Thursday, 20 December 2018

అడవిలో అన్యభాష

మనుషుల నడుమ Communication గొప్పేమిట్ట?
అసలు తన తోటి ప్రాణికి సమాచారాన్ని అందజేయలేని జీవజాతి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మనం జడపదార్థాలుగా పరిగణించే వృక్షజాతులనడుమ కూడా సమాచారవినిమయం జరుగుతుందని జీవశాస్త్రవేత్తలు అంటున్నారు.
తల్లి చిరుత వేటాడినంత చలాకీగా పిల్లచిరుత కూడా వేటాడటం నేర్చుకోగలదు. తండ్రి గ్రద్ద ఎగిరినంత ఎత్తులకు పిల్ల గ్రద్దలు కూడా ఎగురగలవు. మునుపటి తరం పెలికన్లు, ఫ్లెమింగోలలాగానే మరుసటి తరం కూడా ఖండఖండాంతరాలు దాటి వలసలు, రాకపోకలు చేయగలవు.
అయితే
కొన్ని వందల వేల తరాలకు మునుపటి జీవప్రపంచం ఎలా ఉందో అది ఈనాటికీ అలాగే ఉండిపోయింది. జీవప్రపంచంలో మనిషి తన పూర్వీకులకంటె ఎంతగానో అభివృద్ధి చెందాడు. అది మానవజాతికి వరమా శాపమా అనే విషయంలో అనేకమంది అనేకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
ఆ విషయం కాసేపు పక్కనుంచితే, మనిషి అభివృద్ధికి మూలకారణాలలో భాష కూడా ఒకటి అనేది నిర్వివాదాస్పదవిషయాలలో ఒకటి. ఒక తరం తమ విజ్ఞానాన్ని మరుసటితరానికి అందించడం భాషవల్లనే సాధ్యమైంది. అదే క్రమాభివృద్ధికి పునాది అంటారు. సరే, ప్రపంచంలో అసంఖ్యాకమైన భాషలున్నాయి. అందులో - ఒక భాషలో కమ్యూనికేట్ చేయగలిగినవారు మాత్రమే అభివృద్ధి చెందుతారు మిగిలిన భాషలలో కమ్యూనికేట్ చేయగలిగినవారు వెనుకబడిపోతారు అనే భావన వ్యాపించడం, దానిని కొందరు రాజకీయకారణాలతోనూ కొందరు వ్యాపారకారణాలతోనూ సమర్థించడం జరుగుతోంది.
మన ఆంధ్రమంత్రి మరికొంత ముందుచూపు కలిగినవారు పాపం! ఆంధ్రులు తమ మాతృభాషను దాని ఖర్మకు దాన్ని వదిలి ఇంగ్లీషుభాషను దత్తమాతృభాషగా స్వీకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నంత సీరియస్ గా ఒక జీవో జారీచేశారు. మళ్లీ ఏమైందో వెనక్కు తీసుకున్నామని చెప్పారు గాని, ఇలా తలచుకున్న తక్షణమే గాని, జీవోలు జారీ అయిన మరుక్షణమే గాని భాషను మార్చుకోగల శక్తి మనిషికి తప్ప మరే జంతువుకూ లేదు! దాన్ని అభివృద్ధిచెందినవారి భాషలో adaptability అంటారట!
Existence కోసం Struggle చేయడం ప్రకృతిసహజం.
Struggle చేయడం కోసమే Existence ఉందని దబాయించి నిరూపించడం అధికారదర్పం!
ఓ జంతుప్రపంచపు అధికారదర్పం ఎలా ఉంటుందో ఈ క్రింది వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి: 

1
 అనగనగా ఒక అడవి.
ఆ అడవినిండా రకరకాలజంతువులు, రకరకాల పక్షులు.
దానికి ఒక సింహం రాజు.
ఉన్నట్టుండి ఆ రాజుగారికి తన ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో తెలుసుకుందామనిపించింది.  నిజాలు తెలుసుకొనేసరికి ఆ రాజుగారికి తన ప్రజలమీద అమితమైన జాలి కలిగింది. 
 తనలా అవేమీ కూడా ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి తినటం లేదు!  కోతులు ఏవో దొరికిన పండ్లను తింటున్నాయి.  పక్షులు గింజలను ఏరుకొని తింటున్నాయి.  వడ్రంగి పిట్టైతే మరీ ఘోరంగా చెట్టులో అంగుళమంగుళం వెతికి పురుగులు పట్టి తింటోంది.  వేగంగా పరుగెత్తగలిగిన లేళ్లు, మంచి బలం కలిగిన కారెనుబోతులు సైతం గడ్డి మేస్తున్నాయి!  తేనెటీగలైతే ఎంతో శ్రమకోర్చి పూవు పూవూ తిరిగి మకరందాన్ని సేకరిస్తున్నాయి.  నక్కలు తొండేబిక్కలకోసం అడవంతా గాలిస్తున్నాయి!  తోడేండ్లు కుందేండ్ల వెనుక పారి పారి సొమ్మసిల్లి పోతున్నాయి.  చిరుతలకు తమను తిప్పలాడించే జింకలను పట్టుకొనేసరికి తల ప్రాణం తోకకొస్తోంది!  ఇలా వివిధవర్గాలకు చెందిన తన  ప్రజల కష్టాలను తెలుసుకున్న సింహరాజుగారి కళ్లనుండి దుఃఖాశ్రువులు జలజలకారాయి.
 అవన్నీ తనలాగా ఏనుగు కుంభస్థలాన్ని ఎందుకు తినలేకపోతున్నాయని ఆలోచించింది.  మేధోమథనం చేయగా చేయగా దానికి ఒకటే తట్టింది!  తాను గర్జించగలదు!  తన గర్జనకే గజరాజులు బెంబేలెత్తిపోతాయి.  మానసికంగా బలహీనపడతాయి.  ఏదో కాస్త నామ్ కే వాస్తే ప్రతిఘటన కనబరచినా, సులువుగానే లొంగిపోతాయి.  కాని, అడవిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు తనలాగా గర్జించలేవు.  అందువల్ల వాటికి ఏనుగులు లొంగవు.  అవి లొంగటం లేదు కాబట్టి అవన్నీ గత్యంతరం లేక ఏనుగుకుంభస్థలాలనే శ్రేష్టమైన ఆహారాన్ని వదులుకొని వేరే ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి!
 ఇలా సమస్యకు మూలకారణం మిగిలిన జంతువులు సింహంలా గర్జించలేకపోవడమే అని తేలిపోయాక, అయితే ఈ సమస్యను పరిష్కరించేదెలా అని మరలా మేధోమథనం జరిగింది.  చివరకు  సమాధానం దొరికింది.  వెంటనే జంతువులన్నీ అర్జెంటుగా,  సింహంలా గర్జించడం నేర్చుకోవాలని సింహం జీవో పాస్ చేసింది.  ఇప్పటికే గర్జిస్తూ ఉన్నవి తమ గర్జనను కంటిన్యూ చేసుకోవచ్చునని, అలా కానిపక్షంలో జూన్ నుండి సింహగర్జనను మాత్రమే నేర్చుకొని తీరాలని, ఇదంతా అడవిజంతువుల శ్రేయస్సు కోసమే, ఉన్నతమైన బ్రతుకుతెరువుకోసమేనని,  దయచేసి ఈవిషయంలో రాజకీయాలు చేయవద్దని సింహం కోరింది.
 2
 సింహగర్జన జీవో పట్ల అడవిలో సహజంగానే కలకలం రేగింది.  సింహరాజుగారికి ప్రజల పట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమకు, ఆ ప్రజల అభివృద్ధికి పాటుపడడంలో ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన వందిమాగధులు ఆయనను పరిపరివిధముల పొగిడారు.  "అడవిలో అందరూ సింహగర్జనలు మాత్రమే చేస్తే, రకరకాల జంతుజలాల నోట సహజంగా ఉండే శబ్దవైవిధ్యం నశించిపోదా?  ఈ సింహగర్జన జీవో అరణ్యసంస్కృతి అనే మహావృక్షానికి గొడ్డలిపెట్టు" అంటూ కొన్ని ప్రకృతిప్రేమికులైన జంతువులు పక్షులు వాపోయాయి. 
 "నన్ను కమ్మని పాటలు పాడడం మానేసి గర్జించమంటే ఎట్లా?" అని కోకిల కన్నీళ్లు పెట్టుకుంటే "నిజమే!  కోకిల పాటలు లేకుంటే మన అడవిలోనికి వసంతకాలం వచ్చినట్టు ఎలా తెలుసుకొనేది?" అని కొన్ని పక్షులు జంతువులు దాన్ని "అమాయికంగా" సమర్థించాయి.  "నోరు మూసుకోండి!  వసంతమైతే ఏమిటి, చలికాలమైతే ఏమిటి?  మనకు కడుపునిండడం ముఖ్యం గాని, ఏ కాలమైతే మనకెందుకు?" అని మరికొన్ని వాటిని కసిరి నోరుమూయించాయి.
 తాము సింహగర్జన నేర్చుకుంటే ఇకమీదట తొండేబిక్కల బొక్కలను తోడక్కరలేదని, తాము కూడా ఏనుగు కుంభస్థలాన్ని తినొచ్చని నక్కలన్నీ సంబరపడి సింహగర్జన జీవోకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి.  దానిని వ్యతిరేకించిన జంతువులపై విరుచుకు పడ్డాయి.  అభివృద్ధివ్యతిరేకులంటూ దుయ్యబట్టాయి.  నక్కల వాదన సమంజసమనిపించి వాటికి తోడేళ్లు చిరుతలు తోడయ్యాయి.
 కుందేళ్లు, జింకలు వంటి గడ్డితినే జంతువులన్నీ ఒక సంఘంగా ఏర్పడి సింహగర్జన జీవోకు తమ సంఘీభావం తెలిపాయి.  ఈ జీవోవల్ల తమను వేటాడే జంతువులకు ఆహారప్రత్యామ్నాయం లభిస్తుందని,  అందువల్ల తమ జాతులకు భద్రత ఏర్పడుతుందని,  ఆ రకంగా తాము అభివృద్ధి చెందగలమని చెప్పి, సింహరాజుగారికి పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశాయి.
 పక్షులు కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని తమకు ఈ జీవో ఎంతవరకు అనుకూలం అని చర్చించుకున్నాయి.  సింహరాజుగారి తరపున సమావేశానికి హాజరైన పదునుముక్కు గ్రద్దమంత్రి మాట్లాడుతూ, "ఇకమీదట పక్షిజాతులు నానాకూతలు కూసి ఎవరికీ లోకువ కానవసరం లేదని, సింహగర్జనను నేర్చుకుంటే ఏ అడవికి పోయినా అందరూ గౌరవిస్తారని" నచ్చజెప్పడంతో జీవోకు పక్షుల మద్దతు కూడా లభించింది.
 3
 మరోవైపు ఏనుగులు కూడా అత్యవసరసమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.  సింహగర్జన జీవో వెనుక అసలు ఉద్దేశం తమ జాతికి సింహంతో ఉన్న జాతివైరం తప్ప మరొకటి  కారణం కాదని  అభిప్రాయపడ్డాయి.  అడవిలో ఉండే సమస్త జంతుజాలానికి తమ కుంభస్థలపు మాంసమే శ్రేష్ఠాహారమని చెప్పడం అశాస్త్రీయమని, ప్రకృతివిరుద్ధమని, భూమిమీద నడిచే జంతువులన్నిటిలోనూ అతి బలవంతమైన జాతిగా పేరు గడించిన తమపై తక్కిన జంతువులన్నింటినీ మూకుమ్మడిదాడికి ప్రేరేపించే విధంగా జీవో తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.  తమలో ఎవరమైనా ఎప్పుడైనా సింహానికి లొంగితే, దాని గర్జనకు భయపడి కానే కాదని, ఆ సింహంలో ఉండే సత్తాకు మాత్రమే లొంగామని, తాము ఆత్మరక్షణకు పూనుకున్నపుడు దాడికి దిగిన ఎన్నో సింహాలను తమ కాళ్లక్రింద మట్టగించి చంపేసిన సంఘటనలున్నాయని గుర్తు తెచ్చుకున్నాయి.  ఏనుగులే శ్రేష్ఠమైన ఆహారమని చెబుతున్న సింహాలకు కూడా ఆ ఆహారం నిత్యం అందుబాటులో ఉండదని,  అది అటుంచితే  సింహం గర్జిస్తే కొన్ని పిరికి జంతువులు మహా అయితే భయపడతాయేమో కాని లొంగిపోవని, అవి అంత సులువుగా  లొంగిపోయేమాటే గనుక నిజమైతే, జింకలను ఎనుబోతులను వేటాడేందుకు కూడా సింహాలు గుంపులు గుంపులుగా ఎందుకుపోతాయని ప్రశ్నించుకున్నాయి.  ఈనిజాలను అడవిజంతువులన్నటికీ తెలియజేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి.
 ఏనుగుల తిరుగుబాటును సింహాలు సహించలేకపోయాయి.  అడవిలో లభించే ఆహారం అడవిజంతువుల ఉమ్మడి సొత్తని, కాని, ఏనుగులు మిగిలిన ఏ జంతువుతో పోల్చినా అత్యధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయని, అలా తినడాన్ని అక్రమాహారంగా పరిగణించాలని, ఏనుగుల అక్రమాహారం వల్ల అడవి నాశనం కానున్నదని,  త్వరలోనే అడవిలోని జంతువులకు ఆహారపు కొఱత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అలా ఆ ఏనుగులు అక్రమంగా తిన్న ఆహారాన్ని తమ కుంభస్థలాల్లో దాచుకున్నాయని, అందువల్ల వాటిని బద్దలుగొట్టి అడవిజంతువులన్నటికీ  పంచేందుకు కృతనిశ్చయులమై ఉన్నామని, ఆ ఉద్దేశంతోనే ఏనుగుల భరతం పట్టేందుకు సింహగర్జన జీవో తెచ్చామని, ఎవరూ ఏనుగుల దుష్ప్రచారాన్ని కల్లబొల్లి ఏడుపులను నమ్మవద్దని సింహాలు ప్రకటించాయి. 
 ఒకవైపు రాజకీయం చేయకండని కోరుతూ స్వయంగా రాజకీయం చేస్తారా అని ఏనుగులు మండిపడ్డాయి. 
4
సింహగర్జన జీవో జారీ అయి చాలా కాలమైంది.  జంతువులు పక్షులు సింహగర్జనను అంత సులువుగా నేర్చుకోలేకపోతున్నాయి.  కాని అనుకరణనిపుణులైన చిలుకలు మైనాలు కొంతవరకు నేర్చుకున్నాయి. సింహరాజుగారు సభలో ఒకసారి ఏదో విషయం అడిగితే అవి సింహగర్జనతోనే బదులు చెప్పాయి.  అది వాటి పొగరని సింహానికి కోపం వచ్చింది.  మిగిలిన జంతువులన్నీ తమలాగే గర్జించడం నేర్చుకుంటే తమ ప్రత్యేకత ఇంకేముంటుందని సింహాలన్నీ సింహరాజుకు మొరపెట్టుకున్నాయి. 
 సింహరాజు నవ్వి,
 "ఉరే అమాయికుల్లారా!  అసలు ఏ జంతువైనా తమ స్వంతభాషను వదిలి పరాయి భాషను మాట్లాడగలదా?  అలాంటివన్నీ మనిషనే వింత జంతువొకటే చేయగలదు.   సింహాసనం మీద ఉన్న నేను ఏదో చేస్తున్నానని అందరికీ అనిపించాలి.  మన ప్రత్యర్థులు మహా అవినీతిపరులని, మన పనులకు వారు అడ్డుపడుతున్నారని దుష్ప్రచారం చేయడానికి మాత్రమే ఈ హడావుడి" అని చిద్విలాసంగా  చెప్పాడు.
(ఈ నా వ్యాసం మునుపు ఏసియానెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...