Wednesday, 26 December 2018

కల్యాణదుర్గం పూటకూళ్లవ్వ కథ



కొన్ని వందల సంవత్సరాల క్రితం...
కల్యాణదుర్గం ముఖద్వారం. సూర్యాస్తమయం కావస్తోంది.


కోట పై బురుజున ఉన్న కాలగణనయంత్రం సూచన ఇవ్వగానే అక్కడి భటులు ఆరు గంటలు మ్రోగించారు. ద్వారం వద్ద ఉన్న కావలి వారు వాకిలి మూసేందుకు సంసిద్ధులయ్యారు. గంట మ్రోగిన ఐదు నిమిషాలలో ఖచ్చితంగా వాకిలి మూతబడవలసిందేనని రాజాజ్ఞ. అందువలన కోట లోపలి పోవలసిన వారు పరుగు పరుగున వస్తున్నారు. "బిరీన రాండి, బిరీన రాండి" అంటూ భటులు వారిని తొందర పెట్టి, కనబడుతున్నవారిలో చివరి వ్యక్తి లోనికి రాగానే తాము కూడా లోనికి వెళ్లి వాకిలి బిగించేశారు.

అలా బిగించిన కాసేపటికి గుఱ్ఱాలు నురగలు కక్కుతూ ఉండగా ఓ పెద్దాయన, ఆయనతో పాటు మరో నలుగురు యువకులూ స్వారీ చేసుకుంటూ వచ్చారు. "ఓ కావలివాండ్రూ! కాస్త వాకిలి తీయండయ్యా! అనుకోకుండా ఆలస్యమైపోయింది!" అన్నాడా పెద్దాయన కోటగోడపై కనిపిస్తున్న భటులతో.

"క్షమించండి సామీ, మళ్ళీ పొద్దున్నే వాకిలి తెరిచేది! రాజాజ్ఞ!" అన్నారు వారు.

"మా ఆలస్యానికి సుంకం చెల్లిస్తామయ్యా. మీ రాజుగారి ఖజానాకు లాభమే కదా!" అన్నాడాయన.
"మా కోటలో అట్లాంటి సుంకాలేమీ లేవు. మళ్ళీ రేప్పొద్దు పొడిసినంకే తెరిసేది! అప్పుడు రాండి" అన్నారు కావలి వాళ్ళు.

"యాంపా? అంతసేపు రాత్రంతా సల్లో మేము యాడుండేది?" అన్నాడో యువకుడు నిస్సహాయతను కనబరుస్తూ.

"రొవంతట్ల పడమటికి కూతవేటంత దూరం పోండి. ఆడొగ పూటకూళ్ళవ్వ వుండాది. మీయాకట్లోళ్లందురూ రాత్రికి ఆడుండి పొద్దునే వస్తుంటారు".

"సరేనపా, అట్లైతే అట్లే జేస్తాంలే" అన్నాడు ఆ పెద్దాయన. ఆయన, ఆయనతో పాటు వచ్చిన నలుగురు యువకులు ఆ పూటకూళ్ళవ్వ ఇంటికి చేరుకున్నారు.

పూటకూళ్ళవ్వ వారికి ప్రేమతో స్వాగతం పలికి, అప్పటికప్పుడు వంట చేసి వారికి కడుపు నిండా అన్నం పెట్టింది. అప్పుడు వారిని అడిగింది - "ఎక్కడ ఎంత పని ఉన్నా పొద్దుముణిగేతలికే కోటలోపలికి పోవల్ల గదా? మడి ఏమిటికాలస్యమైంది?" అని అడిగింది.

"యెబుడూ పొద్దుముణిగేతలికే వస్తుంటిమి అవా! ఈపొద్దు దావలో కొందురు దొంగోళ్లు నామిందకొచ్చినారు. అబుడు ఈ పిల్లోళ్ళొచ్చి వచ్చి నన్ను కాపాడినారు" అన్నాడు ఆ పెద్దాయన.

"అవునా! ఏమప్పా మడి నువ్వు సూస్తే సావుకారాకట్ల ఉండావు. ఈ పిల్లోళ్ళు సూస్తే యాదో బతుకెదుక్కుంటా తిరుగుతున్నట్ల ఉండారు. నువ్వేమన్న జేసి ఈ పిల్లోళ్ల బొదుకు నిలబెట్టరాదా?" అని అడిగేసింది పూటకూళ్ళవ్వ.

"అట్లేమడగొద్దు లేవా! ఈయప్ప కూడా అట్లే జెప్పి మమ్మల్ని ఎనకేసుకొచ్చినాడు. మేము ఈయప్పని కాపాడినామని శానా మురిసిపోయి రమ్మంటే సరేనని వొచ్చినాము" అన్నాడొక యువకుడు నవ్వుతూ.

"అవునా! సరే, మంచోడేలే ఈయప్ప! వొప్పుకుణ్ణ్యాను. మడి మీ కథ ఏమి, చెప్పండి."

"నా పేరు ప్రతాపుడు. మావూరు గుమ్మఘట్ట."
"నా పేరు తపనుడు. మావూరు రంగసముద్రం."
"నాపేరు పద్మనాభుడు. మావూరు చిన్నపల్లి."
"నాపేరు జయవంతుడు . మావూరు జయపురం".

"సరే, యాటికిట్లా బయల్దేరినారు?"

"ఇంకేమిటికవా? యాడన్నా యేమన్నా వుజ్జోగం జిక్కితే సేసుకుందామని రాజధానికి బయల్దేరినాము. దావలో ఈ పెద్దాయప్ప దొంగులకు చిక్కి కానొచ్చ. కాపాడితిమి. వొరే పిల్లోండ్లూ, నాతో రాండ్రా, యాడన్నా వుజ్జోగం యేపిస్తానంటే సరే పదాని యిట్లా ఆయప్పెనికినే వచ్చినాము."

"బాగుందే మీ కథ! యాంపా పెద్దమనిషీ, మడేమి వుజ్జోగమిప్పిస్తావప్పా యీ పిల్లోండ్లికి?"
"యాదో వొగుట్లేవా! ఆయప్ప ఆ మాట అనే తలికే మాకు ప్రాణాలు లేచొచ్చినయ్!" అన్నాడు జయవంతుడు.

"సరే, యింక అందరూ పండుకోండి. పొద్దునే పోదురంట!"

"సరే, మడి నీ కథ యేందవా? జనాలందరూ కోట లోపల్నే వుంటే నువ్వేమిట్ల కోట బయల్లో గుడిసేసుకోనుండావు? దొంగలు రారా? బయమేసెల్దా?"

"దొంగలు కూడా మనుషులే కదా? వాళ్ళు కూడా ఇంత బువ్వ తినిపోతారు. నాదగ్గర ఏముందని వాళ్ళు దోసుకుపొయ్యేకి?" అంది అవ్వ నవ్వి.
*****
పొద్దు పుట్టగానే ఆ పెద్దమనిషి వెనక కోటలోనికి పోయాక గాని ఆ యువకులకు తెలిసిరాలేదు, తాము కాపాడింది సాక్షాత్తు కళ్యాణదుర్గం ప్రభువైన తిమ్మరాయుడిని అని. ఆయన ఒంటరిగా ప్రజల మంచిచెడ్డలను తెలుసుకొనేందుకు మారువేషంలో కోట బయటకు వెళ్లి వస్తూ ఉండగా దారిలో దొంగలు దాడి చేయడం తాము ఆయనను కాపాడడం యాదృచ్ఛికంగా జరిగిపోయింది.

వారంతా సంభ్రమాశ్చర్యాలతో, భయభక్తులతో తెలియక అనుచితంగా ప్రవర్తించినా, మాట్లాడినా క్షమించమని కోరారు. తిమ్మరాయడు నిండు సభలో ఆ నలుగురు యువకులు తనను దొంగలబారినుండి కాపాడిన వైనాన్ని తెలియజేసి కృతజ్ఞతగా వారికేమి కావాలో కోరుకోమన్నాడు. వారు "తమ కొలువులో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తే అదే చాలు" అన్నారు.

"సరే లెండయ్యా! ఉద్యోగం ఎట్లాగూ ఇస్తాను. అది కాకుండా, మీకు ఇంకేం కావాల్నో కోరుకోండి" అన్నాడు ప్రభువు.

"మా వూర్లో నాకొక మంచి ఇల్లు కావాలి" అన్నాడు ప్రతాపుడు.

"ఓయీ భవననిర్మాణమంత్రీ! రాబోయే పండుగ లోపు ప్రతాపునికి ఒక అద్భుతమైన ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయించాలి" అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"కళ్యాణదుర్గం నుండి మా వూరికి మంచి రహదారి కావాలి ప్రభూ, మావూరి ప్రజలకు మంచి సౌకర్యంగా ఉంటుంది." అన్నాడు తపనుడు.

"ఓయీ రహదారుల మంత్రీ! ఏ కాలంలోనైనా చెక్కుచెదరని చక్కని రహదారి ఒక నెలరోజులలో వేయించు." అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"నాకు మంచి కుటుంబంలో పిల్లను చూసి పెళ్లి చేయండి ప్రభూ!'' అన్నాడు కాసింత సిగ్గుతో, పద్మనాభుడు.

"ఏమయ్యా జనసంక్షేమశాఖామంత్రీ! మీ అమ్మాయికి యోగ్యుడైన వరుడు కావాలని వెదుకుతున్నావు కదా! ఇటువంటి పరాక్రమశాలికంటే యోగ్యుడు ఎక్కడుంటాడయ్యా! వధువుకు, ఆమె తల్లికి ఇతనిని చూపించి, ఎవరికీ అభ్యంతరం లేకుంటే ఇతనికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా!" అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"ప్రభూ, ప్రతియేటా ఒకసారి తమరు మావూరికొచ్చి నా యింట భోంచేసి పోవాలి. ఇదే నా కోరిక" అన్నాడు జయవంతుడు.

అందరూ అది విని ఆశ్చర్యపోయారు. వీడేమి తిక్కలోడురా? ప్రభువంతటి ప్రభువు అనుగ్రహించి వరం కోరుకొమ్మంటే ఇలా అడిగేశాడు అనుకున్నారు. తిమ్మరాయప్రభువు మాత్రమే చిరునవ్వు నవ్వి సరే అన్నాడు.

ఆ తరువాత జయవంతుని కోర్కెను నెరవేర్చే పనిలో పడ్డారు రాజోద్యోగులు. జయవంతుని స్వగ్రామమైన జయపురానికి ప్రభువుగారి రాకపోకలు సౌకర్యంగా ఉండడం కోసం చక్కని రహదారి వేశారు. సాధారణంగా ప్రభువుగారితో పాటు ఆయన పరివారం కూడా వస్తుంది. వారందరికీ మంచి విడిది అవసరం. కాబట్టి, జయపురంలో గొప్ప భవనం కట్టి, దాని చుట్టూ గుఱ్ఱాలు, ఏనుగులు, భటులు విశ్రమించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రభువు గారికి ప్రభువుల ఇండ్లలో మాత్రమే భోజనం చేసే నియమం ఉంది. అందువల్ల జయవంతుని జయపురానికి, చుట్టుపక్కల గ్రామాలకు ప్రభువుగా ప్రకటించేశారు. బ్రహ్మచారి ఇంట ప్రభువు భోజనం చేయడం చిన్నతనం. కాబట్టి జయవంతునికి మరొక ప్రభువుల పిల్లను తెచ్చి పెళ్లి చేశారు. అప్పటికి గాని అందరికీ తెలియలేదు జయవంతుని కోరికలోని అంతరార్థం. 
***

మీకేమైనా సందేహం వచ్చిందా? జయవంతునికి వచ్చింది.
***

జయవంతునికి రోజులు బాధ్యతాయుతంగా, సుఖంగా, హాయిగా గడుస్తుండగా ఓరోజు -
"మరి - ప్రభువుల ఇండ్లలో మాత్రమే భోంచేసే ప్రభువు ఆరోజు రాత్రి పూటకూళ్ళవ్వ ఇంట ఎలా తిన్నాడు?" అనే సందేహం వచ్చింది.

వచ్చిందే తడవుగా పూటకూళ్ళవ్వ గుడిసెకు పోయి - "అవ్వా! నీకెవ్వరూ లేరు కదా? మావూరికొచ్చేయ్. నాతో పాటు ఉండిపో" అని అడిగాడు.

అపుడా అవ్వ నవ్వి,
"నాయనా జయవంతా! వొగు ముప్పై యేండ్ల ముందర మేము కూడా కోటలోనే వుంటిమి. నా కొడుకూ, వాళ్ళప్పా వొగుసారి యిట్లే బయటికి పొయ్యి లోనికొచ్చేతలికే వాకిలి మూసేసిండ్రి. వాళ్ళు అట్లే బయట్నే ఉంటే రాత్రి వాళ్ళని మెకాలు ఈడ్సుకుపోయి తిన్న్యాయి. అబుట్నుంచి మాయా కట్ల కష్టం ఎవురికీ రాగూడదని నేను ఇట్లా కోట బయట మా చేన్లో గుడిసేసుకుని ఉండాను.

ఈ విషయం తిమ్మరాయ ప్రభువుకు తెలిసింది. ఆయన చాలా బాధపడినాడు. ఇబుడు నువ్వొచ్చినట్లే అబుడు ఆయప్ప కూడా వచ్చి కోటలో తన యింట్లోనే తనకు తల్లిలా ఉండమని బ్రతిమలాడినాడు. అయినా నేను ఒప్పుకోలేదు. కోట వాకిలి పొద్దుమునిగే తలికి వేసి తీరల్ల! ఆ నియమాన్ని దాటేకి లేదు. చివరకు అలా ఆలస్యంగా వచ్చింది స్వయంగా ప్రభువైన సరే, కోట తలుపు తీయరాదు అని కఠిన నియమం!

కానీ కొందరు అదృష్టం బాగులేనోళ్ళు రాత్రికి బయటే వుంటే వారి గతి ఏమి కాను? అందుకే నేను కోట బయటనే గుడిసెలోనే ఉంటానంటిని. ప్రభువు చేసేదేమీ లేక సరేననె. కానీ, వచ్చినోళ్ళకి నేను యెట్లో వండిపెడతాను గాని దానికి అవసరమైన గింజలూ అవీ ఎట్లా సంపాదిచ్చేది? అందుకే, అవన్నీ తిమ్మరాయప్రభువే నాకు పంపిస్తాంటాడు. ఆయప్ప నెలకొగసారైనా వచ్చి నేను వొండింది తిని పోతాంటాడు. నేను వాళ్ళ అమ్మనంటాడు. ఆయప్ప యా వేషంలో వచ్చినా నాగ్గొత్తే కానీ కొత్త కాదు. దానికే ఆపొద్దట్ల మీ పిల్లోళ్ల బొతుకు నిలబెట్టమని ఆయప్పని అట్లా అడిగినాను." అని మొత్తం కథ అంతా చెప్పింది.

"అవ్వా! ఇపుడు అర్థమైంది. ప్రభువుల ఇండ్లలో తప్ప యాడా తినని రాజు నీ చేతి వంట ఎట్లా తిన్నాడో! నువ్వు మహా యోగినివి! ప్రభువులకన్నా గొప్పదానివి!" అంటూ పాదాభివందనం చేశాడు జయవంతుడు.

{ Disclaimer: రాజును రక్షించిన యువకులు అనే ఒక చిన్న పాత చందమామ కథకు మా కళ్యాణదుర్గం కథ పూటకూళ్ళవ్వ కథ కల్పించి ఏదో సరదాగా వ్రాశాను సుమా! మళ్ళీ నిజమనుకొనేరు!  }
Photo Credits: Internet

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...