Thursday 26 March 2020

కాళిదాసు స్వభావోక్తి



అది హిమవత్ పర్వతపంక్తులలో ఒక ప్రాంతం.  గంగానది పెద్దగా సడి చేయకుండా నెమ్మదిగా ప్రవహిస్తోంది.  ఆ ప్రవాహంలో పొడవాటి దేవదారువులు కాళ్ళు పెట్టి తడుస్తూ ఉన్నాయి.  అక్కడి పొదలలో సంచరిస్తున్న కస్తూరి మృగాల కారణంగా గాలి పరిమళభరితంగా ఉన్నది.  కిన్నరులు సన్నగా పాడుతున్న ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి.  ఆ ప్రాంతంలో చర్మవస్త్రుడు అయిన పరమేశ్వరుడు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

ప్రమథగణాలు విశ్రాంతిగా ఆటవిడుపుగా ఉన్నారు.  అక్కడ ఉన్న పూలను తమ సిగలలో తురుముకున్నారు.  వారు భూర్జత్వచాలను (బుజపత్తిరి పట్టలను) వస్త్రాలుగా ధరించారు.  మనశ్శిలాచూర్ణాన్ని ఒంటికి పూసుకున్నారు.  శిలాజతువులనడుమ బండరాళ్లపై కూర్చుని ఉన్నారు.

అప్పుడు, నందీశ్వరుని (వృషభం) చేష్టలను వర్ణిస్తూ కాళిదాసు వ్రాసిన ఈ శ్లోకం అతి రమణీయమైనది.

తుషారసఙ్ఘాతశిలాః ఖురాగ్రైః
సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్।
దృష్టః కథఞ్చిద్గవయైర్వివిగ్నైః
అసోఢసింహధ్వనిరున్ననాద॥
(కుమారసంభవమ్ 1.56)

ఆ మహావృషభం చలికాలంలో పేరుకుపోయి గడ్డకట్టిన మంచురాళ్లను తన గొరిౙలతో (కాలి గిట్టలతో) గోరాడుతూ ఉండగా ఎక్కడో దూరం నుండి సింహగర్జనలు వినిపించేసరికి సహించలేక (ఆమాత్రం శబ్దం నేను చేయలేనా అన్నట్టుగా) ఉన్నట్టుండి ఖణిల్లని రంకె వేసిందట.  అప్పుడు దాని మహాకారాన్ని, బలాన్ని చూసి, ఆ దగ్గరలో ఉన్న తక్కిన గవయవాలు (కొండెనుములు) అన్నీ భయనిర్విణ్ణములై నిశ్చేష్టములై పోయాయట.

(ననాద అనే క్రియాపదప్రయోగంతో ఆ ఎద్దు రంకెతో ఆ కొండలు కోనలు ప్రతిధ్వనించిపోయాయనే అర్థాన్ని కూడా కాళిదాసు నేరుగా చెప్పకపోయినా ధ్వనింపజేశాడు.)

(చలికాలంలో కడుపునిండా తిండి దొరకక అరణ్యాలలోను కొండలలోను తిరిగి తిరిగి అలసిపోయి నిస్సహాయంతో కోపంతో గర్జించిన సింహాలు నందీశ్వరుని రంకెకు ఒక్కసారిగా అదిరిపడి, చెవులు రిక్కించి, జూలు అల్లాడుతూ ఉండగా తమ తలలను ఒకింత పైకెత్తి, తమను తిరిగి సవాలు చేస్తున్నట్లు వినవచ్చిన దర్పంతో కూడిన ఆ మహానాదాన్ని చేసిన ఆ మహాసత్త్వం ఏమైయ్యుంటుందో అని కలత చెందుతూ, కళ్లను విప్పార్చి అటూ ఇటూ చూస్తున్న దృశ్యాన్ని ఊహించమని కాళిదాసు చెప్పినట్లు ఉంది కదా!)

ఉపమా కాళిదాసస్య అని అందరూ కీర్తిస్తారు.  కాని ఇంత చక్కని స్వభావోక్తిని కూడా కాళిదాసు ప్రయోగించగలడు!  'చారు యథావద్ వస్తువర్ణనమ్' అని స్వభావోక్తి అలంకారాన్ని ప్రఖ్యాతకాళిదాసవిమర్శకుడైన మల్లినాథులవారు నిర్వచించారు.  ఉన్నదానిని ఉన్నట్టుగా వర్ణించడం స్వభావోక్తి అట. 

కవయః కాళిదాసాద్యాః
కవయో వయమప్యమీ।
(కాళిదాసులాంటివాళ్లూ కవులే, మేమున్నూ కవులమే) ఆమాత్రం అందరూ వర్ణించగలరు కదా?  ఆగండాగండి.  ముందుగా 'చారు' అనే పదాన్ని చూడండి.  అది అన్నంలో కలుపుకు తినే పదార్థం కాదు.  చారు=అందమైన/సుందరమైన/రమణీయమైన/మనోహరమైన అని ఆ పదానికి అర్థం.  మనసును మురిపించే విధంగా, ఉన్నదానిని ఉన్నట్టు వర్ణించడం స్వభావోక్తి.

కాబట్టి,
పర్వతే పరమాణౌ చ
పదార్థత్వం తు విద్యతే॥
కాళిదాసూ కవే, నేను కూడా కవినే అనే వాళ్లకు,
పర్వతమూ ఒక పదార్థమే, పరమాణువూ ఒక పదార్థమే అని సమాధానం.

ఈ బొమ్మకు ఈ కథనానికి సంబంధం ఏమీ లేదే అనిపించిందా?  నాకు కూడా అలాగే అనిపించింది.  ఈ వర్ణనకు తగిన చిత్రం దొరుకుతుందా అని వెదికాను.  ఉహూ.  దొరకలేదు.  చిత్రకారులు కాళిదాసు కావ్యాలను చదవాలే కాని, వారి ప్రతిభను తట్టి లేపే ఎన్నో రమణీయవర్ణనలు వారికి లభిస్తాయి.

(ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక పక్క ప్రశాంతంగా నా పనేదో నేను చేసుకుంటూ ఉంటే మరోపక్క పై తరగతికి వారికి ప్రమోషన్ ఇస్తున్నట్లు వారి పాఠశాలనుండి సందేశం వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక కేకలేస్తున్న పిల్లలను చూసి కుమారసంభవంలో కాళిదాసు వర్ణించిన నందీశ్వరుడు గుర్తుకొచ్చాడు.)

#Kalidasa #Kumarasambhava #Nandi

1 comment:

  1. పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులవడం ఎవరికయినా ఆనందమే...మీ పిల్లల కేరింతలు మాకో మంచి కథనాన్ని అందించాయి .

    ReplyDelete

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...