Sunday 22 March 2020

దానరాజు - ధర్మరాజు

ఈ కథను మీరు కూడా చిన్నపుడు వినే ఉంటారు. మహాభారతంలో ఎక్కడా లేని కథ. అయినా, జానపదులు సృష్టించిన కథ కాబట్టి, మాంచి రసవత్తరంగా ఉంటుంది.

ఒకసారి అర్జునునికి ఒక సందేహం వచ్చిందట.

"కృష్ణా కృష్ణా, మా అన్నను ధర్మరాజు అంటారు. కర్ణుని దానరాజు అంటారు ఈ ఇద్దరిలో ఏ రాజు గొప్ప?" అని అడిగాడు.

"కొన్ని రోజులు ఓపిక పట్టు అర్జునా. అవకాశం రాగానే నీకే ఆ విషయం ప్రత్యక్షంగా తెలిసేలా చేస్తాను" అని కృష్ణుడు చెప్పాడు.

ఎండా కాలం గడిచిపోయింది. వానాకాలం వచ్చింది. ధర్మరాజు రాజుగా ఉన్నాడు కాబట్టి, లోకమంతా మంచి వర్షాలు కురుస్తున్నాయి.

"అర్జునా, పద. వారిద్దరిలో ఎవరు గొప్ప రాజో ఇప్పుడే తెలుసుకుందాం" అని కృష్ణుడు అన్నాడు.

వారిద్దరూ తమను ఎవరూ గుర్తుపట్టకుండా బ్రాహ్మణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. మొదటగా వారు ధర్మరాజు దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

ధర్మరాజు ఆశ్చర్యపోయి, "వర్షాకాలంలో యజ్ఞాలు చేయడం ఏమిటి? పైగా వేయి మణుగుల గంధపు చెక్కను ఉపయోగించి చేయడమేమిటి? ఇటువంటి యజ్ఞాలను గూర్చి నేను ఎన్నడూ వినలేదే?" అన్నాడు.

"రాజా! అది ఒక రకమైన ప్రత్యేకయజ్ఞం" అని మాత్రమే వారు చెప్పారు.

ధర్మరాజు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "మహారాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

అప్పుడు ధర్మరాజు ఆ బ్రాహ్మణులకు నమస్కారం చేసి, "మహాత్ములారా! మన్నించండి. మీరు వర్షాకాలంలో చేయరాని యజ్ఞాన్ని చేయదలపెట్టారు. అందువలన మీకు ఆ ప్రకృతి సహకరించేలా లేదు. దయచేసి వర్షాకాలం పూర్తి అయిన తరువాత మీరు యజ్ఞం చేయదలచుకుంటే, అపుడు మీ ఇంటికి నేను మీరడిగిన వేయి మణుగుల గంధపుచెక్క తో పాటు మిగిలిన యజ్ఞసంభారాలన్నీ పంపిస్తాను" అని అని వినయంగా పలికాడు.

అపుడు ఆ కపటబ్రాహ్మణవేషధారులు సరేనని చెప్పి అక్కడ నుండి నేరుగా కర్ణుని దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

కర్ణుడు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "రాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

కపటబ్రాహ్మణులు నిరాశగా ముఖం పెట్టారు. అది చూసి కర్ణుడు "అయ్యా! ఒక్క క్షణం ఆగండి. మీరు అడిగినది మీకు తప్పక ఇస్తాను" అని పలికాడు.

తరువాత తన భటులను పిలిచి, "భటులారా, భటులారా, నా ఇల్లు శ్రేష్ఠమైన గంధపు చెక్కతో నిర్మించబడింది. వెంటనే దీనిని పడగొట్టి ఈ బ్రాహ్మణులకు అవసరమైనంత గంధపు చెక్కను ఇచ్చి పంపండి" అని ఆజ్ఞాపించాడు.

అది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
"ఆహా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని భావించి అతడి పట్టుదలను మెచ్చుకున్నాడు.

ఇంతవరకు ఇది జానపదులు అల్లిన ఒక అందమైన కథ.

)))(((

ఇపుడు మనము ఈ కథను మరికొంత పొడిగిద్దాం.

"ఆహా! కృష్ణా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని అర్జునుడు పలికాడు.

"అయితే మీ అన్న అయిన ధర్మరాజు గొప్పవాడా లేక దానరాజు అయిన ఈ కర్ణుడు గొప్పవాడా? నీ సందేహం తొలగిపోయిందా?" అని కృష్ణుడు ప్రశ్నించాడు.

"నిస్సందేహంగా కర్ణుడే గొప్పవాడు కదా?" అని అర్జునుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.

"ఎందువల్ల?"

"బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం కర్ణుడు తన సొంత ఇంటినే త్యాగం చేశాడు కదా?"

"అయ్యో అర్జునా! కర్ణుడు ఎంతటి విలాసపురుషుడు కాకుంటే తన ఇంటిని గంధపు చెక్కతో కట్టుకున్నాడు? సరే, అది అతడి ధనం, అతడి ఇష్టం. కానీ అతడి ఇంటిలో ఉండేది అతడొక్కడే కాదు. అతడి తల్లిదండ్రులు ఉంటారు. అతడి భార్యాబిడ్డలు ఉంటారు. అతడి పరివారజనం కూడా ఉంటారు. వీరందరికీ సరిపడిన ఆహారపదార్థాలు ఉంటాయి. వీరందరూ ఉపయోగించుకునే వస్త్రాలు పడకలు మొదలైనవి ఉంటాయి. వాటన్నింటినీ విస్మరించి, మంచి వర్షాకాలంలో ఇల్లు పడగొడితే వారందరి గతి ఏమిటి? ఇంటిలో ఉండే ఆ వస్తువులకు పదార్థాలకు రక్షణ ఏముంటుంది? బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం, తాను దానరాజును అనిపించుకొనడం కోసం అంతమందిని ఇబ్బంది పెట్టడం ధర్మమేనా?" అని కృష్ణుడు అర్జునుని అడిగాడు.

అర్జునుడు ఆలోచనలో పడ్డాడు.

"అర్జునా! దేనిని గూర్చి ఆలోచిస్తున్నావు?"

"నీవు చెప్పిన విషయాన్ని గూర్చే బావా!"

"దానిని గూర్చి తరువాత ఆలోచిద్దువు గాని, ముందు దీనిని గూర్చి ఆలోచన చేయవయ్యా!"

"దేనిని గూర్చి బావా?"

"ఇల్లు పడగొట్టమని కర్ణుడు ఆజ్ఞాపించాడు కదా? ఇదిగో, భటులందరూ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ, పలుగులు, పారలు, గునపాలు, తట్టలు తెచ్చుకున్నారు. కాసేపట్లో ఇంటిని పడగొట్టేస్తారు. అలా పడగొడుతూ ఉండగానే, ఇంటిని కట్టిన గంధపుచెక్క కూడా వర్షంలో తడిచి పోతుంది. అపుడు ఇలా తడిచిన గంధపు చెక్కను మనం మన యజ్ఞంలో ఎలా ఉపయోగించుకుంటాం?"

"అవును బావా! నిజమే!"

"కాబట్టి, ఏదో ఒక విధంగా దానం చేయాలి, దానరాజును అనిపించుకోవాలి అనే ఉద్దేశం అన్ని సందర్భాలలోనూ మంచిది కాదు. కాలధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి."

"నిజమే బావా! తెలిసింది."

"ఏమి తెలిసింది?"

"దానరాజుగా ఉండటం కంటే, ధర్మరాజుగా ఉండటం గొప్ప."

"శభాష్ అర్జునా!"

)))(((

ఈ విధంగా పొడిగించిన కథను, హఠాత్తుగా ముగిస్తే బాగుండదు. కాబట్టి,

కృష్ణార్జునులు తమ కపటబ్రాహ్మణవేషాలు విడిచి, తామెవరమో, ఎందుకు వచ్చామో కర్ణుడికి తెలియజేసి, తన ఇంటికి వచ్చి "ఇది కావాలి" అని ఎవరైనా నోరు తెరిచి కోరితే, "వారికి ఆ వస్తువును ఏ విధంగా అయినా ఇచ్చి తీరాలి" అనే అతడి పట్టుదలను మెచ్చుకొని, అతడు తన ఇల్లును పడగొట్టుకొనడం ఆపించి, వారిద్దరూ అతని ఇంట ఒక వారం రోజులపాటు హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరారు అని చెప్పడం బాగుంటుంది.

)))(((

అప్పట్లో అది గంధపు చెక్క.
ఇప్పట్లో ఇది ఇసుక.
ధర్మరాజు గొప్పవాడా?
దానరాజు గొప్పవాడా?
⚖️
మరో కథ అవసరమా?
పాత కథ చాలు కదా?

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
26 అక్టోబర్, 2019
❇️✳️❇️✳️❇️✳️

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...