Friday 19 March 2021

బాఘ్ మార్ హరిసింగ్ నల్వా (1)



“హరిసింగ్ నల్వాను చంపిన జిహాదీకి పదివేల దీనారాలు బహుమతి ఇస్తాను” అని బిగ్గరగా గొంతెత్తి ప్రకటించాడు ఆఫ్ఘన్ పాదుషా దోస్త్ మహమ్మద్ ఖాన్.

ఆఫ్ఘన్ సర్దార్లందరికీ ఆశ పుట్టింది. కాని, అది దాదాపు అసాధ్యం! కాబట్టి ఎవ్వరూ కూడా మేము ఆ పని చేస్తాము అని అంగీకరించేందుకు కూడా సాహసించలేదు.
ఎండుటాకులను అగ్ని దహించినట్టుగా మాన్ షేరా లోయలో వేలాది ముజాహిదీన్ల సైన్యాన్ని మట్టుబెట్టినప్పటి అతడి అరివీరభయంకరరూపం ఇంకా వారి కండ్లలో కదలాడుతూనే ఉంది.
మెటికోట్ పర్వతసానువుల్లో తమ నాయకుడైన సయ్యద్ అహమ్మద్ తో తలపడి తమ కండ్లముందే అతడి తలను తెగవేసిన దృశ్యం వారిలో ఇంకా ఎవ్వరూ మరచిపోలేదు.
పెషావర్ లో తమ సైన్యాలను ఊచకోత కోసిన అతడి కత్తి గుర్తుకువస్తుంటే వారికి గుండెలు గుబగుబలాడుతున్నాయి.
ఇంతకూ వారందరి గుండెల్లోనూ అంతగా గుబులు పుట్టించిన హరిసింగ్ నల్వా ఎవరు?
)))(((
"బిచిత్ర నాటక్" అనేది సిక్ఖు గురు గోవింద సింహులవారి ఆత్మకథ.
అందులో ఆయన పంజాబులో ఖత్రీలు అని పిలువబడే హైందవక్షత్రియజాతిని గూర్చి ప్రస్తావించారు. వారందరూ గోవిందసింహులవారి కాలానికి వర్తకులుగాను, లేఖకులుగాను, గణకులుగాను, పట్టువస్త్రాలు నేసేవారిగాను స్థిరపడి ఉన్నారు.
ఖత్రీలలోనే ఒక తెగ బేడీలు. (బిషన్ సింగ్ బేడీ గుర్తున్నాడా?) వారు తమ పూర్వీకుడు రాముని కుమారుడైన కుశుడని చెప్పుకుంటారు. వారు క్షత్రియులైనప్పటికీ, కేవలం ఆయుధవిద్యలతో సంతృప్తి చెందకుండా బ్రాహ్మణులతో పోటీ పడి వారణాసికి పోయి చక్కగా వేదాలు నేర్చుకున్నారని, అందుకే వారిని వేది (వేదాభ్యాసం చేసినవారు) అని పిలిచేవారని, ఆ వేది అనే పదమే కాలక్రమేణ బేడి అయిందని అంటారు.
అలాగే పంజాబు హైందవక్షత్రియులలో మరొక తెగవారైన శోధిలు తమ పూర్వికుడు సీతారాముల కుమారుడైన లవుడని అంటారు. వారు గొప్ప ఆత్మశోధన (తపస్సు) చేశారు కాబట్టి శోధి అని పిలువబడ్డారట. సిక్ఖు గురు రామదాస సింహునినుంచి ఏడుగురు గురువులు అందరూ ఈ శోధిలే.
)))(((
1791వ సంవత్సరంలో, అప్పటి పంజాబు రాజధాని అయిన గుజ్రన్ వాలా పట్టణంలో, ఖత్రికుటుంబంలో ధరమ్ కౌర్, గురుదయాళ్ సింగ్ ఉప్పల్ అనే దంపతులకు హరి అనే పుత్రుడు కలిగాడు. ఏడవ ఏటనే అతడి తండ్రి చనిపోయాడు. తన అతడిని తల్లి గొప్ప వీరునిగా చేయాలని సంకల్పించి అలాగే పెంచింది.
హరి తన పదవ యేటనే అమృత్ సంచార్ అనే సిక్కు సంస్కారాన్ని పొందాడు. అప్పటినుండి హరిసింగ్ అయ్యాడు. పన్నెండవ యేటకే ఆయుధవిద్యలలోను, గుఱ్ఱపుస్వారీలోనూ సాటిలేని మేటిగా పేరుగాంచాడు.
1804లో, పద్నాల్గవయేట అతడు అప్పటి పంజాబ్ రాజధాని అయిన లాహోర్ కు వెళ్లి మహారాజా రంజిత్ సింగును కలవడం తటస్థించింది. ఆ బాలుని తేజస్సుకు, వినయానికి రంజిత్ సింగ్ ముగ్ధుడైపోయాడు.
మహారాజుగారి పూర్వికులైన మహాసింగ్ చరత్ సింగ్ లో చెంత తన తండ్రితాతలు పని చేశారని ఆ బాలుడు విన్నవించుకున్న తరువాత రంజిత్ సింగ్ అభిమానం రెట్టింపైంది.
ఆ బాలుని యుద్ధవిద్యాప్రదర్శన చూసిన తరువాత అతడిని తన పుత్రసమానుడిగా భావించి వాత్సల్యం చూపకుండా ఉండలేకపోయాడు. ఆ బాలుడిని తన అంగరక్షకునిగా నియమించుకున్నాడు.
అతడు చేసిన పని ఎంతో మంచిదయింది. అదే సంవత్సరంలో (1804) ఒకనాడు రంజిత్ సింగ్ అడవిలో వేటాడుతూ ఉండగా ఒక పెద్ద పులి అతడిపై దాడి చేసింది. కాని రెప్పపాటులో హరిసింగ్ ఆ పులిమీద పడ్డాడు. రంజిత్ సింగ్ క్షేమంగా బయటపడ్డాడు. కాని, పులి హరిసింగ్ ను తన నోట ఇరికించుకుంది. అతడి ఆయుధం పెనుగులాటలో ఎక్కడో జారిపోయింది. కాని, హరిసింగ్ నిర్భయంగా తన పోరాటం సాగించాడు. పులి కోరలనుండి తాను తప్పించుకొనడమే కాక, ఆ పులి నోటిని చీల్చి చంపేశాడు.
అతడి అసమానబలశౌర్యాలను ప్రత్యక్షంగా చూసిన రంజిత్ సింగ్ ఆనందాశ్చర్యాలతో అతడిని నల్వా అని పిలిచాడట. (అంటే పంజాలవంటి చేతులు కలిగిన మనిషి అని అర్థమట) అప్పటినుండి అతడిని అందరూ బాఘ్ మార్ హరిసింగ్ నల్వా అని ఎంతో అభిమానంతో పిలిచేవారు.
ఈ ధైర్యసాహసాలను మెచ్చి రంజిత్ సింగ్ అతడిని 800 మంది అశ్వికులు, 800 మంది సైనికులు కలిగిన సైన్యదళానికి సర్దారుగా నియమించాడు. అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన ఎందోమంది సర్దారులు కూడా ఒక బాలుడు సర్దారు కావడమా అని ఎంతమాత్రం అసూయ పడకుండా హర్షించి, తమతో సమానుడని మనఃస్ఫూర్తిగా భావించి అతడిని చేరదీశారు. వారి ఆదరానికి పాత్రుడైన హరిసింగ్ క్రమంగా కాకలు తీరిన యోధునిగా తయారైనాడు.
క్రమంగా వయసుతోపాటు అతని శౌర్యపరాక్రమాలు వర్ధిల్లాయి. గురుగోవిందసింహుని ఆశయసాధనకు కట్టుబడిన రాజా రంజిత్ సింగ్ దేశంలో ప్రజలు ఎక్కడ పీడనకు గురైనా వారిని రక్షించేందుకు గాను తన సైన్యాన్ని అక్కడకు పంపేవాడు. అరివీరభయంకరులైన అతని సర్దారులు అక్కడకు వెళ్లి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, శాంతిభద్రతలను నెలకొల్పేవారు. సుస్థిరమైన పరిపాలనా వ్యవస్థను పాదు కొలిపేవారు.
అటువంటి రాజా రంజిత్ సింగ్ తరపున హరిసింగ్ నల్వా గెలిచిన యుధ్ధాలకు లెక్కే లేదు. వాయవ్యభారతంలో అతడి వీరవిహారానికి ఎదురు లేకుండా పోయింది. బర్నాలా యుద్ధం, కసూర్ యుద్ధం, సియాల్ కోట్ యుద్ధం, జమ్మూ యుద్ధం, అతోక్ యుద్ధం, మహమూద్ కోట్ యుద్ధం, ముల్తాన్ యుద్ధం, సోపియన్ యుద్ధం, మంగళ్ యుద్ధం, మంకేరా యుద్ధం, నౌషేరా యుద్ధం, సిరికోట్ యుద్ధం, సైదూ యుద్ధం, బాలాకోట్ యుద్ధం... ఇలా...
ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్ లో ఇస్లామేతరధర్మవ్యతిరేకి అయిన దోస్త్ మహమ్మద్ ఖాన్ తక్కిన పోటీదారులందరినీ హతమార్చి తనను తాను పాదుషాగా ప్రకటించుకున్నాడు. అతడికి రంజిత్ సింగ్ విజయపరంపర నచ్చలేదు. అయితే రంజిత్ సింగ్ మీదకు దండెత్తి అతనిని ఓడించగలననే ధైర్యం కూడా అతడికి లేదు. అతడే తనపై యుద్ధానికి వచ్చేలా చేసి, జిహాద్ పేరుతో మిగిలిన ఇస్లాం రాజ్యాలనుండి సానుభూతిని, సైన్యసహకారాన్ని పొంది అతడిని ఓడించాలని పన్నాగం పన్నాడు.
అయితే రంజిత్ సింగ్ నిష్కారణంగా అతడిమీదకు ఎందుకు దండయాత్ర చేస్తాడు? అందుకని అతడికి ఆగ్రహం కలిగించాలని అతడు పెషావర్ లోని ఇస్లామేతరధర్మీయులను చిత్రహింసలకు గురి చేయసాగాడు. వారి ఆక్రందనలు, రక్షించండి అనే విన్నపాలు రంజిత్ సింగ్ కు చేరాయి.
వెంటనే పెషావర్ ను దోస్త్ మహమ్మద్ ఖాన్ నుండి స్వాధీనం చేసుకొమ్మని అతడు హరిసింగ్ నల్వాను ఆదేశించాడు. హరిసింగ్ అంతు చూడాలనుకున్న దోస్త్ మహమ్మద్ ఖాన్ చివరకు అతడి పరాక్రమానికి వ్యూహాలకు దిగ్భ్రమ చెంది పెషావర్ ను విడిచి కాబూల్ కు పారిపోయాడు. హరిసింగ్ సునాయాసంగా పెషావర్ ను స్వాధీనం చేసుకున్నాడు.
అంతకు మునుపు తన తరపున కాశ్మీర్ కు, తరువాత హజారాకు గవర్నరుగా చక్కని పరిపాలన అందిచిన హరిసింగ్ ను రాజా రంజిత్ సింగ్ పెషావర్ కు గవర్నరుగా నియమించాడు.
)))(((
ఇదీ జరిగిన కథ. దోస్త్ మహమ్మద్ ఖాన్ కు ఈ పరాభవం కంటిమీద కునుకు పట్టనివ్వలేదు. హరిసింగ్ నల్వా పరాక్రమం గురించి అతడు అంతకు ముందు కేవలం విని ఉన్నాడు. పెషావర్ యుద్ధంలో ప్రత్యక్షంగా చవి చూశాడు. తాను విన్నదాని కంటె అతడు మరింత చండప్రచండుడని అతడికి అర్థమైంది. అతడిని నేరుగా యుద్ధంలో గెలవడం అసాధ్యమని భావించాడు. అందుకే, హరిసింగ్ ను చంపిన జిహాదీకి పదివేల దినారాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. అయితే ఏ ఒక్కరూ ధైర్యం చేసి, ముందుకు రాలేదు. ఏం చేయాలో తెలియని మహమ్మద్ ఖాన్ నీరుగారిపోయాడు.
అయితే ఆ రోజు రాత్రి ఒక సర్దార్ మహమ్మద్ ఖాన్ ను రహస్యంగా కలుసుకున్నాడు.
“హుజూర్, యుద్ధంలో హరిసింగ్ ను గెలవడం సాధ్యం కాదు. అందువలన మరొక ఉపాయం ఆలోచించాను" అన్నాడు.
“ఏమిటది?”
“హుజూర్, మహబ్బత్ జిహాద్ ద్వారా హరిసింగ్ ను చంపవచ్చు.”
“మహబ్బత్ జిహాదా? అదేమిటి?”
“హుజూర్, ప్రేమ వల విసురుదాం. దానికి లొంగనివాడు ఎవడూ ఉండడు. ఒక హూక్ సూరత్ నవ్ జవానీ లడికీని అతని మీదకు ఉసిగొలుపుదాం. అతడు ఆమెను వివాహమైనా ఆడతాడు లేదా చేరదీస్తాడు. అతడు ఆదమరచి ఉన్న సమయంలో ఆమె అతడిని ఖతం చేస్తుంది.”
“సెహబ్బాస్ సెహబ్బాస్, అలాగే చేద్దాం. కానీ, అటువంటి హూక్ సూరత్ నవ్ జవానీ లడికీ ఎక్కడ ఉంది?”
“హుజూర్, ఎవరో కాదు, స్వయంగా నా కూతురే ఉంది. పేరు నూర్.”
దోస్త్ మహమ్మద్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. “సర్దార్, ఇస్లాంకు నువు చేస్తున్న మేలు వల్ల నీకు తప్పకుండా జన్నత్ లభిస్తుంది అంటూ అతడిని పొగిడేశాడు.. అతడికి భారీగా నజరానాలు ఇప్పించి, పని మొదలు పెట్టమన్నాడు.
కనీవినీ ఎరుగనంత మొత్తంలో లభించిన నజరానాలకు మురిసిపోయిన సర్దార్ తన పని మొదలు పెట్టాడు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...