Monday 17 December 2018

నేను సైతం వివక్షాగ్నికి సమిధనొక్కటి ధారపోశాను!

  1. హిడింబ ఒకరోజు ఏదో వ్రతం మొదలుపెట్టింది.
  2. ఎందుకమ్మా వ్రతం అని ఘటోత్కచుడు అడిగితే "నాయనా! మీ తండ్రిగారైన భీమసేనుని చూసి చాలకాలమైందిరా! భర్తృదర్శకమనే ఈ వ్రతాన్ని ముగించేసరికి మనకు ఆయన దర్శనమిస్తారు. ఈరోజు సాయంత్రం వ్రతాన్ని ముగించి ఓ మాంచి మనిషిని భోంచేస్తే వ్రతం ముగిసినట్టే. అందుగ్గాను ఎవరైనా దొరుకుతారేమో పట్రాపో" అని చెప్పింది. మాతృవిధేయుడైన ఘటోత్కచుడు సరేనని బయలుదేరాడు.
  3. వానికి అడవిలో ఇద్దరు పెద్దవయసు బ్రాహ్మణదంపతులు, వారి ముగ్గురు కుమారులతో కనబడ్డారు. రాక్షసుణ్ణి చూసేసరికి వాళ్లు హడలిపోయి ప్రాణాలమీద ఆశ వదిలేసుకున్నారు. అతడు "మేము రాక్షసులమైనా నరమాంసభక్షకులం కాదయ్యా, భయపడకండని" వారికి చెప్పి, మీలో ఒకరు మా తల్లికి వ్రతానంతరఫలహారమయ్యేందుకు సిద్ధపడి నాతో వస్తే మిగిలిన నలుగురిని క్షేమంగా వదిలేస్తానన్నాడు. నరమాంసం తినమని ఓవైపు చెబుతూనే మాలో ఒకరిని అతని తల్లికి ఫలహారం ఐపొమ్మంటున్నాడేమిటీ తిక్కలోడని వాళ్లు తికమకపడ్డారు.
  4. "నేను కుటుంబయజమానిని. వారిని రక్షించాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను మీ తల్లికి ఫలహారంగా వస్తాను. నన్ను తీసుకుపో రాక్షసోత్తమా" అన్నాడు ఆ ముసలి బాపడు. "వద్దయ్యా! ఎముకలపోగైన నీవు మా అమ్మ పంటిక్రిందకు చాలవు" అన్నాడు ఘటోత్కచుడు.
  5. "నన్ను తీసుకుపో రాక్షసకుమారా!" అన్నది ఆ వృద్ధబ్రాహ్మణస్త్రీ. "మా తల్లి వంటి కరుణామయి స్త్రీలను ఆహారంగా స్వీకరించలేదమ్మా! మీరు వద్దు" అన్నాడు ఘటోత్కచుడు.
  6. అపుడు నన్ను తీసుకుపొమ్మంటే కాదు నన్నంటూ ముగ్గురు కుమారులూ ముందుకొచ్చారు. ఘటోత్కచుడు విసుక్కొని, "నాక్కావలసింది ఒకరేనయ్యా! మీ ముగ్గురిలో ఎవరో ఒకరే ముందుకురండి!" అన్నాడు.
  7. అపుడు ఆ తండ్రి "జ్యేష్ఠకుమారుడు వంశాన్ని నిలుపవలసినవాడు, శ్రాద్ధాదికర్మలతో పితృకర్మలు చేయవలసినవాడు. వాణ్ణి నేను వదలను" అన్నాడు.
  8. ఆ తల్లేమో - "కనిష్ఠపుత్రుడు నాకు అత్యంతప్రియతముడు. నాకు వాడు ఇప్పటికీ స్తనంధయుడనే అనిపిస్తాడు. వాణ్ణి నేను వదలను" అన్నది.
  9. అపుడు రెండవకుమారుడు ముందుకు వచ్చి "సరే. నన్ను తీసుకొనిపో రాక్షసేంద్రా! కాని, చివరిసారిగా సంధ్యావందనం చేసుకొనే అవకాశమివ్వు" అన్నాడు. "సరే! ఆ వైపు ఓ జలాశయముంది. అక్కడ సంధ్యవార్చుకుని వెంటనే వచ్చేసెయ్." అని ఘటోత్కచుడు అనుమతించాడు. అలా వెళ్లిన అతడు ఎంతకూ తిరిగిరాలేదు.
  10. ఘటోత్కచుడికి విసుగొచ్చి, "మీ వాణ్ణి రమ్మని కేకవేయండి" అని వారిని అడిగాడు. "చావడానికి రమ్మని వాణ్ణి ఎలా పిలువగలం? నువే పిలుచుకోపో!" అన్నారు వారు. "సరే! నేనే పిలుస్తా! ఆ అబ్బాయి పేరేమిటి?" అని అడిగాడు ఘటోత్కచుడు. అదిగూడా చెప్పము పొమ్మన్నారు వారు. చేసేదేమీ లేక ఘటోత్కచుడు ఇద్దరు పిల్లల మధ్యలో పుట్టినవాణ్ణి మనం "ఒరే నడిపోడా" అని పిలిచినట్లుగా "ఓ మధ్యమా! త్వరగా రావయ్యా!" అని గట్టిగా రెండుమూడుసార్లు పిలిచాడు.
  11. "ఎవరయ్యా అది? ఎందుకు నన్ను పిలుస్తున్నారు?" అంటూ ఒక బలిష్ఠుడైన వ్యక్తి అక్కడకొచ్చాడు. అతడే భీముడు. కుంతీకుమారుల్లో రెండవవాడైన అతడికి "మధ్యమా" అన్న పిలుపు అలవాటే. అలా వచ్చిన భీముడికి ఆ పిలిచినవాడు తన కొడుకు ఘటోత్కచుడని తెలియదు. తాను పిలవగా వచ్చినవాడు తన తండ్రి భీముడేనని ఘటోత్కచుడెరుగడు. సరే. అక్కడి పరిస్థితిని క్షణాల్లో పసిగట్టేశాడు భీముడు. మాటలసందర్భంలో వాడు తన కొడుకేనన్న సంగతిని కూడా కనిపెట్టేశాడు.
  12. "కుమారా! వారినొదిలిపెట్టవయ్యా! ఆ బ్రాహ్మణకుమారుడి స్థానంలో నేనొస్తాను" అన్నాడు భీముడు. "నన్ను కుమారుడనడానికి మీరెవరయ్యా?" అంటూ కయ్యిమన్నాడు ఘటోత్కచుడు. "నేను క్షత్రియుడినయ్యా! క్షత్రియుడు అందరికీ తండ్రిలాంటివాడు కదా!" అన్నాడు భీముడు. "సరే అయితే! వస్తానన్నావుగా మరి! బయలుదేరు. నాతో రా!" అన్నాడు ఘటోత్కచుడు. భీముడికి కొడుకు బలాన్ని చూడాలని కోరిక కలిగింది. "చెప్పానుగా, నేను క్షత్రియుణ్ణని? ఒకరు రమ్మని ఆజ్ఞాపిస్తే వచ్చేవాణ్ణి కాదు. నీకు చేతనైతే నన్ను తీసుకుపో చూదాం" అన్నాడు.
  13. దాంతో ఇద్దరికీ కాసేపు యుద్ధం జరిగింది. కాసేపు కుస్తీపట్లు, కాసేపు శస్త్రాలు, కాసేపు మాయలు, కాసేపు అస్త్రాలు... అలా... కాసేపు భీముడిది పైచేయి అయితే కాసేపు ఘటోత్కచుడిదే పైచేయి అయింది. ఎంత చేసినా భీముణ్ణి వంచలేకపోయాడు ఘటోత్కచుడు. కాని, భీముడికి మాత్రం కొడుకు యుద్ధకౌశలం పరమానందం కలిగించింది. చివరకు విసుగెత్తిన ఘటోత్కచుడు, "ఇదుగో, ఏమయ్యోయ్! మాట్లాడితే చాలు! నేను క్షత్రియుణ్ణి క్షత్రియుణ్ణి అంటావ్! సుక్షత్రియులెవరూ ఆడిన మాట తప్పరు! కాబట్టి, నాకిచ్చిన మాట ప్రకారం నాతో రా!" అన్నాడు. "సరే, పద!" అని భీముడు బయలుదేరాడు.
  14. కొడుకుతో పాటు వచ్చిన భర్తను చూసి, హిడింబ తన ఉపాయం ఫలించినందుకు సంతోషపడింది. "ఉరే నాయనా! ఇతడేరా మన ఇద్దరిపాలిటి దైవం!" అని కొడుకుకు అతని తండ్రిని పరిచయం చేసింది. పాండవులు రాజ్యం కోల్పోయి ఈ దగ్గరలోనే వనవాసం చేస్తున్నట్టు తనకు తెలియవచ్చిందని, భీముని చూడాలనే కోరికతోనే బ్రాహ్మణున్ని తెమ్మని ఘటోత్కచుని కోరానని, బ్రాహ్మణరక్షణకు పాండవులు తప్పక వస్తారని, అపుడు భీమదర్శనమౌతుందని ఊహించానని వివరించింది. కుటుంబసభ్యులందరూ సంభ్రమాశ్చర్యాలతో మళ్లీ కలుసుకున్నారు. బ్రాహ్మణరక్షణ పేరుతో వీరరసపోషణ కూడా జరిగింది. కథ సుఖాంతమైంది. 
  15. కానీ...
  16. కానీ...
  17. సాక్షాత్తు కన్న తల్లిదండ్రులలోనే వివక్షా? 
  18. తమ సంతానంలో కొందరిపట్ల అధికమైన ప్రేమ, కొందరిపట్ల తక్కువ ప్రేమ ఉంటుందా? ఈ కథ మహాభారతంలోనిది కాదు. మానవమనస్తత్త్వంలోని ఈ కోణాన్ని అట్టే దూషించకుండా ఆత్మవిమర్శాత్మకమైన ఆలోచనకు బీజం వేస్తూ మధ్యమవ్యాయోగం పేరిట రమణీయమైన రూపకంగా మలిచిన ఘనత, కాళిదాసు కన్నా పూర్వీకుడైన భాసమహాకవిది. ఆయన కూడా ఐతరేయబ్రాహ్మణంలోనూ, రామాయణంలోనూ, దేవీభాగవతంలోనూ ప్రసిద్ధమైన శునశ్శేఫోపాఖ్యానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రచించాడు. కాబట్టి, మానవులలో ఎంతో కొంత వివక్ష అంతర్లీనంగా ఉన్నదనే విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారన్నమాట!
  19. అలా మనలో కూడా దాగి ఉన్న వివక్షను గూర్చి మరిన్ని విషయాలను ఇక్కడ చదవండి:


(ఈ క్రింది వ్యాసం మునుపు ఆసియానెట్ లో ప్రచురింపబడింది.)

మాయాబజార్ సినిమా చూసినవారందరికీ గుర్తు ఉండే ఉంటుంది – “నీవు శశిరేఖను పెళ్లి చేసుకోవాలి నాయనా” అని శకుని లక్షణకుమారుడితో చెబితే - "సిగ్గు సిగ్గు!  ఆ అనాగరిక యాదవ సామంతరాజు కన్యను పెండ్లాడుటయా?" అని మహా చులకనగా తీసిపడేస్తాడతడు.  అతని మాటలలోని భావాన్ని ఏమందాం?  యాదవులంటే అతనికి చులకన అందామా?  యాదవులంటే వివక్ష అందామా?  ఈ రెండుపదాలనూ  ఇప్పుడు తెలుగువారు ఒకే అర్థంలో వాడేస్తున్నారు.   

అసలు వివక్ష అనే సంస్కృతపదానికి - "చెప్పాలనే కోరిక" అని అర్థం.  (वक्तुम् इच्छा विवक्षा।)  హిందీ డిక్షనరీ చూసినా कुछ कहने की इच्छा అనే అర్థమే కనిపిస్తుంది.  కాని, మనం తెలుగుభాషలో  వివక్ష అంటే భేదభావం లేదా పక్షపాతబుద్ధి అనే అర్థాలలో విచ్చలవిడిగా వాడేస్తున్నాం.  విభిన్న రూపురేఖలు, విభిన్నవర్ణభేదాలు, విభిన్నమైన ఆచారవ్యవహారాలు, విభిన్నమైన ఆహారపుటలవాట్లు కలిగిన విశాలమైన భూమి మనది.  ఆయా ప్రజలు తమదైన ఆచారవ్యవహారాలు, దేశం, భాష, మొదలైనవాటిపట్ల అభిమానం కలిగివుండటం సహజమే.  అందులో తప్పేమీ లేదు.  "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ"  అని ఆనందపడేంతవరకు ఫరవాలేదు.  కానీ, వేరొకరి వర్ణం పట్ల, ఆచారాలపట్ల, ఆహారాదులు మొదలైనవాని పట్ల చులకనభావాన్ని కలిగి, వాటిని లేదా వారిని దూషించి, చిన్నబుచ్చి, తన ఆధిపత్యాన్ని చాటుకొనే పద్ధతికి  ప్రస్తుతం "వివక్ష" అనే పదం స్థిరపడింది. 
పైన చెప్పుకున్న అర్థంలో వివక్షాపూరితమైన ఎన్నెన్ని వ్యవహారాలు జరిగాయని!  అటువంటి బోలెడన్ని వ్యవహారాలు పురాణాలలో కూడా రికార్డయి భద్రంగా ఉన్నాయి! 
రామాయణంలోని రావణాసురుడు ఉన్నాడే - అతడు కూడా మానవులంటే వివక్ష చూపించాడు.  అతడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి  బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, "మనవడా, ఏమి వరం కావాలో కోరుకోవయ్యా" అని అడిగితే - "నాకు దేవదానవగంధర్వయక్షరాక్షసకిన్నరకింపురుషనాగాదులు ఎవరివల్లా చావురాకూడదని" కోరుకున్నాడట.  నరవానరులను తన లిస్టులో పొరబాటున మరచిపోయాడనుకొనేరు! “వీళ్ళ ముఖం!  వీళ్ళు నన్ను కొట్టే మొనగాళ్లా?” అనే చులకనభావంతో, కావాలని లిస్టులో నరవానరుల పేర్లు కొట్టేశాడు.  కానీ, చివరకు ఏమైంది?  అతని వివక్షే అతని పాలిట మృత్యువైంది.  నరవానరులే అతని లంకాసామ్రాజ్యాన్ని నాశనం చేశారు.  కాబట్టి, నీతి ఏమిటంటే ఎవరైనా తమ బాగు తాము కోరుకుంటే వారికి వివక్ష ఉండరాదు అని.      
ఇంద్రుడు అంగుష్ఠమాత్రులైన వాలఖిల్యులను చూసి ఒకసారి అవహేళనగా నవ్వాడట.  వారు ఎంత పొట్టివారైనప్పటికీ మహాతపస్సంపన్నులు.  "ఓయ్ ఇంద్రా!  నీ పొగరును అణిచేందుకు మరో ఇంద్రుడు పుట్టుకొస్తాడులే!" అనేశారు.  ఆ తరువాత గరుత్మంతుడు పుట్టుకొచ్చాడు.  అతడు స్వర్గంనుండి అమృతాన్ని తీసుకుపోతూండగా కోపించిన ఇంద్రుడు అతని మీదకు వజ్రాయుధం విసిరినా చెక్కుచెదరలేదు.  కానీ ఇంద్రుడి పరువుపోతుందేమో అని జాలిపడిన గరుత్మంతుడు తన రెక్కనుండి ఒక ఈకను క్రిందపడేలా విదిలించాడట.  ఆ దెబ్బకు ఇంద్రుడు బెదిరిపోయి బావురుమంటే - "సరే, నువ్వు దేవేంద్రుడుగా ఉండు, గరుత్మంతుడు పక్షీంద్రుడుగా ఉంటాడులే" అని పెద్దలు వారిమధ్య రాజీ కుదిర్చారట.  
కాబట్టి ఎలాగైనా వివక్ష భయహేతువు కాకమానదు. 
గురుపుత్రుల శాపంతో త్రిశంకుడు చండాలుడైపోయాడు. అతనిని బొందితో స్వర్గానికి పంపేందుకు గాను విశ్వామిత్రుడు యజ్ఞం చేయతలపెట్టాడు.  వివిధమునులకు ఆహ్వానం పంపించాడు.  చాలామంది వచ్చారు కానీ, కొందరు మాత్రం, అవహేళనగా "ఏమిటేమిటీ?  ఆ జరుగుతున్న యజ్ఞానికి యజమాని చండాలుడున్నూ, ఆ యజ్ఞం చేయించేవాడు క్షత్రియుడూనా?  ఇలాంటి యజ్ఞానికి మేము రామంటే రాము పొమ్మన్నారు". దాంతో వళ్ళు మండి విశ్వామిత్రుడు పెట్టిన శాపం దెబ్బకు వారు నీచాతినీచమైన జన్మలను పొందవలసి వచ్చిందట.    
గొప్ప గొప్ప వాళ్ళని పేరుపడిన వాళ్లకు కూడా కారణాలు ఏమైనప్పటికీ అంతో ఇంతో వివక్ష ఉండనే ఉండింది.  
“మనం ఇద్దరం చిన్ననాటి మిత్రులం కదా” అని ద్రోణుడు ద్రుపదుని చెంతకు పోతే, “నేను ధనవంతుడిని, నీవు ధనహీనుడివి.  మన ఇద్దరి మధ్య మైత్రి పొసగదు పొమ్మని” ద్రుపదుడు చీదరించుకున్నాడు.  అపుడు ఎంతో బాధపడిన ద్రోణుడు అదంతా మరచిపోయి తనవద్దకు అస్త్రవిద్య నేర్చుకునేందుకు వచ్చిన ఏకలవ్యుడిని “నీవు నిషాదజాతికి చెందినవాడవు కాబట్టి నేర్పను పొమ్మన్నాడు.”  
స్త్రీల పట్ల భీష్ముడికున్న లోకువ ఎటువంటిదంటే వారు తనను చంపవచ్చినా వారితో పోరాడను అనేటటువంటిది.  
శల్యుడు కర్ణుడు అయితే మరీను, వారు పరస్పరద్వేషంతో ఎదుటివారి దేశాచారాలను, ఆ దేశప్రజలను కూడా నోటికొచ్చినట్టు తూలనాడారు. 
భీముడంటే దుర్యోధనుడికి చిన్నతనంనుండి తగని మంట.  భీముడిని చంపేందుకు శతవిధాల ప్రయత్నించి సాధ్యం కాక ఆ అక్కసు తీర్చుకొనేందుకు భీముడికి ఎంతో ఇష్టమైన అతని రథసారథిని (సూతుడిని) చంపేశాడు.  సూతుడంటే అతనికి అంత చిన్నచూపు!  కానీ,మరొక సూతపుత్రుడైన కర్ణుడు వీరుడని, తనకు భవిష్యత్తులో పనికొస్తాడని చేరదీశాడు.  “జన్మను బట్టి ఎవరినీ చిన్నచూపు చూడరాదని,పరాక్రమానికే పెద్ద పీట వేయాలని,” ఆ సందర్భంలో అందరికీ నీతులు కూడా గంభీరమైన ఉపన్యాసం దంచి మరీ చెప్పాడు.  దుర్యోధనుడి చేష్టలు, అతని బుద్ధి, తనతో అతనికి ఉన్న అవసరమూ కర్ణుడికి తెలియనివేమీ కావు.  తన కులానికే చెందినవాడిని దుర్యోధనుడు నిష్కారణంగా చంపాడని తెలిసినప్పటికీ, దుర్యోధనుడి ఆశ్రయం వలన తనకు కలిగే వైభవానికి ఆశపడి అతడు పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడి పక్షాన్నే వహించాడు.  కర్ణుడి బుద్ధి అస్త్రవిద్యాప్రదర్శన సమయంలో అందరి ఎదుటా బయటపడింది.  అతడి  వ్యవహారాన్ని మొదటినుండి గమనిస్తూ ఉండిన భీముడు ర్ణుడిని “సూతపుత్రుడు” అంటూ వెక్కిరించాడు.  దాన్ని అందరూ పాండవులకు కర్ణుడు తక్కువజాతివాడని చిన్నచూపు చూశారు వివక్ష ప్రదర్శించారు అని విమర్శిస్తారు.  కానీ, పాండవులను ఆశ్రయించి బ్రతుకుతున్నాడు అనే కారణంగా దుర్యోధనుడు  నిరపరాధి అయిన ఒక సూతుడిని హత్య చేశాడు అన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించరు.  
ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలంటే, మన కాలంలో జరుగుతున్న ఒక సంఘటనను ఉదాహరించవచ్చు.  తనవారైన కాపువారికి చంద్రబాబు ఎంత అన్యాయం చేస్తున్నప్పటికీ వారిని వారిని వారి కర్మకు వదిలి, ఆవిషయాన్ని ఎంతమాత్రమూ పట్టించుకోకుండా చంద్రబాబునే వెనకేసుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఈ కాలపు కర్ణుడు అన్నమాట.  కానీ, ఆనాటి దుర్యోధనుడు కర్ణుడిని తన జీవితాంతం మిత్రుడిగా ఆదరించాడు.  ఈనాటి దుర్యోధనుడు చంద్రబాబు మాత్రం ఈ కాలపు కర్ణుడిని తన అవసరం తీరగానే కరివేపాకులా వదిలించుకుంటాడన్నది జగమెరిగిన సత్యం.   ఆరోజుల్లో భీముడు కర్ణుడిని సూతపుత్రా అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ను ఇపుడు కాపుపుత్రా అంటే (ఈ మాటను స్వయంగా కాపువారే అతనికి పదే పదే గుర్తు చేస్తున్నారు.)  అది వివక్షాపూరితమైన మాట అని ఎవరైనా అనగలరా?
అటువంటి వివక్ష ఉండరాదు అంటూ అందరూ మహా పోలికేకలు పెడుతున్నారు గాని, ఆ లెక్కన అసలు వివక్ష లేనిదెవరికి?  “Indians and dogs are not allowed inside” అని బ్రిటిషువారు కొన్ని ప్రదేశాలలో బోర్డులు వేలాడదీసేవారు అని అప్పుడప్పుడూ గుర్తొస్తే తెగ బాధపడతామే?  భారతీయులు మాత్రం తక్కువ తిన్నారా?  చండాలురు అని కొంతమందిని ఈసడించుకుంటూ వారిని దూరంగా అస్పృశ్యులుగా పెట్టిన రోజులు లేవా?   
హిట్లర్ వివక్షతో లక్షలాది యూదులను ఊచకోత కోయించాడంటారు.  అమెరికాలో తెల్లవారు కొన్ని శతాబ్దాలపాటు నీగ్రోలతోను పశువులతోను ఒకే విధంగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికాలో కూడా కొన్ని దశాబ్దాల ముందటి వరకు ఇదే విధానం ఉండేది.  ఇలా చరిత్రలో వివక్షను గూర్చి రీసెర్చ్ చేయదలచుకుంటే ఎంతకాలం చేసినా తరగని విషయాలు  ఎన్నెన్నో ఉన్నాయి. 
సామాన్యమానవులమైన మనం మాత్రం ఏమైనా తీసిపోయామా?  ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, మనం కూడా వివక్షను మనదైన రీతిలో పాటిస్తున్నాము.  మార్కెట్టులో కూరగాయలను గీచి గీచి బేరమాడతాము.  రిలయన్స్  కు బిగ్ బజారుకు పోతే అక్కడ కూరగాయలకు ఎంత రేటు ఉంటే అంత రేటుకు  నోరుమూసుకుని కొనుక్కొస్తాము.  రోడ్డు పక్కన సరుకులు అమ్ముకొనేవారి పట్ల మనకుండే చిన్నచూపుకు అది నిదర్శనం కాదా?  
మనకు కారు ఉంటే కష్టపడి మోటార్ బైకును మైంటైన్ చేసే మరొక మనిషిని తక్కువగా చూస్తాము.  
గవర్నమెంటు సెక్టారులో పెర్మనెంటు జాబు చేసేవాడు టెంపొరరీ వాడిని చులకనగా చూస్తాడు.  
చివరకు టీవీ ప్రకటనల్లో కూడా నల్లగా ఉంటే మీకు ఉద్యోగం రాదు, మీకు బాయ్ ఫ్రెండ్ దొరకడు, కాబట్టి తెల్లబడండోయ్ అంటూ సమాజంలో మనం చూపుతున్న వివక్షను తేటతెల్లం చేస్తున్నారు.   కాబట్టి, "నేను సైతం వివక్షాగ్నికి సమిధనొక్కటి ధారపోశాను!"  అనుకోవాలి మనం.
"మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి," - అంటూ “నేరం నాది కాదు ఆకలిది” అనే సినిమాలో ఒక పాట ఉంది.   "ఏ నేరం చేయని వాడు ముందుగా రాయి విసరాలి" అని కథానాయకుడు జనాలను సవాలు చేస్తే, ఆ జనాలు సిగ్గుపడి తమ చేతనున్న రాళ్లు వదిలి పెట్టినట్లు చూపించగలిగారంటే కారణం అది సినిమా కాబట్టి.  
అబ్బే, ఇటువంటి ట్రిక్కులు ఎవరో కొందరు సిగ్గూ శరమూ ఉన్నవాళ్ళ దగ్గర పనిచేస్తాయి కానీ, ముదిరిపోయిన రాజకీయ వాదుల దగ్గర పనిచేయవు.  పొరపాటున వారిని ఎవరైనా సవాలు చేస్తే ఆ చేసినవారిమీదనే వీరు ముందుగా రాళ్లు విసురుతారు.  
2014 నుండి గమనిస్తూనే ఉన్నాము కదా? అధికారపక్షంవారికి ప్రతిపక్షంవారంటే ఎంత చిన్నచూపో!  ఎవరైనా“అధికారపక్షం ఈ విధంగా తప్పు చేస్తోంది” అంటే చాలు – “మా నాయకుడు చేస్తున్న అభివృద్ధిని సహించలేకపోతున్నారు” - అంటూ అంతెత్తున ఎగిరి పడుతుంటారు.  “ముందు మీ నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?” అంటూ ఎదురుదాడికి దిగుతారు.  అందరి ముందూ చర్చకు రావలసిన విషయాన్ని ఆవిధంగా అతి సౌకర్యంగా ప్రక్కదారి పట్టించి అనవసరమైన గొడవలను సృష్టించి ప్రజల దృష్టిని ఆలోచనలను మరోవైపు మళ్లించే కళలో వారు ఆరితేరిపోయారు.  
ఒకపక్క అటువంటి వారిని వెనకేసుకొని వస్తూ,  మరో పక్క ఉత్తరాది వారు దక్షిణాదివారిమీద వివక్ష చూపిస్తున్నారు అని ఆరోపణలు చేయడం ఉత్త  వెర్రిమొర్రి వాగుడు మాత్రమే!  
ప్రతిసమాజంలోనూ కొందరు వివక్ష కలిగినవారు ఎప్పుడూ ఉంటారు.  వారికి అధికారకాంక్ష ఉన్నట్లయితే మొదటగా మరికొందరిలో కూడా అటువంటి భావాలను నాటడానికి ప్రయత్నిస్తారు.  తరువాత, అటువంటి భావాలు కలిగినవారికి నాయకులుగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.   ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ను మనం చూడడం లేదా?  కాబట్టి,  ఆరకంగా మనం అతిగా భావావేశాలకు లోనుకాకుండా, మనలో ఉన్నదో లేదో కూడా తెలియని వివక్షను రెచ్చగొట్టి లేపేవారి పట్ల జాగ్రత్తగా ఉందాం.  
తస్మాత్ జాగ్రత జాగ్రత!  

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...