవరూ అనుకోలేదు. చివరకు ధూర్జటి కూడా నవ్వుకుని ఉంటాడు.
కాని కైపెక్కిన ఒక కలియుగ కీచకుడు చేసిన వెధవపనిని
నెత్తి పైకెక్కి నిజాన్ని రికార్డు చేసి చూపిన కళ్లను (సిసి కెమెరాలను) దించేసి వంచేసే (వమ్ము చేసే) ప్రయత్నాలు తెగ జోరుగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలు విడిపోయినా పరస్పరసహకారం కొనసాగాలని చేసిన తీర్మానం ఇంచక్కా అమలవుతూ ఉంటే మనసు పులకరించని వాడు పాపాత్ముడన్న మాట!
బాలుడని పేరు కలిగిన వారందరికీ బాలల మనస్తత్వమే ఉంటుందనుకొనే వారే నిజమైన బాలలని బాలయ్య గారు కూడా తన కళ్లు నెత్తికెక్కించుకుని మరీ నిరూపించారు.
నెత్తికెక్కిన కళ్లను దింపేవారెవరు ఏ కాలంలోనూ లేరా?
•○●□•○●□•○●□
తమిళనాట "నక్కీరన్" అని ఒక పత్రిక.
"గోపాల్" అనే ఆయన అనుకుంటా - దానికి అధిపతి.
తమిళంలో నక్కీరన్ అంటారు.
తెలుగులో నత్కీరుడు అందాం.
నత్కీరుడు మనసా వాచా కర్మణా గొప్ప శివభక్తుడు.
అబ్బో, గజ మొండివాడు.
తప్పు ఎవడు చేసినా తప్పే అనేవాడు.
అంతవరకూ బాగానే ఉంది.
ఆమాత్రం అందరూ ఒప్పుకుంటారు.
కాని ఈ నత్కీరుడు వెతికి వెతికి తప్పులు పట్టేవాడు.
అతడు పాండ్యమహారాజు ఆస్థానకవి.
అతడు తప్పు లేదంటేనే ఎవరికైనా పనులౌతాయి.
అందువల్ల రాజుగారి దగ్గర ఎవరి పనులూ కావటం లేదు.
సమస్యలు రాజుగారి వరకు రావటం లేదు.
పేదవారి గోడు రాజుగారికి వినబడటం లేదు.
విన్నపాలు చేసుకుందామనే వారి ఆర్తి రాజుగారికి కనబడటం లేదు.
జనాలందరూ నెత్తికెక్కిన వీడి కళ్లు ఎవరు దించుతారా, ఎప్పుడు దించుతారా అని దేవుడి మీద భారం వేసి కూర్చున్నారు.
శివభక్తుడి జోలికి వెళ్లేందుకు మిగిలిన దేవతలందరూ భయపడ్డారు.
ఎప్పుడోకప్పుడు, కనీసం సాక్షాత్తు ఆ శివుడి పనులే ఆగిపోయినపుడు, ఆ శివుడే దిగివచ్చి వీడి కళ్లను నెత్తిమీదనుంచి దించుతాడు అనుకున్నారు.
ఆ సమయం రానే వచ్చింది.
•○●□•○●□•○●□
అలా ఉండగా ఓసారి పెద్ద కరువొచ్చింది.
జనాలందరూ ఊళ్లొదిలి వలసపోతున్నారు.
ఆ ఊళ్లో గుడికొచ్చేందుకు ఎవరూ మిగల్లేదు.
పూజారి తన పెళ్లాం బిడ్డల ఆకలిని చూసి తట్టుకోలేక తాను కూడా వలస పోయేందుకు అనుమతినిమ్మని శివుని అడిగాడు.
"నేనో పద్యం వ్రాసిస్తా. అది రాజు గారి దగ్గరకు తీసుకుపోయి చదువు. రాజుగారు మెచ్చుకుని నిన్ను పోషిస్తారు" అని శివుడు ఓ పద్యం వ్రాసిచ్చాడు.
పూజారి రాజసభకు ఎలాగో కష్టపడి వెళ్లాడు.
పద్యం చదివాడు.
రాజుగారు సంతోషపడ్డారు.
కాని మన నత్కీరుడు అభ్యంతరం చెప్పాడు.
"తప్పిది, చెప్పరాదు, కవితాసమయంబున కొప్పుగాదు, నీ విప్పగిదిన్ రచింపదగునే?" అంటూ - ఈనాటి భాషలో చెప్పాలంటే - "అడ్డుపుల్ల వేశాడు".
పూజారి నిజం చెప్పేశాడు.
"ఠఠ్! శివుడైతే పెద్ద గొప్పా? తప్పు తప్పే" పొమ్మన్నాడు నత్కీరుడు.
పూజారి వెళ్లి శివుడికి ఫిర్యాదు చేశాడు.
దాంతో శివుడే స్వయంగా రాజసభకు విచ్చేశాడు.
"నత్కీరుండూరకె తప్పు బట్టెనట?
యేదీ? లక్షణంబో? యలంకారంబో? పదబంధమో? రసమొ? చక్కంజెప్పుడీ తప్పునన్."
అని మాజోరుగా అడిగాడు.
"స్త్రీకేశాలకు సహజమైన సుగంధం ఎక్కడైనా ఉంటుందా?
కాని నువ్వలా పద్యం చెప్పావు.
అందుకే తప్పు" అన్నాడు నత్కీరుడు.
పార్వతీదేవి కేశాలకు సహజసుగంధం ఉంటుంది అన్నాడు శివుడు.
ఓపక్క చెబుతున్నది సాక్షాత్తు శివుడే.
తన ఆరాధ్యదైవమే!
అయినా ఏమాత్రం తగ్గలేదు నత్కీరుడు.
"అలా అయితే ఈ కవిత్వం మీ లోకంలో చెల్లుతుంది గాని మా లోకంలో చెల్లదు" పొమ్మన్నాడు.
ఓర్నీ!
శివుడు లేని లోకమంటూ ఒకటుందా?
నత్కీరుడికంటూ ఒక ప్రత్యేక లోకం ఉందా?
ఆ లోకంలో సర్వాంతర్యామి అయిన శివుడికి స్థానం లేదా?
మూర్ఖత్వానికైనా ఒక హద్దు ఉండవద్దా?
శివుడికి ఒళ్లు మండింది.
కుష్టురోగివైపో అని శపించేశాడు.
అప్పటికి నత్కీరుడి కళ్లు నెత్తిమీదనుండి క్రిందకు దిగాయి.
క్షమించమని కాళ్లబడ్డాడు.
పాపం బోళాశంకరుడు!
జాలి పడ్డాడు.
"కైలాసదర్శనం చేసుకో. రోగం కుదురుతుంది"
అని ఉపాయం చెప్పాడు.
•○●□•○●□•○●□
నత్కీరుడు హడలిపోయాడు.
దక్షిణంలో ఉండే నేనెక్కడ?
ఉత్తరాన ఉన్న కైలాసమెక్కడ?
ఎన్ని మహానదుల్ వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవీ
ళ్లెన్ని మృగంబులెన్ని జనహీనములైన పథంబులెన్ని నే
నెన్నియు దాటి యే కరణినీశ్వరు శైలము చూడబోయెదన్?
గన్నది కాదు విన్నయది కాని, సదాశివ! యేమి సేయుదున్?
అని విచారంతో ఉత్తరదిశగా తన ప్రయాణం ప్రారంభించాడు.
నడుస్తూ నడుస్తూ క్రమంగా ఒక నిర్మలమైన తటాకం చెంతకు చేరుకున్నాడు.
నడుస్తూ నడుస్తూ క్రమంగా ఒక నిర్మలమైన తటాకం చెంతకు చేరుకున్నాడు.
తటాకం ఒడ్డున శివపూజకు కూర్చున్నాడు.
తటాకం ఒడ్డున ఒక చెట్టుంది.
ఆ చెట్టు మీద ఒక యక్షిణి ఉంది.
ఆమె నరమాంసభక్షిణి.
కాని ఆమెకు కూడా ఒక నీతి ఉంది.
మహాశివభక్తుల్ని ఆమె తినదు.
క్రింద నత్కీరుడు శివపూజ చేస్తున్నాడు.
వాణ్ణి తినరాదు.
కాని పూజలో ఏదైనా లోపం కనిపిస్తే అమాంతం మింగేయవచ్చు.
కాబట్టి నత్కీరుడి ఏకాగ్రతను చెడగొట్టి పట్టుకుందామని ఆ యక్షిణి ఒక మంచి ప్లాను వేసింది.
•○●□•○●□•○●□
((మిగిలిన కథ రెండో భాగంలో చదవండి.))
అంత వరకు ఇదిగో హోం వర్కు:
1. ప్రస్తుతం మన దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎవరెవరి కళ్లు నెత్తికెక్కి ఉన్నవో లిస్టు వ్రాసుకొనుము. ఎలా ఎక్కి ఉన్నవో కూడా స్వయముగా వివరించుకొనుము.
(గమనిక: హోం వర్కు చేయని వారికి ఈ కథను చదివిన ఫలితము సిద్ధింపదు)
No comments:
Post a Comment