Friday, 28 December 2018

అంధగోలాంగూలన్యాయము

ఇక్కడ న్యాయము అనే సంస్కృతపదానికి Justice అని కాని సరైనది అని కాని కాదు అర్థం. షడ్దర్శనాలలో ఒకటైన న్యాయం కూడా కానే కాదు. న్యాయం అనే పదానికి దాదాపు పద్ధతి అని అర్థం చెప్పుకోవచ్చు. ఇంగ్లీషులో Maxim అనవచ్చు.

"వాడో పెద్ద సత్యహరిశ్చంద్రుడురా బాబూ!" అని ఎవరైనా అన్నారనుకోండి. వెంటనే సదరు వ్యక్తియొక్క వ్యక్తిత్వం గూర్చి మనకు పెద్ద వివరణ మరేమీ అక్కరలేకుండానే అర్థమౌతుంది కదా! ఇక్కడ న్యాయం చేసే పని కూడా అదే. ఇలాంటి న్యాయాలు సంస్కృతసాహిత్యజగత్తులో లెక్కలేనన్ని ఉన్నాయి. 

అందులో ఒకటి అంధగోలాంగూలన్యాయం. 
అంధుడు అంటే గ్రుడ్డివాడు. 
గోలాంగూలమంటే ఆవు తోక. 

<><><><><><>


ఓనాడు పల్లెటూళ్లో ఉన్న ఓ గ్రుడ్డివాడు రాజధానికి బయలుదేరాడు. పెద్దగా దూరం పోకుండానే దారిలో ఓ పోచుకోలు కబుర్లవాడు కలిశాడు. విషయం తెలుసుకొని "రాజధానికి ఎందుకు పోవడం" అని అడిగాడు.

"రాజధానిలో అయితే జనాలు ఎక్కువమంది ఉంటారు. కాబట్టి పెద్దగా శ్రమపడకుండానే తొందరగా ఎక్కువ బిచ్చం వస్తుంది" అన్నాడా గ్రుడ్డివాడు.

"అలాగా? అయితే నేను నీకు ఒక అనుభవజ్ఞుడైన మార్గదర్శకుడిని తోడిచ్చి పంపిస్తాలే" అన్నాడు పోచుకోలు వాడు.

గ్రుడ్డివాడు పొంగిపోయి "నీకేమిచ్చి ఋణం తీర్చుకోను?" అంటే -

"నిన్ను రాజధానికి చేర్చడమే నా జీవితధ్యేయం, అంతకంటే వేరే ఏమీ వద్దు" అన్నాడు పోచుకోలువాడు.

దారిలో ఓ ఆవు కనిపిస్తే నెమ్మదిగా గ్రుడ్డివాడికి దాని తోకను అందించి -
"దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదలకు - దీన్ని పట్టుకుంటే నేరుగా రాజధానికే వెడతావు. ఈ అవకాశం చేజారిపోనివ్వకు. దారిలో ఎవరైనా ఎదురై ఏం చెప్పినా ఆ మాయకబుర్లు నమ్మకు, ఎవరైనా హెచ్చరిస్తే నువు కూడా హెచ్చరించు - ఎవరైనా వెక్కిరిస్తే నువు కూడా వెక్కిరించు - ఎవరైనా జాగ్రత్తలు చెప్పబోతే నువు నీ దారిన పోపోవోయ్ అని చీదరించుకో" అని చెప్పాడు పోచుకోలువాడు.

తననుంచి చిల్లిగవ్వ కూడా ఆశించకుండా అంత గొప్ప సాయం చేస్తున్న ఆ మనిషి సాక్షాత్తు దేవుడే తప్ప ఇంకెవరో కాదని తక్షణమే నమ్మేశాడు ఆ గ్రుడ్డివాడు.

పోచుకోలువాడికి వంగి వంగి దండాలు పెట్టి, పట్టిన ఆవుతోకను గట్టిగా పట్టి మరి వదలకుండా పోసాగాడు. దారిలో గోతుల్లో పడి మూతి పళ్లు విరగ్గొట్టుకున్నా ఆ తోకను వదలలేదు. రాళ్లకు తట్లుకుని కాలి వేళ్లు, గోళ్లు చితికి రక్తం వస్తున్నా ఆ తోకను వదలకుండా పోతూనే ఉన్నాడు. అడవిలో పడి అటూ యిటూ తిరుగుతూ ఆ ఆవు తన దారిన తాను దొరికింది దొరికినట్టు విచ్చలవిడిగా మేస్తున్నా ఆ గుడ్డోడికి అదేమీ తెలియటం లేదు. ముళ్లపొదల కంపలు కండల్నీ భుజాలనీ వీపునీ పిక్కల్నీ ముఖాన్నీ పట్టి పీకుతున్నా, క్రింది వాలిన ఎండుకొమ్మలు మాడు పగలగొడుతున్నా రాజధానికి చేరుకోవాలంటే తాత్కాలికంగా ఇటువంటి బాధలు తప్పవని సహిస్తూనే ఉన్నాడు. అలా పోతూనే ఉన్నాడు. పోతూనే ఉంటాడు.

దారిలో మీరూ నేనూ ఎదురై ఏమైనా చెప్పబోతే మనలను చీదరించుకుంటూ తిడతాడు. అది వాడి ఖర్మ. అంతే.

<><><><><><>
అదీ అంధగోలాంగూలన్యాయమంటే.
<><><><><><>


న్యాయాలు సార్వకాలికమైనవి.
ప్రస్తుతకాలానికి అన్వయించుకుంటే -

1 ఆ గ్రుడ్డివాడు వోటరు. 
2 ఆ పోచుకోలు కబుర్లవాడు మీడియా.
3 ఆ ఆవు రకరకాల నాయకులు.
4 ఆ ఆవు తోక ఆ నాయకుల వాగ్దానాలు.
5 ఆ గోతులు వాగ్దానభంగాలు.
6 ఆ రాళ్లు ఉన్న ఉద్యోగాలను ఊడబీకే జీవోలు. 
7 ఆ ముళ్లకంపలు రకరకాల క్రొత్త క్రొత్త పన్నులు.
8 ఆ ఎండుకొమ్మలు రకరకాల ఛార్జీల పెంపులు. 
9 ఆ అడవి అగమ్యగోచరమైన ప్రజల భవిష్యత్తు.
10 ఆ రాజధాని మనది కాదు. ప్రపంచపౌరులది!


చివరగా మరో విషయం తెలుసుకోవాలి - ఆ గ్రుడ్డివాడిని తన తోకకు తగిలించినందుకు ఆవు చిరాకు పడి ఉంటుంది. కాని వోటరును తనకు అంటగట్టినందుకు నాయకుడు మీడియాకు కృతజ్ఞుడై ఉంటాడు. వారి మధ్య quid pro quo ఉంటుంది.

అది ఒక్కటి తప్ప మిగిలిందంతా same to same.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...