Monday 23 July 2018

పిచ్చుకలు



ఈ పిచ్చుకలకు అద్దాలంటే ఎంత మోజో!

అద్దంలో కనబడేది ముద్దు ముద్దుగా తమ ప్రతిబింబాలలేనని తెలుసుకొని తమను తాము ముద్దుపెట్టుకొనేందుకే అద్దాలను టక టకామంటూ ముక్కులతో పొడుస్తుంటాయనుకుంటాను.

కాదేమో, అద్దంలో కనిపించేది శత్రువు అనుకొని దాన్ని చీల్చి చెండాడాలనే కసితో అద్దాన్ని అలా పొడుస్తుంటాయి అనిపిస్తూ ఉంటుంది ఇంకోసారి. అలా కాదులే, ఈ పిచికలు మరీ బావిలోకి దూకిన సింహమంత మూర్ఖమైనవి కాదు, బొత్తిగా అమాయికప్ప్రాణులు.

సందు కనిపిస్తే చాలు, వాసాల్లో గోడల్లో గూళ్లు కట్టేసి సంతానం కనేస్తాయి. ఏమిటీ గడ్డీ గాదం, రెట్టలూ అని ఏమాత్రం విసుక్కోని పల్లెటూరి జనాలే వీటికి మిత్రులు, రక్షకులు.

ఇంటిముందు కాళ్లు కడుక్కునే బండల ఎగుడుదిగుళ్లలో నిలిచిన నీటిలోనే మునకలేస్తూ రెక్కలతో నీటిని విదిలిస్తూ మొయ్యి కడుకునే శుచిగల ప్రాణులు. మొక్కలకు నీళ్లు పోస్తే అవి భూమిలోనికి ఇంకిపోకముందే ఆత్రంగా వచ్చి ఆ నీటిని గ్రోలే అల్ప ప్రాణులు. ఇంటి ముందర కట్ట మీద కుసోని పిల్లోళ్లు బొరుగులూ పప్పూ బెల్లాలూ తింటూంటే మరి మాకో అన్నట్టు వారి దగ్గరకొచ్చి వారు పెట్టేదంతా నున్నగా ఆరగించే బాల్యమిత్రులు.

ఇవి ఎప్పుడూ పార్లమెంటు సభ్యుల్లాగా గోలగోలగా అరుస్తాయి కాని, వీటి కిచకిచ శబ్దాలు ఆ పార్లమెంటు సభ్యుల అరుపుల్లా విద్వేషపూరితాలు, అసభ్యాలు, అసూయాసహితాలు, అర్థరహితాలు ఎంతమాత్రం కావు. ఇవి వెల్‌లోకి చొరబడి పనికిమాలిన నినాదాలు చేయకుండా కరెంటు తీగలమీద బుద్ధిగా వరుసగా కూర్చుని తమ సంఖ్యాబలాన్ని ప్రదర్శిస్తాయి కూడా. అందుకే ఎక్కడైనా ప్రయోజనరహితమైన ధ్యేయరహితమైన అల్లరి జరిగితే #కాకిగోల అంటారే గాని, పిచ్చికల గోల అని ఎవ్వరూ అనరు.

పల్లెటూరి ఇండ్లలో నిలువుటద్దాలుండగా మనుషులున్నారనే భయం కూడా లేకుండా గుంపులు గుంపులుగా వచ్చి ఆ అద్దాలముందు అవి చేస్తూ ఉండిన రకరకాల విన్యాసాలు నాకు ఆనందకరమైన జ్ఞాపకాలు.

ఏ ఊరిలో పిచ్చుకలు ఉన్నాయో, ఆ వూరిలో ధాన్యసంపదకు కొదవ లేదు అని అర్థం. దేశంలో ప్రతి గ్రామంలోనూ పిచ్చుకలు మందలు మందలుగా ఉండాలని కోరుకుందాం.

వేసవి రాబోతోంది.
ఇంటి బయటనో, మేడ మీదనో ఒక మట్టి పాత్రనో లేదా మరో అల్యూమినియం పాత్రనో పెట్టి ప్రతిరోజూ ఆ పాత్రలో నీళ్లు పోస్తూ ఈ పక్షిజాతుల పట్ల మన మైత్రీభావాన్ని ప్రకటిద్దాం.

పిల్లలు కాకమ్మ పిచికమ్మ కథలను తరతరాలుగా వింటూనే ఉండాలి!

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...