Friday 20 March 2020

తెలుగు మీడియం - ఇంగ్లీషు మీడియం


ఈ క్రింది పళ్లెంలో ఏదో ఒక రకమైన దానిని మాత్రమే మీరు తీసుకోవాలి అని షరతు పెడితే మీరు దేనిని తీసుకుంటారు? 😊

ఒక భాష యొక్క అభివృద్ధి సాధారణంగా ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది.

1 ఒక భావాన్ని ఇతరులకు స్పష్టంగా తెలియజేయ గలగడం.

2 నిత్య జీవనంలో దైనందినవ్యవహారాలకు ఆటంకం కలిగించక పోవటం.

3 ఒకవైపు ఇతరభాషలకు చెందిన పదాలను స్వాయత్తీకరించుకుంటూనే మరొకవైపు తన ప్రత్యేకతను నిలుపుకొనడం.

4 వినేవారు, పలికేవారు ఉండటం.

5 వ్రాసేవారు, చదివేవారు ఉండటం.

6 తనకంటూ ఒక భూభాగాన్ని కలిగి ఉంటూ అందరిచేత ఆదరింపబడటం.

ఇందులో తెలుగుకు వచ్చిన కొరత ఏమిటి? అన్నీ పుష్కలంగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటి? తెలుగును దోషిగా నిరూపించేందుకు వారు చేస్తున్న ఆరోపణలు ఏమిటి?

ఆరోపణ 1
ఉద్యోగాలు చేసేవారికి తెలుగు పనికిరాదు.

సమాధానం -
ఎంత మంది ఉద్యోగులు ప్రతిరోజు తమ కార్యకలాపాలలో ఇంగ్లీషును వినియోగిస్తున్నారు? ఏ ప్రభుత్వ సంస్థకు వెళ్లిన ఏ ప్రైవేటు సంస్థకు వెళ్లిన అక్కడ అ ఉద్యోగులు పరస్పరం తెలుగు మాట్లాడుకుంటూ ఉండటం వినిపిస్తుంది. వారి చెంతకు వచ్చిన వినియోగదారులు కూడా తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. వారితో ఆయా సంస్థల ఉద్యోగులు కూడా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. విశాఖపట్నం విజయవాడ వంటి నగరాలలోనే గాక శ్రీకాకుళం చిత్తూరు వంటి పట్టణాల్లోనే గాక, మండలాలలోను గ్రామాలలోను కూడా తెలుగు నిత్యం మాట్లాడబడుతుంది. తెలుగు అవసరం ఉన్నచోట తెలుగు పనికిరాదు అనడం ఋజువులు లేని ఆరోపణ.

ఆరోపణ 2
విదేశీ కంపెనీలలోను, కార్పొరేట్ సంస్థలలోను, ఇంగ్లీషు తప్పనిసరి. కాబట్టి తెలుగు అవసరం అక్కడ ఉండదు.

సమాధానం -
సాధారణంగా ప్రతి పెద్ద సంస్థలోనూ పై స్థాయి, మధ్య స్థాయి, క్రింది స్థాయి ఉద్యోగులు ఉంటారు. పైస్థాయి వారు సాధారణంగా పెట్టుబడిదారులై ఉంటారు. వారు మన రాష్ట్రానికే చెందిన తెలుగువారై ఉంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు మన ప్రభుత్వాలు ఎర్ర తివాచీ పరచడం వల్ల వచ్చిన ఇతర రాష్ట్రాల వారు లేదా ఇతర దేశాలవారు అయి ఉంటే వారికి తెలుగు రాదు కాబట్టి వారు ఇంగ్లీషులో మాట్లాడతారు. వారితో మధ్యస్థాయి వారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. అయితే క్రింది స్థాయి వారికి ఇంగ్లీషుతో పనేమీ ఉండదు. మధ్యస్థాయి వారు క్రింది స్థాయి వారితో మాట్లాడేది తెలుగే. పైస్థాయి వారి సంఖ్య, మధ్యస్థాయి వారి సంఖ్య కలిపినప్పటికీ క్రింది స్థాయి ఉద్యోగుల సంఖ్యలో సాధారణంగా 25 శాతం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎంతటి విదేశీ సంస్థ అయిన ఎంతటి కార్పొరేట్ సంస్థ అయిన తెలుగు మాట్లాడే ఉద్యోగులకు పనులలో చక్కటి నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ భాష అవసరం లేదు.

ఆరోపణ 3
అయితే మమ్మల్ని ఎప్పటికీ క్రింది స్థాయి ఉద్యోగులుగానే ఉండమంటారా? మధ్యస్థాయి ఉద్యోగులుగా, పై స్థాయి ఉద్యోగులుగా ఎదగవద్దు అంటారా?

సమాధానం -
ఇది ఒక సెంటిమెంటు. ఇది ఒక ఎమోషనల్ స్థాయిభావం. ప్రభుత్వాధిపతి తన ప్రత్యర్థుల నోరు మూయించడానికి కూడా ఇదే పాయింటును వాడుకున్నాడు. ఇదొక బ్రహ్మాస్త్రం. దీనిమీద ఏ విధంగా సమాధానం చెప్పినా అది తమకు వ్యతిరేకం అని ప్రజలు భావించే ప్రమాదం ఉన్నది.

అయ్యా, ఎన్ని యుగాలు మారినా, యంత్రాలు చేయలేని పనిని మనిషి చేయవలసిందే. ఆ పనులు ఈరోజు మీరు చేయవచ్చు రేపు నేను చేయవచ్చు మర్నాడు మరొకడు చేయవచ్చు. మనుషులు మారుతారు తప్ప, ఆ చేసే పనులు లేకుంటే మాత్రం సమాజం నడవదు.

అందరూ ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే ఇంగ్లీషు దేశాలలో కూడా ఈ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పైస్థాయి మధ్యస్థాయి క్రింది స్థాయి అనే విభజన ఉన్నది. ఒక్కొక్కప్పుడు పైస్థాయి వాడికంటే అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడగలిగిన వారు క్రింది స్థాయిలో కూడా ఉంటారు కానీ వారు క్రింది స్థాయి మనుషులు చేయవలసిన పనులు చేస్తారు. ఇటువంటి తేడాలు కేవలం మన దేశంలో మాత్రమే ఉన్నట్లు ఇతర దేశాలలో మనుషులంతా సుఖపడి పోతున్నారని భావించవద్దు.

అందువల్ల, ఇక్కడ సమస్య డబ్బు ఉండడం లేదా డబ్బు లేకపోవడం మాత్రమే గాని, భాషాసమస్య కాదు.

డబ్బు ఉన్న వారందరూ కూడా పెట్టుబడిదారులు కాలేరు. వారికి భాష కంటే కూడా ముఖ్యంగా కావలసింది ధైర్యము చొరవ అనుభవము. అవి లేని వాడు అంత ఇంగ్లీషు నేర్చినా ఉపయోగం లేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఆ ధైర్యము చొరవ అనుభవము వస్తాయన్నది భ్రమ. నిజానికి అటువంటి ధైర్యము చొరవ అనుభవము ఉన్నవారికి ఇంగ్లీష్ తనంతట తానుగా వచ్చి ఊడిగం చేస్తుంది.

ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని విఫలమైనవారు ఉన్నారు. తెలుగు మీడియంలో చదువుకొని ఘనవిజయాలను సాధించిన వారు కూడా ఉన్నారు.

ఇంగ్లీషు నేర్చిన వారందరూ ఉన్నతస్థాయికి చేరుకుంటారు అనుకుంటే ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పుకుంటూ దీనంగా బ్రతుకుతున్న ఇంగ్లీషుపంతులు గార్లు మన ముందే కనబడుతున్నారు. మరి వారిని ఇంగ్లీషు ఎందుకు ఉన్నత స్థాయికి చేర్చలేకపోయింది?

"ఎవరు ఎటువంటి పనిని చేసినా అందరినీ సమానంగా గౌరవించాలి" అంటూ "డిగ్నిటీ ఆఫ్ లేబర్" పేరిట ఒకప్పుడు వినిపిస్తూ ఉండిన మాటలు ఇప్పుడు వినబడటం లేదు.

అయినప్పటికీ, మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న కొద్దీ, ముందు చెప్పినట్లుగానే మీకు అవసరమైన ఇంగ్లీష్ తనంతట తానుగా వచ్చి మీకు సేవ చేసుకుంటుంది. చిన్నతనం నుండి ఆయా భాషలతో పరిచయం లేకపోయినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్న వారికి ఆయా ప్రాంతీయ భాషలు చాలా సులువుగా రావడం మనం చూస్తూనే ఉన్నాం కదా ఇంగ్లీష్ కూడా దీనికి మినహాయింపు కాదు. అదేమీ పిస్తా కాదు. అందువల్ల మనం మన మాతృభాషను వదిలి చిన్నతనం నుండే మనది కాని ఇంగ్లీషును నేర్చుకుంటూ నములుతూ మింగుతూ జీర్ణం చేసుకొనవలసిన అవసరం లేదు.

ఈ విషయం మన అభినవ మెకాలే అయిన ముఖ్యమంత్రి గారితో సహా మహా మహా మేధావులైన వారికి అందరికీ తెలుసు. కానీ ఏవో రహస్య ప్రయోజనాలను ఆశించి వారు అతి దుర్మార్గమైన చర్యకు పూనుకుంటున్నారు.

(నాగాలాండ్ లో నాగాప్రజల మాతృభాషను చంపేసి ఇంగ్లీషును ప్రవేశపెట్టి, ఇంగ్లీషును బోధించేందుకు క్రిస్టియన్ మిషనరీలను అనుమతించి, దాదాపు నాగ ప్రజలందరినీ క్రిస్టియన్లుగా మార్చి వేశారు. ఇప్పుడు నాగాలాండ్ భారతదేశం నుండి విడిపోవాలని, ప్రత్యేకదేశం కావాలని కోరుతున్నారు. ఇక్కడ కూడా అలా జరగదని నమ్మకం ఏమిటి?)

అపోహ -
ఇంగ్లీషు పెద్ద పిస్తా.

సమాధానం -
😆😂🤣
అలాగే అనుకుందాం. కానీ పిస్తా వల్ల అదనపు లాభం ఏమిటి? పిస్తాను రుచి చూసిన వారందరికీ దాని గూర్చి బాగా తెలుసు. దానికంటే గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు పువ్వు గింజలే మంచి రుచిగా ఉంటాయి. మన చెనిక్కాయలతో పోలిస్తే రంగు రుచి పోషక పదార్థాలలో కూడా పిస్తా దిగదుడుపే. అమ్మ చేసిపెట్టే శనగ గుగ్గిళ్ళ ముందు ఈ పిస్తా బలాదూర్ కాదా? మన రాయదుర్గం కొండలమీద విరివిగా దొరికే తీయని సీతాఫలాలు తిన్న తరువాత ఒక పిస్తా గింజను నోట్లో పెట్టి కొరికితే, దానంత చేదుగా మరే ఇతర పదార్థమూ ఉండదు. మన చక్కరకేళి మన అమృతపాణి తిన్న తరువాత పిస్తా గింజను చూస్తేనే రోత పుడుతుంది. మామిడి పండ్లను, జామ పండ్లను నేరేడు పండ్లను తిన్న తరువాత మళ్లీ పిస్తా అవసరమా? పనసతొనలను పనస గింజలను తిన్నంత ఆనందంగా మనం పిస్తా గింజలను తినగలమా?

పిస్తాను తినడం హోదాకు చిహ్నంగా ఎవరైనా భావిస్తే దాన్ని మన భాషలో వగలు పోవడం అంటారు. అసలు పైన చెప్పినవేమీ తినకుండా, కేవలం పిస్తా గింజలను మాత్రమే తిని బ్రతుకుతున్నవారు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?


No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...