Monday, 17 December 2018

అది పెద్దల సభా కాదు, వారు పెద్దలూ కారు

(1)
"పెద్దలందరూ విచ్చేస్తారు.  ఆ పెద్దల కోసం వెంటనే ఒక సభను నిర్మించవయ్యా విదురా" అన్నాడు ధృతరాష్ట్రుడు.  
"మన పెద్దలు నిర్మించిన సభ ఇప్పటికే ఉంది కదా అన్నా?  మరలా ఒక క్రొత్త సభ దేనికి?"
"పిల్లలు ముచ్చట పడుతున్నారు.  పాండవులను పిలిచి వారితో ఆ సభలో జూదమాడుతారట."
"అన్నా, ఇదేం బాగులేదు.  దీనివల్ల గృహకలహాలు చెలరేగుతాయి.  సర్వనాశనం కలుగుతుంది.  ఈ సభానిర్మాణమనే ఆలోచననూ, జూదమనే ఆలోచననూ విరమించుకోండి".
"ముందు నువు ఎక్కువగా ఆలోచించకు.  నా ఆజ్ఞను పాటించు."
"చిత్తం."
(2)
తోరణస్ఫటికం అనే ఆ పెద్దల సభకు చిన్నా పెద్దా అందరూ విచ్చేశారు.  జూదం మొదలుపెట్టడానికి పెద్దాయన ధృతరాష్ట్రుడు అనుమతించాడు.  ఆ పెద్దల మధ్య మేము మహాక్షత్రియవంశసంజాతులము అనే ఆభిజాత్యం కలిగిన మహారాజులు జూదం ఆడటం మొదలుపెట్టారు.  దుర్యోధనుడు గెలుస్తున్నకొద్దీ కౌరవులు ఉత్సాహంగా కేకలు వేస్తూ ఓడుతున్న పాండవులను గేలిచేయడం మొదలుపెట్టారు.
"రాజా! నా మాట విని ఇంతటితో జూదం ఆపమని చెప్పండి.  మీరు జూదానికి ముందు కూడా ధనికులేగాని, దరిద్రులు కాదు కదా?  ఈ జూదం వినోదం కోసం కాక వికృతానందంకోసం సాగుతున్నట్టనిపిస్తోంది" అన్నాడు విదురుడు.    
"ఏమయ్యో, విదురా!  నిన్నెవడడిగాడని సలహాలు చెబుతున్నావ్?  నువ్వు మా పక్కలో పాములాంటివాడివి. నిన్ను మా దగ్గర పెట్టుకొనడం కూడా పాపమే.  నువ్వు మాకేం అవసరం లేదు.  మాకేం బోధించాల్సిన అవసరం లేదు." అని గర్జించాడు దుర్యోధనుడు.  "సరే, ఆయన మాటలు పట్టించుకోవద్దు.  మనం జూదం కొనసాగిద్దాం" అన్నాడు.  చిన్నాన్న అంతటివాడినే పేరుపెట్టి బెదిరించిన దుర్యోధనుడిని చూసి అంతా భయపడి నోరుమూసుకున్నారు.
క్రమంగా ధర్మరాజు తన తమ్ములను ఓడిపోయాడు.  తనను ఓడిపోయాడు.  ద్రౌపదిని కూడా పందెం పెట్టాల్సిందేనన్నాడు శకుని.  సరేనన్నాడు ఆ మహా ధర్మాత్ముడు.  సభ మొత్తం ఛీఛీఛీ అనే మాటలతో ప్రతిధ్వనించిపోయింది.  విదురుని మొహం వాలిపోయింది.  భీష్మద్రోణకృపాచార్యులవంటి పెద్దలకు కంపరమెత్తి ఏమీ చేయలేని నిస్సహాయతతో సిగ్గుతో వంటినిండా చెమటపట్టింది.  ఆ పెద్దలలో ఆనందించినవాడు ఒక్క ధృతరాష్ట్రుడే.  గుడ్డివాడైన అతడు అప్పుడే ఆ పందెం కూడా గెలిచేశామనుకున్నాడు పాపం.
శకుని పాచికలు వేశాడు.  "మేమే గెలిచాం" అని గొంతెత్తి అరిచాడు.  కౌరవుల అరుపులు కేకలతో సభ దద్ధరిల్లిపోయింది.
(3)
దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.  "ఓయ్,  విదురా! ఇపుడు ద్రౌపది మా దాసి.  నువ్వు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి మా భవనం ఊడ్పించు.  పో. పోయి తీసుకురా." అన్నాడు. 
"నీకు పోయే కాలం వచ్చింది" అని విదురుడు తిరస్కరించాడు.
దుర్యోధనుడు ప్రాతికామిని పంపించాడు. 
అతడు కాసేవయాక వెనుదిరిగి వచ్చి "వాడెవడో దుర్యోధనుడు పిలవడమేమిటి, నేను రావడమేమిటి?  సభలో పెద్దలను ధర్మమేమిటో అడిగిరా" అని ద్రౌపది పంపింది అని చెప్పాడు.  తాము పెద్దలమని సభలో ఎవ్వరూ అనుకున్నట్టు లేదు.  ఎవరూ నోరెత్తలేదు.
"ఓయ్ ప్రాతికామీ!  ఆమెను ఆమాట పెద్దలసభకే వచ్చి అడగమను.  ధర్మమేమిటో ఇక్కడకే వచ్చి తేల్చుకోమను. ఫో!" అని కసిరాడు దుర్యోధనుడు.  
ప్రాతికామి దుర్యోధనుడి మాటలను పట్టించుకోకుండా మళ్లీ పెద్దలసభనే అడిగాడు: "ద్రౌపది ప్రశ్నకు నన్నేం సమాధానం చెప్పమంటారు?"
వాడి నిర్లక్ష్యానికి దుర్యోధనుడికి ఒళ్లు మండింది. 
"దుశ్శాసనా!  ఈ పిరికివెధవను పక్కకు నెట్టి నువ్వెళ్లి ద్రౌపదిని లాక్కురాపో.  ఓడిపోయిన బానిసలు ఈ పాండవులు మనల్నేం చేయగలరు?" అన్నాడు.
నేను రజస్వలను, ఏకవస్త్రను. ఈ స్థితిలో నన్ను సభకు రమ్మనడం న్యాయం కాదు అని ద్రౌపది బ్రతిమలాడినా దుశ్శాసనుడు తన తల్లి ముందే ద్రౌపది జుట్టుపట్టుకొని, నువు ఏకవస్త్రవైనా వివస్త్రవైనా రావలసిందే అని దుర్భాషలాడుతూ ఆమెను పెద్దలసభకు ఈడ్చుకుపోయాడు.  భరతమహారాజవంశానికి కోడలై వచ్చిన స్త్రీకి ఆ దుర్భరావమానం కలగడం ఆ సభ కళ్లారా చూసింది.
"సభలోని పెద్దలు ధర్మం చెప్పండి.  ధర్మరాజు నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?" అని ద్రౌపది పెద్దలను సూటిగా అడిగింది.  పెద్దలమని కూర్చున్నవారు నోరు పెగిల్చి మాటాడకపోయేసరికి చిన్నవాడైనా వికర్ణుడు లేచి ద్రౌపదిని ధర్మరాజు పందెంలో పెట్టడం అధర్మమని ఘోషించాడు.  సభలో జనాలు అతనిని మెచ్చుకున్నారు.
కర్ణుడికి అతని మీద కోపమొచ్చింది.  "ఇంతమంది పెద్దవారికి తెలియని ధర్మం పిల్లకాకివి, నీకు తెలిసిందా? నోరుమూసుకో." అన్నాడు.  "దుశ్శాసనా!  వీడి మాటలకేం గాని, ముందు ద్రౌపది వస్త్రాలు ఊడబెరుకు" అన్నాడు.  
ఆ మాత్రం ప్రోత్సాహం లభించేసరికి దుశ్శాసనుడికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి.  వికటాట్టహాసం చేస్తూ ఆ పని చేయబోయాడు.  కాని సభలోని పెద్దలెవరికీ ఇది తప్పు, అలా చేయవద్దు అనడానికి కూడా మాటలు రాలేదు.  ఇంతలో దుశ్శాసనుడికి గర్వభంగమైంది.  కృష్ణుడు ద్రౌపదీమానసంరక్షణం చేశాడు.
అంత పని చేయబోయిన దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానంటూ భీముడు భీకరప్రతిజ్ఞ చేశాడు.  ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పమని విదురుడు సభను కోరాడు.  ధర్మరాజే సమాధానం చెప్పాలి అని భీష్ముడు తప్పించుకున్నాడు.  "నువ్వే చెప్పాలట!  చెప్పవయ్యా మరి!" అని దుర్యోధనుడు హేళనగా అంటూ తన తొడను ప్రదర్శించాడు.  ధర్మరాజు ఊ అనగానే ద్రౌపదిని అక్కడ కూర్చోబెట్టుకుంటాను అన్నట్టుగా. 
భీముడికి మండిపోయింది.  "ఉరే! యుద్ధంలో ఆ తొడను విరగ్గొడతాను చూడరా!" అంటూ మరో భయంకరప్రతిజ్ఞ చేశాడు.
 (4)
పదమూడు సంవత్సరాలు గడిచాయి. 
మా రాజ్యాన్ని మాకిచ్చేయండి.  లేకపోతే ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అంటూ పాండవులు కౌరవులకు సందేశం పంపారు.
ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు.  "విదురా! వచ్చి రెండు మంచి మాటలు చెప్పిపో" అని కబురు పంపాడు. 
విదురుడు వచ్చాడు.  "రాజా! నీ కొడుకులు చస్తారేమోననే భయంతో నీకు నిద్రపట్టడం లేదు.  కనీసం ఇప్పుడైనా నా మాట విని, పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసెయ్.  వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు.  నీ కొడుకులను కాపాడుకో" అన్నాడు.
"అంతమంది పెద్దల ఎదుట సభలో జరిగినది అన్యాయమెలా అవుతుంది?" అన్నాడు ధృతరాష్ట్రుడు.
"అది సభా కాదు, అక్కడున్నవారు పెద్దలూ కాదు" అన్నాడు విదురుడు.  "అలా పిలిపించుకునే హక్కు వారెవరికీ లేదు" అనేశాడు.  
న సా సభా యత్ర న సంతి వృద్ధాః
న సా వృద్దా యే న వదంతి ధర్మమ్।
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి 
న తత్ సత్యం యత్ ఛలేనాభ్యుపేతమ్।।
(మహాభారతం.5.35.58)
పెద్దలు లేని సభ సభే కాదు.
ధర్మం చెప్పని పెద్దలు పెద్దలే కాదు.
సత్యం లేని ధర్మం ధర్మమే కాదు.
మోసంతో కూడినది (పదిమంది పలికినా) సత్యం కానే కాదు.
అని వివరించి, 
"కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః।  
సుకృతే దుష్కృతే చైవ  చత్వారః సమభాగినః।। 
పాపమైనా పుణ్యమైనా చేసినవాడు, చేయించినవాడు, చేయడానికి అనుమతించినవాడు, బాగా చేశారని మెచ్చుకున్నవాడు సమానభాగస్థులు.  అందరూ ఎవరి ఫలం వారు అనుభవించి తీరుతారు" అని చెప్పాడు.
 (5)
భీముడు అన్నంతపనీ చేశాడు.  యుద్ధంలో దుశ్శాసనుణ్ణి ఓడించి పడగొట్టాడు. "ఏరా? నిరపరాధి అయిన ద్రౌపదిని ఈ చేత్తోనే కదరా ఈడ్చావు?" అని, ఆ చేతిని కసిగా విరిచేశాడు.  ఆ చేత్తోనే అతని చెంపలను వాయించాడు. అతని రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు.  ఆ భీకరదృశ్యం చూసి "భీముడెంత క్రూరుడు!" అని అపుడు చాలామంది రొమ్ము బాదుకున్నారు.  వారెవరికీ "పెద్దలసభలో" దుశ్శాసనుడు చేసిన వెధవపనులు గుర్తుకురాలేదు!
యుద్ధంలోనే కర్ణుడి రథం నేలలో క్రుంగిపోయింది.  "అర్జునా!  కాసేపు ఆగు! బాణాలు వేయకు!  నేను అసహాయస్థితిలో ఉన్నాను."  అన్నాడు.  మునుపు ద్రౌపది అసహాయస్థితిలో ఉండగా "పెద్దలసభలో" అందరి ఎదుట ద్రౌపది వంటిమీదున్న బట్టలను తాను లాగివేయమని చెప్పిన తన దుర్మార్గపు మాటలు తనకే గుర్తురాలేదు ఆ పెద్దమనిషికి!  అప్పుడు ద్రౌపదిని రక్షించిన కృష్ణుడే ఇప్పుడు అర్జునునిచేత నిర్దాక్షిణ్యంగా శిక్ష విధింపజేశాడు.
శకుని తల సహదేవుని బాణం దెబ్బకు మొండెం నుండి వేరై క్రిందపడింది.  జూదం కోసం పెద్దలసభ నిర్మాణానికి ప్రేరకుడైనవాడు నేలకూలిపోయాడు.
ఎందరు ఎన్నిరకాలుగా చెప్పినా వినకుండా పరమమూర్ఖంగా యుద్ధానికి దిగి, తనవారందరినీ కోల్పోయిన దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు.  బయటకు వచ్చి యుద్ధం చేయమంటే "నాకు రాజ్యం మీద ఆసక్తి పోయింది.  నేను వనవాసం చేస్తాను.  రాజ్యం నువే తీసుకో" అని మొదలు పెట్టాడు.  "మేము అడిగినప్పుడు ఇవ్వకుండా ఇంతమంది చావడానికి కారణమై ఇప్పుడు ధర్మపన్నాలు చెప్పకు" అన్నమీదట బయటకొచ్చాడు.  భీముడితో యుద్ధంలో తొడలు విరగగొట్టించుకున్నాడు.  గదాయుద్ధంలో అలా చేయరాదని కొందరు భీముడిని నిందించారే గాని, అసలు దుర్యోధనుడు తన తొడ చూపి ద్రౌపదికి అసభ్యంగా సైగ చేసిన విషయం వారికి గుర్తుకురాలేదు!
మొత్తానికి అలా అపుడెపుడో పెద్దల సభలో జరిగిన అన్యాయానికి తగిన ప్రతికారం జరిగింది.
 (6)
ఆనాటి ద్రౌపది మనకాలం నాటి ప్రజాస్వామ్యం.  ఆనాడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేయబోతే కృష్ణుడు కాపాడాడు.  ఈనాడు మరోపార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోనికి రాజ్యాంగవిరుద్ధంగా ఆకర్షిస్తూ, ప్రజాస్వామ్యపు విలువలను కాలరాస్తూ ఉన్న అభినవకౌరవులనుండి దాన్ని కాపాడేందుకు ఎవరు దిగివస్తారో?  ప్రజాస్వామ్యానికి నాథులు ప్రజలే.  రాబోయే యుద్ధంలో (ఎన్నికలలో) జరిగిన పరాభవానికి తగిన ప్రతికారం చేసేందుకు సన్నద్ధులు కావాలి.
(22-04-2017 నాడు https://telugu.asianetnews.com/editorial/we-see-mahabharata-repeated-in-our-politics-everyday లో ప్రచురింపబడిన నా వ్యాసం.)

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...