Sunday 30 December 2018

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును (రెండవ భాగం)

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును
((రెండవ భాగం))

ఓం శివాయ నమః
ఓం స్దాణవే నమః
ఓం ప్రభవే నమః
ఓం భీమాయ నమః
ఓం ప్రవరాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరాయ నమః

అంటూ నత్కీరుడు మట్టితో తాను చేసిన శివలింగం ముందు పూజలో లీనమై ఉన్నాడు.
యక్షిణి తన తంత్రాన్ని మొదలు పెట్టింది.

చెట్టు మీద నుండి ఒక ఆకు రాలి శివలింగం ప్రక్కనే పడింది.
వెంటనే, అది ఒక పక్షిగా మారిపోయింది. 
టప టప మని రెక్కలాడించూకుంటూ ఎగిరిపోయింది.
నత్కీరుడు ఆ వింత చూశాడు. 
కాని పట్టించుకోలేదు.

ఇంతలో చెట్టుమీద నుండి మరొక ఆకు రాలి తటాకంలోని నీటిలో పడింది.
వెంటనే అది చేపగా మారి విలాసంగా మొప్పలను తోకను ఊపుకుంటూ ఈత కొట్టసాగింది.
నత్కీరుడు ఈ వింతను కూడా చూశాడు.
కాని అతని ఏకాగ్రత చెక్కు చెదరలేదు.

చెట్టుమీద నుండి ఆకులు రాలి పడుతూనే ఉన్నాయి.
రకరకాల పక్షులుగా రంగురంగుల చేపలుగా మారిపోతున్నాయి.
వాటిని పట్టించుకోకుండా నత్కీరుని పూజ కొనసాగుతోంది.
దాదాపు ముగింపుకొచ్చేసింది.
పూజ ముగిసేలోపు ఎలాగైనా అతని ఏకాగ్రతను చెడగొట్టి తీరాలనుకుంది యక్షిణి.

ఈసారి ఆకు రాలి సగం నేలపైన సగం నీటిలోను పడింది.
నేలపైన పడిన సగం పక్షిగా మారింది.
నీటిలో పడిన సగం చేపగా మారింది.
పక్షి ఆకాశంలోనికి ఎగిరేందుకు రెక్కలు కొట్టుకుంటూ ప్రయత్నం చేయసాగింది. 
చేప నీటిలోనికి పోయేందుకు బలంగా ప్రయత్నిస్తోంది.
ఇదంతా నత్కీరుడి కంట బడింది. 
అతడు విభ్రాంతుడైపోయాడు.
అతని చిత్తంలో కాసేపు శివుడు విస్మరణకు గురి అయ్యాడు.
నోటినుంచి అంతవరకు మధురంగా లయబద్ధంగా వినిపిస్తున్న శివనామస్మరణ ఆగిపోయింది.
చూపులు శివుని నుండి ప్రక్కకు మళ్లాయి. 
తదేకంగా ఆ పక్షి,చేపల గుంజులాటను చూడసాగాడు.

ఆ వ్యవధి సరిపోయింది యక్షిణికి.
చెట్టుమీదనుండి కుప్పించి నేలపైకి దూకింది.
నత్కీరుణ్ణి ఒడిసి పట్టుకుంది.
ఓరి దొంగభక్తుడా అంటూ వికటాట్టహాసం చేసింది.
అతణ్ణి నేరుగా తన కొండగుహకు తీసుకొనిపోయి ఒక చెరలో పడేసింది.
శుభ్రంగా స్నానం చేసి వస్తానంటూ వెళ్లిపోయింది.

ఆ చెరలో అప్పటికే చాలమంది బందీలు ఉన్నారు.
వారు తమలో చేరిన నత్కీరుణ్ణి చూశారు.
కొందరు అతడిని చూడగానే హృదయవిదారకంగా ఏడవసాగారు.
మరి కొందరు అతడిని నిందించసాగారు.

నత్కీరుడు వారిని దీనంగా చూశాడు.
"నేను కూడా మీలాంటి అభాగ్యుడినే కదా?
నన్ను మీలో ఒకడిగా భావించకుండా ఎందుకు తిడుతున్నారు?"
అని అడిగాడు.

"మేము ఇప్పటికే 99 మంది ఉన్నాము. 
ఈ యక్షిణి నూరు మందిని పోగేసి కాని తినదు. 
నువు నూరో వాడివి ఇప్పుడు వచ్చావు. 
నీ రాక వల్ల మా అందరికీ చావు మూడింది" 
అన్నారు వారు.

"సరే, ఇపుడు ఏడిస్తే ఏం ప్రయోజనం?
తప్పించుకొనే ప్రయత్నం చేద్దాం" 
అన్నాడు నత్కీరుడు.

"మేము కూడా ప్రయత్నాలు చేశాము. 
ఒక్క సారి ఈ యక్షిణికి దొరికితే మన జాడ అండపిండబ్రహ్మాండాల్లో ఎక్కడున్నా తెలుసుకోగలదు. 
మేము తప్పించుకుని ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి మళ్లీ ఇక్కడ పడేసింది."
అని వాళ్లు మళ్లీ ఏడ్చారు.

నత్కీరుడు వారిని ఓదార్చి కుమారస్వామిని ప్రార్థించాడు. ఆయన వెంటనే దిగివచ్చి యక్షిణి బారినుండి వారిని కాపాడాడు. 
అందరూ కుమారస్వామిని పూజించి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. 

కాని నత్కీరుడు మాత్రం ఆయనను వదలలేదు.
తన పొగరుబోతుతనాన్ని, వదరుబోతుతనాన్ని, 
వాటివల్ల తనకు కలిగిన దుర్గతిని విన్నవించుకుని 
"స్వామీ, కైలాసానికి చేరే మార్గోపదేశం చేయవయ్యా" 
అంటూ వేడుకున్నాడు.

ఆయన నవ్వేసి 
"ఏమయ్యా నత్కీరా, 
కైలాసం ఉత్తరాన మాత్రమే ఉందని 
నువు కూడా ఒక పామరుడిలా భ్రమపడుతున్నావే! 
దక్షిణాన కూడా ఒక కైలాసం ఉన్నది. 
అదే శ్రీకాళహస్తి. 
దానిని దర్శించుకో" అని ఉపదేశించాడు.

నత్కీరుడు అలాగే చేసి తన కుష్టు రోగం నుండి విముక్తుడయ్యాడు. 
•○●□•○●□•○●□

నత్కీరుడు ఎంతెంతో నయం!
అందుకే ఆయనను శాపంతో (మాటలతో) బుద్ధి చెప్పి వదిలేశారు.

కాని, 
పొగరు తలకెక్కిన పరమధూర్తులు మరి కొందరు ఉన్నారు.
ప్రసిద్ధులే! 
celebrities & legends మరి!
మాటలతో హెచ్చరించినంత మాత్రాన నెమ్మదించే బ్యాచ్ కాదు వారు.
•○●□•○●□•○●□

నూరుమంది కౌరవులకు ఒక చెల్లెలు.
ఆమె పేరు దుశ్శల. 
ఆమె భర్త పెద్ద సుశీలుడేం కాదు.
అతని పేరు జయద్రథుడు.
సైంధవుడనే పేరుతో బాగా తెలిసినవాడు.
కౌరవపాండవులకు వివాహసంబంధం ద్వారా బావమరది అయ్యాడు.

వాడొకసారి అరణ్యంలో ప్రయాణిస్తూ ద్రౌపదిని చూశాడు.
అతడు ఫలానా అని తెలుసుకున్న ద్రౌపది "రా అన్నా భోంచేసి వెడుదువు గాని. మీ బావలు కూడా కాసేపట్లో తిరిగివస్తారు" అంటూ ఆహ్వానించింది.
పాండవులు లేరని తెలుసుకొనేసరికి ఆ పిరికి వెధవకు హఠాత్తుగా నెత్తిమీద కొమ్ములు మొలిచాయి. 
వావివరుసలు గాలికి వదిలేశాడు. 

పాండవులను వదిలేసి తనతో వస్తే ఆమెను రాణిని చేస్తానంటూ "ఆఫర్" ఇచ్చాడు.
ఆమె ఛీ పోరా వెధవా అనేసరికి వాడు ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయాడు.
కాని అరణ్యం దాటే లోపులే పాండవులకు దొరికిపోయాడు.
భీముడు ఒక్క పిడికిలి పోటుతో వాడి తలను పగలగొట్టే లోగా ధర్మరాజు అడ్డుపడి "నాయనా ఈ వెధవను చంపి మన చెల్లెలు దుశ్శలను విధవను చేయకురా" అంటూ వాడిని కాపాడాడు.

వాడికి తలనిండా పిలకలుండేట్టు బుఱ్ఱ గొరిగి పంపేశారు.
ఆ వెధవ అప్పటికైనా బుద్ధి తెచ్చుకునింది లేదు.

తపస్సుతో శివుడిని మెప్పించి పాండవులను ఓడించేంత బలం కావాలన్నాడు.
శివుడు అప్పటికే అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చి నీవు అజేయుడవై ఉంటావు అని వరం ఇచ్చి ఉన్నాడు.
పైగా ఆ దుర్మార్గుడిని ఎంకరేజ్ చేయదలచుకోలేదు.

అందువల్ల "ఓరయ్య నీవు ఎన్ని జన్మలెత్తినా అర్జునుణ్ణేం చేయలేవు. 
కానీ నీ జన్మలో ఒకసారికి మిగిలిన నలుగురిని ఓడించగలవులే" 
అని మాట ఇచ్చి పంపాడు.
ఆ వరంతో వాడు యుద్ధంలో అభిమన్యుడి చావుకు కారణమయ్యాడు.

ఆ విషయం తెలుసుకుని క్రోధాగ్నిజ్వాలాముఖుడైన అర్జునుడు వాడిని మరుసటి రోజు సాయంత్రంలోగా చంపకుంటే గాండీవంతో సహా నేనే స్వయంగా అగ్నిప్రవేశం చేస్తా అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు.

అపుడు పాండవవీరులు ప్రచండంగా పెడబొబ్బలు పెట్టారట. 
భూమి కంపించిందట.
ఉల్కలు రాలి పడ్డాయట!
దూతఘటోత్కచంలో భాసుడు ఆ ఘట్టాన్ని వర్ణించిన తీరు అద్భుతం!

మరుసటి రోజు అర్జునుణ్ణి ఆపగల శక్తి ఎవరికీ లేకపోయింది. 
ఎవరూ కని విని ఎరుగని రీతిలో విజృంభించాడు. 
అడ్డుకున్నవారినందరినీ ఊచకోత కోశాడు.
జయద్రథుణ్ణి నిర్దాక్షిణ్యంగా వధించాడు.

జయద్రథుడి కండకావరానికి పడవలసిన శిక్షను ధర్మరాజు రద్దు చేయలేదు. 
శిక్ష ఆనాడే ఖరారైంది. 
కాని ఆ శిక్ష సమంజసమే అని అందరూ భావించేంతవరకూ కేవలం పోస్ట్ పోన్ చేశాడంతే!
•○●□•○●□•○●□

పాండవులు అజ్ఞాతంలోనికి ప్రవేశించేముందు పరమేశ్వరిని పూజించారు. 
ఆమె స్త్రీరూపంలోని శివశక్తి. 
తప్పక తన భక్తులను కాపాడుతుంది.

సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని కీచకుడు చూశాడు.
ఆమెను తన దగ్గరకు పంపమని సిగ్గు ఎగ్గు లేకుండా స్వయంగా తన సోదరినే అడిగాడు.
అతని నీచత్వానికి అతని సోదరే భయభ్రాంతురాలైంది.

వాడు బాగా తాగేసి ఉన్నాడు.
నిరాకరించిన సైరంధ్రిని వదలకుండా వెంటబడ్డాడు.
సాక్షాత్తు రాజసభలోనే అందరి ఎదుట ఆమెను క్రింద పడేసి కాళ్లతో తన్నాడు. 
"నాపేరు సింహబలుడు. నన్నెవడూ ఏం చేయలేడు" అని వికటాట్టహాసం చేశాడు.

రాజుగారు కూడా భయపడి పోయారు.
గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నారు.
కీచకుడనే ప్రభుత్వేతరశక్తిని అరికట్టలేక
నిస్సహాయంగా నిశ్చేష్టులై పోయారు.

మొత్తానికి రాజుగారి చేతగానితనం అందరికీ తెలిసిపోయింది.
కాని ఆ పాపాత్ముడు ఫలితం అనుభవించాల్సిందే.
చట్టాన్ని ధర్మమే స్వయంగా తన అదుపులోనికి తీసుకుంది.
తాత్కాలికంగానే...

ఫలితం -
ఆ రోజు రాత్రి కీచకుడు రక్తపు ముద్దగా మారిపోయాడు. 
వాడి తల వాడి పొట్టలో కుక్కబడింది. 
వాడి కాళ్లు చేతులు ఖండఖండాలుగా చేయబడి వాడి మొండెంలో ఎక్కడెక్కడ కూరుకుపోయి ఉన్నాయో ఎవడికీ అర్థం కాలేదు.
మహా ఘోరమైన చావు చచ్చాడు.

చూసిన ప్రతి ఒక్కరు తమ జన్మజన్మలకు సరిపడేంతగా భయపడి వణికిపోయారు.
కీచకుని తమ్ములైన ఉపకీచకులు తప్ప.
వారు కాదన్న అమ్మాయి మొహంపై ఆసిడ్ పోసే బ్యాచ్ లాంటివారు.
వారు సైరంధ్రిని ఎత్తుకుపోయి తమ అన్న శవంతో పాటు కాల్చేద్దాం అనుకున్నారు.

అంతే!
ఆ మరుసటి రోజే వాళ్ల శవాలు కనీసం పోస్ట్ మార్టంకు కూడా నోచుకోకుండా తమ అన్నశవంతో బాటు తగలబడి పోయాయి. వారందరికీ ఆ శిక్ష విధించిన శక్తి ఎవరిదో తెలియని వాళ్లెవరూ లేరు.
•○●□•○●□•○●□

అంతేనా? 
సీతను అపహరించిన రావణుడికి,
ద్రౌపదిని తన తొడపై కూర్చొమ్మన్న డిక్టేటర్ తొడల దుర్యధనుడికి,
ఆమె జుత్తును, కొంగును లాగిన దుశ్శాసనుడికి,
ఇలా కళ్లు నెత్తికెక్కిన ప్రతి వెధవకు 
వారు చేసిన వెధవ పనులకు ఆయా కాలాల్లో తగిన శిక్ష పడింది.
•○●□•○●□•○●□

సందేహం అక్కరలేదు.
ఇంద్రుడికీ శిక్ష పడింది.
ఉపేంద్రావతారుడికీ శిక్ష పడింది.
(దయ చేసి అవేమిటో వివరించమని నన్ను అడగకండి.
ఎవరికి వారే స్వయంగా తెలుసుకుంటే మంచిది. )
•○●□•○●□•○●□

ఇలా ఆయా సందర్భాల్లో
పురాణాలు మనకు మార్గదర్శనం చేస్తున్నాయి. 
కర్తవ్యబోధన చేస్తున్నాయి. 
ఇలాంటిలాంటి సందర్భాలలో మీరు ఈవిధంగా ప్రవర్తించాలి 
అని పదే పదే చెబుతున్నాయి. 
పైన పేర్కొన్నవి కేవలం ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే.

పురాణాలు కేవలం పెద్ద వయసులో పారాయణ చేసుకొనే గ్రంథాలు అని భావించడంలోనే భారతజాతి పతనానికి మూలబీజాలు ఉన్నాయి.

అలాంటి పురాణాలకు కొందరు కుట్రదారులు మతమనే గాఢమైన ముద్ర వేసేసరికి అన్నీ తెలుసుకొనగల తెలివి కలిగిన కొందరికి వాటిలో కేవలం డొల్లతనమే కనిపిస్తోంది. 
"పైపొట్టు లేకుండా బియ్యం గింజ మొలకెత్తదు."

ఈ మనుషులు - 
వారి ఆభిజాత్యం ఎంత గొప్పదైనా, 
వారి విద్య ఎంతటి మహోన్నతమైనదైనా,
వారు ఎంతటి పరాక్రమవంతులైనా, 
వారు ఎంతటి ఐశ్వర్యసంపన్నులైనా,
వారు ఎంతటి దివ్యాంశసంభూతులైనా, 
అక్కడక్కడ వారిలో కనిపించే లోపాలను 
దాచకుండా బయటపెట్టిన పురాణాల నిజాయితీ 
కొందరికి మెచ్చదగిందిగా కనబడకపోవటం దురదృష్టం.

అన్యాయాలు జరిగాయి.
అక్రమాలు జరిగాయి.
నిజమే.
అలా నిజాలు బయటపెట్టడం వల్ల పురాణాల విలువ తగ్గిపోతుందా?

మానవుడిగా పుట్టినవారిలో 100% మహాపురుషుడు లేడని, 
అంతగా కావాలంటే 99.99 తో సరిపెట్టుకొనవలసిందే 
అని అవి విస్పష్టంగా తెలియజెబుతూంటే వాటిని ఎందుకు తప్పు బట్టడం?
అవి మన పూర్వీకులకు సంబంధించిన బోలెడన్ని కేస్ స్టడీలు 
మనకు అందిస్తున్నాయి. 

వాటిని బట్టి 
మనం స్వీకరించదగినవి ఇవి, 
తిరస్కరించదగినవి ఇవి 
అనే విచక్షణ జ్ఞానం మనకు ఉండి తీరాలి.

నీటిని విడిచి పాలను గ్రహించే రాజహంసల్లా
మనుషులుండాలని
ఆయా వ్యక్తులలోని
ఈయీ సుగుణాలను గ్రహిద్దాం.
ఈయీ దుర్గుణాలను పరిహరిద్దాం 
అని గ్రహించి
పరమహంస స్థాయికి చేరుకోవాలని
పురాణేతిహాసాలు ఆశిస్తున్నాయి.

కాదు కాదు, 
కానే కాదు, 
వాటికి ఫలానా మతానికి చెందినవి అనే ముద్ర ఉంది కాబట్టి 
అవి నాకు ఏ మాత్రం సంబంధం లేనివి.

అని సెక్యులర్ మతం వహించి దూరం చేసుకుంటే 
వ్యక్తిగతంగా ఆయా మనుషుల ఇష్టం. 
సామూహికంగా దేశానికి నష్టం! 
•○●□•○●□•○●□

నాకు సంబంధించి దేవుడొకడే. 
అతని నామరూపాలు ఆయా దేశకాలాల్లో వేరు వేరుగా ఉండవచ్చు గాక!
అన్ని నామరూపాలు నాకిష్టమే. 
ఆయన సర్వవ్యాపి.

అయినా, 
శివరాత్రి నాడు దక్షిణకైలాసమైన శ్రీకాళహస్తికి పోవాలనే పట్టుదలకు పోకుండా తిరుమల వేంకటనాథుని దర్శనాన్ని మా కుటుంబసభ్యులందరం చేసుకున్నాం. 
నాస్తి కోsపి భేదః.
•○●□•○●□•○●□

నాకు ఎవరి పిల్లలైనా ఇష్టమే. 
కాని మా పిల్లలు మా ఇంట్లో పెరగడమే న్యాయం.
వారు వేరొకరి ఇంట్లో పెరగాలని నేను కోరుకోను. 
కాని 
ఇతరుల పిల్లలు కూడా మా ఇంటికొచ్చి మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు.
మా పిల్లలు కూడా తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఆడుకుని వస్తారు.

ఉమ్మడి కుటుంబాల వంటి ఇళ్లు ఉంటే 
అంతటా నిర్వ్యాజమైన ప్రేమ లభిస్తూ ఉంటే 
ఎవరు ఎక్కడ పెరిగినా ఆనందమే!
వారి స్నేహం అలా నిత్యం కొనసాగుతూ ఉండాలని నా కోరిక.
•○●□•○●□•○●□

అందరికీ శుభాకాంక్షలు.
సర్వే జనాః సుఖినో భవంతు.
సర్వే దుష్టాః దండితాః భవంతు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...