Showing posts with label Kurukshetra. Show all posts
Showing posts with label Kurukshetra. Show all posts

Wednesday, 8 August 2018

శాశ్వతం ఏది?

అనగా అనగా...
సృంజయుడు అని ఒకానొక రాజు ఉండేవాడు. అతడు మిక్కిలి వినయవంతుడు. పండితులను, బ్రాహ్మణులను శ్రద్ధగా సేవించుకొనేవాడు.
ఆయన శ్రద్ధకు మెచ్చిన నారదమహర్షులవారు "నాయనా! ఏమి వరం కావాలో కోరుకో" అని అడిగారు.
సృంజయుడు సంబరపడి - "దేవర్షీ, నాకొక కుమారుడు కలగాలి. అతడి మలమూత్రాలు, ఉమ్మి, చెమట కూడా స్వర్ణమయంగా ఉండాలి" అని కోరుకున్నాడు.
నారదమహర్షులవారు "తథాస్తు" అన్నారు.
అనంతరం రాజుకు అటువంటి కుమారుడు కలిగాడు.
రాజుగారి దశ తిరిగిపోయింది.
తన ఇంటిని, ఇంటి గచ్చును, మంచాలను, కంచాలను కూడా బంగారుమయంగా చేసుకున్నాడు.
అతడు చేసే బంగారు దానాలకు అంతులేకుండా పోయింది.
ఆ రాజకుమారుని అందరూ "సువర్ణష్ఠీవి" అని పిలవసాగారు.
ఉన్నట్టుండి ఒకరోజు కొందరు దొంగలు అతనిని ఎత్తుకుపోయారు. బంగారం కోసం అతని శరీరాన్ని చీల్చి చూశారు. ఏ బంగారమూ దొరకలేదు. బంగారమంటి రాజకుమారుడు మాత్రం చచ్చిపోయాడు. తన కొడుకుకు పట్టిన దుర్గతిని చూసి రాజు ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చాడు.
అపుడు నారదమహర్షులవారు అక్కడకు వచ్చారు.
"ఏమయ్యా రాజా! అందరిలాంటి కొడుకును కోరుకున్నావు కాదు, నీ దురాశ వల్లనే నీ కొడుకుకు ఈ దుర్గతి పట్టింది, నీకు శోకం మిగిలింది." అన్నారు.
"డబ్బు శాశ్వతం కాదు,
డబ్బు వలన శాశ్వతత్వం కూడా కలుగదయ్యా!" అన్నారు.
కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.
***
(1)
"మరున్మహారాజు శంకరభగవానుడి దయ వల్ల బంగారు కొండను పొందాడు. దానితో అతడు అనేక యజ్ఞాలు చేసి గొప్ప గొప్ప దానాలు చేశాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ మరున్మహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(2)
"సుహోత్రమహారాజు ఎంతటి వాడంటే అతని పాలనలో మేఘాలు బంగారు వర్షం కురిపించేవి. బంగారు నదులు ప్రవహించేవి. అందులో బంగారు చేపలు బంగారు మొసళ్ళు ఉండేవి. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు ,నీ కొడుకు ఆ సుహోత్రమహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(3)
"శిబిచక్రవర్తి తెలుసా? ఒక పావురాన్ని డేగ బారినుండి కాపాడడం కోసం తన తోడనే కోసి ఇచ్చిన మహానుభావుడు. శివుడు అతని దానశీలానికి మెచ్చి అతనికి తరగని సంపద ఉండేలా అనుగ్రహించాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ శిబిచక్రవర్తి కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(4)
"భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, శ్రీరాముడు, అంబరీషుడు, శశబిందుడు, గయుడు, రంతిదేవుడు, శకుంతలాదుష్యంతుల తనయుడు అయిన భరతుడు, పృథు చక్రవర్తి - వీళ్లందరి గురించి విన్నావా?
వారు చేసిన ఘనకార్యాలను గూర్చి మాత్రమే కాదు,
వారి మహాసంపదను గూర్చి విన్నావా?
అలాగే, వారు తమ ప్రజలకు చేసిన మహోపకారాలను గూర్చి తెలుసుకున్నావా?
వారిని తరతరాలుగా ప్రజలు గుర్తుంచుకుని పొగుడుతున్నారు అని నీకు తెలుసునా?
అయినా వీరెవ్వరూ కూడా శాశ్వతంగా ఉండలేకపోయారు.
నువ్వు, నీ కొడుకు ఆ మహా మహా చక్రవర్తులకంటే పెద్ద గొప్పవాళ్ళా?"
నారదమహర్షులవారి మాటలు విన్నాక సృంజయ మహారాజుకు నోట మాట రాలేదు.
"నేను చెప్పింది అర్థమైందా మహారాజా?" అని రెట్టించి అడిగారు నారదమహర్షులవారు.
"అర్థమైంది దేవర్షీ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అన్నాడు సృంజయమహారాజు.
"చక్కగా గ్రహించావు రాజా!" అన్నారు నారదమహర్షులవారు తృప్తిగా.
***
కురుక్షేత్రంలో అభిమన్యుడు వీరమరణం పొందాక గోలుగోలున ఏడుస్తున్న ధర్మరాజుకు ఈ కథను చెప్పింది వ్యాసమహర్షులవారు. అపుడు ధర్మరాజు కూడా -
"అర్థమైంది తాతగారూ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అని అన్నాడు.
(మహాభారతం - ద్రోణపర్వంలోని కథ ఇది.)
***
ఇలా ఆనాడు తమకు తగని ఆలోచనలు చేసే రాజులకు కొందరు జ్ఞానులైన వారు హితబోధతో పాటు కర్తవ్యోపదేశం చేసేవారు. స్వతః గా వినయవంతులు అయిన ఆ రాజులు వాటిని శిరసా వహించేవారు.
***
ఈనాడు కూడా "మేము శాశ్వతంగా ఉంటాం" అని కలలు కనే రాజులున్నారు. కానీ, "నీ కోరికలు తీరేవి కావు" అంటూ నిక్కచ్చిగా చెప్పగల నారదుడు, వ్యాసుడు వంటి హితబోధకులూ ఎక్కడా లేరు.
హితవు చెప్పబోతే శారీరకంగానో మానసికంగానో దాడి చేసే రాజుగారి అనుచరగణాలకు భయపడి నిశ్శబ్దంగా ఉంటారు. అందువల్ల ఆ రాజులు తమ కోరిక తప్పక నెరవేరుతుందని భ్రమతో ఎటువంటి పనులను చేసేందుకైనా తెగిస్తూ ఉంటారు కూడా.
"మేము ఫలానా ఫలానా వ్యక్తిని సలహాదారుగా నియమించుకున్నాం" అని కొందరి మెప్పు కోసం వోట్ల కోసం అటువంటి రాజులు మభ్యపెడుతూ ఉంటారు. కానీ వారిని ఎన్నడూ సలహా అడిగేదీ ఉండదు, వారికి జీతం ఇచ్చేదీ ఉండదు.
పాపం, ఒక్క పూట దుష్టశక్తుల దృష్టి తగిలిన పాపానికి "రాజుగారి సలహాదారు"లనే మిథ్యాబిరుదును పొంది కొందరు నిర్దోషులు మాత్రం నిందాపాత్రులుగా మిగిలిపోతుంటారు.

Saturday, 28 July 2018

శ్రీకృష్ణుడితో ఇంటర్వ్యూ - 2

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((రెండవ భాగం))

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
ఎందుకు ఉండదూ? ఎలాగో కష్టపడి యుద్ధాన్నంతా ఓ కొలిక్కి తెచ్చామా? దాదాపు దుర్యోధనుడొక్కడే మిగిలిపోయాడు. మడుగులో దాక్కున్నాడు. అతడిని యుక్తిగా ఏదో ఒక రకంగా బయటకు రప్పించాము. ఈలోగా ధర్మరాజు - "ఓయ్ దుర్యోధనా! మా పాండవులు ఐదుగురిలో ఎవరో ఒకరిని ఎంచుకో. వారితో నీకు నచ్చిన ఆయుధంతో యుద్ధం చేసి గెలు చూద్దాం. ఏ ఒక్కర్ని గెలిచినా మొత్తం రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తాను" అనేశాడు. అపుడు నాకు ఎంత కోపం వచ్చిందో!

ప్రశ్న 14
అయినా, దుర్యోధనుడు మంచివాడు, నిజాయితీపరుడు కదా! అందుకే ఏ సహదేవుడినో ఎంచుకుని ఓడించకుండా తనకు తగిన జోడీ అని భీముడిని ఎంచుకున్నాడు! లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది?

కృష్ణుడు:
దుర్యోధనుడికి నిజాయితీనా? ఆ మాత్రం నిజాయితీ ఉంటే పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన వెంటనే వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి ఉండాల్సింది.

సరే, ప్రస్తుతానికి వస్తే, ధర్మరాజు సవాలును స్వీకరించి మీరన్నట్టు ఏ సహదేవుడినో ఎంచుకొని గదతో పడగొట్టి రాజ్యాన్ని సంపాదించేవాడే. కానీ, అతడు అలా చేయకపోవడానికి కారణం నిజాయితీ కాదు, మంచితనం కూడా కాదు, అలా చేస్తే అతడి పిరికితనానికి, కక్కుర్తితనానికి జనాలు నవ్వుకొనేవారు. వెక్కిరించేవారు. అభిమానధనుడని పేరుపొందిన దుర్యోధనుడికి అటువంటి అవహేళన చావుకంటే దుర్భరం. జనాల మాటలు వినలేక గుండెలు పగిలి చచ్చుండేవాడు.

అలాగని అతడు భీముడిని కూడా తన ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. "మీలోనే ఎవరైనా రండి, మీలోనే ఎవరైనా రండి, మట్టి కరిపించేస్తా, సవాల్!" అంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ మాటల్లో ఏ నకులుడో సహదేవుడో రాకపోతారా అనే ఆశ కూడా ఉంది. వారంతట వారే వచ్చి తన చేతిలో చస్తే అది తన తప్పుగా ఎవరూ భావించలేరు కదా? తనకు అటు రాజ్యమూ వస్తుంది, ఇటు అవహేళన చేసేవారు కూడా ఎవరూ ఉండరు అనే దురాశ అతడిది. కానీ పాపం, అతడి ఆశ చెల్లలేదు. అతడు చేసిన సవాలును భీముడే స్వీకరించి ముందుకొచ్చి అతడిని మట్టికరిపించాడు.

ప్రశ్న 15
అసలు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మీరే అని చాలమంది అంటారు?

కృష్ణుడు:
దుర్యోధనుడు భీముడికి విషం పెట్టినపుడు, ఆ భీముడికి కాళ్ళు చేతులు కట్టేసి నీటిలోని తోసి చంపదలచినపుడు నేను చాల చిన్నపిల్లవాడిని.

అప్పటికి నేను ఇంకా యశోదానందుల బిడ్డడిననే అనుకుంటూ ఉన్నాను. అప్పటికి కుంతి మా అత్త అని తెలియదు. పాండవులు మా బావలు అని తెలియదు. మధురానగరిలో రాజకీయాలు కూడా తెలియవు, కంసుడు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా తెలియదు. ఏదో అమాయికంగా ఆవులు కాచుకుంటూ, మిగిలిన పిల్లలతో ఆడుకుంటూ, మా జోలికి వచ్చిన చిన్న చిన్న పాములను కాలితో తొక్కేసి తరిమేస్తూ - ఇలా బయటి ప్రపంచం తెలియకుండా కాలం గడిపేవాడిని. అలాంటి నేను ఆ సమయంలో హస్తినాపురానికి వచ్చి భీముడికి విషం పెట్టమని దుర్యోధనుడికి చెప్పానా?

ఏమయ్యా, ఇది శకునిని అడగవలసిన ప్రశ్న కదా, నన్ను అడుగుతున్నారేమిటి?

ప్రశ్న 16
అలా కాదు, మీరు తలచుకుని ఉంటే అసలు యుద్ధానికి కారణమైన జూదమే జరగకుండా ఆపగలిగి ఉండేవారు కదా?

కృష్ణుడు:
ఆ సమయంలో మా యాదవులమీద కక్షగట్టిన సాళ్వరాజు, సౌభరి అనే విమానాన్ని ఎక్కి వచ్చి ద్వారకమీద దాడి చేశాడు. నేను మా వారితో కలసి వాడితో యుద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ జూదం జరిగింది. లేకుంటే నేను పిలవకున్నా ఈ జూదానికి వచ్చేవాడినే, జూదం జరగకుండా చూసేవాడినే.

ప్రశ్న 17
కాదు, కౌరవులు పాండవులు జూదమాడుతూ ఉండగా మీరు ద్వారకలో 'విన్నావా యశోదమ్మా' అనే ఒక నృత్యరూపకాన్ని చూస్తూ మైమరచి ఉన్నారు కదా?

కృష్ణుడు:
ఏమయ్యా? మాయాబజార్ సినిమాకు నువ్వు వీరాభిమానివిలా ఉన్నావే? మాయాబజార్ ఒక కల్పితకథ. అసలు మా అన్న బలరామునికి శశిరేఖ అనే కూతురే లేదు. పాండవుల వనవాసకాలంలో సుభద్రాభిమన్యులు పూర్తిగా
ద్వారకలోనే నివసించారు. దేవకాంత, అతిసౌమ్యురాలూ అయిన మా వదిన రేవతిగారిని తుచ్ఛమైన డబ్బుకు ఆశపడే సామాన్యస్త్రీగా చిత్రీకరించారే? సరే, లోకం ఇలా ఉంటుంది సుమా అని జానపదులకు అర్థమయేలా చెప్పేందుకు ఈరకమైన సినిమా తీశారులే అని జాలిపడి మేము ఊరుకున్నాము.

ప్రశ్న 18
కానీ, మీరు ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ, ద్రౌపదికి పరాభవం కలుగకుండా కాపాడారు కదా? అంత చేసిన వారు అదే చేత్తో దూరం నుండే జూదాన్ని ఎందుకు ఆపలేకపోయారు?

కృష్ణుడు:
ఎందుకు ఆపలేదు? ధృతరాష్ట్రుడి మనసులో భయం పుట్టించాను. ద్రౌపదికి వరాలు ఇచ్చే మిషతో జూదంలో పాండవులు ఓడిపోయినదంతా తిరిగి వారికి ఇప్పించాను. అంతా సవ్యంగానే ఉండింది.

ఈలోగా రెండోసారి కూడా జూదానికి పిలుపు వచ్చింది. ధర్మరాజు తగుదునమ్మా అని మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి పన్నెండేళ్ల వనవాసము, ఒక యేడు అజ్ఞాతవాసము అనే నియమంతో మళ్ళీ పందెంలో ఓడిపోయాడు.

ఇలా ఎన్ని సార్లు భక్తులను దేవుడు కాపాడాలి? కష్టం అనుభవిస్తేనే గాని సుఖం విలువ తెలియదు. అందుకని రెండోసారి నేను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా రెండో సారి కూడా అడ్డం తగిలి ఉంటే "తప్పులు చేసిన ప్రతిసారీ దేవుడొచ్చి కాపాడతాడు" అనే మానసికదౌర్బల్యం జనాలందరికీ కలిగేది. అది ప్రమాదకరం. "అసలు తప్పులే చేయకుండా ఉండాలి" అనే ఆదర్శం ప్రచారం కావాలి. అందుకే రెండో సారి ఊరుకున్నాను.

ప్రశ్న 19
కానీ మీకు తరువాతనైనా పాండవులను గట్టెక్కించే శ్రమ తప్పలేదు కదా?

కృష్ణుడు:
నిజమే. కానీ, ఎంత శక్తిమంతులు అయినా పొరపాట్లు చేస్తే కష్టపడవలసి ఉంటుంది సుమా అనే భయం అందరికీ ఉండాలంటే ఆ మాత్రం శ్రమ పడక తప్పదు.

ప్రశ్న 20
కానీ, మీరు ఆనాడు అలా ఊరుకొనడం వల్లనే కదా, యుద్ధం సంభవించింది?

కృష్ణుడు:
దీనికి నేను ముందే సమాధానం చెప్పాను. క్షత్రియుడు కోరుకునేది ఇటువంటి మరణాన్నే. తెలిసి కూడా అధర్మంవైపు నిలబడిన వారు మరణించారు. ధర్మం కోసం ప్రాణాలర్పించినవారు ధన్యులయ్యారు.

ప్రశ్న 21
క్షత్రియులు అలా మరణిస్తే మంచిదని మీరంటున్నారు. కాని, ఆ మరణించిన వీరుల కుటుంబాలలో ఎంతటి సంక్షోభం కలిగి ఉంటుందో కదా!

కృష్ణుడు:
మీ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ఈ విషయం దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి. ఆవు వ్యాసంలాగా. (నవ్వులు) అసలు భగవద్గీతలో అర్జునుడి విషాదం కూడా ఇదే కదా!

క్షత్రియులు అంటేనే ప్రాణాలకు తెగించి ఉండే జాతి అని ఇంతకు ముందే చెప్పాను. అసలు ఏ వృత్తికి చెందినవాడైనా, ఇంటి బయటకు వెళ్లినవాడు మరలా ఇంటికి క్షేమంగా తిరిగి రాగలడని ఎవరైనా హామీ ఇవ్వగలరా? క్షత్రియవృత్తిని అవలంబించిన వారిలో ఈ ప్రమాదశాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వారు చిన్నతనం నుండి ఆ సంక్షోభానికి సిద్ధపడి బ్రతికేలా మానసికమైన సన్నద్ధత ఉంటుంది.

నాటి సమాజం నేటి సమాజం వంటిది కాదు, వారి కుటుంబానికి మంచి గౌరవమర్యాదలు ఉంటాయి. ఆ యోధుల కుటుంబాలకు రాజుల అండదండలు ఉంటాయి. వారికి ఆర్థికసంక్షోభం ఉండే సమస్య లేదు. అయితే మనిషి లేకపోవడం అనే కొరతను ఎవరూ తీర్చలేరు. కానీ, క్షత్రియజాతికి గుండెనిబ్బరం జన్మతః సిద్ధిస్తుంది.

సుఖదుఃఖాలు శాశ్వతాలు కావు. "ధర్మ ఏకో హి నిశ్చలః." ధర్మం ఒకటే శాశ్వతమైనది. కాబట్టి, నేటి మనుషులను, నేటి సమాజాన్ని చూసిన కళ్ళతో నాటి మనుషులను, నాటి సమాజాన్ని అంచనా వేయకండి. మళ్ళీ ఇటువంటి ప్రశ్నను వేస్తే మీదగ్గర అడగడానికి మరే ప్రశ్నలూ లేవనుకుని ఇంటర్వ్యూ ను ఇంతటితో ముగిద్దాము.

ప్రశ్న 22
స్వామీ, స్వామీ, కోప్పడకండి. మరో రెండు మూడు ప్రశ్నలున్నాయి.
మరి యుద్ధంలో అబద్ధమాడమని మీరు ధర్మరాజుకు చెప్పారా లేదా? అది తప్పు కాదా? గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టమని భీముడికి చెప్పారా లేదా? అది తప్పు కదా?

కృష్ణుడు:
అవునయ్యా. అవును ధర్మరాజుకు, భీముడికి నేను అలా చెప్పిన మాట నిజమే. అసలు నా అవతారరహస్యాలలో అది ఒకటి.

కలియుగంలో దురాచారులెందరెందరో భారతానికి వస్తారు. వారు చేసే ప్రతి వెధవ పనిని కప్పిపుచ్చుకుంటూ భారతీయులు చేసే ప్రతిపనినీ తప్పు పడుతూ ఉంటారు. వారు చంపితే వీరత్వం అంటారు. వారికి ఎదురుతిరిగి భారతీయులు చంపితే క్రూరత్వం అంటారు. ఈరకంగా వారు తప్పు చేస్తే ఆనాటి అవసరం అలా చేయించింది అంటారు. భారతీయులు తప్పనిసరై అలా చేయబోతే నానా యాగీ చేస్తారు. భారతీయులు ఏమి చేయాలో తెలియని ధర్మసంకటంలో ఇరుక్కుని నిస్సహాయులౌతారు. వారికి నేను కర్తవ్యం బోధించదలచాను.

మాయాచారో మాయయా బాధితవ్యః.
సాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః..

మాయగాళ్లని మాయతోనే కొట్టాలి.
మంచివారితో మంచిగానే వ్యవహరించాలి.

ఇలా స్వయంగా నేను చెప్పినప్పటికీ నిజంగా అలా మాయ చేసి దెబ్బ కొట్టవచ్చునా అని వెనుకంజ వేస్తూ పిరికివాళ్ళనిపించుకొనేంత వెర్రి వాజమ్మలు కలియుగభారతీయులు. అందుకే వారికి ఆదర్శంగా స్వయంగా నేనే కురుక్షేత్రయుద్ధంలో అలా చేసి చూపించవలసి వచ్చింది. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అబద్ధమాడినా పరవాలేదు. నియమం తప్పినా పరవాలేదు. అటువంటి సందర్భాలలో తప్పొప్పులు ఏమి చేసినా నాకు వదిలిపెట్టండి, కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి అని చెప్పదలిచాను.

ప్రశ్న 23
ధన్యులం స్వామీ, ధన్యులం. మీ ఉపదేశాన్ని భారతీయులందరూ సక్రమంగా గ్రహిస్తే వారికి ఇక తిరుగు ఉండదు. కాని, మీకు పక్షపాతం దేనికి స్వామీ, ఒకవైపు "సర్వత్ర సమదర్శనః" అంటారు. కానీ అంత గొప్ప భగవద్గీతను అర్జునుడికి మాత్రమే బోధించారు.

కృష్ణుడు:
అయ్యో పిచ్చోడా, నేను వేరు, అర్జునుడు వేరు అనుకుంటున్నావా?

यो2हं तमर्जुनं विद्धि, यो2र्जुनः सोहमेव तु।
నేనెవరిననుకుంటున్నావో ఆ నన్ను అర్జునుడనే తెలుసుకో.
ఇతడు అర్జునుడు అని ఎవరిని గూర్చి అనుకుంటున్నావో అతడు నేనేనని తెలుసుకో.

భగవద్గీతను నాకు నేనే బోధించుకున్నా. అది నా ఆత్మప్రబోధం.

ప్రశ్న 24
శ్రీకృష్ణా, నమో నమః. నమో నమః. పరమానందం. పరమానందం.
కానీ, మేము మీరన్నట్టే సామాన్యులం కదా స్వామీ, మీరు ఆ భగవద్గీతను దుర్యోధనుడికి చెప్పి ఉంటే యుద్ధం ఉండేది కాదేమోనని మా ఆశ.

"भक्तो2सि मे सखा चेति रहस्यम् एतदुत्तमम्"

అంటూ అర్జునుడికి మాత్రమే చెప్పారు కదా.

కృష్ణుడు:
(నవ్వులు) ఏమయ్యా తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా?

రాయబారానికి వెళ్ళినపుడు నేను మంచి మాటలు చెప్పనే లేదంటావా? దుర్యోధనుడు కాస్త ఓపికగా విని ఉంటే ఆ భగవద్గీతను అప్పుడే చెప్పి ఉండేవాడినేమో? కానీ, నా మాటలు వినే ఓపిక ఆయనకెక్కడిది? ఆయన నా మాటలు వినకుండా తన మిత్రుల మాటలు విన్నాడు. నన్నే బంధించే ప్రయత్నం చేశాడు.

అప్పుడు కూడా సభామధ్యంలో నా విశ్వరూపం ప్రదర్శించాను. భయపడ్డాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత నన్ను ఇంద్రజాలం చేసే గారడీ వాడినంటూ హేళన చేశాడు.

"యద్భావం తద్భవతి" అని వినలేదా?
"యే యథా మామ్ ప్రపద్యన్తే తాన్ తథైవ భజామ్యహమ్"
(భగవద్గీత 4.11)

నన్ను గూర్చి ఎవరు ఏమనుకుంటే నేను వారికి అలాగే కనిపిస్తాను. అనిపిస్తాను. నువ్వేమనుకుంటావో నీ యిష్టం.

ప్రశ్న 25
స్వామీ, మీ మాటలు నాకు అయోమయం కలిగిస్తున్నాయి. ఒకవైపు అన్నీ చేసే భగవంతుడిని నేనే అంటారు. మరో వైపు నీ భావన ఎలా ఉందో అలాగే జరుగుతుంది అంటారు.  అందుకనే అర్జునుడిలా నేను నిన్ను అదే విధంగా ఆశ్రయిస్తున్నాను.

కార్పణ్యదోషోప హతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః.
యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్.

కృష్ణుడు:
ఇది ప్రశ్నలా లేదే?

*****
ఉపసంహారం:
******
అలా ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ చేసేటపుడు ఎదుట ఉన్నవారు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయితే అతడిని అయోమయంలో పడేస్తూ అతడి చేత వివాదాస్పదవ్యాఖ్యలు చేయిస్తూ అతడికి తెలియకుండా అతడి మాటల మీద ప్రజాభిప్రాయం కోరుతూ, రాచి రంపాన పెట్టడమే ఇంటర్వ్యూ అని కదా ఈరోజుల్లో భావం?

కానీ, అలా చేస్తూ చేస్తూ అతని మాటలు బలేగా నచ్చేసి అతనికి భక్తుడైపోయి నువ్వే నాకు దిక్కంటే ఆ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పటికీ కట్ చెప్పాల్సిందే కదా?

అలా నేను చేస్తున్న/చేసిన ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోవలసి వచ్చిందన్న మాట. అయినప్పటికీ ఆయననుండి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను రాబట్టాననే భావిస్తున్నాను.

ఈ ఇంటర్వ్యూ చదివినవారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ నిశ్చితమైన శ్రేయస్సు కలుగుగాక!

ఇంటర్వ్యూ రెండవ భాగం కూడా శ్రీకృష్ణార్పణమస్తు.

శ్రీకృష్ణునితో ఇంటర్వ్యూ 1

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((మొదటి భాగం)) 

ప్రస్తావన:
అరిందమనుడి బుఱ్ఱ నిండా ప్రశ్నలే ప్రశ్నలు. 
ఒకోసారి అర్ధరాత్రి పూట కూడా నిద్రనుండి లేపి మరీ ప్రశ్నలు వేస్తుంటాడు. వాడికి అందరు దేవుళ్లకంటే కృష్ణుడంటేనే ఎక్కువ ఇష్టం. రేపటి దినాన కృష్ణాష్టమికి హరే రామ హరే కృష్ణ గుడికి పోదాం అని చెబుతూ చెబుతూ వాడు నన్ను నిన్న సాయంత్రం అడిగిన ప్రశ్న ఇదీ -

"అప్పన్నా, కృష్ణుడికి ఎవరంటే అందరికంటే ఇష్టం?"

వెంటనే సమాధానం చెప్పాను: "అర్జునుడంటే ఇష్టం."

"మరి".. అని మొదలుపెట్టాడు వాడు. (పాచికలు జూదం అనే పదాలు వాడికి ఇంకా అలవాటు పడలేదు. చేతితో వాటిని వేస్తున్నట్టు అభినయిస్తూ) "ఇలా ఇలా వేసి ఆడుతాడే... వాడు ఇష్టమని ఆ సినిమాలో చెప్పాడు కదా?" అని అడిగాడు.

మాయాబజార్ సినిమాలో శకుని ఇష్టమని చెప్పించిన విషయం గూర్చి అడుగుతున్నాడని కాసేపటికి అర్థమైంది.

"సినిమాలో తీసి చూపించేవన్నీ నిజం కావు" అని చెప్పాను. ఈలోగా వాడి నేస్తం ఎవడో పిలిచేసరికి ఆడుకోవాలంటూ పారిపోయాడు.

లాభం లేదు,
కొన్ని కొన్ని విషయాలు నేరుగా కృష్ణుడినే అడిగి కన్ ఫామ్ చేసుకోవాలని నిశ్చయించుకుని

"కృష్ణా ఇంటర్వ్యూ ఇస్తావా" అని అడిగాను.

ఓ వైపు ప్రపంచమంతా ఈరోజు ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నా, నా కోరికను మన్నించి ఆయన "సరే" అని అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూ ను ఈ రోజు మీముందుకు తేగలిగాను.

***
ఇంటర్వ్యూ మొదలు:
***

ప్రశ్న 1
స్వామీ, కృష్ణా, మీకు సూటిగా ఒక ప్రశ్న. మీకు అందరికంటే ఎవరు ఇష్టం?

కృష్ణుడు:
నువ్వే చెప్పావు గదయ్యా అరిందమనుడికి. మళ్ళీ సందేహం ఎందుకు? నాకు అర్జునుడంటేనే అందరికంటే ఇష్టం.

ప్రశ్న 2
అర్జునుడిలో ఏమి చూసి అంతగా ఇష్టపడ్డారు?

కృష్ణుడు:
అర్జునుడిలో ఉండే సుగుణాలు ఒకటా రెండా?

అర్జునుడి ఆత్మవిశ్వాసం మొదటి కారణం. "నేను కోరిన గురుదక్షిణ ఎవరు ఇస్తారు?" అని గురువు అడిగితే చిన్నతనంకొద్దీ మిగిలిన రాజకుమారులు అందరూ అదేమిటో అని భయపడిన క్షణాన అర్జునుడు ఒక్కడే "నేనిస్తాను" అని ధైర్యంగా చేయి ఎత్తాడు.

క్షత్రియుడిగా పరాక్రమవంతుడు కావడం తన లక్ష్యంగా భావించి అందుకు అహర్నిశలు శ్రమించే అతడి దీక్ష అనితరసాధ్యం. చిన్నతనంలో రాత్రులు చీకట్లో కూడా బాణాలు వేస్తూ అభ్యాసం చేసినా, గొప్ప తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించినా అతడికతడే సాటి.

మహా ప్రతాపవంతుడిని అనే గర్వం మనసులో లేకుండా తన చేత ఓడిన వారి పట్ల కూడా అతడు ప్రదర్శించే సౌమ్యత చాలదూ అతడిని మహానుభావుడు అనడానికి? ఆ మాటలకు ముగ్ధుడైపోయి కాదూ, ద్రుపదుడు అర్జునుడికి ఇవ్వడానికి తనకో కూతురు ఉంటే బాగుండుననుకున్నది?

విజయం సాధించాక ఒళ్ళు మరచి విశృంఖలంగా ప్రవర్తించేవారిని చూస్తాం కానీ, అటువంటి ఆనందంలో కూడా సదాచారాన్ని మరువని అతడి నడవడికను పొగడకుండా ఎలా ఉండగలం? "అర్జునా! ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నావు కాబట్టి, ఆమెను నువ్వు పెళ్లాడు” అని ధర్మరాజు అంటే, ఎగిరి గంతేసి పెళ్లి చేసుకోకుండా, "అన్నా, నాకంటే పెద్దవారు మీరు భీమన్న ఉన్నారు కదా, మీ ఇద్దరికీ అయిన తరువాతే నా పెళ్లి" అని చెప్పడం అందరికీ సాధ్యమా? చివరకు తల్లి అయిన కుంతి మాటపై ద్రౌపదిని అన్నదమ్ములందరూ పెళ్ళాడడం వేరే విషయం.

ప్రపంచం తల్లక్రిందులైనా ఒక నియమానికి కట్టుబడి ఉండటం అతనిలో తప్ప వేరెవరిలో చూడగలం? మిగిలిన పాండవులందరూ ఇంద్రప్రస్థంలో హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ ఉండగా నియమానికి స్వచ్ఛందంగా కట్టుబడి అతడు పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేయడం సామాన్యమైన విషయమా?

అర్జునుడికి ఉన్నంతటి ఆత్మనిగ్రహశక్తి వేరెవరికీ లేదు. అంతటి అప్సరస, సాక్షాత్తు ఊర్వశి అతడిపై మరులుగొని వస్తే, "అమ్మా నీవు నాకు తల్లివంటి దానివి" అని పాదాభివందనం చేశాడు కదా?

ఇలా ఇంకా ఇంకా చాలా చెప్పగలను. కానీ ప్రస్తుతానికి ఇవి చాలు.

ప్రశ్న 3
మరి అర్జునుడు అంతటి గుణవంతుడే అయితే - తన గురువు గారైన ద్రోణుడికి ద్రుపదుడు శత్రువు కదా? అటువంటి ఆయన కూతురును పెళ్ళాడి ఎందుకు అతనికి ఎందుకు బంధువు అయ్యాడు?

కృష్ణుడు:
ద్రోణుడు ద్రుపదునితో సంధి కుదుర్చుకున్నాడు కదా. ద్రుపదుడికి దక్షిణపాంచాలరాజ్యం ఇచ్చి, ఉత్తరాన ఉన్న అహిచ్ఛత్రనగరం తన స్వాధీనంలో ఉండేట్టు ఒప్పందం చేసుకున్నారు కదా? ఇక శత్రుత్వం లేదని ద్రోణుడే స్వయంగా ద్రుపదుడితో అన్నాడు కదా? ద్రుపదుడితో బంధుత్వం పెట్టుకుంటే అతడి మనసులో తన గురువుపై ఉన్న ఏ కొద్ది ద్వేషమైనా సమసిపోతుందని భావించాడు. తప్పేముంది?

ప్రశ్న 4
మరి అర్జునుడు గురువుగారి మీదనే బాణాలు వేసిన మాట అబద్ధమా?

కృష్ణుడు:
మీలాంటి వారు భవిష్యత్తులో ఇలా ఆక్షేపిస్తారనే కాబోలు, సభలో పెద్దలందరి ఎదుటా ద్రోణుడు అర్జునుడిని ఒక ప్రత్యేకమైన గురుదక్షిణ కోరాడు. యుద్ధరంగంలో స్వయంగా గురువైన తానే ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా యుద్ధం చేయమని అడిగాడు.

आचार्यदक्षिणां देहि ज्ञातिग्रामस्य पश्यतः।
युद्धे2हं प्रतियोद्धव्यो युध्यमानस्त्वयानघ।।
(మహాభారతం.1.138.13&14)

అందుకని అర్జునుడు గురువుగారిమీద బాణాలు వేసి గురుదక్షిణ చెల్లించవలసి వచ్చింది. సరేనా?

ప్రశ్న 5
మరి తాతగారైన భీష్ముడిమీద బాణాలు వేయడం తప్పు కాదా?

కృష్ణుడు:
అయ్యా, మీరు మామూలు మనుషులు. అందువల్ల మామూలుగానే ఆలోచిస్తున్నారు. కాని, భీష్ముడు అర్జునుడు క్షత్రియులు. వారికి సంబంధించి యుద్ధం అనేది పెళ్ళివంటి శుభకార్యం. బాణాలు తగిలి పడిపోయిన భీష్ముడు తన వద్దకు దుర్యోధనుడు పంపగా వచ్చిన శస్త్రవైద్యులను వద్దని రాజులందరితోనూ ఏమన్నాడో తెలుసునా?

"క్షత్రియుడు మంచాన పడి రోగాలతో చనిపోవడం అనుచితం. యుద్ధరంగాన అస్త్రవిద్ధుడై చనిపోవడమే క్షత్రియునికి అత్యుత్తమమరణం".

అలా అర్జునుడు తన తాతగారి కోరికను నెరవేర్చినవాడయ్యాడు సుమా.

ప్రశ్న 6
పక్షపాతం లేకుండా చెప్పండి - కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా?

కృష్ణుడు:
వారిద్దరినీ పోల్చి చూడాలనే బుద్ధి జనాలకు ఎందుకు పుట్టింది? వారిద్దరూ యుద్ధంలో పరస్పర ప్రత్యర్థులు కాబట్టి. కాబట్టి, గెలిచినవాడే గొప్ప. అర్జునుడు కర్ణుడిని ఉత్తరగోగ్రహణసమయంలో ఓడించాడు. రెండోసారి నేరుగా కురుక్షేత్రంలో ఓడించాడు.

అసలు అర్జునుడిదాకా ఎందుకు? కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు. సాత్యకి చేతిలో ఓడిపోయాడు. కానీ, వారందరూ "ఈ కర్ణుడు అర్జునుడిచేతిలోనే చావాలి తప్ప మా చేతిలో కాదు" అని వదిలేయబట్టి బ్రతికిపోయాడు.

అటువంటి మొహమాటాలేమీ లేని ఘటోత్కచుడు దాదాపు కర్ణుని చంపేసేవాడే.
అందుకని ఆ ఆపత్సమయంలో కర్ణుడు అర్జునుడిని చంపడం కోసం దాచుకున్న ఇంద్రుడిచ్చిన మహాశక్తిని ఘటోత్కచుడిపై విసిరేసి మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బ్రతికి బయటపడ్డాడు.

ప్రశ్న 7
కానీ, ఇంద్రుడు కర్ణుని కవచం లాగేసి శక్తిహీనుణ్ణి చేసేసిన తరువాత కదా, వీరందరి చేతిలో కర్ణుడు ఓడింది?

కృష్ణుడు:
సరే, కాసేపు అలాగే అనుకుందాం.

కానీ, ఘోషయాత్ర సమయంలో కర్ణుడు అర్జునుని శిష్యుడైన చిత్రసేనుని చేతిలో చిత్తుగా ఓడిపోయి జాడ కూడా తెలియకుండా పారిపోయాడు కదా. దానికేమంటారు?

ఈ కర్ణుడు తన నూత్న యౌవనసమయంలోనే తనతో ద్వంద్వయుద్ధం చేయమని అర్జునుడిని సవాలు చేశాడు కదా, కానీ, ఆ మరుసటి రోజే దుర్యోధనుడితోనూ, మిగిలిన కౌరవులతోనూ కలసి ద్రుపదుడి మీద యుద్ధానికి పోయి చిత్తుగా తన్నులు తిని పారిపోలేదా?

ఈ రెండు సందర్భాలలోనూ అతడి ఒంటి మీద సహజకవచకుండలాలు ఉన్నాయి కదా? అవి ఉండడం వల్ల అతడు ఏమాత్రం గెలిచాడేమిటి?

ప్రశ్న 8
మరి కర్ణుడికి గురుశాపం ఉంది కదా?

కృష్ణుడు:
అది అతడు చేతులారా చేసుకున్న పని. దానికి ఎవడు ఏం చేయగలడు? ఈ విషయంలో అర్జునుడికి ఏమి సంబంధం ఉంది? అర్జునుడు స్వయంగా పరశురాముడి చెంతకు వెళ్లి "అయ్యా, దయచేసి కర్ణుడికి శాపం ఇవ్వండి" అని కోరి ఉంటే మీరు తప్పు పట్టవచ్చు.

"సచిన్ టెండూల్కర్ రన్ అవుట్ కాకుండా ఉంటే అతడు సెంచరీ చేసేవాడు, మ్యాచ్ గెలిపించేవాడు" అని మీరు బాధపడితే ఎంత అసంబద్ధమో, ఇపుడు ఈ గురుశాపప్రస్తావన వంటివి అంతే అసంబద్ధం.

ప్రశ్న 9
యుద్ధంలో రథం క్రుంగి పోయి నేల మీద ఉన్న కర్ణుడి మీదకు బాణం వేయమని మీరు అర్జునుడిని ప్రోత్సహించలేదా? అది ధర్మమేనా?

కృష్ణుడు:
ఇప్పుడు మీరే కాదు, సాక్షాత్తు కర్ణుడు కూడా నన్ను ఆ సమయంలో ఇదే మాట అడిగాడు. అపుడు నేను కూడా ఆ కర్ణుడిని అడిగాను -

ఏమయ్యా కర్ణా? "పాండవులు వానవాసాన్ని అజ్ఞాతవాసాన్ని నియమం ప్రకారం ముగించారు కాబట్టి, వారి రాజ్యం వారికి ఇచ్చేయడం ధర్మం" అని నువు దుర్యోధనుడికి ఆ సమయంలో ధర్మాన్ని ఎందుకు గుర్తు చేయలేదు?

భీముడికి విషం పెట్టినపుడు అది అధర్మం అని నీ మిత్రుడికి ఎందుకు చెప్పలేదు?

పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చివేసే ప్రయత్నం అధర్మం అని ఎందుకు చెప్పలేదు?

ద్రౌపదిని నిండుసభలో దుశ్శాసనుడు, మీ ప్రాణమిత్రుడైన దుర్యోధనుడు పరాభవించినపుడు, నువ్వు ఆనందంతో కేరింతలు కొట్టినప్పుడు ఈ ధర్మం ఎందుకు గుర్తుకురాలేదు?

అభిమన్యుడు ఒంటరిగా యుద్ధం చేస్తూ నీలాగే నేలమీద ఉన్నపుడు, అయ్యో అతడు బాలుడు కదా, నిరాయుధుడై ఉన్నాడు కదా అనే కనికరం కూడా లేకుండా ఆరుగురు అతిరథులు అతడిపై విరుచుకుపడి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా?  ఆ ఆరుగురిలో నువ్వు కూడా ఒకడివి కదా? ఆ సమయంలో అది అధర్మం అని ఎందుకు గుర్తుకు రాలేదు తమరికి?" అని అడిగాను.

ఆవిధంగా నేనడిగిన ప్రశ్నలలో కర్ణుడు ఏ ఒక్కదానికైనా సరైన సమాధానం చెప్పి ఉంటే, "అర్జునా! కాసేపు ఆగు, కర్ణుడు యుద్ధానికి సిద్ధమైన తరువాత బాణాలు వేద్దువు గాని" అని అర్జునుడిని ఆపి ఉండేవాడిని. మీకు ఈ ప్రశ్న వేసే శ్రమ తప్పి ఉండేది.

ప్రశ్న 10
శల్యుడు కర్ణుడిని నిరుత్సాహపరిచాడు కదా?

కృష్ణుడు:
అసలు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వస్తున్న శల్యుడిని మాయలతో వశపరచుకుని తన పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పించుకున్న దుర్యోధనుడిని అడగండి ఈ మాట. శత్రువు వేలుతో శత్రువు కంటినే పొడవాలని దుర్యోధనుడు అలాంటి ఎత్తు వేశాడు. అదే యుక్తిని ధర్మరాజు అమలు పరిస్తే తప్పు పడతారెందుకు?

ప్రశ్న 11
మీరు కూడా కర్ణుడిని పాండవపక్షానికి రప్పించేందుకు ప్రయత్నించారు కదా?

కృష్ణుడు:
కర్ణుడు పాండవపక్షంలో చేరి ఉంటే యుద్ధం జరుగదు కదా అనే ఆశతో అలా చేశాను. అయినా, ప్రయత్నించడంలో తప్పేమిటి? దుర్యోధనుడు ఏకంగా నన్నే తన పక్షాన యుద్ధం చేయమని కోరేందుకు రాలేదా?

ప్రశ్న 12
అలా ప్రయత్నించినపుడు ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని ఆశ పెట్టారట కదా?

కృష్ణుడు:
ఎవరు అలా చెప్పిన నీచుడు? మీ తెలుగువాళ్లు పరమచెత్త సినిమాలు తీసి అందులో నా పాత్రధారి చేత అటువంటి నీచపు మాటలు పలికించారని విన్నాను. నిజానికి కర్ణుడు పాండవుల పక్షానికి వస్తే అతడు రాజు అవుతాడని 
నేను చెప్పానే కానీ, ద్రౌపది గురించి అలా మాట్లాడే అధికారం నాకెక్కడిది? ఆ సమయంలో జరిగింది జూదమూ కాదు, ద్రౌపదిని తాకట్టు పెట్టేందుకు నేను ధర్మరాజునూ కాదు.

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
(అందుకు సమాధానంగా ఏమని ఉంటాడు ఊహించగలరా? ఇంకా కృష్ణుని ఎలాగైనా ఇరికిద్దామని, ఎన్నో సందేహాస్పదమైన విషయాలకు ఆయన నోటిమీదుగానే సమాధానాలను రాబడదామని ప్రయత్నించాను. ఆ మిగిలిన ఇంటర్వ్యూ ను ఈరోజే రెండో భాగంలో చదవండి)

ఇంటర్వ్యూ మొదటి భాగం శ్రీకృష్ణార్పణమస్తు.

కులము - పౌరుషము


తన కుమారుడు యుద్ధరంగంలో చనిపోయాడని మాట యుధిష్ఠిరుని నోట విన్నవెంటనే ద్రోణాచార్యులకు జీవితేచ్ఛ పోయింది. యుద్ధమధ్యంలో శస్త్రత్యాగం చేసి యోగాసనంలో కూర్చున్నాడు. ఇదే అదనుగా భావించి ధృష్టద్యుమ్నుడు ఆయన రథం మీదకు కుప్పించి దూకి అతని శిరోజాలను పట్టుకుని ఒక్క కత్తివేటుతో తలను మొండెం నుండి వేరు చేశాడు.

పాండవకౌరవపక్షాలు రెండూ ఈ చర్యను చూసి దిగ్భ్రాంతి చెందాయి. ఆచార్యుని మరణానికి ఎంతో ఖేదం చెందాయి. ఒక్క కర్ణుడే మిగిలిన అందరికంటె భిన్నంగా ఆలోచించాడు. 

"నా మిత్రుడైన దుర్యోధనుడు ఎంతో నమ్మకంతో ఈ ద్రోణాచార్యుని తన సమస్తసైన్యానికి నాయకుడిగా నియమిస్తే అతడు తన మహారాజుకు విజయం కలిగేలా యుద్ధం చేయవలసింది పోయి, తన కొడుకు చనిపోయాడనేసరికి యుద్ధం మానేసి చేతులారా చావు కొనితెచ్చుకున్నాడు. ఈ విధంగా అతడు స్వామిద్రోహి" అని అతడు మనసారా నమ్మాడు. 

మరోవైపు ఆ ఘోరం జరిగిన సమయానికి అక్కడ లేని అశ్వత్థామకు ఈ విషయం తెలిసింది. ప్రాణప్రదుడైన తండ్రిని కోల్పోయిన తీరని దుఃఖం ఒకవైపు, తండ్రిని అన్యాయంగా చంపిన ఆ దుర్మార్గుడైన ధృష్టద్యుమ్నుని మట్టుపెట్టాలన్న తీవ్రప్రతీకారేచ్ఛ మరొకవైపు. తన తండ్రి గారు అవమానకరమైన రీతిలో మరణించడానికి కారణమైన పాండవ మత్స్య పాంచాల మాగధాది క్షత్రియాపసదుల పాలిటి పరశురాముడయ్యేందుకు పరమ క్రోధంతో ఉద్యుక్తుడయ్యాడు. 

అటువంటి తన మేనల్లునికి దుర్యోధనుడు కౌరవసేనాధిపత్యం ప్రసాదించగలడని కృపాచార్యులు ఆశించారు. కానీ, భీష్మద్రోణుల తరువాత కౌరవసేనాధిపత్యానికి మరొక పోటీదారుడు కర్ణుడు ఉన్నాడు. 

అతడు మహారాజైన దుర్యోధనుడికి ప్రియమిత్రుడు. పైగా రాజసమక్షంలో ద్రోణాచార్యుని మీద లేని పోని నిందలు వేస్తూ ఉన్నాడు. ద్రోణుడి బుద్ధి మంచిది కాదని, ఆసంగతిని బాల్యంలోనే కనుగొన్న ద్రుపదుడు అతనిని తన చెంత ఉంచుకోకుండా తరిమేశాడని ఇలా ఏమేమో చెబుతూ అతని మనసు విరిచేసి, అతనికి ద్రోణుడి పట్ల కృతజ్ఞతాభావం కానీ, గౌరవభావం కానీ లేకుండా చేశాడు. 

ఆ దుర్యోధనుడి సమక్షంలోనే కర్ణాశ్వత్థామల సంవాదం ఇలా జరిగింది:

అశ్వత్థామ) 
రాజా ఇక నిశ్చింతగా నిద్రపోదువు గాని. ఈ రోజు భూమి కృష్ణుడు, పాండవులు లేకుండా అయిపోతుంది.

కర్ణుడు) 
చెప్పడం సులువే. చేయడమే కష్టం. నువ్వు చెప్పిన పనిని చేయగలిగినవారు కౌరవసైన్యంలో చాలామంది ఉన్నారులే. (నీకంత శ్రమవద్దు.) 

అశ్వత్థామ) 
అంగరాజా, తండ్రి పోయిన దుఃఖంలో అలా అన్నానే గాని, ఇతరవీరులను అవమానించడం నా ఉద్దేశం కాదు.

కర్ణుడు) 
ఓయీ మూఢా! దుఃఖంతో ఉంటే కన్నీరు వదలాలి, కోపం వస్తే యుద్ధరంగంలోకి ఉరకాలి. అంతే గాని, ఇటువంటి ప్రగల్భాలు పలుకరాదు.

అశ్వత్థామ) 
ఒరే రాధాగర్భభారభూతుడా! సూతాపసదుడా! నువ్వా నాకు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్పేది? నీలా నేనెప్పుడూ యుద్ధరంగంనుండి పారిపోయి రాలేదే? నా ఆయుధం నీ ఆయుధంలా గురుశాపం పొంది నిర్వీర్యం కాలేదే? నీలా స్తోత్రపాఠాలు పలికే సూతకులంలో నేను పుట్టలేదే? కాబట్టి, నా క్షుద్రశత్రువులు నాకు చేసిన అపకారానికి నేను ప్రతీకారాన్ని అశ్రువులతో కాదు, అస్త్రంతోనే చేస్తాను.

కర్ణుడు) 
ఒరే వాచాలుడా! నా ఆయుధం నిర్వీర్యమో, సవీర్యమో గాని, నేనెప్పుడూ నీ తండ్రిలా ఆయుధాన్ని యుద్ధరంగంలో పక్కన పెట్టలేదు సుమా. 

మరొకటి కూడా చెబుతున్నాను. నేను సూతుడినా సూతపుత్రుడినా, ఎవరైతే నేమయ్యా? दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्। ఒరే, నేను ఏ కులంలో పుడితేనేమిరా, పుట్టించింది ఆ భగవంతుడు. అందువల్ల నా పుట్టుకకు అతడే బాధ్యుడు. కానీ, పౌరుషం ఉన్నదే, అది మాత్రం నేను సంపాదించుకున్నది. అది నాకు పుష్కలంగా ఉన్నదిరా"
***
***

ఇలా ఎవరైనా (సకారణంగానో లేక నిష్కారణంగానో) ఒక వ్యక్తిని ఆక్షేపిస్తే ఆ వ్యక్తి కోపగించుకుని తనను ఆక్షేపించిన వ్యక్తిని కులం పేరుతో తూలనాడడం ఈనాటి మాట కాదు. 

ఈ వాగ్వాదం జరిగింది భట్టనారాయణమహాకవి వ్రాసిన వేణీసంహారం అనే నాటకంలో. ఆయన మనకు దాదాపు పదకొండువందల సంవత్సరాల పూర్వీకుడు. ఆనాటికే ఇటువంటి ఆక్షేపణలు తూలనాడడాలు ఉన్నాయన్న మాటేగా?
***

కానీ ఆ తిట్లు కాసేపు పక్కన పెడితే చూడండి, అశ్వత్థామ వినయం: 

"నేను దుఃఖంలో ఏదో అన్నానే గాని, ఇతరవీరులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు" అన్నాడు. 

అంటే, "నేనొక్కడే వీరుడిని కాను, నావంటి వీరులు ఇంకా చాలామంది ఉన్నారు." అని స్వయంగా అంతటి మహావీరుడై ఉండి కూడా వినమ్రతను కనబరిచాడు. 
***

కాని, ఈనాడు ముఖానికి రంగులు పూసుకుని కెమెరా ముందు తైతక్కలాడే ఒక మనిషి కూడా, 

మా పుట్టుకే వేరు, మా బ్రీడే వారు, మా వంటి వంశం లేదు, మాకు సాటి పోటీ ఎవరూ రాలేరు 

అని వాగుతుంటే భరించవలసి ఖర్మ పట్టింది మనకు. 

అలాంటి వారికి కర్ణుడు ఆనాడే ఒక జవాబు చెప్పాడు:


" - దైవాయత్తం కులే జన్మ మదాయత్తం తు పౌరుషమ్ -
నేను ఫలానా కులంలో పుట్టడం అనేది దైవం చేతిలో ఉంది. 
కానీ, 
పౌరుషం నిరూపించుకొనడం మాత్రం ఖచ్చితంగా నా చేతిలో ఉంది." 
***

అలాగే జరుగుతుంది. 
అలా జరిగిందని ఇతిహాసమూ చెప్పింది, 
చరిత్ర కూడా అలా జరగడాన్ని చాలాసార్లు ప్రత్యక్షసాక్షిగా చూసింది.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...