Saturday 20 March 2021

బాఘ్ మార్ హరిసింగ్ నల్వా (2)

 


పెషావర్ నివాసి అయిన సర్దార్ కమాల్ ఖాన్ కు అరవై యేండ్లు. నలుగురు బేగంలు. అందులో జరీనా అనే బేగంకి లేక లేక పుట్టిన కూతురు నూర్ భాను. చక్కటి చుక్క. కమాల్ ఖాన్ కు ఆమె తప్ప వేరే సంతానం లేదు. ఆమె నలుగురు తల్లుల ముద్దుల బిడ్డ. అందు చేత అల్లారుముద్దుగా పెరిగింది. పదహారేండ్ల యువతి. పెషావర్ లో ఎందరో అమీర్లు నూర్ ను తమకు ఇచ్చి చేయవలసిందిగా కమాల్ ఖాన్ ను కోరుతున్నారు. కాబూల్, కెట్టా, కాందహార్, సమర్ ఖండ్, హీరత్ మొదలైన దూరప్రాంతాలకు చెందినవారు కూడా ఆమెను తమకిచ్చి పెండ్లి చేయమని కమాల్ ఖాన్ ను అడుగుతూ కబుర్లు పంపుతున్నారు. అయినా, కమాల్ ఖాన్ ఆమెకు వారికంటె గొప్ప సంబంధం చేయాలని అందరినీ తిరస్కరిస్తూ వస్తున్నాడు. కాని, ఈరోజు దోస్త్ మహమ్మద్ ఖాన్ మాటలు వినగానే అతడికి తన కూతురు నూర్ ను ఉపయోగించి హరిసింగ్ నల్వాను కడతేర్చాలని భావించాడు. అందుకు అతడు కూడా సమ్మతించి నజరానాలు ఇవ్వడంతో అతడి సంతోషానికి మేర లేదు.

కమాల్ ఖాన్ తెచ్చిన నజరానాలు చూడగానే అతడి భార్యలు ఎంతగానో సంతోషించారు. అయితే అవి ఎందుకు ఇవ్వబడ్డాయో తెలియగానే వారికి కమాల్ ఖాన్ మీద కోపం ముంచుకు వచ్చింది. అతడి మీద కేకలు వేశారు.
“దుర్మార్గుడా, అభం శుభం ఎరుగని అమాయికురాలైన కూతురును నీ నీచమైన రాజకీయాలకోసం బలిపశువును చేస్తావా? అన్నారు.
అటువంటి పనికోసం వినియోగించేందుకు నలుగురిలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. ఇలాంటి పని చేయడానికి మా కూతురే దొరికిందా? దోస్త్ మహమ్మద్ ఖానుకు ఇప్పటికే ఇరవై మంది బీవీలు ఉన్నారు. ఇప్పటికే పదహారుమంది కూతుర్లు ఉన్నారు. ఇంకా ఎంతమందిని చేసుకుంటాడో, ఇంకా ఎంతమందిని కంటాడో? వారిలో ఒకరిని హరిసింగ్ కు ఇచ్చి తన రాజకార్యం జరిపించుకోరాదా?” అని దుమ్మెత్తిపోశారు.
అయితే కమాల్ ఖాన్ మాత్రం పట్టు వదలలేదు. “నా మాట వినండి. హరిసింగ్ సామాన్యుడు కాదు. సిఖ్ సామ్రాజ్యానికి పాదుషా రంజిత్ సింగ్ అయితే అతడి కుడిభుజం హరిసింగ్. ప్రస్తుతం అతడు మన పెషావర్ గవర్నరు కూడా. అతడికి నిఖా చేసుకుంటే మన కూతురు నూర్ భాను పెషావర్ రాణి అవుతుంది. దాని వలన మనకు ఎంతో ప్రతిష్ఠ చేకూరుతుంది. హరిసింగ్ కు అత్తామామలుగా మన పేరు ప్రఖ్యాతులు పెషావర్ అంతా మారు మ్రోగుతాయి” అన్నాడు.
“హరిసింగ్ కు ఇప్పటికే పెండ్లి అయిందని తెలియదా నీకు?”
“అయితే మాత్రం ఏమిటి? మన నూర్ అందచందాలకు అతడు తప్పక బానిస అయిపోతాడు. మొదటి రాణిని పక్కకు తోసి మన కూతురే అసలైన రాణి అవుతుంది.”
“అయినా, నువు చెప్పిన పథకం ప్రకారం ఆ వైభోగం అదెంతకాలముంటుంది? ఏదో ఒకరోజు హరిసింగ్ ను కపటంతో చంపాలంటున్నావు. అలా చేశాక దాని బ్రతుకు ఏమి కావాలి?”
“ఏమౌతుంది? హరిసింగ్ చస్తే పెషావర్ మనదే. మనం హిందువులం కాదు. హిందూ స్త్రీలతో స్నేహం చేసీ చేసీ వారిలాగానే మీరు కూడా ఆలోచిస్తున్నారు. మన ఆచారంలో భర్త చనిపోతే ఆ స్త్రీ మరలా పెళ్లి చేసుకోవచ్చు. అతడు కూడా చస్తే మరలా పెళ్లి చేసుకోవచ్చు. అలా ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. మన నూర్ ను నిఖా చేసుకోవాలంటే ఎవరైనా ఎగిరి గంతేసి మరీ వస్తారు. ఆ విషయం గూర్చి అట్టే బాధ పడకండి” అన్నాడు కమాల్ ఖాన్.
“ఇలాంటి మాటలు పలకడానికి నీకు సిగ్గుగా లేదా?”
కమాల్ ఖాన్ వారి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయాడు.
“హరిసింగ్ కు ఇప్పుడు నలబై నాలుగేండ్లు. మన నూర్ భానుకు ఇప్పుడు పదహారేండ్లు మాత్రమే. తెలుసా? అటువంటి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారా?”
“అదో పెద్ద విషయమా? మా దోస్త్ మహమ్మద్ ఖాన్ కు నలబై రెండు ఏండ్లు. అతడి ఇరవయ్యో బేగం వయసు కేవలం పద్నాలుగు ఏండ్లు మాత్రమే తెలుసా? అంతే కాదు, అతడి బేగంలలో మరో ఐదుగురి వయసు ఇంకా పద్దెనిమిది కూడా నిండలేదు. అది కూడా తెలుసా?”
“ఒరే మూర్ఖుడా, వాడొక కామపిశాచి. ఆ పిల్లల ఖర్మ కొద్దీ దోస్త్ మహమ్మద్ ఖాన్ చూపు వారిమీద పడింది. అధికారమదంతో వారి తల్లిదండ్రులను బలాత్కారంగా ఒప్పించి వారిని నిఖా చేసుకున్నాడు. మన కూతురును కూడా ముసలాడికిచ్చి పెళ్లి చేయవలసిన ఖర్మ ఏమి పట్టింది?"
“హరిసింగ్ ను ఎప్పుడైనా మీరు చూశారా? ఎంతటి మహావీరుడు అతడు! అతడు బల్లెం గాని కత్తి కాని పట్టి యుద్ధానికి నిలిచాడంటే ఇరవైయేండ్ల పడుచు పోరగాళ్లు ఓ పాతికమంది అతని చుట్టుముట్టి యుద్ధానికి దిగినా అతడికి గోరును కూడా తాకలేరు. పైగా ఆ పాతికమంది బ్రతికి బట్టకట్టితే అది నిజంగా గొప్ప విషయం!” అన్నాడు కమాల్ ఖాన్.
ఇలా బేగంలు ఎంతగా కాదంటున్నా కమాల్ ఖాన్ మాత్రం తన పట్టు వీడలేదు. అంతా సక్రమంగా జరిగితే హరిసింగ్ తమకు అల్లుడౌతాడు. ఆ తరువాత అతడిని చంపగలిగితే పెషావర్ కు తననే పాలకునిగా చేస్తానని మహమ్మద్ ఖాన్ మాట ఇచ్చాడు. తన కూతురుకు కూడా మళ్లీ పెళ్లి చేయడం పెద్ద విషయమేమీ కాదు!
అయినా, బేగంలు ఎంతకూ ఒప్పుకోకుండా విసిగిస్తూ ఉండటంతో అతడు చివరకు తన కపటపు మాటలు మొదలు పెట్టాడు.
“సరే, విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి అసలు విషయం చెబుతాను వినండి! దోస్త్ మహమ్మద్ ఖాన్ కు ఇప్పటికే ఇరవై ముగ్గురు బేగంలు ఉన్నారు. అతడి కన్ను మన కూతురు మీద పడింది. ఆమెను తనకు ఇరవై నాలుగో బేగంగా ఇవ్వమని నన్ను అడిగాడు. అతడికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. కాని, అలా నేను తిరస్కరిస్తే నన్ను చంపేసి అయినా మన కూతురును తన స్వాధీనం చేసుకుంటాడు. అందువల్ల నేను తెలివిగా ఇలా హరిసింగ్ పేరు చెప్పి, నా కూతురు చేతనే హరిసింగును చంపిస్తానని చెప్పడం వల్ల ప్రస్తుతానికి ఊరుకున్నాడు. నేను మన కూతురును హరిసింగ్ కు ఇచ్చి నిఖా చేయకుంటే వాడే మన కూతురును ఎత్తుకుపోతాడు. హరిసింగ్ కు కాకుండా వేరెవరికి ఇచ్చి చేసినా సరే, అతడిని చంపి మరీ ఎత్తుకుపోతాడు. అర్థమైందా? నాకు మాత్రం నా కూతురు మీద ప్రేమ లేదనుకున్నారా?”
ఆ మాటలు బ్రహ్మాస్త్రంలా పని చేశాయి. కమాల్ ఖాన్ బేగంలందరూ నిశ్చేష్టులయ్యారు. దోస్త్ మహమ్మద్ ఖాన్ ఎంతటి క్రూరుడో దేశానికంతటికీ తెలుసు. వాడి జనానాకు పోవడం కన్నా చావడం మేలు. తమ ముద్దుల కూతురుకు అటువంటి గతి పట్టకూడదు. ఆమెను కాపాడుకోవాలంటే హరిసింగ్ కన్నా వేరొక సమర్థుడు ఎవరూ లేరు! కమాల్ ఖాన్ చెప్పిన దాంట్లో అతిశయోక్తులు ఏమీ లేవు.
“కానీ, మరి నిఖా జరిగిన తరువాత హరిసింగ్ ను కపటంతో చంపాలంటున్నావు? మరి అవేం మాటలు?”
“ఎందుకంటే, నాకు ఆడవారి మీద అసలు నమ్మకమే లేదు. నిజంగా ఇదీ అసలు విషయం అని చెప్పేస్తే ఆడవారైన మీ నోట ఈ రహస్యం దాగుతుందనే నమ్మకం నాకు లేదు. మీనుంచి మీ స్నేహితురాళ్లకు, వారినుంచి వారి స్నేహితురాళ్లకు వెడుతుంది. నెమ్మదిగా ఈ విషయం దోస్త్ మహమ్మద్ ఖాన్ వరకు చేరిపోతుంది. అప్పుడు మనలో ఎవరమూ బ్రతికి బట్టకట్టలేము. హరిసింగ్ తో మన కూతురు పెండ్లి అయ్యేంతవరకూ మాత్రమే మనం ప్రమాదంలో ఉంటాం. పెండ్లి జరిగిన తరువాత హరిసింగ్ అత్తమామలుగా మహారాణిగారి తల్లిదండ్రులుగా మనకు మంచి రక్షణ ఉంటుంది.”
అప్పటికి బేగంలందరికీ కమాల్ ఖాన్ మీద విశ్వాసం కుదిరింది. ప్రస్తుత పరిస్థితులలో వారికి వేరే గత్యంతరం కూడా లేదు కాబట్టి, నూర్ భానును హరిసింగ్ కు ఇవ్వవచ్చునని చివరకు అంగీకరించారు.
తన మాటలు అంత చక్కగా పనిచేసినందుకు కమాల్ ఖాన్ తనను తానే మనసులో అభినందించుకున్నాడు.
కమాల్ ఖాన్ ఒక పథకం ప్రకారం తన కూతురైన నూర్ భానుకు ఆమె స్నేహితుల ద్వారా హరిసింగ్ నల్వా వీరత్వం గూర్చి గొప్పతనం గూర్చి కథలు కథలుగా చెప్పించడం మొదలు పెట్టాడు. పెషావర్ లోనూ, ఇతరత్ర కూడా ప్రజలు అతనిని ఎంతగా అభిమానిస్తారో ముందే తెలిసి ఉన్న పదహారేండ్ల బాలిక నూర్ కు సహజంగానే హరిసింగ్ పట్ల ఆకర్షణ కలిగింది. పైగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా తనను అతడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారని తెలియగానే ఆ ఆకర్షణ ప్రేమగా ఆరాధనగా మారింది.
ఆ విషయాన్ని ఆమె స్నేహితుల ద్వారా తెలుసుకుని సంతోషించిన కమాల్ ఖాన్ ఒకరోజు హరిసింగ్ నల్వా దర్శనం కోరి అతని చెంతకు వెళ్లి తన కూతురు నూర్ ను వివాహం చేసుకొనవలసిందిగా కోరాడు.
అతడు మునుపు పఠాన్ల సైన్యంలో సర్దారుగా పని చేశాడని, అయితే ఇపుడు క్రూరమైన పనులు మానివేసి బుద్ధిగా బ్రతుకుతున్నాడని హరిసింగ్ కు తెలుసు. అందువలన అతడిని సాదరంగా ఆహ్వానించినప్పటికీ, అతడి పెండ్లి ప్రస్తావనను మృదువుగా తిరస్కరించాడు. అతడు కోరితే వారిలోనే ఒక గొప్ప సంబంధాన్ని తాను ఆమెకోసం చూసి పెడతానని చెప్పాడు.
తన పథకం నెరవేరనందుకు కమాల్ ఖాన్ కు ఆశాభంగం కలిగింది. తన కలలు కల్లలౌతాయేమో అని నిరాశతో క్రుంగిపోయాడు. అయితే అతడికి ఇంకా ఆశ చావలేదు. తన కూతురు జగదేకసుందరి. ఆమెను చూస్తే హరిసింగ్ తప్పక మనసు మార్చుకుంటాడని, ఆమెతో పెండ్లికి అంగీకరిస్తాడని అతడికి గట్టి నమ్మకం.
అందువల్ల అతడు ఒకరోజు అతడు ఆమె తల్లుల ద్వారానే తన కూతురును నేరుగా అడిగించాడు. “బేటీ, నీకు హరిసింగ్ అంటే ఇష్టమేనా? అతడిని పెండ్లి చేసుకుంటావా?”
ఆమె సిగ్గుతో తల దించుకుంది. అంతకంటె అంగీకారం ఏముంటుంది?
అపుడు కమాల్ ఖాన్ తాను హరిసింగ్ ను ఆ విషయమై అడిగినట్లు, కాని అతడు తిరస్కరించినట్లు ఆమెకు నిజం చెప్పేశాడు. నూర్ భానుకు ఆశాభంగమైంది. ఆమె ముఖం వెల వెల బోయింది. కళ తప్పిపోయింది. ఆమె హృదయం ముక్కలైంది. కన్నీళ్లను అదిమి పెట్టుకుంటూ, తల దించుకుని మరలా ఎత్తనే లేదు.
అపుడు కమాల్ ఖాన్ ఆమెను ఓదారుస్తూ చెప్పాడు – “బేటీ, మరేం దిగులు పడకు, హరిసింగ్ ప్రతిరోజూ ఉదయం షాహిభాగ్ ఉద్యానవనానికి వస్తాడు. ఆ సమయంలో నువ్వే నేరుగా వెళ్లి అడుగు. నిన్ను చూస్తే అతడు కాదనలేడని నా అభిప్రాయం” అని చెప్పాడు.
తండ్రీకూతుర్ల మధ్యలో జరగరాని సంభాషణ అది. కాని, కమాల్ ఖాన్ దురాశ అతడితో అలా పలికించింది. తల్లులందరూ కూడా దోస్త్ మహమ్మద్ ఖాన్ భయంతో అతడి మాటలను సమర్థించారు.
నూర్ భాను కూడా ఒక వైపు సంకోచిస్తూనే, హరిసింగ్ నల్వాపై తాను పెంచుకున్న ప్రేమ కొద్దీ సరేనంది.
తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి, హరిసింగ్ ఉదయమే షాహిబాగ్ ఉద్యానవనానికి వచ్చే సమయంలో తన కూతురుకు కూడా అక్కడ ఎలా ప్రవేశం కల్పించాలా అని కమాల్ ఖాన్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
( ఇది కథలో రెండవ భాగం. మిగిలిన కథ మూడవభాగంలో)

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...