Wednesday 14 April 2021

మన రాముని కథలు 2



అయోధ్య అంటేనే ఎంతటి యోధులకైనా జయింపరానిది (invincible) అని అర్థం. అటువంటి అయోధ్యసైన్యం నడుస్తూ ఉంటే ఒకొక్క సైనికుని అడుగు శత్రువులకు గుండెల్లో యుద్ధభేరీశబ్దంలా ప్రతిధ్వనిస్తూ ఉంది. తొమ్మిదివేల ఏనుగులు, అరవై వేల రథాలు, వాటినిండా అమితశూరులైన అరవైవేల ధానుష్కులు, వివిధ ఆయుధధారులు లక్షమంది అశ్వయోధులు ఒక్కమారుగా దండు బయలుదేరేసరికి భూమి వారి పదధ్వనుల ఘట్టనలకు, రథచక్రఘోషలకు కంపించిపోసాగింది. ఆ సైన్యం అంతులేని మహాసముద్రంలా గోచరిస్తోంది.
మహతీయమితః సేనా
సాగరాభా ప్రదృశ్యతే।
నాఽస్యాంతమధిగచ్ఛామి
మనసాపి విచింతయన్।। (రా.2.84.2)
వారందరికీ ముందుగా భరతశత్రుఘ్నుల రథం నడుస్తోంది. భరతుని కేవలం సైన్యం మాత్రమే కాక, అయోధ్యాపౌరులలో సగం కంటె ఎక్కువమందే అనుసరించి వస్తున్నారు.
“దురదృష్టవశాత్తు అడవులపాలైన మన రామన్నను నేను తిరిగి అయోధ్యకు తీసుకువస్తాను” - అని భరతుడు నిండు పేరోలగంలో అయోధ్యాప్రజలకు మాట ఇచ్చాడు. అదుగో, ఆ మాటను నిలబెట్టుకొనేందుకే, ఇలా సైన్యసముపేతుడై బయలుదేరాడు. రథాలమీద, గుఱ్ఱాలమీద, ఏనుగులమీద, ఎడ్లబండ్లమీద వేలాది జనాలు అతనిని అనుసరించి వస్తున్నారు. దారిలో కోసల జనపదానికి చెందిన గ్రామాలు తాము వెనుక ఉండలేక, మన రాముని తాము కూడా వెంటనే చూడాలనే ఆత్రుతతో భరతుని అనుసరించి వస్తున్నాయి. చివరకు అందరూ గంగాతీరానికి చేరుకున్నారు. అప్పటికి సాయంసంధ్య అయింది. అందువల్ల అందరూ విశ్రమించారు.
సీతారామలక్ష్మణులు నావలో గంగను దాటి అడవిలోనికి ప్రవేశించారు. అంతవరకు మాత్రమే సుమంత్రుడు తెలిపాడు. అయితే దట్టమైన ఆ అడవులలో నా రామన్న ఎక్కడ నివసిస్తున్నాడో? అతడిని కనుగొనటం ఎలాగో అని భరతుడు నిద్ర రాక చింతామగ్నుడై ఉన్నాడు.
ఇంతలో కొందరు వేగులు హడావుడిగా వచ్చారు. “జయము జయము భరతకుమారా! మన సైన్యానికి వేరొక సైన్యం అడ్డు నిలిచింది. మనలను ముందుకు పోనీయకుండా ఆపడమే వారి లక్ష్యంలాగా ఉంది. తెల్లవారగానే వారితో మనకు ఘర్షణ తప్పకపోవచ్చు” అని సమాచారం అందించారు.
శత్రుఘ్నుడు ఆశ్చర్యపోయాడు. “కోసలజనపదంలో విప్లవమా? అసాధ్యం. దశరథమహారాజుగారిని ప్రతిసామంతరాజూ కన్నతండ్రిలా ప్రేమించాడు. ఇప్పుడు ఆయన మరణించగానే అయోధ్యపై వారు తిరుగుబాటు యుద్ధం చేస్తారా? నమ్మశక్యంగా లేదు. అయినా, మనం అన్నిటికీ సన్నద్ధులమై ఉండాలి. అగ్రజా భరతా, మీ ఆజ్ఞ ఏమిటి?” అని అడిగాడు.
త్రికరణాలలోనూ అచ్చంగా రాముని పోలి ఉంటాడని అందరూ మెచ్చుకునే భరతుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. “వేగులారా, ఎవరిదా సైన్యం? వారు మనలను అడ్డుకుంటారని మీకెందుకు అనిపించింది?” అని ప్రశ్నించాడు.
“కుమారా, ఆది దాశరాజైన (జాలరి వారి నాయకుడైన) గుహుని సైన్యం. రాత్రి అయినప్పటికీ వారందరూ తమ తమ నావలను విడిచి తమ గూడెంలో విశ్రమించడానికి పోకుండా ఆయుధాలు ధరించి యుద్ధసన్నద్ధులై ఉన్నారు. ఏ క్షణంలోనైనా మనమీదకు దాడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నారని వారి మాటలను బట్టి తెలుసుకున్నాము.”
“ఎంతమాత్రం సైన్యం వారిది?”
“కుమారా, ఐదునూర్ల పెద్ద నావలు వారివి, ఒకొక్క నావలో నూర్గురు యోధులు ఉన్నారు.”
“సరే” అన్నాడు భరతుడు. అతని కైసైగపై వేగులు అక్కడనుండి నిష్క్రమించారు.
శత్రుఘ్నుని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. “అగ్రజా, ఆ గుహునిది ఎంతటి సాహసం! అగ్నిలోనికి దుమికే శలభాలలాగ వారంతా మన సైన్యం ధాటికి క్షణంలో నశించిపోతారు. అయినా, పరమరాజభక్తుడైన గుహుడేమిటి? హఠాత్తుగా మనమీద అతడు ఈ విధంగా నిష్కారణమైన వైరం పూనడమేమిటి? నమ్మలేకుండా ఉన్నాను” అన్నాడు.
“అనుజా, మన వేగులు చూసినట్టు గుహుని దాశగణమంతా యుద్ధసన్నద్ధులై ఉండటం నిజమే అయినా, వారు ఊహించినట్టు ఆ యుద్ధం మనమీద చేయడానికి కాకపోవచ్చును” అన్నాడు భరతుడు.
“మరి?”
“మనము అయోధ్యాపురవాసులమని, దశరథపుత్రులమని గుహునికి తెలిసి ఉండకపోవచ్చును. మనము ఈ విధంగా సైన్యసమేతులమై వస్తున్నామని వారికి ముందుగా మనము సమాచారం అందించలేదు. అందువల్ల మనం శత్రువులం కావచ్చునని భావించి మనలను అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని నా అనుమానం.”
“అయితే ఈ అపార్థాన్ని తొలగించేందుకు మనం వారి వద్దకు మన దూతను వెంటనే పంపాలి అగ్రజా.”
ఇంతలో కావలి భటుడు ఒకడు శిబిరంలో ప్రవేశించి, “జయము జయము కుమారా, అయోధ్యాప్రభుభక్తుడైన దాశరాజు గుహుడు మీ దర్శనం కోరి వచ్చారు” అని విన్నవించాడు.
భరతుడు శత్రుఘ్నునివైపు చూసి మందహాసం చేశాడు. బదులుగా శత్రుఘ్నుడు కూడా ప్రసన్నమనస్కుడై నవ్వాడు.
“నాయనా భరతా, మనం వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుంది. గంగను దాటిపోయిన మన రాముడు అరణ్యంలో ఎక్కడ ఉన్నాడో మనకు చెప్పగలిగినవాడు ఈ గుహుడు ఒక్కడే. అతినిని వెంటనే అనుమతించండి” అని పలికాడు సుమంత్రుడు.
“మీ అభీష్టం ప్రకారమే జరుగుతుంది పితృవ్యా” అన్నాడు భరతుడు.
కొన్ని క్షణాలలోనే గుహుడు శిబిరంలోనికి ప్రవేశించాడు. ఆయన భరతుని కోసం ఎన్నెన్నో మధురాతిమధురమైన వన్యభక్ష్యపదార్థాలను కానుకలుగా తెచ్చి సమర్పించాడు. భరతునికి ప్రణమిల్లాడు.
“రాజపుత్రా, మీకు మా నివాసప్రాంతాలన్నీ విహారయోగ్యమైన ఉద్యానవనాలవంటివి. అయితే మీ రాక మాకు ముందుగా తెలియకపోవడం వలన, మేము మరెవ్వరు వచ్చారో, ఎందుకు వచ్చారో అని భ్రమించాము. మేము మీ వారము. మా ఇంట మీరు మహారాజులవలె నివసించవచ్చును. మా కానుకలను స్వీకరించి మమ్ములను ధన్యులను చేయండి” అని వినయంగా పలికాడు.
భరతుడు అతని పట్ల తనకు కలిగిన ప్రీతిని దాచుకోలేకపోయాడు. ఎంతో సంతోషించాడు. కొంత సంభాషణ జరిగిన పిమ్మట, “ఓ గుహా, ఈ అరణ్యం చాల దట్టమైనది. గంగానదీపరీవాహకప్రాంతం. బురదనేలలు చాల అధికంగా ఉన్నాయి. చాల ప్రమాదభరితంగా ఉన్నాయి. వీటిని దాటి మా రామన్న భరద్వాజమహర్షి ఆశ్రమం చేరినట్లు మాకు తెలిసింది. నీవు మాకు అక్కడకు వెళ్లేందుకు నీవు మాకు మార్గం చూపగలవా?” అని అడిగాడు.
ఆ మాటలు వినగానే గుహుని ముఖం కొంత అప్రసన్నంగా మారింది. అంతవరకు కొంత మృదువుగా ఉన్న అతడి కంఠస్వరం కూడా కొంత కరకుబారింది.
“ఓ రాజపుత్రా, మహాధనుర్ధారులైన నా అనుచరులతో సహా నేనే స్వయంగా మీకు దారి చూపిస్తాను. కాని, నాకు నీపై చాల సందేహం ఉన్నది. మా రామన్న అంతటి అసాధ్యసాధకుడే, నీవు అతడి దగ్గరకు ఎందుకు వెడుతున్నావు? అతడికి కీడు తలపెట్టాలనే దుర్బుద్ధితో వెడుతున్నావేమో! లేకపోతే, ఇంతటి మహాసైన్యంతో నీవు ఎందుకు అతడిని వెదుకుకుంటూ వచ్చావు? ఆ సందేహం తొలగితే కాని, నిన్ను అక్కడకు తీసుకుపోవడం సాధ్యం కాదు. నీవు నీ సైన్యం కూడా నేను ప్రాణాలతో ఉండగా దాటిపోవడం అసాధ్యం” అన్నాడు మొరటుగా, ఏమాత్రం మొగమాటం లేకుండా.
కచ్చిన్న దుష్టో వ్రజసి
రామస్యాక్లిష్టకర్మణః।।
ఇయం తే మహతీ సేనా
శంకాం జనయతీవ మే।। (రా.2.85.7)
సుమంత్రుడు, శత్రుఘ్నుడు గుహుని అమాయికత్వానికి నవ్వారు. అతడి రామభక్తికి ఆశ్చర్యపోయారు కూడా. తన చిన్న సైన్యంతో అపారమూ అజేయమూ అయోధ్యసైన్యంతో యుద్ధం చేయడానికి కూడా అతడు ఎందుకు సన్నద్ధుడై ఉన్నాడో వారికి అర్థమైంది. భరతునికి కూడా గుహుని సందేహం అర్థమైంది.
“ఓ గుహా, రామన్న మాకు జ్యేష్ఠసోదరుడు. మాకు తండ్రి తరువాత తండ్రివంటివాడు. అతడిని వనవాసంనుండి తిరిగి అయోధ్యకు తీసుకుపోవాలనే సంకల్పంతోనే వచ్చాను. సత్యం బ్రవీమి తే. నిజం చెబుతున్నానయ్యా” అని భరతుడు సానునయంగా పలికాడు.
ప్రసన్నంగా ఉన్న భరతుని ముఖచిహ్నాలను, మాటతీరును గమనించాక, గుహుడు భరతుని నమ్మగలిగాడు. భరతుని సంకల్పాన్ని ప్రశంసించాడు. రాత్రంతా వారికి నిద్ర లేదు. మన రాముని గూర్చి, తత్సేవానిరతుడూ భాగ్యవంతుడూ అయిన లక్ష్మణుని గూర్చి, వారి సంరక్షణలో ఉన్న సీతమ్మను గూర్చి వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
మరుసటి రోజు గుహుని మార్గదర్శకత్వంలో అయోధ్యాసైన్యమంతా రాముడున్న ప్రాంతానికి కదిలింది. దారిలో వారు ఒక రాత్రి భరద్వాజమహర్షి ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించారు. తరువాత రోజున దూరంగా కొండపై పొగలను చూసి, మన రాముడు అక్కడ ఉండవచ్చునని తలచి అక్కడకు దారి తీశారు. అదిగో, చివరకు వారికి సీతాలక్ష్మణసమేతుడైన శ్రీరాముని దివ్యదర్శనం లభించింది.
శ్రీరాముని కోసం తన సమస్తసైన్యంతో సహా ప్రాణాలను కూడా యుద్ధంలో తృణప్రాయంగా భావించి పోరాడేందుకు నిశ్చయించిన ఆ గుహునికి కూడా శ్రీరామసందర్శనభాగ్యం మరలా కలిగింది.
జన్మతః చేపలను పట్టే వృత్తిని చేపట్టిన జాలరి అయిన అతడు రామభక్తులలో అగ్రేసరుడని, పరమభాగవతోత్తముడని అందరిచేతా ప్రస్తుతింపబడ్డాడు. శ్రీరాముని ఆలింగనభాగ్యం పొందినవారిలో అతడు కూడా ఒకడు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...