Saturday 28 July 2018

దాతా భవతి వా న వా - 1

(మొదటి భాగం - Part 1)
శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః।
వక్తా దశసహస్రేషు దాతా భవతి వా న వా।।

నూరుగురిలో ఒక శూరుడు పుడతాడు.
వేలమందిలో ఒక పండితుడు పుడతాడు.
పదివేలమందిలో ఒక వక్త పుడతాడు.
కాని దాత అనేవాడు ఒకడు పుడతాడో లేదో!

చూశారా?
సకలశుభలక్షణాలు కలిగినవారు కొందరైనా ఎంతో కొంత మొత్తంలో పుడుతున్నారు కాని దాత మాత్రం పుడతాడో లేడో అంటూ విచారం వ్యక్తం చేశాడో కవి. దాతలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా సప్లై తక్కువగా ఉందని అర్థం కావట్లా పాపం?
దాత అనగానే ఎలాంటి మనిషిని ఊహిస్తాం ?
రోజూ ఓ శుభముహూర్తాన తన ఇంటి ముందు క్యూలో నిలబడిన పేదవాళ్లకు బట్టలు డబ్బులు పంచి, అమ్మా, అయ్యా, అదే చేత్తో మా ఇంట భోజనం చేసి వెళ్లండంటున్న ఓ మధురమందహాసముఖుడిని ఊహిస్తామా?
ఆఫీసులో తన ఏసీ ఛాంబర్లో కూర్చుని, ఎవరో ఆర్గనైజర్లు తన దగ్గరకు వచ్చి, తాము చేయబోతున్న ప్రజోపయోగకరమైన పని ఏదో చెప్పగానే, కన్విన్సైపోయి, వారు ఊహించనంత పెద్ద మొత్తానికి ఓ చెక్కు వ్రాసిచ్చే ఓ గొప్ప వ్యాపారవేత్తను ఊహిస్తామా?
ఊహ ఎలా ఉన్నా, దాత అనగానే, తన దగ్గర తన అవసరానికంటె ఎక్కువ ఉన్న వస్తువులనో లేక ధనాన్నో ఇతరులకు ఇచ్చేవాడని అనుకుంటాం కదా? ఎంత పెద్ద రిజర్వాయరైనా తన కడుపులో ఎన్ని నీళ్లని దాచుకోగలదు? వరద వస్తే వదిలేస్తుంది కదా? వదలకపోతే పగిలిపోతుంది కదా? ప్రాణం లేని రిజర్వాయర్ కు కూడా ఆమాత్రం జ్ఞానముంది కదా?
<><><><><><>
దానాలు ఎన్ని రకాలు?
సాత్త్వికదానం, రాజసికదానం, తామసికదానం అంటూ భగవద్గీత చెబుతుంది. (17-20,21,22)
ప్రతిఫలాపేక్షలేకుండా దేశకాలపాత్రోచితంగా చేసే దానం సాత్త్వికం.
ప్రతిఫలాన్ని ఆశిస్తూనో, బాధతోనో చేసే దానం రాజసం.
దేశకాలపాత్రౌచిత్యాలను ఎరుగకుండా తిరస్కారభావంతో చేసే దానం తామసం.
<><><><><><>

దానం ఎంత శ్రద్ధగా చేయాలో తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది. 
(శిక్షావల్లి-ఏకాదశోऽనువాకః) 
శ్రద్ధయా దేయమ్ = 
ప్రేమపూర్వకంగా, ఆదరపూర్వకంగా, ఆలస్యం చేయకుండా, అవసరాన్ని గుర్తించి చేయాలి.
అశ్రద్ధయాऽదేయమ్ = 
బాధపడుతూ గాని, తిరస్కారభావంతో గాని, ఇవ్వరాదు. 
శ్రియా దేయమ్ = 
తన సంపదకు తగినట్లు ఇవ్వాలి. (సంపదకు మించి దానం చేయడం వద్దు అని కూడా అర్థం)
హ్రియా దేయమ్ = 
సంకోచిస్తూ దానం చేయాలి. (అయ్యో, నేను ఇస్తున్నది ఈయనకు సరిపోతుందో లేదో అని)
భియా దేయమ్ = 
భయంతో ఇవ్వాలి. (నా యజమాని అయిన భగవంతుడు నాకు ఇచ్చినది నేను ఇతరులకు ఇస్తున్నాను. ఇది భగవంతుని కార్యమే కాని, నా పని కాదు, ఇందులో లోపాలుంటే భగవంతునికి కోపం వస్తుందనే భయంతో ఇవ్వాలి)
సంవిదా దేయమ్ = 
స్వీకరించేవాని యోగ్యతకు తగినట్లు చేయాలి.
<><><><><><>
ఐదు కారణాలవల్ల దానాలు జరుగుతాయని వ్యాసమహాభారతం చెబుతుంది.
(అనుశాసనపర్వ-దానధర్మపర్వ- 138.5,6,7,8,9,10)

1 ఇహలోకంలో కీర్తిని పరలోకంలో సుఖాన్ని కోరి చేసే దానాలు. 
2 నేను ఇతని వల్ల మేలు పొందాను అనే కృతఙ్ఞతతోనో, లేదో ఇతని వల్ల నాకు రాబోయే కాలంలో మేలు కలుగుతుందనే భావంతోనో చేయబడే దానాలు.
3 వీనికి ఇవ్వకుంటే నాకు అపకారం చేస్తాడని భయపడి చేసే దానాలు.
4 వీడు నాకు ఆప్తుడు, కావలసినవాడు అని ప్రేమతో చేసే దానాలు. 
5 పాపం వీడు దీనుడు, అభిమానం వదులుకొని యాచిస్తున్నాడు, ఎంత చిన్నమొత్తం ఇచ్చినా దాంతోనే సంతోషపడతాడు అని జాలిపడి చేసే దానాలు.
<><><><><><>
దానాలు చేయడం వల్ల వివిధ పుణ్యలోకాలలో సుఖంగా ఉండవచ్చునని పురాణాలు ఉద్ఘోషిస్తూ ఆశపెట్టడం ఎందుకు - అంటే - దాతలను తయారుచేయడానికే! వాపీకూపతటాకాలయారామాదుల నిర్మాణం చేయించేవాడు కూడా దాతగానే పరిగణింపబడ్డాడు. కరువురోజుల్లో ప్రజలు అల్లలాడిపోతుంటే వారిని కూర్చోబెట్టి పోషించడం కాకుండా, వారితో చెఱువులు బావులను తవ్వించడం, దేవాలయాలను కట్టించడం వంటి పనుల ద్వారా ఆయా శ్రమజీవులకు, ఆయా వృత్తులను నమ్ముకొని బ్రతికేవారికి ఆవిధంగా జీవనభృతి కల్పించడమనేది - నిష్కారణదానంతో సమానమైన పుణ్యకార్యంగా గుర్తించబడింది.

దీన్ని మనం ఆధునికీకరించడానికి a planned social crisis management గా కూడా గుర్తించవచ్చు. అడవుల్లో తినడానికి ఏమీ దొరకనపుడు చిరుతపులులు ఊళ్లమీద పడి గొఱ్ఱెలు, మేకలు, దూడలు, కోళ్లు, కుక్కలను లాక్కుపోతుంటాయి కదా? అలాగే కరువు రోజుల్లో మంచి క్రమశిక్షణ కలిగిన ప్రజలు కూడా, ఆకలిబాధకు తట్టుకోలేక, తెగబడి, దొంగలుగా దోపిడీదార్లుగా మారే అవకాశం ఉంది. దానిని నివారించడానికి ఉత్తమమార్గం - ఆ కరువు రోజుల్లో వారికి పనికి ఆహారం పథకం ద్వారా జీవనోపాధిని చూపడమే. అందువల్ల ధనవంతులకు డబ్బు నష్టమైనా, శాశ్వతమైన కీర్తి లభిస్తుంది కదా!

కాని మన దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కరువునివారణ అనేది కేవలం గవర్నమెంటు చేయవలసిన పనిగా ధనవంతులు తమ బాధ్యతలనుండి తప్పుకుంటున్నారు. కరువు లేనపుడు తమ సంపద పెరగడానికి ఉపయోగపడిన సామాన్యప్రజలు కరువు కాలంలో మోయరాని భారంగా కనపడడం అన్యాయం కదా? అందుకే - దాత అనేవాడు అసలు పుడతాడో లేడో అని ఒక సామాజికస్పృహ కలిగిన కవి వాపోయింది. 
<><><><><><>
సరే, అసలు దానయోగ్యమైనవి ఏమిటి? అంటే -
"కాదేదీ దానానికి అనర్హం" అన్నట్టు చాలానే ఉన్నాయి.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...