Showing posts with label Truth. Show all posts
Showing posts with label Truth. Show all posts

Friday, 12 April 2019

ప్రజలు కోరుకున్న రాజలక్షణాలు


దశరథుడు ఒక సుప్రసిద్ధుడైన ఇక్ష్వాకువంశపు మహారాజు.  అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని, కోసలరాజ్యాన్ని ఆయన చాల కాలం పరిపాలించాడు.  ఆయన గొప్ప విద్యావంతుడు.  దేవదానవయుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధం చేసి, వారికి ప్రీతిపాత్రుడైన మహావీరుడు.  వందలాది యజ్ఞాలను చేసినవాడు.  గొప్ప దానాలు చేసి అందరినీ సంతృప్తిపరచినవాడు.  దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం, విప్ర ఋణం, ఆత్మ ఋణం మొదలైన పంచఋణాల నుండి విముక్తుడైనవాడు.  తన పూర్వుల వలెనే ప్రజల శ్రేయస్సు కోరి, యథాశక్తి, ఎంతో జాగ్రత్తగా పరిపాలించినవాడు.  అరవైవేల సంవత్సరాలు అలా పరిపాలించిన తరువాత, ఆయన అలసిపోయాడు.  తన వారసుడైన రామునికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకొనదలిచాడు.  
ఒకనాడు ఆయన కొలువుదీర్చి, తన అభిమతాన్ని ప్రజలందరి సమక్షంలో వెల్లడించాడు.  ఆ మాటలను విని, ప్రజలందరూ హర్షించారు.  ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలియజేశారు.
రాముని పట్ల ప్రజలకున్న ఇష్టాన్ని తెలుసుకుని దశరథుడు  సంతోషపడినప్పటికీ, “ఎందువల్ల మీరు రాముని కోరుకుంటున్నారు?  నేను ధర్మానుగుణంగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాను కదా?  నా పరిపాలన మీకు నచ్చలేదా?  రాముడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పవలసింది” అని ప్రజలనే అడిగాడు.
అపుడు ప్రజలు తాము రాముని ఎందుకు ఇష్టపడ్డారో స్పష్టంగా చెప్పారు.  
“మహారాజా!  రాముడు గొప్ప విద్యావంతుడు.  గురువుల మెప్పుకు పాత్రుడైనవాడు. 
(సమ్యక్ విద్యావ్రతస్నాతః)  

అతడు పరిపాలనకు తగిన శిక్షణను చక్కగా పొందినవాడు.  (ద్విజైరభివినీతశ్చ)  

ధర్మం తెలిసినవాడు. (ధర్మజ్ఞః)  అందువలన ప్రజలలో ఎటువంటి వైషమ్యాలు తలెత్తకుండా, ఒకరి పనికి ఇంకొకరు అడ్డు తగలకుండా అన్ని వ్యవహారాలూ సక్రమంగా జరిగేటట్లు చూడగలడు.   ప్రజాజీవనం ప్రశాంతంగా సాగేటట్లు చేయగలడు.  

అతడు ధర్మానికి కట్టుబడినా, అర్థాన్ని (అంటే ఆర్ధికరంగాన్ని) నిర్లక్ష్యం చేసేవాడు కాదు.  అట్లని, అర్థానికి అధికప్రాధాన్యతను ఇచ్చి, ధర్మాన్ని తక్కువచేసేవాడు కాదు.  (ధర్మశ్చాపి శ్రియా సహ)
రాముడు ఎల్లపుడూ సత్యమే పలుకుతాడు.  (సత్యసంధః)  అందువల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.  అవసరం కోసం అబద్ధమాడటం, అవసరం తీరిన తరువాత ముఖం చాటువేయటం వంటి దుర్గుణాలు ఆయనలో లేవు.
 
రాముడు సహజంగానే మంచివాడు.  (సత్పురుషః)   అందువల్ల అతనికి మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు.  చెడ్డవారైనా అతడితో స్నేహం చేస్తే మంచివారౌతారు.

అతడు శీలవంతుడు (శీలవాన్).  లోకంలో మంచిపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని చేస్తాడు.  చెడ్డపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని ఎన్నడూ చేయడు.  

అతడు అసూయ లేనివాడు.  (అనసూయకః)  ఇతరులలో ఉండే సద్గుణాలను చూసి ఆనందిస్తాడు, అభినందిస్తాడే తప్ప, వారిలో తప్పులు ఎంచడు.  

అతడు చిన్న చిన్న తప్పులు చేసే వారిని క్షమించి, వారు మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు సహకరిస్తాడు.  (క్షాంతః)  

అతడు కష్టాలలో ఉన్నవారిని ఓదార్చి, యథాశక్తి సహాయం చేస్తాడు.  (సాన్త్వయితా)  

అతడు గొప్ప మనఃస్థైర్యం కలిగినవాడు.  (స్థిరచిత్తః)  ఎన్ని కష్టాలు ఎదురైనా చలించని తత్త్వం కలిగినవాడు.  తనకుండే వైభవాలకు, తనకు లభించే విజయాలకు, ఒళ్లు మరచి పొంగిపోయేవాడు కాదు.  

అతడు ఇతరులు తనకు చేసిన సహాయాలను ఎన్నడూ మరచేవాడు కాదు.  (కృతజ్ఞః)     

అతడు ప్రజలందరితోనూ మంచిగా మాట్లాడతాడు (ప్రియవాదీ)  

ఎదుటివారు తనను పలకరిస్తే అపుడు బదులు పలుకుదామని ఎదురుచూడకుండా, తానే మొదట చిరునవ్వుతో వారిని పలుకరిస్తాడు.  (స్మితపూర్వాభిభాషీ
ఎంతటి సత్పురుషులైనప్పటికీ, అధికారం లభించిన తరువాత వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.  కాని, రాముడు అటువంటి వాడు కాదు.  అతడు తన ఇంద్రియాలమీద సంపూర్ణమైన అదుపు సాధించినవాడు.  (విజితేన్ద్రియః)  అందువలన అన్ని రకాల వ్యసనాలకు, బలహీనతలకు దూరంగా ఉంటాడు.  

రాముడు అత్యంతసమర్థుడై, ఎంతటి భారాన్ని వహిస్తున్నప్పటికీ, గొప్ప సహనం కలిగినవాడు.  
(వసుధాయాః క్షమా)  

అతడు బుద్ధిలో బృహస్పతివంటివాడు.  (బుద్ధ్యా బృహస్పతేః తుల్యః)  అందువల్ల, ఇతరులు తనను తప్పు దారిలో నడిపేందుకు ప్రయత్నిస్తే, వివేకంతో అటువంటి వారిని దూరం పెట్టగలిగినవాడు.  

అతడు మహా పరాక్రమవంతుడు కూడా.  (వీర్యే సాక్షాత్ శచీపతేః)  అందువల్ల, ఎవ్వరూ అతడి మీద వత్తిడి తీసుకువచ్చి, తమకు అనుకూలమైన పనులు తప్పుదారిలో చేయించుకొనలేరు.  

తనకు వ్యతిరేకులైన వారిని విమర్శించేందుకు గాని, ఆడిపోసుకొనేందుకు అతడు ఆసక్తిని కనబరచడు, తన అమూల్యమైన సమయాన్ని ఆ విధంగా ఎన్నడూ వ్యర్థం చేసుకోడు. 
(న విగృహ్య కథారుచిః)   

తన పరిపాలనలో లోటుపాట్లను తెలుసుకొనేందుకు, వాటిని తొలగించుకునేందుకు, సరిదిద్దుకునేందుకు, తన పరిపాలన గాడి తప్పకుండా, మెరుగుగా, సక్రమంగా కొనసాగించేందుకు మేధావులు, పెద్దలు, పండితులు, అయినవారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, వారి సలహాలను ఆదరిస్తూ, పాటిస్తూ ఉంటాడు. 
(బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానామ్ ఉపాసితా।)
 
పరిపాలనాభారం అనే నెపంతో అతడు ప్రజలకు దూరంగా ఉండడు.  ప్రజలతో సమావేశమై, వారు తన కుటుంబసభ్యులే అయినట్లు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.  (పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి।)   

ప్రజలకు కష్టాలు కలిగినపుడు అతడు చాల బాధ పడతాడు.  వారు ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నపుడు ఒక ఇంటి పెద్ద పిల్లల ఆటలను చూసి ఆనందపడినట్లు సంతోషిస్తాడు.
(వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః।  
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి।।)  

పక్షపాతరహితంగా అందరికీ శ్రేయస్సును చేకూర్చేందుకు ప్రయత్నిస్తాడు.  
(సమ్యగ్ యోక్తా శ్రేయసామ్)
రామునికి అసలు కోపమే రాదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని ఎవరివల్లనైనా హాని కలిగితే అతనికి కోపం వస్తుంది.  రామునికి పక్షపాతం అనేది లేదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని విశేషమైన ఉపకారం చేసినవారి పట్ల అతడికి అనుగ్రహం కలుగుతుంది.  అటువంటి రాముని కోపం గాని, అనుగ్రహం కాని ఎన్నడూ వృథా కావు.  
(నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోऽస్తి కదాచన।)  

దండనార్హుడైనవానిని నియమం ప్రకారం, అంటే చట్టం ప్రకారం, దండించే తీరుతాడు.  నిర్దోషి పట్ల ఎన్నడూ కోపం చూపనే చూపడు.  (హన్త్యేవ నియమాద్ వధ్యాన్ అవధ్యే చ న కుప్యతి।)  అలాగే, తన అనుగ్రహానికి పాత్రుడైన వాడు మరింత మంచి పనులు చేసేందుకు ప్రేరణగా అతడికి సకల ప్రయోజనాలను చేకూరుస్తాడు. (యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి।)      
అటువంటి రాముడికి సంపూర్ణమైన బలము, ఆరోగ్యము, ఆయుష్షు చేకూరాలని, రాష్ట్రంలోనూ రాజధానిలోనూ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
(బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః।  
ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా।।)           
అందరూ ధనంతో శ్రీమంతులౌతారేమో గాని, రాముడు మాత్రం ఇటువంటి గుణాలతో కూడా శ్రీమంతుడైనవాడు.  అందువల్ల, ప్రజలు అతనిని తమ రాజుగా కోరుకుంటున్నారు.  (తమేవంగుణసంపన్నమ్ అకామయత మేదినీ।)     
ఈవిధంగా, స్వయంగా ప్రజలే, తాము రాముని ఎందుకు కోరుకుంటున్నామో తమకు ఎటువంటి పాలకుడు ఇష్టుడు అవుతాడో దశరథునికి వివరించారు.  దశరథుడు తన కుమారుని గుణగణాలను ప్రజల నోటినుండి విని “అహోऽస్మి పరమప్రీతః” అంటూ ఎంతగానో సంతోషపడ్డాడు.
ఆనాడైనా, ఈనాడైనా ఇటువంటి గుణాలు పాలకులకు ఎంతో ఆదర్శప్రాయమైనవి.  ఈ గుణాలను అలవరచుకునే పాలకులు, తప్పకుండా ప్రజల ప్రేమకు పాత్రులౌతారు అనడంలో సందేహం లేదు.

(పరాయి పాలకుల చెరనుండి విడివిడిన తరువాత. భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది అని చరిత్ర చెబుతుంది.  అంటే, ప్రజల అభిప్రాయం ప్రకారం పరిపాలన కొనసాగే దేశం అన్న మాట.  ఇది ఎంతో గొప్ప పద్ధతిగా ఈనాటి రాజకీయశాస్త్రజ్ఞులు కీర్తిస్తారు.  భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యపు పద్ధతి రామాయణకాలంలోనే ఉన్నట్లుగా వాల్మీకిమహర్షి రచన ద్వారా తెలుస్తుంది.  దశరథుడు, అతని కుమారుడైన రాముడు ప్రజల అభిప్రాయానికి ఎంతో విలువనిచ్చేవారని రామాయణం వర్ణిస్తుంది.  ముఖ్యంగా, తమకు ఎటువంటి రాజు కావాలి అనే విషయంలో ఆనాటి ప్రజలు ఒక స్పష్టమైన, అందరికీ అంగీకారయోగ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.  ఆ అభిప్రాయాలు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తాయి.  ఎందువల్లనంటే, ఆ అభిప్రాయాలు రాజును నియంత కాకుండా ఆపుతాయి.  అవి సమాజంలో ధర్మాచరణకు, ధర్మరక్షణకు అనుకూలమైనవిగా కూడా ఉన్నాయి.  అవే ఈ వ్యాసంలో చెప్పబడ్డాయి.)

{ఈ వ్యాసం 2019 ఏప్రిల్ నెల, ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ప్రచురించే యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.}

Friday, 5 April 2019

వికారి ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు.
వికారి-నామ-సంవత్సర-శుభాకాంక్షలు.
వికారి అనే పేరు విని
ఏమిటిది అని ఎవరూ ముఖం చిట్లించుకొనవలసిన పని లేదు.
అదేమీ చెడ్డ పేరు కానే కాదు.
ధనము కలిగినవాడు ధని.
బలము కలిగినవాడు బలి. (బలిచక్రవర్తి తెలుసుగా)
చక్రము కలిగినవాడు చక్రి (విష్ణువు)
శూలము కలిగిన వాడు శూలి (శివుడు)
హస్తము అంటే తొండము కలిగినది హస్తి. (అంటే ఏనుగు)
అదే పరంపరలో వికారము కలిగినది/కలిగినవాడు వికారి అన్న మాట.
మరి వికారము అనేది చెడ్డపేరు కాదా?
కాదు.
ఆకారము అనే పదాన్ని ఆకృతి అని కూడా అంటాము.
అలాగే, వికారము అనే పదాన్ని వికృతి అని కూడా అంటాము.
వికృతి అనగానే తెలుగు వ్యాకరణంలో ప్రకృతి – వికృతులు గుర్తుకు వచ్చాయా? రథము అనే ప్రకృతి పదానికి అరదము అనే పదం వికృతి. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి బొమ్మ అనే పదం వికృతి. విష్ణువు అనే ప్రకృతిపదానికి వెన్నుడు అనే పదం వికృతి. ఇలా చాలానే చదువుకున్నాం కదా? ఈ విధంగా వికృతిపదాలు ప్రకృతి నుండి వచ్చినవే తప్ప, వేరే కావు. కాని, ఇది భాషకు సంబంధించిన ప్రకృతి-వికృతి సంబంధం.
దర్శనశాస్త్రాన్ని అనుసరించి ఈ కనిపిస్తున్న, మన తర్కానికి గాని, మన ఊహకు గాని అందుతున్న ఈ సమస్తవిశ్వము కూడా వికృతే! దీనికి మూలమైన ప్రకృతి మన కంటికి కూడా కనబడదు. “మూలప్రకృతిరవికృతిః. మహదాద్యాః ప్రకృతివికృతయః సప్త. షోడశకస్తు వికారః.” అని సాంఖ్యకారికలలో (3) ఈశ్వరకృష్ణుడు చెబుతాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే వేరొకదాని పుట్టుకకు ఆధారభూమిగా ఉండేది. వికృతి అంటే, వేరొకదానినుండి ఉద్భవించేది. ప్రకృతివికృతులు అంటే, తాము స్వయంగా వేరొకదానినుండి పుడుతూ మరొకదాని పుట్టుకకు కారణమయ్యేవి అన్నమాట.
అటువంటి మూలప్రకృతి (కేవల ప్రకృతి) ఒక్కటే ఉందట.
ప్రకృతివికృతులు ఏడు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు అన్నారు కదా?
ఆ వికృతులు ఏమిటో తెలుసా?
అందులో మొట్టమొదటిది మనస్సు.
తరువాత, కన్ను ముక్కు చెవి వంటి జ్ఞానేంద్రియాలు ఐదు,
కాళ్లు చేతులు వంటి కర్మేంద్రియాలు ఐదు,
భూమి, గాలి, నీరు వంటి పంచభూతాలు ఐదు.
(1+5+5+5=16)
అర్థమైందా?
ఈ మనస్సు, ఈ పంచభూతాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచకర్మేంద్రియాలు – ఇవన్నీ వికృతులు. అంటే వికారాలు. ఈ వికారాలతో తయారైనదే శరీరం. ఈ వికారాలు కలిగినది వికారి. అంటే ఎవరు? మనమే. కాబట్టి, వికారి నామ సంవత్సరం అంటే మన సంవత్సరమే.
సరే, ఇంతకీ మనం ఎవరం?
ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఆరుణి అని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. అతడికి శ్వేతకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతడు గురుకులానికి వెళ్లి విద్యాభాసం చేసి వచ్చాడు. అపుడు వారి నడుమ ఒక గొప్ప సంభాషణ జరిగింది.
"నాయనా శ్వేతకేతూ, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అవుతుందో దానిని నువు తెలుసుకున్నావా?”
శ్వేతకేతువుకు ఆశ్చర్యం కలిగింది.
“లేదు నాన్నగారూ, అదేమిటో చెప్పండి” అని అడిగాడు.
అపుడు ఆరుణి చక్కగా వివరించి చెప్పాడు –
యథా సోమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్। వాచారంభణం వికారో నామధేయో మృత్తికేత్యేవ సత్యమ్।।’ (ఛాందోగ్యం 6.1.4)
కుండ, మూకుడు, కడవ, తొట్టి వంటి వస్తువులు తయారు అవుతున్నాయి. అవన్నీ మట్టితోనే తయారు అవుతున్నాయి. అదే మట్టితో రాజు బొమ్మ, రాణి బొమ్మ, గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ, తయారు అవుతున్నాయి. వాటి ఆకారాలు వేరు, వాటి పేర్లు వేరు. వాటి ఉపయోగాలు కూడా వేరే. అయినప్పటికీ వాటి మూలపదార్థం ఒకటే. అదే మట్టి. కాబట్టి, ఆ మట్టి స్వభావాన్ని తెలుసుకుంటే, దానితో చేయబడిన, చేయబడుతున్న, చేయబడబోతున్న సమస్తవస్తువులను గూర్చి సమగ్రంగా తెలుసుకున్నట్టే” అని చెప్పాడు ఆరుణి.
ఆ వస్తువులన్నీ వికారాలు.
వాటికి ఆ మట్టి మూలపదార్థం.
ఈ వికారాలన్నీ కూడా మట్టిముద్దకంటె అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అయినప్పటికీ, ఆ వికారాల ఆయుష్కాలం తీరినతరువాత అవి నెమ్మదిగా కలసిపోయేది తమ మూలపదార్ధంలోనికే. (అయితే ఆ మట్టి కూడా, మూలప్రకృతి నుండి పుట్టుకొచ్చిన వికారమే అని మరచిపోరాదు.)
అలాగే, ఉంగరము, గొలుసు, కంకణము మొదలైన నగలన్నీవికారాలు.
వాటికి బంగారం మూలపదార్థం.
ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది. దానికి విశాలంగా విస్తరించిన బోలెడు కొమ్మలున్నాయి. బోలెడు ఊడలు ఉన్నాయి. లెక్కపెట్టడం మొదలు పెడితే మనకు ఆయాసం కలిగించేంత సంఖ్యలో ఆకులు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి. పండ్లలో విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ వికారాలు. ఆ విత్తనాలలో మళ్లీ ఇంత పెద్ద మఱ్ఱి చెట్లు అనేకం దాక్కుని ఉన్నాయి. ఆ విత్తనాలలో ఆ మఱ్ఱిచెట్లను మనం చూడలేము. ఐనప్పటికీ, అవి ఉన్నమాట సత్యం. అవి ఆ విత్తనాలలో అత్యంత సూక్ష్మపదార్థరూపంలో దాక్కుని ఉన్నాయి. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థమే మూలప్రకృతి అని చెప్పవచ్చు. అది క్రమంగా కాలానుగుణంగా విస్తరిస్తుంది. అయితే, తనంత తానుగా విస్తరించే శక్తి దానికి లేదు. చైతన్యంతో కలసినపుడే అది అలా విస్తరిస్తుంది.
అలాగే ఈ సమస్తవిశ్వం కూడా వికారం. ఇది తనంత తానుగా విస్తరించలేదు. దీనికి మూలం మూలప్రకృతి. ఆ మూలప్రకృతి కూడా చైతన్యంతో కలసినపుడు విశ్వంగా విస్తరిస్తుంది. ఆ చైతన్యపదార్థాన్ని సాంఖ్య దర్శనంలో పురుషుడు అంటారు. (ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు.)
మనం ఎవరం అని అనే ప్రశ్నకు సమాధానం అదే.
మనం పురుషులం.
చైతన్యస్వరూపులం.
(పైన చెప్పినట్లుగా ఇక్కడ ఆడ-మగ అనే తేడాలు లేవు. పురుష అనేది చైతన్యపదార్థానికి ఒక సాంకేతికనామం మాత్రమే.) మనం వికారాలు కలిగి ఉండడం చేత మాత్రమే మనం వికారి అనబడతాము.
ఆరుణి చెప్పిన కథలో వలె, మన నామరూపాలు కూడా వికారాలే.
నన్ను నేను శ్రీనివాసులు అనే పేరుతో పరిచయం చేసుకున్నాను కాబట్టి, మీరందరూ నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. మొదట్లోనే నా పేరు వేంకటేశులు అనో రామయ్య అనో చెప్పుంటే, మీరు నన్ను అదే పేరుతోనే పిలిచేవారు కదా? కాబట్టి, నామం వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికంగా అసత్యం అని తెలుస్తోంది. అవునా?
అలాగే, నా తిండిని బట్టి నా రూపం, అంటే ఒడ్డు, పొడుగు, బరువు మొదలైనవి ఉంటాయి. నేను నివసించే ప్రదేశాన్ని బట్టి నా రంగు ఉంటుంది. ఈవిధంగా, రూపం కూడా వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికసత్యం కాదు అని తెలుస్తోంది కదా?
నా మనస్సు కూడా వ్యావహారికమే. నా మనసు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, నేను ఈ ప్రదేశం గురించే ఆలోచిస్తాను. ఇక్కడ మంచి జరిగితే సంతోషిస్తాను. ఇక్కడ బాగులేదు అనుకుంటే బాధపడతాను. నా మనస్సు ఇక్కడ కాకుండా ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఒక అందమైన దీవిలో ఉందనుకోండి. అక్కడి సుఖాలను అక్కడి బాధలను మాత్రమే నా మనస్సు అనుభవిస్తుంది. కాబట్టి, మనం సుఖాలు, బాధలు అనుకుంటున్నవి అన్నీ కూడా మన మనసు పడుతున్న వికారాలే. అవి కూడా వ్యావహారికసత్యాలే కాని, పారమార్థికసత్యాలు కావు.
మనకు ఇన్ని వికారాలు ఉన్నాయి కదా, అందుకే మనం వికారి అయినాము. ఇటువంటి రకరకాల వికారాలు వదులుకోగలిగితే, మనం మనంగా, (శుద్ధచైతన్యస్వరూపంగా) ఉంటాము అనేది సాంఖ్యదర్శనశాస్త్రం చెబుతుంది. మోక్షం అంటే అదే అని వారు చెబుతారు.
అయితే, మోక్షం కావాలంటే, ముందు మనం వికారి అని తెలుసుకోవాలి. అప్పుడే, మన వికారాలు ఏమిటో మనం తెలుసుకొనగలం. అవి తెలిస్తేనే, వాటిని వదిలించుకొనేందుకు ప్రయత్నించగలం. చైతన్యస్వరూపులం కాగలం.
వికారము అనే పదాన్ని కురూపత్వము అనే అర్థంలో కూడా వాడుతారు.
వికారి అంటే కురూపి (సౌందర్యవిహీనుడు) అన్నమాట.
"ఓ పార్వతీ! శివుడు విరూపాక్షుడు కదా? కాబట్టి వికారి కదా? మరి అటువంటివాడిని ఎందుకు నువు ఇష్టపడ్డావు?" అని అడిగితే పార్వతికి కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పింది. అలా అడిగినవాడు స్వయంగా మారువేషం వేసుకొచ్చిన శివుడే అనుకోండి. ఆ ముచ్చటలు కాళిదాసుని కుమారసంభవంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఆ మాటలు ఒకసారి చూద్దాం.
మానవులు ఏమైనా తక్కువ తిన్నారా?
భౌతికంగా వికారులైనవారిని చూసి నవ్వే మానసికవికారులు కూడా ఉంటారు.
జనకమహారాజు సభలో ప్రవేశించిన అష్టావక్రమహర్షిని చూసి అక్కడ ఉన్న పండితులు నవ్వారట. అపుడు, అష్టావక్రుడు కూడా నవ్వాడట. "మేము నవ్వితే దానికి ఒక అర్థం ఉంది, మరి నువ్వెందుకయ్యా నవ్వావు?" అని వారు అడిగారట.
కండ్లు ఉండవలసిన స్థానంలో ముక్కు, ముక్కు ఉండవలసిన స్థానంలో చెవులు, - ఇలా ఉంటే అది వికారం కదా? అలాగే, ఈ సభలో ఉన్న వికారాన్ని చూసి నవ్వాను అన్నాడట అష్టావక్రుడు.
ఈ సభలో నీకేమి వికారం కనిపించింది? అని వారు అడిగారట. క్షత్రియుల దృష్టి ఆయుధాల ఉంటుంది. పండితుల దృష్టి శాస్త్రజ్ఞానం మీద ఉంటుంది. కాని, ఇక్కడున్న వారు నా శాస్త్రజ్ఞానాన్ని చూడలేకపోయారు. కేవలం నా చర్మాన్ని చూసి నవ్వారు. అందుకని వారు చర్మకారులే. పండితాసనాలలో పండితులు ఉండాలి. కాని, ఈ సభలో అక్కడ చర్మకారులు కూర్చున్నారు. అందువల్ల, ఈ సభ నాకు వికారంగా కనబడింది. అందువల్ల నవ్వాను పొమ్మన్నాడు అష్టావక్రుడు.
దాంతో అందరికీ బుద్ధి వచ్చిందట. అష్టావక్రునికి అందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. (ఇక్కడ చర్మకారుడు అనేది వెక్కిరింపు మాట కాదు. కన్ను ఉండవలసిన చోట ముక్కు ఉంది అన్నామనుకోండి. అది ముక్కును వెక్కిరించినట్టు కాదు కదా?)
ఒడిషా బెంగాలు ప్రజలు ‘వ’ అనే అక్షరాన్ని ‘బ’ అని పలుకుతారు. వంగదేశాన్ని బంగదేశం అంటారు. రవీంద్ర అనకుండా రబీంద్ర అంటారు. అలాగే వారు 'వికారి' అనే పదాన్ని 'బికారి' అని పలుకుతారేమో. అపుడు అర్థం మారిపోదా? ఆయా ప్రాంతంలో పలుకుబడి అలాగే ఉంటుంది కాబట్టి, అర్థం మారిపోదు.
సరే, ఇంతకూ మన భాషలో బికారి అంటే ఏమిటి? బికారి అంటే బిచ్చగాడు, ఇల్లూవాకిలీ లేని వాడు, అనాథ, పేదవాడు అనే నానార్థాలలో మన తెలుగువారు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు.
కాని, నిజానికి బే-కార్ అనే రెండు పదాల కలయిక అది. ‘బేషరతు’ అంటే షరతులు లేకుండా అనే అర్థం మనకు తెలుసు కదా? అలాగే, ‘బేకార్’ అంటే పనిలేనివాడు అని అర్థం. అంటే, చేయడానికి పని లేనివాడు అని అర్థం కాదు. వాడిని నిరుద్యోగి అని కాస్త మర్యాదగా పిలుస్తారు. బేకార్ అనేది ఒకరకంగా తిట్టు. చేయడానికి పని ఉన్నప్పటికీ, చేయకుండా జులాయిగా తిరిగేవాడిని అలా తిడతారు.
నిరుద్యోగులకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పే మన రాజకీయనాయకులకు ఈ తేడా తెలిస్తే బాగుంటుంది అని ఆశిద్దాం.
భౌతికమైన వికారాల కంటె, మనోవికారాలు చాల శక్తిమంతమైనవి. ప్రేమ, కరుణ, వాత్సల్యము, మొదలైనవి కూడా శాస్త్రం ప్రకారం మనోవికారాలే. అయినప్పటికీ, వ్యవహారంలో వాటిని మంచి వాటిగా పరిగణిస్తారు.
కాని, మరికొన్ని మనోవికారాలు చెడ్డవి అని వ్యవహారం. కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు మనోవికారాలే. ఇవి తగుమాత్రంలో అందరికీ ఉంటాయి. సాధువులు మాత్రం మంచివని, చెడ్డవని తేడా చూపకుండా, సమస్తమనోవికారాలను వదిలించుకోవాలని ప్రయత్నిస్తారు.
మంచివైనా చెడ్డవైనా మితిమీరితే మాత్రం చాల ప్రమాదం. రాయలసీమలో ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే, "యేమిరా ఆ మనిషి శానా యికారాలు బడతా ఉండాడే?" అని అంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా?
ప్రేమ అనే మనోవికారం మంచిదని మనం అనుకుంటాం. కాని, దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడు అతి ప్రేమ చూపినందువలన ఆ దుర్యోధనుడు ఎలా చెడిపోయాడో మహాభారతం చెప్పింది.
కామం అనే మనోవికారం చెడ్డదని మనం అనుకుంటాం. కాని, "ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ(ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే అర్జునా) అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. గంగను స్వర్గం నుండి భూమికి దించాలి అనే కామంతో (కోరికతో) భగీరథుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి, సఫలుడై, సమస్తప్రజలకు చాల మేలును చేకూర్చాడని రామాయణం వర్ణిస్తుంది.
ఈ రామాయణమహాభారతాలను మనం ఇతిహాసాలుగా పరిగణిస్తాము. అంటే చరిత్ర అన్నమాట. అయితే, పాశ్చాత్యులు వచ్చి వాటిని మైథాలజీ అనేశారు. అంటే కట్టుకథలు అని.
అస్తు. వారికైనా మనకైనా యద్భావం తద్భవతి.
అందువలన, వికారాలు స్వతః మంచివి అని చెడ్డవి అని ఉండవు. వాటితో మనం చేసే వ్యవహారాలను బట్టి అవి మంచివా చెడ్డవా అని లోకులు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అధికమాత్రంగా ఉన్నవాటిని మనం వదిలించుకోవాలి. మనం స్వయంగా అటువంటి వికారాలను వదిలించుకొనలేకుంటే రామదాసుని, హనుమంతుని త్రికరణశుద్ధిగా స్మరిద్దాం. ఆయన వదిలించగలడు. హనుమంతుడే ఎందుకు అంటే, హనుమంతుడే మరి! బురదగుంటలో పడినవాడిని పైకి లాగాలి అంటే, ఆ బురదగుంటలో లేకుండా బయట ఉన్నవారే శరణ్యం కదా, అలాగన్న మాట.
తులసీదాసమహాకవి హనుమాన్ చాలీసా మొదలుపెట్టే ముందు హనుమత్స్మరణం చేశాడు.
'బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి బిద్యా దేహు మొహి హరహు కలేశ బికార'
(దోహా 2)
(ఓ పవనకుమారుడా! హనుమన్! నన్ను నేను ఒక తెలివితక్కువవాడిగా పరిగణించుకుని, నిన్ను స్మరిస్తూ శరణు వేడుతున్నాను. నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నా కష్టాలను, నా వికారాలను హరించు)
తులసీదాసు ప్రార్థన ఫలించింది. అతడు మహాకవులలో ఒకడుగా కీర్తింపబడ్డాడు. భక్తాగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు. ఆవిధంగా వికారాలను వదిలించగల శక్తి, ఆసక్తి రెండూ మెండుగా ఉన్న స్వామి హనుమంతుడు కదా, అందుకని అతనిని ప్రార్థించాలి. పైగా మరికొన్ని రోజులలో శ్రీరామనవమి కూడా రానుంది మరి!
క్రొత్త సంవత్సరం వేళ, మన ప్రార్థన కూడా తప్పక ఫలిస్తుంది.
ఈ వికారినామ సంవత్సరంలో వారికి, వీరికి అని కాకుండా, అందరికీ సకలశుభాలు ఆనందాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
డా. శ్రీనివాసకృష్ణ పాటిల్

Sunday, 23 December 2018

రాముడు పితృవాక్య పాలకుడేనా?


ఎంతో భక్తిశ్రద్ధలతో రాముడి కథను చదివిన కొందరు సోదరులకు ఒక సందేహం వచ్చింది. అదేమిటంటే -
**********
అదెప్పుడో - త్రేతాయుగం.
వసంతకాలం ఆరంభమైంది. చైత్రమాసం. శుక్లపక్షం. పునర్వసునక్షత్రయుక్తమైన దినం.

శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణునితోను, ఇతర మిత్రులతోనూ కలిసి ఉల్లాసంగా మాటలాడుతున్నాడు. ఇంతలో దశరథమహారాజుకు ఎంతో విశ్వాసపాత్రుడైన సుమంత్రుడు అక్కడకు విచ్చేశాడు. "రామా! మీ తండ్రిగారు వెంటనే నిన్ను తన చెంతకు రమ్మని ఆదేశించారు" అని పలికాడు. రాముడు తక్షణమే అతని వెంట బయలు దేరి వెళ్ళాడు.

నాలుగు దిక్కుల నుండి విచ్చేసిన రాజుల నడుమ దశరథ మహారాజు కొలువు దీరి ఉండగా రాముడు ఆ సభలో ప్రవేశించాడు. రాముని చూడగానే సభలో ఉన్న పౌరజానపదులు, రాజులు అందరూ జయజయధ్వానాలు చేశారు. అప్పటికే దశరథుడు రాముని పట్టాభిషేకవిషయంలో ఏకగ్రీవంగా ప్రజామోదాన్ని పొంది ఉన్నాడనే విషయం రామునికి ఇంకా తెలియదు. తనకు పాదాభివందనం చేసిన రాముని దశరథుడు తనివి తీరనట్టు చూస్తూ, "నాయనా, నీవు పుష్యమీ నక్షత్రయుక్తమైన రేపటి రోజున యువరాజపట్టాభిషిక్తుడవు కావాలి. ప్రజలను రంజింపజేస్తూ భూమిని పాలించాలి." అని పలికాడు. శ్రీరాముడు తండ్రి మాటను అంగీకరించి, ఆయనకు నమస్కరించి, తన నివాసభవనానికి వెళ్ళాడు.

దశరథునికి తన అంతః పురానికి చేరగానే మరలా ఒకసారి రాముని చూడాలనిపించింది. మరలా సుమంత్రునితో కబురు పంపగా రాముడు మరలా వచ్చాడు. "నాయనా! ప్రజలందరూ నిన్నే తమ రాజుగా కోరుకుంటున్నారు. అందువల్ల నిన్ను యువరాజుగా అభిషేకిస్తాను. నాయనా! నా మనసు మారక ముందే, రేపే ఆ శుభకార్యం జరగాలి. "చలా హి ప్రాణినాం మతిః" - ప్రాణుల బుద్ధి చంచలమైనది అని అంటారు కదా!" అన్నాడు. రాముడు సరేనన్నాడు.

అక్కడనుండి బయలు దేరి తల్లి ఆశీస్సులను అందుకున్నాడు. వశిష్ఠమహర్షి చెప్పిన ప్రకారంగా సీతాసమేతుడై వ్రతదీక్షితుడు అయ్యాడు. మరుసటి రోజు ఉదయమే చక్కని వస్త్రాభరణాలను ధరించి రాముడు సిద్ధంగా ఉండగా మరలా సుమంత్రుడు వచ్చాడు. "కైకేయీసమేతుడై ఉన్న మీ తండ్రి మిమ్మల్ని చూడగోరుతున్నాడు. ఆలస్యం చేయక వెంటనే వెళ్ళవయ్యా రామయ్యా" అన్నాడు.


రాముడు మహానందభరితుడై బయలుదేరాడు. అక్కడ కైకేయీ మందిరంలో దీనముఖంతో ఉన్న తండ్రిని రాముడు చూశాడు. పినతల్లికి, తండ్రికి నమస్కరించాడు. తండ్రి "రామా!" అని మాత్రమే తండ్రి పలికాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. రాముని సూటిగా చూడలేకపోయాడు. అతనితో నోరు విప్పి మాటలాడలేకపోయాడు. అతని మనసులో ఏదో అపరాధభావం.


తండ్రి పరిస్థితి రామునికి కంగారును కలిగించింది. "అమ్మా! ఎందుకు నాన్నగారు నాతో మాట్లాడటం లేదు? నావల్ల ఏదైనా తప్పు జరిగిందా?"

అతోషయన్ మహారాజమ్ అకుర్వన్ వా పితుర్వచః।
ముహూర్తమపి నేచ్చేయం జీవితుం కుపితే నృపే।।
(రామాయణం 2.18.15)

"మహారాజైన నాన్నగారిని సంతోషపెట్టకుండా, ఆయన చెప్పిన మాటను పాటించకుండా ఆయన కోపానికి గురై ఒక్క ముహూర్తకాలం కూడా బ్రతకడానికి నేను ఇష్టపడను" అని ప్రక్కనే ఉన్న పినతల్లి కైకేయిని తండ్రి దీనస్థితికి కారణం అడిగాడు.

"నాయనా! మీ తండ్రి మునుపు నాకొక వరం ఇచ్చి ఉన్నాడు. నేను దానిని తీర్చమని ఇప్పుడు అడిగాను. దానిని నెరవేర్చితే నీవు ఏమనుకుంటావో అనే భయంతో నీతో మాట్లాడటం లేదు. రాజు నీకు చెప్పదలచుకున్నది నీకు ఇష్టమనిపించినా కష్టమనిపించినా తప్పక చేస్తానని మాట ఇస్తే నేనే నీకు చెబుతాను" అన్నది కైకేయి.

అందుకు రాముడు -
"కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్ణాభిభాషతే" (2.18.30)
అమ్మా! తప్పక చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు రెండువిధాల మాటలాడడు. రాజు, తండ్రి అయిన ఆయన మాటపై నిప్పులో దూకడానికైనా, విషం త్రాగడానికైనా, సముద్రంలో మునిగిపోవడానికైనా నేను సిద్ధమే. మహారాజు మనసులోని మాట నాకు చెప్పండి." అన్నాడు.


"రామా! భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు వెంటనే దండకారణ్యానికి వెళ్లి అక్కడ పద్నాల్గు సంవత్సరాలు గడపాలని నేను రాజుగారిని కోరాను.

ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।।
(రామాయణం 2.18.40)

మీ నాన్నగారి మాటను నిలబెట్టాలనుకుంటే నువ్వు వెంటనే బయలుదేరు" అన్నది కైకేయి.

వెంటనే రాముడు -
"ఏవమస్తు గమిష్యామి వనం వస్తుం అహంత్వితః।
జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్।।
(రామాయణం 2.19.2)

"సరే, ఇదిగో రాజుగారి ప్రతిజ్ఞ (వరమిస్తానని నీకిచ్చిన మాట) మేరకు జటలను, జింకచర్మాన్ని ధరించి అడవిలో నివసించడానికి బయలుదేరుతున్నాను" అంటూ పెద్దగా కాలహరణం చేయకుండా బయలుదేరాడు.
***********


ఇదీ జరిగిన కథ - కానీ,
"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీ, ఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?" కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసి, అదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"

ఆవిధంగా తండ్రి తనతో చెప్పని మాటను పట్టుకుని రాముడు అడవికి పోతే అతనికి "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు? అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది.

వారి సందేహానికి నాకు తోచిన సమాధానం -

(వారికి నేను చెప్పిన సమాధానం క్రిందన ఉన్నది, మునుపు ఏసియా నెట్ న్యూస్ లో వచ్చింది)


"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీ, ఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?"
 "కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసి, అదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"
 "దశరథుడు నోరెత్తి అడవికి పోవయ్యా అని రాముడికి చెప్పనే లేదు కదా?  మరి అలా చెప్పించుకోకుండానే బయలుదేరి అడవికి వెళ్లిపోయిన రాముడికి  "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది?  అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు?" అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది
 తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షిని చూసేసరికి వాల్మీకికి పరమానందం కలిగింది.    నారదుడు గొప్ప తపస్సంపన్నుడు.  స్వాధ్యాయతత్పరుడు.  మహావాగ్మి.  తన సందేహాలను అలవోకగా తీర్చగలిగిన దిట్ట. 
 వచ్చిన నారదునికి అతిథి పూజ చేసిన తరువాత, వాల్మీకి పదహారు గొప్ప గుణాలను పేర్కొని,  తన సమకాలికులలో ఆ గుణాలన్నింటిని కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు.  "లేకనేమయ్యా?  ఉన్నాడుగా రాముడు?" అంటూ నారదుడు రాముని గూర్చి సంక్షిప్తంగా చెప్పాడు. 
 ఆ సందర్భంలో వాల్మీకి అడిగిన గుణాలలో ఒకటి - "చారిత్రేణ యుక్తత్వం " - (చారిత్రతను కలిగి ఉండటం)  అంటే - తన వంశానికి చెందిన వారు మునుపు పాటించిన సదాచారాలు తానూ కూడా పాటించడం అని అర్థం.  రాముడికి అటువంటి గుణం ఉన్నది అని నారదుడు వాల్మీకికి నొక్కి చెప్పాడు.  రాముని పూర్వీకుల సదాచారాలలో ఒకటి ఏమంటే - ఆడిన మాటను తప్పకపోవటం (వాగ్దానభంగం చేయకపోవటం) అనేది.      
 రాముని తండ్రి అయిన దశరథుడు కూడా ఇదే విధంగా తన పూర్వీకుల పద్ధతిని అనుసరించి, ఆడిన మాటను ఎన్నడూ తప్పకుండా హుందాగా జీవితాన్ని గడిపిన వాడే.  కానీ, వయసులో బాగా పెద్దవాడయ్యాక వాగ్దానభంగానికి పాల్పడవలసిన దురవస్థ రెండుసార్లు పట్టింది.   వింత ఏమిటంటే - అతని ఆ బలహీనతకు కారణం అతని పెద్ద కుమారుడు రాముడే!  
 (1)
ఒకనాడు దశరథుడు తన గురువులతోను, బంధువులతోను, కూర్చుని ముచ్చటలాడుతున్నాడు.  రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది కదా, వారికి తగిన కన్యలు ఎక్కడున్నారు అని చర్చలు జరుగుతున్నాయి.  ఆ సమయంలో విశ్వామిత్రమహర్షి అక్కడకు వేంచేశారు.  దశరథుడు ఆ మహర్షి పాదాలమీద వాలి, స్వాగతం పలికి, -
 "బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి।
కార్యస్య న విమర్శం చ గన్తుమర్హసి కౌశిక।।  (రామాయణం  1.18.54&56)
 స్వామీ, మీరు వచ్చిన పని ఏమిటి?  నేను తప్పక ఆ పనిని నెరవేరుస్తాను.  ఆ పని నెరవేరుతుందో లేదో అని సందేహం పెట్టుకోకుండా అడగండి."  అని ధారాళంగా మాట ఇచ్చేశాడు.  విశ్వామిత్రుడు "ఓ రాజా!  రాక్షసులబారినుండి నా యజ్ఞాన్ని రక్షించేందుకు గాను నీ కుమారుడైన శ్రీరాముని నాతో పంపవయ్యా" అని అడిగాడు.
 ఆ మాటతో దశరథుడు కలవరపడిపోయాడు.  అంతవరకు రాముడికి పెళ్లీడు వచ్చిందని బంధువులతో మాట్లాడిన ఆయన హఠాత్తుగా అదంతా మరచి పోయి - "నా రాముడు బాలుడు స్వామీ, వాడు ఇంకా ఏ విద్యలను పూర్తి చేసింది కూడా లేదు, రాక్షసులు ఎంతటి బలవంతులో కూడా ఎరుగని వాడు, రాముడు వద్దులెండి, నేనే స్వయంగా మీ యజ్ఞాన్ని రక్షించడానికి వస్తాను. ఎన్నెన్నో కష్టాలు పడిన తరువాత నేను బాగా ముసలివాడిని అయ్యాక పుట్టక పుట్టక పుట్టిన నలుసు వాడు.  దాచేసి వాడిని తీసుకు వెళ్ళకండి."
 బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్।
అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి।।
షష్ఠిర్వర్షసహస్రాణి మమ  జాతస్య కౌశిక।
దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి।। (రామాయణం  1.20.6-10)
 అంటూ ముందు దీనంగా బ్రతిమాలాడుకున్నాడు.  అయినప్పటికీ విశ్వామిత్రుడు సరేనని మాట్లాడకపోయేసరికి - "బాలం మే తనయం బ్రహ్మన్నైవ దాస్యామి పుత్రకమ్  (1.20.24) స్వామీ, నా పిల్లవాణ్ణి, నా కొడుకును, నా పుత్రుడిని నీతో పంపను పోవయ్యా" అంటూ మొండికేశాడు. 
 దానితో విశ్వామిత్రునికి  కోపం వచ్చింది. 
"పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి।
రాఘవాణామయుక్తోSయం కులస్యాస్య విపర్యయః।।" (రామాయణం 1.21.2)
 "ఏమయ్యా  దశరథా?  మొదట నేను అడిగినది ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు కాదంటున్నావే?  మీ రాఘవవంశానికి ఇది ఎంతమాత్రం తగని పని కదా?" అన్నాడు.  "సరేలే,అలాగే కానీ!" అంటూ వెళ్ళిపోబోయాడు.  కానీ, ఇంతలో రాజగురువైన వసిష్ఠుడు కలగజేసుకుని, "రాజా!  ముల్లోకాల్లోనూ ధర్మాత్ముడవని మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇలా ఆడిన మాట తప్పి అధర్మం చేసి వంశానికి మచ్చ తెచ్చే పని చేయవద్దు" అంటూ దశరథునికి ఎలాగో నచ్చజెప్పి  విశ్వామిత్రుడి వెంట రాముని పంపించగలిగాడు.
 దాంతో ఆడిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితినుండి దశరథుడు బయటపడ్డాడు.  మొదటిసారి ఎలాగో గండం గట్టెక్కేసింది.  కానీ రెండోసారి మళ్ళీ అటువంటి పరిస్థితి దాపురించింది.  ఈసారి అంత సులువైన పరిష్కారం లభించే అవకాశం కాదు.  ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఏమి చేయదలచుకున్నా ఇచ్చిన మాట తప్పినట్టయ్యే వింత పరిస్థితులలో చిక్కుకున్నాడు. 
2
ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకున్నారు.  దశరథుడు రాముని పిలిపించి "రామా! రేపు నీకు యువరాజపట్టాభిషేకం జరుపబోతున్నాను.  నీవు గురువులు చెప్పిన విధంగా సిద్ధమైపో" అని చెప్పాడు. (అలా రామునికి మాట ఇచ్చేశాడు)
 ఈ శుభవార్తను విని కైకేయి సంతోషపడుతుందేమో అని దశరథుడు అనుకున్నాడు.  కానీ, ఆమె మాత్రం రాముని పద్నాల్గు సంవత్సరాలపాటు అడవికి పంపి, తన కొడుకైన భరతునికి పట్టాభిషేకం జరపమని కోరింది.  శంబరమహాసురునితో యుద్ధం చేస్తూ దశరథుడు గాయపడినపుడు కైకేయి అతనిని కాపాడింది.  ఆ సందర్భంలో దశరథుడు సంతోషించి కైకేయికి రెండు వరాలను ఇస్తానన్నాడు.  ఆమె తనకు అవసరమైనపుడు ఆ వరాలను కోరుకుంటానని అన్నది.  దశరథుడు సరేనన్నాడు.  కైకేయి ఆ సందర్భాన్ని గుర్తు చేసి, అపుడు ఇచ్చిన మాటను ఇపుడు నిలబెట్టుకొమ్మని అడిగింది.  ఆ విధంగా నీ వంశమర్యాదను, నీ శీలాన్ని, నిలబెట్టుకొని, నీ జన్మకు సార్థకత చేకూర్చుకొమ్మని అన్నది.
 కులం చ శీలం చ హి రక్ష జన్మ చ। (2.11.30)
  ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించని దశరథుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు.  ఇరుకులో పడ్డాడు.  కైకేయి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు గాను రాముని అడవికి పొమ్మంటే రాముడు మారు మాటాడక అడవికి నిశ్చయంగా పోతాడు.  ఆ నమ్మకం అతనికి ఉంది. 
 నాలం ద్వితీయో వచనం పుత్రో మాం ప్రతిభాషితుమ్।
స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి।। (రామాయణం - 2.12.86)
 కానీ, పొమ్మంటే పోతాడు కదా సమస్య ఏముంది అని, "పోవయ్యా రామా" అనే రెండు పదాలు పలికితే "నిన్ను యువరాజును చేస్తాను" అని రామునికి తాను ఇచ్చిన మాట తప్పినట్టవుతుంది.  అలాగని కైకేయి కోరినట్టు రాముని పంపకపోతే కైకేయికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది.  ఆవిధంగా దశరథుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చిక్కులో పడ్డాడు.   రాముడు కానీ, కైకేయి కానీ ఎవరో ఒకరు వెనుకకు తగ్గితే తనకు ఆడిన మాట తప్పిన పాపం తప్పుతుంది.
 నిజానికి రాముని అడవికి పంపడం అతనికి మనసులో ఎంత మాత్రం సమ్మతం కూడా కాదు.  అందువల్ల అతడు అటువంటి కోరికను కోరవద్దని కైకేయిని బ్రతిమాలాడాడు.  కోపగించుకున్నాడు.  శపించాడు.  రాముడు అడవికి వెళ్ళిపోతే తాను బ్రతకబోనని నిజం చెప్పాడు.  చివరకు ఆమె  కాళ్ళు పట్టుకుంటానని కూడా అన్నాడు.
స్పృశామి పాదావపి తే ప్రసీద మే। (2.12.114) 
 అయినప్పటికీ ఆమె ఎంత మాత్రం వెనుకకు తగ్గకుండా, అతి కఠినంగా, "నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం రాముని అడవికి పంపకపోతే నీ ముందే నేను ప్రాణాలను వదిలేస్తాను" అని బెదిరించింది.
సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి।
అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితమ్।। (2.14.10)
 ఇక దశరథునికి గత్యంతరం లేకపోయింది.  తన మాటను నిలబెట్టేందుకు రాముడొక్కడే సమర్థుడు.  అతనికి కబురు పంపించాడు.  వెంటనే రాముడు వచ్చాడు.  కానీ, నిర్దోషి అయిన అతనిని తన కారణంగా అడవులకు పంపించేందుకు మనసొప్పని దశరథుడు "రామా" అని ఒక్క మాట పలికి  మరేమీ  మాటాడలేక, చివరకు అతనిని సూటిగా కూడా చూడలేక, కళ్లనీళ్లు పెట్టుకొని ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.
 తాను తండ్రిపట్ల ఏమైనా తప్పు చేశానేమో అని మథనపడిన రామునితో కైకేయి దశరథుడు తనకు ఇచ్చిన వరాలను పేర్కొని,  అలా ఇచ్చేందుకు గల కారణాలను కూడా వివరించి, తండ్రిమాటను నిలబెట్టేందుకు గాను నువ్వు ఆవిధంగా ఆచరించవలసి ఉన్నది" అని చెప్పింది.
ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।। (రామాయణం 2.18.40)
 తండ్రికి తనపై గల ప్రేమ శ్రీరామునికి సంపూర్ణంగా తెలుసు.  ఆ ప్రేమతోనే తనను వెళ్ళమని చెప్పలేకపోతున్నాడని గ్రహించాడు.  మునుపు విశ్వామిత్రుడు అడిగినపుడు కూడా తనమీద ప్రేమకొద్దీ తనను అతనితో పంపలేక వంశాచారాన్ని భగ్నపరచే సాహసం చేసిన విషయం రాముడు ఇంకా మరచిపోలేదు.  ఎలాగో గురువైన వసిష్ఠుని వల్ల ఆ ఆపద గడిచింది.  తాను ఆనాడు బాలుడు.  కాని, ఈనాడు సమర్థుడైన యువకుడు.  తండ్రి మాటను నిలబెట్టవలసిన బాధ్యత తనమీద ఉన్నది.  అది గ్రహించుకున్న స్థితప్రజ్ఞుడు రాముడు అడవులకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.
 దండకారణ్యమేషోSహమితో గచ్చామి సత్వరః।
అనుక్తోప్యత్ర భవతా భవత్యా వచనాదహమ్।
వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ।। (రామాయణం 2.19.11&23)
 "అమ్మా, ఇదిగో,  నేను వెంటనే దండకారణ్యానికి బయలుదేరుతున్నాను.  తండ్రి గారు నేరుగా చెప్పకపోయినా మీ మాట మేరకు (మీకిచ్చిన మాట మేరకు)  అక్కడ పద్నాలుగు సంవత్సరాలు నివసిస్తాను."  అని తండ్రి ముందే చెప్పి బయలుదేరాడు. 
 ఈ విధంగా తండ్రి తనను స్వయంగా అడవికి పొమ్మని ఆజ్ఞాపించకున్నా - పినతల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రాముడు అడవికి బయలుదేరడం ఖచ్చితంగా  పితృవాక్యపరిపాలనమే!  ఈ మాటను అన్నది నేను కాదు, మరెవరో ఒక మానవమాత్రుడు కూడా కాదు, వారు కూడా ఒకరిద్దరు కాదు.  ఎవరెవరు ఏయే సందర్భాలలో  అలా అన్నారో ఈ క్రిందన రామాయణశ్లోకాల సంఖ్యతో సహా చూడండి.  పేర్కొనబడిన ప్రతి శ్లోకానికి అర్థం లేదా భావం రాముడు పితృవాక్యపరిపాలకుడు అనే. 
 1) మొదటగా నారదుడు వాల్మీకితో అన్నాడు:
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామానుపాలయన్।
పితుర్వచననిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్।।  (రామాయణం 1.1.24)
 2) బ్రహ్మ వాల్మీకితో ఈవిధంగా అన్నాడు:
వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాత్ శ్రుతమ్।
న తే వాగనృతా కావ్యే  కాచిదత్ర భవిష్యతి।।  (రామాయణం 1.2.32&35)
 "ఓ వాల్మీకీ, నారదుడు నీకు ఎలా చెప్పాడో అలాగే ధీరుడైన రాముని కథను వ్రాయవయ్యా.  నీవు వ్రాసిన ఒక్క మాటకూడా అసత్యం కాజాలదు" అని బ్రహ్మ వరం ఇచ్చాడు.  కాబట్టి రాముడు పితృవాక్యపరిపాలకుడు అని నారదుడు అన్న మాట సత్యమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాల్మీకితో చెప్పినట్టే కదా?
 3) లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు:
పితుర్నిర్దేశపారగః ....
రాజ్యాద్భ్రష్టో  వనే వస్తుం మయా సార్థమిహాగతః।। (రామాయణం 4.4.8-10)
4) అంగదుడు జటాయువు సోదరుడైన సంపాతితో ఈవిధంగా అన్నాడు:
రామో దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టో దండకావనమ్।
పితుర్నిర్దేశనిరతో  ధర్మ్యం పన్థానమాశ్రితః।।  (రామాయణం 4.57-58)
 5) హనుమంతుడు అశోకవనంలో సీతమ్మకు తన ఉనికిని తెలియజేసేందుకు ముందు ఈ విధంగా శ్రీరాముని కీర్తించాడు:
తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః।
సభార్యః  సహా చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్।।  (రామాయణం 5.32.8)
 6) హనుమంతుడు రావణుడితో కూడా అదే విషయం చెప్పాడు:
పితుర్నిర్దేశాన్నిష్క్రాంతః ప్రవిష్టో దండకావనమ్।।   (రామాయణం 5.51.5)
 7) "పద్నాలుగేళ్ళు అడవిలో ఉంటాను"  అన్న మాటను రాముడు కూడా అంతే పట్టుదలతో నిలబెట్టుకున్నాడు.  తండ్రి చనిపోయిన తరువాత, రాముని వెతుక్కుంటూ చిత్రకూటానికి వచ్చిన భరతుడు, జాబాలి, వసిష్ఠుడు తదితరులు వనవాసం మాని, అయోధ్యకు తిరిగి వచ్చి, పట్టాభిషేకం చేసుకొమ్మని రాముని ఎంతగా వత్తిడి చేసి చెప్పినప్పటికీ,
తేన పిత్రాssహమప్యత్ర నియుక్తః పురుషర్షభ।
చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికమ్।। (రామాయణం 2.107.7)
అంటూ నిర్ద్వంద్వంగా తండ్రి మాటను తాను నిలబెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు.
 8) చివరకు స్వర్గస్థుడైన దశరథుడు కూడా అంగీకరించాడు!  అష్టావక్రుడు తన తండ్రిని తరింపజేసినట్లు నువ్వు నన్ను తరింపజేశావు నాయనా! అన్నాడట.  (6.119.17) ఆ సందర్భంలో కైకేయి మిమ్మల్ని నిర్బంధించినందుకు మనసులో ఎటువంటి కోపం పెట్టుకోవద్దు, వారిని క్షమించమని రాముడు తండ్రిని కోరడం, ఆయన అంగీకరించడం కూడా జరిగింది. 
 ఈ విధంగా కథ సుఖాంతం అయింది.
 "పితృవాక్యపాలన" అనే ఒక ఆదర్శాన్ని గొప్ప గుణంగా శ్రీరాముని పాత్ర ద్వారా బ్రహ్మ, నారదుడు, వాల్మీకి కలసి ప్రజలకు ఆ విధంగా పరిచయం చేయదలచుకున్నారు.  కాబట్టి, వారి సంకల్పం తిరుగులేకుండా ప్రచారంలోనికి వచ్చేసింది.  ।।ఇతి శమ్।।


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...