Saturday 29 December 2018

కర్మయోగులు



చలికాలం...
పొద్దునే లేస్తే చంపేస్తాననే కాలం...

పొద్దు పొడిచినా ముసుగు తీసి బయట అడుగుపెట్టేందుకు భయపడే కాలం...
అడుగు పెడితే ముఖం చుట్టూ కోతి టోపీ గాని, మఫ్లర్ గాని అలంకారంయ్యే కాలం... ఓ పది నిమిషాలు ద్విచక్ర వాహనం నడిపితే చాలు వేళ్ళు కొంకర్లు పోయే కాలం... మన ప్రమేయం లేకుండానే, లయబద్ధంగా దంతసంగీతం పుట్టే కాలం... అరచేతులు ఖాళీగా ఉండక చంకల్లోకో ప్యాంటు జేబుల్లోకో దూరి దాక్కునే కాలం... సూర్యభగవానుడి కిరణకటాక్షాలకోసం అంతా ఆశగా ఎదురుచూసే కాలం... 

ఇంత భయంకరకాలంలో కూడా...
కొందరు తమ విధినిర్వహణలో గాని బ్రతుకు పోరాటంలో గాని ఏమరటం లేదు...

మనకు కనీసం ప్రొద్దున ఆరింటికల్లా పేపర్ అందాలంటే పేపర్ బాయ్ కనీసం మూడున్నరకల్లా లేచి పేపర్ సెంటర్ కు పరుగెత్తాలి. మనకు పాలు సరైన సమయానికి కావాలంటే పాలవాళ్ళు నాలుగింటికల్లా లేచి పాల ప్యాకెట్లు అందుకుని మనకోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి. అదే సమయానికల్లా టీ కొట్టు వాళ్ళు తమ సరంజామాతో సిద్ధం అయిపోవాలి. ఏ రాత్రి పూట మనకు ఏ అవసరం రావచ్చునో అని ఆటోవాలాలు తమ ఆటో వెనుక సీట్లోనే రాత్రంతా నిద్రపోతూ పొద్దున్నే ఎవరైనా ఓ బాగ్ తోనో సూట్ కేసు తోనో కనబడితే చాలు, "స్టేషన్ కా అన్నా, బస్టాండ్ కా?" అని ఆశతో అడుగుతూ ఉండాలి. చీకటితోనే కూరగాయలు పళ్ళు వ్యాన్లలోనూ లారీలలోనూ వస్తే వాటిని దించి ఆయా దుకాణాలలోనికి చేర్చేందుకు కూలీలు, తోపుడు బళ్ళ వాళ్ళు, ఎద్దులబళ్ల వాళ్ళు సకాలంలో సంసిద్దంగా ఉండాలి. 

ఇందులో వింత ఏముంది? వారు బ్రతకడం కోసం ఆమాత్రం వారు చేయకూడదా? అని మనం అనుకోవచ్చు. తప్పేం లేదు.

కాని, మనం మన ఇంట్లో నాలుగు గోడల మధ్య వెచ్చగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వెన్నుపామును వంగదీసెంత చలిలో వారంతా మనకోసమే - మన అవసరాల కోసమే - మనకు సేవ చేసేందుకు మాత్రమే - వాళ్ళు పరుగెడుతూనే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు, సిద్ధం అవుతూనే ఉన్నారు, ఆశతో అడుగుతూనే ఉన్నారు, సంసిద్ధంగానే ఉన్నారు. 

ఇక్కడ ఉదాహరించిన వారు కొందరు మాత్రమే, ఇలాంటి కర్మవీరులు ఇంకా ఎందరు అజ్ఞాతంగా ఉన్నారో?

వారు మన సోదరులు, వారు మన తోటి పౌరులు, వారు కూడా మనతో పాటు మన దేశ అదృష్ట దురదృష్టాలను పంచుకుంటున్న వారు, వారికి కూడా మనలాగే జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. మనం వారి పట్ల జాలితోనో దయతోనో, ప్రేమతోనో లేక అత్మీయతతోనో వారి సేవలను వినియోగించుకుంటేనే వారికి సుఖం కలుగుతుంది. 

తీరిగ్గా పొద్దున్న పదింటికి తలుపులు తెరిచి జేబులు అదరగొట్టేంత ఖరీదుతో మన ఆదాయాన్ని దోచుకొనే రిలయన్స్ మార్టులకు, బిగ్ బజారులకు, స్పెన్సర్లకు, వాల్మార్టులకు మనం ఎగబడి వారి దగ్గరే ఎందుకు కొనాలి? వారు రిటైల్ ప్రైస్ మీద కాస్త తగ్గించి ఇస్తారు అని భ్రమ పెట్టుకోవద్దు, మన ఇంటి దగ్గర ఓ చిల్లర దుకాణం వాడి చెంతకు నిత్యం వెడుతూ ఉంటే మనం అడక్కుండానే వాళ్ళు మనకు ఖరీదు కాస్త తగ్గించి ఇవ్వడం మొదలు పెడతారు. చివరకు కూరగాయలు పళ్లు పత్రికలూ గ్రీటింగు కార్డులు కూడా ఆ మహా షాపులలోనే మనం కొనాలా? పోనీ అవేమైనా అక్కడ చవకగా ఉంటాయా అంటే, అదీ లేదు. మరెందుకు వాటిలో మనం అడుగు పెట్టడం? 

మనతో పాటు మన ఊరిలోనే ఉంటూ, మనం ఎప్పుడు వస్తామా లేక ఎప్పుడు పిలుస్తామా అని కాచుకు కూర్చున్న మన సోదరుల సేవలను వినియోగించుకుందాం. వారితో మన అనుబంధాన్ని పెంచుకుందాం. వారితో స్నేహంగా ఉందాం. 

మనం తినే తిండిని పండించింది మన డబ్బు కాదు, 
ఆ పని చేసింది వీరే! 
ఆ తిండిని ఆ పంట పండిన భూమి నుండి మన నోటి ముందుకు తెచ్చింది కూడా మన డబ్బు కాదు,  
ఇదుగో, ఆ తెచ్చింది మరలా వీరే! 

జాతీయ సంపద అంటే మన రిజర్వ్ బ్యాంకులో పేరుకుపోయి ఉన్న బంగారు నిల్వలు గాని, విదేశీ మారక ద్రవ్యం గాని కాదు. జాతీయ సంపద అంటే ఇదుగో, ఈ శ్రామికులే! 

వీరు లేకుంటే, మనం లేము. 
వీరు మన నుంచి అతి చిన్న ప్రతిఫలం మాత్రమే కోరుకునే కర్మ యోగులు! 

వారి సేవలను స్వీకరించడమే వారి పట్ల మనం చూపగలిగిన నిజమైన కృతజ్ఞత. మన శాస్త్రాలలో చెప్పిన సమాజ ఋణం తీర్చుకొనే పధ్ధతి ఇదే! 

వారికి కావలసిందల్లా...

కాసింత జాలి
కూసింత దయ
ఒకింత ప్రేమ 
కొంత ఆత్మీయత.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...