Friday, 28 December 2018

Sorry, Yours is a Wrong Call


అనగనగా ఒక ముసలవ్వ.
ఆ అవ్వకు ఏడుగురు కొడుకులు.
పెద్ద కొడుకు సైన్యంలో ఉన్నాడు.
మిగిలిన ఆరుగురూ అవ్వను చూసుకుంటూ ఊళ్లోనే ఉన్నారు. 

ఇలా ఉండగా ఒకసారి యుద్ధం వచ్చింది.
పెద్ద కొడుకు చనిపోయాడని వార్త వచ్చింది.
ఊళ్ళో అందరూ ఆమెపై సానుభూతి కురిపించారు.
ఆమె మాత్రం రెండో కొడుకును యుద్ధానికి పంపింది.

అతడు కూడా చనిపోయాడని వార్త వచ్చింది. ఊరంతా బాధ పడుతూ ఉంటే ఆమె మూడో కొడుకును యుద్ధానికి పంపింది. అతడు కూడా చనిపోయాడు. అపుడు నాలుగో కొడుకును పంపింది. అలా ఒకరొకరుగా ఆరుగురు కొడుకులు యుద్ధంలో చనిపోయారు. ఊర్లో జనాల బాధకు అంతే లేదు. కాని ఆ మొండి ముసలవ్వ అందరూ వద్దు, వద్దు అంటున్నా, చివరి కొడుకైనా నీకు తోడుగా ఉంటాడంటున్నా పట్టించుకోకుండా యుద్ధానికి పంపింది. చివరకు అతడు కూడా చనిపోయినట్టు తెలిసింది. 

అప్పడు ఆ ముసలవ్వ ఏడవటం మొదలు పెట్టింది.

జనాలు ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. "వద్దు వద్దన్నా పంపించావు. ఇప్పుడు ఏడుస్తున్నావు. మిగిలిన ఆరుగురు చనిపోయినప్పుడు ఏడవలేదు. ఇప్పుడు ఏడో కొడుకు చనిపోయాక ఎందుకు ఏడుస్తావు?" అని అడిగారు.

అప్పుడు ఆ అవ్వ "నేను నా ఏడో కొడుకు చనిపోయినందుకు ఏడవటం లేదు, యుద్ధానికి పంపటానికి నాకు మరికొంతమంది కొడుకులు లేరే అని ఏడుస్తున్నాను" అని అన్నదట! 
<><><><><><><>
<><><><><><><>

ఇది మా అవ్వ మాకు చెప్పిన కథ. చాల చాల చిన్నప్పుడు విన్నది.
అది విన్నపుడు నేను ఏడ్చి కన్నీళ్లు పెట్టింది నాకు ఇంకా గుర్తుంది. 

ఈ కథ పెద్దైన తరువాత కూడా మరెక్కడో చదివాను. అవ్వ గుర్తుకు వచ్చింది. మళ్ళీ చదవకుండా ఉండి ఉంటే మరచి పోయి ఉండే వాడినేమో! ఇది వీరమాతృత్వాన్ని ప్రశంసించే కథ! అసలు ఈ కథ అలా ఎప్పటినుండి ప్రచారంలో ఉందో తెలియనే తెలియదు. ఈ కథను సృష్టించినదెవరో మరి! దేశం కోసం ప్రజలు తమ ప్రాణాలను ధారపోయాలని పరోక్షంగా చెప్పిన కథ అది. తప్పేముంది? చాల మంచి కథే!
<><><><><><><> 
<><><><><><><>

పారిశ్రామికవిప్లవం వచ్చాక యూరోపియన్ దేశాలు తమ ఆయుధసంపత్తితో ప్రపంచదేశాల మీద పడ్డాయి. దొరికిన ప్రాంతాన్ని దొరికినట్టు ఆక్రమించుకొని అక్కడి జనాలను దాదాపు బానిసలుగా చేసుకొని, వ్యాపారము ధనార్జన మాత్రమే ప్రధాన లక్ష్యాలుగా ప్రజలమీద పెత్తనం చెలాయించాయి. 

శతాబ్దాల తరబడి వారు దోచుకున్న ధనమే పెట్టుబడిగా పెట్టి ఆ దేశాలు ఇప్పటికీ ధనిక దేశాలుగా వెలిగిపోతున్నాయి. దాన్ని వాళ్ళు తమ దేశపు వ్యాపారులు చేసిన సంపద సృష్టి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ సంపదలో అత్యధిక శాతం సృష్టింపబడింది వారి వారి వలస దేశాలలోనే తప్ప వారి దేశాలలో కాదు అన్నది చారిత్రక సత్యం. 

ఆ వలస స్వాముల నిర్దాక్షిణ్యమైన భారీ దోపిడీకి అనాగరిక జాతులైన ఆఫ్రికన్ల నుండి గొప్ప నాగరికత కలిగిన భారతదేశం వరకూ అందరూ బాధితులే! 

మనమే ఇంకా అదృష్టవంతులం! ఆఫ్రికన్లు చాలాకాలం పాటు బానిసలుగా సంతలో పశువుల్లా క్రయవిక్రయాలకు గురి అయ్యే వారు. ఆస్ట్రేలియా అమెరికా ఖండాలలో నేటివ్ లను దాదాపు సర్వనాశనం చేసి అవి తరతరాలుగా తమ జన్మభూముల్లా దర్జా ఒలకబోస్తున్న వారు ఒకనాటి యూరోపియన్లే కదా! 

మనమీద కూడా జలియన్ వాలా బాగ్ వంటి దౌర్జన్యపూరిత మారణకాండలు జరిపినా జంకకుండా పోరాడి పోరాడి మొత్తానికి వారిని ఎలాగో తరిమేశామనిపించుకొని, స్వాతంత్ర్యం వంటి పదార్థాన్ని ఒకదాన్ని తెచ్చుకొని, మన కర్మ మనం అనుభవిస్తున్నాము. కుంటుతూ పడుతూ లేస్తూ మన పాట్లు ఏవో మనం పడుతున్నాము. 
<><><><><><><>

ఇలా ఒకనాడు పాశ్చాత్య దేశాల సంపద సృష్టికి ఇతోऽధికంగా ఉపయోగపడిన బానిసదేశాలు మాత్రం ఈనాడు పేదరికంతో మగ్గిపోతుండగా, 

ఆ సంపదను సృష్టించుకున్న దేశాలు మాత్రం పెత్తనం చేసే బుద్ధులు ఇంకా పోనిచ్చుకోలేక, చమురు ఎగుమతి చేసే దేశాల గొడవలలో తల దూర్చి, వాటితో పెట్టుకుని, కొరివితో తల గోక్కునారు. గ్లోబల్ టెర్రరిజం అనే కొత్త సమస్యను సృష్టించారు. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేక ఇపుడు అభద్రతా భావంతో, మునుపటి కంటే మరింత భయంకరమైన ఆయుధాలను సృష్టించుకుని భయం భయంగా గడిపేస్తున్నారు. 

చమురు ఎగుమతి చేసే ఈ మధ్య ఆసియాదేశాలు తమ వ్యవహారాల్లో విదేశాలజోక్యాన్ని భరించలేక, వారిని తరిమివేయాలి అనుకొనడం మంచిదే. చాల సహజమైన ప్రతిక్రియే. 

కాని, వారు ఆ ఉద్యమాన్ని పొరబాటున మతానికి అటాచ్ చేశారు. 

అంతే! ఆ ఉద్యమం విద్యావంతుల చేజారిపోయింది. పడరాని వారి చేతుల్లో పడింది. ఆపైన అది కొమ్ములు విరవబడని మహోగ్ర మతోన్మాద ఉగ్రవాద భూతంగా తయారై, అడ్డూ అదుపూ లేక, అసలా ఉద్యమం ఎందుకు పుట్టిందో కూడా తెలియని మూర్ఖత్వంతో వారి వారి దేశాలకు ఎటువంటి హాని కూడా చేయని అమాయిక దేశాల మీద కూడా పడి సర్వ ప్రపంచానికి శత్రువుగా తయారైంది. 

అందువల్ల ఆయా దేశాలలో ఇటువంటి తీవ్రవాద ఉద్యమాల మీద సదభిప్రాయం గాని ఆదరణ గాని పెద్దగా లేదు. ఇటువంటి ఉద్యమాల పట్ల సానుభూతి ఉన్నవారి సంఖ్య పెద్ద గొప్పగా ఏమీ లేదు. 

అందువల్ల, భారత్ పాకిస్తాన్ వంటి దేశాలనుండి కూడా యువకులను ఆకర్షించి, ట్రైనింగ్ ఇచ్చి, తమ సంస్థలలో రిక్రూట్ చేసుకుని, తాము చేస్తున్న మారణహోమాలకు వారిని సమిధలుగా ఉపయోగించుకుంటూ, అలా ఉపయోగపడటం ఒక ఘనకార్యంగా చెబుతూ, వారిని అమరవీరులుగా కీర్తిస్తూ, జన్నత్ లో వారి స్థానం శాశ్వతంగా ఉంటుందని కురాన్ లో లేని కొత్త ప్రవచనాలను కూడా వీరే రాసేస్తూ, వాటినే బోధిస్తూ, అలజడి సృష్టిస్తున్నారు. 
<><><><><><><>

సరే, భారతదేశంలో కొందరు "మహా" నాయకులు పాశ్చాత్య దేశాలలో జరిగిన సంపద సృష్టి విధానాన్ని బాగా "స్టడీ" చేశారు! 

అక్కడ యూరోప్ లో జరిగిన భయంకర సంపద సృష్టిని, తద్వారా అక్కడ ఆవిర్భవించిన "మహోన్నతసంస్కృతిని" తమ దేశాలలో కూడా సృష్టించి, ప్రచారం చేసి తాము కూడా లాభపడదాం అనుకుంటూ విజనరీలుగా దార్శనికులుగా తమను తాము ప్రమోట్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు. 

ఇపుడు చూడండి - 

దేశంలో స్వదేశీ కార్పొరేట్ సంస్థలు విచ్చల విడిగా పెరుగుతున్నాయి. 
విదేశీ వ్యాపార సంస్థలు భారత దేశంలోనికి కాలు మోపడానికి విరివిగా లక్షల కోట్ల రూపాయల విలువైన MOUలు కుదుర్చుకుంటున్నాయి(ట). 

మరి ఈనాడు వారి వారి వ్యాపారాలకు చవకగా దొరికే కూలి మనుషులు కావాలి. 
పోనీ, కూలి అనకుంటే జీతాలు అనుకోండి. 

మనుషులు, మనుషులు, మనుషులు కావాలి. 
సంపద సృష్టికి ప్రధానమైనవి - మానవ వనరులు - అట. 
అవి విరివిగా కావాలి.

కాని, భారతదేశం అంతా మనుషులతో నిండిపోయి ఉన్నా, పనికి మనుషులు ఎవరూ దొరకటం లేదే? 
రైతులకు కూలీలు దొరకటం లేదు. 
ఇద్దరూ ఉద్యోగులే ఉన్న ఇంట్లో పనిమనిషి దొరకడం కూడా కష్టంగానే ఉంది. 
అస్సలు దొరకరని కాదు, వారిని దొరికించుకొనేంత కూలీ నువ్వు ఇవ్వలేవు కాబట్టి దొరకరు. 
లోకల్ గా ఉన్న భారతీయులకే దొరకని కూలీలు 
ఇపుడు కొత్తగా వచ్చే విదేశీ కంపెనీలకు మాత్రం ఎలా దొరుకుతారు? 

దొరకకపోతే విదేశీ కంపెనీలు రావు. 
చవకగా దొరికే వేరే దేశాలకే పోతాయి. 
అవి సోకాల్డ్ మహానాయకులు తమకు ఉందని ప్రచారం చేసుకొనే అదేదో రకం గ్రాఫిక్ విజన్ చూసి మురిసి పోయి, ఎగిరి గంతులేసుకుంటూ రావు కదా? 

విజన్ను చూసి మురిసిపోయి వస్తాయి అని ఏ వెధవ అయినా అంటే ఈ సారి చెప్పుచ్చుకు కొట్టండి. 

ఈ విషయం తనకు కూడా కాస్త అర్థమైన తరువాత, మన విజనరీ మహానాయకుడు పిల్లల్ని కనండహో, సాధ్యమైనంత ఎక్కువగా పిల్లల్ని కనండహో అని నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నాడు. 

కొత్త దంపతులు అలాంటి మాటల మాయలో భ్రమిసి అలా కనేసేరు జాగ్రత్త! 

ఇపుడు ఉన్నవారికే సరైన చదువులు చెప్పించ లేక, 
సరైన వైద్య సదుపాయం కల్పించ లేక, 
సరైన నివాసం చూపించ లేక, 
సరైన ఉపాధి కూడా కల్పించలేని దుఃస్థితిలో ఉన్న ఈ విమనాడు (విజనరీ మహా నాయకుడు)
తన మాటను అమాయికంగా నమ్మేసి నవదంపతులు అధిక సంతానాన్ని కంటే, 
ఇపుడువారికి సౌకర్యాలకంటె మరింత అధికంగా వారికి ఏమివ్వగలడు? 

అప్పటికి ఈయన జవాబు చెప్పడానికి కూడా ఉండడు. ఆయన వారసులు ఈనాటి ఈయన మాటకి ఆనాడు బాధ్యత వహించరు. 

ఆ అధిక సంతానానికి భవిష్యత్తులో కూలి ఉద్యోగాలు వచ్చినా అది అత్యంత గొప్ప విషయంగా, తాము సాధించిన ఘనకార్యంగా డప్పులు కొట్టుకుంటారు గుర్తు పెట్టుకోండి! 

ఈరోజు ఈ మాటలు నమ్మి మోసపోతే, 2050 నాటికి "ఇంటికో కూలి ఉద్యోగపథకం" అనేది ఒక గొప్ప ఎన్నికల నినాదంగా రూపు దిద్దుకుంటుంది. 
<><><><><><><>

జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక రైతు కూడా ఈ విషయంలో మోసాన్ని అర్థం చేసుకోగలడు.

ఒక ఎకరా భూమిలో ఒక మనిషి పని చేస్తే 
కాస్త పంట వస్తుంది. 

ఇద్దరు పని చేస్తే, 
మరి కొంత అధికంగా పండించగలరు. 

ముగ్గురు పని చేస్తే, 
మరీ ఎక్కువ రాకున్నా, కాస్త పెరగ వచ్చు. 

నలుగురు పని చేస్తే, 
ముగ్గురు కలసి పండించిన దానికంటే అధికంగా రాక పోవచ్చు. 

ఇక ఐదో వాడు చేరితే? 
అంత వరకూ వస్తున్న పంట కంటే తక్కువ వచ్చే ప్రమాదం ఉంది. 

ఇలాంటి స్థితిలో ఆరో వాడు కూడా నేను సైతం అంటూ వస్తే? 
పొలంలో మరింత పంట పండేది లేదు కాని, అంత వరకూ ఐదుమంది మూడు పూటలా, కడుపు నిండా తింటున్నా సరిపోయిన పంట, ఇపుడు ఆరోవాడికి సరిపోకపోవచ్చు. 

దానికి తోడు ఏడో వాడు వస్తే? 
పంట పండించే సంగతి మరచి, ఉన్న ఆహారాన్ని ఎవరెవరెవరు ఎన్తెన్తెంత పంచుకోవాలో గొడవలు మొదలౌతాయి. 

వీళ్ళ గొడవల్లో వీళ్ళు ఉండగా ఎనిమిదో వాడు, తొమ్మిదో వాడు, పదో వాడు అంటూ అడ్డూ అదుపూ లేక జనాలు పుట్టుకొస్తూనే ఉంటే? 
అప్పుడేమిటి పరిష్కారం?

పొలాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్మేసుకుని తలాకింత పంచేసుకుంటే - 

అపుడు చేతిలో కాస్త డబ్బులు ఆడుతాయి - 
సరే, కాని, కడుపు నిండే పంట ఏదీ? 
సింగపూరుకు, జపానుకు, చైనాకు రోజూ ఫ్లైట్లో వెళ్లి తినేసి వద్దామా? 

ఉన్నదాంతో ప్రశాంతంగా ఉండక, అవసరమా ఇప్పుడా అధిక సంతానం గొడవలు, తలనెప్పులు? 
<><><><><><><>

ఇక్కడ మన భారతదేశమే ఆ పొలం!
ప్రజలే రైతులు!
పెరిగే జనాభాతో పాటు పొలం కూడా అదే దామాషాలో పెరిగే అవకాశం లేనే లేదు. 
అది అందరికీ తెలుసు. 
తెలియనట్టు నటించే వెధవలకు చెప్పుతో సన్మానం!
అధిక సంతానం వద్దు, ఆ మాటలకు మోసపోవద్దు!
<><><><><><><>

అయినా, 
మొదట కథలో చెప్పినట్టు, ఆ ముసలమ్మలాగ మన దేశాన్ని రక్షించుకొనేందుకు వీరులైన సంతానాన్ని కన్నా అందులో ఒక గౌరవం ఉంటుంది కాని, 

* దేశాన్ని మరలా ప్రచ్ఛన్నంగా దోచుకుపోయేందుకు వస్తున్న విదేశీకంపెనీలకు కూలీలుగా ఉండేందుకు, 
* సినిమాజనాల కటౌట్లకు మేకలను బలి ఇచ్చి తలలు వేలాడదీసేందుకు, 
* సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని తమ నాయకుడు చేస్తున్న వెధవ పనులను వ్యతిరేకించిన వారిని అదేపనిగా తిడుతూ వేధించడానికి, 
* క్రికెట్ మైదానాలలో ఫోర్లు సిక్సర్లకు కేరింతలు కొట్టి క్రికెట్ బోర్డుకు ఆదాయం తెచ్చి పెట్టే వనరులుగా మారేందుకు, 

- జస్ట్, జస్ట్, ఇలాంటి పనులు చేసేందుకు సంతానాన్ని కనడంలో ఏమి గౌరవం ఉంటుంది విజనరీ గారు? 

Shame on You, for Your Wrong Call

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...