ఎంతో భక్తిశ్రద్ధలతో రాముడి కథను చదివిన కొందరు సోదరులకు ఒక సందేహం వచ్చింది. అదేమిటంటే -
**********
**********
అదెప్పుడో - త్రేతాయుగం.
వసంతకాలం ఆరంభమైంది. చైత్రమాసం. శుక్లపక్షం. పునర్వసునక్షత్రయుక్తమైన దినం.
వసంతకాలం ఆరంభమైంది. చైత్రమాసం. శుక్లపక్షం. పునర్వసునక్షత్రయుక్తమైన దినం.
శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణునితోను, ఇతర మిత్రులతోనూ కలిసి ఉల్లాసంగా మాటలాడుతున్నాడు. ఇంతలో దశరథమహారాజుకు ఎంతో విశ్వాసపాత్రుడైన సుమంత్రుడు అక్కడకు విచ్చేశాడు. "రామా! మీ తండ్రిగారు వెంటనే నిన్ను తన చెంతకు రమ్మని ఆదేశించారు" అని పలికాడు. రాముడు తక్షణమే అతని వెంట బయలు దేరి వెళ్ళాడు.
నాలుగు దిక్కుల నుండి విచ్చేసిన రాజుల నడుమ దశరథ మహారాజు కొలువు దీరి ఉండగా రాముడు ఆ సభలో ప్రవేశించాడు. రాముని చూడగానే సభలో ఉన్న పౌరజానపదులు, రాజులు అందరూ జయజయధ్వానాలు చేశారు. అప్పటికే దశరథుడు రాముని పట్టాభిషేకవిషయంలో ఏకగ్రీవంగా ప్రజామోదాన్ని పొంది ఉన్నాడనే విషయం రామునికి ఇంకా తెలియదు. తనకు పాదాభివందనం చేసిన రాముని దశరథుడు తనివి తీరనట్టు చూస్తూ, "నాయనా, నీవు పుష్యమీ నక్షత్రయుక్తమైన రేపటి రోజున యువరాజపట్టాభిషిక్తుడవు కావాలి. ప్రజలను రంజింపజేస్తూ భూమిని పాలించాలి." అని పలికాడు. శ్రీరాముడు తండ్రి మాటను అంగీకరించి, ఆయనకు నమస్కరించి, తన నివాసభవనానికి వెళ్ళాడు.
దశరథునికి తన అంతః పురానికి చేరగానే మరలా ఒకసారి రాముని చూడాలనిపించింది. మరలా సుమంత్రునితో కబురు పంపగా రాముడు మరలా వచ్చాడు. "నాయనా! ప్రజలందరూ నిన్నే తమ రాజుగా కోరుకుంటున్నారు. అందువల్ల నిన్ను యువరాజుగా అభిషేకిస్తాను. నాయనా! నా మనసు మారక ముందే, రేపే ఆ శుభకార్యం జరగాలి. "చలా హి ప్రాణినాం మతిః" - ప్రాణుల బుద్ధి చంచలమైనది అని అంటారు కదా!" అన్నాడు. రాముడు సరేనన్నాడు.
అక్కడనుండి బయలు దేరి తల్లి ఆశీస్సులను అందుకున్నాడు. వశిష్ఠమహర్షి చెప్పిన ప్రకారంగా సీతాసమేతుడై వ్రతదీక్షితుడు అయ్యాడు. మరుసటి రోజు ఉదయమే చక్కని వస్త్రాభరణాలను ధరించి రాముడు సిద్ధంగా ఉండగా మరలా సుమంత్రుడు వచ్చాడు. "కైకేయీసమేతుడై ఉన్న మీ తండ్రి మిమ్మల్ని చూడగోరుతున్నాడు. ఆలస్యం చేయక వెంటనే వెళ్ళవయ్యా రామయ్యా" అన్నాడు.
తండ్రి పరిస్థితి రామునికి కంగారును కలిగించింది. "అమ్మా! ఎందుకు నాన్నగారు నాతో మాట్లాడటం లేదు? నావల్ల ఏదైనా తప్పు జరిగిందా?"
అతోషయన్ మహారాజమ్ అకుర్వన్ వా పితుర్వచః।
ముహూర్తమపి నేచ్చేయం జీవితుం కుపితే నృపే।।
(రామాయణం 2.18.15)
ముహూర్తమపి నేచ్చేయం జీవితుం కుపితే నృపే।।
(రామాయణం 2.18.15)
"మహారాజైన నాన్నగారిని సంతోషపెట్టకుండా, ఆయన చెప్పిన మాటను పాటించకుండా ఆయన కోపానికి గురై ఒక్క ముహూర్తకాలం కూడా బ్రతకడానికి నేను ఇష్టపడను" అని ప్రక్కనే ఉన్న పినతల్లి కైకేయిని తండ్రి దీనస్థితికి కారణం అడిగాడు.
"నాయనా! మీ తండ్రి మునుపు నాకొక వరం ఇచ్చి ఉన్నాడు. నేను దానిని తీర్చమని ఇప్పుడు అడిగాను. దానిని నెరవేర్చితే నీవు ఏమనుకుంటావో అనే భయంతో నీతో మాట్లాడటం లేదు. రాజు నీకు చెప్పదలచుకున్నది నీకు ఇష్టమనిపించినా కష్టమనిపించినా తప్పక చేస్తానని మాట ఇస్తే నేనే నీకు చెబుతాను" అన్నది కైకేయి.
అందుకు రాముడు -
"కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్ణాభిభాషతే" (2.18.30)
అమ్మా! తప్పక చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు రెండువిధాల మాటలాడడు. రాజు, తండ్రి అయిన ఆయన మాటపై నిప్పులో దూకడానికైనా, విషం త్రాగడానికైనా, సముద్రంలో మునిగిపోవడానికైనా నేను సిద్ధమే. మహారాజు మనసులోని మాట నాకు చెప్పండి." అన్నాడు.
"కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్ణాభిభాషతే" (2.18.30)
అమ్మా! తప్పక చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు రెండువిధాల మాటలాడడు. రాజు, తండ్రి అయిన ఆయన మాటపై నిప్పులో దూకడానికైనా, విషం త్రాగడానికైనా, సముద్రంలో మునిగిపోవడానికైనా నేను సిద్ధమే. మహారాజు మనసులోని మాట నాకు చెప్పండి." అన్నాడు.
"రామా! భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు వెంటనే దండకారణ్యానికి వెళ్లి అక్కడ పద్నాల్గు సంవత్సరాలు గడపాలని నేను రాజుగారిని కోరాను.
ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।।
(రామాయణం 2.18.40)
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।।
(రామాయణం 2.18.40)
మీ నాన్నగారి మాటను నిలబెట్టాలనుకుంటే నువ్వు వెంటనే బయలుదేరు" అన్నది కైకేయి.
వెంటనే రాముడు -
"ఏవమస్తు గమిష్యామి వనం వస్తుం అహంత్వితః।
జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్।।
(రామాయణం 2.19.2)
"ఏవమస్తు గమిష్యామి వనం వస్తుం అహంత్వితః।
జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్।।
(రామాయణం 2.19.2)
"సరే, ఇదిగో రాజుగారి ప్రతిజ్ఞ (వరమిస్తానని నీకిచ్చిన మాట) మేరకు జటలను, జింకచర్మాన్ని ధరించి అడవిలో నివసించడానికి బయలుదేరుతున్నాను" అంటూ పెద్దగా కాలహరణం చేయకుండా బయలుదేరాడు.
***********
***********
ఇదీ జరిగిన కథ - కానీ,
"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీ, ఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?" కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసి, అదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"
ఆవిధంగా తండ్రి తనతో చెప్పని మాటను పట్టుకుని రాముడు అడవికి పోతే అతనికి "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు? అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది.
వారి సందేహానికి నాకు తోచిన సమాధానం -
(వారికి నేను చెప్పిన సమాధానం క్రిందన ఉన్నది, మునుపు ఏసియా నెట్ న్యూస్ లో వచ్చింది)
"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీ, ఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?"
"కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసి, అదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"
"దశరథుడు నోరెత్తి అడవికి పోవయ్యా అని రాముడికి చెప్పనే లేదు కదా? మరి అలా చెప్పించుకోకుండానే బయలుదేరి అడవికి వెళ్లిపోయిన రాముడికి "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు?" అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది
తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షిని చూసేసరికి వాల్మీకికి పరమానందం కలిగింది. నారదుడు గొప్ప తపస్సంపన్నుడు. స్వాధ్యాయతత్పరుడు. మహావాగ్మి. తన సందేహాలను అలవోకగా తీర్చగలిగిన దిట్ట.
వచ్చిన నారదునికి అతిథి పూజ చేసిన తరువాత, వాల్మీకి పదహారు గొప్ప గుణాలను పేర్కొని, తన సమకాలికులలో ఆ గుణాలన్నింటిని కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. "లేకనేమయ్యా? ఉన్నాడుగా రాముడు?" అంటూ నారదుడు రాముని గూర్చి సంక్షిప్తంగా చెప్పాడు.
ఆ సందర్భంలో వాల్మీకి అడిగిన గుణాలలో ఒకటి - "చారిత్రేణ యుక్తత్వం " - (చారిత్రతను కలిగి ఉండటం) అంటే - తన వంశానికి చెందిన వారు మునుపు పాటించిన సదాచారాలు తానూ కూడా పాటించడం అని అర్థం. రాముడికి అటువంటి గుణం ఉన్నది అని నారదుడు వాల్మీకికి నొక్కి చెప్పాడు. రాముని పూర్వీకుల సదాచారాలలో ఒకటి ఏమంటే - ఆడిన మాటను తప్పకపోవటం (వాగ్దానభంగం చేయకపోవటం) అనేది.
రాముని తండ్రి అయిన దశరథుడు కూడా ఇదే విధంగా తన పూర్వీకుల పద్ధతిని అనుసరించి, ఆడిన మాటను ఎన్నడూ తప్పకుండా హుందాగా జీవితాన్ని గడిపిన వాడే. కానీ, వయసులో బాగా పెద్దవాడయ్యాక వాగ్దానభంగానికి పాల్పడవలసిన దురవస్థ రెండుసార్లు పట్టింది. వింత ఏమిటంటే - అతని ఆ బలహీనతకు కారణం అతని పెద్ద కుమారుడు రాముడే!
(1)
ఒకనాడు దశరథుడు తన గురువులతోను, బంధువులతోను, కూర్చుని ముచ్చటలాడుతున్నాడు. రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది కదా, వారికి తగిన కన్యలు ఎక్కడున్నారు అని చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో విశ్వామిత్రమహర్షి అక్కడకు వేంచేశారు. దశరథుడు ఆ మహర్షి పాదాలమీద వాలి, స్వాగతం పలికి, -
"బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి।
కార్యస్య న విమర్శం చ గన్తుమర్హసి కౌశిక।। (రామాయణం 1.18.54&56)
స్వామీ, మీరు వచ్చిన పని ఏమిటి? నేను తప్పక ఆ పనిని నెరవేరుస్తాను. ఆ పని నెరవేరుతుందో లేదో అని సందేహం పెట్టుకోకుండా అడగండి." అని ధారాళంగా మాట ఇచ్చేశాడు. విశ్వామిత్రుడు "ఓ రాజా! రాక్షసులబారినుండి నా యజ్ఞాన్ని రక్షించేందుకు గాను నీ కుమారుడైన శ్రీరాముని నాతో పంపవయ్యా" అని అడిగాడు.
ఆ మాటతో దశరథుడు కలవరపడిపోయాడు. అంతవరకు రాముడికి పెళ్లీడు వచ్చిందని బంధువులతో మాట్లాడిన ఆయన హఠాత్తుగా అదంతా మరచి పోయి - "నా రాముడు బాలుడు స్వామీ, వాడు ఇంకా ఏ విద్యలను పూర్తి చేసింది కూడా లేదు, రాక్షసులు ఎంతటి బలవంతులో కూడా ఎరుగని వాడు, రాముడు వద్దులెండి, నేనే స్వయంగా మీ యజ్ఞాన్ని రక్షించడానికి వస్తాను. ఎన్నెన్నో కష్టాలు పడిన తరువాత నేను బాగా ముసలివాడిని అయ్యాక పుట్టక పుట్టక పుట్టిన నలుసు వాడు. దాచేసి వాడిని తీసుకు వెళ్ళకండి."
బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్।
అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి।।
షష్ఠిర్వర్షసహస్రాణి మమ జాతస్య కౌశిక।
దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి।। (రామాయణం 1.20.6-10)
అంటూ ముందు దీనంగా బ్రతిమాలాడుకున్నాడు. అయినప్పటికీ విశ్వామిత్రుడు సరేనని మాట్లాడకపోయేసరికి - "బాలం మే తనయం బ్రహ్మన్, నైవ దాస్యామి పుత్రకమ్। (1.20.24) స్వామీ, నా పిల్లవాణ్ణి, నా కొడుకును, నా పుత్రుడిని నీతో పంపను పోవయ్యా" అంటూ మొండికేశాడు.
దానితో విశ్వామిత్రునికి కోపం వచ్చింది.
"పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి।
రాఘవాణామయుక్తోSయం కులస్యాస్య విపర్యయః।।" (రామాయణం 1.21.2)
"ఏమయ్యా దశరథా? మొదట నేను అడిగినది ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు కాదంటున్నావే? మీ రాఘవవంశానికి ఇది ఎంతమాత్రం తగని పని కదా?" అన్నాడు. "సరేలే,అలాగే కానీ!" అంటూ వెళ్ళిపోబోయాడు. కానీ, ఇంతలో రాజగురువైన వసిష్ఠుడు కలగజేసుకుని, "రాజా! ముల్లోకాల్లోనూ ధర్మాత్ముడవని మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇలా ఆడిన మాట తప్పి అధర్మం చేసి వంశానికి మచ్చ తెచ్చే పని చేయవద్దు" అంటూ దశరథునికి ఎలాగో నచ్చజెప్పి విశ్వామిత్రుడి వెంట రాముని పంపించగలిగాడు.
దాంతో ఆడిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితినుండి దశరథుడు బయటపడ్డాడు. మొదటిసారి ఎలాగో గండం గట్టెక్కేసింది. కానీ రెండోసారి మళ్ళీ అటువంటి పరిస్థితి దాపురించింది. ఈసారి అంత సులువైన పరిష్కారం లభించే అవకాశం కాదు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఏమి చేయదలచుకున్నా ఇచ్చిన మాట తప్పినట్టయ్యే వింత పరిస్థితులలో చిక్కుకున్నాడు.
2
ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకున్నారు. దశరథుడు రాముని పిలిపించి "రామా! రేపు నీకు యువరాజపట్టాభిషేకం జరుపబోతున్నాను. నీవు గురువులు చెప్పిన విధంగా సిద్ధమైపో" అని చెప్పాడు. (అలా రామునికి మాట ఇచ్చేశాడు)
ఈ శుభవార్తను విని కైకేయి సంతోషపడుతుందేమో అని దశరథుడు అనుకున్నాడు. కానీ, ఆమె మాత్రం రాముని పద్నాల్గు సంవత్సరాలపాటు అడవికి పంపి, తన కొడుకైన భరతునికి పట్టాభిషేకం జరపమని కోరింది. శంబరమహాసురునితో యుద్ధం చేస్తూ దశరథుడు గాయపడినపుడు కైకేయి అతనిని కాపాడింది. ఆ సందర్భంలో దశరథుడు సంతోషించి కైకేయికి రెండు వరాలను ఇస్తానన్నాడు. ఆమె తనకు అవసరమైనపుడు ఆ వరాలను కోరుకుంటానని అన్నది. దశరథుడు సరేనన్నాడు. కైకేయి ఆ సందర్భాన్ని గుర్తు చేసి, అపుడు ఇచ్చిన మాటను ఇపుడు నిలబెట్టుకొమ్మని అడిగింది. ఆ విధంగా నీ వంశమర్యాదను, నీ శీలాన్ని, నిలబెట్టుకొని, నీ జన్మకు సార్థకత చేకూర్చుకొమ్మని అన్నది.
కులం చ శీలం చ హి రక్ష జన్మ చ। (2.11.30)
ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించని దశరథుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. ఇరుకులో పడ్డాడు. కైకేయి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు గాను రాముని అడవికి పొమ్మంటే రాముడు మారు మాటాడక అడవికి నిశ్చయంగా పోతాడు. ఆ నమ్మకం అతనికి ఉంది.
నాలం ద్వితీయో వచనం పుత్రో మాం ప్రతిభాషితుమ్।
స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి।। (రామాయణం - 2.12.86)
కానీ, పొమ్మంటే పోతాడు కదా సమస్య ఏముంది అని, "పోవయ్యా రామా" అనే రెండు పదాలు పలికితే "నిన్ను యువరాజును చేస్తాను" అని రామునికి తాను ఇచ్చిన మాట తప్పినట్టవుతుంది. అలాగని కైకేయి కోరినట్టు రాముని పంపకపోతే కైకేయికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. ఆవిధంగా దశరథుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చిక్కులో పడ్డాడు. రాముడు కానీ, కైకేయి కానీ ఎవరో ఒకరు వెనుకకు తగ్గితే తనకు ఆడిన మాట తప్పిన పాపం తప్పుతుంది.
నిజానికి రాముని అడవికి పంపడం అతనికి మనసులో ఎంత మాత్రం సమ్మతం కూడా కాదు. అందువల్ల అతడు అటువంటి కోరికను కోరవద్దని కైకేయిని బ్రతిమాలాడాడు. కోపగించుకున్నాడు. శపించాడు. రాముడు అడవికి వెళ్ళిపోతే తాను బ్రతకబోనని నిజం చెప్పాడు. చివరకు ఆమె కాళ్ళు పట్టుకుంటానని కూడా అన్నాడు.
స్పృశామి పాదావపి తే ప్రసీద మే। (2.12.114)
అయినప్పటికీ ఆమె ఎంత మాత్రం వెనుకకు తగ్గకుండా, అతి కఠినంగా, "నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం రాముని అడవికి పంపకపోతే నీ ముందే నేను ప్రాణాలను వదిలేస్తాను" అని బెదిరించింది.
సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి।
అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితమ్।। (2.14.10)
ఇక దశరథునికి గత్యంతరం లేకపోయింది. తన మాటను నిలబెట్టేందుకు రాముడొక్కడే సమర్థుడు. అతనికి కబురు పంపించాడు. వెంటనే రాముడు వచ్చాడు. కానీ, నిర్దోషి అయిన అతనిని తన కారణంగా అడవులకు పంపించేందుకు మనసొప్పని దశరథుడు "రామా" అని ఒక్క మాట పలికి మరేమీ మాటాడలేక, చివరకు అతనిని సూటిగా కూడా చూడలేక, కళ్లనీళ్లు పెట్టుకొని ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.
తాను తండ్రిపట్ల ఏమైనా తప్పు చేశానేమో అని మథనపడిన రామునితో కైకేయి దశరథుడు తనకు ఇచ్చిన వరాలను పేర్కొని, అలా ఇచ్చేందుకు గల కారణాలను కూడా వివరించి, తండ్రిమాటను నిలబెట్టేందుకు గాను నువ్వు ఆవిధంగా ఆచరించవలసి ఉన్నది" అని చెప్పింది.
ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।। (రామాయణం 2.18.40)
తండ్రికి తనపై గల ప్రేమ శ్రీరామునికి సంపూర్ణంగా తెలుసు. ఆ ప్రేమతోనే తనను వెళ్ళమని చెప్పలేకపోతున్నాడని గ్రహించాడు. మునుపు విశ్వామిత్రుడు అడిగినపుడు కూడా తనమీద ప్రేమకొద్దీ తనను అతనితో పంపలేక వంశాచారాన్ని భగ్నపరచే సాహసం చేసిన విషయం రాముడు ఇంకా మరచిపోలేదు. ఎలాగో గురువైన వసిష్ఠుని వల్ల ఆ ఆపద గడిచింది. తాను ఆనాడు బాలుడు. కాని, ఈనాడు సమర్థుడైన యువకుడు. తండ్రి మాటను నిలబెట్టవలసిన బాధ్యత తనమీద ఉన్నది. అది గ్రహించుకున్న స్థితప్రజ్ఞుడు రాముడు అడవులకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.
దండకారణ్యమేషోSహమితో గచ్చామి సత్వరః।
అనుక్తోప్యత్ర భవతా భవత్యా వచనాదహమ్।
వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ।। (రామాయణం 2.19.11&23)
"అమ్మా, ఇదిగో, నేను వెంటనే దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. తండ్రి గారు నేరుగా చెప్పకపోయినా మీ మాట మేరకు (మీకిచ్చిన మాట మేరకు) అక్కడ పద్నాలుగు సంవత్సరాలు నివసిస్తాను." అని తండ్రి ముందే చెప్పి బయలుదేరాడు.
ఈ విధంగా తండ్రి తనను స్వయంగా అడవికి పొమ్మని ఆజ్ఞాపించకున్నా - పినతల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రాముడు అడవికి బయలుదేరడం ఖచ్చితంగా పితృవాక్యపరిపాలనమే! ఈ మాటను అన్నది నేను కాదు, మరెవరో ఒక మానవమాత్రుడు కూడా కాదు, వారు కూడా ఒకరిద్దరు కాదు. ఎవరెవరు ఏయే సందర్భాలలో అలా అన్నారో ఈ క్రిందన రామాయణశ్లోకాల సంఖ్యతో సహా చూడండి. పేర్కొనబడిన ప్రతి శ్లోకానికి అర్థం లేదా భావం రాముడు పితృవాక్యపరిపాలకుడు అనే.
1) మొదటగా నారదుడు వాల్మీకితో అన్నాడు:
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామానుపాలయన్।
పితుర్వచననిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్।। (రామాయణం 1.1.24)
2) బ్రహ్మ వాల్మీకితో ఈవిధంగా అన్నాడు:
వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాత్ శ్రుతమ్।
న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి।। (రామాయణం 1.2.32&35)
"ఓ వాల్మీకీ, నారదుడు నీకు ఎలా చెప్పాడో అలాగే ధీరుడైన రాముని కథను వ్రాయవయ్యా. నీవు వ్రాసిన ఒక్క మాటకూడా అసత్యం కాజాలదు" అని బ్రహ్మ వరం ఇచ్చాడు. కాబట్టి రాముడు పితృవాక్యపరిపాలకుడు అని నారదుడు అన్న మాట సత్యమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాల్మీకితో చెప్పినట్టే కదా?
3) లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు:
పితుర్నిర్దేశపారగః ....
రాజ్యాద్భ్రష్టో వనే వస్తుం మయా సార్థమిహాగతః।। (రామాయణం 4.4.8-10)
4) అంగదుడు జటాయువు సోదరుడైన సంపాతితో ఈవిధంగా అన్నాడు:
రామో దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టో దండకావనమ్।
పితుర్నిర్దేశనిరతో ధర్మ్యం పన్థానమాశ్రితః।। (రామాయణం 4.57-58)
5) హనుమంతుడు అశోకవనంలో సీతమ్మకు తన ఉనికిని తెలియజేసేందుకు ముందు ఈ విధంగా శ్రీరాముని కీర్తించాడు:
తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః।
సభార్యః సహా చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్।। (రామాయణం 5.32.8)
6) హనుమంతుడు రావణుడితో కూడా అదే విషయం చెప్పాడు:
పితుర్నిర్దేశాన్నిష్క్రాంతః ప్రవిష్టో దండకావనమ్।। (రామాయణం 5.51.5)
7) "పద్నాలుగేళ్ళు అడవిలో ఉంటాను" అన్న మాటను రాముడు కూడా అంతే పట్టుదలతో నిలబెట్టుకున్నాడు. తండ్రి చనిపోయిన తరువాత, రాముని వెతుక్కుంటూ చిత్రకూటానికి వచ్చిన భరతుడు, జాబాలి, వసిష్ఠుడు తదితరులు వనవాసం మాని, అయోధ్యకు తిరిగి వచ్చి, పట్టాభిషేకం చేసుకొమ్మని రాముని ఎంతగా వత్తిడి చేసి చెప్పినప్పటికీ,
తేన పిత్రాssహమప్యత్ర నియుక్తః పురుషర్షభ।
చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికమ్।। (రామాయణం 2.107.7)
అంటూ నిర్ద్వంద్వంగా తండ్రి మాటను తాను నిలబెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు.
8) చివరకు స్వర్గస్థుడైన దశరథుడు కూడా అంగీకరించాడు! అష్టావక్రుడు తన తండ్రిని తరింపజేసినట్లు నువ్వు నన్ను తరింపజేశావు నాయనా! అన్నాడట. (6.119.17) ఆ సందర్భంలో కైకేయి మిమ్మల్ని నిర్బంధించినందుకు మనసులో ఎటువంటి కోపం పెట్టుకోవద్దు, వారిని క్షమించమని రాముడు తండ్రిని కోరడం, ఆయన అంగీకరించడం కూడా జరిగింది.
ఈ విధంగా కథ సుఖాంతం అయింది.
"పితృవాక్యపాలన" అనే ఒక ఆదర్శాన్ని గొప్ప గుణంగా శ్రీరాముని పాత్ర ద్వారా బ్రహ్మ, నారదుడు, వాల్మీకి కలసి ప్రజలకు ఆ విధంగా పరిచయం చేయదలచుకున్నారు. కాబట్టి, వారి సంకల్పం తిరుగులేకుండా ప్రచారంలోనికి వచ్చేసింది. ।।ఇతి శమ్।।
No comments:
Post a Comment